
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్‌లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
భారీ భద్రత నడుమ ఓటేసిన ధోని
ఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.
ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే
ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగాడు.
వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.
అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.
#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C
— ANI (@ANI) May 25, 2024