
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్ (ఓఎంఆర్) ఒక్కియం తొరైపాక్కంలో ఉన్న 13.68 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీని రూ.612 కోట్లకు విక్రయించింది. నీలాంకరై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వారం ప్రారంభంలో ఈ అమ్మకం లావాదేవీలు నమోదయ్యాయి. తొరైపాక్కం కాంప్లెక్స్‌లో సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న కాగ్నిజెంట్ ఇండియా ప్రధాన కార్యాలయం లెగసీ ఇక ముగిసినట్లు తెలుస్తుంది.
చెన్నైలో కాగ్నిజెంట్ మొదటి పూర్తి యాజమాన్యంలోని క్యాంపస్‌గా ఉన్న ఈ ప్రాపర్టీకి గణమైన చరిత్ర ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, చంద్రశేఖరన్‌లకు గతంలో ఈ ఆఫీస్ ఆపరేషనల్ బేస్‌గా పనిచేసింది. ఒకప్పుడు కాగ్నిజెంట్ రిమోట్ కార్యకలాపాలకు ఇది ఎంతో తోడ్పడింది. అయితే ప్రస్తుతం అమ్మిన దాదాపు 15 ఎకరాల్లోని నాలుగు లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలంతో కూడిన ఈ కార్యాలయానికి సుమారు రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని గత ఏడాది సెప్టెంబరులో ఒక నివేదిక తెలిపింది.
ఎంఈపీజెడ్, షోలింగనల్లూరు, సిరుసేరిలోని మూడు సొంత భవనాల్లో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ విక్రయం జరిగింది. ఈ లావాదేవీని సులభతరం చేయడానికి అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ జేఎల్ఎల్‌ను నియమించి గత ఏడాది ఆగస్టులో కంపెనీ ఈ ప్రాపర్టీని మార్కెట్లోకి తెచ్చింది. స్థానిక డెవలపర్లు బాశ్యామ్ గ్రూప్, కాసాగ్రాండ్ సహా పలువురు కొనుగోలుదారులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ బగామానే గ్రూప్ విజయవంతమైన బిడ్డర్‌గా లిస్ట్ అయింది.
ఇదీ చదవండి: శామ్‌సంగ్ కో-సీఈఓ కన్నుమూత
ఈ ప్రాపర్టీ విక్రయం ద్వారా స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజుల కోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.55.08 కోట్లు సమకూరాయి. ఈ లావాదేవీని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాపర్టీ అప్పగింతకు ముందుగా అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు మూడు నెలల సమయం పట్టినప్పటికీ కాగ్నిజెంట్ డిసెంబర్ చివరి నాటికే క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇదిలాఉండగా, రామానుజన్ ఐటీ పార్క్, డీఎల్ఎఫ్, ఆర్ఏ పురంలోని సెయింట్ మేరీస్ రోడ్డులోని కార్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా చెన్నై అంతటా లీజుకు తీసుకున్న స్థలాలను కూడా కంపెనీ ఖాళీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment