వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్‌ఎమ్‌లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్‌లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు.
ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్‌లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్‌బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ.
పోస్ట్ చేసేది ఎవరు?
తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్‌లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్‌తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్‌లో ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్‌గా ఎవరు తీశారో, ఎవరు అప్‌లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్‌లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్‌లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్‌కి, షాపింగ్‌కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్‌బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది.
ముక్కలైన బంధం
కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది.
మేకవన్నె పులి
దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్‌కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్‌లైన్‌లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు.
వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్‌లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్‌లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి.
ఎమెషనల్ ఫ్రాడ్స్‌కి దూరం
ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్‌ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్‌కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్‌ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్‌లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు.
– అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
పగ తీర్చుకోవాలనే..
కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్‌గా ముందు క్లోజ్‌గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్‌లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్‌లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్‌కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్‌ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం.
– వి. గోపీనాథ్, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment