అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఆగని రగడ
ట్రంప్ మద్దతుదారులే ‘చెత్త’ అన్న బైడెన్
కోట్లాది అమెరికన్లను అవమానించారు
ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ శిబిరం ధ్వజం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...!
ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు.
‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు.
వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు.
వివరణ ఇచి్చనా...
వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది.
నాడు హిల్లరీ ఏమన్నారంటే...
2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.
డెమొక్రాట్లకు అలవాటే
బైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు.
అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment