విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి...
మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్‌పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది...
మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు.
‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది.
బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి.
హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’
ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.
‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది.
మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్‌లు ఉన్నారు.
‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి.
యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది.
ఏడీసీ మనీషా
చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది...
మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది.
చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్‌లకు ఇద్దరిని నియమిస్తారు.
మా కూతురు మా శక్తి
మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి.
‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి.
‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’
Comments
Please login to add a commentAdd a comment