నెల్లూరు(సిటీ): నగరంలోని బోడిగాడతోటలో కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది ఆటోలతో చెత్తను డంప్ చేసేందుకు రావడంతో స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని బోడిగాడితోట అరవపాళెంలో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నగరంలోని చెత్తను బోడిగాడితోటలోనే డంపింగ్ చేస్తుండేవారు. మూడునెలల కిందట డంపింగ్‌యార్డ్‌లోని చెత్తకు కార్పొరేషన్ అధికారులు నిప్పంటించారు.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కొన్ని ఇళ్లు బూడిదయ్యాయి. అప్పటి నుంచి కార్పొరేషన్ అధికారులు అక్కడ చెత్త వేయడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం రాత్రికి రాత్రే బోడిగాడితోటలోని దాదాపు మూడు ఎకరాల చుట్టూ పట్టలు కప్పి అక్కడ చెత్త వేసేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని డివిజన్లలోని బుధవారం సేకరించి దానిని ఆటోల్లో శానిటరీ సిబ్బంది తీసుకొచ్చారు. స్థానికులు ఆటోలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
దాదాపు మూడు గంటలపాటు ఆటోలను అక్కడే నిలిపి వేశారు. చెత్తను డంప్ చేయడం ద్వారా రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎస్‌ఈ ఇమాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే స్థానికులు ససేమిరా అనడంతో వారు వెనుతిరిగారు. కమిషనర్, కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఇమాముద్దీన్ తెలిపారు. చివరికి 20 ఆటోల్లోని చెత్తను అక్కడే డంప్ చేసి వెళ్లారు.
నగరంలో రెండు డంపింగ్ యార్డ్‌లు
నగరంలోని అన్ని డివిజన్లలో రోజుకు దాదాపు 20 టన్నుల చెత్తను శానిటరీ సిబ్బంది సేకరిస్తుంటారు. ఈ చెత్తను ఆటోల ద్వారా నగరం నుంచి దొంతాలి వరకు దాదాపు 25 కి.మీ వెళ్లాల్సి ఉంది. ఆ దారి గుంతలు మయం కావడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. దీంతో నగరంలోనే రెండు మినీ చెత్త డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్ధ అధికారలు భావించారు. ఈ క్రమంలో బోడిగాడితోట, చిల్డ్రన్స్‌పార్క్ సమీపంలో మినీ డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలనుకున్నారు. మొదట బోడిగాడితోటలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు.
చెత్త డంప్‌పై నిరసన
Published Thu, Nov 27 2014 2:13 AM | Last Updated on Sat, Sep 15 2018 8:15 PM