ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.
వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు.
‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.
ఆప్ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి లేఖను అందిస్తాం. మరోసారి ఆప్ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు.
ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక కరెంట్ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment