ఓ ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన వివాహిత
17 ఏళ్ల వివాహ బంధాన్ని పక్కనపెట్టి.. పిల్లలను వదిలేసి రాక
భర్త ఇచ్చిన ఆన్‌లైన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్‌జీఐఏ పోలీసులు
ఫోన్ ట్రాకింగ్‌తో వారి గుర్తింపు.. ట్యాక్సీ డ్రైవర్ ట్రాప్ చేశాడన్న మహిళ
వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిందన్న యువకుడు
భర్త విజ్ఞప్తితో లండన్ విమానం ఎక్కించి పంపిన పోలీసులు
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్‌కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది.
ఆన్‌లైన్ పేమెంట్‌తో..
ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్‌కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది.
ట్యాక్సీ డ్రైవర్‌తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు.
ఏం జరిగింది..?
లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది.
తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్‌కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.
దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లో ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్‌జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్‌పల్లి పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్‌లో చూపింది.
శంషాబాద్ టు గోవా..
పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్‌కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్‌ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్‌మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్‌కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు.
మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్‌జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment