Garbage dump
-
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్‌లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది) -
చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు...వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్ చేశారు. A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 (చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!) -
రోజు ఏమార్చి రోజు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి. అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది. ఇదీ అసలు ఉద్దేశం వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారవుతోంది. ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం. పక్కాగా రూట్ ఉండాలంటూ...! చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దూరమవుతుందంటూ..! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. (చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట) -
చార్ధామ్ యాత్ర: భక్తులకు వార్నింగ్.. 2013ను గుర్తు తెచ్చుకోండి
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను భారతీయలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం భక్తులు ఎంతో ఖర్చు చేసి అక్కడి వెళ్తుంటారు. ఆ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ, భక్తులు ఇవ్వన్నీ మరచి.. అక్కడి వాతావరణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో కొందరు అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదు. ప్లాస్టిట్స్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చెత్తా చెదారం అన్నీ అక్కడే పడేసి వచ్చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాన్ని చెత్త కుండీలా మార్చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్లాస్టిక్ కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడి వాతావరణం విపరీతంగా దెబ్బతిని పోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో ప్లాస్టిక్ కారణంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. అది జీవావరణానికే పెద్ద ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లో 2013 నాటి ఉపద్రవాన్ని ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దేవుడిని కేవలం గర్భగుడిలోనే చూడటం కాదు.. ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూడాలని కోరుతున్నారు. Uttarakhand | Heaps of plastic waste & garbage pile up on the stretch leading to Kedarnath as devotees throng for Char Dham Yatra pic.twitter.com/l6th87mxD9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 22, 2022 ఇది కూడా చదవండి: యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. నిలిచిపోయిన 10 వేల మంది యాత్రికులు.. -
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్‌లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్‌పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్‌పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్‌ను ఇలా డంపింగ్ లేక్‌గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్ ఇంటికెళ్లి
బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణమంతా ఎక్కడ చూసినా చెత్త ఉంటుండడంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (బీజేపీ). బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్ తీసుకుని చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్ కమిషనర్ కేహెచ్ జగదీశ్ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా ఇంటిముందు కుమ్మరించాడు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్‌కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తామనని ఎమ్మెల్యే హెచ్చరించాడు. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ గతంలో పలు వింత కార్యక్రమాలతో వార్తల్లో నిలిచాడు. కరోనా పోవాలని పట్టణంలో యాగం నిర్వహించడమే కాక నగరమంతా సామ్రాణి వేయించారు. Garbage full of tractor was dumped infront of City corporation commissioner K.H Jagadish's house today. Three month ago corporation officials were warned to maintain cleanliness in the city but there was no improvement, garbage is at every corner of city. pic.twitter.com/tv7ndkQw9T — Abhay Patil (@iamabhaypatil) July 25, 2021 -
రోజంతా గోదావరి ఒడ్డున విజిల్ ఊదుతూ..
ఇష్టమైంది తిని, ఇష్టమొచ్చినట్లు బతికి, ఏదో ఒక రోజు వెళ్లిపోదాం అన్నట్లే ఉంటున్నారు మనుషులు. మంచి చెబితే అస్సలు సహించలేక పోతున్నారు. ‘మీరూ మనుషులే కదా, మీది మానవ జాతి కాదన్నట్లు మాకు మంచి చెబుతున్నారెందుకు?’ అన్నట్లే చూస్తున్నారు! ఇద్దరు చికాగో సిస్టర్స్ ఈమధ్య ఒక షూస్ స్టోర్ లో.. ‘మాస్క్ పెట్టుకోండమ్మా’ అని మంచి చెప్పిన సెక్యూరిటీ గార్డుని కసాబిసా 27 సార్లు కత్తితో పొడిచేశారు. ‘సాక్షి: టీవీ గరం గరం వార్తల్లో ఊరంతా తిరుగుతూ మొత్తుకుంటుండే ‘గోపి సర్’ గారి చిత్తూరు యాసలో చెప్పాలంటే ఆ కసాబిసా సిస్టర్స్‌లో ఒక పాపకు 21 ఏళ్లు, ఇంకొక పాపకు 18. గోపీ సర్ అందర్నీ ‘పాప’ అనే అంటాడు. వయసు చూసుకోబళ్ళా.. అది లేదు సర్ దగ్గర. ఆయనా అంతే. మంచి చెప్పబోయి ఈ నడుమ ఎవరితోనో అమాంతం పైకి లేపించుకున్నాడు. సర్ని కాలర్ పట్టి లేపి నేలకు కాళ్లందకుండా చేశాడు సర్ చేత మంచి చెప్పించుకున్న ఆ మనిషి. గోపీ సర్ లానే నాసిక్‌లో చంద్ర కిషోర్ పాటిల్ అనే ఒక మంచాయన ఒక రోజంతా గోదావరి నది బ్రిడ్జి మీద నిలబడి నదిలో చెత్త పారేయడానికి క్యారీ బ్యాగుల్ని మోసుకొచ్చేవాళ్లను అడ్డుకున్నాడు. (చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!) చెత్త విసిరేయబోతుంటే పెద్దగా విజిల్ ఊదేవాడు. వాళ్లు వింతగా, విడ్డూరంగా చూసేవాళ్లు. ఇతడు వెళ్లి మంచి చెప్పేవాడు. నదిలోకి చెత్త విసరొద్దనే వాడు. విసిరితే నది కలుషితం అవుతుందని చెప్పేవాడు. విసిరిన చెత్తవల్ల ప్రవాహ వేగం తగ్గుతుందని దిగులుగా ముఖం పెట్టేవాడు. ‘నువ్వేమైనా మోదీవా? చెత్త గురించి స్పీచ్ ఇస్తున్నావ్’ అని వాళ్లు. ఎలాగో కన్విన్స్ చేసి బ్రిడ్జి పైనే ఓ పక్కకి చెత్త పెట్టించేవాడు.. నదిలోకి విసరకుండా. ఒక రోజంతా ఇలా గడిచింది. రెండో రోజు గోపీ సర్.. అదే.. చంద్ర కిశోర్ పాటిల్ సర్ కనిపించలేదు! ఏమైందో తెలీదు. తర్వాత ఒక రోజు ట్విట్టర్లో కనిపించాడు. ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ శ్వేత.. బ్రిడ్జి మీద ఉండగా ఎవరో తీసిన అతడి ఫొటోను టాగ్ చేస్తూ.. ‘ఇతడు రోజంతా గోదావరి బ్రిడ్జి పై విజిల్ ఊదుతూ నిలబడి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు’ అని ట్వీట్ చేశారు. ప్రజలకేమైనా పిచ్చా.. సాటి పౌరుడొకడు వచ్చి చెబితే చైతన్యవంతులు అవడానికి!! చంద్ర కిషోర్ పాటిల్ అనే ఆ మంచివాడు ఇప్పుడు ఏ నది ఒడ్డున ఉన్నాడో! నైస్ గై పాపం. -
ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..
సాక్షి, నిర్మల్: రెంటికి ఆరుబయటకు వెళుతున్నారా..! ఆగండి.. మీ ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించు కోండి.. ఒకవేళ లేకుంటే వెంటనే నిర్మించుకోండి.. లేదంటే ఫైన్ కట్టక తప్పదు. ఇక నుంచి ఆరుబయట మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇది ఒక్కటే కాదు.. మ నం పద్ధతి మార్చుకోకుంటే మరెన్నో ఫైన్లు కట్టక తప్పదు మరి. ఇప్పటి దాకా మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఒక వేళ ఎవరైన ఏంటీ మీరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మంచిది.. బాగా సలహా ఇస్తున్నారు... నీకెందుకులే అనే వాళ్లం. ఇక ముందు పారి శుధ్యం విషయంలో, ఆరుబయట మల విసర్జన, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం విషయంలలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. మరుగుదొడ్లను వినియోగించకుంటే రూ.1000 జరిమానా.. చిట్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జరిమానా బోర్డు ఆరుబయట మల, మూత్ర విసర్జనలతో పరిసరాలు ఆపరిశుభ్రంగా మారడంతో పాటు కలుషిత వాతావరణం ఏర్పడేది. దీంతో వ్యాధులు ప్రబలేవి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అందజేస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న వారిలో చాలా మంది వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చాలా సార్లు విన్నవించారు. బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు, కట్టుకున్న మరుగుదొ డ్లు వాడుకునేలా ప్రజలకు అవగాహన సైతం కల్పించారు. అయితే ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఇంకా అలవాటు ప్రకా రం మల విసర్జనకు ఆరుబయటకే వెళుతున్నారు. దీంతో అట్టి చర్యలకు పాల్పడిన వారికి జరిమానా విధించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బహిరంగ మలవిసర్జన వెళ్లిన వారిని గుర్తించి, జరిమానాలు విధించాలని పంచాయతీ కా ర్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు. చెత్త వేస్తే రూ. 500 కట్టాల్సిందే... పారిశుధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు చర్యలు చేపట్టింది. పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటింటికీ బుట్టల పంపిణీ చేపట్టింది. వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోనూ చెత్త సేకరణను తోపుడు బండ్లు(పుష్ కాట్స్) ద్వారా చేపడుతున్నారు. ఇలా సేకరించిన చెత్త, చెదారాన్ని గ్రామాల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇలా చెత్త సేకరణతో రోడ్లపై చెత్తను వేయడం అధికంగా తగ్గింది. కానీ పట్టణాల్లో, గ్రామాల్లో కొందరు ని ర్లక్ష్యంతో ఇంకా ఆరుబయట రోడ్లపై చెత్తను వే స్తున్నారు. ఇలా నిర్లక్ష్యంతో ఇక ముందు ఇలా చెత్తను రోడ్లపై వేస్తే రూ. 500 ఫైన్ చెల్లించక తప్పదు. ఇప్పటికే నిర్మల్ మున్సిపల్ పరిధిలో నలుగురికి జరిమానా విధించారు. అలాగే పలు గ్రామాల్లోనూ దీనిని అమలు చేస్తున్నారు. చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేస్తే తప్పని సరిగా రూ. 500 జరిమానా విధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించింది. కాగా ఈ జరిమానాను రూ.500నుంచిరూ.వెయ్యి వరకు విధించవచ్చు. మొక్కలను మేసినా.. ప్లాస్టిక్ వేసినా.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఒక వేళ నాటిన మొక్కలో 85 శాతం బతికించాలి. మొక్కలు బతకకపోతే సంబంధిత అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోనుంది. దీంతో అధికారులు, పాలకులు సైతం మొక్కల సంరక్షణకు కఠినంగానే వ్యవహరించనున్నారు. పశువులు, గొర్రెలు మొక్కలను మేసినా.. పాడు చేసినా.. మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించనున్నారు. అలాగే వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, నీటి ప్యాకెట్లు వంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తే పాలక వర్గం జరిమానా విధించనున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని దండెపల్లిలో ఓ వైన్స్ పక్కన ఇష్టారీతిన ప్లాస్టిక్ గ్లాసులు పడేసి ఉండటంతో ఆగ్రహించిన అక్కడి కలెక్టర్ రూ. 30వేలు జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడంతో పాటు అమలు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోనూ ప్లాస్టిక్ వినియోగదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇక మనలో మార్పు రాకపోతే జరిమానాలు కట్టక తప్పదు. -
వినాయకా...ఏమిటీ పొగ కష్టాలు
సాక్షి, కాణిపాకం: కాణిపాకం దేవస్థానం వద్ద ప్రతిరోజూ చెత్త కుప్పలకు నిప్పు పెడుతుండటంతో వచ్చే దుర్వాసనకు భక్తులు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి కూతవేటు దూరంలోని నిత్యాన్నదాన కేంద్రం, కల్యాణకట్ట సమీపంలో నుంచి వచ్చే దట్టమైన పొగలతో జనం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యం కాణిపాక దేవస్థానం, పరిసరాల నుంచి వచ్చే చెత్తను (ప్లాస్టిక్ వ్యర్థాలను) సమీపంలోని బాహుదా నది ఒడ్డున ఆలయ అధికారులు పడేస్తున్నారు. ఆ చెత్త కుప్పలు పేరుకుపోయిన తరువాత సిబ్బంది వాటికి అక్కడే నిప్పుపెడుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే తీవ్రమైన దుర్వాసనతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాణిపాకం దేవస్థానం, పంచాయతీ పరిధిలో నలభైకిపైగా చిన్న, పెద్ద తరహా హోటళ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది ఇక్కడ పడవేస్తున్నారు. వాటి నుంచి వచ్చే కాలుష్యంతో అనర్థాలు తప్పడం లేదు. డంపింగ్ యార్డు వినియోగం ఎప్పటికో ? కాణిపాకం పంచాయతీ లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు ప్రస్తుతం పూర్తి స్థాయిలో వినియోగానికి నోచుకోవడంలేదు. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాటరీ వాహనాలు ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. దేవస్థానానికి సైతం డంపింగ్ యార్డు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ దేవస్థానం సైతం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆలయం వద్ద చెత్త కుప్పలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
రోడ్డుపై చెత్తేసినందుకు... చెంప ఛెళ్లుమనే గుణపాఠం!
తినగానే, అవసరం తీరగానే మిగిలిన చెత్తను తీసి రోడ్డు మీద విసిరెయ్యడం మామూలైపోయింది. స్వచ్ఛ భారత్ మొర్రో అంటూ మొత్తుకున్నా పట్టించుకోని ‘స్వేచ్ఛ’ జీవులం కదా?! సిగ్నల్ వద్ద ఆగిన కారులోంచి ఎవరో చెత్త రోడ్డుపై విసిరిస్తే సాటి పౌరునిగా మనమేం చేస్తాం?.. మనకెందులే అని గమ్మునుంటాం. వీళ్లు మారరని లోలోపలే కుమిలిపోతాం. లేదంటే చెత్తేసిన వాడికి వినపడకుండా తిడతాం. నలుగురం నాలుగు విధాలా గొనుగుతామంతే! వాడికి కళ్లు తెరిపించే సాహసం చేయగలమా? అయితే చెత్తేసినందుకు... చెంప ఛెళ్లుమనే గుణపాఠం చెప్పిందో యువతి! మొన్న సెప్టెంబర్ 17న చైనా రాజధాని బీజింగ్‌లో ఓ సిగ్నల్ వద్ద ఓ కారు ఆగింది. ఆ కారులోంచి ఓ ఆకతాయి మహిళ చెత్త బయటకు విసిరింది. పక్కనే బైక్ మీద ఉన్న ఓ యువతి ఆ చెత్తను తీసి మళ్లీ ఆ కారులోనే వేసింది. ఈ హఠాత్పరిణా మానికి షాకయిన ఆ మహిళ కోపంతో కారు దిగింది. ఇంతలోనే ఆ బైక్ నడుపుతున్న యువతి వేగంగా కంటికి ఆననంత దూరం వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ఇదో చురుకైన గుణపాఠం అంటూ నెటిజన్లు ఆ యువతిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
గ్రేటర్‌కు ‘చెత్త’ముప్పు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న మన గ్రేటర్ సిటీ తలసరి చెత్త ఉత్పత్తిలోనూ దేశంలో అగ్రభాగానికి చేరింది. నగరంలో ప్రతీ వ్యక్తి నిత్యం సుమారు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తుండగా, బెంగళూరులో 440 గ్రాములు ఉత్పత్తి అవుతోంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే 410 గ్రాముల చెత్త మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తిపై నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) తాజాగా అధ్యయనం చేసింది. ఇందులో ఈ లెక్కలు తేలాయి. హైదరాబాద్‌లో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉండడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే విషయంలో ప్రజల విముఖత నగరపాలక సంస్థకు శాపంగా మారింది. వ్యర్థాల్లో అధికం ఇవే... నగరంలో రోజూ సుమారు 4,500 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. మిగతా వాటిలో ఆర్గానిక్ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, ఈ–వేస్ట్ తదితరాలున్నాయి. ఇక వ్యక్తిగతంగా సిటిజన్లు వృథాగా పడవేస్తున్న వాటిలో వస్తువులు, దుస్తులు, తినుబండారాలు, ఫుడ్ పార్సిళ్లకు సంబంధించిన ప్యాకేజింగ్ మెటీరియల్ అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత వినియోగించి పడవేస్తున్న లెదర్ బ్యాగులు, బూట్లు, ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, వాటర్ బాటిల్స్, బ్యాటరీలు, ఎల క్ట్రానిక్ విడిభాగాలున్నాయి. కొన్ని రకాల వినియోగ వస్తువులను శుద్ధిచేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ సిటిజన్లు వాటిని చెత్తడబ్బాలు, వీధుల్లో పడేస్తుండటంతో గ్రేటర్ నగరంలో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. అవగాహనే కీలకం... ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా పంపిణీ చేసిన డబ్బాలను వేర్వేరుగా వినియోగించడంలో చాలా మంది విముఖత చూపుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకులు తదితర వ్యర్థాలను వేరుచేసి ఆరబెట్టిన తరవాత ఇళ్లలో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు కూడా చాలామంది ముం దుకు రావడంలేదు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం సాధారణ చెత్తతోపాటే పడేస్తుండటంతో నగర పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వ్యక్తి సామాజిక బాధ్యతగా వ్యవహరించి తడి, పొడి చెత్త కోసం 2 డబ్బాల విధానాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దుస్తులు, వస్తువులు, తినుబండారాల పార్సిళ్ల కోసం వినియోగించే ప్యాకింగ్‌లను ఇష్టారాజ్యంగా రహదారులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని కోరుతున్నారు. -
గోదావరి కంపు.. కంపు
ధర్మపురి: రాయపట్నం గోదావరిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయపట్నం వంతెనవద్ద గత పుష్కరాల సందర్భంగా ఘాటును ఏర్పాటుచేశారు. ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్ నిండుగా ఉండడంతో భక్తులు పుష్కరఘాట్ వద్దనే స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫొటోలు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, దుస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పగిలిన గ్లాసుముక్కులు కాళ్లకు గుచ్చి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు. గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు. -
ఆ చెత్త మాకెందుకు..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై 845 పేజీల అఫిడవిట్‌ను సమర్పించడం పట్ల కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరకొర సమాచారంతో భారీ అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ తాము చెత్త సేకరించేవారం కాదని తీవ్రస్ధాయిలో మండిపడింది. కేంద్రం తమ ముందు చెత్త పడేసి చేతులు దులుపుకోవడాన్ని అంగీకరించబోమని, అఫిడవిట్‌ను స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ‘మీరు మమ్మల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారా..? మేం ప్రభావితం కాబోం.. అఫిడవిట్‌ను తాము స్వీకరించేది లేద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. మీ దగ్గరున్న చెత్తంతా ఇక్కడ పడేయడానికి మేం గార్బేజ్ సేకరించేవారం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఘనవ్యర్థాల నిర్వహణకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేశాయా, లేదా అనే వివరాలు సూచిస్తూ మూడు వారాల్లోగా ఓ చార్ట్‌ను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం బెంచ్ ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో డెంగూ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ప్రబలి పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని గతంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
చెత్త డంప్ కూలి ఇద్దరు మృతి
-
చెత్త డంప్ కూలి ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కొండలా పేరుకుపోయిన ఓ చెత్త డంప్ కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత మూడేళ్లలో ఎన్నడూలేనంతగా ఢిల్లీలో ఈసారి వర్షాలు పడ్డాయి. దీంతో శుక్రవారం ఈ డంప్‌లో కొంతభాగం కుంగిపోయి ఒక్కసారిగా పక్కనే ఉన్న రోడ్డుపై పడింది. పెద్దమొత్తంలో చెత్త గుట్ట మీదపడడంతో రోడ్డుపై వెళ్తున్న కారు, మూడు బైకులు అదుపుతప్పి పక్కనే ఉన్న కోండ్లీ కాలువలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. రంగంలోకి దిగిన సహాయకసిబ్బంది కాలువలో పడిన ఐదుగురిని రక్షించారు. ఈ సహాయక కార్యక్రమంలో 45 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 15 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘటనాస్థలికి వచ్చి సహాయకచర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌లను కలిపే అత్యంత రద్దీగా ఉండే 24వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ డంప్ ఉంది. ఈ చెత్త డంప్ 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అంతస్తుల భవంతి ఎత్తులో పేరుకుపోయింది. ఉత్తర భారతదేశంలో ఇదే అతిపెద్ద చెత్త డంప్. రోజుకు 2500 మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపాలిటీవారు ఇక్కడికి తరలించి పడేస్తున్నారు. -
చెత్త డంప్‌పై నిరసన
నెల్లూరు(సిటీ): నగరంలోని బోడిగాడతోటలో కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది ఆటోలతో చెత్తను డంప్ చేసేందుకు రావడంతో స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని బోడిగాడితోట అరవపాళెంలో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నగరంలోని చెత్తను బోడిగాడితోటలోనే డంపింగ్ చేస్తుండేవారు. మూడునెలల కిందట డంపింగ్‌యార్డ్‌లోని చెత్తకు కార్పొరేషన్ అధికారులు నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కొన్ని ఇళ్లు బూడిదయ్యాయి. అప్పటి నుంచి కార్పొరేషన్ అధికారులు అక్కడ చెత్త వేయడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం రాత్రికి రాత్రే బోడిగాడితోటలోని దాదాపు మూడు ఎకరాల చుట్టూ పట్టలు కప్పి అక్కడ చెత్త వేసేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని డివిజన్లలోని బుధవారం సేకరించి దానిని ఆటోల్లో శానిటరీ సిబ్బంది తీసుకొచ్చారు. స్థానికులు ఆటోలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఆటోలను అక్కడే నిలిపి వేశారు. చెత్తను డంప్ చేయడం ద్వారా రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎస్ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే స్థానికులు ససేమిరా అనడంతో వారు వెనుతిరిగారు. కమిషనర్, కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఇమాముద్దీన్ తెలిపారు. చివరికి 20 ఆటోల్లోని చెత్తను అక్కడే డంప్ చేసి వెళ్లారు. నగరంలో రెండు డంపింగ్ యార్డ్లు నగరంలోని అన్ని డివిజన్లలో రోజుకు దాదాపు 20 టన్నుల చెత్తను శానిటరీ సిబ్బంది సేకరిస్తుంటారు. ఈ చెత్తను ఆటోల ద్వారా నగరం నుంచి దొంతాలి వరకు దాదాపు 25 కి.మీ వెళ్లాల్సి ఉంది. ఆ దారి గుంతలు మయం కావడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. దీంతో నగరంలోనే రెండు మినీ చెత్త డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్ధ అధికారలు భావించారు. ఈ క్రమంలో బోడిగాడితోట, చిల్డ్రన్స్‌పార్క్ సమీపంలో మినీ డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలనుకున్నారు. మొదట బోడిగాడితోటలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు.