ADC
-
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
ఆ ఐదు కంపెనీలపై అమితప్రేమ
సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు ఏడు వేల నుంచి పది వేల రూపాయలకుపైగా అంచనాలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని ఎలాంటి పోటీ లేకుండా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. కేవలం ఐదు నిర్మాణ సంస్థలకు నాలుగున్నరేళ్లలో రూ.25 వేల కోట్లకుపైగా పనుల్ని అప్పగించింది. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతో వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలైతే ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతుండగా.. ఆయన ఆమోదముద్ర వేసి వాటికే నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తుండడం గమనార్హం. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజి, బీఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలకు 80 శాతానికిపైగా పనులు కేటాయించగా మిగిలిన పనుల్ని బీఎస్సీపీఎల్, మేఘ ఇంజినీరింగ్ కంపెనీలకు అప్పగించారు. ఎల్ అండ్ టీకి రూ.8 వేల కోట్ల పనులు.. ఇప్పటివరకూ రూ.39,875 కోట్ల విలువైన పనుల్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో ఒక్క ఎల్ అండ్ టీ సంస్థకే రూ.8 వేల కోట్లకు పైగా పనుల్ని కట్టబెట్టారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఈ సంస్థే నిర్మించగా.. ఇటీవలే మొదలైన శాశ్వత సచివాలయంలోని మూడు, నాలుగు టవర్లు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణంతోపాటు రెండు భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, పలు రోడ్ల ప్రాజెక్టులనూ ఎల్ అండ్‌టీ కే అప్పగించారు. సీడ్ యాక్సెస్ రోడ్, శాశ్వత సచివాలయంలో జీఏడీ టవర్, ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు, రోడ్ల ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఎన్సీసీ చేజిక్కించుకుని మొత్తంగా రూ.4,700 కోట్ల విలువైన పనులు చేస్తోంది. షాపూర్జీ పల్లోంజి సంస్థ రూ.3 వేల కోట్లకు పైగా పనుల్ని చేపట్టగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతో పాటు శాశ్వత సచివాలయంలోని ఒకటి, రెండు టవర్లు.. పూర్తిస్థాయి హైకోర్టు భవనం, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు, ఇతర పనులను అప్పగించారు. ఆ కంపెనీల అర్హతలే టెండర్ నిబంధనలు.. రూ.వేల కోట్ల విలువైన పనుల్ని ఈ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చేస్తోంది. ఏ ప్రాజెక్టును ఎవరికివ్వాలో ముందే నిర్ణయించేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సైతం ఆ కంపెనీలతోనే తయారు చేయిస్తున్నారు. పనులు అప్పగించిన తర్వాత ఆ కంపెనీలకున్న అర్హతలనే నిబంధనలుగా టెండర్లలో పెడుతుండడంతో ఇతర కంపెనీలకు అవకాశం దక్కడం లేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలకు అప్పగించేందుకు టెండర్లలో ప్రి కాస్ట్ భవనాలు నిర్మించిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో దేశంలో ఎన్నో భవనాలు నిర్మించిన కంపెనీలు కూడా ఈ పనులకు అర్హత సాధించలేకపోయాయి. కానీ ఎల్ అండ్ టీ ప్రి కాస్ట్ కాకుండా సాధారణ గోడల్నే కట్టేసి.. ఆ తర్వాత నిబంధనలను మార్పు చేయించుకుంది. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా ఎస్టీపీ, రోడ్ల నిర్మాణం, అంతర్గత వసతుల పనులు చేసి ఉండాలనే నిబంధనను విధించడం ద్వారానే ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి, ఎన్సీసీ కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. పలు రోడ్ల పనుల్ని సైతం వారికే అప్పగించి వాటితో సంబంధం లేని పనులు కూడా చేసి ఉండాలనే నిబంధనలు విధించారు. సర్కార్ పెద్దల కమీషన్లకు భయపడి.. రాజధాని నిర్మాణ వ్యవహారాలు చేపట్టిన సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కంపెనీలతో కుమ్మక్కై నిబంధనలు వారికి అనుకూలంగా రూపొందిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందామని మొదట్లో టాటా కనస్ట్రక్షన్స్ వంటి కంపెనీలు ముందుకు వచ్చినా.. సర్కారు అనుకూల కంపెనీల ముందు నిలవలేకపోయాయి. సింగపూర్, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు సైతం సర్కారు పెద్దల కమీషన్ల డిమాండ్లతో అవాక్కై వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పోటీ లేకుండా తాము తయారుచేసిన అంచనాల ప్రకారమే ప్రాజెక్టులు దక్కించుకుని ఆ కంపెనీలు లాభాలు పండించుకుంటుండగా.. సర్కారు పెద్దలు కమీషన్ల మత్తులో మునిగి మిగిలిన పనుల్నీ వారికే కేటాయించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. -
కిలోమీటర్‌కు రూ.17.23 కోట్లు వాస్తవమే
‘సాక్షి’ కథనంపై ఏడీసీ వివరణ సాక్షి, అమరావతి: రాజధానిలో కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.17.23 కోట్లు వ్యయం అవుతున్న విషయం వాస్తవమేనని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) పేర్కొంది. రాజధానిలో కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.17.23 కోట్ల వ్యయం అవుతోందంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఏడీసీ వివరణ ఇచ్చింది. నిర్ణీత అంచనాలతోనే అమరావతి రహదార్లకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపింది. ఏడీసీ తరఫున జరిగే నిర్మాణాలకు ఆచితూచి అంచనాలను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్‌ను ఈపీసీ విధానంలో చేపట్టగా.. ఒక కిలోమీటర్‌కు రూ.25 కోట్లు వెచ్చించారని, కానీ రాజధానిలో నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ఏడీసీ కిలోమీటర్‌కు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో మాత్రమే అంచనాలను రూపొందించిందని పేర్కొంది. -
కిలోమీటర్‌కు 17.23 కోట్లు!
♦ రాజధాని రహదారుల నిర్మాణంలో సర్కార్ మరో మాయాజాలం ♦ 98 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారుల అంచనా వ్యయం రూ.1520.28 కోట్లు ♦ రూ.3 కోట్ల ఖర్చుతో కిలోమీటర్ మేర జాతీయ రహదారి నిర్మాణం ♦ వర్షం నీటి పైపులు, విద్యుత్ కేబుల్ పనుల ఖర్చు కలిపినా రూ.5 కోట్లు దాటదంటున్న నిపుణులు ♦ అమరావతిలో మాత్రం సప‘రేటు’పై అధికారుల విస్మయం ♦ ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించిన ఏడీసీ సాక్షి, అమరావతి: నూతన రాజధాని ముసుగులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులకైనా చుక్కలనంటేలా భారీ అంచనాలను రూపొందిస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు 6,020 రూపాయల వ్యయం చేసిన సర్కారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల నివాస ప్లాట్లకు ఏకంగా ఒక్కో ప్లాట్‌కు 1.40 కోట్ల రూపాయలను అంచనాగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాల శాశ్వత నిర్మాణాల వరకు సబ్ ఆర్టీరియల్ (ఎక్కువ ట్రాఫిక్ సామర్థ్యం) రహదారుల నిర్మాణాలకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) అదే రీతిలో అంచనాలు తయారు చేసింది. వర్షం నీరు, విద్యుత్ కేబుల్, మంచినీటి పైపులతో సహా 98.77 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.1520.28 కోట్ల అంచనాగా రూపొందించింది. మూడు ప్యాకేజీలుగా ఈ రహదారుల నిర్మాణాలకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ)లో టెండర్లను ఆహ్వానించింది. ఈ రహదారుల అంచనాలను చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారులకు కిలో మీటర్‌కు (సర్వీసు రోడ్లతో సహా) మూడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షం నీరు, మంచి నీరు, విద్యుత్ కోసం వేర్వేరుగా పైప్లైన్లు, కేబుల్ వేసినప్పటికీ కిలో మీటర్‌కు 5 కోట్ల రూపాయలకు మించి వ్యయం కాదని చెబుతున్నారు. అలాంటిది సగటున కిలో మీటర్‌కు 17.23 కోట్ల రూపాయల మేర అంచనాలను రూపొందించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ నంబర్ 8 : 22.93 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) రూ.435.20 కోట్లు. అంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.18.97 కోట్లు. ప్యాకేజీ నంబర్ 9 : 40.23 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం రూ.514.28 కోట్లు. అంటే కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.12.18 కోట్లు. ప్యాకేజీ నంబర్ 10 : 28.60 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల సబ్ ఆర్టీరియల్ రహదారి అంచనా వ్యయం రూ.570.80 కోట్లు. అంటే ఒక్కో కిలో మీటర్ నిర్మాణానికి రూ.19.95 కోట్లు. (మూడు ప్యాకేజీల పరిధిలో 7 కిలోమీటర్ల మేర లింకు రోడ్లతో కలిపి) ప్రతి పనిలోనూ ఇదే తంతు! రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా అంతిమ లక్ష్యం కమీషన్లే. అందువల్లే అదిరిపోయే ధరలను ఖరారు చేస్తోంది. ఇష్టానుసారం పనుల అంచనాలను పెంచేస్తూ.. కావాల్సిన సంస్థలకు ఆ పనులు వచ్చేలా టెండర్ల నిబంధనలను రూపొందిస్తోంది. ఆ తర్వాత ఆ పనులు దక్కించుకున్న సంస్థలు ముందే చేసుకున్న ఒప్పందం మేరకు ‘ముఖ్య’ నేతకు కమీషన్లు అంద జేస్తాయి. దాదాపు ప్రతి పనిలోనూ ఇదే తంతు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు 6,020 రూపాయలను వ్యయం చేసినప్పటికీ ఎక్కడా నాణ్యత లేదని, ఆ భవనాల నుంచి వర్షం నీరు కారు తుండటంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు చేస్తుండటం ప్రత్యక్ష ఉదాహరణ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
ఇక ప్రతి ఇంటికీ యూపిక్ కార్డ్
న్యూఢిల్లీ: కార్పొరేషన్ ఆదాయం పెంపుదలకు ఎన్డీసీ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమం లో అనధికారిక కాలనీలతోపాటు నార్త్ కార్పొరేషన్లో ఉన్న ప్రజల ఆస్తి పాస్తుల వివరాలన్నింటినీ పొందుపరిచే యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ (యూపిక్) కార్డులను జారీ చేసేందుకు నార్త్ సివిక్ ఏజెన్సీ నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను పిలిచిన కార్పొరేషన్ అతి తక్కువ వేలం వేసిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనివల్ల వచ్చే జూన్‌కల్లా పాన్ నంబర్ కలిగి ఉన్నట్లే ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి భవనం ఈ యూపిక్ కోడ్‌ను కలిగి ఉంటుంది. ‘ఉత్తర పౌర ఏజెన్సీలో ప్రస్తుతం 10 లక్షల ఆస్తులుండగా మూడు లక్షల ఆస్తులకు మాత్రమే పన్ను వసూలు చేస్తున్నాం. ఈ యూపిక్ విధానం పన్నుల వసూళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని నార్త్ కార్పొరేషన్ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ ఎం.ఎస్.ఎ.ఖాన్ అన్నారు. పాన్ కార్డ్ నంబర్‌లాగే యూపిక్ నంబర్ ఉంటుందని, ప్రజలకు కార్పొరేషన్‌తో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకైనా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఖాన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పన్నుల వివరాలను ఆన్ లైన్లో చూసుకోవడానికే గాక, ఎటువంటి ఫిర్యాదులైనా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. టెండర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిందని, ఒక సమావేశం అనంతరం ఒప్పందం కుదురుతుందని, మే 16న ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఇది అమలులోకి వస్తుందని ఖాన్ వెల్లడించారు. అయితే ఈ కార్డుల కోసం ప్రజలు కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒప్పందం చేసుకున్న సంస్థ కార్పొరేషన్‌లోని ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించి, వెంటనే యూపిక్ కోడ్‌ను జారీ చేస్తుందని ఖాన్ తెలిపారు. భవనాల ఫొటోలు తీసి భౌగోళిక సమాచార వ్యవస్థలో పొందుపరచనున్నట్టు కూడా ఆయన వివరించారు. యూపిక్ కార్డులతో కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ‘ప్రస్తుతం నార్త్ కార్పొరేషన్లో 10 నుంచి 12 లక్షల భవనాలు, ఇతర వాణిజ్య సముదాయాలు ఉండగా కేవలం మూడు లక్షల ఆస్తులకు సంబంధించిన పన్ను మాత్రమే కార్పొరేషన్‌కు అందుతోంది. యూపిక్ కోడ్‌తో... కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 60 నుంచి 70 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంద’ని ఖాన్ చెప్పారు.