FM radio
-
ఇకపై స్మార్ట్ ఫోన్లో టీవీ చూడొచ్చు..! ఎలా అంటే..?
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ కార్యక్రమాలను వీక్షించేలా ట్రయల్స్ నిర్వహించనుంది. ఇదే విషయాన్ని సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది రేడియో స్టేషన్లను వేలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎఫ్ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ దేశంలో 60 శాతం మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. సరిహద్దు, వ్యూహాత్మక ప్రాంతాలతో సహా ప్రసార భారతి పరిధిని విస్తృతం చేయడానికి ప్రసార మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ డెవలప్మెంట్ (బైండ్) స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 2,500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ప్రభుత్వ రంగ ప్రసారాలను పెంచడం, ఆల్ ఇండియా రేడియో (air), దూరదర్శన్ (dd)తో సహా ప్రసార భారతి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు టెలివిజన్ సిగ్నల్‌లను నేరుగా మొబైల్ ఫోన్లకు ప్రసారం చేసేలా పరిసర ప్రాంతాలలో ట్రాన్స్మిటర్లను ఇన్స్టాల్ చేసినట్లు చంద్ర చెప్పారు. అత్యాధికమైన టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను సేకరించవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ పరికరాలకు ప్రత్యేక డాంగిల్‌ను జత చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫోన్లలో ప్రత్యేక చిప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా మొబైల్ తయారీదారులను ప్రోత్సహించాల్సి ఉంటుందని, తద్వారా డాంగిల్ లేకుండానే టెలివిజన్ సిగ్నల్స్ అందుతాయని అన్నారు. -
కొత్త విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆడియో బుక్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆడియో స్ట్రీమింగ్ వేదిక పాకెట్ ఎఫ్ఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన కస్టమర్లకు ఎక్స్‌క్లూజివ్, లైసెన్స్డ్ ఆడియో బుక్స్‌ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ కంచన్ మిశ్రా మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆడియో బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయని, పాకెట్ ఎఫ్ఎంతో కలిసి రచయితలకు సహకారం అందించడం ద్వారా ఆడియోబుక్స్ తేనున్నామని తెలిపారు.దేశంలో ఇప్పటికే సుమారు 2.5 కోట్ల మంది ఆడియో బుక్స్‌ను వింటున్నట్టు అంచనా. పాకెట్ ఎఫ్ఎం ప్రతి నెల 1,20,000కిపైగా ఆడియో బుక్స్‌ను విక్రయిస్తోంది. చదవండి: ITR Filing Deadline: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు -
తొలి రేడియో స్టేషన్ ఎక్కడో తెలుసా?
కవర్ స్టోరీ సమస్త సమాచారం, అభిరుచికి తగిన వినోదం ఇప్పుడు అరచేతిలోకే అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయింది. దాదాపు శతాబ్దం కిందట సమాచారం కోసం వార్తా పత్రికలే ఆధారం. రంగస్థల కళలు, జానపద కళారూపాలే వినోద సాధనాలు. అక్షరాస్యత తక్కువగా ఉన్న నాటి కాలంలో వార్తా పత్రికలతో జన సామాన్యానికి పెద్దగా నిమిత్తం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో రేడియో రాకడతో తొలితరం సమాచార విప్లవం మొదలైందనే చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో సంపన్నుల ఇళ్లలో హోదాకు చిహ్నంగా ఉండే రేడియో సెట్లు అనతి కాలంలోనే పంచాయతీ కార్యాలయాల వరకు, ఆ తర్వాతి కొద్ది కాలానికే సామాన్యుల ఇళ్లకు విస్తరించాయి. రెండు మూడు తరాల వారికి రేడియో ఆనాటి ఆటవిడుపు. మన దేశంలో టీవీ ఎనభయ్యో దశకంలో అందుబాటులోకి వచ్చింది. టీవీ సెట్లు మధ్య తరగతి నట్టిళ్లకు చేరక ముందు సమాచార, వినోద రంగాల్లో రేడియో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగిం చింది. స్మార్ట్ఫోన్ల యుగం మొదలైనా, రేడియో ఇంకా శ్రోతలను అలరిస్తూనే ఉంది. సెల్ఫోన్ల లోనూ ఎఫ్ఎం స్టేషన్ల ప్రసారాలు రేడియో అభిమానులను ఇంకా ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వంటివి రేడియో ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న రేడియో, కొత్త కొత్త సాధనాల ద్వారా శ్రోతలకు చేరువవుతూనే ఉంది. సాంకేతిక రంగంలో శరవేగంగా సంభవిస్తూ వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో ఆరు ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 215 ఆకాశవాణి కేంద్రాల నుంచి 337 ప్రసార కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 144 మీడియం వేవ్ కేంద్రాలు, 54 షార్ట్ వేవ్ కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి. రేడియో పుట్టుక ఇలా... విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను తొలుత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్1886లో గుర్తించాడు. దాదాపు దశాబ్దం తర్వాత 1895–96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త మార్కోనీ. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లతో కొలవడం మొదలైంది. మార్కోనీ వివిధ దశల్లో కొనసాగించిన ప్రయోగాలు విజయవంతమవుతూ వచ్చాయి. ఇవి అనతికాలంలోనే తొలి రేడియో ప్రసార కేంద్రం ఆవిర్భావానికి దారి తీశాయి. పిట్స్‌బర్గ్‌లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబరు 2న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో పిట్స్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనపరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లాండ్ అయినా, అక్కడి ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. వైర్లెస్ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలసి 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) స్థాపించాయి. బీబీసీ 1922 నవంబరు 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) నియంత్రిస్తుంది. సమాచార సాంకేతికత పురోగతిలో రేడియో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. ఇది కేవలం రేడియో ప్రసారాలకు మాత్రమే పరిమితం కాదు. టీవీ ప్రసారాలకు, సెల్ఫోన్లు, రాడార్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిమోట్ కంట్రోల్, రిమోట్ సెన్సింగ్, వైర్లెస్ నెట్వర్కింగ్, ఉపగ్రహ ప్రసారాలు వంటి వాటన్నింటికీ రేడియో సాంకేతికతే మూలాధారం. రేడియో సాంకేతికత ఫలితంగానే నేడు ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయే స్థాయికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధ్యమైంది. రేడియో నిర్మాణంలో మార్పులు తొలినాటి రేడియో సెట్లలో ఇప్పటి మాదిరిగా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్ నెట్ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. తొలినాళ్లలో రేడియో ప్రసారాలు లాంగ్ వేవ్, మీడియం వేవ్‌లలో జరిగేవి. వేవ్ లెంగ్త్ ఎక్కువయ్యే కొద్దీ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా కాకుండా, కలగలసి వినిపించే పరిస్థితి తరచుగా తలెత్తేది. షార్ట్ వేవ్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఈ ఇబ్బంది కొంత దూరమైంది. రేడియో ప్రసారాల్లో ప్రసారమయ్యే శబ్దాలకు అనుగుణంగా తరంగాల వెడల్పును మార్చే ‘ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్’ (ఏఎం) ఉపయోగిస్తారు. అల్ట్రాషార్ట్ వేవ్స్‌తో ప్రసారాలు సాగించే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ (ఎఫ్ఎం) రేడియో ప్రసారాలు మొదలైన తర్వాత రేడియో ప్రసారాల్లో ఇదివరకు ఎదురయ్యే ఇబ్బందులు దూరమయ్యాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే శాటిలైట్ రేడియోలు, ఇంటర్నెట్ రేడియోలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చిలైట్లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్లు కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో పాటు, పరిమాణంలోనూ ఇవి చిన్నగా ఉండటంతో ట్రాన్సిస్టర్లు అనతికాలంలోనే సామాన్యుల ఇళ్లకూ చేరుకున్నాయి. ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని రేడియో ప్రసారాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు రూపొందుతూ, జనాలను అలరించసాగాయి. బాంబేలో మన తొలి రేడియో స్టేషన్ బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‌ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1927 జూలై 23న ప్రారంభించారు. అంతకు ముందు రేడియో క్లబ్ ఆఫ్ బాంబే 1923లో దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 1936లో ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో ఏర్పడిన రెండేళ్లకు–1938 జూన్ 16న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకట రెడ్డినాయుడు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ప్రారంభోపన్యాసాలు చేశారు. అంతకు ఐదేళ్ల ముందే హైదరాబాద్‌లో మహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పట్లో హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న నిజాం రాజు 1935లో ఆ రేడియో స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి. దీనికే 1939లో దక్కన్ రేడియోగా పేరు మార్చారు. దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు. ఆయన పట్టుదల ఫలితంగా 1948 డిసెంబరు 1 నాటికి దక్కన్ రేడియోలో తెలుగు ప్రసారాలకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో (ఆకాశవాణి) పరిధిలోకి తెచ్చింది. అంతకు ముందే 1948 డిసెంబరు 1న విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. విశాఖపట్నం, కడపలలో 1963లో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తర్వాతి కాలంలో కర్నూలు, తిరుపతి, అనంతపురం, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌లలో కూడా ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేడియోస్టేషన్లన్నింటినీ 2006 సంవత్సరం వరకు భారత ప్రభుత్వమే నడిపేది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం ప్రసారాలను కూడా అందిస్తున్నాయి. ఇవికాకుండా, పలు ప్రైవేటు ఎఫ్ఎం రేడియో కేంద్రాలు కూడా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఆకాశవాణి తొలినాళ్లలో విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి వినోద విజ్ఞానాలను మేళవించిన జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అనతికాలంలోనే ఈ కార్యక్రమాలు ఆనాటి జనజీవితంలో భాగమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాశవాణి కేంద్రాలే కాకుండా, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం తెలుగులో వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్ కేంద్రాలు కూడా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. తెలుగులో తొలి ప్రసారాలు తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్ 16న సాయంత్రం5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు. ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది. అంజయ్య మంత్రివర్గం రాజీనామా, విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, ఎన్టీఆర్ మరణవార్త మొదటిగా వెల్లడి చేసిన ఘనత ఆకాశవాణి వార్తలకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, అద్దంకి మన్నార్, పీఎస్సార్ ఆంజనేయ శాస్త్రి, డి.వెంకట్రామయ్య, ప్రయాగ రామకృష్ణ, మామిళ్లపలి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, జ్యోత్స్నాదేవి తదితరులు ఎందరో రేడియోలో వార్తలు చదవడం ద్వారా ప్రసిద్ధులయ్యారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. తొలినాళ్లలో ‘గీతావళి’ పేరుతో భావగీతాలు ప్రసారమయ్యేవి. ‘లలిత సంగీతం’ అనే పేరు మాత్రం ఆకాశవాణి ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఎమ్మెస్ రామారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తరంజన్, మల్లిక్, సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతీ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి ప్రముఖ కవులు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు, గ్రామీణులకు, కార్మికులకు, యువతరానికి, కవులు, రచయితలకు ఆకాశవాణి అనేక కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు వ్యాఖ్యాతలు శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఎందరో మహానుభావులు... సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. శ్రీశ్రీ, జాషువా వంటి కవులు కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, ఆచంట జానకిరాం, తెన్నేటి హేమలత, దాశరథి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలంత్రపు రజనీకాంతరావు, బందా కనకలింగేశ్వరరావు వంటి సాహితీ సంగీత నాటకరంగ ప్రముఖులు ఆకాశవాణిలో పనిచేసిన వారే. గ్రామీణ కార్యక్రమాల వ్యాఖ్యాతగా ప్రయాగ నరసింహశాస్త్రి గ్రామీణ శ్రోతలకు చేరువైతే, ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ద్వారా ఉషశ్రీ రేడియో శ్రోతల్లో ఆబాలగోపాలాన్నీ అలరించారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి బాలల కార్యక్రమాల ద్వారా కొన్ని తరాల పిల్లలను ప్రభావితం చేశారు. ఆకాశవాణికి సేవలందించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. ఆకాశవాణిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఎందరో మహానుభావులు ఎనలేని కృషి చేశారు. వారందరికీ వందనాలు. – పన్యాల జగన్నాథదాసు -
వినండి.. వినండి.. ఉల్లాసంగా...
సంగారెడ్డి అర్బన్: రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని జిల్లా జైలులో ఈనెల 10వ తేదీన ఎఫ్ఎం రేడియో ప్రారంభం కానుంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్ సెంట్రల్ జైళ్లలో ఇప్పటికే ఎఫ్ఎం రేడియో సేవలు ఖైదీలకు అందుతున్నాయి. డీజీ వీకే సింగ్, ఐజీ సైదయ్య ఆదేశాల ప్రకారం జిల్లా అధికారులు గతంలో ఇక్కడి జైలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోలు పంపు, సూపర్‌మార్కెట్, హెయిర్ కటింగ్ సెలూన్, గ్రంథాలయాలు విజయవంతం కావడమే కాకుండా ఖైదీల్లో మార్పును తీసుకు వచ్చాయి. కాగా, ఎఫ్ఎం రేడియో అంతర్రాష్ట్ర ఖైదీలు, నిరక్షరాస్యులైన ఖైదీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎఫ్ఎం రేడియో పనితీరు ఇదీ.. జైల్ ఎఫ్ఎం రేడియోని కేవలం ఖైదీలు, జైలు లోపల ఉండే అధికారులు, సిబ్బందికి వినిపించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీలను కలవడానికి (ములాఖత్) వచ్చే వారు ఉండే చోట స్పీకర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 6 బ్లాక్‌లలో 8 స్పీకర్లు అమర్చారు. అదనంగా మరో 4 అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్ఎం రేడియోలో పనిచేయడానికి ఐదుగురు రేడియో జాకీలను ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా రిహార్సల్స్ చేయిస్తున్నారు. వీరేకాక మరో ఐదుగురిని జాకీలుగా ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. జైలు ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలు ఖైదీల్లో ఉత్సాహం నింపడమేకాక మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమ వివరాలు... ‘వెల్కమ్ టు మీ అంతర్వాణి.. జైలు ఖైదీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..’అంటూ ఖైదీ రేడియో జాకీలు ఉదయం నుంచే పలుకరిస్తుంటారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రస్తుతానికి జైలు కార్యక్రమాలన్నీ వైర్లెస్ సెట్లు, అందుబాటులో ఉన్న ఖైదీల ద్వారా సమాచారం చేరవేయడంద్వారా జరుగుతుండగా, ఇక నుంచి ఎఫ్ఎం రేడియో ద్వారానే సమాచారాన్ని చేరవేస్తారని అంటున్నారు. బయట నుంచి ఎవరైనా ఖైదీని కలవడానికి వస్తే ఆ వివరాలను రైల్వే, బస్సు స్టేషన్లలో అనౌన్స్ చేసినట్లుగా జాకీలు వినిపిస్తారు. ఎప్పటికప్పుడు జైలు సమాచారం. మధ్య, మధ్యలో భక్తిరస, వినోదాత్మక పాటలు, తాజా వార్తలను ఎఫ్ఎం రేడియో ద్వారా వినిపిస్తారు. జైలుకు వచ్చే ఉన్నతాధికారులు సైతం తమ సందేశాన్ని ఎఫ్ఎం రేడియో ద్వారా ఖైదీలకు వినిపించే వీలుంటుందని చెబుతున్నారు. బతుకులు మారుస్తున్న బందీఖాన... బయటి ప్రపంచం విషయాలు తెలియడంతో పాటు, అంతర్గతంగా సరదాగా గడపడానికి రేడియో సేవలు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఖైదీలు చెబుతున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్షపడి ఇక్కడికి వచ్చాక వారిలో మార్పు తెచ్చేలా కంది జైలు వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా జైలులో చుట్టూ పచ్చటి చెట్లు, ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. సూపర్‌మార్కెట్‌ను నిర్వహించడం, పురుషుల హెయిర్ సెలూన్, పెట్రోలు పంపు నిర్వహణతో సంగారెడ్డి జైలుకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వచ్చింది. మంచి ప్రవర్తనతో విడుదలైన ఐదుగురు ఖైదీలు పెట్రోలు పంపులో పనిచేస్తుండగా మరో నలుగురు ఖైదీలు కూడా ఇందులో పనిచేస్తున్నారు. కంది జైలులో ఓపెన్ జిమ్ సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జైలులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాదిన జైల్లో ఈ విధమైన జిమ్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కానుంది. జైలు ఆవరణలో ఓపెన్ జిమ్ కోసం స్థలాన్ని చదును చేశారు. జైలులో ఉన్న పరికరాలతోనే తక్కువ ఖర్చుతో జిమ్‌ను ఏర్పాటు చేసి ఖైదీలను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేందుకు కృషిచేస్తున్నామని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ తెలిపారు. ఖైదీల్లో కళలను ప్రోత్సహిస్తాం ఖైదీల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికి ఈ నెల 10న జిల్లా జైలులో ఎఫ్ఎం రేడియోని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర జైళ్లశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం అంతర్వాణి అని నామకరణం చేశాం. ఇది ఖైదీలకు అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ప్రముఖ వ్యక్తులను పిలిచి రేడియో ద్వారా ఖైదీలకు సందేశం ఇప్పిస్తాం. వారిలో దాగిఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీస్తాం. మిగతా కార్యక్రమాల్లాగే ఎఫ్ఎం రేడియో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా. – శివకుమార్‌గౌడ్, జైలు సూపరింటెండెంట్ -
వాట్సాప్ ‘ఆకాశవాణి’ అవగాహన..
దేశంలోని చట్టాలకు లోబడి పనిచేయాలని, ఏదైనా సమస్య ఎదురైతే దానికి అమెరికా నుంచి కాకుండా భారత్ నుంచే సమాధానం ఇచ్చేలా ఆ సంస్థ ప్రతినిధి ఇక్కడే ఉండేలా, గ్రీవెన్స్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే వాట్సాప్ సీఈఓ క్రిస్ డానియల్స్ను కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ నకిలీవార్తల నియంత్రణ చర్యలతో పాటు ఆకాశవాణి (ఏఐఆర్) పరిధిలోని 46 హిందీ రేడియో స్టేషన్లలో గురువారం నుంచి అవగాహన, ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ముందుగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్‌ల వ్యాప్తంగా ఈ సర్వీసును ప్రారంభించి, రాబోయేరోజుల్లో ఇతర భారతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. ‘మీరు, మేము కలిసి పుకార్లను నిర్మూలిద్దాం’ అంటూ 30 సెకన్ల కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లోభాగంగా తమకొచ్చే మెసేజ్‌లు ఏ మేరకు విశ్వసనీయమైనవో యూజర్లు తెలుసుకునేందుకు చిట్కాలతో పాటు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కారణమవుతాయని భావించే వాటిపైనా ఫిర్యాదు చేసే వీలు కల్పిస్తున్నారు. ప్రమాదకరమైన మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనే హెచ్చరికలు, వాటిని ఫార్వర్డ్ చేస్తే ఎదురయ్యే తీవ్ర సమస్యలను గురించి సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా యూజర్లుండగా, 20 కోట్లకు పైగా యూజర్లతో భారత్ ముందువరసలో నిలుస్తోంది. వాట్సాప్ మాధ్యమం ద్వారా నకిలీవార్తల వ్యాప్తి అంశంపై ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించే చర్యలను ఆ సంస్థ ప్రారంభించింది. భారత్‌లో ఏదైనా మెసేజ్‌ను లేదా వీడియోను ఒకసారి ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేసేలా నియంత్రించడంతో పాటు ఒరిజనల్, ఫార్వర్డ్ చేసే మెసేజ్‌ల తేడా తెలిసే ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఓ మెసేజ్‌ను ఇరవై మందికి ఫార్వర్డ్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది. ఏదైనా మెసేజ్‌ను ఒకే అకౌంట్ నుంచి ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేస్తే మళ్లీ ఫార్వర్డ్ చేసే ఆప్షన్‌ను పనిచేయకుండా చేయనుంది. ఎన్నికల నేపథ్యంలో నకిలీవార్తలపై.. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, నకిలీ వార్తల వ్యాప్తి దేశంలో మూకదాడులు, హింసాత్మక ఘటనలకు దారితీసిన నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే చర్యలనూ వాట్సాప్ ప్రారంభిస్తోంది. ఈ ఏడాది చివర్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నకిలీవార్తల బెడదను అరికట్టడంపై దష్టిని సారించింది. ఢిల్లీకి చెందిన డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్)తో కలిసి వాట్సాప్ యూజర్లలో నకిలీవార్తలపై అవగాహన కల్పించే చర్యలు చేపడుతోంది. ఏదైనా సమాచారాన్ని లేదా వీడియోలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ముందే దాని విశ్వసనీయతను సరిచేసుకునే ఆవశ్యకతను తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం పది రాష్ట్రాల్లో (త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా) డీఈఎఫ్ 40 శిక్షణా తరగతులు నిర్వహించనుంది.ఏదైనా మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడానికి ముందు సులువైన పద్ధతుల్లో ఆ సమాచారాన్ని ఎలా సరిచూసుకోవచ్చునో స్థానికనాయకులు, ప్రభుత్వ ఆధికారులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు తెలియజేస్తారు. ఇందులో భాగంగానే ఏడు రాష్ట్రాల్లో డీఈఎఫ్‌కు సంబంధించిన 30 వేల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలకు కూడా శిక్షణనిస్తారు. ‘గ్రామీణ, ఇతర పేదవర్గాల ప్రజలు కూడా ‘ఆన్లైన్’ ఉపయోగించుకునేలా చేయాలన్నది మా సంస్థ ధ్యే యం. వారికి ఆన్లైన్లో బెదిరింపులు, హెచ్చరికలు, నకిలీవార్తల నుంచి ఇంటర్నెట్ను సురక్షితంగా ఉపయోగించేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. తమకు వచ్చే ప్రతీ మెసేజ్‌పై వెంటనే ప్రతిస్పందించడానికి బదులు దానిపై ఏ విధంగా స్పందింవాలన్న దానిపై వాట్సాప్ యూజర్లలో సహానుభూతి, అవగాహన కలిగించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని వాట్సాప్, డీఈఎఫ్ భావిస్తున్నాయి’ అని డీఈఎఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ ఒసామా మంజర్ పేర్కొన్నారు.‘నకిలీవార్తల పట్ల మెరుగైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజలు సురక్షితంగా ఉండేలా చేయాలన్నది మా లక్ష్యం. అంతేకాకుండా ఇలాంటి వార్తల వ్యాప్తి నియంత్రించే అధికారం యూజర్లకు కల్పిస్తున్నాం. డిజిటల్ ఇండియా స్వప్నాన్ని సాకారం చేసేందుకు వివిధ రూపాల్లో అవసరమైన మేర మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని వాట్సాప్ పబ్లిక్ పాలజీ మేనేజర్ బెన్ సపుల్ తెలిపారు. -
వింటారా.. అలనాటి మధుర స్వరాలు
బంజారాహిల్స్: మ్యాజిక్ 106.4 ఎఫ్ఎం హైదరాబాద్‌లో మొట్టమొదటి రెట్రో ఎఫ్ఎం చానెల్‌గా శ్రోతలను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. వింటూ మైమరిచిపోదామంటూ హైదరాబాద్ శ్రోతల జీవితంలోని మధుర స్మృతులను తిరిగి తీసుకురావడానికి మైమరిపించే పాటలను అలనాటి మేటి గీతాలను అందించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజ్‌కోటిలాంటి మరెందరో అలనాటి మేటి సంగీత దర్శకుల పాటలను వినిపించనుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో శుక్రవారం మ్యాజిక్ 106.4 ఎఫ్ఎం ప్రముఖ దర్శకుడు, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె.విశ్వనాథ్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఆయన శ్రోతలతో మాట్లాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, నిర్మాత అశ్వినీదత్, హీరో రాజశేఖర్, జీవిత విచ్చేసి శ్రోతలతో మాట్లాడి అలరించారు. రోజంతా ఆర్జేలు, సెలబ్రిటీలు వేడుక జరుపుకున్నారు. టాలీవుడ్ గాయకుడు శ్రీకృష్ణ, జ్యోతి, మహతితో పాటు మురళి, సాగర్లు ఆర్‌జెలుగా వ్యవహరించారు. -
66 ఎఫ్ఎం చానళ్లు @రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎం రేడియో చానళ్ల ఫేజ్–3 రెండో రౌండ్ వేలంలో మొత్తం 66 చానళ్లు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయి. 48 పట్టణాలు, నగరాల్లో ఈ కొత్త ఎఫ్ఎం చానళ్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలం వివరాల్ని సోమవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎఫ్ఎం చానల్ ఏర్పాటుకు అత్యధికంగా రూ. 23.4 కోట్లకు సన్ గ్రూపునకు చెందిన కల్ రేడియో బిడ్ చేసింది. డెహ్రాడూన్‌లో ఎఫ్ఎం కోసం రూ. 15.61 కోట్లతో సౌత్ ఆసియా ఎఫ్ఎం బిడ్ వేసింది. ఇది కూడా కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్‌దే కావడం విశేషం. అయితే లేహ్, భాదేర్వా, పూంచ్, కతువా, కార్గిల్‌లో ఎఫ్ఎంల ఏర్పాటు కోసం కేవలం రూ. 5 లక్షలకే బిడ్లు దాఖలయ్యాయి. ఫేజ్–3 రెండో దశలో 92 నగరాల్లో 266 ఎఫ్ఎం చానళ్ల ఏర్పాటు కేంద్రం లక్ష్యం. అయితే 200 చానళ్ల ఏర్పాటుకు ఎలాంటి స్పందన రాలేదు. -
ఎఫ్ఎం రేడియోలకు గుడ్‌బై
ఆస్లో: కారులో ఎక్కడికెళ్లినా ఎఫ్ఎం రేడియో మోగాల్సిందే. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఇదే పరిస్థితి. దీన్ని మొట్టమొదటి సారిగా నార్వే బ్రేక్ చేయనుంది. ఎఫ్ఎం రేడియోకు తిలోదకాలిచ్చి డిజిటల్ రేడియో (డీఏబీ)కు తలుపులు తెరవనుంది. వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2017 చివరి నాటికి పూర్తవుతుందని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. ఎల్తైన పర్వత శిఖరాలు, వాటి మధ్య లోతైన లోయల్లో నదులు, సముద్ర మార్గాలు, అక్కడక్కడ చెల్లా చెదురుగా విసిరేసి నట్లుండే జనావాసాలున్న నార్వేలో ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహించడమన్నదే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఎఫ్ఎం రేడియో రద్దు దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం దశాబ్దకాలం నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయోగం ఈ దేశంలో విజయవంతమైతే అనుసరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను మూసేసి డిజిటల్ రేడియోలను తెరవడం ద్వారా ఏడాదికి 23 లక్షల డాలర్లు మిగులుతాయన్నది నార్వే ప్రభుత్వం అంచనా. డిజిటల్ రేడియో వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆడియో క్లారిటీ పెరగుతుందని, దూరప్రాంతాలకు కూడా సిగ్నల్స్ సులభంగా వెళతాయని, ఎక్కువ ఛానళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. సిబ్బంది ఉద్యోగాలు పోతాయని, వినియోగదారులకు భారం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలు ఏమీ పోవని, ఆ మేరకు డిజిటల్ రేడియో స్టేషన్లను పెంచుతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే డిజిటల్ రేడియోలను కొనుగోలు చేయడానికి ఒక్కసారి మాత్రమే ప్రజలపై భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో నడుస్తున్న 20 లక్షల కార్లలో ఎఫ్ఎం రేడియోలు మూగబోతాయని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 52 లక్షల జనాభా కలిగిన నార్వేలో 70 శాతం ఇళ్లలో ఇప్పటికే డిజిటల్ రేడియోలు ఉన్నాయి. -
తీయని గొంతుకతో... శ్రోతల గుండెల్లో
*రేడియో జాకీలుగా మారడానికి ఆసక్తి చూపుతున్న యువత *ఈ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు * చలాకీగా..గలగలా మాట్లాడే వారి కోసం ఎదురు చూస్తున్న ఎఫ్ఎం రేడియోలు ‘గుడ్ మార్నింగ్ నమ్మ బెంగళూరు’ అంటూ నిద్రలేపుతారు. ‘ఇది చాలా హాట్‌గురూ’ అంటూనే స్వీట్ స్వీట్ మెలోడీ సాంగ్స్‌ని వినిపిస్తారు. ‘లవ్‌గురు’గా మారిపోయి ఎన్నో ప్రేమ చిట్కాలను అందిస్తారు. ఇలా ఇంట్లో ఉన్నా, రోడ్డుపై ప్రయాణిస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా... ఎక్కడైనా సరే ధారాళంగా సాగిపోయే మాటల ప్రవాహం, వాటి వెనువెంటే వీనుల విందైన సంగీతం, కొన్ని చిట్కాలు, ప్రశ్నలకు చిలిపి సమాధానాలు, మరి కాసిన్ని సలహాలు... వీటన్నింటితో ప్రస్తుతం మెట్రో ప్రజలందరికీ దగ్గరైనవే ఎఫ్ఎం రేడియోలు. ఈ రేడియోల్లో రేడియో జాకీ(ఆర్జే)లుగా పనిచేస్తున్న వారు తమ గొంతుకతోనే ప్రజల గుండెలకు చేరువవుతున్నారు. గలగల మాటలతో రేడియో శ్రోతలందరి జీవితాల్లో భాగంగా మారిపోతున్నారు. రేడియో జాకీలుగా మారాలని ఆరాటపడే యువతీ యువకుల సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఎంసీఏలు, ఎంబీఏలు పూర్తిచేసిన వారు కూడా రేడియో జాకీలుగా మారడానికి ఉత్సాహం చూపుతున్నారు. లాంగ్ కెరీర్ అంటూ ఉండని ఈ రంగంలోకి రావడానికి యువత ఎందుకు ఉత్సాహం చూపుతోంది? నటులుగానో వీడియో జాకీలుగానో మారితే వారికంటూ ఓ ఫేమ్ ఉంటుంది, జనాల్లో గుర్తింపు ఉంటుంది. మరి కేవలం గొంతులు మాత్రమే పరిచయమయ్యే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం.... - సాక్షి, బెంగళూరు వేలాది మంది అభిమానులను పొందే అవకాశం.... ‘రేడియో జాకీ ఉద్యోగాల్లో ఏళ్లకేళ్లు కొనసాగే వీలుండదు. అందుకే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఈ రంగంలో లాంగ్ కెరీర్ ఉండదు. అయినా కూడా కేవలం గొంతు ద్వారా వేలాది అభిమానులను సంపాదించుకోగల అవకాశం కేవలం రేడియో జాకీలకే ఉంటుంది. రేడియో ఛానల్స్ వినే అభిమానులంతా ప్రతి రోజు మాకు ఫోన్ చేసి వారి ఇంట్లో వారి లాగానే మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రేడియో జాకీలుగా పనిచేసే వారికి మాత్రమే సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్నవారితోను, అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారితోనూ మాట్లాడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. నేను షో చేస్తున్నపుడు ఓ సారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెటర్ అనిల్‌కుంబ్లే ఫోన్ చేసి నా షో అంటే తనకెంతో ఇష్టమని, నా గొంతు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. వేరే ఏ రంగంలో ఉన్నా అటువంటి ప్రముఖుడి నుంచి అభినందనలు పొందే అవకాశం ఉండేది కాదేమో.’ - నేత్ర, రేడియో జాకీ సాఫ్ట్వేర్ నుంచి ఆర్జేలుగా నిన్న మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం, పైలట్‌గా మారడం, వైద్యృవత్తిలో చేరడం, ఇవన్నీ యువతకున్న లక్ష్యాలు. అయితే ఇప్పుడు వీరి అభిరుచి మారుతోంది. నగరంలో ప్రస్తుతం రేడియో జాకీలుగా మారాలనుకుంటున్న యువత సంఖ్య ఎక్కువవుతోంది. ఎంబీఏ, ఎంసీఏలు చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా తమ తమ ఉద్యోగాలను వదిలేసి రేడియో జాకీలుగా మారిపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రేడియో జాకీలుగా చేరే వారికి ఎఫ్ఎం రేడియో సంస్థలు ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని అందిస్తున్నాయి. అంతేకాక సాఫ్ట్వేర్ సంస్థల్లాగానే రేడియో జాకీలకు అదనపు సౌకర్యాలు అందించడంలో కూడా ఎఫ్ఎం రేడియో సంస్థలు ముందుంటున్నాయి. మాటల ప్రవాహమే ముఖ్యం.... రేడియో జాకీలుగా మారడానికి కావలసిన ముఖ్య అర్హత ఏంటంటే...ఏ అంశంలోనైనా సరే మాటల ప్రవాహాన్ని కొనసాగించటమే. గలగల మాట్లాడుతూ తమ గొంతుకతో శ్రోతను ఆకట్టుకోగలిగే వారికి ఎఫ్ఎం రేడియోలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి. రాజకీయాలు, సినిమాలు, సమాజంలోని దురాచారాలు, వాతావరణ కాలుష్యం ఇలా అన్ని అంశాలపై కాస్తంత పరిజ్ఞానం, వృతభాషతో పాటు మరో రెండు భాషల్లో ప్రా వీణ్యం ఉంటే ఇక ఆ రేడియో జాకీ పంట పండినట్లే. ప్రస్తుతం ఇటువంటి వారికి ఆర్జే రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆర్జే సౌజన్య తెలిపారు. రానున్న ఏడాది కాలం లో కేవలం కర్ణాటకలోనే దాదాపు 20 రేడియో చానల్స్ వచ్చే అవకాశముందని రేడియో సిటీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఆర్ జేలుగా సెలబ్రిటీలు... తమకు కావలసిన పబ్లిసిటీని పొందడానికి సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రేడియో చానల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం కొందరు, విడుదలైన సిని మాపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొందరు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి మరికొందరు ఇలా సెలబ్రిటీలంతా ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వైపు అడుగులు వేస్తున్నారు. తద్వారా తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ వారిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అభిమాన తారలనందరినీ నేరుగా క లవడమే కాక ఏకంగా వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం వస్తుండటం కూడా చాలా మంది యువత రేడియో జాకీలుగా మారడానికి కారణమవుతోంది. -
ఎఫ్ఎంలో ఆప్ ముమ్మర ప్రచారం
న్యూఢిల్లీ: సాధారణ ప్రజల సమస్యలకు చేరువైయ్యేందుకు ఆమ్ఆద్మీ పార్టీ ఎఫ్ఎం రేడియో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సాధారణ ప్రజల దృష్టిని ఆకట్టుకొని ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ఎఫ్ఎం ఎన్నికల సరళిలో మరికొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. వారి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరిస్తూ ఎఫ్ఎం రేడియోల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హల్చల్ చేస్తున్నారు. ‘నమస్కార్ మై హూ అరవింద్ కేజ్రీవాల్’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. అయితే ఈ విషయమై ప్రజలు ఇప్పటికే విసిగెత్తినట్లు గమనించిన ఆప్ నేతలు సరికొత్త ప్రచారానికి నడుం బిగించారు. ప్రచార వ్యూహాన్ని మార్పుకొన్నారు. సగటు మనిషి గొంతును వినిపించేందుకు ఆప్ వాలంటీర్ల బృందాన్ని రంగంలోకి దింపింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలోని ఐదు ప్రధాన ఎఫ్ఎం స్టేషన్ల ద్వారా ఎడతెరపి లేకుండా ప్రచారం చేయాలని ఆప్ నిర్ణయించింది. ‘ఢిల్లీ డైలాగ్’పై విస్తృత ప్రచారం పార్టీ ‘ఢిల్లీ డైలాగ్’ను ప్రధాన అంశంగా ప్రచారం చేయనుంది. కొన్ని నిమిషాలపాటు కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రచారాన్ని కూడా చేపడతున్నారు. రాజధాని నగరంలో ప్రజలు రోజువారి ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలను చూపిస్తూ ప్రచారం చేయనున్నారు. ‘యూత్ డైలాగ్ నమునా’లో అన్ని వర్గాల పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నారు. రేడియో ప్రచారంలో కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నగరంలో 20 కొత్త కాలేజీలను నిర్మిస్తామని ఆప్ ప్రచారం చేస్తోంది. మహిళ సమస్యలను కేజ్రీవాల్ అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తారనే విషయాలను తెలియజేస్తున్నారు. ప్రజలకు ‘విద్యుత్, నీళ్లు’ అనే ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. 4 గంటల పాటు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ పార్టీ అధినేత కే జ్రీవాల్ గత వారం ఎఫ్ఎం రేడియో చానల్ ఆహ్వానించింది. నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆప్ ప్రచారం ఎఫ్ఎం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎఫ్ఎం రేడియో కీలక పాత్ర పోషించింది. ఎఫ్ఎం రేడియోను పార్టీ రెండు కారణాల దృష్ట్యా ప్రచారానికి ఎంచుకొంది. మొద టిది ప్రింట్,టీవీ మీడియాల కన్నా ప్రసార ఖర్చులు తక్కువగా ఉండడం, రెండోది సాధారణ ప్రజలకు ఎఫ్ఎం రేడియో అందుబాటులో ఉంటుంది. -
ఎఫ్ఎం రేడియో ప్రారంభం నాలుగు రోజులుగా ట్రయల్స్
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త. దాదాపు మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ ఊరించిన ఎఫ్ఎం రేడియో ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం నుంచి ట్రయల్స్ కూడా సాగుతున్నాయి. అధికారుల ప్రయత్నాలు విజయవంతం అయినట్లే కనిపించడంతో వారు ఉత్సాహంగా మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ సదుపాయం కల్పించేందుకు ఆకాశవాణి కడప కేంద్రం ప్రధాన కార్యాలయంలోగల టవర్‌కు ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్నాళ్లపాటు ట్రయల్స్ చూడాలని నిర్ణయించి శనివారం కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టారు. కడప నగరంతోపాటు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో కూడా ఈ మూడు రోజులు కార్యక్రమాలు విజయవంతంగా ప్రసారమయ్యాయి. ట్రాన్స్మిషన్ టవర్ పనితీరు, దూరం, నాణ్యత, కార్యక్రమాలు వినిపిస్తున్న ప్రాంతాల గురించి ట్రయల్స్‌లో అధ్యయనం సాగుతోంది. ఆకాశవాణి కడపకేంద్రంలో ప్రసారమవుతున్న కార్యక్రమాలనే ప్రస్తుతం ఎఫ్ఎంలో కూడా ప్రసారం చేస్తున్నారు. ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధికారులు పూర్తి స్థాయిలో ధ్రువీకరించుకున్నాక ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం కడప నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో స్పష్టంగా ప్రసారమవుతున్నాయి. ఇక రేడియోగా సెల్‌ఫోన్! ఎఫ్ఎం సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్‌ను రేడియోగా వాడుకోవచ్చు. 900 కిలో హెడ్స్‌పై కడప ఆకాశవాణి ప్రసారాలు వస్తుండగా, ఎఫ్ఎం నుంచి రేడియోలోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ 103.6 మెగా హెడ్స్‌పై ప్రసారమవుతున్నాయి. కొన్ని సెల్ఫోన్లలో నేరుగా కార్యక్రమాలు వినే సౌకర్యం ఉంది. మరికొన్నింటిలో హెడ్ ఫోన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో... ప్రయోగాత్మక ప్రసారాలు కనీసం మూడు నుంచి ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఈలోపు ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన సిబ్బంది, కార్యక్రమాల రూపకల్పన, నెట్వర్క్ తదితరాలను ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు రేడియో వ్యాఖ్యాతల్లాగా ఎఫ్ఎం కార్యక్రమాల్లో జాకీలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రసారాలివి! ప్రస్తుతం ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారాతెలుగులో ఉదయం 6.45, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 6.15 గంటలకు ప్రాంతీయ వార్తలు, ఉదయం 7.10, మధ్యాహ్నం 12.40, రాత్రి 7.05 గంటలకు తెలుగులో జాతీయ వార్తలను వినవచ్చు. ఆంగ్లంలో ఉదయం 8.15, మధ్యాహ్నం 2.00, రాత్రి 9.00 గంటలకు, హిందీలో ఉదయం 8.00, రాత్రి 8.45 గంటలకు, ఉర్దూలో సాయంత్రం 5.50 గంటలకు వార్తలను వినవచ్చు. ఇవిగాక ఉదయం 7.15 గంటల నుంచి 7.55 గంటల వరకు కాంతిరేఖలు కింద ఆరోగ్యం, సాహిత్యం తదితర అంశాలపై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఉదయం 8.30 నుంచి 9.00 గంటల వరకు సినిమా పాటలు, 10 నుంచి 11గంటల వరకు శ్రోతలు కోరిన ి పాటలను వినిపిస్తారు. సాయంత్రం 5 గంటలకు యువవాణిలో యువతకు అవసరమైన సమాచారం, వినోద కార్యక్రమాలు ప్రసారవుతాయి. -
వచ్చే నెలలో ఎఫ్ఎం రేడియో మూడో దశ వేలం !
న్యూఢిల్లీ: ఎఫ్ఎం రేడియో మూడో దశ వేలం వచ్చే నెలలో జరిగే అవకాశాలున్నాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారి చెప్పారు. ఎఫ్ఎం రేడియో వేలానికి 2011లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, వాటిని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు నివేదించామని వివరించారు. ఇక్కడి సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. వేలం పారదర్శకంగా జరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.