ఈసీకి ఆప్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది.
ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు.
దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్‌దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment