శ్రోతల ముందు గొప్పోళ్ల జీవిత విశేషాల ఆవిష్కరణ
ఉద్యోగం చేసుకుంటూనే వారాంతాల్లో ఆర్‌జేగా..
భరత్ కల్యాణ్ గొంతుకి ఫిదా..
సాక్షి, సిటీబ్యూరో: గుడ్ మార్నింగ్ లండన్.. మీరు వింటున్నారు 98.8 స్పైస్ ఎఫ్‌ఎం.. అంటూ ఓ గొంతు ఉదయమే అందరినీ పలకరిస్తుంటుంది. గొప్ప వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ స్ఫూర్తిని నింపుతుంది. ప్రపంచ దేశాల్లోని శ్రోతలకు ఆ గొంతు ఒక వ్యసనం..
ఆ గొంతు విననిదే చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే ఆ గొంతు మన తెలుగు అబ్బాయిది కాబట్టి.. అదీ మన హైదరాబాదీ గొంతు కాబట్టి. ఆ గొంతుక పేరే భరత్ కల్యాణ్. ఉప్పల్‌కు చెందిన భరత్ పేరు యూకే, యూఎస్, కెనడా, భారత్‌తో పాటు అనేక దేశాల్లో రేడియో శ్రోతలకు వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. వారం మొత్తం జాబ్ చేసుకుని.. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేయకుండా.. శనివారం అక్కడి స్పైస్ ఎఫ్‌ఎంలో ది కల్యాణ్ క్రానికల్స్ విత్ భరత్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు.
ఉన్నత చదువుల కోసం వెళ్లి..
అందరు యువకుల్లాగే విదేశాలకు వెళ్లి ఎంఎస్ చేయాలనేది తన కోరిక. ఎలాగోలా యూకేలోని న్యూక్యాసిల్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌గా మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ప్రజలతో మమేకం కావడమంటే చిన్నప్పటి నుంచి మనోడికి ఇష్టం. ఉద్యోగరీత్యా అది సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఆన్‌లైన్ ఎఫ్‌ఎం స్టేషన్‌లో రేడియో జాకీ ఉద్యోగం ఉందని ప్రకటన చూసి దరఖాస్తు చేసుకోవడం.. మనోడి స్కిల్స్ చూసి సెలెక్ట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో సక్సెస్ అయిన వారి జీవిత విశేషాలు, సక్సెస్ జర్నీని శ్రోతలకు పరిచయం చేస్తూ స్ఫూర్తి నింపుతున్నాడు. అలా మన తెలుగు వారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. 2014 యూపీఎస్సీ టాపర్ ఇరా సింఘాల్ ఇంటర్వ్యూ ఎంతో ఇష్టమని భరత్ చెప్పాడు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు పది మందితో పంచుకుంటుంటే.. ఎంతో మంది తనకు ఫోన్ చేసి మెచ్చుకుంటుంటే ఆ తృప్తే వేరని పేర్కొంటున్నాడు. ఇక, తాను పనిచేసే ఎఫ్‌ఎం దక్షిణాసియా దేశాలకు చెందిన వారు నడుపుతున్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఎంతో సోదరభావంతో పనిచేస్తుంటామని, ఎలాంటి బేధాలు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుందని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment