బెంగళూరు : తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, కొందరు తనను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేయడమే కాదు.. తనను రేప్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ప్రముఖ రేడియో జాకీ (ఆర్జే) ర్యాపిడ్ రష్మీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్‌ను కూడా ఆమె ఆశ్రయించింది.
రేడియో షోలో భాగంగా ఇటీవల విడుదలైన కన్నడ సినిమా ‘రాజారథ’ దర్శకుడు అనూప్ భండారీ, అతని సోదరుడు, సినిమా హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టీలతో రష్మీ ఫోన్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా చూడని వారిని ఏం చేస్తారని అడుగగా, ‘వాళ్లు అంతా చెత్తా’అని అనూప్ పేర్కొనగా, హీరో, హీరోయిన్లు వాళ్లు లోఫర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్జే ర్యాపిడ్ రష్మీపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు.
‘నాదీ కర్ణాటక రాష్ట్రమే. 11 ఏళ్లుగా కన్నడ రేడియో రంగంలో పనిచేస్తున్నా. ఎన్నడూ కన్నడిగులపై, కర్ణాటకపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కొందరు కించపరిచే కామెంట్లు చేయడం ద్వారా నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నన్ను దూషిస్తూ సందేశాలు పెడుతున్నారు. రేప్ చేస్తామని కొందరు బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టారు’ అని రష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనను కించపరిచిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఆమె పలు టీవీ షోలు చేశారు. పలు కన్నడ చిత్రాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment