సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్‌లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది.
కాగా స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
వ్యర్థాల డంపింగ్‌పై ఎన్‌జీటీలో పిటీషన్..
పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు.
డంపింగ్‌పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్
సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్‌జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్‌ను ఇలా డంపింగ్ లేక్‌గా మార్చడం ఏమాత్రం సబబు కాదు.
ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం
సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి.
ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్‌డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం.
సాగర మథనం సాగుతోందిలా..
► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు
► 2014: రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్ పనులు
► 2015: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్‌కావేటర్‌తో వ్యర్థాలు తొలగింపు.
► 2017: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు)
► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు
చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా!
Comments
Please login to add a commentAdd a comment