న్యూఢిల్లీ: కార్పొరేషన్ ఆదాయం పెంపుదలకు ఎన్డీసీ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమం లో అనధికారిక కాలనీలతోపాటు నార్త్ కార్పొరేషన్‌లో ఉన్న ప్రజల ఆస్తి పాస్తుల వివరాలన్నింటినీ పొందుపరిచే యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ (యూపిక్) కార్డులను జారీ చేసేందుకు నార్త్ సివిక్ ఏజెన్సీ నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను పిలిచిన కార్పొరేషన్ అతి తక్కువ వేలం వేసిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనివల్ల వచ్చే జూన్‌కల్లా పాన్ నంబర్ కలిగి ఉన్నట్లే ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి భవనం ఈ యూపిక్ కోడ్‌ను కలిగి ఉంటుంది.
‘ఉత్తర పౌర ఏజెన్సీలో ప్రస్తుతం 10 లక్షల ఆస్తులుండగా మూడు లక్షల ఆస్తులకు మాత్రమే పన్ను వసూలు చేస్తున్నాం. ఈ యూపిక్ విధానం పన్నుల వసూళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని నార్త్ కార్పొరేషన్ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ ఎం.ఎస్.ఎ.ఖాన్ అన్నారు. పాన్ కార్డ్ నంబర్‌లాగే యూపిక్ నంబర్ ఉంటుందని, ప్రజలకు కార్పొరేషన్‌తో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకైనా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఖాన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పన్నుల వివరాలను ఆన్ లైన్‌లో చూసుకోవడానికే గాక, ఎటువంటి ఫిర్యాదులైనా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. టెండర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిందని, ఒక సమావేశం అనంతరం ఒప్పందం కుదురుతుందని, మే 16న ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఇది అమలులోకి వస్తుందని ఖాన్ వెల్లడించారు.
అయితే ఈ కార్డుల కోసం ప్రజలు కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒప్పందం చేసుకున్న సంస్థ కార్పొరేషన్‌లోని ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించి, వెంటనే యూపిక్ కోడ్‌ను జారీ చేస్తుందని ఖాన్ తెలిపారు. భవనాల ఫొటోలు తీసి భౌగోళిక సమాచార వ్యవస్థలో పొందుపరచనున్నట్టు కూడా ఆయన వివరించారు. యూపిక్ కార్డులతో కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ‘ప్రస్తుతం నార్త్ కార్పొరేషన్‌లో 10 నుంచి 12 లక్షల భవనాలు, ఇతర వాణిజ్య సముదాయాలు ఉండగా కేవలం మూడు లక్షల ఆస్తులకు సంబంధించిన పన్ను మాత్రమే కార్పొరేషన్‌కు అందుతోంది. యూపిక్ కోడ్‌తో... కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 60 నుంచి 70 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంద’ని ఖాన్ చెప్పారు.
ఇక ప్రతి ఇంటికీ యూపిక్ కార్డ్
Published Sat, Apr 26 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM
Advertisement
Advertisement