న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్‌లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు.
మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment