
ఈజీ మనీ ప్రచారానికి ఆకర్షితులవుతున్న పిల్లలు
కౌన్సెలింగ్ ఇచ్చినామారటంలేదంటున్న వైద్యులు
ఆన్‌లైన్ విద్య మొదటికే మోసం తెచ్చిందనే అభిప్రాయాలు
పిల్లలను మార్చలేక తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..
- హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి బాధ
మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు..
- వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదన
పిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు..
- మానసిక వైద్యులు చెబుతున్నది ఇది
బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్‌తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్
చదువు కోసం మొదలై..
కరోనా లాక్‌డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్‌లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్‌లైన్‌లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.
సంపాదనకు వెల్‌కమ్.. స్కూల్‌కు బైబై...
సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్‌ఫ్లుయెన్సర్ / సింగర్‌గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ
ఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్‌తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.
- డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్
జాగ్రత్తగా డీల్ చేయాలి
స్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్‌లైన్‌లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్‌గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్‌నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.
- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment