తీయని గొంతుకతో... శ్రోతల గుండెల్లో
*రేడియో జాకీలుగా మారడానికి ఆసక్తి చూపుతున్న యువత
*ఈ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు
* చలాకీగా..గలగలా మాట్లాడే వారి కోసం ఎదురు చూస్తున్న ఎఫ్‌ఎం రేడియోలు
‘గుడ్ మార్నింగ్ నమ్మ బెంగళూరు’ అంటూ నిద్రలేపుతారు. ‘ఇది చాలా హాట్‌గురూ’ అంటూనే స్వీట్ స్వీట్ మెలోడీ సాంగ్స్‌ని వినిపిస్తారు. ‘లవ్‌గురు’గా మారిపోయి ఎన్నో ప్రేమ చిట్కాలను అందిస్తారు. ఇలా ఇంట్లో ఉన్నా, రోడ్డుపై ప్రయాణిస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా... ఎక్కడైనా సరే ధారాళంగా సాగిపోయే మాటల ప్రవాహం, వాటి వెనువెంటే వీనుల విందైన సంగీతం, కొన్ని చిట్కాలు, ప్రశ్నలకు చిలిపి సమాధానాలు, మరి కాసిన్ని సలహాలు... వీటన్నింటితో ప్రస్తుతం మెట్రో ప్రజలందరికీ దగ్గరైనవే ఎఫ్‌ఎం రేడియోలు. ఈ రేడియోల్లో రేడియో జాకీ(ఆర్‌జే)లుగా పనిచేస్తున్న వారు తమ గొంతుకతోనే ప్రజల గుండెలకు చేరువవుతున్నారు.
గలగల మాటలతో రేడియో శ్రోతలందరి జీవితాల్లో భాగంగా మారిపోతున్నారు. రేడియో జాకీలుగా మారాలని ఆరాటపడే యువతీ యువకుల సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఎంసీఏలు, ఎంబీఏలు పూర్తిచేసిన వారు కూడా రేడియో జాకీలుగా మారడానికి ఉత్సాహం చూపుతున్నారు. లాంగ్ కెరీర్ అంటూ ఉండని ఈ రంగంలోకి రావడానికి యువత ఎందుకు ఉత్సాహం చూపుతోంది? నటులుగానో వీడియో జాకీలుగానో మారితే వారికంటూ ఓ ఫేమ్ ఉంటుంది, జనాల్లో గుర్తింపు ఉంటుంది. మరి కేవలం గొంతులు మాత్రమే పరిచయమయ్యే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం.... - సాక్షి, బెంగళూరు
వేలాది మంది అభిమానులను పొందే అవకాశం....
‘రేడియో జాకీ ఉద్యోగాల్లో ఏళ్లకేళ్లు కొనసాగే వీలుండదు. అందుకే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఈ రంగంలో లాంగ్ కెరీర్ ఉండదు. అయినా కూడా కేవలం గొంతు ద్వారా వేలాది అభిమానులను సంపాదించుకోగల అవకాశం కేవలం రేడియో జాకీలకే ఉంటుంది. రేడియో ఛానల్స్ వినే అభిమానులంతా ప్రతి రోజు మాకు ఫోన్ చేసి వారి ఇంట్లో వారి లాగానే మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రేడియో జాకీలుగా పనిచేసే వారికి మాత్రమే సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్నవారితోను, అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారితోనూ మాట్లాడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. నేను షో చేస్తున్నపుడు ఓ సారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెటర్ అనిల్‌కుంబ్లే ఫోన్ చేసి నా షో అంటే తనకెంతో ఇష్టమని, నా గొంతు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. వేరే ఏ రంగంలో ఉన్నా అటువంటి ప్రముఖుడి నుంచి అభినందనలు పొందే అవకాశం ఉండేది కాదేమో.’
- నేత్ర, రేడియో జాకీ
సాఫ్ట్‌వేర్ నుంచి ఆర్‌జేలుగా
నిన్న మొన్నటి వరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం, పైలట్‌గా మారడం, వైద్యృవత్తిలో చేరడం, ఇవన్నీ యువతకున్న లక్ష్యాలు. అయితే ఇప్పుడు వీరి అభిరుచి మారుతోంది. నగరంలో ప్రస్తుతం రేడియో జాకీలుగా మారాలనుకుంటున్న యువత సంఖ్య ఎక్కువవుతోంది. ఎంబీఏ, ఎంసీఏలు చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా తమ తమ ఉద్యోగాలను వదిలేసి రేడియో జాకీలుగా మారిపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రేడియో జాకీలుగా చేరే వారికి ఎఫ్‌ఎం రేడియో సంస్థలు ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని అందిస్తున్నాయి. అంతేకాక సాఫ్ట్‌వేర్ సంస్థల్లాగానే రేడియో జాకీలకు అదనపు సౌకర్యాలు అందించడంలో కూడా ఎఫ్‌ఎం రేడియో సంస్థలు ముందుంటున్నాయి.
మాటల ప్రవాహమే ముఖ్యం....
రేడియో జాకీలుగా మారడానికి కావలసిన ముఖ్య అర్హత ఏంటంటే...ఏ అంశంలోనైనా సరే మాటల ప్రవాహాన్ని కొనసాగించటమే. గలగల మాట్లాడుతూ తమ గొంతుకతో శ్రోతను ఆకట్టుకోగలిగే వారికి ఎఫ్‌ఎం రేడియోలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి. రాజకీయాలు, సినిమాలు, సమాజంలోని దురాచారాలు, వాతావరణ కాలుష్యం ఇలా అన్ని అంశాలపై కాస్తంత పరిజ్ఞానం, వృతభాషతో పాటు మరో రెండు భాషల్లో ప్రా వీణ్యం ఉంటే ఇక ఆ రేడియో జాకీ పంట పండినట్లే. ప్రస్తుతం ఇటువంటి వారికి ఆర్‌జే రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆర్‌జే సౌజన్య తెలిపారు. రానున్న ఏడాది కాలం లో కేవలం కర్ణాటకలోనే దాదాపు 20 రేడియో చానల్స్ వచ్చే అవకాశముందని రేడియో సిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఆర్ జేలుగా సెలబ్రిటీలు...
తమకు కావలసిన పబ్లిసిటీని పొందడానికి సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రేడియో చానల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం కొందరు, విడుదలైన సిని మాపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొందరు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి మరికొందరు ఇలా సెలబ్రిటీలంతా ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. తద్వారా తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ వారిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అభిమాన తారలనందరినీ నేరుగా క లవడమే కాక ఏకంగా వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం వస్తుండటం కూడా చాలా మంది యువత రేడియో జాకీలుగా మారడానికి కారణమవుతోంది.