మెరిసేవన్నీ బంగారం కానట్టే, మనం చూసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో అందరూ నిజమైన వారు కాకపోవచ్చు. వారు చూపే ఉత్పత్తులు నమ్మదగినవి అయిఉండకపోవచ్చు. ఎందుకంటే, రూ.100 పెట్టి, వంద అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే కొత్త మార్కెట్ ప్లేస్‌గా ప్రస్తుత సోషల్‌మీడియా తయారైంది.
సరైన అవగాహన లేకపోతే పెయిడ్ పోస్ట్– వ్యక్తిగత అభిప్రాయం మధ్య తేడాను గుర్తించడం కష్టం. సెలబ్రిటీలు, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారు చెబుతున్నారు కదా అని నాసిరకం వస్తుసేవలను కొనుగోలు చేసి మోసపోవద్దు.
ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి కంపెనీలు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వైపు మళ్లుతున్నాయని ఆన్‌లైన్ ట్రెండ్ నివేదికలు చూపుతున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ ఎండార్స్‌మెంట్ పెరగడానికి ప్రధాన కారణాలివి..
►ఇన్‌ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేసే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ.
►వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్ చూపించే వ్యూస్, కామెంట్స్‌ను చూసి నమ్ముతారు.
►ఎక్కువ షేర్ అయిన కంటెంట్‌ను చదవడానికి అధిక సమయం కేటాయిస్తారు. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులు నమ్మే అవకాశాలు ఎక్కువ.
►ఇన్‌ప్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్ కామెంట్స్‌కు ప్రతిస్పందించడం, ఉత్పత్తులు, సేవలపై వారి అభిప్రాయాలను చెప్పడం.. మొదలైన వాటితో వినియోగదారుడు నమ్మకం పెంచుకుంటాడు.
►ఇన్‌ఫ్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్‌తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం కూడా దీనికి ఒక కారణం.
సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు..
►నకిలీ ఉత్పత్తులు/సేవలు/ యాప్‌లు అందించే డబ్బును చూసి ఆశపడవద్దు. వాటి వల్ల మీపైన కూడా యూజర్లకు నమ్మకం పోయే అవకాశం ఉంది.
►ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా గూగుల్‌లో శోధించండి. చట్టబద్ధమైన సమాచారం ఉందో లేదో రివ్యూలు చదివి నిర్ధారించండి.
►మీ ఫోన్ నెంబర్ లేదా చిరునామాను సోషల్ మీడియాలో ఉంచవద్దు. ఎందుకంటే వీటిని వ్యాపార ఉపయోగాల కోసం ఇతరులు సేకరించే అవకాశం ఉంది.
►యాప్‌లకు ఇచ్చిన యాక్సెస్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసి గాని నిర్ధారణకు రాకండి.
►ఫోన్‌లో అవసరమైన ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. అందుకు.. ఫోన్‌లో జీపీఎస్, బ్లూ టూత్, పాస్‌వర్డ్‌లు, పిన్‌లను సెట్ చేయండి.
►నమ్మకమైన ప్రొవైడర్ల నుండి మాత్రమే కావల్సినవాటిని డౌన్‌లోడ్ చేసుకోండి.
►అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పరస్పర చర్యల కోసం సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి.
►మీ వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ట్రోలింగ్‌కి ఆస్కారమిచ్చే వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, ఫొటోలు/వీడియోల ... వంటివి పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తపడటం మంచిది.
►అన్ని ఫొటోలపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి.
►హద్దులను సృష్టించుకోండి. అంటే, భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కథనాల జోలికి వెళ్లకండి.
►ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేయవద్దు.
►జాత్యాహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యాలను నివారించడం మంచిది.
►మీ డేటాను రక్షించుకోవడం ముఖ్యం. మాల్వేర్, ట్రాకర్లను నిరోధించే పెయిడ్ టూల్స్‌ను ఉపయోగించండి.
►పాస్‌వర్డ్‌లు, ఇమెయిల్, నగదు చెల్లింపులను రక్షించడానికి రెండు రకాల ప్రామాణికతను పాటించాలి.
►ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి నకిలీ సమీక్షలు, కామెంట్స్, లైక్స్‌ను కొనుగోలు చేయకూడదు.
ఇలాంటి వాటిలో ఎక్కువ...
►నకిలీ కంపెనీలు ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, పెట్టుబడి, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిఫ్టో కరెన్సీ .. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సహాయంతో ఇంటర్నెట్‌లో గుర్తుతెలియని విధంగా పనిచేస్తాయి. వారి యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సగటు మధ్యతరగతిని ప్రలోభ పెట్టడానికి ఖరీదైన మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించాయి.
►ఆపిల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయని యాప్‌లు చాలా వరకు చట్టబద్ధమైనవి కావు. వీటి ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలంటే మన దేశంలో చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు పట్టే సమయం ఎంతో తెలియదు కాబట్టి మనమే జాగ్రత్త వహించడం ముఖ్యం.
గుర్తించడం ఇలా?
►ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ చేసిన సర్వే ప్రకారం 50 శాతం ఫాలోవర్లు నకిలీలే అని తేలింది. చాలా మంది ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణులు, ర్యాపర్లను కూడా నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మోసగాళ్లు వాడుకుంటున్నారు.
►పోస్టింగ్‌కు ఉన్న ఫాలోవర్ల ట్రెండ్‌ను చూడాలి.
►ఇన్‌ఫ్లుయెన్సర్లు తరచూ చేసే పోస్టింగ్‌లపై దృష్టి పెట్టండి. ఫాలోవర్స్ ఎక్కువ, పోస్ట్‌లు తక్కువ ఉంటే అవి రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తించాలి.
►కొన్ని నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్ల అకౌంట్స్ చూస్తే ఒకే విధమైన కామెంట్స్, ఒకే విధమైన ఫాలోవర్లు ఉంటారు.
►ఇన్‌ఫ్లుయెన్సర్ల మానిటరింగ్ టూల్స్ అంటే కూపన్‌కోడ్‌లు, లింక్, బయో డిస్క్రిప్షన్‌లు... మొదలైనవి పర్యవేక్షించడం ద్వారా మోసపూరితమైన వాటిని కనిపెట్టవచ్చు.
-ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment