
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు.
కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు.
వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్‌టైజింగ్‌లో మాస్టర్స్ చేసింది మలిష్క.
ముంబైకీ రాణీ
చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్‌ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది.
ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్‌లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్‌ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్‌ఎమ్‌లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం రెడ్ ఎఫ్‌ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది.
ఆర్జేగానేగాక..
రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్‌క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్‌రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్‌చెప్పింది.
సామాజిక కార్యకర్తగా..
రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్‌సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్‌ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్‌ఎమ్‌లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment