Radio Jockey
-
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా
Kerala Vaccine RJ Aswathy Murali: కరోనాకు వ్యాక్సిన్ రాకముందు..వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మాస్కులు పెట్టుకోవాలి? బయటకెళ్లాలంటేనే భయమేస్తుంది..అంటూ వ్యాక్సిన్ కోసం ఒకటే ఎదురు చూపులు చూసిన వారు కూడా తీరా వ్యాక్సిన్ వచ్చాక.. కరోనా కంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ ప్రమాదమన్న అపోహతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. అస్వతి బామ్మ కూడా ‘‘ఇప్పటిదాకా నిక్షేపంగా ఉన్నాను నేను... వ్యాక్సిన్ వేసుకుంటే నా ఆరోగ్యం పాడవుతుంది.. వ్యాక్సిన్ వేసుకోను’’ అని మొండికేసింది. వ్యాక్సిన్ గురించి తెలిసిన అస్వతి.. ‘‘బామ్మా ..వ్యాక్సిన్ వేసుకుంటే ఏం కాదు, కరోనా వచ్చినా ప్రమాదం ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పడంతో వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇవే మాటలు తన కమ్యూనిటీలో ఎంతోమందికి చెప్పి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించింది అస్వతి. దీంతో గ్రామంలో ఉన్న వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వతి ద్వారక నుంచి ప్రసారమయ్యే ‘మట్టోలి(90.4 ఎఫ్ఎమ్)’ కమ్యూనిటీ రేడియో సర్వీస్‌లో రేడీయో జాకీగా పనిచేస్తుంది. వైనాడ్‌లో ‘పనియార్’ జాతికి చెందిన గిరిజనుల జనాభా 18 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ‘పనియా’ భాషనే మాట్లాడుతారు. మట్టోలి మారుమూల గ్రామం, పనియా భాష ఒక్కటే తెలుసు. వీరికి వ్యాక్సిన్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వీరిలాగే అస్వతి బామ్మ ముందు మొరాయించినప్పటికీ తరువాత వ్యాక్సిన్ వేసుకున్నారు. బామ్మను ప్రేరణగా తీసుకున్న అస్వతి, తను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కావడంతో గ్రామస్థులందరికి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలనుకుంది. దీనికోసం ఒకపక్క ఆర్జేగా పనిచేస్తూనే తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డాక్టర్ల టాక్‌షోలు శ్రద్దగా వినేది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించేది. కోవిడ్ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి పనియా భాషలో రేడియోలో వివరించేది. ఈ కమ్యూనిటీకి సమాచారం అందించే ఒకే మాధ్యమం రేడియో కావడంతో..కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రేడియో ద్వారా అందించేది. అంతేగాక రేడియోకు కాల్ చేసి ఎవరైనా సందేహాలు అడిగినా వాటిని నివృత్తి చేసి, వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. దీంతో గ్రామస్థులంతా వ్యాక్సిన్ వేసుకున్నారు. టీవీ కంటే రేడియో ద్వారా.. ‘‘మా కమ్యూనిటీలో ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. వీరిని విపత్కర పరిస్థితుల్లో నుంచి బయట పడేయడానికి.. నావంతు సాయం కమ్యునిటీకి చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి టీవీలో కంటే రేడియో ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునేదాన్ని. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా రేడియోలో ప్రసారమయ్యే డాక్టర్ కార్యక్రమాలు ఇంగ్లిష్‌లో వచ్చేవి. అవి మా కమ్యూనిటీ వాళ్లకు అర్థం కావు. అందువల్ల అవన్నీ వింటూ రాసుకుని తరువాత మా పనియా భాషలో వివరించేదాన్ని. గ్రామస్థులకు ఉన్న సందేహాలను తెలుసుకుని వాటికి సమాధానాలు చెప్పేదాన్ని. ఈ ప్రశ్నలనే రేడియోలో కూడా ప్రస్తావిస్తూ ఎక్కువమందికి చేరేలా చెప్పాను. నేను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందినదాన్ని కావడంతో అంతా నా మాటలపై నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో మట్టోలి గ్రామం పూర్తి వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని అస్వతి చెప్పింది. చదవండి: సోషల్ స్టార్.. ఇక్కడ కాకపోతే ఇంకోచోట! -
నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ముందు యువతులు చేసిన అసభ్యకర డ్యాన్స్ వివాదాస్పదంగా మారింది. దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. వివరాల్లోకి వెళితే.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను శుక్రవారం రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్ యాప్ ద్వారా ఇంటర్య్వూ చేసింది. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ ఇంటర్య్వూలో భాగంగా మలిష్కాతో పాటు కొందరు యువతులు లాప్టాప్లో నీరజ్ చోప్రాను చూస్తూ 1957 బాలీవుడ్ సినిమా ''నయా దౌర్''లోని ''ఉడెన్ జబ్ జబ్ దల్హే తేరీ'' పాటకు అసభ్యకర డ్యాన్స్‌లు చేశారు. ఆ తర్వాత మలిష్కా నీరజ్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ మలిష్కా తన ట్విటర్లో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు యువతులను ఒక ఆట ఆడుకున్నారు. ''దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది.. మీ ప్రవర్తనతో తల దించుకునేలా చేశారు... అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. చదవండి: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం Ladiesssss..Yes I got the hard hitting, deep answers too but..Take the first 4 secs before the cam moves to the zoom call to guess who we are dancing for😇 ;) #udejabjabzulfeinteri and then tell me I did it for all of us😄 #gold #olympics #neerajchopra @RedFMIndia @RedFM_Mumbai pic.twitter.com/SnEJ99MK31 — Mumbai Ki Rani (@mymalishka) August 19, 2021 -
ప్రేమ,పెళ్లి.. నా కౌశిక్ చచ్చిపోయాడు.. అయినా
సాక్షి, వెబ్‌డెస్క్: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది. ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే ‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది. నేను ఆర్జే, తను రైటర్ ‘‘కామన్ ఫ్రెండ్స్ ద్వారా కౌశిక్‌ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్‌ఫ్రెండ్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్ టవర్ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే సలహా ఇచ్చేందుకు తను లేడు తనకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. అప్పుడే భర్తను మర్చిపోయిందా? ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్‌కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ దొంగ ఎవరు?!
వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్ఎమ్లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్‌లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు. ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ. పోస్ట్ చేసేది ఎవరు? తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్‌తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్లో ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్‌గా ఎవరు తీశారో, ఎవరు అప్లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్‌కి, షాపింగ్‌కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్‌బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది. ముక్కలైన బంధం కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్‌గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది. మేకవన్నె పులి దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్‌కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్లైన్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి. ఎమెషనల్ ఫ్రాడ్స్‌కి దూరం ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్‌ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్‌కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్‌లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ పగ తీర్చుకోవాలనే.. కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్‌గా ముందు క్లోజ్‌గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్‌కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్‌ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం. – వి. గోపీనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం -
అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్ధరాత్రి ఇంటికి వస్తున్న ఓ రేడియో జాకీని తను నివాసం ఉండే కాలనీ సెక్యూరిటీగార్డు వేధింపులకు గురిచేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావని వెటకారంగా ఆమెను ప్రశ్నించడమేగాక కాలనీ గేటు తీయడానికి నిరాకరించాడు. సెక్యూరిటీగార్డు చేష్టలతో ఖంగుతిన్నఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ కాలనీ అధ్యక్షుడు, అతని భార్య సైతం సెక్యూరిటీ గార్డునే వెనకేసుకొచ్చారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడమేగాక తన ఆవేదనను ట్విటర్లో పంచుకుంది. ఆఫీసులో పని ఎక్కువ కావడంతో ఆలస్యంగా వచ్చిన రేడియోజాకీ స్తుతీ ఘోష్‌ను కాలనీ సెక్యూరిటీ గార్డు అడ్డగించాడు. ఇంత అర్ధరాత్రి వరకూ ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. కాలనీలోకి రాకుండా గేటును మూసివేశాడు. స్తుతీ సెక్యూరిటీగార్డుని మందలించేలోగా ఆ కాలనీ అధ్యక్షుడు మిక్కీ బేడీ జోక్యం చేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డును ఏమీ అనకుండా తిరిగి స్తుతీపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె క్యారెక్టర్‌ను అనుమానించేలా.. ఎందుకు నువ్వు లేట్‌గా వస్తున్నావ్, ఎక్కడి నుంచి వస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా కాలనీ అధ్యక్షుని భార్య కూడా అతన్నే వెనకేసుకొచ్చింది. సాటి మహిళ అని చూడకుండా స్తుతీపై గట్టిగా అరుస్తూ కాలనీ గేటు తెరవొద్దని సెక్యూరిటీకి చెప్పింది. దీంతో స్తుతీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. స్తుతీ తల్లి మాట్లాడుతూ వృత్తిలో భాగంగా తన కూతురు ఒక్కోసారి లేట్‌గా వస్తుందని, వీళ్లెవరు తనని ప్రశ్నించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలనీ అధ్యక్షుడిగా ఇంత సంకుచిత భావాలు ఉన్న వ్యక్తిని ఎలా ఎంపిక చేశారని మండిపడింది. స్తుతీ ఘోష్‌కు మద్దతు తెలుపుతూ అనేకమంది ట్విటర్లో తమ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి వాళ్ల వల్లే స్త్రీ స్వాతంత్రం భారత్‌కు రావట్లేదని విమర్శించారు. -
హిట్ అండ్ రన్ : రేడియో జాకీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్జే) అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ధీరజ్ కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారంపరామర్శించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గులాటిని అరెస్ట్ చేశారు. -
నేను మీ ప్రియాంక !
కర్ణాటక, యశవంతపుర: బెంగళూరుకు చెందిన హిజ్రా ప్రియాంక రేడియో జాకీగా పనిచేస్తున్నారు. రేడియో అక్షీవ్ సీఆర్ 90.4లో ఆమె రోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒక హిజ్రా దేశ చరిత్రలో రేడియో జాకీగా కావటం ప్రియాంకనే ఫస్ట్. దీంతో పాటు మహిళ సబలీకరణ కోసం ఆమె ఎంతోగాను కృషి చేస్తున్నారు. -
అది సమస్యగా అనిపించడం లేదు!
బాలీవుడ్లో నటుడు ఆయుష్మాన్ ఖురానా కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘అంధాధూన్, బదాయి హో’ చిత్రాలు హిందీ చిత్రపరిశ్రమలో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. సినిమాల్లోకి రాకముందు రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేశారు ఆయుష్మాన్. ఆయనకు చెప్పుకోదగ్గ ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. ‘‘స్టార్ కిడ్ అయ్యి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి’’ అని మీరు ఆలోచిస్తున్నారా? అన్న ప్రశ్నను ఆయుష్మాన్ ముందు ఉంచితే... ‘‘నా 27 ఏళ్ల వయసులో నేను ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాను. అదే నేను స్టార్ కిడ్ అయితే 22 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చే వాడినేమో. కానీ ఈ ఐదేళ్ల వ్యత్యాసం నాకు పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఎందుకంటే 17 ఏళ్లకే రియాలిటీ షోలో పాల్గొన్నాను. 22 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఉన్న యంగెస్ట్ రెడీయో జాకీని నేనే. ఇలా అన్ని రకాల ప్లాట్‌ఫామ్స్‌ను దాటుకుంటూ వచ్చాను. ఎక్కువమంది యాక్టర్స్‌కు ఇది సాధ్యం కాకపోవచ్చు. 27 ఏళ్ల వయసులో ఒక యాక్టర్‌కు ఉండాల్సిన మెచ్యూరిటీ థింకింగ్ కన్నా ఇప్పుడు నా ఆలోచన స్థాయి ఎక్కువ అని చెప్పగలను’’ అన్నారు. -
రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు: ర్యాపిడ్ రష్మీ
బెంగళూరు : తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, కొందరు తనను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేయడమే కాదు.. తనను రేప్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ప్రముఖ రేడియో జాకీ (ఆర్జే) ర్యాపిడ్ రష్మీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్‌ను కూడా ఆమె ఆశ్రయించింది. రేడియో షోలో భాగంగా ఇటీవల విడుదలైన కన్నడ సినిమా ‘రాజారథ’ దర్శకుడు అనూప్ భండారీ, అతని సోదరుడు, సినిమా హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టీలతో రష్మీ ఫోన్లో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా చూడని వారిని ఏం చేస్తారని అడుగగా, ‘వాళ్లు అంతా చెత్తా’అని అనూప్ పేర్కొనగా, హీరో, హీరోయిన్లు వాళ్లు లోఫర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్జే ర్యాపిడ్ రష్మీపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ‘నాదీ కర్ణాటక రాష్ట్రమే. 11 ఏళ్లుగా కన్నడ రేడియో రంగంలో పనిచేస్తున్నా. ఎన్నడూ కన్నడిగులపై, కర్ణాటకపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కొందరు కించపరిచే కామెంట్లు చేయడం ద్వారా నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నన్ను దూషిస్తూ సందేశాలు పెడుతున్నారు. రేప్ చేస్తామని కొందరు బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టారు’ అని రష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనను కించపరిచిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఆమె పలు టీవీ షోలు చేశారు. పలు కన్నడ చిత్రాల్లో నటించారు. -
రేడియో జాకీగా రాయ్‌లక్ష్మి
సంచలన నటి రాయ్‌లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారు. మలయాళంలో అనూహ్య విజయం సాధించిన 100 డిగ్రి సెల్సియస్ చిత్రం కోలీవుడ్‌లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. దీనిని తమిళంలో మిత్రన్ కే.జవహర్ దర్శకత్వం వహించనున్నారు. ఉద్యోగం చేసే ఐదుగురు యువతులు ఒకే అపార్ట్మెంట్లో నివశిస్తుంటారు. వారి ఫ్లాట్‌లో ఒకరు హత్యకు గురవుతారు.అది తెలిసిన ఒక వ్యక్తి ఈ ఐదుగురు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.చివరికి ఏమైందన్న సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రమే 100 డిగ్రి సెల్సియస్. కాగా మలయాళంలో శ్వేతామీనన్, అనన్య, భామా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో ఒక నాయకిగా నటి రాయ్‌లక్ష్మి నటించనున్నారన్న సంగతి తెలిసిందే. మరో పాత్రకు నటి శ్రియ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నటి శ్వేతామీనన్ పాత్రను రాయ్‌లక్ష్మి పోషించనున్నారు. అయితే శ్వేతామీనన్ మలయాళంలో టీవీ రిపోర్టర్‌గా నటించిన పాత్రను తమిళంలో రేడియో జాకీగా మార్చుతున్నారట. దీంతో నటి రాయ్‌లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారన్న మాట. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. -
ఈసారి కామెడీ జాకీ
‘‘చూపిస్తా... నేనెంత అల్లరి పిల్లనో త్వరలోనే మీకు చూపిస్తా. ఐయామ్ సో నాటీ’’ అంటున్నారు విద్యా బాలన్. ‘డర్టీ పిక్చర్’లో అందాలను ఆరబోసిన ఈ మలయాళ కుట్టి, ‘కహానీ’లో క్యారెక్టర్‌కి తగ్గట్టు నటిగా విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకూ విద్యా బాలన్ చేసిన పాత్రలన్నీ అయితే హాటు.. లేదంటే నీటు! అసలు కామెడీ క్యారెక్టర్స్ చేయనే లేదు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘తుమ్హారీ సులూ’ ఆ లోటు భర్తీ చేస్తుందంటున్నారీ బ్యూటీ. ఇందులో లేట్ నైట్ ఆర్.జె. (రేడియో జాకీ) సులోచన పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. సులోచనని ముద్దుగా ‘సులూ’ అని పిలుస్తారన్న మాట. ఆల్రెడీ ‘లగే రహో మున్నాభాయ్’లో ఆర్.జె.గా నటించిన అనుభవం ఆమెకి ఉంది. అయితే... రెండూ విభిన్నమైన పాత్రలట. ‘‘ప్రస్తుతం నేను ‘బేగమ్ జాన్’, ‘తుమ్హారీ సులూ’ చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ విభిన్నమైన సినిమాలు. ‘తుమ్హారీ...’లో నా క్యారెక్టర్ నాలోని నాటీ యాంగిల్ ప్రేక్షకులకు చూపిస్తుంది. అనుకోకుండా ఆర్.జె. అయిన సులోచనలో కోపం, బాధ, ప్రేమ.. అన్నీ ఉంటాయి. కానీ, కామెడీ హైలైట్ అవుతుంది’’ అన్నారామె. -
రేడియో జాకీ భార్య ఆత్మహత్య
అహ్మదాబాద్: ప్రముఖ రేడియో జాకీ కునాల్ భార్య భూమి దేశాయ్(28) ఆత్మహత్య చేసుకుంది. ఆనంద్ నగర్ ఏరియాలోని 10వ అంతస్థు టెర్రస్ నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది. శ్యామల్ క్రాస్ రోడ్ లో ఉన్న పది అంతస్తుల భవనం సచిన్ టవర్ వరకు కారులో వెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకుని మూడు నెలలు తిరగ్గకుండానే ఆమె బలవంతంగా ప్రాణం తీసుకోవడం విషాదాన్ని నింపింది. ఓ పోటీలో బహుమతి గెలుచుకున్న దేశాయ్ కు, ప్రముఖ ప్రయివేట్ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న ఆర్జె కునాల్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గత ఏడాది నవంబర్ 24న వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం బ్యాంకాక్ కు వెళ్లి ఈ జంట జనవరి 18న తిరిగి వచ్చింది. అక్కడే వీరి మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే భర్త నుంచి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదని గానీ సచిన్ టవర్ దగ్గర సూసైడ్ చేసుకుంటున్నట్టుగా గురువారం మధ్యాహ్నం మెసేజ్ పెట్టి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకేసింది. బ్యాంకాక్ లో తమ మధ్య విభేదాలు వచ్చినట్టుగా తల్లితో దేశాయ్ చెప్పుకున్నట్టు ఆమె తరపు బంధువు ఒకరు తెలిపారు. కానీ ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతేదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఆమె ఆ భవనంపైకి వెళ్లినట్టు ఎసెఎంఎస్ ద్వారా తెలుస్తోందన్నారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారి పీవీ జడేజా తెలిపారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు. -
సమాజ సేవలో.. నేనున్నానని..
హీరో అంటే.. వందమందిని ఇరగదీయాలి. డ్యూయెట్లు పాడాలి. తనవారి కోసం విలన్‌ను ఎదిరించి నిలవాలి.. ఇది ‘రీల్ హీరో’ సంగతి. మరి నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.. తనకన్నా సమాజం కోసం పాటుపడేవారు.. ‘రియల్ హీరో’ అవుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వేణు శ్రావణ్. వెండి తెరపై హీరో కావాలన్న కలతో సిటీకి వచ్చిన అతడు పేదల సాయంలో నిమగ్నమయ్యాడు. ఓ పక్క రేడియో జాకీగా, మరోపక్క బుల్లితెర నటుడిగా కొనసాగుతున్నాడు. తాను సేకరించిన పాత, కొత్త దుస్తులను ఆదివారం ధర్నా చౌక్‌లో పేదలకు పంచాడు. వారికి భోజనం సైతం పెట్టాడు. ఈ సందర్భంగా అతడిని ‘సాక్షి’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన మాటల్లోనే.. - సాక్షి,సిటీబ్యూరో అలా ‘చలో హైదరాబాద్’ ‘మాది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు వేశాను. అలా సినిమా హీరో కావాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీని ఇరగదీయాలని చలో హైదరాబాద్ అన్నా. భాగ్యనగరంలో కొన్నాళ్లు టీచరుగా పనిచేశాను. తర్వాత రెయిన్బో ఎఫ్ఎంలో ఆర్జేగా మారాను. మరో పక్క ‘విధి, రాధా-మధు, చక్రవాకం, ఆమె, శుభలగ్నం’ వంటి సీరియల్స్‌లో నటించాను. ఇదే సమయంలో యాంకర్ గానూ చేస్తున్నా. తర్వాత సమాజంలో ఒక్కో ఘటనతో ఒక్కో అనుభవం. దీంతో ఆశయం ముందు హీరో కావలన్న ఆశ చిన్నదైపోయింది. అలా పుట్టుకొచ్చింది ‘కలర్స్’ ‘కొన్నాళ్ల క్రితం వృద్ధుల దినోత్సవం రోజు నిజాంపేట్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈవెంట్ కోసం యాంకర్‌గా వెళ్లాను. ఆరోజు ఉదయం నుంచి తమ బిడ్డల కోసం వృద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత సేపటికీ వారు రాలేదు. నా వాక్ చాతుర్యంతో వారిని ఆడించి మెప్పించాను. వారు నన్ను నిజమైన బిడ్డవంటూ ముద్దాడారు. ఒకసారి చిన్న బాబుకి లివర్ ఆపరేషన్ చేయాలి. ఖమ్మంకు చెందిన దంపతులిద్దరూ నా రూములో 15 రోజులు ఉన్నారు. ‘సాక్షి చానెల్’ వారిని సంప్రదిస్తే బాబు సమస్యను టీవీలో టెలికాస్ట్ చేశారు. దీంతో రూ.14 లక్షలు పోగయ్యాయి. ఆ డబ్బుతో ఆ బాబు బతికాడు. సమయానికి సరైన సాయం అందక చాలామంది పేదలు కష్టాలు పాలవుతున్నారు. చర్లపల్లి జైల్లో కార్యక్రమాలు చేశా. క్షణికావేశంతో చేసిన తప్పులకు నేరస్తులు జైల్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో తెలుసుకున్నా. ఇలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం డబ్బు కావాలి. ఇందుకు 2013లో ‘కలర్స్ సర్వీస్ అండ్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో సంస్థను స్థాపించా. దీనిద్వారా లైవ్ షోలు చేసి విరాళాలు సేకరిస్తున్నా. ఫేస్బుక్ స్నేహితులతో మాట్లాడి ఆదివారాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నా. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే నాకు ముఖ్యం’.. అని ముగించాడు. -
తీయని గొంతుకతో... శ్రోతల గుండెల్లో
*రేడియో జాకీలుగా మారడానికి ఆసక్తి చూపుతున్న యువత *ఈ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు * చలాకీగా..గలగలా మాట్లాడే వారి కోసం ఎదురు చూస్తున్న ఎఫ్ఎం రేడియోలు ‘గుడ్ మార్నింగ్ నమ్మ బెంగళూరు’ అంటూ నిద్రలేపుతారు. ‘ఇది చాలా హాట్‌గురూ’ అంటూనే స్వీట్ స్వీట్ మెలోడీ సాంగ్స్‌ని వినిపిస్తారు. ‘లవ్‌గురు’గా మారిపోయి ఎన్నో ప్రేమ చిట్కాలను అందిస్తారు. ఇలా ఇంట్లో ఉన్నా, రోడ్డుపై ప్రయాణిస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా... ఎక్కడైనా సరే ధారాళంగా సాగిపోయే మాటల ప్రవాహం, వాటి వెనువెంటే వీనుల విందైన సంగీతం, కొన్ని చిట్కాలు, ప్రశ్నలకు చిలిపి సమాధానాలు, మరి కాసిన్ని సలహాలు... వీటన్నింటితో ప్రస్తుతం మెట్రో ప్రజలందరికీ దగ్గరైనవే ఎఫ్ఎం రేడియోలు. ఈ రేడియోల్లో రేడియో జాకీ(ఆర్జే)లుగా పనిచేస్తున్న వారు తమ గొంతుకతోనే ప్రజల గుండెలకు చేరువవుతున్నారు. గలగల మాటలతో రేడియో శ్రోతలందరి జీవితాల్లో భాగంగా మారిపోతున్నారు. రేడియో జాకీలుగా మారాలని ఆరాటపడే యువతీ యువకుల సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఎంసీఏలు, ఎంబీఏలు పూర్తిచేసిన వారు కూడా రేడియో జాకీలుగా మారడానికి ఉత్సాహం చూపుతున్నారు. లాంగ్ కెరీర్ అంటూ ఉండని ఈ రంగంలోకి రావడానికి యువత ఎందుకు ఉత్సాహం చూపుతోంది? నటులుగానో వీడియో జాకీలుగానో మారితే వారికంటూ ఓ ఫేమ్ ఉంటుంది, జనాల్లో గుర్తింపు ఉంటుంది. మరి కేవలం గొంతులు మాత్రమే పరిచయమయ్యే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం.... - సాక్షి, బెంగళూరు వేలాది మంది అభిమానులను పొందే అవకాశం.... ‘రేడియో జాకీ ఉద్యోగాల్లో ఏళ్లకేళ్లు కొనసాగే వీలుండదు. అందుకే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఈ రంగంలో లాంగ్ కెరీర్ ఉండదు. అయినా కూడా కేవలం గొంతు ద్వారా వేలాది అభిమానులను సంపాదించుకోగల అవకాశం కేవలం రేడియో జాకీలకే ఉంటుంది. రేడియో ఛానల్స్ వినే అభిమానులంతా ప్రతి రోజు మాకు ఫోన్ చేసి వారి ఇంట్లో వారి లాగానే మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రేడియో జాకీలుగా పనిచేసే వారికి మాత్రమే సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్నవారితోను, అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారితోనూ మాట్లాడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. నేను షో చేస్తున్నపుడు ఓ సారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెటర్ అనిల్‌కుంబ్లే ఫోన్ చేసి నా షో అంటే తనకెంతో ఇష్టమని, నా గొంతు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. వేరే ఏ రంగంలో ఉన్నా అటువంటి ప్రముఖుడి నుంచి అభినందనలు పొందే అవకాశం ఉండేది కాదేమో.’ - నేత్ర, రేడియో జాకీ సాఫ్ట్వేర్ నుంచి ఆర్జేలుగా నిన్న మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం, పైలట్‌గా మారడం, వైద్యృవత్తిలో చేరడం, ఇవన్నీ యువతకున్న లక్ష్యాలు. అయితే ఇప్పుడు వీరి అభిరుచి మారుతోంది. నగరంలో ప్రస్తుతం రేడియో జాకీలుగా మారాలనుకుంటున్న యువత సంఖ్య ఎక్కువవుతోంది. ఎంబీఏ, ఎంసీఏలు చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా తమ తమ ఉద్యోగాలను వదిలేసి రేడియో జాకీలుగా మారిపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రేడియో జాకీలుగా చేరే వారికి ఎఫ్ఎం రేడియో సంస్థలు ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని అందిస్తున్నాయి. అంతేకాక సాఫ్ట్వేర్ సంస్థల్లాగానే రేడియో జాకీలకు అదనపు సౌకర్యాలు అందించడంలో కూడా ఎఫ్ఎం రేడియో సంస్థలు ముందుంటున్నాయి. మాటల ప్రవాహమే ముఖ్యం.... రేడియో జాకీలుగా మారడానికి కావలసిన ముఖ్య అర్హత ఏంటంటే...ఏ అంశంలోనైనా సరే మాటల ప్రవాహాన్ని కొనసాగించటమే. గలగల మాట్లాడుతూ తమ గొంతుకతో శ్రోతను ఆకట్టుకోగలిగే వారికి ఎఫ్ఎం రేడియోలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి. రాజకీయాలు, సినిమాలు, సమాజంలోని దురాచారాలు, వాతావరణ కాలుష్యం ఇలా అన్ని అంశాలపై కాస్తంత పరిజ్ఞానం, వృతభాషతో పాటు మరో రెండు భాషల్లో ప్రా వీణ్యం ఉంటే ఇక ఆ రేడియో జాకీ పంట పండినట్లే. ప్రస్తుతం ఇటువంటి వారికి ఆర్జే రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆర్జే సౌజన్య తెలిపారు. రానున్న ఏడాది కాలం లో కేవలం కర్ణాటకలోనే దాదాపు 20 రేడియో చానల్స్ వచ్చే అవకాశముందని రేడియో సిటీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఆర్ జేలుగా సెలబ్రిటీలు... తమకు కావలసిన పబ్లిసిటీని పొందడానికి సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రేడియో చానల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం కొందరు, విడుదలైన సిని మాపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొందరు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి మరికొందరు ఇలా సెలబ్రిటీలంతా ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వైపు అడుగులు వేస్తున్నారు. తద్వారా తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ వారిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అభిమాన తారలనందరినీ నేరుగా క లవడమే కాక ఏకంగా వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం వస్తుండటం కూడా చాలా మంది యువత రేడియో జాకీలుగా మారడానికి కారణమవుతోంది. -
నవ్వుల రారాజు..
మాది చిట్యాల మండలంలోని వెల్లంపల్లి. నాన్న మల్లయ్య సింగరేణి ఉద్యోగి. అమ్మ సరోజన గృహిణి. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. హన్మకొండలోని సరస్వతి కాలేజీలో ఇంటర్మీడియెట్, అరోరా డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘డిప్లొమా ఇన్ మిమిక్రీ’లో గోల్డ్ మెడల్ అందుకున్నా. అనుకరణే.. కమెడియన్‌ను చేసింది. చిన్నప్పటి నుంచే తోటివారిని అనుకరించేవాడిని. స్నేహితులతో ఉపాధ్యాయుల్లా మాట్లాడేవాడిని. విషయం తెలిసిన టీచర్లు మమ్మల్నే ఇమిటేట్ చేస్తావా అంటూ బెత్తం దెబ్బలు వేసేవారు. ఇక సినిమాలంటే విపరీతమైన పిచ్చి. హీరోలు, కమెడియన్ల డైలాగులు చూసి వారిలా ఊహించుకుంటూ సినిమా హాల్లోనే యాక్టింగ్ చేసేవాడిని. మందమర్రి నుంచి హన్మకొండకు రావడంతో నా దశ తిరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు మిత్రుల వద్ద మిమిక్రీ చేసేవాడిని. విద్యాసాగర్ అనే వ్యక్తి.. ‘హీరోలను భలే అనుకరిస్తున్నావు స్టేజీ ప్రోగాములు ఇవ్వొచ్చు కదా’ అని ప్రోత్సహించాడు. ఆయన ప్రోద్బలంతో మిమిక్రీ షోలు చెయ్యడం మొదలుపెట్టా. అలా వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అప్పటి హన్మకొండ సీఐలు కిరణ్‌కుమార్, ఫణికుమార్ నా వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. సినిమాల్లోకి వెళ్లాలని ఒత్తిడి చేశారు. నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది హైదరాబాద్ వెళ్లి టీవీల్లో అవకాశాలు వెతుక్కుంటానని ఇంట్లో చెప్పగానే అడ్డుచెప్పకుండా వెళ్లి ప్రయత్నించమన్నారు. దీంతో ఓ టీవీ చానల్‌కు వెళ్లి ప్రదర్శన ఇచ్చా. నిర్వాహకులు వెంటనే శభాష్ అంటూ కితాబిచ్చారు. తమ చానల్లో రోజూ గంటపాటు కార్యక్రమం నిర్వహించాలని సూ చించారు. దీంతో నా సంతోషానికి అవధుల్లేకుండా పో యాయి. అలా నవ్వుల డాన్.. రేడియో జాకీగా ప్రస్థానాన్ని ప్రారంభించా. తర్వాత 91.1ఎఫ్ఎంలో కార్యక్రమాలు చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఏడు చానళ్లలో, రేడియోలో కమెడియన్‌గా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఓరుగల్లు వీధుల్లో వినాయకుడి వేదికలపై నవ్వుల పువ్వులు పూయించిన వెంకీ.. నేడు వెండి, బుల్లి తెరలపై కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. స్నేహితుల ప్రోద్బలంతో టెలివిజన్ ఇంటర్య్వూకు వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బుల్లి తెరపై నవ్వుల రారాజుగా పేరుగాంచిన వెంకీ అసలు పేరు బొజ్జపల్లి వెంకటేశ్వర్లు. టీవీ వీక్షకుల హృదయాలు దోచుకుంటున్న ఈ వరంగల్ కుర్రోడు హన్మకొండ సుబేదారిలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడాడు. అంతరంగాన్ని ఆవిష్కరించాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. - వరంగల్ అర్బన్ ‘జబర్దస్త్’తో సినిమా అవకాశాలు జబర్దస్త్ టీం లీడర్లు చంద్ర, ధన్‌రాజ్, చిత్రం శ్రీనులతో కలిసి విజయవాడలో ఓ కార్యక్రమం నిర్వహించే అవకాశం లభించింది. అక్కడ నా ప్రదర్శన చూసి మెచ్చుకున్నారు. ఆ వెంటనే ‘జబర్దస్త్’లోకి కమెడియన్‌గా వస్తావా అని నన్ను అడిగారు. ఎగిరి గంతేశా. మొత్తం 74 షోలు చేశా. మహిళ గెటప్‌తోనే 50షోలు చేశా. ‘వద్దురా రాములా’ అనే డైలాగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రేసుగుర్రంలోనూ ఓ చిన్నపాత్ర చేశా. ఇది నాకు నిజంగా కొత్త జీవితమే. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్, ఈ వర్షం సాక్షిగా, ఈజీ మనీ, ఓరే సాంబ రాసుకోరాతోపాటు పలు సినిమాల్లో నటిస్తున్నా. పేరుపెట్టని ఓ సినిమాలో హీరోయిన్ ప్రియమణిని ప్రేమించే ఓ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా. సుబేదారి నుంచి రోజూ హైదరాబాద్‌కు వెళ్లి వస్తున్నా. అయితే బిజీ కావడం వల్ల అక్కడికే మకాం మార్చాలని అనుకుంటున్నా. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నా. సంపాదించిన సొమ్ములో కొంత సేవకు ఉపయోగిస్తున్నా. ప్రతిభ ఉండి చదువుకు దూరమైన నలుగురు నిరుపేద విద్యార్థుల బాగోగులు చూసుకుంటున్నా. సినిమాల్లో అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైంది. కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది. నా ఎదుగుదలకు ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, స్నేహితులకు, కమెడియన్లకు, హీరోహీరోయిన్లకు కృతజ్ఞతలు.