‘మెక్‌క్లస్కీగంజ్’.. భారత్‌లోని ‘మినీ లండన్’గా పేరుగాంచింది. పచ్చని చెట్లు, అందమైన పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. వేసవిలో పర్యాటకులు సేదతీరేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? దీనికి ‘మినీ లండన్’ అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై ‘లండన్ గ్రామం’గా పేరొందిన మెక్‌క్లస్కీగంజ్ ఉంది. దీనిని ‘ఇంగ్లీష్ గ్రామం’ అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్‌క్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు.
ఇక్కడి సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా డేగి నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు.
మెక్‌క్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటీష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్లీమళ్లీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు.
నేటికీ కొందరు ఆంగ్లో-ఇండియన్లు మెక్‌క్లస్కీగంజ్‌లో నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ‘లిటిల్ ఇంగ్లాండ్ ఆఫ్ ఇండియా’ పర్యాటకులు మెచ్చిన ప్రాంతంగా పేరొందింది.
Comments
Please login to add a commentAdd a comment