తొలి రేడియో స్టేషన్‌ ఎక్కడో తెలుసా? | World Radio Day: Look At The Full Story Here | Sakshi
Sakshi News home page

ఆనాటి ఆటవిడుపు

Published Sun, Feb 9 2020 10:33 AM | Last Updated on Sun, Feb 9 2020 10:33 AM

World Radio Day: Look At The Full Story Here - Sakshi

  • కవర్‌ స్టోరీ

సమస్త సమాచారం, అభిరుచికి తగిన వినోదం ఇప్పుడు అరచేతిలోకే అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయింది. దాదాపు శతాబ్దం కిందట సమాచారం కోసం వార్తా పత్రికలే ఆధారం. రంగస్థల కళలు, జానపద కళారూపాలే వినోద సాధనాలు. అక్షరాస్యత తక్కువగా ఉన్న నాటి కాలంలో వార్తా పత్రికలతో జన సామాన్యానికి పెద్దగా నిమిత్తం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో రేడియో రాకడతో తొలితరం సమాచార విప్లవం మొదలైందనే చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో సంపన్నుల ఇళ్లలో హోదాకు చిహ్నంగా ఉండే రేడియో సెట్‌లు అనతి కాలంలోనే పంచాయతీ కార్యాలయాల వరకు, ఆ తర్వాతి కొద్ది కాలానికే సామాన్యుల ఇళ్లకు విస్తరించాయి. రెండు మూడు తరాల వారికి రేడియో ఆనాటి ఆటవిడుపు.

మన దేశంలో టీవీ ఎనభయ్యో దశకంలో అందుబాటులోకి వచ్చింది. టీవీ సెట్‌లు మధ్య తరగతి నట్టిళ్లకు చేరక ముందు సమాచార, వినోద రంగాల్లో రేడియో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగిం చింది. స్మార్ట్‌ఫోన్‌ల యుగం మొదలైనా, రేడియో ఇంకా శ్రోతలను అలరిస్తూనే ఉంది. సెల్‌ఫోన్‌ల లోనూ ఎఫ్‌ఎం స్టేషన్ల ప్రసారాలు రేడియో అభిమానులను ఇంకా ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ వంటివి రేడియో ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న రేడియో, కొత్త కొత్త సాధనాల ద్వారా శ్రోతలకు చేరువవుతూనే ఉంది. సాంకేతిక రంగంలో శరవేగంగా సంభవిస్తూ వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.

స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో ఆరు ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 215 ఆకాశవాణి కేంద్రాల నుంచి 337 ప్రసార కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 144 మీడియం వేవ్‌ కేంద్రాలు, 54 షార్ట్‌ వేవ్‌ కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు ఉన్నాయి.  

రేడియో పుట్టుక ఇలా...
విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను తొలుత జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్‌ హెర్ట్జ్‌1886లో గుర్తించాడు. దాదాపు దశాబ్దం తర్వాత 1895–96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్‌ శాస్త్రవేత్త మార్కోనీ.  
రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్‌ హెర్ట్జ్‌ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్‌లతో కొలవడం మొదలైంది. మార్కోనీ వివిధ దశల్లో కొనసాగించిన ప్రయోగాలు విజయవంతమవుతూ వచ్చాయి. ఇవి అనతికాలంలోనే తొలి రేడియో ప్రసార కేంద్రం ఆవిర్భావానికి దారి తీశాయి. పిట్స్‌బర్గ్‌లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబరు 2న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్‌ ఎన్నికయ్యారనే వార్తతో పిట్స్‌బర్గ్‌ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనపరచిన తొలి యూరోపియన్‌ దేశం ఇంగ్లాండ్‌ అయినా, అక్కడి ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. వైర్‌లెస్‌ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలసి 1922లో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) స్థాపించాయి. బీబీసీ 1922 నవంబరు 14 నుంచి లండన్‌ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది.
రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్స్‌ యూనియన్‌ (ఐటీయూ) నియంత్రిస్తుంది. సమాచార సాంకేతికత పురోగతిలో రేడియో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. ఇది కేవలం రేడియో ప్రసారాలకు మాత్రమే పరిమితం కాదు. టీవీ ప్రసారాలకు, సెల్‌ఫోన్‌లు, రాడార్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, రిమోట్‌ కంట్రోల్, రిమోట్‌ సెన్సింగ్, వైర్‌లెస్‌ నెట్‌వర్కింగ్, ఉపగ్రహ ప్రసారాలు వంటి వాటన్నింటికీ రేడియో సాంకేతికతే మూలాధారం. రేడియో సాంకేతికత ఫలితంగానే నేడు ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయే స్థాయికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధ్యమైంది.

రేడియో నిర్మాణంలో మార్పులు

తొలినాటి రేడియో సెట్‌లలో ఇప్పటి మాదిరిగా లౌడ్‌ స్పీకర్లు ఉండేవి కావు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్‌ నెట్‌ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. తొలినాళ్లలో రేడియో ప్రసారాలు లాంగ్‌ వేవ్, మీడియం వేవ్‌లలో జరిగేవి. వేవ్‌ లెంగ్త్‌ ఎక్కువయ్యే కొద్దీ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా కాకుండా, కలగలసి వినిపించే పరిస్థితి తరచుగా తలెత్తేది. షార్ట్‌ వేవ్‌ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఈ ఇబ్బంది కొంత దూరమైంది. రేడియో ప్రసారాల్లో ప్రసారమయ్యే శబ్దాలకు అనుగుణంగా తరంగాల వెడల్పును మార్చే ‘ఆంప్లిట్యూడ్‌ మాడ్యులేషన్‌’ (ఏఎం) ఉపయోగిస్తారు. అల్ట్రాషార్ట్‌ వేవ్స్‌తో ప్రసారాలు సాగించే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌ (ఎఫ్‌ఎం) రేడియో ప్రసారాలు మొదలైన తర్వాత రేడియో ప్రసారాల్లో ఇదివరకు ఎదురయ్యే ఇబ్బందులు దూరమయ్యాయి.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే శాటిలైట్‌ రేడియోలు, ఇంటర్నెట్‌ రేడియోలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని బెల్‌ టెలిఫోన్‌ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చిలైట్‌లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్లు కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో పాటు, పరిమాణంలోనూ ఇవి చిన్నగా ఉండటంతో ట్రాన్సిస్టర్లు అనతికాలంలోనే సామాన్యుల ఇళ్లకూ చేరుకున్నాయి. ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని రేడియో ప్రసారాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు రూపొందుతూ, జనాలను అలరించసాగాయి. 

బాంబేలో మన తొలి రేడియో స్టేషన్‌
బ్రిటిష్‌ హయాంలో తొలి రేడియో స్టేషన్‌ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‌ను అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ 1927 జూలై 23న ప్రారంభించారు. అంతకు ముందు రేడియో క్లబ్‌ ఆఫ్‌ బాంబే 1923లో దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ 1936లో ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో ఏర్పడిన రెండేళ్లకు–1938 జూన్‌ 16న మద్రాసులో రేడియో స్టేషన్‌ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకట రెడ్డినాయుడు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ప్రారంభోపన్యాసాలు చేశారు. అంతకు ఐదేళ్ల ముందే హైదరాబాద్‌లో మహబూబ్‌ అలీ అనే తపాలా ఉద్యోగి రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు.

అప్పట్లో హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న నిజాం రాజు 1935లో ఆ రేడియో స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి. దీనికే 1939లో దక్కన్‌ రేడియోగా పేరు మార్చారు. దక్కన్‌ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్‌ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు. ఆయన పట్టుదల ఫలితంగా 1948 డిసెంబరు 1 నాటికి దక్కన్‌ రేడియోలో తెలుగు ప్రసారాలకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో భారత ప్రభుత్వం డెక్కన్‌ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో (ఆకాశవాణి) పరిధిలోకి తెచ్చింది. అంతకు ముందే 1948 డిసెంబరు 1న విజయవాడలో రేడియో స్టేషన్‌ ప్రారంభమైంది. విశాఖపట్నం, కడపలలో 1963లో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

తర్వాతి కాలంలో కర్నూలు, తిరుపతి, అనంతపురం, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌లలో కూడా ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేడియోస్టేషన్లన్నింటినీ 2006 సంవత్సరం వరకు భారత ప్రభుత్వమే నడిపేది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్‌ఎం ప్రసారాలను కూడా అందిస్తున్నాయి. ఇవికాకుండా, పలు ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో కేంద్రాలు కూడా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఆకాశవాణి తొలినాళ్లలో విజయవాడ, హైదరాబాద్‌ కేంద్రాల నుంచి వినోద విజ్ఞానాలను మేళవించిన జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అనతికాలంలోనే ఈ కార్యక్రమాలు ఆనాటి జనజీవితంలో భాగమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాశవాణి కేంద్రాలే కాకుండా, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం తెలుగులో వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. బెంగళూరు, పోర్ట్‌ బ్లెయిర్‌ కేంద్రాలు కూడా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి.

తెలుగులో తొలి ప్రసారాలు
తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్‌ 16న సాయంత్రం5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే.

రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్‌ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్‌ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్‌ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు.

ఆకాశవాణి కార్యక్రమాలు
ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్‌ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్‌ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది. అంజయ్య మంత్రివర్గం రాజీనామా, విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణం, ఎన్టీఆర్‌ మరణవార్త మొదటిగా వెల్లడి చేసిన ఘనత ఆకాశవాణి వార్తలకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, అద్దంకి మన్నార్, పీఎస్సార్‌ ఆంజనేయ శాస్త్రి, డి.వెంకట్రామయ్య, ప్రయాగ రామకృష్ణ, మామిళ్లపలి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, జ్యోత్స్నాదేవి తదితరులు ఎందరో రేడియోలో వార్తలు చదవడం ద్వారా ప్రసిద్ధులయ్యారు.

లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. తొలినాళ్లలో ‘గీతావళి’ పేరుతో భావగీతాలు ప్రసారమయ్యేవి. ‘లలిత సంగీతం’ అనే పేరు మాత్రం ఆకాశవాణి ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఎమ్మెస్‌ రామారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తరంజన్, మల్లిక్, సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం,  వేదవతీ ప్రభాకర్‌ వంటి సుప్రసిద్ధ స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి ప్రముఖ కవులు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు, గ్రామీణులకు, కార్మికులకు, యువతరానికి, కవులు, రచయితలకు ఆకాశవాణి అనేక కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు వ్యాఖ్యాతలు శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 

ఎందరో మహానుభావులు...
సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. శ్రీశ్రీ, జాషువా వంటి కవులు కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, ఆచంట జానకిరాం, తెన్నేటి హేమలత, దాశరథి,  మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలంత్రపు రజనీకాంతరావు, బందా కనకలింగేశ్వరరావు వంటి సాహితీ సంగీత నాటకరంగ ప్రముఖులు ఆకాశవాణిలో పనిచేసిన వారే. గ్రామీణ కార్యక్రమాల వ్యాఖ్యాతగా ప్రయాగ నరసింహశాస్త్రి గ్రామీణ శ్రోతలకు చేరువైతే, ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ద్వారా ఉషశ్రీ రేడియో శ్రోతల్లో ఆబాలగోపాలాన్నీ అలరించారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి బాలల కార్యక్రమాల ద్వారా కొన్ని తరాల పిల్లలను ప్రభావితం చేశారు. ఆకాశవాణికి సేవలందించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. ఆకాశవాణిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఎందరో మహానుభావులు ఎనలేని కృషి చేశారు. వారందరికీ వందనాలు.
– పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement