Special story on funday
-
సీతాకోకచిలుక: పది రోజులు గడిచిపోయాయి! కాబోయే వియ్యంకులు..
అది నీలం రంగు సీతాకోకచిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలోని కొన్ని పశువృక్షకీటకపక్ష్యాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే! కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలి వర్ణద్రవ్యం (పిగ్మెంట్) సహజంగా ఉత్పత్తి అవదు. ఆయా ప్రాణుల ఈకలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండటం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి.మరి అంతటి అరుదైన రంగున్న ఆ సీతాకోకచిలుక అక్కడికెలా వచ్చిందోగానీ, సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతోంది. తన రెండవ కూతురు దుర్గ ఆ సీతాకోకచిలుక కావాలని ఆశగా అడిగిందని ఇంటి వెనుక పెరట్లో అటూ ఇటూ దాని వెనుకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనుక గుమ్మం దగ్గర నిలబడిన దుర్గ ఆత్రుతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తోంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటోడ్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోకచిలుకని పట్టుకుని తన చిన్న కూతురు చేతికిచ్చాడు.‘అది అడుగుడు సరే.. నువ్వు దానెనక వయసు యాదిమర్శి ఉరుకుడు సరే! సరిపోయిన్రు ఇద్దరూ’ అని తండ్రిని వారించింది లక్ష్మి. ‘పోనీతీ బిడ్డా, చిన్నపిల్ల.. ఆడుకోనీ’ అని అరుగు మీద కూర్చుని నిట్టూర్చాడు సుబ్బయ్య.‘గంతే తీ, అది ఇంజనీరింగ్ సదువుతున్న గూడ నీకు చిన్నపిల్ల లెక్కనే కనవడ్తది.’ ‘ఒసేయ్! ఏందే నీ లొల్లి. నాయిన నాకు సీతాకోకచిలుక పట్టిస్తే నీకేందే నొప్పి?’ ఎగతాళిగా వెక్కిరించింది దుర్గ.‘ఏందే.. ఎక్కువ మాట్లాడుతుండవ్?’ ‘పెండ్లి అయినాక నీ మొగుడు అమెరికాలో సీతాకోకచిలుకలు పట్టిస్తడులే.. ఏడ్వకు.’ సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మికి కోపమొచ్చింది. దుర్గ చేతి మీద ఫట్టుమని ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోకచిలుకను దుర్గ వదిలేసింది. అది కాస్తా సందు చూసుకుని తుర్రుమంది. దుర్గ కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది.దుర్గ ఏడుపు మొహం పెట్టి, ‘నాయినో! అది ఎగిరిపోయిందే’ అని అరిచింది. ‘దాన్ని పట్టుడు ఇంగ నాతోని కాదు బిడ్డా.. ఇడిశెయ్. మళ్ళా కనిపిస్తే పట్టిస్తా’ అని తన జేబులో సిగరెట్ బయటకి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరికొచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వుమని అరిచి తల్లిని పట్టుకుంది. ‘ఏం పుట్టిందే నీకు? దాన్ని అట్లా గిల్లుతవెందే?’ కసిరింది సుజాత.‘నా సీతాకోకచిలుకని ఎల్లగొట్టిందే అది’ అని స్టౌ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంది. ‘దానికంటే బుద్ధిలేకపాయె తింగరిది. నీకేమొచ్చిందే లక్ష్మీ?’‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం గా సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’ బయట పెరట్లో అరుగు మీదే కూర్చుని సిగరెట్ తాగుతూ వంట గదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య.‘పైసలున్నోళ్ళకే చెల్లుతయె గీ స్వేచ్ఛలు. అయినా గంత మాటంటివేందే.. నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినమే ఈ ఇంట్ల?’ చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత. ‘నాకీ పెండ్లొద్దే హైదరాబాద్ పోయి మాస్టర్స్ సదువుతానంటే నా మాట యింటున్నరా?’‘మన పరిస్థితి తెలిశిగూడ నువ్వు గట్ల మాట్లాడ్తవేందే? అయినా మేం చూసినదేమన్న మామూలు సంబంధమానే? అమెరికా పొరడ్ని చూసినం. ఇంకేం కావాల్నే నీకు?’ ‘నాకేం అమెరికా పోవాలని ఆశల్లేవ్ తీ. నాకీడనే ఉండాలనుంది.’‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారిన్ మ్యాచ్ అంటే ముక్కు, మొహం సూడకుండ పెండ్లి చేసుకుని మొగుడెంట పోతున్నరు. నువ్వేందక్కా గిట్లున్నవ్? ఇదే చా¯Œ ్స నాకొచ్చింటేనా అస్సలు ఆలోచించక పోతుండే.’‘అయితే నువ్వే చేస్కో పో!’ మొహం తిప్పుకుంది లక్ష్మి. ‘హా! బరాబర్ చేస్కుంటా. అమ్మా, నాకు ఓకేనే ఈ పెండ్లి. నాకు చేయుర్రి.’ ‘ఏయ్! నువ్వా సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంప్కరాపో.. నడువ్’ అని దుర్గను కసిరి బయటకి పంపించింది. అలిగి వంటగది తలుపుని ఆనుకుని నిలబడిన కూతురు దగ్గరికొచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకుని తల పైకి లేపి కూతురి కళ్ళలోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి. ‘నీ మనసు నాకు తెల్సు బిడ్డ. కానీ, నీకు పెండ్లి జేశి పంపుడు అమ్మ, అయ్యలుగ మా బాధ్యత.’‘ఎవడు కనిపెట్టిండే ఈ బాధ్యతలు? నేనడిగిన్నా ఇప్పుడు నాకు పెండ్లి చేయమని?’ ‘నువ్వే గదనే రెణ్ణెళ్ళ కిందట సంబంధాలు సూద్దుమా అంటే గొర్రెలెక్క తల ఊపితివి?’‘ఏమో అప్పుడు నాయన నోరు తెరిశి అడిగిండని తలూపిన. నాకేం దెల్సు మీరు అమెరికా సంబంధం సూస్తరని? ఇప్పుడు మీయందరిని ఇడిశిపెట్టి ముక్కు మొహం తెల్వనోనితోని గంత దూరం పోవాల్నా? నాకేమొద్దు.’‘ఆళ్లే ముచ్చటవడి నిన్ను సూడనికొస్తాన్నప్పుడు మనమొద్దంటే మంచిగుంటదా? మధ్యవర్తి ముంగట నాయినకి మర్యాద దక్కుతదానే?’బుస్సుమని అన్నం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టౌ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి, గరిటతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. సుజాత గరిట తిప్పుతూనే, ‘మీ నాయిన ఉన్న మూడెకరాలు సాగు చేసుకుంటనే ఇన్నేండ్లు మీకు నచ్చిన సదువులు సదివించిండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే వెడుతున్నడు. చానా కష్టపడి నీ పెండ్లి కోసం పదిలక్షలు కూడబెట్టిండు. ఇంకింతకన్నా కష్టవెట్టకే నాయనని. మా బుజ్జి కదా, నా మాటిను’ నచ్చజెప్పింది. తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చింది సుజాత.మరుసటిరోజు కాబోయే వియ్యాలవారి రాకతో సుబ్బయ్య ఇల్లు కళకళలాడింది. రాత్రి లక్ష్మి చేతికి దుర్గ పెట్టిన గోరింటాకు పొద్దుటికల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి, ఫొటోలో కన్నా అబ్బాయి చాలా బాగున్నాడని లక్ష్మి చెవిలో గుసగుసలాడింది దుర్గ. పెళ్ళిచూపుల్లో అమ్మాయి, అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని, అబ్బాయిని ఇంటి వెనుక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చున్న పెళ్ళి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు.కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకొచ్చి కూర్చుని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా బాగుంది. ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ, అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు గనుక యాభై లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పనయ్యింది. పెళ్ళి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని, త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకొమ్మని నచ్చజెప్పారు. కానీ, ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బులేదు. వచ్చే నెలలోపల పెళ్ళి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఈ సంబంధం చేయి దాటి పోతుంది.ఆ రోజు సాయంత్రం ఇంటి వెనుక పెరట్లో అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఒక పెట్టె సిగరెట్లు గుప్పుమని ఊదిపడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తనని దేశంకాని దేశానికి పంపించే పెళ్ళి తనకొద్దంటే వద్దని మొండికేసి నానా హంగామా చేసి, అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపును ఆనుకుని కూర్చుని మొబైల్ చూస్తోంది దుర్గ. వంట గదిలో అందరి కోసం టీ కాస్తోంది సుజాత. అంతా నిశ్శబ్దం.ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ పెరట్లోకొచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటబడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుర్లకి టీ ఇచ్చి, అటు నుండి పెరట్లోకి రెండు టీ గ్లాసులు పట్టుకుని వెళ్లింది. భార్య రాకను చూసి, సుబ్బయ్య సిగరెట్ కిందపడేసి కాలితో నలిపి ఒక టీ గ్లాసు అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరూ మౌనంగా టీ తాగసాగారు.కాసేపటికి సుజాత నోరు తెరిచి, ‘పొలం అమ్ముదమా?’ అన్నది నెమ్మదిగా. ఆ మాటకు సుబ్బయ్య కంగుతిని భార్య వంక చూస్తూ ‘ఏం పుట్టిందే నీకు? గంత మాటంటివి?’ కరిచినంత పని చేశాడు.‘మరేం చేస్తమయ్యా? గన్ని పైసలేడికెల్లి దెస్తం?’ ‘అయితే? ఇన్నేండ్లు అన్నంబెట్టిన పొలాన్ని అమ్ముకొమ్మంటవా?’ కోపంగా చూస్తూ అన్నాడు.‘మంచి సంబంధం.. కూతురు సుఖవడ్తది గదా అని..’ ‘ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే? ఇంకా చిన్నదాని సదువైపోలే.. దానికేం బెడతవ్? దిమాగ్ పనిచేస్తున్నదా నీకు?’‘వాయబ్బో! నువ్వు పెద్ద దిమాగ్ వెట్టి పనులు జేస్తున్నవ్ లే. ఈ ఏడు వరి పంట ఎయ్యిరా మొగుడా అంటే, పోయిపోయి ఆ టమాటా పంటేస్తివి. దానికేవేవో కొనుక్కొచ్చి పొలాన్ని ముస్తాబు జేస్తివి. ఎంత దిగువడొస్తదో చూస్త గదా..!’ ‘నోర్ముయసో! అన్నీ తెలుసుకునే పంటేశిన. పోయినేడు వరి పంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేశిన అప్పులకే పాయే..’‘ఓహో! గిప్పుడు టమాటాకు లచ్చలు రాల్తయ్ మరి’ వెటకారంగా అంది సుజాత. ‘యెహే! నా దిమాగ్ తినకు. నా కూతురికెట్ల పెండ్లి జేయాల్నో నాకు తెల్వదా?’ అని కసిరి, టీ గ్లాసు అరుగు మీద పెట్టి.. లేచెళ్ళిపోయాడు సుబ్బయ్య.పది రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు, మధ్యవర్తులు రెండు రోజులకోసారైనా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చేయాలో తోచడంలేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి. కానీ, అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయలేడు. చేయడు కూడా. ఉన్నది మూడెకరాలే అయినా పొలమంటే అతనికి పిచ్చి ప్రేమ. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకి మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఏమైనా చేస్తాడు.గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని, ఈ ఏడు ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి, అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించి వచ్చాడు. తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో టమాటాలు సరిగా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.భార్యకి చెప్పకుండా కూతురి పెళ్ళికోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి తన మూడెకరాలలో పంటకి ఎండ తగలకుండా నెట్, వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటాలు కోతలకు సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో పది రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్ళి చేద్దాం అనుకున్నాడు. ఆ ధైర్యం, నమ్మకంతోనే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడా పంట అమ్మినా వాళ్ళడిగిన కట్నం ఇచ్చుకోలేడు గనుక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు.మరుసటిరోజు పొలంలో పంట కోతలు జరుగుతుండగా మధ్యవర్తి నుండి ఫోనొచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్ళేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటునట్టు చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం. అలా రెండు మార్లు సిగరెట్ పొగని పీల్చి వదలగా ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ తన కంటపడింది. దాన్ని చూడగానే తన ఇద్దరు కూతుర్లు గుర్తొచ్చారు.సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. భుజం పైన ఉన్న తువాలు తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలుకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తుండగా చిన్నపిల్లాడిలా దాని వెనుక పరుగెత్తాడు. ఒక పదిహేను నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలా దాని వెనుకపడి చివరికి ఎలాగోలా పట్టుకోగలిగాడు. రొప్పుతూ ఒక గట్టు మీద కూలబడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోకచిలుకని తన మొహానికి దగ్గరిగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ళనుండి విడిపించుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ కొట్టుమిట్టాడుతోంది. దాని అవస్థ చూడగానే పెళ్ళిచూపుల ముందు రోజు తాను పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి.. తల్లితో అన్న మాట గుర్తుకొచ్చింది.‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం ఆ సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తరువాత సుబ్బయ్య మొహంలో ఒక నవ్వు విరిసింది. రోజుల తరువాత హాయిగా నవ్వినట్టు అనిపించింది అతనికి.తన పొలంలో పండిన టమాటాలను లారీలలో ఎక్కించాక మరుసటిరోజు తెల్లవారుజామునే హైదరాబాద్ బయలుదేరాడు. ఆలస్యమైన రుతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలియదు. మార్కెట్లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్నదాని కన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. తన భార్య వెటకారంగా అన్నా ఆరోజు నిజంగానే టమాటాలకు లక్షలు రాలాయి. మొత్తంగా తన మూడెకరాల పంటకి డెబ్బై లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి.మరుసటిరోజు ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఊరు ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యను మెచ్చుకుని అభినందించారు. కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్ళి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ, ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుర్లిద్దరూ అక్కడే కూర్చున్నారు.సుబ్బయ్య టీ తాగుతుంటే సుజాత గొంతు సరిచేసుకుని, ‘ఇప్పుడు మనకాడ పైసలున్నయి. గా అమెరికా సంబంధం కలుపుకుందామయ్యా?’ అన్నది నెమ్మదిగా. సుబ్బయ్య తిరిగి భార్య వంక గుర్రుమని చూశాడు. దుర్గ తన అక్క భుజం తట్టి నవ్వింది. లక్ష్మి నిట్టూర్చి తలని చేత్తో బాదుకుంది. ‘అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగ ఉంటది గదాని..’సుబ్బయ్య వెటకారంగా నవ్వి, ‘మనుషులకు విలువనియ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురెట్ల సుఖంగ ఉంటదే? ఆడేం మంచిగా సూసుకుంటడు నా బిడ్డని?’ అన్నాడు. ‘అయితే పెండ్లి చెయ్యకుండ గిట్లనే ఉంచుతవా ఏందీ?’‘ఎహేపో! నా కూతుర్లు సీతాకోకచిలుకల్లాంటోల్లే. రెక్కలొచ్చినాక గూడ ఎన్ని దినాలని చేతుల ఒడిశి పట్టుకుంటం? ఇడిశిపెట్టాల్నే. అవట్లా స్వేచ్ఛగ ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు గూడ గంతే. ఈ పైసలతో ఆళ్ళకి ఇష్టమొచ్చిన సదువులు సదువుకోనీ, నచ్చిన పనులు చేస్కోనీ. వాళ్ళకి నచ్చినప్పుడే పెండ్లి చేస్త. గంతే!’ – దినేష్ఈ మాట విన్న వెంటనే కూతుర్లు ఇద్దరూ చేతుల్లోని టీ గ్లాసులు పక్కన పెట్టి, ఠక్కున లేచొచ్చి సుబ్బయ్య చెరో పక్కన కూర్చుని, గట్టిగా తండ్రిని వాటేసుకుని ఇరు భుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది. ‘గీ మాటింటే ఊరోల్లందరు మనమీద ఉమ్మేస్తరు. నువ్వేం తండ్రివని దెప్పిపొడుస్తరు. అవసరమా?’ అని తిట్టిందిసుబ్బయ్య గట్టిగా నవ్వి, ‘గీ ఊర్ల సుబ్బయ్యను అనేంత దమ్ములు ఎవనికున్నయే? ఎవడంటడో అననీ.. సూస్కుందం. నా బిడ్డలు నా ఇష్టమే’ అని తన మీసం మేలేశాడు. ‘మా మంచి నాయిన’ అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. ‘సరిపోయిన్రు తీ తండ్రీబిడ్డలు’ మూతి ముడిచింది సుజాత.తండ్రీ, కూతుర్లు గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో అలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోకచిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురి చుట్టూ గిరగిరా తిరిగి మెల్లిగా దుర్గ చేతి మీద వాలింది. – దినేష్ -
ఆ ప్రభుండు పుట్టెను.. బేత్లెహేమునందున!
‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’ అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె. ‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు. ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. ‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’ దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2). క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం. పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’ సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!
ఇప్పుడు భారత ఐటీలో మాంద్యం కాదు.. దిద్దుబాటు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భయపడే స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు లేవని వారు చెబుతున్నారు. ఉద్యోగం పోయినా మరొక కంపెనీలో చేరుతున్నారు తప్ప రోడ్డున పడ్డ వారెవరూ ఐటీలో లేరని స్పష్టం చేస్తున్నారు. 2001, 2008లో ఐటీ రంగం మందగమనానికి లోనై తిరిగి గాడిలో పడింది. ఏ రంగానికైనా ఒడిదుడుకులు సహజం. ఇందుకు ఐటీ మినహాయింపు కాదని నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 దెబ్బతో ప్రపంచం అంతా సంప్రదాయ విధానాల నుంచి సాంకేతిక ఆధారిత పద్ధతులవైపు మళ్లింది. దీంతో తయారీ, బ్యాంకింగ్, బీమా, ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, ఆతిథ్యం, ఆహారం, ఆరోగ్యం, విద్య, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, రవాణా, సరుకు రవాణా.. ఇలా అన్నిరంగాల కంపెనీలూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. ఇంకేముంది ఐటీ ప్రోడక్ట్, సర్వీస్ కంపెనీలు 2021, 2022లో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టులు చేజిక్కించుకున్నాయి. వీటి ఆదాయమూ ఊహించనంతగా పెరిగింది. కాంట్రాక్టుల రాకతో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను చేర్చుకున్నాయి. కొన్ని కంపెనీలు అయితే అవసరానికి మించి నియామకాలను చేపట్టాయి. ప్రాజెక్టుల ఆశతో బెంచ్‌ను మెయింటెయిన్ చేశాయి. కరోనా మహమ్మారి రాకతో రిమోట్ వర్కింగ్ విధానం తప్పనిసరి అయింది. నియామక ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో జరిగాయి. ఇదే అదనుగా చాలాచోట్ల అసలు అభ్యర్థికి బదులు మరొకరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలా ఉద్యోగం సాధించిన వారిలో కొందరైతే ఒప్పందం కుదుర్చుకుని సబ్జెక్ట్ తెలిసివారితో పనులు చేయించుకున్నారు. గతంలో ఫ్రెషర్లలో మెరిట్ ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చాయి. కరోనా సమయంలో ఒక మోస్తరు అభ్యర్థులకు సైతం జాబ్స్ వచ్చాయంటే ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో అర్థం చేసుకోవచ్చు. నైపుణ్యం ఉన్నవారు అదనపు సంపాదన కోసం ఒకటికి మించిన ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేశారు. ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ గడిచిన రెండేళ్లలో ఇది విస్తృతం అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో ఇంటి పట్టున ఉండే ఉద్యోగాలు చేసినవారికి ఇది కలిసి వచ్చింది. మహమ్మారి తెచ్చిన మార్పులతో అన్ని రంగాల్లోని కంపెనీలూ సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అందుకే గడచిన రెండు సంవత్సరాల స్థాయిలో ఇప్పటి పరిస్థితులు లేవు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల రాకలో స్పీడ్ తగ్గింది. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన, కోడింగ్ చేస్తాయి. పరీక్షలు జరిపి అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నాక ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తాయి. ఆ తర్వాత క్లయింట్లకు కావాల్సిన సపోర్ట్‌ను ఒప్పందంలో భాగంగా ఐటీ కంపెనీలు కొన్నేళ్లపాటు కొనసాగిస్తాయి. కరోనా కాలంలో వచ్చిన ప్రాజెక్టులు దాదాపు ఇప్పుడు సపోర్ట్ దశకు వచ్చాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంటే ప్రస్తుతం సపోర్ట్ సేవలు అందించే సిబ్బందికే ఎక్కువ పని ఉంటుందన్నది వారి మాట. సదరు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీకి కొత్త ప్రాజెక్టులు లేకపోతే డిజైన్, కోడింగ్, టెస్టింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు మరో మార్గాలను వెతుక్కుంటున్నారు. కరోనా కాలంలో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినందున ఈ విభాగాల్లో ఉద్యోగావకాశాలకు కొరత లేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. నూతన ప్రాజెక్టులు తగ్గాయి. కరోనా కాలంలో ఉద్యోగులు మూడు రెట్ల వరకు వేతనం అందుకోవడంతో ప్రస్తుతం కంపెనీలకు భారంగా పరిణమిస్తోంది. అందుకే వ్యయ నియంత్రణతోపాటు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించాయి. కొత్త సాంకేతికతకు అప్‌గ్రేడ్ కాని ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాలవైపు మళ్లడంతో ఉద్యోగులు ఆఫీసుకు రాక తప్పడం లేదు. తమకు బదులుగా ఇంకొకరి సాయంతో ఇంటర్వ్యూ పూర్తి చేసినవారు నైపుణ్య పరీక్షల్లో విఫలం అవుతున్నారు. అలాగే ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నవారిని హెచ్ఆర్ విభాగాలు ఏరివేస్తున్నాయి. బ్యాంకు స్టేట్మెంట్స్, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల ఆధారంగా మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించి సాగనంపుతున్నాయి. పని లేక బెంచ్‌పై ఖాళీగా కూర్చున్న సిబ్బందిని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు ఇంటికి పంపించివేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే మాంద్యం బూచి చూపి సిబ్బంది సంఖ్యలో కోత విధిస్తున్నాయి. ఐటీతో ముడిపడి.. సాంకేతికత ఏదైనా సామాన్యుడికి చేరితేనే భవిష్యత్తు. ఫ్యూచర్‌ను అంచనావేసి అందుబాటులోకి తెచ్చిన ఏ పరిష్కారమైనా ఆదరణ చూరగొంటుంది. ఇప్పుడు ఐటీలో అదే జరిగింది. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో నిలుచున్న రోజులు గుర్తుండే ఉంటాయి. నేడు పేమెంట్, బ్యాంకింగ్ యాప్స్‌తో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాం. ఫుడ్ డెలివరీ, రైడ్ హెయిలింగ్ యాప్స్, ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఈ అప్లికేషన్స్‌ను (యాప్స్) నడిపించేది సాంకేతికతనే. మానవ జీవితంలో సాంకేతికత లేకపోతే మనుగడ అసాధ్యం అన్నంతగా ముడిపడింది. ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఐటీకి భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందన్నది నిపుణుల మాట. ప్రపంచమే మార్కెట్.. ఒకప్పుడు యూఎస్ విపణిపైనే ఐటీ ఆధారపడేది. ఇప్పుడు ప్రపంచమే పెద్ద మార్కెట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఒక దేశంలో బ్యాంకు మూతపడిందనో, ఆ దేశం మాంద్యంలో చిక్కుకుందనో మొత్తం ఐటీ పరిశ్రమ నిలిచిపోదు. నిపుణులైన అపార మానవ వనరులు భారత్ సొంతం. అంతే కాదు ఇక్కడ లభించే సేవలు చౌక. అందుకే దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. మనవాళ్లే ఎందుకంటే.. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ప్రకారం.. ఇక్కడ మానవ వనరులకు అయ్యే ఖర్చు తక్కువ. అధిక నైపుణ్యం ఉన్నవారు దేశంలో కోకొల్లలు. ఇతర భాషలూ మాట్లాడగలరు. వివిధ దేశాల్లో ఉన్న క్లయింట్ల సమయం ప్రకారం పనిచేసేందుకు వెనుకాడరు. తార్కిక ఆలోచన (లాజికల్ థింకింగ్) భారతీయులకు ఎక్కువ. క్లయింట్ల ఆలోచనను సులువుగా అర్థం చేసుకుంటారు. కొన్నేళ్లుగా విద్యావిధానంలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరో ముఖ్య విషయం టీమ్ వర్క్ భారతీయుల ప్రత్యేకత. సమష్టి కృషి వల్ల పనులను నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన పూర్తి చేయగలరు. కోడింగ్‌లో భారతీయులు దిట్ట. క్యాప్టివ్ కంపెనీల్లో నియామకాలు.. ఐటీ కంపెనీల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్. అంటే తమ గ్రూప్ కంపెనీల కోసం సొంతంగా ఐటీ సేవలు, బ్యాక్ ఎండ్ సపోర్ట్ అందించేవి. మరొకటి క్లయింట్లు, ఎండ్ యూజర్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు. కరోనా కాలంలో భారత్‌కు క్యాప్టివ్ కంపెనీలు క్యూ కట్టాయి. గోల్డ్‌మన్ శాక్స్, పెప్సికో, అపెక్స్ ఫండ్, సిట్కో ఫండ్, యూబీఎస్, స్టేట్ స్ట్రీట్ వంటివి వీటిలో ఉన్నాయి. క్యాప్టివ్ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఈ రిక్రూట్మెంట్ ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. రూ.5–12 లక్షల వార్షిక వేతనాల విభాగంలో కొత్త వారిని ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. క్లయింట్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంది. పల్లెలకూ ఐటీ పాకింది.. నియామకాలు కొనసాగుతుండడంతో ఐటీతో ముడిపడిన శిక్షణ సంస్థలు కొత్త కోర్సుల కోసం వచ్చిన అభ్యర్థులు, ఫ్రెషర్లతో సందడిగా ఉన్నాయి. ల్యాప్‌టాప్ అంటే తెలియనివారూ ఇక్కడికి వస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంగ్లిష్‌పై ఏమాత్రం పట్టు ఉండదు. అయినా నేర్చుకుని స్థిరపడవచ్చన్నది ప్రగాఢ విశ్వాసం అభ్యర్థుల్లో కనపిస్తోంది. మారు మూల పల్లెలకూ ఐటీ చొచ్చుకుపోయింది. కరోనా కారణంగా స్వగ్రామాల్లో ఇంటికి చేరి ఉద్యోగాలు చేసినవారు లక్షల మంది ఉన్నారు. లక్షల్లో వేతనం అందుకుంటున్న వీరిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి ఐటీలో ఉద్యోగం సంపాదించాలనే ఆశ పుట్టింది. ఇప్పటికీ ఆఫర్స్ షాపింగ్.. ఆఫర్ లెటర్లు అందుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆఫర్స్ షాపింగ్ జరుగుతోంది. అంటే ఒక సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను చూపించి మరో కంపెనీలో అధిక వేతనాన్ని డిమాండ్ చేయడం. ఇటీవల యూఎస్ ప్రభుత్వం జారీ చేసిన హెచ్1బీ వీసాలు అందుకున్న వారిలో భారతీయులూ ఉన్నారు. వీరిలో అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ నిపుణులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. భారత ఐటీ నిపుణులకు డిమాండ్‌ను సూచిస్తోంది ఇది. లే ఆఫ్స్ అనే మాటలు వింటున్నాం గాని, తమ కంపెనీలో అలాంటిదేమీ జరగడం లేదని యూఎస్‌కు చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థలో పని చేస్తున్న సాయి శ్రీహిత్ తెలిపారు. ‘నా స్నేహితులు చాలా మంది ఐటీలో ఉన్నారు. ఉద్యోగం పోయిందనే మాట వారి నుంచి నేను వినలేదు. కొందరు కొత్త కోర్సులు నేర్చుకుని పని చేస్తున్న సంస్థలో రోల్ మారడమో, లేదా మరొక కంపెనీలో అధిక వేతనానికి చేరడమో చేస్తున్నారు’ అని అన్నారు. ఈ ఏడాది హైక్ తక్కువే.. ప్రాజెక్టులు వస్తాయన్న అంచనాలతో బెంచ్‌ను కంపెనీలు మెయింటైన్ చేస్తాయి. అంటే ప్రాజెక్టు లేనప్పటికీ ఉద్యోగులను చేర్చుకుంటాయి. సిబ్బందికి వేతనాలూ చెల్లిస్తాయి. ఎప్పుడైతే ప్రాజెక్టులు రావని నిర్ధారణ అవుతుందో సిబ్బంది తీసివేతలు మొదలవుతాయి. కొన్ని కంపెనీలు కొన్ని నెలల వేతనం ముందే చెల్లించి సిబ్బందిని ఇంటికి పంపిస్తాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించడం లేదా నిలిపివేయడం చేస్తాయి. దీంతో ఉద్యోగి చేసేదేమీ లేక రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే వాతావరణం నెలకొందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల సంఖ్య తగ్గడంతో 2023లో వేతన పెంపు నెమ్మదించవచ్చని వారు అంటున్నారు. అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే.. సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి చొచ్చుకు వస్తున్నాయి. టెక్నాలజీ మార్పులకు తగ్గట్టుగా ఈ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందే. లేదంటే ఇంటిబాట తప్పదని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2023లో కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఈ రంగ నిపుణులు దృష్టి సారిస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్, టెస్టింగ్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఇంజినీర్, స్క్రమ్ మాస్టర్ వంటి నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. ఐటీలో ఏదో ఒక ఉద్యోగం.. 2020కి ముందు శిక్షణ సంస్థల్లో ఐటీ కోర్సులు నేర్చుకున్న వారిలో 40 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2021, 2022లో అభ్యర్థుల సంఖ్య రెండింతలైంది. 70–80 శాతం మంది జాబ్స్ సంపాదించారు. గడచిన రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థుల సంఖ్య 25 శాతం తగ్గింది. సక్సెస్ రేట్ 50 శాతం ఉంది. మాంద్యం వార్తల నేపథ్యంలో అభద్రతా భావం వల్లే శిక్షణ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని ఇన్స్టిట్యూట్స్ చెబుతున్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి గ్రూప్స్‌కు సన్నద్ధం అయినవారు ఇప్పుడు ఐటీ వైపు చూస్తున్నారు. కొత్తగా శిక్షణ కోసం వచ్చిన వారిలో ఇటువంటి వారి సంఖ్య 50 శాతంపైగా ఉంటోందని సమాచారం. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఐటీలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్నది వారి నమ్మకం. కోవిడ్ తెచ్చిన మార్పులు.. ఒకప్పుడు బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఐటీతోపాటు ఎంసీఏ చదివినవారు ఐటీ వైపు వచ్చేవారు. మహమ్మారి కాలంలో, అలాగే ప్రస్తుతం డిగ్రీ పూర్తి అయినవారు, ఇతర విద్యార్హతలు ఉన్నవారూ సంబంధిత కోర్సులు చేసి ఐటీలో ప్రవేశిస్తున్నారు. అధిక వేతనాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టులు వెల్లువెత్తడంతో కంపెనీలు అభ్యర్థుల విద్యార్హతలను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టాయి. నాన్ బీటెక్, నాన్ ఐటీ నుంచి ఇటువైపు రావడం 2021 నుంచి ట్రెండింగ్ అయింది. హెచ్‌సీఎల్‌లో రూ.20 లక్షల వార్షిక వేతనం ఆమెది. ఉద్యోగం వదిలేయాలని డిసైడ్ అయ్యారు. నూతన సాంకేతికత నేర్చుకుని యూఎస్ వెళ్లాలన్నది ఆమె ఆలోచన. కొసమెరుపు ఏమంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గ్రూప్–2 స్థాయి అధికారి అయిన తన భర్తను సైతం రాజీనామా చేయించి.. ఇద్దరూ విదేశీ గడ్డపై స్థిరపడాలని ఆమె నిర్ణయించుకోవడం. ప్రపంచం అంతా మందగమనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ఒక్క సంఘటన చాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉన్న ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పడానికి! వేతనాలు ఇలా.. కొత్త కోర్సు నేర్చుకుని అప్‌గ్రేడ్ అయినవారు అదే సంస్థలో సగటున వేతనంలో 70-80 శాతం హైక్ సాధిస్తున్నారు. కంపెనీ మారినవారైతే రెండింతల శాలరీతో జాక్‌పాట్ కొట్టేస్తున్నారట. కీలక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణుల జీతాలు మూడు రెట్ల వరకు అధికం అయ్యాయంటే ప్రస్తుత డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కంపెనీ, ఉద్యోగి సామర్థ్యాలను బట్టి కోవిడ్ ముందు, ప్రస్తుతం వార్షిక వేతనాలు సగటున ఇలా ఉన్నాయి. అనుభవం కోవిడ్ ముందు ప్రస్తుతం (వార్షిక వేతనాలు లక్షల్లో) ఫ్రెషర్స్ రూ.2–5 రూ.4–10 1–3 ఏళ్లు రూ.5–8 రూ.8–20 3–10 ఏళ్లు రూ.6–16 రూ.15–40 10–15 ఏళ్లు రూ.15–25 రూ.25 లక్షల – రూ.1 కోటి 15 ఏళ్లకుపైబడి రూ.30–70 రూ.40 లక్షల – రూ.1 కోటి నైపుణ్యం ఉన్నవారే ఉంటారు..: ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్తు ఉంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ, సీఆర్ఎం విభాగాల్లో నిపుణులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక ప్రభావం ఏ రంగాలపై ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయి ఉండవచ్చు. అయినంత మాత్రాన భయపడేంత పరిస్థితులు లేవు. భారత్‌లో పెద్దగా లే ఆఫ్స్ లేవు. నైపుణ్యం ఉంటే ఒక కంపెనీ కాకపోతే మరొక కంపెనీలో ఉద్యోగం లభిస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన వారికే ముప్పు. కొత్త ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రాకపోవడంతో బెంచ్ మీదకు తీసుకోవడం లేదు – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్. ఉద్యోగం పోవడం సమస్యే కాదు..: ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో గతేడాది వరకు ఆఫర్ షాపింగ్ చేసేవారి సంఖ్య 20 శాతం ఉండేది. ఇప్పుడు ఇలాంటి వారు ఏకంగా 50 శాతం ఉంటున్నారు. అభ్యర్థుల్లో 20 శాతం మంది లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగం పోయినవారు వస్తున్నారు. జాబ్ పోయిందనేది సమస్యే కాదు. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అన్నదే కంపెనీలకు ప్రధానం. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అక్కర్లేదు. సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగితే చాలు. పురుషులైతే 1–2 ఏళ్లు గ్యాప్ ఉన్నా ఫర్వాలేదు. మహిళలు అయితే ఎంత గ్యాప్ ఉన్నా సంబంధిత సాంకేతికతలో నైపుణ్యం ఉంటే జాబ్ వస్తోంది. అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు వేతనంలో కనీసం 30 శాతం హైక్ డిమాండ్ చేస్తున్నారు – రేచల్ స్టెల్లా రాజ్, ఇంటర్నల్ టాలెంట్ అక్విజిషన్ రిక్రూటర్. ప్యాకేజ్ గురించి ఆలోచించవద్దు..: కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్ గ్యాప్ ఉన్నవారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయాలి. ఏ కోర్స్ చేస్తే మెరుగ్గా ఉంటుందో కెరీర్ గైడెన్స్ ద్వారా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగుపెట్టాలి. టెక్నికల్ సబ్జెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలు చూసుకోవాలి. విభిన్న కంపెనీల్లో ఓపికగా ఇంటర్వ్యూల్లో పాల్గొని నాలెడ్జ్ సంపాదించాలి. డిగ్రీ చదివి మంచి ఇన్స్టిట్యూట్లో 6–12 నెలలపాటు శిక్షణ తీసుకుంటే చాలు. ఐటీ రంగంలో జాబ్ తప్పనిసరిగా దొరుకుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్టయితే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. నైపుణ్యం ఉంటే ఐటీ రంగంలో నిలదొక్కుకోవచ్చు. నియామక పత్రాలు అందుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు – రమణ భూపతి, చైర్మన్, క్వాలిటీ థాట్ గ్రూప్. -నూగూరి మహేందర్ -
Michael Jordan: బాస్ ఆఫ్ బాస్కెట్‌బాల్
ఆరు సార్లు ప్రతిష్ఠాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు... ఆరు ఫైనల్స్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డు... ఐదు సార్లు టోర్నీ మొత్తంలో అత్యంత విలువైన ఆటగాడు...14 సీజన్ల పాటు ఆల్‌స్టార్ జట్టులో చోటు...రెండు ఒలింపిక్ పతకాలు...కనీసం రెండంకెల పాయింట్లు స్కోరు చేసిన వరుస మ్యాచ్‌లు ఏకంగా 840... ఒక మ్యాచ్‌లో ఒంటిచేత్తో ఏకంగా 69 పాయింట్లు సాధించిన ఘనత... ఒకటేమిటి, ఇలా ఆ దిగ్గజం గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే పుటలు సరిపోవు. లెక్కలేనన్ని రికార్డులను అతను తిరగరాశాడు. అతను కోర్టులో అడుగుపెడితే అభిమానులకు అతి పెద్ద పండుగ! ఆట మొదలుపెడితే అద్భుతాలు ఆవిష్కృతం కావడమే, లోకం ఊగిపోవడమే! క్రీడా చరిత్రలో ఒక ఆటపై ఒక వ్యక్తి ఇంతగా తనదైన ముద్ర వేయడం అరుదు. ఆ సూపర్ స్టార్ పేరే మైకేల్ జోర్డాన్. మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ గ్రేట్. ఒక తరం పాటు బాస్కెట్‌బాల్ అంటే జోర్డాన్; జోర్డాన్ అంటే బాస్కెట్‌బాల్! 1984లో ఎన్బీఏ జట్టు షికాగో బుల్స్ తొలి సారి జోర్డాన్‌ను తీసుకుంది. అప్పుడు వారికీ తెలీదు. తాము ఎలాంటి సంచలనాన్ని ఎంచుకున్నామో, మున్ముందు అతను చూపే అద్భుతాలు ఎలాంటివో వారూ ఊహించలేదు. సీనియర్లు మెల్లమెల్లగా తప్పుకుంటున్న దశలో జోర్డాన్ రాక బుల్స్ టీమ్‌ను శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. అతను పాయింట్ సాధించే క్రమంలో ఎగిరే తీరు, ’స్లామ్ డంక్స్’తో పాటు ‘ఫ్రీ త్రో లైన్’లో పాయింట్లు సాధించే తీరు ప్రపంచ క్రీడాభిమానులందరూ నివ్వెరపోయేలా చేశాయి. అందుకే జోర్డాన్ కోసం వారంతా పడిచచ్చిపోవడం మొదలైంది. బుల్స్‌తో చేరిన తర్వాత తొలి ఎన్బీఏ టైటిల్ సాధించేందుకు కొంత సమయం పట్టినా తన అద్భుత ఆటతో బుల్స్‌కు రెండుసార్లు త్రీ–పీట్ (హ్యాట్రిక్) టైటిల్స్‌ను అందించాడు. 1991–93 వరకు వరుసగా మూడేళ్లు షికాగో బుల్స్ పైచేయి సాధించిందంటే అందుకు జోర్డానే కారణం. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల తర్వాత తిరిగొచ్చిన జోర్డాన్... మరోసారి వరుసగా మూడేళ్లు బుల్స్ టైటిల్ సాధించడంలో మళ్లీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఎన్బీఏ లీగ్ చరిత్రలో తొలి బిలియనీర్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. స్కూల్, కాలేజీల్లో సత్తా చాటి... జోర్డాన్ జీవితంలో పెద్దగా ఎత్తుపల్లాలేమీ లేవు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని బాల్యం బాగానే సాగింది. ఆటల్లో ఎంతో ఆసక్తి కనబర్చిన అతను తన స్కూల్లో బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ ఆడాడు. బాస్కెట్‌బాల్ అతడిని ఎక్కువగా ఆకర్షించడంతో జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో జోర్డాన్ ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. మామూలుగా అయితే ఇది మంచి ఎత్తు. కానీ స్కూల్ లెవల్ బాస్కెట్‌బాల్ ఆడేందుకు ఇది సరిపోదని, చాలా తక్కువ అంటూ అతడికి చోటు నిరాకరించారు! దాంతో అదే స్కూల్ జూనియర్ టీమ్ తరఫున అతను ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటి పాయింట్ల వర్షం కురిపించాడు. తర్వాతి ఏడాది వచ్చేసరికి జోర్డాన్ ఎత్తు మరో 10 సెంటీమీటర్లు పెరిగింది. దాంతో పాటు శిక్షణలో కఠోరంగా శ్రమించాడు కూడా. ఫలితంగా తిరస్కరించిన జట్టులోనే చోటు లభించింది. తమ టీమ్‌ను వరుసగా గెలిపించడంతో పాటు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బాస్కెట్‌బాల్ స్కాలర్‌షిప్‌లన్నీ వచ్చి చేరాయి. ఆపై కాలేజీ టీమ్‌లో కూడా చెలరేగడంతో కాలేజీ బాస్కెట్‌బాల్ అమెరికన్ టీమ్‌లో కూడా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికే బాస్కెట్‌బాల్‌లో జోర్డాన్ అందరి దృష్టిలో పడి భవిష్యత్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ తర్వాత ఎదురు లేకుండా అతని ప్రస్థానం కొనసాగింది. తిరుగులేని ప్రదర్శనతో... షికాగో బుల్స్... ఎన్బీఏలో 1966నుంచి బరిలో ఉన్న జట్టు. 18 సీజన్ల పాటు ఆడినా ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. కానీ 1984 డ్రాఫ్ట్ ఆ జట్టుకు ఒక్కసారిగా ఆకర్షణను తెచ్చింది. దానికి కారణం ఒకే ఒక్కడు మైకేల్ జోర్డాన్. జోర్డాన్ బరిలోకి దిగితే చాలు అభిమానులు ఊగిపోయారు. ఫలితంతో సంబంధం లేకుండా అతను ఉంటే చాలు, అతని ఆట చూస్తే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ ఏడాది బుల్స్ ఆడిన 82 మ్యాచ్‌లు అన్నింటిలో బరిలోకి దిగిన ఏకైక ఆటగాడైన జోర్డాన్ ప్రతీ గేమ్‌కు సగటున 28.2 పాయింట్లు సాధించిన శిఖరాన నిలిచాడు. అయితే ఇతర సహచరుల నుంచి తగినంత సహకారం లేక టీమ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. కానీ 1991లో ఎట్టకేలకు బుల్స్ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ఫైనల్లో టాప్ టీమ్ లాస్ ఏంజెల్స్ లేకర్స్‌ను ఓడించి బుల్స్ తొలి సారి చాంపియన్‌గా నిలిచింది. 31.5 సగటు పాయింట్లతో టాప్ స్కోర్ సాధించిన జోర్డాన్ అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు ఇదే కొనసాగింది. ఫలితంగా మరో రెండు టైటిల్స్ జట్టు ఖాతాలో చేరాయి. అనూహ్యంగా దూరమై... 1993లో జోర్డాన్ తండ్రి అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. తండ్రిని ఎంతో ప్రేమించిన జోర్డాన్ తనకు బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి తగ్గిపోయిందంటూ హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా అప్పటికే ఎంతో కీర్తిని పొందినా, చిన్నప్పుడు తన తండ్రి తనను బేస్‌బాల్ ఆటగాడిగా చూడాలని కోరుకున్నాడంటూ ఒక్కసారిగా బేస్‌బాల్ మైనర్ లీగ్‌లో కూడా అడుగు పెట్టాడు. అక్కడ రెండు సీజన్ల పాటు బ్యారన్స్, స్కార్పియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే రెండేళ్ల తర్వాత తన టీమ్ బుల్స్ పరిస్థితి బాగా లేకపోవడంతో సీజన్ మధ్యలో ’ఐయామ్ బ్యాక్’ అంటూ రిటైర్మెంట్కు గుడ్‌బై చెప్పిన మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. సుమారు 18 నెలల పాటు ఆట నుంచి దూరంగా ఉన్నా జోర్డాన్‌లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఒంటి చేతుల్లో టీమ్‌ను ప్లే ఆఫ్ వరకు చేర్చగలిగాడు. అయితే తాను చేయాల్సింది ఇంకా ఉందని భావించిన జోర్డాన్ తర్వాతి సీజన్ కోసం సీరియస్‌గా కష్టపడ్డాడు. అందుకు తగ్గ ఫలితం కూడా జట్టుకు లభించింది. మరో సారి వరుసగా మూడేళ్ల పాటు (1996, 97, 98) బుల్స్ ఎన్బీఏ చాంపియన్‌గా నిలవడం విశేషం. రెండోసారి మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించి, మూడేళ్ల తర్వాత జోర్డాన్ మళ్లీ వెనక్కి వచ్చాడు. ఈసారి జట్టు మారి రెండేళ్ల పాటు వాషింగ్టన్ విజార్డ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జోర్డాన్ టీమ్ నుంచి తప్పుకున్న తర్వాత 1998నుంచి ఇప్పటి వరకు ఎన్బీఏలో షికాగో బుల్స్ మరో టైటిల్ గెలవలేకపోయిందంటే అతని ఘనత ఏమిటో అర్థమవుతుంది. 1984 లాస్ ఏంజెల్స్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లలో అమెరికాకు స్వర్ణ పతకాలు అందించి జాతీయ జట్టు తరఫున కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. బాస్కెట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం కల్పించడంలో జోర్డాన్ కీలక పాత్ర పోషించాడు. అతని కారణంగానే 90వ దశలో ఎన్బీఏ లీగ్ వాణిజ్యపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. స్వయంగా జోర్డాన్ ఎండార్స్మెంట్ల ద్వారా మార్కెట్‌ను శాసించాడు. అతనితో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద సంస్థలు ‘క్యూ’ కట్టి పోటీ పడ్డాయి. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధికంగా మార్కెటింగ్ చేయబడిన ఆటగాడిగా అతను గుర్తింపు పొందారు. అన్నింటికి మించి ‘నైకీ’ సంస్థ అతని జంప్‌తో ప్రత్యేకంగా రూపొందించిన షూస్ విశ్వవ్యాప్తంగా సంచలనం సష్టించాయి. ‘ఎయిర్ జోర్డాన్’ పేరుతో రూపొందించిన ఈ కమర్షియల్‌తో అతని స్థాయి ఏమిటో తెలిసింది. పలు సినిమాలు, డాక్యుమెంటరీల్లో కూడా నటించిన జోర్డాన్ పలు పుస్తకాలు రచించాడు. అయితే ’ఫర్ ద లవ్ ఆఫ్ ద గేమ్’ పేరుతో వచ్చిన జోర్డాన్ ఆత్మకథలో అతని కెరీర్, జీవితంలో అన్ని కోణాలు కనిపిస్తాయి. -
చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది..
‘చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చి మరీ మారిన ఓ ముసుగు మనిషి కథ ఇది.జపాన్‌లో హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియా సిటీ మధ్యలో చిన్న కొండపై తమ పాత ఇంటిని కలుపుకుంటూ.. రెండతస్తుల మేడ కట్టుకున్నాడు కట్సుహిసా ఎజాకి(42). గ్లికో ఫుడ్ కంపెనీ ప్రెసిడెంట్‌గా అతడికి మంచి పేరుతో పాటు శత్రువులూ ఎక్కువే. అందుకే ఇంటి తలుపులకు హైటెక్ సెకామ్ సెక్యూరిటీ సిస్టమ్‌ని అమర్చుకున్నాడు. పాతింట్లో.. తల్లి యోషీ ఉండేది. కొత్త ఇంటి తాళాల్లో ఒకటి తల్లి దగ్గర మరొకటి భార్య దగ్గర ఉండేవి. 1984 మార్చి 18, రాత్రి ఎనిమిదిన్నర దాటాక వర్షం పడుతుంటే.. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు యోషీ ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ల చేతుల్లో తుపాకీలు, కత్తులు ఉన్నాయి. టీవీలో మునిగిపోయిన యోషీని.. బెదిరించి.. టెలిఫోన్ వైర్స్ కట్ చేసి.. వాటితోనే కట్టేశారు. నోటికి, కళ్లకి టేప్ వేసి.. ఆమె దగ్గరున్న కొత్తింటి తాళం తీసుకుని పరుగుతీశారు. అప్పటికి కట్సుహిసా.. తన నాలుగేళ్ల కూతురు యుకికోకి, 11 ఏళ్ల కొడుకు ఎట్సురోకి స్నానం చేయిస్తూ బాత్రూమ్లో ఉన్నాడు. భార్య మికీకో.. మరో ఏడేళ్ల కూతురు మారికోతో కలసి టీవీ చూస్తోంది. బయట నుంచి తాళం తీసి.. మికీకో ఉన్న గదిలోకి వెళ్లి తుపాకీలు గురిపెట్టారు. క్షణాల్లో అక్కడున్న టెలిఫోన్ వైర్స్ని కట్ చేసి.. వాళ్ల కాళ్లు చేతులు కట్టి.. నోటికి ప్లాస్టర్స్ వేసి.. కట్సుహిసాని వెతుక్కుంటూ వెళ్లారు. బాత్రూమ్లో ఉన్న కట్సుహిసా గుండెకు గన్ గురిపెట్టి.. ‘అరవద్దు కాల్చేస్తాను’ అని పిల్లల్ని బెదిరించారు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురి నోటికి, కళ్లకి ప్లాస్టర్స్ వేసి.. పిల్లల్ని అక్కడే కట్టిపడేసి.. కట్సుహిసాను లాక్కుపోయారు. ‘త్వరగా కారు తియ్’ అనగానే కారు ముందుకు కదలడంతో మరో దుండగుడూ కారులో ఉన్నట్టుగా కట్సుహిసాకి అర్థమైంది. సరిగ్గా పది నిమిషాలకి మికీకో కష్టపడి తనకున్న కట్లు విప్పుకుని, కూతురు మారికోని కూడా విడిపించి.. డైనింగ్ హాల్లో ఉన్న ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే చెక్‌పోస్టుల్లో క్షుణ్ణంగా తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు. తెల్లవారుజామున ఒంటి గంటకు, గ్లికో కంపెనీ డిపార్ట్మెంట్ హెడ్.. ఫుజీ ఇంటికి ఒక ఫోన్ వచ్చింది. ‘తకాట్సుకిలోని పబ్లిక్ టెలిఫోన్ బాక్స్‌లోని టెలిఫోన్ డైరెక్టరీలో ఓ లేఖ ఉంది, చూడండి’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మొదట అంతగా పట్టించుకోని ఫుజీ.. ఎందుకో ఆ వాయిస్ తమ యజమాని కట్సుహిసాలాగా అనిపించి.. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ నిజంగానే ఓ లేఖ ఉంది. ‘కట్సుహిసా ప్రాణాలతో దక్కాలంటే 1 బిలియన్ యెన్ (రూ. 60 కోట్లు), 100 కిలోల బంగారం సిద్ధం చేసుకోండి. వాటిని ఫుజీ ఇంటి ముందు తెల్లటి కారులో ఉంచి వెళ్లాలి. మేము మళ్లీ ఫుజీకే కాల్ చేస్తాం. మీరు ఏ ప్రయత్నం చేసినా మాకు తెలిసిపోతుంది. పోలీసుల్లో మాకు స్నేహితులున్నారు’ అనేది ఆ లేఖ సారాంశం. అది చదవగానే ఫుజీ పోలీసుల దగ్గరకే పరుగుతీశాడు. తీరా కట్సుహిసా.. అతడి కంపెనీకి చెందిన గిడ్డంగిలోనే బందీ అయ్యాడు. ‘నీ కూతురు మారికో కూడా మా దగ్గరే ఉంది. నువ్వు తప్పించుకుంటే ఆమెను చంపేస్తాం’ అని అబద్ధం చెప్పి బెదిరించారు కూడా. అయితే మార్చి 21 మధ్యాహ్నం గిడ్డంగిలో దుండగులు లేని సమయంలో కట్సుహిసా.. తుప్పుపట్టిన వెనుక డోర్‌ని బలంగా తన్ని దానిలోంచి బయటపడ్డాడు. పోలీసుల సాయంతో సురక్షితంగా కుటుంబాన్ని చేరుకున్నాడు. నేరస్థులు దొరక్కున్నా.. కథ సుఖాంతం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ కాలేదు. ఎవరో ఏప్రిల్ 10న.. గ్లికో కార్పొరేట్ కార్ పార్కింగ్లోని 3 కార్లకు నిప్పు పెట్టారు. 3 రోజుల తర్వాత ‘ది మాన్స్టర్ విత్ 21 ఫేసెస్’ అనే పేరుతో ‘అది మా పనే’ అంటూ ఓ లేఖ వచ్చింది. మే 10న, అదే పేరుతో ‘గ్లికో ఉత్పత్తులను పొటాషియం సైనైడ్‌తో విషపూరితం చేశాం’ అనే మరో బెదిరింపు లేఖ ఫుడ్ కార్పొరేషన్ కి అందింది. దాంతో ఆ కంపెనీ 21 మిలియన్ యెన్ లను నష్టపోయింది. మరికొన్ని రోజులకు.. విషపూరిత ఉత్పత్తులను గ్లికో స్టోర్ షెల్ఫ్‌లలో ఉంచుతామంటూ లేఖ వచ్చింది. చెప్పినట్లే స్టోర్ షెల్ఫ్ ముందు ఓ వ్యక్తి సీసీటీవీలో అనుమానస్పదంగా కనిపించాడు. అతడే మాన్ స్టర్ అని అంతా నమ్మారు. కానీ ఫుటేజ్‌లో అతడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. అలాగే అతడు వచ్చివెళ్లిన ర్యాక్‌లో ఎలాంటి విషపూరిత ఆహారం దొరకలేదు. ‘నేనొక అసంతృప్తితో ఉన్న గ్లికో ఉద్యోగిని’ అంటూ పోలీసులకూ లేఖలొచ్చాయి. ఆ దిశగానూ విచారణ ఫలించలేదు. జూన్ 26న ‘మాన్ స్టర్.. గ్లికోను క్షమిస్తున్నాడు!’ అంటూ వచ్చిన లేఖతో.. ఆ కంపెనీపై వేధింపులు ఆగిపోయాయి. ఆ తర్వాత నుంచి మోరినాగా అనే మరో ఆహార సంస్థకు అలాంటి లేఖల రాక మొదలైంది. గ్లికో విచారణ తర్వాత మాన్ స్టర్ ఊరికే బెదిరిస్తున్నాడని ఆ లేఖలను లైట్‌గా తీసుకుంది మోరినాగా సంస్థ. అయితే ‘మోరినాగా ఉత్పత్తుల్లో మేము ప్రత్యేక మసాలా సోడియం సైనైడ్‌ను కలిపాం.. కాబట్టి అది కొంచెం చేదుగా ఉంటుంది’ అంటూ దేశంలోని పిల్లల తల్లులను ఉద్దేశిస్తూ.. మాన్స్టర్ నుంచి మీడియాకి ఓ లేఖ వచ్చింది. వెంటనే ఫుడ్ కార్పొరేషన్ రంగంలోకి దిగి.. మోరినాగాకు చెందిన 29 విషపూరిత ఉత్పత్తులను గుర్తించింది. దాంతో వణికిన మోరినాగా.. 50 మిలియన్ యెన్ లు చెల్లిస్తామని.. వేధింపులు ఆపాలని మాన్ స్టర్‌ని వేడుకుంది. ఆ ఆఫర్‌ని అంగీకరించాడు మాన్స్టర్. జూన్ 28న ఆ డబ్బు అందుకోబోతూ.. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారని గుర్తించి తప్పించుకున్నాడు. అప్పుడే మాన్ స్టర్ కళ్లను ఓ అధికారి చూశాడట. అతడి కళ్లు నక్క కళ్లలా ఉండటంతో.. మాన్ స్టర్.. ఫాక్స్–ఐడ్ మ్యాన్ గా మారాడు. మాన్ స్టర్ వేధింపులు పెరగడంతో పోలీసుల మీద పై అధికారుల ఒత్తిడి పెరిగిపోయింది. 1985 ఆగస్ట్‌లో షోజీ యమమోటో అనే పోలీస్.. మాన్ స్టర్‌ని పట్టుకోలేకపోతున్నాననే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మా¯న్స్టర్ నుంచి చివరిగా ఒకే ఒక్క లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పోలీసుల్లో మాకు స్నేహితులు ఎవరూ లేరు. యమమోటో ఓ మనిషిలా చనిపోయాడు. దానికి మేము సానుభూతి తెలుపుతున్నాం. ఇక నుంచి మా వేధింపులను నిలిపేస్తున్నాం. మా పేరుతో మరెవరైనా ఈ నేరాలకు పాల్పడితే అది మేము కాదని గుర్తించండి. మేం చెడ్డవాళ్లం. చెడ్డ వ్యక్తిగా జీవితాన్ని గడపడం సరదాగా ఉంటుంది. ఇట్లు.. 21 ముఖాల రాక్షసుడు’ అనేది అందులోని భావం. అప్పటి నుంచి మాన్ స్టర్ కనుమరుగు అయిపోయాడు. మాన్ స్టర్ ఒక గ్రూప్‌కి లీడరా? లేక నిజంగానే 21 మంది కలిసే ఇదంతా చేశారా? అనేది నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
కీడు గుడిసె.. మనసును కదిలించే కథ
తూర్పు కనుమలు ఆ చలికాలపు ఉదయాన మంచుముసుగు కప్పుకున్నాయి. చెట్టూపుట్టలూ, పశుపక్ష్యాదులూ మంచులో తడిసిముద్దయి చలికి వణుకుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో, దట్టమైన కీకారణ్యంలో ఎతై ్తన కొండలమీదుంది ఆ గూడెం. నాగరికతకు చాలా దూరంగా వున్న ఆ గూడెంలో ఒక గిరిజన తెగకు చెందిన ఇరవైమూడు కుటుంబాలు.. అనాదిగా వస్తున్న ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూ జీవనం సాగిస్తున్నాయి. గూడేనికి కాస్త ఎడంగా, చుట్టూ రక్షణగోడలా వున్న వెదురుతడికల మధ్య వుంది ఆ గుడిసె. అందులో వెదురుబొంగులతో కట్టిన అటకమీద ముడుచుకుని పడుకున్న సోము చలికి గజగజా వణికిపోతున్నాడు. చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే... భార్య సిసిరి గురించిన ఆలోచనలు అతని మనసును ముసురుతుంటే... నిద్రెలా పడుతుంది? హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిగ్గున లేచి, అటక దిగాడు సోము. బయట మంచు తప్ప ఏం కనిపించ లేదు, వినిపించ లేదు. ‘అంత నా బెమ’ అనుకున్నాడు. గుడెసెలో ఓ మూలనున్న పొయ్యి దగ్గరికెళ్లి ముట్టించాడు. చిన్న మంట వెచ్చగా తగిలి ప్రాణం లేచొచ్చింది. చలి కాగుతుంటే అతడికి సిసిరి గుర్తుకొచ్చింది మళ్లీ. ‘యీ సలిలో అదెట్టావుందో ఏటో?’ అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. ‘ఆలుమగలను ఇడదీసే యీ ఆసారమేటి? దాన్నట్టుకుని గూడెం పెద్ద యాలాడ్డమేటి?’ అనుకుంటూ మొహం చిరాగ్గాపెట్టాడు. పక్క పక్క గూడేలకు చెందిన సోము, సిసిరి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇరు గూడేల పెద్దలను తమ మనువుకు ఒప్పించారు. ఆచారం ప్రకారం మనువుకు ముందు గుడిసెకట్టి ఆనక మనువాడారు. ఆ కొత్తగుడిసెలో కాపురం పెట్టి యేడాదిన్నరయింది. నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరినీ, సిసిరి నెలసరి సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది. దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపమూ వచ్చేది. సిసిరిని ఆచారం తప్పమనేవాడు. ‘గూడెం కట్టుబాటు దప్పితే తొప్పు గట్టాలి గదా మావ’ అని నచ్చచెప్పేది సిసిరి. కీడు గుడిసెకు వెళ్ళి, అక్కడ మూడ్రోజులుండి వచ్చేది. ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు! దాంతో ఆమె మకాం కొద్దిరోజులక్రితం కీడు గుడిసెకు మారింది మళ్లీ. రెండునెలలు అక్కడే వుంటుంది. కొన్ని గిరిజన తెగల్లో వుండే ఆ ఆచారం.. సోము వాళ్ల తెగలోనూ వుంది. స్త్రీలు నెలసరి అయితే మూడ్రోజులు, గర్భిణీలు, రజస్వలైనవాళ్లు రెండునెలలు గూడేనికి కాస్త దూరంలో వుండే కీడు గుడిసెలో వుండాలి. వారు గూడెంలో వుంటే వారి కీడు (మైల) గూడేనికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు. వారు ఆ కీడు గుడిసెలోనే వుంటూ, వారికి కేటాయించిన దారుల్లోనే బయటకెళ్లి రావాలి. వారికి వారి బంధువులైన స్త్రీలు తింటానికి పట్టుకెళ్లిస్తారు. ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా వుంటాయి. గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేస్తారు. పురుడుకోసం కీడు గుడిసెలోకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా గూడేనికి తిరిగొస్తారన్నది సందేహమే! కీడు గుడిసెలో మంత్రసాని పురుళ్లు పోస్తుంది. ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాలమీదకు వచ్చినా సరే ఆసుపత్రికి తీసుకెళ్లరు. బలవంతంగా మోటుపద్ధతుల్లో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కీడు గుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో? సోము అలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు. మరెన్నో విన్నాడు. అందుకే అతడు భయపడుతున్నాడు. చలి కాగుతూ సిసిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు. తమ ఆచారాల్లో కొన్నింటిని మూఢాచారాలుగా భావిస్తాడు సోము. అడవిలో తాము సేకరించినవి అమ్మి కావలసిన సరుకులు తెచ్చుకోవడంకోసం.. అప్పుడప్పుడు అతడు సమీప పట్టణంలోకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా పట్టణ ప్రజల జీవనవిధానాన్ని పరిశీలించేవాడు. అక్కడ కీడు గుడిసె ఆచారంతోపాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలూ లేవని గ్రహించేవాడు. ఆ విషయాలను తన నేస్తాలతో చెప్పి బాధపడేవాడు. ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప, కీడు గుడిసెకు మరమ్మత్తులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యంచేసి, ‘పట్నంల యాడ ఇట్టాంటి కీడు ఆసారం నేదు. మనంగూడ మానుకుందాం’ అన్నాడు. గుర్రప్ప గుర్రుగా చూసి ‘నక్కబుట్టి నాలుగువోరాలు గానేదు, యీ గాలీవోన యెన్నడు సూడనేదన్నదంట. అట్టాగుంది నీ యెవ్వారం. మూతిమీద మీసమే సరిగ్గ రానేదు పెద్దకొబుర్లు ఆడేతున్నవు’ వెటకారంగా అన్నాడు.‘ఆడోల్ని ఇబ్బందెట్టే, ఆల్ల పేనంమ్మీదకు దెచ్చే ఆసారం యెంతసెడ్డదో తెల్డానికి మీసమే రానొవసరం నేదు’ అన్నాడు సోము ఆవేశంగా. గుర్రప్ప అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘ఏట్రా... ఇప్పసారా తల కెక్కేసినదేటి? ఏటేటో వోగుతున్నవు. గూడెం బాగు కోసరం మన పెద్దోల్లెట్టిన ఆసారం మనం పాటించల. మానుకుంతే కొండదేవతకు కోపమొస్తది. ఆసారం దప్పినప్పుడల్ల గూడెంల పీనుగులెగుతున్న ఇసయం నీకుతెల్ద? మల్ల ఇట్టాగ ఆసారాన్ని ఎటకారంసేత్తే గూడెం పెద్దగ ఏటిసేయాల్నో అదే సేస్తను’ అంటూ హెచ్చరించాడు. అందుకే సోము మళ్లా ఆ మాట ఎత్తలేదు. ‘ఒరే సోముగే... లెగిసినవ... గుర్రెట్టుకొని నిద్రోతున్నవ?’ అంటూ గుడిసెలోకి దూరాడు సోము అయ్య కన్నప్ప. చలి కాగుతున్న సోము ‘నిద్రడితేనే కదర నిద్రోడనికి... సిసిరికి ఎట్టుందో తెలిసినదేటి?’ ఆత్రుతగా అడిగాడు. ‘అది సెప్పడనికే వొచ్చినను. సిసిరి పెరిస్తితి ఏం బాగోనేదంట. కాన్పుసేయడం కట్టమని మంత్రసాని అందంట. కోడలికేటవుతాదోనని మీయమ్మ రాగాలుదీత్తు నెత్తిబాదుకుంతున్నది’ చెప్పాడు కన్నప్ప. అది విని సోము భయంతో వణికిపోయాడు. సిసిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని ‘ఒరే అయ్య... మరిప్పుడేటి సేయడం?’ అన్నాడు బేలగా. ‘సేసేదేటుందిర. సిసిరికి ఏటిగాకుండ కాన్పయితే కొండదేవతకు అడవిపందిని బలిత్తమని మొక్కీసుకోడమే! అంతకుమించి మనం సేసేది ఏటినేదు’ అన్నాడు కన్నప్ప విచారంగా. ‘ఒరే అయ్య... అలాగనకుర. సిసిరి నా పేనం! అది సావగూడదు. ఆలిస్యెం సెయ్యకుండ ఆసుపెత్రికి దీస్కుపోదం. దాన్ని బతికించుకుందం’ అన్నాడు సోము ఏడుస్తూ. ‘నీకేటి మతిపోనదేటిర... గూడెం ఆసారం నీకు తెల్దేటి? కిందటేడు కాసమ్మ కాన్పు జెరక్క గిలగిల కొట్టుకుంతుంటే, దాని పెనిమిటి కొండప్ప ఆసుపెత్రికి దీస్కుపోతన్నడు. గుర్రప్ప ఒప్పుకున్నడేటి? ఆసారం దప్పుతావేట్ర ఎదవనాయాలంటు గయ్యిన లేసినడు గద...’ ‘పేనం కంటే ఆసారం గొప్పదేటి? నాకు సిసిరికంటే మరేటి గొప్పది గాదు. దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం దప్పుతను. గుర్రప్ప ఏటిసేస్తడో సేసుకోమను’ తెగింపుగా అన్నాడు సోము. ‘గుర్రప్ప దయదాచ్చన్యంనేనోడు. గూడెం కట్టుబాటు దప్పితే సిచ్చేసి, ఎలేస్తడు. గూడెం ఇడిసి మనం బతకలేం. దేవతమీద బారమేసి వొల్లకుండడమే’ నచ్చజెప్తూ అన్నాడు కన్నప్ప. ‘ఎలేస్తడని బయిపడితే సిసిరి సస్తది. సిసిరికి ఉసురుంతే ఈడగాకబోతే ఏడన్న బతుకుతం. ఒరే అయ్య... నా మాటిని సాయం సెయ్య. సిసిరిని డోలీగట్టుకుని ఆసుపెత్రికి దీస్కుపోదం’ దీనంగా బతిమాలాడు సోము. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్ప ఆగ్రహానికి గురికావడమే! అయితే కొడుకు బాధను చూడలేకపోయాడు కన్నప్ప. ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. ‘సరే బయిలెల్లయితే’ అంటూ డోలీ కట్టడానికి దుప్పట్లు, పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు. సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు. డోలీ ముందు కొమ్ము కన్నప్ప, వెనుక కొమ్ము సోము భుజాలమీద వుంచుకుని మోసుకుపోతున్నారు. మంచును చీల్చుకుంటూ, రాయీరప్పను దాటుకుంటూ, తుప్పలు డొంకలను తప్పించుకుంటూ దూసుకుపోతున్నారు. డోలీకి పక్కగా సోము అమ్మ నారమ్మ కంగారుగా నడుస్తోంది. ఏ క్షణంలో గుర్రప్పొచ్చి తమను అడ్డుకుంటాడోనని ఆమె భయపడుతోంది. మరోపక్క సిసిరిని ఆపదనుంచి గట్టెక్కించమని కొండదేవతకు పదేపదే మొరపెట్టుకుంటోంది. సిసిరి మూలుగు తప్ప మరే శబ్దమూలేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప, సోము హఠాత్తుగా ఆగిపోయారు. ఓ అమ్ము వారిపక్క నుంచి రివ్వున దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్విచెట్టుకు గుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూసి హడలిపోయారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది. అల్లంత దూరంలో గుర్రప్ప, విల్లంబులు పట్టుకుని, గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నప్ప, సోము జడుసుకుని డోలీని కిందకు దించారు. గుర్రప్ప వస్తూనే కన్నప్పను మెడపట్టుకొని పక్కనున్న డొంకలోకి తోసేశాడు. నారమ్మ వైపు కొరకొర చూసి బండబూతులు తిట్టాడు. సోమును పట్టుకొని చెంపలు వాయించేశాడు. ‘ఏరా గుంటనాయాల... గూడెం కట్టుబాటును దప్పే దయిర్యం వొచ్చేసిందన్న మాట నీకు’ అంటూ నిప్పులు కక్కాడు. సోము గుర్రప్ప కాళ్ళమీద పడిపోయాడు ‘నీకు దన్నం పెడత గుర్రప్ప. సిసిరికి వయిద్యమందకబోతే సచ్చిపోద్ది. ఈ పాలికి మా తొప్పుకాసి ఒగ్గియ్యి’ అంటూ. ‘ఒగ్గియ్యిడానికేట్ర... మామంత పరుగు పరుగునొచ్చింది? ఆసారం కాపాడుకోటానికి’ గుర్రప్ప కోపంగా అన్నాడు. సోము ధైర్యం కూడగట్టుకొని ‘ మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు. కాలం మారినది గుర్రప్ప. దిగువున సాన గూడేలు మార్నయి. మనము మారదం’ అన్నాడు. ‘గుంటడు సెప్పే కొబుర్లు ఇనీడానికి నానేమి ఎర్రి మేకనుగాదు, మేకల్ని నమిలేసే పెద్దపులిని! గూడెం పెద్దగ ఆసారాన్ని రచ్చించడం కోసరం ఎంతకైన తెగిత్తను.’ డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి.. ‘గుర్రప్ప... కోపమిడిసి సాంతంగ ఆలోసించు. ఇంతవొరకు ఆసారం కోసరం ఎందరో ఆడకూతుర్ల ఉసురోసుకున్నం. పురుడు రాక గిలగిలకొట్టుకుంతున్న సిసిరిని బతికించుకుందం. కూస్త పెద్దమనుసు సేసుకుని మమ్ము ఆసుపెత్రికి అంపు’ బతిమాలుతూ అన్నాడు. ‘అరే కన్నప్ప... ఉప్పుడువొరకు కట్టుబాట్లకు అడ్డుసెప్పని నువ్వు, నీవొరకు వొచ్చేసరికి ఆటిని దప్పమంతన్నవు. నీకో నాయం, మరోల్లకింకో నాయం సేయమంతున్నవు? ఇలగయితే రేపు మరోడు మరో ఆసారం దప్పుతడు. అప్పుడు గూడ నాను సూస్తు కూకోవల? గూడెం ఆసారాలు, కట్టుబాట్లు అందరు ఆచెరించాల్సిందే!’ అన్నాడు గుర్రప్ప కళ్ళెర్రజేసి. మంచు క్రమంగా తొలగిపోతోంది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి విచ్చుకుంటున్నాయి. ప్రసవ వేదనతో సిసిరి గింజుకుంటోంది. గుర్రప్ప సిసిరిని సమీపించి ‘నొప్పులోర్సుకుని కులదేవతకు మొక్కుకోయే. నీకేటిగాదు’ అంటూ ధైర్యం చెప్పి, డోలీని కీడు గుడిసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు. వారు డోలీని భుజాలకెత్తుకుంటుంటే సోము, కన్నప్ప ఏడుస్తూ అడ్డుపడ్డారు. వారిని అక్కడున్న మగోళ్ళు తలోమాటతో దూషిస్తూ పక్కకు లాగారు. ఆడోళ్ళు చోద్యం చూస్తూ నిల్చున్నారు. అంతలో ఆ ఆడోళ్ళ మధ్యనున్న గుర్రప్ప పెళ్ళాం చుక్కమ్మ, జుట్టు విరబోసుకుని గట్టిగా అరుస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఆమెకు తమ కులదేవత పూనిందని, ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు. ఆమె తల గుండ్రంగా ఊపుతూ, రాగాలు తీస్తూ ‘నాను కొండదేవతన్రో గుర్రప్ప... నువ్వు తొప్పు సేత్తున్నవ్రో... తొప్పు సేత్తున్నవు’ అంటూ గుర్రప్పను వేపకొమ్మలతో కొడుతోంది. ఆడోళ్ళు చుక్కమ్మను గట్టిగా పట్టుకుని ‘తల్లీ... అమ్మా... తొప్పేటో సెప్పు తల్లీ. సెప్పు...’ అని అడుగుతున్నారు. చుక్కమ్మ రౌద్రంగా మొహంపెట్టి ‘సిసిరి నా బిడ్డరో బిడ్డ. అది పాపం పున్నెం దెలీని పిల్లరో... అది గూడేనికి ఎలుగురో... దాని కడుపులో బిడ్డ అడ్డం దిరిగినదిరో... దాన్ని ఆసుపెత్రికి దీసుకుబోనివ్వడ్రో... అది సస్తే గూడేనికి సేటుకాలమొస్తదిరో... గూడెం వొల్లకాడవుద్దిరో... నా మాటినికొండ్రో...’ అంటూ రాగాలు తీసి చెప్తూ, హఠాత్తుగా సొమ్మసిల్లి కింద పడిపోయింది. అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు. ఏనాడూ చుక్కమ్మ మీదకు రాని కులదేవత, ఇప్పుడిలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిసిరి చచ్చిపోతే గూడేనికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు. గుర్రప్ప తెగ భయపడిపోయాడు. ఆకాశంలోకి చూసి దండం పెడుతూ ‘తప్పైపోనది, సెమించు తల్లీ... గూడెమ్మీద గుర్రెట్టుకోకు. దయిసూపు తల్లీ... నువ్వు సెప్పినట్టే సిసిరిని ఆసుపెత్రికి దీస్కుబోతం’ అని లెంపలేసుకున్నాడు. సిసిరిని ఆసుపత్రికి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. అంతే.. సోము, కన్నప్ప వేగంగా కదిలి డోలీని భుజాలకెత్తుకొని పరుగందుకున్నారు. నారమ్మతోపాటు గూడెంలోని కొందరు .. సాయంగా డోలీవెంట నడిచారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సిసిరిని చేర్చారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించారు. ఆపరేషన్ చేసి, తల్లీబిడ్డను కాపాడారు. చలికాలం గడిచి, ఎండాకాలం ఆఖరుకొచ్చింది.. ఓ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చుని, మూడ్రోజుల కిందట కీడు గుడిసెకెళ్లిన సిసిరికోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి తలారా స్నానంచేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది సిసిరి. సోము పక్కన కూర్చుని ‘ఎవురుతోటి సెప్పనంటే నీకో రహస్యెం సెప్పుతను!’ అంది నెమ్మదిగా. ‘సెప్పనుగనీ ఏటా రహస్యెం?’ అడిగాడు ఆత్రుతగా సోము. ‘సుక్కమ్మ నిన్న కీడు గుడిసెకొచ్చినది. ఎవురుతోటి సెప్పొద్దని రేత్రి ఓ రహస్యెం సెవినేసింది. ఆ రోజున సుక్కమ్మమీదన నిజెంగ కొండదేవత పూన్లేదంట. నా పేనాలుగాపాడానికి ఇంకో మార్గంనేక దేవతకు సెమాపన సెప్పి అట్టా నాటకమాడినదంట. ఇన్నాక నా కల్లమ్మట నీల్లొచ్చిసినయి. సుక్కమ్మ కాల్లమీద పడిపోనను’ చెప్పింది ఉద్విగ్నంగా. అది విని సోము ఆశ్చర్యపోయాడు. చుక్కమ్మ చేసిన సాయానికి అతడి మనసు పులకించింది. గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢాచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. సిసిరి ఒళ్ళోని బిడ్డను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ‘సిట్టితల్లీ... మీయమ్మడుతున్న ఇక్కట్లు సూసి, ఆడబుట్టుక బుట్టినానని బెంగెట్టుకోకు... నువ్వు పెద్దయ్యేసెరికి యీ ఆసారాలేం వుండవునే. గూడెం పెద్దతోనే కీడు గుడిసెకు అగ్గెట్టేసే రోజు తొందర్లోనే వస్తది. ఆ రోజు కోసరం నాను పోరాడతనేవుంట’ అన్నాడు దృఢంగా, ఆశగా. ఆ చంటిబిడ్డకు ఏమర్థమయిందో తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది. -బొడ్డేడ బలరామస్వామి -
మహమ్మద్ పీటర్ శాస్త్రి.. ఈ వారం కథ
సూరీడుతో పాటు ఓ వార్త భళ్లుమనడంతో... తెల్లారింది. పేపర్ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద ఫొటోలతో ప్రత్యక్షమయ్యాడు ... మహమ్మద్ పీటర్ శాస్త్రి. టీవీలో ప్రతీ చానల్లోనూ సెంటరాఫ్ అట్రాక్షన్ ... మహమ్మద్ పీటర్ శాస్త్రి. వాట్సప్ గ్రూపుల్లోనూ అదే పేరు కూస్తోంది. కానీ నాకే ఆ వార్తలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆ న్యూసు నాన్సెన్సులా వినిపిస్తోంది. ‘ఏవండోయ్.. విన్నారా.. మీ ఫ్రెండు పీటర్ శాస్త్రి ఏం చేశాడో...’ ఆనందాన్ని నటిస్తూ, అసూయని లోలోపల దాచేస్తూ.. అయోమయంగా అంది మా ఆవిడ. మహహ్మద్... పీటర్.... శాస్త్రి... వాడు నా ఫ్రెండా... శత్రువా..? ఫ్రెండే అయితే... వాడి పేరు చెప్పగానే ఎందుకు మనసు కుతకుత లాడుతోంది? శత్రువు అయితే వాడెప్పుడు ఏం చేస్తాడో తెలుసుకోవాలన్న ఆత్రుత ఎందుకు పెరుగుతూ పోతుంటుంది? పేపర్లో హెడ్డింగులు బ్లరైపోయి, టీవీలో వార్తలు సైడైపోయి... ఇప్పుడు నా మనసంతా పీటర్ శాస్త్రినే ఆక్రమించుకున్నాడు.. నన్నో నలభై ఏళ్లు వెనక్కి లాక్కెళ్లాడు. అప్పుడు నాకు పద్నాలుగేళ్లుంటాయేమో..! ఇప్పటిలా కాదు కానీ... ఆరోజు భళ్లుమనకుండానే తెల్లారింది. లేచిన వెంటనే తూర్పు వైపున్న కిటికీ తెరిచి ఉదయాల్ని కళ్లార్పకుండా చూడడం నా అలవాటు. ఇంటి పక్కనే ఓ వేప చెట్టు ఉంది. వేప చెట్టు గాలి ఒంటికి మంచిదని నాన్న చెప్పేవాడు. ఆరోజూ అలానే పచ్చటి గాలి కోసం కిటికీ తెరిస్తే... సూరీడితో పాటు చురుక్కుమనే శాల్తీ ఒకడు కనిపించాడు. అప్పటి నుంచి ప్రతీసారీ... వాడివైపు చూస్తూనే ఉన్నాను. నేను చూడడం కాదు. వాడే నా చూపుల్నీ, ఆలోచనల్నీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. వాడికీ నా అంత వయసుంటుంది. సన్నగా రివటలా ఉన్నాడు. ఒంటిమీద చొక్కా లేదు. పొట్ట లోపలకు వెళ్లిపోవడం వల్ల మొలతాడు వదులయ్యిందేమో.. మాటి మాటికీ నిక్కరు జారిపోతూ ఉంది. ఆ వేప చెట్టు అరుగున.. అట్ట ముక్కల్ని పేర్చి, కొబ్బరాకులు అమర్చి.. ఓ కుటీరంలా మారుస్తున్నాడు. పొద్దుట నుంచి కష్టపడుతున్నాడనడానికి సాక్ష్యంలా.. ఒంటి మీద నుంచి చెమట ధారలా కారుతోంది. వాడెవడో, వేప చెట్టు కింద ఏం చేస్తున్నాడో... తెలుసుకోవాలనిపించింది. ‘ఏరా.. పొద్దుటే ఎక్కడికి.... పళ్లు కూడా తోముకోకుండా..’ అంటూ అమ్మ అడ్డు పడుతున్నా పరుగున వెళ్లా. ‘ఏయ్.. ఎవడ్రా నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావ్?’ పెద్ద మనిషి తరహాలో గొంతు పెంచి అడిగా. ఓ కొబ్బరాకు భుజాన వేసుకుని... నా వైపు నవ్వుతూ చూశాడు. ‘ఏం చేస్తున్నావ్.. అని అడుగుతున్నా..’ ‘ఇల్లు కడుతున్నానండీ...’ మళ్లీ అదే నవ్వు. ‘ఇల్లా.. ఎందుకు? నువ్విక్కడ ఉంటావా..?’ ‘ఆయ్.. ప్రెసిడెంటు గారిని అడిగానండీ.. ఇక్కడ ఉండు పర్లేదు అన్నారండీ.. ఇక నుంచి ఇదే నా ఇల్లు..’ నాకేం అర్థం కాలేదు. రెండు అట్టముక్కలు పేర్చి.. దానిపై కొబ్బరాకులు పడేస్తే ఇల్లయిపోతుందా..? మా ఇంటివైపు చూశా. విశాలమైన ఆరు గదుల పెంకుటిల్లు. ఎంచక్కా మా చుట్టాలంతా వచ్చినా... ఇంకో గది ఖాళీగానే ఉంటుంది. ఇల్లంటే అది. వీడేంటి..? దీన్ని పట్టుకుని ఇల్లంటాడేంటి? ‘ఇంతకీ నీ పేరేంటి..?’ ‘మహమ్మద్ పీటర్ శాస్త్రి..’ అంత విచిత్రమైన పేరు వినడం అదే మొదటి సారి. చనిపోయేలోగా మళ్లీ ఇలాంటి పేరు వినను కూడా. అది నాకు గ్యారెంటీగా తెలుసు. అప్పటి నుంచీ ఆ పేరు నా చెవిలో మార్మోగుతూనే ఉంది. ‘మహమ్మద్ పీటర్ శాస్త్రా..’ ‘అవునండీ.. నేనే పెట్టుకున్నానండీ..’ ‘నువ్వు పెట్టుకోవడం ఏమిటి? అమ్మానాన్న పెడతారు కదా..’ ‘నాకు అమ్మా నాన్న లేరండీ..’ ఆ మాట అనగానే నాక్కొంచెం జాలేసింది. నేను వాడి మీద జాలిపడడం అదే మొదటి సారి.. అదే చివరి సారి. అయినా వీడిమీద జాలెయ్యడం ఏమిటి.. ఛీఛీ అనుకుని జాలిపడడం మానేశా. అదేంటో అప్పటి నుంచీ.. ఎవ్వరిపైనా జాలి కలగడం లేదు. ‘అదేం పేరు..?’ ‘యాండీ.. బాగుంది కదా..?’అనేసి మళ్లీ తన పనిలో పడిపోయాడు. ‘నాకెవరూ లేరు కదండీ.. ఎక్కడికి వెళ్లినా.. నీ పేరేంటి? నీ పేరేంటి? అనే అడుగుతున్నారండీ.. ఏం పేరు పెట్టుకోవాలో తెలీక ఇలా పెట్టేసుకున్నానండీ..’ తను మాట్లాడుతూనే పని చేసుకుంటున్నాడు. పని చేస్తూనే మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఓ చిన్న ఇల్లు తయారైపోయింది. పక్కింటి రత్తమ్మత్త, వాళ్లింట్లో పనిచేసే ముత్యాలు... నోరెళ్లబెట్టుకుంటూ వచ్చేశారు. ‘ఓరి భడవా... భలే కట్టేశావురా.. అట్టముక్కల ఇల్లు..’ అంది రత్తమ్మత్త మెచ్చుకోలుగా. ‘మాకోగది అద్దికిస్తావేంటబ్బాయ్...’ అని ముత్యాలు నవ్వేసింది. ‘అమ్మా – నాన్న లేరటగా.. ఇంత చిన్న వయసులో ఎంత కష్టమొచ్చిందయ్యా... సర్లే పనయ్యాక.. ఇంటికి రా... అట్టు ముక్క పెడతా. కొబ్బరి పచ్చడితో తిందువు గానీ’ అంది రత్తమ్మత్త. ‘వస్తాను గానండీ.. నాకేదైనా పని చెప్పండి. చేస్తా.. ఊరికనే అట్టు ముక్కొదు..’ ‘ఆత్మాభిమానం ఎక్కువే పిలగాడికి.. సరేలే.. దొడ్లో డొక్కలున్నాయి... ఎండకేద్దువు గానీ.. రా..’ అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ వెనకే ముత్యాలు కూడా. ‘ఆత్మాభిమానం...’ ఈ మాట కూడా నేను మొదటిసారే విన్నా. కానీ... అప్పటి నుంచీ ఆ మాటకు మహమ్మద్ పీటర్ శాస్త్రి కేరాఫ్ అడ్రస్సయిపోతాడని ఆ సమయంలో నాకు తెలీదు. మహమ్మద్ పీటర్ శాస్త్రి అనేవాడు ఒకడొచ్చాడని... వాడు వేప చెట్టుకింద ఇల్లే కట్టేశాడన్న సంగతి ఊరంతటికీ తెలిసిపోయింది. ‘ఆడెవడో, ఎక్కడ్నుంచి వచ్చాడో తెలీకుండా.. అక్కడ చోటెందుకు ఇచ్చారు’ ‘ప్రెసిడెంటు గారు మంచి పనే చేశార్లే’ ‘అలాంటోళ్లని చేరనివ్వకూడదండీ..’ ఇలా తలో మాట. కానీ అందరూ అవాక్కయిన మూకుమ్మడి విషయం... ఆ పేరు. ‘మూడు మతాల్నీ చుట్టగా చుట్టి తన పేరుకి కట్టేశాడు’ అని నాలానే అంతా నవ్వుకుంటూ ఆశ్చర్యపోయారు. వాడి పేరే కాదు.. తీరు ఇంకా గమ్మత్తుగా ఉండేది. పొద్దుటే లేచి సూర్య నమస్కారాలు చేసేవాడు. ఆ పక్కనే రాములోరి గుళ్లో ప్రవచనాలు చెబుతుంటే.. వాలిపోయి ‘ఊ’ కొట్టేవాడు. అయిదు పూటలా నమాజ్ చదివేవాడు. ఆదివారమైతే చర్చి వదిలేవాడే కాదు. ఎనిమిదో తరగతి చదువుతూ.. చుట్టుపక్కల ఏడో తరగతి వరకూ పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ‘ఈ పూట మా ఇంట్లో భోంచేద్దువు గానీ..’ అని ఎవరు ఎంత బలవంతం పెట్టినా, ‘ఏదైనా పన్జెప్పండి.. అప్పుడు తింటా’ అనేవాడు. బజారుకెళ్లి సరుకులు తెచ్చేవాడు. పాలు పితికే వాడు. పేడ పిసికి పిడకలు కొట్టేవాడు. వాడు చేయని, వాడికి చేతకాని పనంటూ ఉండేది కాదు. ఒక్కోసారి అలానే ఖాళీ కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకునేవాడు. ‘ఏరా... భోం చేశావా...’అని ఎవరైనా అడిగితే... ‘రత్తమ్మత్త నూతిలో నీళ్లు తీయగుంటాయని అందరూ చెబితే నమ్మలేదండీ.. నిజంగా ఎంత తీపో.. తాగుతూనే ఉన్నా. అలా... రెండు చేదల నీళ్లు తాగానా..అంతే... కడుపు నిండిపోయిందండీ..’ అని ఆకలికి కూడా రంగులద్ది.. సీతాకోక చిలుకలా ఎగరనిచ్చేవాడు. పేదరికాన్ని కూడా పండగలా చేసుకునేవాడు. ‘చూడ్రా ఆ శాస్త్రి.. ఎంత బుద్ధిగా చదువుకుంటున్నాడో.. చూసి నేర్చుకోరా..’ అని అమ్మ ఎప్పుడూ నన్నే తిట్టేది. నా దగ్గర కొత్త కొత్త పుస్తకాలు, ఖరీదైన పెన్నులూ ఉండేవి. వాడి దగ్గర చదువుండేది. నేను సైకిలు కొనుక్కొని, తొక్కుతుంటే రాని ఆనందం.. వాడు టైరాట ఆడుతూ అలిసిపోయినప్పుడు చూశాను. ఆ అట్టపెట్టెల ఇంట్లో కాలు మీద కాలేసుకుని.. కొబ్బరాకుల సందుల్లోంచి ఆకాశం వైపు చూస్తూ.. నవ్వుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటుంటే.. మా ఆరుగదుల పెంకుటిల్లు కూడా ఇరుగ్గా అనిపించేది. అదేంటో గానీ.. వాడి పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు చెరిగేది కాదు. ‘నువ్వెప్పుడూ బాధపడవా...’ అడిగానోసారి. ‘బాధ పడకూడదండీ... పడితే పడిపోయినట్టేనండీ... మళ్లీ లెగమండీ.. అలాంటప్పుడు ఎందుకు బాధ పడాలండీ. కష్టాలేం చుట్టాలు కాదండీ. బొట్టు పెట్టి రమ్మనడానికి. అయినా నాకు చుట్టాలూ లేరండీ.. కష్టాలూ వద్దండీ..’ అంటూ బరువైన మాటల్ని తేలిగ్గా చెప్పేసేవాడు. ఎందుకో పిల్లలంతా వాడి వెనకే ఉండేవాళ్లు. అది నాకు సుతరామూ నచ్చేది కాదు. చాక్లెట్లు, బిస్కెట్లు, పుల్లయిసులూ.. పిప్పరమెంట్లూ.. ఇచ్చి వాళ్లందరినీ మచ్చిక చేసుకుందామనుకునేవాడ్ని. కానీ వాడు.. పచ్చి మామిడిని సన్నగా తరిగి.. ఉప్పు కారం చల్లి.. తీసుకొచ్చేవాడు. నేరేడు పళ్లు కోసుకొచ్చేవాడు. రేగుపళ్లు, ఉసిరి కాయలైతే సరే సరి. వాడికంటూ మిగుల్చుకోకుండా అందరికీ పంచేవాడు. అందుకే అందరికీ ఫ్రెండయిపోయాడు. నాకు తప్ప. ఏళ్లు గడుస్తున్నాయి.. వాడూ పాతుకుపోతున్నాడు. ఆ వేప చెట్టుకంటే విశాలంగా విస్తరిస్తున్నాడు. వాడిమీద ఒక్కసారైనా గెలవాలని ఉండేది. వాడి దగ్గర లేనిది.. నా దగ్గర ఉన్నది డబ్బొక్కటే. దాంతో గెలిస్తే..? దీపావళి వచ్చింది. పీటర్ శాస్త్రిని ఓడించేందుకు ఇదే తగిన అవకాశం. నాన్న దగ్గర అరచి గోల పెట్టి మరీ... డబ్బులు లాక్కొన్నా. డిబ్బీ పగలగొట్టా. బజారుకు వెళ్లి.. ఓ బస్తాడు బాణసంచా కొనుక్కొచ్చా. కాకరపువ్వొత్తులు, మతాబులు, లక్ష్మీ బాంబులు ఒక్కటేంటి..? ఓ దుకాణమే నా దగ్గరుంది. వాడి దగ్గరేముంది..? వెళ్లి చూస్తే.. తాటాకులు తెంపుతూ, పేపర్లు చిన్నగా చింపుతూ కనిపించాడు. ‘ఏం చేస్తావ్ వాటితో..’ ‘ఈ తాటాకులతో పెటేపు కాయలు..ఈ కాగితాలేమో సిసింద్రీల కోసం’ ‘ఓస్ అంతేనా.. నా దగ్గర బోలెడన్ని సరుకులున్నాయి..’ అని సంబరపడుతూ ఇంటికొచ్చేశా. అరగంటలో.. అన్నీ ఊది పడేశా. ‘కొన్నయినా దాచుకోరా.. నాగుల చవితికి కాల్చుకుందువు గానీ...’ అని అమ్మ అన్నా వినిపించుకోలేదు. కానీ.. ఎందుకో ఏ ఆనందమూ లేదు. పీటర్ శాస్త్రి గుర్తొచ్చాడు. కిటికీ తలుపు తెరచుకొంది. నిప్పుల్లో కాలిన కొబ్బరి డొక్కని బాగా ఊది, పెటేపు కాయ ఒత్తి వెలిగాక.. దూరంగా విసిరేస్తున్నాడు. ఆ శబ్దానికి వీధి వీధింతా... దద్దరిల్లుతోంది. ‘పీటర్ శాస్త్రి పెటేపు కాయలు బాగా పేల్తున్నాయ్రోయ్’ అంటూ చుట్టుపక్కల పిల్లలంతా వాడి దగ్గరకు చేరిపోయారు. వచ్చినవాళ్లందరికీ తన దగ్గరున్న పెటేపుకాయలు కట్టలు కట్టలుగా పంచుతూనే ఉన్నాడు. సిసింద్రీలు నేలమీద దూసుకుపోతున్నాయి. పిల్లలంతా గాల్లో ఎగురుతున్నారు. అప్పుడు అనిపించింది. పండగంటే – పంచుకునేది. కొనుక్కొని దాచుకొనేది కాదు అని. ఈసారీ వాడే గెలిచాడు. దీపావళే కాదు.. అన్ని పండుగలూ అంతే. ప్రతీ పండక్కీ నా దగ్గర కొత్త బట్టలు మాత్రమే ఉండేవి. వాడు మనిషే కొత్తగా కనిపించేవాడు. రంజాన్‌కి పూర్ణాలు పంచిపెట్టేవాడు. క్రిస్మస్కి పులిహోర చేసేవాడు. శ్రీరామనవమికి సేమ్యా. తీసుకొనేటప్పుడు పడే ఇబ్బంది.. ఇచ్చే దగ్గర వచ్చేది కాదు. ‘రేపటికి ఉంచుకోవచ్చుగా.. ఎందుకు ఈరోజే ఖర్చు పెట్టేసుకుంటావ్..’ అని ఎవరైనా అంటే.. ‘ఈరోజు హాయిగా గడిచిపోతోంది కదండీ.. రేపు ఎలాగూ సంపాదించుకుంటా కదా..’ అనేవాడు. వాడి కష్టమ్మీద వాడికంత నమ్మకం. ‘పెద్దయ్యాక ఏం చేస్తావ్..’ ‘బాగా కష్టపడి.. డబ్బులు సంపాదిస్తానండీ.. సంపాదించి.. మళ్లీ అందరికీ పంచిపెట్టేస్తానండీ.. మళ్లీ ఇదిగో ఈ చెట్టుకిందకే వచ్చేస్తానండీ..’ ‘సంపాదించడం ఎందుకు.... అదంతా మళ్లీ ఇచ్చేయడం ఎందుకు?’ ‘మరి దాచుకోడానికేంటండీ... దాచుకుని ఏం చేస్తామండీ.. నా చేతిలో డబ్బులుంటే నేను బాగుంటానండీ. అదే పంచేస్తే.. అందరూ బాగుంటారండీ. అయినా డబ్బుంటే సుఖాలుంటాయండీ.. అనుభవాలు ఉండవండీ. నా దగ్గర ఏమీ లేనప్పుడు రూపాయి సంపాదించినా ఆనందంగానే ఉంటుందండీ.. లక్ష రూపాయలు ఉంటే, మరో లక్ష సంపాదించినా.. తృప్తి ఉండదండీ.. ఏమీ లేకపోవడంలోనే ఎంతో ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుందండీ..’ ‘అంతా ఇలానే చెబుతారు’ ‘నేనలా కాదండీ.. అయినా మీరే చూస్తారుగా..’ ఓసారి రత్తమ్మత్త ఆ అట్టముక్కల ఇంట్లోకెళ్లి రావడం చూశాన్నేను. అప్పుడు... శాస్త్రి లేడు. ‘ఏంటత్తా... గాలి ఇటు మళ్లింది.. శాస్త్రి లేడు కదా.. లోపల ఏం చేస్తున్నావ్...’ అంటూ ఆరా తీశా. ‘ఓ అదా.. పొద్దుట కొబ్బరుండలు చేశా.. వాడికి అవంటే చాలా ఇష్టం. కుర్ర సన్నాసి.. చేతికిస్తే తీసుకోడు.. ‘‘ఏదైనా పని చెప్పత్తా..’’ అంటాడు.. చదువుకునే కుర్రాడు. ఇంటి పని, దొడ్డి పనీ చేస్తుంటే మనసు అదోలా ఉంటుంద్రా.. అందుకే.. వాడు లేనప్పుడు... ఇంట్లో పెట్టి వచ్చేశా.. వెధవ.. ఇవి కూడా తినడు.. ఎవరికో ఒకరికి పంచేస్తాడు. అయినా వాడేం పిల్లాడో.. ఇంత చిన్న వయసులోనే ఇవ్వడం నేర్చేసుకున్నాడు. ఇన్నేళ్లొచ్చినా.. అదేమిటో నాకింకా అర్థమే కాలేదు..’ ‘అయినా శాస్త్రంటే.. మా దొడ్డ ఇష్టం కదా..’ కుళ్లుకుంటూనే అడిగా. కానీ అత్త అది గమనించలేదు. ‘నాదేముందిరా.. మనుషుల్ని ఇష్టపడడంలో వాడి తరవాతే ఎవరైనా. వాడికంటే చిన్నవాళ్లనైనా..‘‘ మీరు.. అండీ..’’ అంటూ మర్యాదగా పిలుస్తాడెందుకో తెలుసా? అది నీమీదో, నామీదో ఉన్న ఇష్టం కాదు. వాడికి మొత్తంగా మనుషులంటేనే ఇష్టం.. పిచ్చి. మొన్న నాకు మశూచి వచ్చిందా.. ఎన్ని సేవలు చేశాడో. అరె.. ఇది అంటు వ్యాధిరా.. వద్దురా.. అన్నా వినలేదు. ఆఖరికి మా ఆయన కూడా.. నేనున్న గదికి వచ్చేవాడు కాదు.. వాడొచ్చాడు.. ‘‘అత్తా.. అత్తా’’ అంటూనే ఓ అమ్మలా సేవ చేశాడు.. ఏమిచ్చి.. వాడి రుణం తీర్చుకోను..’ అత్త కళ్లల్లో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయ్. ‘మహమ్మద్ పీటర్ శాస్త్రి.. అని పెట్టుకున్నాడు గానీ... వాడికి ఏ మతం అంటలేదు. మనిషే గట్టిగా అంటేసుకున్నాడు.. అందుకే మనుషుల్ని వాడలా ప్రేమిస్తూనే ఉంటాడు.. నిజంగా వాడికి అమ్మనైపోతే బాగుంటుంది అనిపిస్తుందిరా... ఉత్తినే అన్నం పెట్టినా తీసుకోనోడు... ఏకంగా అమ్మనైపోతానంటే.. ఒప్పుకుంటాడా.. దానికీ అదృష్టం ఉండొద్దూ..’ అని చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ మాట చెప్పింది. ‘చాలా మంది దగ్గర డబ్బుంటుందిరా.. అదొక్కటే ఉంటుంది. కానీ వాడి దగ్గర డబ్బు మాత్రమే లేదు.. అన్నీ ఉన్నాయ్’ ఆ మాటెందుకో నాకు చురుక్కున తగిలింది. పదో తరగతిలో వాడే ఫస్టు. ఇంటర్‌లోనూ అంతే. అన్నింటా వాడే. వాడికి తెలియని సబ్జెక్టు లేదు. వాడి మేధస్సుకి తలొంచని డిగ్రీ లేదు. డబ్బే డబ్బుని కూడబెడుతుందటారు. అలానే వాడి చదువే వాడ్ని చదివించింది. స్కాలర్షిప్పులు తెచ్చుకున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు. కంపెనీలు పెట్టాడు. కోటాను కోట్లు సంపాదించాడు. అంతా చేసి.. ఇంతా సంపాదించి.. మొత్తం.. మళ్లీ పేద ప్రజలకు విరాళంగా రాసిచ్చేశాడు. ఒక్క పైసా.. ఒక్క పైసా కూడా తన దగ్గర ఉంచుకోలేదు. తన ఆస్తినంతా పేదలకు ధారాదత్తం చేసిన మహోన్నతుడిగా.. ప్రపంచం మొత్తం పీటర్ శాస్త్రిని కీర్తిస్తోందిప్పుడు. ‘ఆఖరికి మీ సొంతిల్లు కూడా డొనేట్ చేసేశారు. ఇప్పుడు ఎక్కడుంటారు?’ టీవీ చానల్ రిపోర్టర్ అడుగుతున్నాడు. ‘నా జీవితం.. ఓ వేప చెట్టుకింద.. అట్ట పెట్టెల ఇంట్లో మొదలైంది.. ఇప్పుడు అక్కడికే వెళ్లిపోతున్నా.. అక్కడ నా స్నేహితుడు ఒకడు నా కోసం ఎదురు చూస్తుంటాడు..’ అని నవ్వుతూ నమస్కారం పెట్టాడు మహహ్మద్ పీటర్ శాస్త్రి. పద్నాలుగేళ్ల వయసులో నేను చూసినప్పటి నవ్వది. ఇంకా చెక్కు చెదరలేదు. ఆ స్వచ్ఛత ఎక్కడికీ పోలేదు. నాకు తెలుసు. ఇంకో వందేళ్లయినా అది వాడ్ని విడిచిపెట్టి పోదు. మేడల్లో మిద్దెల్లో, ఏసీ రూముల్లో వాడెంత సంతోషంగా గడిపాడో నాకు తెలీదు. కానీ ఈ చెట్టు కింద వాడింకా ఆనందంగా బతికేస్తాడు. టీవీ ఆఫ్ చేసి.. కిటికీ తలుపు తెరిచాను. వేప చెట్టు అలానే.. దృఢంగా నిలబడి మహ్మద్ పీటర్ శాస్త్రి కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వాడికీ నాకూ ఉన్న తేడా నాకు మరోసారి తెలిసొచ్చింది. సంపాదించింది వదలుకోవడానికి ఆకాశమంత మనసు కావాలి. జీవితం మొదలెట్టిన చోటికే మళ్లీ రావడానికి ధైర్యం ఉండాలి. పరుగు ఎక్కడ మొదలెట్టాలో కాదు. ఎక్కడ ఆపాలో తెలిసుండాలి. ఇవన్నీ పీటర్ శాస్త్రి చేసేశాడు. అన్నట్టే మళ్లీ ఇక్కడకి తిరిగి వస్తున్నాడు. ఈసారి ఇంకెన్ని పాఠాలు నేర్పుతాడో.. ఇంకెన్ని అనుభవాలు అందిస్తాడో..? -మహమ్మద్ అన్వర్ -
ఈవారం కథ
నిజానికి పుస్తకాలు చదవడం ఎంత గొప్ప అలవాటు! ఓ మనిషి ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా మంచి పుస్తకాలు ప్రేరేపిస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న ఎంతోమంది పుస్తకప్రియులే! ఇదంతా తెలిసి కూడాలక్షల మంది ఒకప్పటి తెలుగు పాఠకులు ఇప్పుడు ప్రేక్షకులుగా మారి ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నామనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. రాబోయే తరాన్ని కూడా పాడుచేస్తున్నారు. విమాన ప్రయాణం అంటే నాకు చాలా విసుగు. ఏ పనీపాటా లేనట్టుగా గంట ముందుగా విమానాశ్రయం చేరుకోవటం, మార్నింగ్ వాక్‌కి వచ్చినట్టుగా లోపల నడవడం, చాంతాడంత క్యూలో నుంచొని బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెకిన్ చేయించుకోవటం, ఒళ్ళంతా తడిమించుకొని సెక్యూరిటీ చెక్ దాటడం, ఆ తర్వాత బందరు బస్టాండ్‌లో బస్ కోసం నుంచున్నట్టుగా నుంచొని ఎయిర్ పోర్ట్ బస్ ఎక్కి మళ్ళీ దిగి విమానంలోకి ఎక్కడం. ఇదంతా ఓ పీడలాగా అనిపిస్తుంది నాకు. ఆ రోజు కూడా అలాగే అనిపించేదే ఆ మనిషి నాకు కనబడక పోయుంటే! ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్నాను ఆ రోజు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాను కిందటి రోజే. పని చూసుకొని అక్కడనుంచి ముంబైలో ఉంటున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ విమాన ప్రయాణమే చాలా బోరు అనుకున్నాను. బోర్డింగ్ పాస్ కోసం క్యూలో నుంచొని ఉండగా కనిపించాడతను. నా కంటే కొంచెం ముందున్నాడు క్యూలో. మంచి ఎత్తు, అందుకు తగ్గ లావు. యాభై ఏళ్ల పైనే ఉంటాడు. ఫుల్ సూట్లో అందంగా ఉన్నాడు. అయితే నన్ను ఆకర్షించింది మాత్రం అతని చేతిలో ఉన్న ఓ లెదర్ బేగ్, దాని సైడ్ అరలోంచి బయటకు తొంగి చూస్తున్న ఓ తెలుగు నవల! ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో తెలుగు నవలలు చదివే పాఠకులు ఒకప్పుడు తెలుగులో ఉన్న రచయితల కన్నా తక్కువే అనడం అతిశయోక్తే అయినా.. త్వరలోనే నిజమవుతుందేమోనని భయమేస్తూంటుంది నాకు. పాత నవలా యుగాన్ని తలచుకున్నప్పుడల్లా గుండెను ఎవరో గ్రైండర్లో పెట్టి గరగరా తిప్పినట్టుగా బాధేస్తుంది. అప్పట్లో నవలలు, సీరియల్స్ చదివే పాఠకులు కోకొల్లలుగా ఉండి వాటి గురించి గంటల తరబడి చర్చించుకునేవారు కూడా. వారం వారం సీరియల్ కోసం ఎదురుచూడటంలో ఉండే థ్రిల్ అప్పటి జనాలు బాగా ఆస్వాదించారు. తెలుగు రచయిత అంటే ఓ గొప్ప విషయంగా ఉండేది. ఆ క్రేజే వేరు! టీవీలు, అందులో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్, రియాలిటీ షోస్ లాంటివి వచ్చాక తెలుగు పాఠకులు అమాంతం తగ్గిపోయారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు కూడా గృహప్రవేశం చేశాక తెలుగు పాఠకులు అంతరించిపోవటమే కాక చాలా అరుదైన విషయంగా మారారు. అలాంటి ఈ కాలంలో తెలుగు నవల చదివే ఓ పాఠకుడు డిల్లీ విమానాశ్రయంలో కనబడడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే నేనూ ఓ తెలుగు నవలా రచయితనే! వయసు అరవై. ఆలోచనల్లోంచి తేరుకొని బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఆ పాఠక మహాశయుడు ఎక్కడున్నాడా అని కళ్ళతోనే చుట్టూ వెదికాను. దూరంగా ఉన్న రెస్ట్ రూమ్ వైపు అతను వెళ్ళటం కనిపించింది. నేనూ అటుగా అడుగులు వేశాను. ఆ పుస్తకం తెలుగు నవలే అని తెలిసింది కానీ తిరగదిప్పి ఉండటం వల్ల దాని టైటిల్ కానీ, రచయిత పేరు కానీ హడావిడిలో అర్థం కాలేదు. అసలా పుస్తకం ఏంటో, ఎవరు రాసిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి క్షణ క్షణానికీ ఎక్కువవసాగింది. కొంపదీసి అది నా పోటీ రచయితది కాదు కదా! అలాగానీ అవుతే మూడ్ అంతా పాడై చస్తుంది. ‘అసూయ’ అనేది మానవ సహజమైన లక్షణం మరి. ఏది ఏమైనా ఆ నవల ఏంటో తెలుసుకునే దాకా నాకు విముక్తి లేదు అనుకున్నాను కసిగా. రెస్ట్ రూమ్ లోపలకు వెళ్లకుండా అతని కోసం బయటే నిలబడి వేచి చూడసాగాను. రెండు నిమిషాల్లో బయటకు వచ్చాడతను. బేగ్ వైపు చూశాను వెంటనే. దురదృష్టం! పుస్తకాన్ని లోపలకు తోసేసి బేగ్ జిప్ పెట్టేశాడు. పుస్తకం పేరు చూస్తే ఓ పనైపోతుంది అనుకుంటే ఏంటిది అనిపించింది. పోనీ నేరుగా వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని ఆ పుస్తకమేంటో అడిగేస్తే? అది నేను రాసిన పుస్తకమే అయుంటుంది అని ఎక్కడో ఏదో ఆశ. అతని దగ్గరకు వెళ్లబోతూంటే మళ్ళీ ఏదో అనుమానం. తెలుగు రచనలు చదువుతాడు కాబట్టి కచ్చితంగా నా పేరు తెలిసే ఉంటుంది. పుస్తకం గురించి అడిగాక అది నేను రాసింది కాకపోతే అసహ్యంగా ఉంటుందేమో? అంతే కాక, నేను రాసిన నవల కాదు ఇంకెవరో రాసింది అని తెలిసినప్పుడు నా మొహంలో కలిగే మార్పు, అందులో కదలాడే ఈర‡్ష్యను అతను గమనించేస్తే? నేను ఫీల్ అవకుండా నా ముందు పెదాలు బిగపట్టి మనసులో మాత్రమే నవ్వుకొని పక్కకు వెళ్ళాక పగలబడి నవ్వుకుంటాడా? అన్నీ అనుమానాలే. బాగా బిజీగా, హడావిడిగా కూడా కనిపిస్తున్నాడు. ఫోన్లు వస్తున్నాయి మాటిమాటికీ. బాగా ఆలోచించి అతన్ని అడక్కుండానే అదేం నవలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. వేరే పని కూడా ఏమీ లేకపోవటంతో సరదాగా అతనికి తెలీకుండా అతన్ని ఫాలో అవసాగాను. నేను రాసిన డిటెక్టివ్ నవలల్లోని అలాంటి సన్నివేశాలు గుర్తొచ్చి నవ్వుకున్నాను. సెక్యూరిటీ చెక్ జరుగుతున్నప్పుడు కూడా నా దృష్టంతా నాకంటే ముందుగా వెళ్ళిన అతని మీదే ఉంది. ముంబై విమానం వచ్చే గేట్ దగ్గర వెయిటింగ్ ఏరియాలో ఓ ఖాళీ సీటు చూసుకొని కూర్చున్నాడతను బేగ్ ఒళ్ళో పెట్టుకొని. అతన్నే ఫాలో అవుతూ వెళ్ళిన నేను కూడా అతని పక్కనో, వెనకో కూర్చుందామని చూశాను. ఒక్క సీటుకూడా ఖాళీగా లేదు. రెండు వరసల వెనక ఓ సీటు చూసుకొని కూర్చున్నాను. నేను కూర్చున్న చోటునుంచి అతను స్పష్టంగా కనబడకపోయినా, బేగ్లోంచి పుస్తకం తీయబోతే మటుకు కదలికలవల్ల తెలిసిపోతుంది అని తృప్తిపడ్డాను. విమానం రావటానికి టైమ్ ఉండటంతో బేగ్లోంచి ఆ నవల తీసి కచ్చితంగా చదువుతాడు అని ఊహించాను. చెప్పుకోకూడదు కానీ, నేను రాసిన నవల అయితే మటుకు టైమ్ దొరికినప్పుడల్లా చదవాల్సిందే. నా రచనల్లో ఉండే ‘బిగి’అలాంటిది. నవల మొదలుపెడితే పూర్తిచేసే దాకా తోచదు. అతన్నే ఉత్సాహంగా గమనించసాగాను. రెండు నిమిషాల్లోనే నేను ఊహించినట్టుగా అతని చేయి కదిలి బేగ్ వైపు వెళ్ళింది. తల కొద్దిగా పైకెత్తి, ముందు వరసల్లో కూర్చున్న జనాల మధ్యలోంచి కూడా బాగా కనబడేలా చూడసాగాను. నవల ఉన్న సైడ్ అర జిప్ మీద మీద చేయివేశాడు. ఊపిరి బిగపట్టాను. పుస్తకం అట్ట పావు వంతు సరిగ్గా కనబడినా చాలు. నాదో కాదో తెలిసిపోతుంది. ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టుగా ఉత్కంఠగా అనిపించింది. ఇంకో అర సెకెండ్లో బేగ్ జిప్ లాగుతాడనగా అతని ఫోన్ మోగింది. బేగ్ మీదనుంచి చేయి, దృష్టి మళ్లించి ఫోన్ తీసి చూసుకున్నాడు. కాల్ కట్ చేస్తాడేమో అంత ముఖ్యమైనది కాకపోతే అని ఆశించాను. అలా జరగలేదు. ముఖ్యమైనదే అనుకుంటా కాల్ ఏక్సెప్ట్ చేసి ఓపిగ్గా మాట్లాడసాగాడు. నేనూ తీరిగ్గా అతన్ని గమనించసాగాను. కాసేపటికి అతని ఫోన్ మాట్లాడటం పూర్తయింది. ఫోన్ జేబులో పెట్టుకునేలోగా మళ్ళీ మోగింది. అయితే ఈసారి కూర్చున్న చోటునుంచి లేచి కాస్త పక్కగా పచార్లు చేస్తూ మాట్లాడసాగాడు. బేగ్ అతని సీట్లోనే ఉంది. అదృష్టవశాత్తూ అప్పటిదాకా అతని పక్కన కూర్చున్నతను కూడా లేచి వెళ్లిపోయాడు. ఆ పాఠక మహాశయుడి పక్కన కూర్చునే మంచి అవకాశం దొరికిందనుకొని గబగబా లేచి వెళ్ళి ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాను. రిలీఫ్‌గా అనిపించింది. పక్క సీట్లోనే బేగ్ ఉన్నది. పుస్తకం ఉన్న వైపే తిప్పి ఉంది. బేగ్ జిప్ లాగి ఆ పుస్తకం ఏంటో చూడాలన్న కోరిక వొద్దనుకున్నా కలిగింది. ‘ఛ! ఏంటిది? ఎవరిదో బేగ్ నేను ముట్టుకోవడమేంటి దరిద్రంగా’ అనుకున్నాను. అతను వచ్చేదాకా చూద్దాం అని అతని వైపే చూడసాగాను. ఫోన్ మాట్లాడటం అవగానే అతను సీటు దగ్గరకు రాకుండా, కొంచెం దూరంలో ఉన్న కాఫీ షాప్ వైపు వెళ్ళసాగాడు. నెమ్మదిగా చేయి బేగ్ వైపు జరిపి జిప్ లాగి పుస్తకం చూసి మళ్ళీ లోపల పెట్టేస్తే? ఇదంతా చేయడానికి రెండు మూడు క్షణాలు చాలు! ఇదేమీ దొంగతనం కాదు కదా. కాకపోతే ఆ రెండు క్షణాల్లోనే అతని చూపు బేగ్ వైపు మళ్లిందంటే అసహ్యంగా ఉంటుంది. ఆ పుస్తకం నేను రాసిందే అయితే, నేనెవరో తెలిశాక ‘ఇదేంటి ఇంత గొప్ప నవల రాసిన రచయిత ఇలా ఉన్నాడు?’ అని తక్కువగా అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాఫీ తాగుతున్న అతను దూరంగా వెనకనుంచి కనిపిస్తున్నాడు. ఇంకో అయిదు నిమిషాల్లో వచ్చేస్తాడులే అనుకొని తృప్తిపడాలని చూశాను. కుదర్లేదు. రెండు నిమిషాల తరువాత నా చేయి అతని బేగ్ మీదకు వెళ్ళింది. గబుక్కున బేగ్ జిప్ తీసి పుస్తకం బయటకు కొద్దిగా తీస్తే చాలు. జిప్ తిరిగి పెట్టకపోయినా పర్లేదు. ఓసారి చుట్టూ చూసి, ధైర్యంగా జిప్ తీయబోయాను. రాలేదు. ఇరుక్కుపోయినట్టుంది. గట్టిగా లాగాల్సి వచ్చింది. ఓ చేత్తో బేగ్ పట్టుకొని ఇంకో చేత్తో జిప్ లాగుతూండగా గరగరమని పెద్ద చప్పుడు వెనక నుంచి. ఉలిక్కిపడి కంగారుగా చేతులు వెనక్కు తీసుకున్నాను. అక్కడి గ్రౌండ్ స్టాఫ్ మైక్ సరిచూసుకున్న చప్పుడది. ముంబై వెళ్ళే విమానం బోర్డింగ్‌కు సిద్ధంగా ఉందని అనౌ¯Œ ్స చేశారు. చప్పున అతని వైపు చూశాను. కాఫీ పూర్తిచేసుకొని వడివడిగా బేగ్ వైపు రాసాగాడు. ‘ఇంకా నయం జిప్ లాగుతూ అడ్డంగా దొరికిపోలేదు’ అనుకొని సీట్లోంచి లేచి నిలబడ్డాను. అతనొచ్చే దాకా ఆగి క్యూలో అతని వెనకే నుంచున్నాను. నవల చదవనీకుండా అడ్డుపడిందని కాబోలు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తృప్తిగా అనిపించింది. ఇక అతను పుస్తకం చేతిలోకి తీసుకోవటం ఏ క్షణానైనా జరగొచ్చు. సరదాగా అతన్నే గమనించసాగాను. అతని బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపేటప్పుడు వెనకే ఉన్న నాకు అతని సీట్ నంబర్ కనిపించింది. సరిగ్గా నా వెనక వరుసలో విండో సీటు అతనిది. నాది అతనికి ముందు వరసలో విండోకి అవతల పక్క సీటు. మంచిదే అనుకున్నాను. తల కొంచెం పక్కకు తిప్పి సీటు సందులోంచి వెనక్కి చూస్తే అతను ఏం చేసేది కనిపిస్తుంది, అతనికి తెలీకుండా. ఎయిర్ బస్‌లో కూడా అతని పక్కనే నుంచున్నాను. అతనెవరో తెలీకపోయినా కేవలం పుస్తకాలు చదివే అలవాటు అతనికుంది అన్న కారణం వల్ల అతని మీద గౌరవం ఏర్పడ్డది. నిజానికి పుస్తకాలు చదవడం ఎంత గొప్ప అలవాటు! ఓ మనిషి ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా మంచి పుస్తకాలు ప్రేరేపిస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న ఎంతోమంది పుస్తకప్రియులే! ఇదంతా తెలిసి కూడాలక్షల మంది ఒకప్పటి తెలుగు పాఠకులు ఇప్పుడు ప్రేక్షకులుగా మారి ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నామనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. రాబోయే తరాన్ని కూడా పాడుచేస్తున్నారు. చదవడంలో ఉండే మాధుర్యంతో కూడిన వినోదం ఇంకెందులోనూ లేదు. ఈ విషయం ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎలా తెలిసేది? చాలా మందికి అసలు తెలుగు చదవటమే సరిగ్గా రాదు. బాధగా నిట్టూర్చాను. మొత్తానికి విమానం లోపల కూర్చున్నాను. తల వెనక్కి తిప్పి చూశాను. నా అభిమాన పాఠకుడు కూడా వెనక సీట్లో కూర్చున్నాడు హాయిగా. అతని బేగ్ ఒళ్లోనే ఉంది. విమానం కదిలాక పుస్తకం తీసుకొని బేగ్ కింద పెడతాడనుకుంటా. కాసేపటికి ప్రయాణికులంతా సీట్ బెల్ట్ పెట్టుకున్నాక విమానం కదిలి గాల్లోకి లేచింది. మళ్ళీ తల వెనక్కి తిప్పాను. ఆ క్షణం నాకు కలిగిన ఆనందాన్ని వర్ణించడం రచయితనైన నాకు కూడా కష్టమే! అతను దీక్షగా చదువుతున్న పుస్తకం నేను రాసిందే!! చాలు!! అప్పటిదాకా నేను చేసిన నిరీక్షణ మంచి ఫలితాన్ని ఇచ్చింది అనుకున్నాను సంతృప్తిగా. అట్ట మీద నా పేరు గర్వంగా చూసుకున్నాను. పుస్తకం కవర్ డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. పాతికేళ్ళ పైనే అయింది ఆ పుస్తకం రాసి. అయినా కొత్తగా కనబడుతోంది. మధ్య మధ్యలో తల వెనక్కు తిప్పి అతను చదివే పేజీని బట్టి కథలో ఏ సన్నివేశం అయుంటుందా అని ఊహించసాగాను సరదాగా. అతను ఒకటి రెండుసార్లు పుస్తకం మూసేసి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడటం గమనించాను. ఆ నవల్లో ఎన్నో హృదయానికి హత్తుకుపోయే సన్నివేశాలు ఉన్నాయి మరి! పెన్నుతో అక్కడక్కడా ఏదో రాసుకున్నాడు కూడా. కొంతమంది పాఠకులకు ఈ అలవాటు ఉంటుంది. తమకు నచ్చిన వాక్యాలను అండర్ లైన్ చేసుకోవటం లేదా మార్జి¯Œ ్సలో తమ అభిప్రాయాలు రాసుకోవటం మొదలైనవి. విజ్ఞానం కలిగించే ఎన్నో విషయాలను ఎంతో రీసర్చ్ చేసి రాశాను ఆ నవల్లో. అలాంటివి గుర్తుకోసం అండర్ లైన్ చేసుకుంటున్నాడేమో అని కూడా అనిపించింది. ఆ నవల రాయడం వెనక నేను చేసిన కృషి, సీరియల్‌గా వస్తున్నప్పుడు అప్పటి పాఠకుల స్పందన అన్నీ గుర్తుకొచ్చినయ్. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా లేచి నిలబడి ఒకరొకరుగా దిగసాగారు. అతనితో మాటలు కలిపి అతను అప్పటిదాకా చదివిన నవల నేను రాసిందే అని చెప్పి అతనికి థ్రిల్ కలిగిద్దామనుకున్నాను. చిన్నగా నవ్వాను అతని వైపు తిరిగి. ఇద్దరం నిలబడే ఉన్నాం. ‘మీరు పుస్తకాలు బాగా చదువుతారా?’ అడిగాను అతని చేతిలో ఉన్న నవల వైపు ఓసారి మామూలుగా చూసి. ‘సారీ?’ నేనన్నది ఏమాత్రం అర్థంకానట్టుగా మొహం పెట్టి అడిగాడు. అప్పుడు కలిగింది నాకు అనుమానం అతనికి తెలుగు రాదేమోనని! అతను ఎయిర్ పోర్ట్‌లో అన్ని ఫోన్ కాల్స్ మాట్లాడినా ఒక్కసారి కూడా తెలుగులో మాట్లాడకపోవటం వెంటనే స్ఫురించింది. ఈసారి ఇంగ్లీషులో అడిగాను ‘మీరు తెలుగువారేనా?’ ‘నాకు తెలుగు రాదు. మాది ముంబై’ చెప్పాడు చిన్నగా నవ్వి. ఆ తర్వాత మా సంభాషణంతా ఇంగ్లీషులోనే సాగింది. ‘మరి మీ చేతిలో ఉన్న తెలుగు పుస్తకమేంటి?’ అడిగాను ఆశ్చర్యంగా. ‘ఓహ్! ఇదా? నా ఫ్రెండ్ కూతురు హైదరాబాద్‌లో ఓ లైబ్రరీలో పని చేస్తుంది. పదిహేనేళ్లకు పైగా ఎవరూ తాకని కొన్ని పుస్తకాల్ని స్టాఫ్‌కి ఇచ్చేశారట. అలా ఈ పుస్తకం తన చేతికొచ్చింది. తను తెలుగమ్మాయే కానీ తెలుగు చదవడం బొత్తిగా రాదు. పుస్తకం అట్ట ఊడిపోతే కవర్ డిజైన్ చాలా వెరైటీగా బావుందని, లోపల అదే సైజులో నీట్‌గా కట్ చేసిన తెల్లకాగితాలు పెట్టి బైండ్ చేసి ఇలా నోట్‌ప్యాడ్‌లా చేసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. నాకూ బాగా నచ్చింది. బాగా చేసింది కదూ’ దాని వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు. ‘అవును. అచ్చు నవల సైజ్‌లోనే చేసింది. చాలా బావుంది..’ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పుతూ అన్నాను. అట్ట నేను రాసిన నవలదే కానీ లోపలంతా తెల్ల కాగితాల మీద అతను రాసుకున్న నోట్స్ కనబడింది. సగం పైనే వాడేశాడతను. తిరిగి ఇచ్చేసి బై చెప్పి బయటకు వచ్చాను. జరిగిందంతా తలచుకుంటే నవ్వొచ్చింది. అసలు విషయం తెలుసుకోకుండా పొరపాటున ఆ పుస్తకం రాసింది నేనే అని ఆ ఉత్త మహాశయుడితో అని ఉంటే ‘అవునా! ఈ ‘అట్ట’ డిజైన్ చేసింది మీరా’ అని సంభ్రమంగా అడిగేవాడేమో మరీ దారుణంగా. ‘ఓహ్! ఇదా? నా ఫ్రెండ్ కూతురు హైదరాబాద్‌లో ఓ లైబ్రరీలో పని చేస్తుంది. పదిహేనేళ్లకు పైగా ఎవరూ తాకని కొన్ని పుస్తకాల్ని స్టాఫ్‌కి ఇచ్చేశారట. అలా ఈ పుస్తకం తన చేతికొచ్చింది. తను తెలుగమ్మాయే కానీ తెలుగు చదవడంబొత్తిగా రాదు. పుస్తకం అట్ట ఊడిపోతే కవర్ డిజైన్ చాలా వెరైటీగా బావుందని, లోపల అదే సైజులో నీట్‌గా కట్ చేసిన తెల్లకాగితాలు పెట్టి బైండ్ చేసి ఇలా నోట్‌ప్యాడ్‌లా చేసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. నాకూ బాగా నచ్చింది. బాగా చేసింది కదూ’ దాని వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు. ఒకప్పుడు పాఠకులై ఉండి నేడు టీవీ ప్రేక్షకులుగా మారిన లక్షల మంది తెలుగువారికి ఆ సందర్భంగా మనసులోనే వందనాలు తెలుపుకున్నాను. కేవలం వారివల్లే ఆ రోజు నా విమాన ప్రయాణం ఏమాత్రం విసుగు లేకుండా సరదాగా సాగిపోయింది! వినోదంతో పాటు ఎంతో విజ్ఞానదాయకంగా ఉండే తెలుగు సాహిత్యం మీద ఒకప్పుడున్న (ఎప్పటికీ ఉండాల్సిన) ఆసక్తినంతా ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్స్ మీదకు మళ్లించుకొని తెలుగు పాఠకుడనేవాడు కనబడటమే ఓ గొప్ప విషయంగా మార్చింది వారే కదా మరి! -దమ్మవళం శ్రీనివాస్ -
ఎదురు చూపులు
లోపలికి చొరబడిన శింశుపాచెట్టు నీడలకింద కోమావార్డు వరండాలో ఇనుప అమడకుర్చీలో చేరగిలబడి పిలుపుకోసం ఎదురుచూస్తోంది యశోద. దూరంగా వరండా అటు చివర పెద్దడాక్టరు రూము కనిపిస్తోంది. పెద్దడాక్టరు రౌండ్సు నుంచి రాగానే యశోదను పిలుస్తానని నర్సమ్మ మాటయిచ్చింది. యశోద భర్త గంగారామ్ అప్పటికి నెలరోజులుగా మనతెలివిలో లేకుండా కోమావార్డులో తొమ్మిదో నెంబరు మంచం మీద ఉన్నాడు. కోమావార్డు.. ఆసుపత్రి వెనుకవైపు రెండో అంతస్తులో ఉంది. వరండాను ఆనుకుని చిట్టడవిలాగా అన్నీ చెట్లే. పక్షుల అరుపులు తప్ప మరో చప్పుడు లేదు. వార్డులోపల గంగారామ్‌కు, బయట వరండాలో యశోదకు నెలరోజులుగా కాలం స్తబ్దుగా అయిపోయింది. ఉదయం పది దాటింది. పక్కన మరో అమడకుర్చీలో కూర్చున్న పోలమ్మ వక్కాకు సంచీలోంచి తమలపాకులు తీసి తొడిమలు తుంపుతోంది. పోలమ్మ భర్త ట్రాక్టరు నుంచి పడి తలకు దెబ్బతగిలింది. పదిరోజుల కిందట కోమావార్డుకి మార్చారు. ‘కాలం యెట్లమారిందో సూసినావా? అమ్మానాయన వయసైపోయి యింగ యింటికి పనికిరాకపోతే వాళ్లను సచ్చినోళ్లల్లో జమజేసేస్తారు. ఆల్ల బిడ్డలు గూడా ఆ మనిసి సావుకోసం యెదురుసూస్తారు. లోపల అంతమంది పేసెంట్లుంటే బయిట వొరండాలో మనిద్దరం తప్ప యెవురూ లేరు’ అంది పోలమ్మ.. యశోదవైపు చూసి విరక్తిగా. యశోద తల అడ్డంగా వూపి ‘చిచ్చీ.. మనిషి చావుకోసం అట్లా యెవరూ యెదురుచూడరు. యెట్లావున్నా మన పెద్దవాళ్లను బాగా చూసుకోవాల. జీవితం విలువైంది, వొక్కసారే వొస్తుంది. మన శత్రువైనా బతకాలనే కోరుకోవాల అంటాడు మా ఆయన’ అంది. పోలమ్మ వెనక్కి తగ్గకుండా ‘వొకమనిసి ఖాయిలాపడి యింగ బాగవడని తెలిసినా అంతే. డాకటర్లు తప్ప తక్కినోళ్లందరూ యెప్పుడు పోతాడా అని సూస్తారు. యిదే యిప్పుటి దిక్కుమాలిన లోకరీతి’ అంది. యశోదకు చేదువిషం తిన్నట్టయింది. తలవెనక్కి వాల్చి కళ్లుమూసుకుంది. నెలరోజుల్నుంచి రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, రోజూ తెల్లవారు జామున్నే లేచి పనంతా చేసుకుని ఆటోలో రావడం వల్ల యశోదకు ఒళ్లంతా పోటుగావుంది. అది ఒక మఠం నిర్వహించే ధర్మాసుపత్రి. గంగారామ్ నాన్న బతికి వున్నప్పుడు పెద్దస్వామీజీకి శిష్యుడు. గంగారామ్‌ను శ్రద్ధగానే చూసుకుంటున్నారు. వాళ్ల నాగులూరు నుంచి ఆసుపత్రికి అరగంట ప్రయాణం. యశోద రోజూ పొద్దున వచ్చి సాయంత్రం వరకూ ఎదురుచూసి వెళ్తోంది. ఇంటి దగ్గర అత్త మణెమ్మ పిల్లలను చూసుకుంటూ స్కూలుకు పంపిస్తోంది. పొద్దున రాగానే లోపలికెళ్లి గంగారామ్‌ను చూసొచ్చింది యశోద. ఎప్పటిలాగే స్పృహలో లేడు. చేతికి, ముక్కుకు, తలకు పెట్టిన ట్యూబులు అలాగే వున్నాయి. వెనుక మిషన్‌లో ఏవేవో గీతలు మారుతూనే వున్నాయి. భర్త ప్రాణాలు భూమికి, ఆకాశానికి మధ్యలో తీగలుపట్టుకుని వేలాడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. లోపల ఎక్కువసేపు ఉండనీరు. వరండాలో కూర్చోనో, పడుకోనో కాలం గడపాలి. పెద్దడాక్టరు కోసం ఎదురుచూస్తూ పొద్దున్నించీ ఆమె ఏమీ తినలేదు. కడుపులో ఆకలి అటూఇటూ కదిలింది. ‘యీ ఆకలొకటి, బతికినంతకాలం వొదిలిపెట్టదు. ఆకలేస్తేనే మనిషి బతికివున్నట్టా? గంగారామ్‌కి ఆకలేస్తే బావుండును’ అనుకుంది. ఒక రెక్కలపురుగు శబ్దం చేస్తూ యశోద తలచుట్టూ తిరిగింది. నర్సు వరండాలోకి వచ్చి ఆమెను రమ్మని చెయ్యి వూపింది. యశోద లేచి గబగబా వెళ్లింది. ‘గంగారామ్‌లో పెద్దగా మార్పేమీ లేదు. పెద్దస్వామీజీగారు నిన్న వచ్చి చూశారు. యెన్నాళ్లైనా సరే బాగయ్యేవరకు మనమే చూసుకోవాలన్నాడు’ అన్నాడు పెద్దడాక్టరు చేతులు కట్టుకుని నిలబడ్డ యశోదతో. ‘మా ఆయనకు బాగవుతుందా సార్’ ఆశగా అడిగింది యశోద. ‘చికిత్సవల్ల అతని మెదడులో కణితి పెరగడం ఆగిపోయినా అది మెదడును కొంత దెబ్బతీసింది. కోమాలోకి వెళ్లిపోయాడు. మిగతా అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. యిలా వున్నవాళ్లలో వందమందిలో వొకరు కోలుకుంటారు. యీ చికిత్స కొనసాగిద్దాం. కోలుకునే అవకాశం వుంది. మనం యెదురుచూడక తప్పదు!’ అని నిట్టూర్చి తనముందున్న పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు పెద్దడాక్టరు. యశోద అతనికి నమస్కారం చేసి బయటకు వచ్చింది. ‘ఒక్క నెలలోనే తన బతుకులో ఎంతమార్పు’ అనుకుంది వెయిటింగ్ కుర్చీలకేసి నడుస్తూ. ఎమ్మే చదివిన గంగారామ్ది ఒక పెద్ద ఎరువుల కంపెని ఫీల్డాఫీసులో గుమాస్తా ఉద్యోగం. జీతభత్యాలు మంచివే. ఒళ్లొంచి పనిచేసే వాడు. మరో వ్యాపకం ఉండేదికాదు. భార్యాపిల్లల్తో ప్రేమగా గడిపేవాడు. అతనికున్న ఒకే ఒక బలహీనత తరచుగా సెలవుపెట్టి ఆశ్రమాలు, మఠాలకు వెళ్లిరావడం. అది అతనికి తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం. ఇద్దరాడపిల్లలు పుట్టాక కూడా దాచుకోకుండా తండ్రిలాగే డబ్బంతా అలా తగలేస్తున్నాడని తల్లి మణెమ్మ వాపోయినా పట్టించుకునేవాడు కాదు. అతనికి తాతల కాలం నుంచి వచ్చిన చిన్న ఇల్లు తప్ప మరో ఆస్తిలేదు. మూడునెలల కిందటి వరకూ గంగారామ్ బాగానే వున్నాడు. క్రమంగా తలనొప్పి రావడం, వస్తువులు రెండుగా కనపడ్డం మొదలైంది. అప్పుడప్పుడూ స్పృహ తప్పేది. మఠం ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలన్నీ చేసి మెదడులో కణితి పెరుగుతోందని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. మూడోరోజున తెలివొచ్చి భార్యాపిల్లలను పలకరించాడు. నాలుగురోజులు బావున్నాడు, ఏడోరోజున కోమాలోకి వెళ్లిపోయాడు. నెలరోజులైనా ఇక తెలివి రాలేదు. అప్పట్నుంచి యశోద నాగులూరికీ మఠం ఆసుపత్రికీ మధ్య తిరుగుతూనేవుంది. ఆ వార్డు నుంచి కోలుకొని బయటికి వెళ్లేవాళ్లు తక్కువ. చుట్టాలు మొదట్లో వచ్చినంతగా తరువాత రారు. పగలంతా ఒక నైరాశ్య నిశ్శబ్దం కమ్ముకుని వుంటుంది.. యశోద సంచిలోంచి టిఫిన్ డబ్బా తీసింది. తినాలనిపించక మూత పెట్టేసింది. ‘తినమ్మా నీరసంగా అగపడతా వుండావు. మీ ఆయనకు లోపల టూబుల్లో అన్నం పెడతానే వున్నారు గదా. తినక నువ్వూ పడిపోతే యిల్లూ, ఆసుపత్రి యెవురు జూసుకుంటారు’ అంది పోలమ్మ కుర్చీలోకి కాళ్లు ముడుచుకుని. పోలమ్మది పెద్ద వయసు. కాస్త దూరంలోని పల్లెటూరు, రైతుకుటుంబం. అన్నీ తెలిసినట్టుగా కబుర్లు చెబుతూ అందరి వివరాలూ సేకరిస్తూంటుంది. తన భర్త విషయంలో ఆమె నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతుంది. వాళ్ల వూరి పూజారి ఇచ్చిన కుంకాన్ని భర్త నుదిటి మీద రాస్తుంది. ‘బెమ్మరాతను యీ కుంకమ మారస్తాదా’ అని నిర్లిప్తంగా తనే అంటుంది. ‘జనమ యెత్తినట్టే సావుగూడా మామూలు యిసయమేగదా’ అంటుంది. ఒకవేళ భర్త చనిపోతే అతని మరణాన్ని హుందాగా తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండడం యశోదకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘నిన్నరేత్రి మూడో నెంబరు మంచమామె కాలంజేసింది. బైట వొరండాలో వొచ్చినోల్ల యేడుపులు జాస్తిగా వుండినాయి. లోపలున్న పేసంట్లకు యివేమీ తెలీదు, అదొక సుకం’ అంది పోలమ్మ. అలాంటి వార్త విన్నప్పుడంతా యశోద గుండె ఆగినట్టవుతుంది. రాకూడని ఆలోచనని అణచేసినట్టుగా చెట్లవైపు చూస్తుంది. నలుగురు మధ్యవయస్కులు పెద్దడాక్టరు రూము నుంచి వచ్చి వార్డులోకి వెళ్లి మూడునిముషాల్లో బయటికి వచ్చారు. ఇద్దరు మగవాళ్లూ అలసిపోయినట్టుగా కూర్చున్నారు. ఆడవాళ్లు వాళ్లెదురుగా నిలబడ్డారు. నలుగురూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల నాన్న కోటయ్య తలలో రక్తనాళాలు చిట్లి కొన్నిరోజులుగా ఐదోనెంబరు మంచంలో ఉంటున్నాడు. ఆయన భార్య పోయి చాలాకాలమైంది. పిల్లలందరూ స్థిరపడ్డారు. ‘యెట్లుంది మీ నాయనకు?’ వాళ్లను అడిగింది పోలమ్మ.‘పొద్దున కొంచెం సీరియస్సైందంట, ఆస్పత్రివాళ్లు రమ్మంటే పరిగెత్తుకొచ్చాం. యిప్పుడు ఫరవాలేదంటున్నారు. డాక్టర్లేదీ సరిగ్గా చెప్పడంలేదు’ అంది ఆడవాళ్లలో పెద్దగావున్నావిడ. కాసేపటి తరువాత వాళ్లు వెళ్లిపోయారు. ‘యీళ్లసంగతి గమనించినావా? ఆయనెప్పుడుపోతాడా అని సూస్తన్నారు. ఆస్తికోసమనుకుంటా’ అంది పోలమ్మ మొహం గంటుపెట్టుకొని. ‘అదంతా నీ భ్రమ. అట్లెందుకనుకుంటారు. వాళ్లు వున్నోళ్లు’ అంది యశోద. ఆ ఊహే ఆమెకు కష్టంగా, భయంగా ఉంది. ‘అది మనిషిని బట్టి వుంటాది, యీళ్లట్లాటోళ్లే. నిజం సేదుగానే వుంటాది’ అని ‘శానా ఆలెస్సమైంది, నాష్టాజెయ్యిపోమ్మా’ అంది పోలమ్మ. సంచి తీసుకుని వరండా చివర వాష్ బేసిన్ దగ్గరికెళ్లింది యశోద. ఆమె ఎంగిలిపడి వచ్చి కూర్చోగానే వీర్రాజు వచ్చాడు. ‘అన్నకెట్లుంది?‘ అనడిగాడు. ‘అట్లేవుంది, యింగా టైం పడుతుందంట’ అంది యశోద. లోపలికి వెళ్లి గంగారామ్‌ను చూసొచ్చాక నాలుగైదు నిముషాలు మాట్లాడి ‘యేది కావాల్సొచ్చినా ఫోన్ చెయ్యి’ అని చేప్పి వెళ్లిపోయాడు వీర్రాజు. ‘సోగ్గా వుండాడు, యెవురతను?’ అడిగింది పోలమ్మ ‘వరసకు మా అత్తకొడుకు, మావూళ్లో సినిమాహాలు మేనేజరు’ జవాబిచ్చింది యశోద. పోలమ్మ ఆసక్తిగా వివరాలు అడగబోయిందిగాని యశోద తలతిప్పుకుంది. ఆమెకు వీర్రాజంటే చిన్నప్పట్నుంచి ఇష్టంలేదు. వీర్రాజు మంచివాడే గాని సినిమాల పిచ్చితో థియేటర్ల చుట్టూ తిరిగి ఇంటర్ తప్పి చదువు వదిలేశాడు. యశోద బియ్యే పాసైంది. యశోదకు గంగారామ్‌తో పెళ్లికాక ముందు ఆమెను చేసుకోవాలని వీర్రాజు శతవిధాల ప్రయత్నించాడు. ఒకప్పుడైతే అసలు మాట్లాడేదిగాదు. భర్త జబ్బుపడ్డాక ఆమె గట్టిదనం తగ్గిపోయింది. వీర్రాజుకు పెళ్లైంది గాని పిల్లల్లేరు. పెళ్లి తర్వాత అతను యశోద దగ్గరికి రావడం తగ్గించేశాడు. గంగారామ్‌కి బాగలేనప్పట్నుంచి మళ్లీ వస్తున్నాడు. గంగారామ్ ఆసుపత్రిలో చేరిన నెలరోజుల తర్వాత ఇంకా యశోదను పట్టించుకుంటున్న ఏకైక చుట్టం అతనే. సాయంత్రం ఇంటికొచ్చింది యశోద. ఆసుపత్రిలో స్తబ్దుగా ఉండిన కాలం ఇప్పుడు ముల్లుకర్రలా గుచ్చుకుంటోంది. ఇంట్లో సరుకులన్నీ దాదాపు నిండుకున్నాయి. చేతిలో వున్న డబ్బంతా అయిపోయింది. అత్త ఎవరి దగ్గరో అప్పుకోసం వెళ్లినట్టుంది. అన్నానికి పెట్టి వరండాలో గోడకానుకుని కూర్చొని గేటు బయట ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. చిక్కిపోయి నీరసంగా ఉన్నారు. ఆమె కళ్లు నీళ్లతో నిండాయి. వీర్రాజు వచ్చాడు. పిల్లలను పలకరించి లోపలికొచ్చి స్టూలు మీద కూర్చున్నాడు. ‘ఆఫీసులో గంగారామ్‌కు రావల్సిన డబ్బులు వుంటాయి. అంతేగాదు, వుద్యోగస్తుడు ఖాయిలాపడితే బాగయ్యేదాకా భార్యకు వుద్యోగమిస్తారంట. ఆఫీసుకు పొయ్యి మేనేజరుసారును కలుద్దాం’ అని ‘అర్జెంటు పనుంది, రేప్పొద్దునొస్తా’ అంటూ వెళ్లిపోయాడు. మరుసటిరోజు పదిగంటలకు వీర్రాజు వచ్చేసరికి యశోద తయారుగా ఉంది. తన మోటారుసైకిలు వెనుక సీటు మీద యశోదను కూర్చోమన్నాడు. యశోద కదల్లేదు. ‘వెళ్లిరామ్మా’ అంది తలుపు వరకు వచ్చిన మణెమ్మ. ఇక తప్పదన్నట్టు ఎక్కింది. మేనేజరు కలుపుగోలు మనిషి. రైతుల బాధలు వినీవినీ అతని మొహం ముడతలు పడి విచారంగా మారిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది. ఆయన యశోదను పలకరించి, గంగారామ్ స్థితిపట్ల విచారం వెలిబుచ్చాడు. ‘గంగారామ్ లేకపోవడంతో నాకు కుడి భుజం విరిగినట్టుంది. మొన్నాదివారం మేమంతా వెళ్లి గంగారామ్‌ను చూసొచ్చాం. కోలుకునే అవకాశాలు బాగా వున్నాయని చెప్పాడు డాక్టరు. గంగారామ్ మంచివాడు, తప్పకుండా తిరిగొస్తాడు’ అన్నాడు. గంగారామ్ ఇంటి పరిస్థితి, యశోదకు ఉద్యోగం ఇవ్వడం గురించి వీర్రాజు ప్రస్తావించాడు. మేనేజరు వీర్రాజువైపు తిరిగి కంపెనీ రూల్సు చెప్పి ‘గంగారామ్‌కి యివ్వగలిగినవన్నీ యిప్పటికే ఇచ్చేశాం. అతను ప్రాణాలతో వుండగా అతని బదులు భార్యకు వుద్యోగం రాదు. ఆమెకు మరోచోట ప్రయత్నిద్దాం.. యేదోవొకటి దొరక్కపోదు’ అని చెప్పలేక చెప్పాడు. అతని మాటలు విన్న యశోద మొహం పాలిపోయింది. కిటికీ వైపు తల తిప్పుకుంది. ఇంటికొచ్చాక జరిగిందంతా అత్తతో చెప్పి ఏడ్చింది యశోద. మరోవారం గడిచింది. గంగారామ్‌లో మార్పు లేదు. యశోదకు వీర్రాజు ద్వారా ఒక స్కూటర్ల డీలరు వర్కుషాపులో పొద్దున షిఫ్టులో క్లర్కుగా చిన్న వుద్యోగం దొరికింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆసుపత్రికి వెళ్తోంది. మణెమ్మ పిండి మిషనులో పనికి కుదిరింది. కానీ అనారోగ్యంతో అడపాదడపా మానేస్తోంది. అవసరాన్నిబట్టి వీర్రాజు తన మోటారుసైకిల్ మీద యశోదను ఇంటి దగ్గర దింపడమేకాక ఆసుపత్రిక్కూడా తీసుకెళ్తున్నాడు. ‘ఇరుగుపొరుగు తన గురించి ఏమనుకుంటున్నారో’ అని అత్త దగ్గర బాధపడింది యశోద. అలాంటివన్నీ పట్టించుకోవద్దని ఆమె ధైర్యం చెప్పింది. ఆ సాయంత్రం ఆసుపత్రి వరండాలో యశోద, పోలమ్మ ఇద్దరే ఉన్నారు. ‘మా ఆయన గురించి యీరోజు పెద్దడాక్టరు ముందు మాదిరి నమ్మకంగా చెప్పలేదు’ అంది యశోద ఆందోళనగా. ‘యీ వ్యాధి అట్లాటిది. యేమాటా చెప్పలేం. నువ్వు గుండెను రాయి జేసుకోవాల బిడ్డా. నీ మొగుణ్ణి దేవుడే తీసుకోనిపోతే అది నీ మంచికోసమే జేసినట్టు అర్థంజేసుకో. నువ్వు మీ ఆయన వుద్యోగంలో జేరి పిల్లల్ని వుర్దిలేకి తీసుకోనిరావాలని దేవుడి నిర్నయమనుకో, అంతే. నీ మొగుణికి బాగైనా కాళ్లూసేతులూ పని జెయ్యకపోతే యిద్దరాడబిడ్డలను పెట్టుకోని యెట్లబతుకుతావు? సక్కటి మనిసివి, యింగా యెంతో బతుకుండాది నీకు’ అంది పోలమ్మ నిర్వికారంగా. ఆమె మాటలు వినలేనట్టుగా యశోద చేతులతో చెవులు మూసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా యశోద స్థిమితపడలేదు. ఆరాత్రి చిన్నకూతురు తలను వొళ్లో పెట్టుకుని ఆలోచిస్తూ గోడకానుకుని కూర్చుంది. చిన్నవుద్యోగంతో రోజు గడిచేది కష్టంగా వుంది. పిల్లలను చూస్తే ఆమెకు బాగా బతకాలన్న కోరిక పెరుగుతోంది. ‘బతికేదానికి కోరికే మూలమ’నేవాడు గంగారామ్. అతనికి కోరిక తగ్గిపోయి అట్లా ఐపోయినాడా?’ తన ఈ పరిస్థితికి ముగింపెప్పుడో, ఎలా వుండబోతోందో ఆమెకు అంతుబట్టలేదు. వొళ్లు నొప్పులతో నిద్రపట్టక కదులుతున్న మణెమ్మ లేచివెళ్లి మంచినీళ్లు తాగి కోడలి దగ్గరికొచ్చింది. ‘జరిగేదాకా సత్తెమేదో యెవురికీ తెలీదు. సెడాలోశనలకు దుడుకెక్కువ, వొద్దన్నా వస్తాయి. ఐనా మంచిమాటే అనుకోవాల’ అంటూ కోడలి తలమీద చేత్తో రాసింది మణెమ్మ. యశోద చివుక్కున తలెత్తి చూసింది. ‘దేవుడెట్టా రాసిపెట్టి వుంటే అట్టా జరుగుతుంది తల్లీ’ అంది మణెమ్మ వెళ్లి పడుకుంటూ.యశోదను ఆలోచనలు వదల్లేదు. ‘పోలమ్మ చెప్పింది సరైందేనా? బతకడం బరువైనప్పుడు యెవరైనా అట్లాగే ఆలోచిస్తారా? నిజంగా తను దేనికోసం ఎదురుచూస్తావుంది?’ ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె తలలో కదులుతున్న చిత్రమాలికలో మధ్యమధ్యన వీర్రాజు మోటారుసైకిలు మీద వచ్చిపోతున్నాడు. చేతులతో తలను నొక్కిపట్టుకుని పడుకుంది. ఆ తరువాతెప్పుడో గాని ఆమెకు నిద్రపట్టలేదు. రెండువారాలు గడచిపోయాయి. ఈ మధ్యలో ఒకరోజు కోమావార్డులో ఐదోనెంబరు మంచం మీదుండిన కోటయ్యకు తెలివొచ్చి జనరల్ వార్డుకు మార్చారు. ఆయన పిల్లలు సంతోషంగానే కనబడ్డారు. ‘అందురికోసం పైకి సంతోసంగా కనబడినా మొదుట్లో యిసుక్కున్నారు, నేను జూసినా’ అని చెప్పింది పోలమ్మ. ఆ తరువాత రెండురోజులకు పోలమ్మ భర్త చనిపోయాడు. ఆసమయంలో యశోద అక్కడలేదు. ఆమె తన భర్త మరణాన్ని ఎలా తీసుకుందో తెలియలేదు. కాలక్షేపంగా వుండిన పోలమ్మ వెళ్లిపోయినందుకు యశోదకు దిగులేసింది. గంగారామ్ పైకి బాగానే కనపడుతున్నా రోజురోజుకీ డాక్టర్లు అతని గురించి ఆందోళనగా మాట్లాడ్డం పెరిగింది. నిస్పృహలోకి జారిపోకుండా పంటి బిగువున ఆపుకోవాల్సి వస్తోంది యశోదకి. ఒక మధ్యాహ్నం వర్క్‌షాపులో మిగిలిపోయిన పని చేసుకుంటున్న యశోదకు వెంటనే రమ్మని ఆస్పత్రి నుంచి ఫోనొచ్చింది. కాళ్లుచేతులు ఆడక వీర్రాజుకు ఫోన్ చేసింది. అరగంటలో వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే గంగారామ్ ప్రాణాలు పోయాయి. గుండె ఆగి చనిపోయాడని చెప్పారు. యశోద కుప్పకూలిపోయింది. పెద్ద డాక్టరు, పెద్దస్వామీజీ వచ్చి ఆమెకు ఓదార్పు మాటలు చెప్పారు. యశోద అచేతనంగా ఐపోయింది. వీర్రాజే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. పదహైదురోజులు పోయాక ఒక సాయంత్రం వీర్రాజు కొన్ని కాగితాలు తీసుకుని యశోద యింటికొచ్చాడు. యశోద ఇంకా అన్యమనస్కంగానే ఉంది. ‘గంగారామన్న డెత్ సర్టిఫికెట్టు, కావలసిన యితర కాగితాలన్నీ తీసుకొచ్చినాను. ఆయన వుద్యోగాన్ని నీకిమ్మని అడుగుతా మేనేజరు సాయంతో యీ దరఖాస్తు తయారు చేసినాను. నువ్వు సంతకం పెట్టిస్తే మూణ్ణెల్ల లోపలే నీకు వుద్యోగం వచ్చేట్టు చూస్తాను’ అని పేపర్లు యశోదకిచ్చాడు వీర్రాజు. యశోద కళ్లల్లో నీళ్లు బొటబొటా కారాయి. చివుక్కున తలపైకెత్తి ‘ఆయన పోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు, ఆ వుద్యోగం నాకొద్దు’ అంటూ వీర్రాజువైపు పేపర్లు విసిరేసి ‘నేనేదన్నా వేరేపని చూసుకుంటా. యింకెప్పుడూ నన్ను కలవొద్దు’ అని మొహం తిప్పుకుని లోపలికి వెళ్లిపోయింది యశోద. మణెమ్మ వొంగి పేపర్లన్నీ ఏరుకుని ‘రేపు నేను నచ్చజెప్పి సంతకం జేయించి పంపిస్తా, నువ్వేమనుకోవద్దు బాబూ’ అంది అనునయంగా. వీర్రాజు చాలాసేపు కొయ్యబారిపోయినట్టుగా అలా నిలబడేవుండిపోయాడు. - డాక్టర్ కెవి రమణరావు -
పొగిడితే పోయేదేముంది డ్యూడ్..
పొగడ్త అగడ్త అని గిట్టనివారు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, నిజానికి పొగడ్తలను ఇష్టపడనివారు లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. పొగడుపూలవాన కురిపిస్తే, ఎంతటి ధీరగంభీరవదనులైనా పెదవులపై చిరునవ్వులొలికించక మానరు. పొగడ్తల శక్తి అలాంటిది మరి! మామూలు భాషలో పొగడ్త. పొగడ్తను కాస్త నాజూకుగా ప్రశంస అని, ఆధ్యాత్మిక పరిభాషలో స్తుతి అని కూడా అంటారు. పొగడ్తకు మన తెలుగు భాషలోనే దాదాపు అరవై వరకు పర్యాయపదాలు ఉన్నాయి. పొగడ్తనే ఇంగ్లిష్‌లో ‘కాంప్లిమెంట్’ అంటారు. ఈ మాటకు ఇంగ్లిష్‌లో నలభైకి పైగా పర్యాయపదాలు ఉన్నాయి. అంటే, పొగడ్తల్లో మన తెలుగువాళ్లదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు. ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేన’ని కొందరి ప్రగాఢ విశ్వాసం. ఎంతటి అపర దుర్వాసులనైనా పొగడ్తలతో అవలీలగా పడగొట్టవచ్చనేది వారి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’లో గిరీశం ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి అగ్నిహో్రత్రావధానుల్లాంటి ప్రథమకోపిని చులాగ్గా బురిడీ కొట్టించగలిగాడు. అకాలంలో ఈ పొగడుపూల వానేంటని అయోమయం చెందుతున్నారా? మరేమీ లేదు– రేపు ‘వరల్డ్ కాంప్లిమెంట్ డే’– అనగా, ప్రపంచ ప్రశంసా దినోత్సవం. అందువల్లనే ఈ పొగడ్తల కథా కమామీషూ... పొగడ్త పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన జాడ చరిత్రలో ఎక్కడా కనిపించదు గాని, బహుశ మాటలు పుట్టినప్పుడే పొగడ్తలు కూడా పుట్టి ఉంటాయని భావించవచ్చు. ‘ఆదియందు అక్షరము ఉన్నది. అక్షరము దైవము వద్ద ఉన్నది. అక్షరమే దైవమై ఉన్నది’ అని బైబిల్ చెబుతోంది. కాలక్రమమున దైవమై ఉన్న అక్షరమే దైవమును పొగడనేర్చినది. ఇది ఒక సృష్టి వైచిత్రి. పొగడ్తలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు దైవానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి మనుషులకూ విస్తరించాయి. జీవాత్ములైన మనుషులందరూ సమానులేనని అటు ఆధ్యాత్మికవాదులు, మనుషులంతా ఒక్కటేనని ఇటు సామ్యవాదులు ఏదో మాటవరసకు అంటుంటారు గాని, మనుషుల్లో కొందరు ఎక్కువ సమానులు ఉంటారు. సమాజంలో ఆస్తులూ అంతస్తులూ అధికారాలూ ఈ ఎక్కువ సమానుల సొంతం. ఎక్కువ సమానులను ప్రసన్నం చేసుకుని, వారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందడానికి తక్కువ సమానులు ఎప్పటికప్పుడు ‘పొగడు’పూల మాలలను అల్లుతుంటారు. పురాతన కళ పొగడ్త ఒక పురాతన కళ. వాంగ్మయారంభం నుంచే ఇది ఉనికిలో ఉంది. వేదపురాణాది పురాతన వాంగ్మయమంతా దైవాన్ని వేనోళ్ల పొగడటంతోనే వ్యాప్తిలోకి వచ్చాయి. రాచరికాలు ఏర్పడిన తర్వాత కవిపండితులు దైవంతో పాటు రాజులను కూడా పొగడటాన్ని అలవాటు చేసుకున్నారు. దైవాన్ని పొగిడితే చాలదా? మానవమాత్రులైన రాజులనెందుకు పొగడాలనే ధర్మసందేహం కొందరికి కలగవచ్చు. అలాంటి సందేహానికి ఆనాటి బతకనేర్చిన కవిపండితులు ‘నా విష్ణుః పృథ్వీపతిః’ అని సమర్థించుకున్నారు. అంటే, భూమినేలే రాజు సాక్షాత్తు మహావిష్ణువుతో సమానుడు. అందువల్ల రాజును పొగడటం తప్పుకాదనేది వారి వాదన. ఈ వాదనతో ఏకీభవించి, రాజులను పొగడనేర్చిన కవిపండితులు, వాగ్గేయకారులు, విదూషకులు వంటి వారందరూ సునాయాసంగా సుభిక్షంగా సువిలాసంగా బతుకుతూ, సమాజంలో ఎక్కువ సమానులుగా చలామణీ అయ్యేవారు. పొగడటానికి ఇంతమంది ఉన్నా, తనివితీరని రాజులు కేవలం తమను పొగడటానికే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని, వారిని పెంచి పోషించేవారు. రాజులు ఎలాంటి వారైనా వారిని పొగడక తప్పని దుస్థితి ఆ రాజోద్యోగులది. ఎక్కడో తెనాలి రామకృష్ణుడిలాంటి తెలివైన కవులు రాజులను పొగుడుతున్నట్లే అనిపించే పద్యాలు చెబుతూ చురకలంటించేవారూ చరిత్రలో లేకపోలేదు. అలాంటి పద్యాల్లోని శ్లేషాలంకార మర్మాన్నెరుగని తెలివితక్కువ మారాజులు వారికి ఘనసన్మానాలూ చేసేవారు. పొగుడుతున్నట్లే చురకలంటించే ఆనాటి కవుల నైపుణ్యానికి ఒక ఉదాహరణ: శ్రీకృష్ణదేవరాయల చిన్నల్లుడు తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడితో పొగిడించుకోవాలనే కోరిక పుట్టింది. రామకృష్ణుడికి కబురు పంపి సభకు పిలిపించుకుని, తనను పొగుడుతూ పద్యం చెప్పమన్నాడు. తిరుమలరాయడు ఏకాక్షి. శ్లాఘించవలసిన లక్షణాలేవీ పెద్దగా లేనివాడు. పొగడనని మొండికేస్తే తిక్క మారాజు ఎలాంటి శిక్ష విధించడానికైనా వెనుకాడడు. సమయస్ఫూర్తిమంతుడైన తెనాలి రామకృష్ణుడు కాసేపు ఆలోచించి, ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం: అన్నాతిగూడ హరుడవె అన్నాతి గూడకున్న నసురగురుడవె అన్నా తిరుమలరాయా! కన్నొక్కటి మిగిలెగాని కౌరవపతివే! తిరుమలరాయడు భార్యతో కలసి సభలో కొలువుదీరాడు. భార్యతో కలసి ఉంటే, ఆమె రెండు కన్నులూ అతడి ఒంటికన్నూ కలసి మూడు కన్నులు. అందువల్ల ‘ఆమెతో కలసి ఉన్నప్పుడు సాక్షాత్తు ముక్కంటి అయిన పరమశివుడివేనని పొగిడాడు. పక్కన ఆమె లేనప్పుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడంతటి వాడివన్నాడు. వామనావతారంలో శ్రీమహావిష్ణువు దర్భపుల్లతో గుచ్చడంతో శుక్రాచార్యుడు ఒంటికంటితో మిగిలాడనే పురాణం అందరికీ తెలిసినదే. చివరి పాదంలో చెప్పినది వీటన్నింటినీ మించిన చమత్కారం. కన్నొక్కటి మిగిలిపోయింది గాని, లేకుంటే సాక్షాత్తు ధృతరాష్ట్రుడివేనన్నాడు. మహాభారతంలో గుడ్డిమారాజైన ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడి శ్లేష అర్థంకాలేదు కాబట్టి సరిపోయింది. రామకృష్ణుడు తనను నిజంగా పొగిడాడనే భ్రమలో మురిసిపోయాడా పిచ్చిమారాజు. తిరుమలరాయడికి అసలు విషయం అర్థమై ఉంటే రామకృష్ణుడి కథ వేరేలా ఉండేది. అధికార పీఠాలపై ఉన్నవారిని తప్పనిసరిగా పొగడాల్సిన పరిస్థితులు తటిస్థిస్తే తెనాలి రామకృష్ణుడి మార్గమే సురక్షితమైనది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నమయ్య అనుసరించిన మార్గం అత్యంత ప్రమాదకరం. పెనుగొండ పాలకుడు సాళువ నరసింహరాయలు తన ఆస్థానంలో అన్నమయ్యకు ఆశ్రయం కల్పించాడు. అన్నమయ్య ఎంతసేపూ శ్రీనివాసుడిపైన కీర్తనలను గానం చేయడమే తప్ప ఏనాడూ తనకు ఆశ్రయం ఇచ్చిన రాజును పొగిడిన పాపాన పోలేదు. ఒకసారి సాళువ నరసింహరాయలకు ఎందుకో అన్నమయ్య చేత తనను పొగిడించుకోవాలనే దుగ్ధ కలిగింది. తనను పొగుడుతూ కీర్తనలను గానం చేయాలంటూ హుకుం జారీ చేశాడు. తిరుమలేశుని పరమభక్త శిఖామణి అయిన అన్నమయ్య అందుకు నిరాకరించాడు. ‘నరహరి పొగడగ నానిన జిహ్వ.... నరుల నుతింపగ నోపదు జిహ్వ’ అంటూ కరాఖండిగా మొండికేశాడు. ఈ నిరాకరణకు రాజైన సాళువ నరసింహరాయడి అహం దెబ్బతిన్నది. అన్నమయ్యను గొలుసులతో బంధించి, చెరసాలలో పెట్టించాడు. దైవకృప వల్లనో, మరెందు వల్లనో అన్నమయ్య ఆ తర్వాత సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది. అందువల్ల అధికారపీఠాన్ని అధిష్ఠించినవారిని పొగడక తప్పని పరిస్థితే ఏర్పడితే అన్నమయ్య మార్గం కంటే తెనాలి రామకృష్ణుడి మార్గమే మేలని వారి తర్వాతి తరాల బతకనేర్పరులందరూ ఏనాడో గ్రహించారు. అలాంటి బతకనేర్పరులు ఆనాటి రాచరిక కాలంలోనే కాదు, నేటి కార్పొరేట్ కాలంలోనూ ఉన్నారు. ఏ బాసుకు తగిన తాళాలను ఆ బాసు దగ్గర వాయిస్తూ ఇంచక్కా పబ్బం గడిపేసుకునే గడసరులు వారు. పొగడ్తలతో పనులు చక్కబెట్టుకోవడం కూడా ఒక కళ. ముఖస్తుతి కళలో ఆరితేరినవారిని మిగిలినవారంతా తప్పక ప్రశంసించి తీరాల్సిందే! సామాజిక బహుమతి ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి అర్ధసత్యం మాత్రమే! డబ్బును, డబ్బుతో కొనగలిగే వస్తువులను బహుమతులుగా ఇచ్చే ఆనవాయితీ చిరకాలంగా ఉన్నదే. ఇవన్నీ భౌతిక బహుమతులు. సామాజిక సామరస్యానికి ప్రశంసలే సోపానాలు. ప్రశంసకు డబ్బుతో పనిలేదు. ఎదుటివారిలోని సుగుణాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించగలిగే సహృదయం ఉంటే చాలు. మనిషి సామాజిక జీవి. ప్రశంస ఒక సామాజిక కానుక. డబ్బుతో ముడిపడిన భౌతిక కానుకలు ఇవ్వలేని సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి మంచి ప్రశంసకు మాత్రమే ఉంది. ఒకవేళ భౌతిక కానుకలు ఇచ్చినా, వాటికి కొన్ని ప్రశంసలను జతచేరిస్తే కానుకలు ఇచ్చేవారికి తృప్తి, పుచ్చుకునేవారికి ఆనందం కలిగిస్తాయి. ‘అదిగో వినరా ఆ చప్పట్లు– ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన’– సృజనాత్మక రంగంలోని కళాకారుల్లో మోతాదుకు మించి ఉండే గుర్తింపు కాంక్షకు అద్దంపట్టే డైలాగు ఇది– భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలోనిది. ప్రశంసలంటే మాటలే కాదు, చప్పట్లు కూడా. రసజ్ఞుల ఆమోదాన్ని వ్యక్తం చేసే కరతాళ ధ్వనులు కడుపు నింపవుగాని, కళాజీవుల మనసులు ఉప్పొంగేలా చేస్తాయి. ఎవరినైనా పొగడాలంటే భాషలో మాటలకు కరువులేదు. మరి పొగడటానికి మొహమాటమెందుకు? ఎదుటివారిలోని మంచిని గుర్తించి, మనసారా పొగడండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే హుందాగా స్వీకరించండి. ప్రశంసలూ ప్రయోజనాలూ... ప్రశంసలు విన్నప్పుడు ప్రశంసలు పొందినవారికి సంతోషం కలుగుతుంది. వారిలో తమను ప్రశంసించిన వారిపై సానుకూల భావనలు కలుగుతాయి. ఒకే చోట చదువుకునే సహాధ్యాయులు, ఒకే చోట పనిచేసే సహోద్యోగులు– అంతెందుకు, ఒకే ఇంట కాపురం చేసే భార్యాభర్తలు సందర్భోచితంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉన్నట్లయితే, వారి మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వారి పనితీరు కూడా మెరుగుపడుతుంది. పొగడ్తలకు జ్ఞాపకశక్తిని మెరుగుపరచే శక్తి ఉన్నట్లు జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన మనస్తత్వశాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొత్తగా కళలు, శాస్త్ర విషయాలు నేర్చుకునే వారికి తొలి దశలో పొగడ్తలు టానిక్‌లా పనిచేస్తాయని, మెదడులో అవి కలిగించే జీవరసాయన చర్యలు వారి జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రశంసల వల్ల మనుషుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. మనుషుల్లో పరస్పర సహకార ధోరణి అలవడుతుంది. ‘ఒక మంచి ప్రశంస చాలు, నేను రెండు నెలలు బతికేస్తాను’ అన్నాడు మార్క్ ట్వేన్. ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే గొప్పగా మరెవరూ చెప్పలేరు. తోటివారిని ప్రశంసించే సంస్కృతి సమాజంలో శాంతి సామరస్యాలకు దోహదపడుతుంది. ప్రశంసలు చిన్నపిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఏదైనా కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు, ఏదైనా మంచిపని చేసినందుకు పిల్లలను ప్రశంసించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రశంసలు పొందిన వారికి సంతోషం కలగడం సహజమే అయినా, ప్రశంసలు పొందిన వారి కంటే ప్రశంసలు కురిపించిన వారికే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగిడితే పోయేదేమీ లేదు... పొరపొచ్చాలు తప్ప! పొగడ్తలు పొందడాన్ని దాదాపు అందరూ ఆస్వాదిస్తారు గాని, ఇతరులను పొగడటానికి మాత్రం కొందరు తెగ ఇబ్బందిపడిపోతుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా, లేకున్నా ఎదుటివారిపై ఎడాపెడా పొగడ్తలు కురిపించేస్తుంటారు. అనవసరంగా పొగిడే అలవాటు ఉన్నవారు ఎక్కువగా అధికారంలో ఉన్నవారి చుట్టూ, అందగత్తెల చుట్టూ, అపర కుబేరుల చుట్టూ చేరుతుంటారు. పొద్దస్తమానం జోరీగల్లా వారి చెవుల్లో పొగడ్తల రొద పెడుతుంటారు. పొగడ్తలకు అలవాటు పడిన వారు ఒక్క పొగడ్త అయినా వినిపించని రోజున నిద్ర పట్టక, తిన్న తిండి సయించక నానా యాతన పడతారు. శ్రుతిమించితే పొగడ్త అగడ్తే అవుతుంది. అలాగని పొగడ్తలను తీసిపారేయడానికి లేదు. పొగడ్తలకు గల ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పొగిడితే పోయేదేమీ లేదు... మనుషుల మధ్య పొరపొచ్చాలు తప్ప. పొగడ్తలు మనుషుల మధ్య సఖ్యతను, సామరస్యాన్ని, పరస్పర సహకార ధోరణిని పెంచుతాయి. పిల్లలూ పెద్దలూ... మహిళలూ పురుషులూ... ఎలాంటి వారైనా పొగడ్తల ప్రభావానికి అతీతులు కారు. ప్రశంసలను ఎందుకు కోరుకుంటారు? సామాజిక జీవి అయిన మనిషి సమాజంలో ఒకరిగా మనుగడ సాగిస్తున్నా, తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటాడు. తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి, తన ప్రత్యేకతకు తగిన గుర్తింపును ప్రశంసల ద్వారా పొందడానికి అహరహం ప్రయత్నిస్తుంటాడు. మనిషి స్వభావమే అంత. గుర్తింపు కాంక్ష కొందరిలో కాస్త మోతాదుకు మించి ఉంటుంది. మోతాదుకు మించిన గుర్తింపుకాంక్ష ఉన్నవారే ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారు తిండి లేకపోయినా, పెద్దగా బాధపడరు గాని, ప్రశంసలు లేకపోతే తెగ కుంగిపోతారు. -
బిపిన్ చౌధురి జ్ఞాపకశక్తి పోయిందా..?
బిపిన్ చౌధురి ప్రతి సోమవారంనాడు తన కార్యాలయం నుంచి తిరిగి వచ్చేదారిలో కొత్త అంగడి వీధిలో ఉన్న కాళీచరణ్ దుకాణంలోకి పుస్తకాలను కొనడానికి వెళ్తుంటాడు. నేర సంబంధ కథలు, దయ్యాల కథలు, ఇంకా గుండెలు ఝల్లుమనేలా భయపెట్టేవి. వారం అంతా గడిచిపోయేలా అతను ఒకేసారి ఐదు పుస్తకాలను కొంటాడు. బిపిన్‌బాబు ఒంటరిగా ఉంటాడు. అతనికి కొద్దిమంది మిత్రులున్నారు. ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేయడం ఆయనకిష్టం ఉండదు. ఈ దినం కాళీచరణ్ దుకాణంలో అతనికి తననెవరో దగ్గరగా పరిశీలనగా గమనిస్తున్నట్లు అనుభూతి కలిగింది. తను వెనక్కి తిరిగి ఒక గుండ్రని ముఖం కలిగి, సాత్వికంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని... తానతన్ని చూడగానే అతని ముఖంపైన చిరునవ్వు కదలడంతో– అతనేనని తనంటత తానే అర్థం చేసుకున్నాడు. ‘‘నువ్వు నన్ను గుర్తు పట్టలేదని భావిస్తున్నా’’ ‘‘మనం క్రితం కలుసుకున్నామా?’’ బిపిన్‌బాబు అడిగాడు. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ‘‘ఒక పూర్తి వారంలోని ప్రతిదినం మనం కలుసుకున్నాము. 1958లో రాంచీలో హుద్రూ జలపాతాలకు నిన్ను తీసుకు వెళ్లడానికి నేను కారును ఏర్పాటు చేశాను. నా పేరు పరిమళ ఘోష్.’’ ‘‘రాంచీనా?’’ ఇప్పుడు బిపిన్‌బాబు– అతనిక్కావలసిన ఆ వ్యక్తి ఎవరో తాను కాదని ఈ మనిషి పొరపాటు పడ్డాడనీ నిశ్చయానికి వచ్చాడు. తానేనాడూ రాంచీ వెళ్లలేదు. అనేకసార్లు వెళ్లాలని ఉద్దేశపడ్డాడు. కానీ ఎప్పుడూ వెళ్లలేదు. చిరునవ్వుతో అడిగాడు బిపిన్‌బాబు ‘‘నేనెవరో మీకు తెలుసా?’’ ఆ మనిషి కనుబొమలు పైకెగురవేస్తూ అన్నాడు ‘‘నువ్వు నాకు తెలుసు. బిపిన్ చౌధురిని ఎరగని వాళ్లెవరు?’’ బిపిన్‌బాబు పుస్తకాల అరల వైపు తిరిగి అన్నాడు ‘‘ఇప్పటికీ మీరు పొరపాటులోనే ఉన్నారు. నేనేనాడూ రాంచీ వెళ్లలేదు.’’ ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు ‘‘ఏమంటున్నావు మిస్టర్ చౌధురి! నువ్వు హుద్రూలో పడిపోయావు. నీ కుడి మోకాలికి గాయమైంది. నేను నీకు అయోడిన్ తెచ్చాను. తర్వాతి దినం నువ్వు నెవర్హాట్ వెళ్లడానికి నేనో కారు కుదిర్చాను. కానీ నువ్వు నీ మోకాలి నొప్పితో వెళ్లలేకపోయావు. ఇవేవీ గుర్తులేవా? అదే సమయంలో నీకు తెలిసిన మరో వ్యక్తి కూడా రాంచీలో ఉన్నాడు. అతను మిస్టర్ దినేష్ ముఖర్జీ.నువ్వో బంగ్లాలో బస చేశావు. నీకు హోటలు భోజనం ఇష్టం కాదని చెప్పావు. ఎవరైనా ఒక వంట మనిషి వండిన భోజనమైతే మేలన్నావు. నీకింకా చెప్తాను. దర్శనయోగ్యస్థలాలకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ నువ్వో సంచిలో పుస్తకాలు పెట్టుకుని మోసుకెళుతుంటావు. అవునా, కాదా?’’ తన దృష్టినలాగే పుస్తకాల మీద నిలిపి నిమ్మళంగా మాట్లాడాడు బిపిన్‌బాబు ‘‘1958 గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఏ నెల?’’ ‘‘అక్టోబరు’’ అన్నాడా వ్యక్తి. ‘‘లేదండి’’ బిపిన్‌బాబు అన్నాడు. ‘‘58 అక్టోబరులో నేను కాన్పూరులో ఉన్న నా మిత్రుని వద్ద గడిపాను. మీరు పొరబడ్డారు. మంచిది. సెలవ్!’’ కానీ ఆ మనిషి సెలవు తీసుకోనూలేదు, మాట్లాడకుండా ఉండనూలేదు. ‘‘చాలా చిత్రం. ఒక సాయంకాలం నీ బంగళా వరండాలో నీతో కలసి తేనీరు తాగాను. నువ్వు నీ కుటుంబం గురించి మాట్లాడావు. నీకు పిల్లల్లేరని చెప్పావు. పదేళ్ల క్రితమే భార్యను కోల్పోయానన్నావు. నీ ఒక్కగానొక్క తమ్ముడు పిచ్చితో చనిపోయాడనీ, అందుకే నువ్వు రాంచీలో మనోవ్యాధుల చికిత్సాలయానికి రావడం నీకిష్టంలేదని చెప్పావు.’’ బిపిన్‌బాబు కొన్న పుస్తకాలకు డబ్బిచ్చి దుకాణం వదిలి వెళుతుండగా ఆ వ్యక్తి శుద్ధ అపనమ్మకంతో అతన్నలాగే చూస్తూ ఉండిపోయాడు. బిపిన్‌బాబు కారును బెర్ట్రం వీధిలోని లైట్‌హౌస్ చిత్రశాల దగ్గర కార్లు నిలిపే స్థలంలో సురక్షితంగా నిలుపుతాడు. వచ్చి కారులో కూర్చుంటూ నడిపే వ్యక్తికి ‘‘కొంచెం అలా గంగ పక్కగా పోనియ్ సీతారాం’’ అని చెప్పాడు. తీరా రాస్తాపైన కారు పోతుండగా... ఇందాక తానడగకుండానే జోక్యం చేసుకుని చొరబడిన వ్యక్తి వద్ద శ్రద్ధ కనపరచినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. తానెప్పుడూ రాంచీ వెళ్లలేదు. దాని గురించి ప్రశ్నే లేదు. కేవలం ఆరేడు సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను మరచిపోవడం అసంభవం. తనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది– తనకి బుర్రతిరుగుడు జరిగితే తప్ప... తాను చలచిత్తుడైతే తప్ప– కానీ అదెలా జరుగుతుంది? ప్రతిదినం అతను కార్యాలయానికి వెళ్లి పని చేస్తూనే ఉన్నాడు. అదొక పెద్ద సంస్థ. అందులో తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఇప్పటివరకు ఏదైనా తీవ్రమైన తప్పు జరుగుతోందని అతని దృష్టికి వచ్చింది లేదు. ఈరోజే చాలా ముఖ్యమైన సమావేశంలో అరగంటసేపు మాట్లాడాడు. అయినా... అయినప్పటికీ, ఆ వ్యక్తి తన గురించి సవిస్తారంగా ఆరా తీశాడే. ఎలా? అతను కొన్ని ఆంతరంగిక వివరాలను సైతం తెలుసుకున్నట్లు కనిపిస్తోంది... పుస్తకాల సంచి, భార్య గతించడం, సోదరుని పిచ్చి... ఒకే పొరపాటు– తాను రాంచీ వెళ్లానని చెప్పడం గురించి. అది పొరపాటు మాత్రమే కాదు, బుద్ధిపూర్వకంగా చెప్పిన అబద్ధం. 1958లో అది పూజల సమయం. తాను తన మిత్రుడు హరిదాస్ బాగ్చీ దగ్గర కాన్పూర్‌లో ఉన్నాడు. ఈ విషయంలో అతనికి రాస్తే..? లేదు లేదు. హరిదాస్‌కు రాసే మార్గం లేదు. అతను తన భార్యతో సహా కొన్ని వారాల క్రితం జపాన్ వెళ్లాడనేది హఠాత్తుగా గుర్తుకొచ్చింది బిపిన్‌కి. అతని చిరునామా తన వద్ద లేదు. అయినా దీనికి రుజువుల అవసరం దేనికి? తాను రాంచీ వెళ్లలేదనేది తనంటత తనకి పూర్తిగా తెలిసిందే కదా!... అంతే! నది నుంచి వస్తున్న చల్లనిగాలి అతనికి కొంత బలాన్ని చేకూర్చింది. అయినా, కొద్దిపాటి అసౌకర్యం బిపిన్‌బాబు మనసులో తారాట్లాడుతోంది. తనను చుట్టుముడుతున్న తీవ్రతలో బిపిన్‌బాబు... ఒక ఆలోచనతో తన పొడవు నిక్కరును పైకి మడిచి కుడి మోకాలును చూసుకున్నాడు. ఒక అంగుళం పొడవున పాతగాయపు గుర్తు కనిపించింది. అదెప్పటిది అనేది చెప్పడం అసంభవం. చిన్నపిల్లవానిగా కిందపడి మోకాలి గాయం చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వీలవలేదు. బిపిన్‌బాబు అప్పుడు హఠాత్తుగా దినేష్ ముఖర్జీ గురించి ఆలోచించాడు. ఆ సమయంలో ఆ సమయంలో దినేష్ రాంచీలో ఉన్నాడని ఆ వ్యక్తి చెప్పాడు. అతనిని అడగడమే ఉత్తమమైన రుజువర్తనమవుతుంది. పైగా అతను దగ్గరలోనే బెహినందన్ వీధిలో ఉంటున్నాడు. ఇప్పుడే అతని దగ్గరకు వెళితే ఎలా ఉంటుంది? అయితే, అప్పుడు– వాస్తవానికి తానెప్పుడూ రాంచీ వెళ్లి ఉండకపోతే, బిపిన్‌బాబు దృఢపరచుకోవడానికి అడిగినట్లయితే, దినేష్ ఏవిధంగా ఆలోచిస్తాడు! బహుశా బిపిన్‌బాబు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడనే భావనకు వస్తాడు. లేదు. అతన్నడగడం వెర్రితనం. దయమాలిన దినేష్ తిరస్కార గుణం ఎలా ఉంటుందో తనకు తెలుసు. తన ఏసీ గదిలో కూర్చుని చల్లని ద్రవాన్ని చప్పరించడంతో బిపిన్‌బాబు మళ్లీ నిమ్మళం చేకూరిన అనుభూతిని పొందాడు. ఎంతటి పీకులాట? ఏమీ లేదు... చేయడానికి ఏ పనీ ఉండదు. ఇతరుల జుట్టులో కెలుకుతుంటారు. రాత్రి భోంచేసిన తర్వాత, కొత్తగా తెచ్చిన ఉత్తేజిత నవలల్లో ఒకదాన్ని పట్టుకుని నిమ్మళంగా పడకన చేరాడు. కొత్త అంగడి వీధిలో కలిసిన వ్యక్తిని గురించి మరచిపోయాడు. తర్వాతి రోజు కార్యాలయంలో గడుస్తున్న ప్రతిగంట క్రితంరోజు తాను ఎదుర్కొన్న పరిస్థితి తన మనసును మరీ మరీ ఆక్రమించుకుంటున్నట్లు గమనించాడు. అతను తన గురించిన అంతటి సమాచారం తెలుసుకుని ఉన్నాడు కదా మరి రాంచీ ప్రయాణం గురించి పొరపాటెలా పడ్డాడు. మధ్యాహ్న భోజన వేళకు కొంచెం ముందు దినేష్ ముఖర్జీకి ఫోను చేద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన సందేహాన్ని ఫోను సంభాషణల్లోనే తేల్చుకోవడం ఉత్తమం. కనీసం ముఖంలో కదలాడే కలతన్నా తీరుతుంది. రెండు... మూడు... ఐదు... ఆరు... ఒకటి... ఆరు బిపిన్‌బాబు ఈ అంకెలను నొక్కి ‘‘హలో!.. దినేషేనా?... నేను బిపిన్ని’’ ‘‘మంచిది– బాగుంది!... ఏమిటి సంగతులు!’’ ‘‘1958లో జరిగిన ఒక సంఘటన నీకు గుర్తుంటే, నేను కొంత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా...’’ ‘‘యాభై ఎనిమిదిలోనా? ఏ సంఘటన?’’ ‘‘ఆ సంవత్సరమంతా నువ్వు కలకత్తాలోనే ఉన్నావా? మొదటగా ఆ సంగతి నాక్కావాలి’’ ‘‘కొద్దిగా... ఒక్క నిమిషం ఆగు...58– కొద్దిగా నా డెయిరీలో పరిశీలించనివ్వు...’’ ఒక్క నిమిషం సేపు అటువైపు నిశ్శబ్దం. బిపిన్‌బాబు తన గుండె కొట్టుకోవడం పెరిగినట్లు భావించాడు. కొద్దిగా చెమట్లు కూడా పట్టాయి. ‘‘హలో!’’ ‘‘చెప్పు’’ ‘‘దొరికింది. నేను రెండుసార్లు బయటకు వెళ్లాను.’’ ‘‘ఎక్కడికి?’’ ‘‘ఒకసారి ఫిబ్రవరిలో దగ్గర్లోని కృష్ణనగర్‌కు మేనల్లుడి పెళ్లికి. తర్వాత... అయితే దీని గురించి నీకు తెలుసునే!– అది రాంచీ ప్రయాణం. నువ్వక్కడున్నావు కూడా.– అంతే! కానీ, ఏమిటిదంతా– ఈ పరిశోధన?’’ ‘‘ఏమీ లేదు. కొద్దిగా సమాచారానికి.– ఏమైనా– ధన్యవాదాలు’’ బిపిన్‌బాబు దడాలున ఫోను పెట్టేసి, తన తలను గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. తల ఈదులాడుతున్న భావన– ఒక చలి ఝలక్ తన శరీరమంతా పాకుతున్నట్లనిపించింది. భోజనపు గిన్నెలో రొట్టెముక్కల మధ్య మాంసం పొదిగిన పదార్థాలు ఉన్నాయి. కానీ బిపిన్ వాటిని తినలేదు. ఆకలంతా ఇగిరిపోయింది పూర్తిగా. మధ్యాహ్న భోజన సమయం తర్వాత బిపిన్‌బాబు బల్ల దగ్గర కూర్చుని తాను క్రితంలా యథాశక్తిగా పని నిర్వహించలేనేమోననుకున్నాడు. తాను ఆ సంస్థలో ఉన్న పాతికేళ్లలో ఏనాడూ ఇలా జరగలేదు. అలుపెరుగని, సత్యసంధత కలిగిన పనివానిగా అతనికి కీర్తి ఉంది. కానీ, ఈరోజు అతను అయోమయంలో పడిపోయి, సరైన ఆలోచన చేయలేకపోతున్నాడు. అతను రెండున్నరకి ఇంటికి తిరిగి వచ్చి మంచంపై పడుకుని ప్రశాంతతను కూర్చుకుని నెమ్మది ఆలోచనతో తన బుద్ధి వివేకాలను సమీకరించుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి తెలుసు. తలలో ఏదైనా గాయమైతే ఆ వ్యక్తి జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది. ఎవరో ఒక వ్యక్తి గుర్తుచేసిన ఒకే ఒక సంఘటన తప్ప ప్రతిదీ తనకు గుర్తుంది. సముచితంగా ఈ మధ్యనే జరిగిన ప్రాముఖ్యత కలిగిన ఆ ఒక్కటే... అతనెప్పుడో రాంచీ వెళ్లాలని కోరుకోవడం– వెళ్లడం. అక్కడ పనులు జరపడం... అవి జ్ఞాపకం లేకపోవడం... ఏదైనా పూర్తిగా అసంభవం! ఏడున్నర సమయంలో బిపిన్ సేవకుడు వచ్చి ‘‘అయ్యా! చునీబాబు... చాలా ముఖ్యమైన సంగతట...’’ అంటూ చెప్పాడు. చునీ ఎందుకొచ్చాడో బిపిన్‌బాబుకు తెలుసు. చునీలాల్ బడిలో తనతో ఉండేవాడు. ఈ మధ్య అతని రోజులు బాగాలేవు. అందుకని తరచు తన దగ్గరకు వస్తున్నాడు తనకేదైనా ఉద్యోగం చూడమని. అతని కోసం తానేదైనా చేయడం సంభవం కాదని బిపిన్‌బాబు బాగా ఎరుగును. వాస్తవానికి ఆ విషయం అతనితో కూడా చెప్పాడు. అయినా చునీ చెల్లని కాసులా వస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చునీని చూడటం తనకు సాధ్యం కాదని, ఇప్పుడే కాదు చాలా వారాల పాటు కుదరదని కబురంపాడు బిపిన్. అయితే, ఆ కబురుతో సేవకుడు గడప దాటిన మరుక్షణంలో బిపిన్‌బాబుకు ఒక ఆలోచన తట్టింది. 1958లో తన రాంచీ ప్రయాణం గురించి చునీకి ఏమైనా గుర్తుండవచ్చునేమోనని. అతన్ని అడగడంలో ఇబ్బంది ఉండదు కదా! తక్షణం బిపిన్‌బాబు హడావుడిగా మెట్లు దిగి కిందనున్న వాడుక గదిలోకి వెళ్లాడు. వెళ్లిపోబోతున్న చునీ బిపిన్ రావడం చూసి ఆశ చిగురించి వెనక్కు తిరిగాడు. బిపిన్‌బాబు డొంకతిరుగుడుకు ఇష్టపడకుండా సూటిగా అడిగాడు ‘‘చూడు చునీ! ఒక విషయం నిన్నడగదలచుకున్నాను. నీకు మంచి జ్ఞాపకశక్తి ఉంది. నువ్వు నన్ను చాలాకాలంగా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నావు. నీ మనసును కేవలం పాత రోజులకు మరల్చి ఆలోచించి చెప్పు. 1958లో నేను రాంచీ వెళ్లానా?’’ చునీ అన్నాడు: ‘‘యాభై ఎనిమిదా? అది యాభై ఎనిమిది అయి ఉంటుంది లేదా యాభై తొమ్మిది’’ ‘‘నేను రాంచీ వెళ్లాననేది నీకు నిశ్చయమేనా?’’ చునీ ఆశ్చర్యంగా చూసిన చూపుతో ఆతృత కలసి ఉంది. ‘‘పోయి ఉండటం గురించి ఏమాత్రమో సందేహాలు ఉన్నాయని భావిస్తున్నావా?’’ ‘‘నేను వెళ్లానా? నీకు స్పష్టంగా గుర్తుందా?’’ చునీ సోఫా మీద కూర్చుని దృఢపరచేలా బిపిన్ వైపు రెప్పలేయని దృష్టి నిలిపి అన్నాడు. ‘‘బిపిన్! మత్తు పదార్థాల్లాంటివేమైనా సేవించావా? నాకు తెలిసినంత వరకు అలాంటి అలవాట్ల విషయంలో నీకు స్వచ్ఛమైన చరిత్ర ఉంది. పాత స్నేహాలు నీకంతగా పట్టవని నాకు తెలుసు. కానీ, కనీసం మంచి జ్ఞాపకశక్తి ఉంది నీకు. రాంచీ ప్రయాణం గురించి నువ్వు మర్చిపోవడమనేది నీకు చిన్నతనమనిపించడం లేదా?’’ చునీ దృష్టి నుంచి బిపిన్‌బాబు వేరేవైపు తిరిగాడు. ‘‘నేను చివర్లో ఏం ఉద్యోగం చేశానో అదయినా గుర్తుందా నీకు?’’ చునీలాల్ అడిగాడు. ‘‘పర్యాటక ఏజెన్సీలో పనిచేశావు కదా!’’ ‘‘పోన్లే అదన్నా గుర్తుంది. కానీ, నీకు రాంచీకి రైలు టికెట్ సిద్ధపరచి తెప్పించింది నేనేననేది నీకు గుర్తులేదు. నిన్ను బండెక్కించి పంపడానికి ప్లాట్‌ఫామ్‌కు వచ్చింది నేనే! బోగీలోని ఫ్యాను పాడైతే ఆ వ్యక్తిని పిలుచుకు వచ్చి బాగుచేయించాను. వీటన్నింటినీ మరచిపోయావా? నీకేమైనా అయిందా? నీ ఒంట్లో బాగున్నట్లుగా కనిపించడం లేదు... అది తెలుసా నీకు?’’ బిపిన్‌బాబు నిట్టూర్చి తల అడ్డంగా ఊపాడు. కొంచెం సేపాగి అన్నాడు: ‘‘నేను చాలా ఎక్కువగా పని చేస్తున్నాను. అదే కారణమై ఉంటుంది. దీని గురించి వైద్య నిపుణుని సంప్రదించాలి.’’ సందేహం లేదు. చునీలాల్ తన ఉద్యోగం గురించి మాట్లాడకుండా వెళ్లిపోవడంతోనే బిపిన్‌కు పరిస్థితి అర్థమవుతోంది. చురుకైన మెరిసే కళ్లు. చక్కగా కొనదేలిన ముక్కుతో యువకుడైన పరేష్చందా వైద్య నిపుణుడు. ఆయన బిపిన్‌బాబు లక్షణాల గురించి వినగానే ఆలోచనలో మునిగాడు. ‘‘చూడండి డాక్టర్ చందా! ఈ దారుణమైన రుగ్మత నుంచి నాకు మీరు స్వస్థత చేకూర్చాలి. ఇది నా పని బాధ్యతలపై ఎంతగా ప్రభావం చూపిస్తోందో మీకు చెప్పలేను.’’ డాక్టర్ చందా తలను అడ్డంగా ఊపి అన్నాడు ‘‘మీకేమన్నా అర్థమవుతుందా మిస్టర్ చౌధురి! మీ రుగ్మత వంటి వ్యవహారాన్ని నేనింత వరకు చూడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నా అనుభవ పరిధిని దాటి కనిపిస్తోంది. అయితే నేనొక సూచన చేస్తాను. అదెంతవరకు పనిచేస్తుందో నేను చెప్పలేను. కానీ, అదొక మంచి ప్రయత్నం, హానికరం కాదు.’’ బిపిన్‌బాబు ఆరాటంగా ముందుకు వంగాడు. డాక్టర్ చందా చెబుతున్నాడు ‘‘నేననుకున్నదాని ప్రకారం మీరు రాంచీ వెళ్లి ఉంటారు. కానీ, ఏదో అవగాహనకు రాని కారణాల వల్ల ఆ కథన భాగం మీ మెదడు పొరలలోంచి తప్పుకుంది. దీనికిప్పుడు నా సూచన ఏమిటంటే, మీరు మళ్లీ ఒకసారి రాంచీ వెళ్లండి. మీరు ఆ ప్రదేశాలను చూస్తున్నప్పుడు మీ గత ప్రయాణం గుర్తు రావచ్చు. ఇది అసంభవమేమీ కాదు. నరాల సంబంధంగా ఉపశమనానికి నేనో మందు ఇస్తాను. నిద్ర చాలా ముఖ్యం. లేదా లక్షణాలు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి.’’ మర్నాటి ఉదయం బిపిన్‌బాబుకు కొంతవరకు నెమ్మదించినట్లు అనిపించింది. ఉదయం టిఫిన్ చేశాక ఆఫీసుకు ఫోన్ చేసి, కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసి, తర్వాత అదేరోజు సాయంత్రం రాంచీ ప్రయాణం కోసం మొదటి తరగతి టికెట్ ఏర్పాటు చేసుకున్నాడు. రెండోరోజు ఉదయం రాంచీలో బండి దిగి, గతంలో తాను ఏనాడూ అక్కడికి వచ్చి ఉండలేదని రూఢి చేసుకున్నాడు. అతను స్టేషన్ బయటకు వచ్చి, బాడుగ కారు తీసుకుని, తనే నడుపుకుంటూ కొంచెంసేపు పట్టణాన్ని చుట్టి వచ్చాడు. ఆ వీధులు, కట్టడాలు, ఫలహార భోజనశాలలు, వ్యాపార స్థలాలు, మోరాబాడీ కొండ ఏ ఒక్కటీ తనకే మాత్రం పరిచయం కలిగినది కాదని రూఢి చేసుకున్నాడు. హుద్రూ జలపాతాల వద్దకు వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందా! తనకా నమ్మకం లేదు. కానీ, అదే సమయంలో తాను తగినంత ప్రయత్నం చేయకుండా వదిలేశాననే శంక లేకుండా చేయాలనుకున్నాడు. సాయంత్రం ఒక కారును ఏర్పాటు చేసుకుని హుద్రూకు వెళ్లాడు. అదే సాయంకాలం ఐదుగంటలకు ఒక వనభోజనాల బృందంలోని ఇద్దరు గుజరాతీలు బిపిన్‌బాబు ఒక పెద్ద బండరాయి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. అతను తిరిగి స్పృహలోకి వచ్చాక అతను అన్నది ‘‘నేను అయిపోయాను. ఇంకే ఆశా మిగల్లేదు’’ అని. తర్వాతి ఉదయానికి బిపిన్‌బాబు తిరిగి కలకత్తా వచ్చాడు. నిజానికి తనకేమాత్రం ఆశ మిగల్లేదనే నిశ్చయానికొచ్చాడు. ‘త్వరలో పనిమీద ఇచ్ఛ, నమ్మకం, సామర్థ్యం, ఆలోచన నియంత్రణ అన్నీ కోల్పోతాను. నేను... నా జీవితం శరణాలయంలో ముగిసిపోతుందా?’’ బిపిన్‌బాబు ఇక ఆపై ఆలోచించలేకపోయాడు. తిరిగి ఇంటికి చేరి, డాక్టర్ చందాకు ఫోన్‌చేసి ఇంటికి రమ్మని కోరాడు. తర్వాత తలస్నానం చేసి, తలకు ఐస్‌బ్యాగ్ బిగించుకుని పడుకున్నాడు. అదే సమయంలో సేవకుడు వచ్చి లెటర్బాక్సులో ఎవరో ఉంచారని చెప్పి ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు. ఆకుపచ్చని కవరుపై ఎర్రసిరాతో తనపేర రాయబడి ఉందది. పేరు పైభాగంలో ‘‘అత్యవసరం– ఆంతరంగికం’’ అని రాసి ఉంది. తన ప్రస్తుత స్థితి బాగాలేకపోయినా బిపిన్ బాబు ఆ ఉత్తరం చదివి తీరాల్సిందిగా భావించాడు. కవరును ఒకవైపు చించి ఉత్తరం బయటకు తీశాడు. అందులో ఇలా ఉంది. ‘‘ప్రియమైన బిపిన్! ఐశ్వర్యం నీలో ఈ విధమైన మార్పు తెస్తుందని నేననుకోలేకపోయాను. నువ్వు మారిపోయావు. అదృష్టం జారిపోయిన ఒక పూర్వమిత్రునికి సహాయం చేయడం నీకంతటి కష్టతరమా? నాకు డబ్బులేదు. అలా నా సంపాదన వనరులు పరిమితమైపోయాయి. ఇక నాకున్న ఆలోచనేమిటి? అందులో భాగంగానే దయాదాక్షిణ్యాలు లేని నీ ప్రవర్తనకు ప్రాయశ్చిత్తం కలిగించే ఒక మార్గం ఎన్నుకున్నాను. కొత్త అంగడి వీధిలో నీకెదురైన వ్యక్తి మా పొరుగింటివాడు. నాకు పరిచయస్తుడు. సామర్థ్యమున్న నటుడు. అందుకే, నేనతనికి రాసిచ్చినదంతా అవగాహనతో నటించగలిగాడు. ఇక, దినేష్ ముఖర్జీ.. తానేనాడూ, ముఖ్యంగా నీ పట్ల సదుద్దేశం, స్నేహం కలిగినవాడు కాదు. అందుకే ఈ విషయంలో నాకు సహాయపడటానికి పూర్తి అంగీకారం ఇచ్చాడు. నీ మోకాలి మచ్చ విషయానికొస్తే, 1939లో చాంద్పాల్ ఘాట్‌లో నువ్వు ఒక తాడు నుంచి జారిపడ్డప్పటిదని ఇప్పుడు నువ్వు కచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటావు. సరే, ఇక ఇప్పుడు నువ్వు తిరిగి స్వస్థత పొందుతావు. నేను రాసిన ఒక నవలను ముద్రించడానికి ఒక ప్రచురణకర్త అంగీకరించాడు. అతను గనుక నాకు తగినట్లుగా ఇష్టపడినట్లయితే, అదే చాలు– రాబోయే కొద్ది నెలల్లో అదే నన్ను కాపాడుతుంది. నీ చునీలాల్’’ భారతీయ ఆంగ్ల మూలం : సత్యజిత్ రాయ్ అనువాదం: సుంకర కోటేశ్వరరావు -
తొలి రేడియో స్టేషన్ ఎక్కడో తెలుసా?
కవర్ స్టోరీ సమస్త సమాచారం, అభిరుచికి తగిన వినోదం ఇప్పుడు అరచేతిలోకే అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయింది. దాదాపు శతాబ్దం కిందట సమాచారం కోసం వార్తా పత్రికలే ఆధారం. రంగస్థల కళలు, జానపద కళారూపాలే వినోద సాధనాలు. అక్షరాస్యత తక్కువగా ఉన్న నాటి కాలంలో వార్తా పత్రికలతో జన సామాన్యానికి పెద్దగా నిమిత్తం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో రేడియో రాకడతో తొలితరం సమాచార విప్లవం మొదలైందనే చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో సంపన్నుల ఇళ్లలో హోదాకు చిహ్నంగా ఉండే రేడియో సెట్లు అనతి కాలంలోనే పంచాయతీ కార్యాలయాల వరకు, ఆ తర్వాతి కొద్ది కాలానికే సామాన్యుల ఇళ్లకు విస్తరించాయి. రెండు మూడు తరాల వారికి రేడియో ఆనాటి ఆటవిడుపు. మన దేశంలో టీవీ ఎనభయ్యో దశకంలో అందుబాటులోకి వచ్చింది. టీవీ సెట్లు మధ్య తరగతి నట్టిళ్లకు చేరక ముందు సమాచార, వినోద రంగాల్లో రేడియో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగిం చింది. స్మార్ట్ఫోన్ల యుగం మొదలైనా, రేడియో ఇంకా శ్రోతలను అలరిస్తూనే ఉంది. సెల్ఫోన్ల లోనూ ఎఫ్ఎం స్టేషన్ల ప్రసారాలు రేడియో అభిమానులను ఇంకా ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వంటివి రేడియో ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న రేడియో, కొత్త కొత్త సాధనాల ద్వారా శ్రోతలకు చేరువవుతూనే ఉంది. సాంకేతిక రంగంలో శరవేగంగా సంభవిస్తూ వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో ఆరు ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 215 ఆకాశవాణి కేంద్రాల నుంచి 337 ప్రసార కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 144 మీడియం వేవ్ కేంద్రాలు, 54 షార్ట్ వేవ్ కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి. రేడియో పుట్టుక ఇలా... విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను తొలుత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్1886లో గుర్తించాడు. దాదాపు దశాబ్దం తర్వాత 1895–96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త మార్కోనీ. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లతో కొలవడం మొదలైంది. మార్కోనీ వివిధ దశల్లో కొనసాగించిన ప్రయోగాలు విజయవంతమవుతూ వచ్చాయి. ఇవి అనతికాలంలోనే తొలి రేడియో ప్రసార కేంద్రం ఆవిర్భావానికి దారి తీశాయి. పిట్స్‌బర్గ్‌లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబరు 2న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో పిట్స్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనపరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లాండ్ అయినా, అక్కడి ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. వైర్లెస్ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలసి 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) స్థాపించాయి. బీబీసీ 1922 నవంబరు 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) నియంత్రిస్తుంది. సమాచార సాంకేతికత పురోగతిలో రేడియో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. ఇది కేవలం రేడియో ప్రసారాలకు మాత్రమే పరిమితం కాదు. టీవీ ప్రసారాలకు, సెల్ఫోన్లు, రాడార్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిమోట్ కంట్రోల్, రిమోట్ సెన్సింగ్, వైర్లెస్ నెట్వర్కింగ్, ఉపగ్రహ ప్రసారాలు వంటి వాటన్నింటికీ రేడియో సాంకేతికతే మూలాధారం. రేడియో సాంకేతికత ఫలితంగానే నేడు ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయే స్థాయికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధ్యమైంది. రేడియో నిర్మాణంలో మార్పులు తొలినాటి రేడియో సెట్లలో ఇప్పటి మాదిరిగా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్ నెట్ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. తొలినాళ్లలో రేడియో ప్రసారాలు లాంగ్ వేవ్, మీడియం వేవ్‌లలో జరిగేవి. వేవ్ లెంగ్త్ ఎక్కువయ్యే కొద్దీ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా కాకుండా, కలగలసి వినిపించే పరిస్థితి తరచుగా తలెత్తేది. షార్ట్ వేవ్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఈ ఇబ్బంది కొంత దూరమైంది. రేడియో ప్రసారాల్లో ప్రసారమయ్యే శబ్దాలకు అనుగుణంగా తరంగాల వెడల్పును మార్చే ‘ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్’ (ఏఎం) ఉపయోగిస్తారు. అల్ట్రాషార్ట్ వేవ్స్‌తో ప్రసారాలు సాగించే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ (ఎఫ్ఎం) రేడియో ప్రసారాలు మొదలైన తర్వాత రేడియో ప్రసారాల్లో ఇదివరకు ఎదురయ్యే ఇబ్బందులు దూరమయ్యాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే శాటిలైట్ రేడియోలు, ఇంటర్నెట్ రేడియోలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చిలైట్లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్లు కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో పాటు, పరిమాణంలోనూ ఇవి చిన్నగా ఉండటంతో ట్రాన్సిస్టర్లు అనతికాలంలోనే సామాన్యుల ఇళ్లకూ చేరుకున్నాయి. ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని రేడియో ప్రసారాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు రూపొందుతూ, జనాలను అలరించసాగాయి. బాంబేలో మన తొలి రేడియో స్టేషన్ బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‌ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1927 జూలై 23న ప్రారంభించారు. అంతకు ముందు రేడియో క్లబ్ ఆఫ్ బాంబే 1923లో దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 1936లో ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో ఏర్పడిన రెండేళ్లకు–1938 జూన్ 16న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకట రెడ్డినాయుడు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ప్రారంభోపన్యాసాలు చేశారు. అంతకు ఐదేళ్ల ముందే హైదరాబాద్‌లో మహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పట్లో హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న నిజాం రాజు 1935లో ఆ రేడియో స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి. దీనికే 1939లో దక్కన్ రేడియోగా పేరు మార్చారు. దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు. ఆయన పట్టుదల ఫలితంగా 1948 డిసెంబరు 1 నాటికి దక్కన్ రేడియోలో తెలుగు ప్రసారాలకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో (ఆకాశవాణి) పరిధిలోకి తెచ్చింది. అంతకు ముందే 1948 డిసెంబరు 1న విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. విశాఖపట్నం, కడపలలో 1963లో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తర్వాతి కాలంలో కర్నూలు, తిరుపతి, అనంతపురం, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌లలో కూడా ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేడియోస్టేషన్లన్నింటినీ 2006 సంవత్సరం వరకు భారత ప్రభుత్వమే నడిపేది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం ప్రసారాలను కూడా అందిస్తున్నాయి. ఇవికాకుండా, పలు ప్రైవేటు ఎఫ్ఎం రేడియో కేంద్రాలు కూడా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఆకాశవాణి తొలినాళ్లలో విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి వినోద విజ్ఞానాలను మేళవించిన జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అనతికాలంలోనే ఈ కార్యక్రమాలు ఆనాటి జనజీవితంలో భాగమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాశవాణి కేంద్రాలే కాకుండా, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం తెలుగులో వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్ కేంద్రాలు కూడా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. తెలుగులో తొలి ప్రసారాలు తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్ 16న సాయంత్రం5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు. ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది. అంజయ్య మంత్రివర్గం రాజీనామా, విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, ఎన్టీఆర్ మరణవార్త మొదటిగా వెల్లడి చేసిన ఘనత ఆకాశవాణి వార్తలకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, అద్దంకి మన్నార్, పీఎస్సార్ ఆంజనేయ శాస్త్రి, డి.వెంకట్రామయ్య, ప్రయాగ రామకృష్ణ, మామిళ్లపలి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, జ్యోత్స్నాదేవి తదితరులు ఎందరో రేడియోలో వార్తలు చదవడం ద్వారా ప్రసిద్ధులయ్యారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. తొలినాళ్లలో ‘గీతావళి’ పేరుతో భావగీతాలు ప్రసారమయ్యేవి. ‘లలిత సంగీతం’ అనే పేరు మాత్రం ఆకాశవాణి ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఎమ్మెస్ రామారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తరంజన్, మల్లిక్, సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతీ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి ప్రముఖ కవులు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు, గ్రామీణులకు, కార్మికులకు, యువతరానికి, కవులు, రచయితలకు ఆకాశవాణి అనేక కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు వ్యాఖ్యాతలు శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఎందరో మహానుభావులు... సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. శ్రీశ్రీ, జాషువా వంటి కవులు కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, ఆచంట జానకిరాం, తెన్నేటి హేమలత, దాశరథి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలంత్రపు రజనీకాంతరావు, బందా కనకలింగేశ్వరరావు వంటి సాహితీ సంగీత నాటకరంగ ప్రముఖులు ఆకాశవాణిలో పనిచేసిన వారే. గ్రామీణ కార్యక్రమాల వ్యాఖ్యాతగా ప్రయాగ నరసింహశాస్త్రి గ్రామీణ శ్రోతలకు చేరువైతే, ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ద్వారా ఉషశ్రీ రేడియో శ్రోతల్లో ఆబాలగోపాలాన్నీ అలరించారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి బాలల కార్యక్రమాల ద్వారా కొన్ని తరాల పిల్లలను ప్రభావితం చేశారు. ఆకాశవాణికి సేవలందించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. ఆకాశవాణిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఎందరో మహానుభావులు ఎనలేని కృషి చేశారు. వారందరికీ వందనాలు. – పన్యాల జగన్నాథదాసు -
సోలో జర్నీ...సో బెటరు...
నేను ముంబైలో చదువుతున్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి భారతదేశంలో కొన్ని ప్రదేశాలూ, యూరప్‌లో కొన్ని దేశాలూ, ఈజిప్ట్ చూశాను. అలాగే అమెరికాలో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పర్యాటన చేశాను కానీ, జపాన్ చూడాలన్న కల మాత్రం ఈమధ్య వరకూ తీరలేదు. జపాన్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక ఏ సీజన్లో వెళ్ళాలని ముందుగా ఆలోచించాను. వసంతకాలంలో వెళ్తే సకురా హనామి (చెర్రీ పూల కనువిందు), వేసవిలో ఐతే నత్సుమత్సూరి (వేసవి ఉత్సవాలు), శిశిరంలో మోమోజీ (ఎర్రని మేపిల్ చెట్ల దర్శనం) ఉంటాయి. నేను శిశిరంలోనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను – ఇంకోసారి తక్కిన సీజన్లలో వెళ్ళచ్చని అనుకుంటూ. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించుకున్నాక, ముందుగా ఏర్పాటు చేసుకోవల్సింది వీసా. నేను అమెరికా నుండి జపాన్ వెళ్తూండడం వల్ల వీసా పని సులభంగా అయిపోయింది. నిజానికి భారతదేశం నుండి కూడా జపాన్ వీసా రావడం సులభమే. చాలా దేశాలతో పోలిస్తే జపాన్ వీసా ఫీజు కూడా చాలా తక్కువ. సుమారుగా ఐదువందల రూపాయలు. 2020 నుండి జపాన్ ప్రభుత్వం భారత పర్యాటకులకి ఈ–వీసా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వెళ్దామనుకున్న వాళ్ళు ఈ ఈ–వీసా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీసా తర్వాత మనం వెళ్ళబోయే దేశంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలి అని ప్రణాళిక వేసుకోవాలి. నా ప్రయాణం మొత్తం పదిరోజులే కాబట్టి నేను మూడు నాలుగు ప్రదేశాల కన్న ఎన్నుకోలేను, ఒక్కో చోటా రెండు మూడు రోజుల కన్న ఎక్కువ సమయం ఉండలేను. జపాన్‌లో ఉండే రకరకాల సంస్కృతుల్ని కొంచెం కొంచెంగా అనుభవించాలని నేను – నవీనత్వం కోసం టోక్యోనీ, రాచరికపు చిహ్నాల కోసం కానజావానీ, ఆలయాల కోసం క్యోటోనీ, గత వైభవపు కోట కోసం హిమేజీనీ, ప్రకృతి కోసం, ఆలయాల కోసం నారానీ ఎంచుకున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఒక ప్రాంతంలో లేవు. అందుకని జపాన్ ఒక మూల నుండి ఇంకో మూలకి తిరగాల్సిన అవసరం ఉంది. ఐతే ఆ ఆవసరం ప్రపంచ ప్రసిద్ధమైన జపాన్ షిన్కాన్సెన్ (బుల్లెట్ రైళ్ళు) వాడే అవకాశం కూడా కలిగించింది. జపాన్‌లో ప్రయాణాలకి నేను జపనీస్ రైల్ పాస్ తీసుకున్నాను. అది ఆన్లైన్లో ముందుగానే కొనుక్కోవచ్చు. జపాన్ రైల్ నెట్‌వర్క్‌లో ఎప్పుడు రైలు ఎక్కాలన్నా ఆ పాస్ ఉపయోగపడుతుంది. షిన్కాన్సెన్ రైళ్ళలో సీటు రిజర్వ్ చేసుకుందుకు కూడా ఆ పాస్ ఉపయోగిస్తుంది. ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకి పాస్ చాలా ఉపయోగకరం. నేను వారం రోజుల పాస్ తీసుకున్నాను. వీసా, రైలు టికెట్ తర్వాత చూసుకోవల్సింది ఎక్కడ ఉండాలన్నది. ఒక్కళ్ళమే ప్రయాణం చేస్తున్నప్పుడు హŸటళ్ళలో కాకుండా హాస్టళ్లలో ఉండడం మంచిది. హాస్టళ్ళలో ఉంటే – మనలాగే ప్రయాణాలు చేసే వాళ్లని కలవచ్చు. ఒక్కోసారి వాళ్లతో కలిసి కొన్ని ప్రదేశాలు చూడచ్చు. అదీకాక హాస్టళ్ళు సురక్షితంగా అనిపిస్తాయి. అద్దెలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. నేను ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు హాస్టళ్లలో ఉండటమే మంచిదనిపిస్తుంది. నేనంతకు ముందు కొన్ని చోట్లకి సోలోగా ప్రయాణం చేశాను కానీ పది రోజులు ఒంటరిగా వెళ్ళడం జపాన్‌తోనే మొదలైంది. టోక్యో నరీతా విమానాశ్రయంలో దిగడంతో నా జపాన్ పర్యటన మొదలైంది. విమానాశ్రయం నుండి ట్రైన్ ఎక్కి అసకుసలో ఉన్న నా బసకు చేరుకున్నాను. అక్కడ నా గది మూడు గోడలకీ, అల్మైరాకీ మధ్యన ఉన్న ఒక పడక. ఐతే అందులో టీవీ, స్టొరేజ్, సేఫ్ లాంటి సౌకర్యాలతో పాటు నిత్యావసరాలకి అవసరమైన కిట్ కూడా ఉంది, పైజామాతో సహా. నేను ఆ హాస్టల్ ఎంచుకున్నది ప్రధాన కారణం అది సెన్సోజీ ఆలయానికి దగ్గరగా ఉండడం. మనం వెళ్ళే ఊళ్ళలో ఉండే ప్రధాన పర్యాటక ప్రదేశాలకి దగ్గరగా మనం ఉంటే మనకి సమయం బాగా కలిసి వస్తుంది. నేను నా బసకి చేరుకున్నది సాయంత్రం. సూర్యాస్తమయం తొందరగా అయిపోవడం వల్ల చీకటిలో దీపాల కాంతిలో ఆ గుడిని నేను చూశాను. ఆ గుడి చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధమైనది. మర్నాడు నేను ఇషికావా ప్రాంతంలో ఉన్న కనజావాకి వెళ్ళాను. బుల్లెట్ రైలులో అదే నా మొదటి ప్రయాణం. రైలు అందమైన ప్రకృతి మధ్య వేగంగా సాగిపోయింది. కనజావాలో నేనో బొతిక్ హాస్టల్లో ఉన్నాను. సమురై డిస్ట్రిక్ట్ గా పేరుగాంచిన నాగామాచీ నన్ను శతాబ్దాల వెనకటి రోజుల్లోకి తీసికెళ్ళింది. అలానే హిగషి ఛాయా డిస్ట్రిక్ట్ లో గీషా (టీ వేడుక) గొప్ప అనుభవం. రాత్రి హాస్టల్లో గడిపి రెండోరోజు ఉదయమే – అక్కడున్న వనాల్లో తిరగడానికి వెళ్లాను. ఉదయం వెళ్తేనే ప్రకృతిæ రమణీయత బాగా ఆస్వాదించగలం. చెట్లనీ, రాలుతున్న ఆకుల్నీ, సరస్సుల్నీ తనివితీరా చూసి, దగ్గర్లోనే ఉన్న కానజావా కోటని కూడా చూశాను. కానజావా నుండి క్యోటోకి వెళ్లాను. ఆ దారిలో బుల్లెట్ రైలు లేదు. అందుకని థండర్ బర్డ్ అనే ఎక్స్ప్రెస్స్ రైల్లో ప్రయాణం చేసాను. దారిలో జపాన్ పల్లెటూరి వాతావరణం చూడగలిగాను. క్యోటోలో నేను సాంప్రదాయకమైన అతిథి గృహంలో ఉన్నాను. అలా ఉండడం వల్ల జపాన్ సంస్కృతి తెలుసుకోవచ్చు. ఆ సాయంత్రం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన కియోమిజుదేరా ఆలయాన్ని చూశాను. ఆ సమయంలో శిశిరపు ప్రత్యేక దీపాలంకరణ అద్భుతంగా అనిపించింది. క్యోటోలో లోకల్ బస్ పాస్ కొనుక్కుని ఉదయమే బంగారు భవనం అని పిలవబడే కిన్కాకుజీ ఆలయానికి వెళ్లాను. ఆ తర్వాత క్యోటోలో ఎక్కువగా ఫొటోగ్రాఫులకెక్కే అరషియామా వెదురు పొదలకి వెళ్లాను. అక్కడ నడుస్తూ గాలికి వెదురు పొదల మీద నుండి శబ్దాలని వినడం శ్రవణానందకరం. అది అనుభవైకవేద్యం. అలా నడుస్తూ ఫుషిమీ ఇనారీ దగ్గర మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశాల్లో తిరిగాను. క్యోటో తర్వాత నా బస నారాలో. నారాలో ఉన్న జింకల పార్కు పక్కనే నా హాస్టల్. నాగరికతకి దూరంగా, జింకలకి దగ్గరగా ఉండడం ఓ అనుభవం. హాస్టల్లో కొందరితో కలిసి జింకల పార్కులో తిరిగాను. మర్నాడు ఉదయమే దగ్గర్లోని గుళ్ళని చూశాను. ఆ తర్వాత హిమేజీ ఆలయానికి ప్రయాణం అయ్యాను. దానికి బుల్లెట్ రైల్లో రెండు గంటల ప్రయాణం. ఐతే హిమేజీ కోట అద్భుతమైంది. అంతేకాదు. శిధిలమైపోకుండా ఉన్న కొన్ని కోటల్లో అది ఒకటి. తర్వాత తోదైజీ ఆలయానికి వెళ్ళాను. నేనెన్నో బౌద్ధాలయాలకి వెళ్ళాను కానే అవన్నే తొదైజీ బౌద్ధ మందిర వైభవానికి సాటి రావనిపించింది. ఆ ఆలయ దర్శనం తర్వాత నారా జింకలపార్కులో గడిపాను. నారాలో రెండురోజులూ ఆనందంగా సమయం తెలియకుండా గడిచిపోయింది. అక్కడ నుండి మళ్ళీ టోక్యోకి బుల్లెట్ రైల్లో ప్రయాణమయ్యాను. క్యోటో నుండి టొక్యోకి వెళ్తోంటే దార్లో మౌంట్ ఫుజీ కనిపిస్తుంది. నాకు తెలిసిన జపనీస్ ఙ్ఞానంతో నేను క్యోటో టికెట్ ఆఫీసులో, నేనెటు కూచుంటే ఫుజీ కనిపిస్తుందో కనుక్కుని రైల్లో అటుపక్క కిటికీ సీట్ సంపాదించాను. అలా మంచు నిండిన అగ్నిపర్వతం ఫుజీని స్పష్టంగా చూడగలిగాను. ఈసారి టోక్యోలో నేను ఉన్న హాస్టల్ అంతా ఆడవాళ్ళకే. అంతకు ముందున్న హాస్టళ్ళలో నేనున్న గదులు మాత్రం ఆడవాళ్లకి ఉండేవి. ఇన్నాళ్ళూ ప్రకృతి అందాన్నీ, గత వైభవ చిహ్నాలనీ చూస్తున్న నాకు టోక్యోలో ఆధునికత కొట్టొచ్చినట్లు కనిపించింది. గింజా, షిన్కూజూ, షిబూయా, అకిహాబరాలలో ఎలక్ట్రానిక్, ఎనిమే, మాంగా కొట్లు కొత్త వస్తువులతో వెలిగిపోతూ ఉండడం చూశాను. అలానే జపాన్ పెన్నులకీ ఇంకులకీ ప్రసిద్ధి. నేనిప్పటికీ ఇంకు పెన్నులు వాడతాను. అవి కొన్ని కొనుక్కున్నాను. ఆ తర్వాత కామాకురలో బౌద్ధాలయం చూశాను. పక్కనే పసిఫిక్ మహాసముద్రం దగ్గరకెళ్ళాను కానీ, చాలా చల్లగా ఉండడంతో నీళ్లలోకి దిగలేదు. ఆహరం గురించి ప్రస్తావించుకోకుండా జపాన్ పర్యటన ముచ్చటని ముగించలేం. పూర్తి శాకాహారిని కాబట్టి నాకు ఆహారం కష్టం అవుతుందని నేను భయపడ్డాను కానీ, వీగన్ రెస్టారెంట్లు ఎక్కువగానే ఉండడం వల్ల పెద్ద నగరాల్లో సమస్య లేకపోయింది. పెద్ద నగరాలు కాని చోట్ల కూడా గ్రాసరీలలో బన్నులూ, బ్రెడ్డులూ లాంటివి దొరుకుతాయి. ఐతే చూడ్డానికి శాకాహరంలా కనిపించే వస్తువుల్లో శాకాహారం కానివి ఏవైనా చేరి ఉంటాయా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఐతే ఆహారం యాప్స్ ద్వారా చాలా విషయాలు ముందుగానే తెలుసుకోవచ్చు కాబట్టి నాకు బానే గడిచింది. నారాలో ఒకరోజు ఉదయం ఐదు గంటలకి నాకు హాట్ చాకొలేట్ దొరికింది కూడా. జపాన్‌లో అన్నిటి కన్న ముఖ్యం భాష. అక్కడ చాలా మందికి ఇంగ్లిష్ రాదు. నేను జపాన్ వెళ్దామని అనుకున్న తర్వాత కొంచెం జపనీస్ నేర్చుకున్నాను. అది కొంత ఉపయోగపడింది. ఐతే అనువాద యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాటిని వాడుతూ అన్ని చోట్లా పనులు చేసుకున్నాను. అంతేకాదు. జపాన్‌లో చాలామంది వాళ్లకి భాష రాకపోయినా మనకి సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. హడావిడి పడకుండా నేను అడిగిన దాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించారు. వాళ్లలో చాలా మందికి భారతదేశం అంటే అభిమానం ఉన్నట్లు అనిపించింది. నాతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఓ పదిరోజులు ఆ దేశం ఆత్మీయపూర్వకమైన ఆతిథ్యం చవిచూడడం మరిచిపోలేని అనుభవం. ఇంకో జపాన్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. – అపరాజిత అల్లంరాజు(రచయిత్రి అమెరికాలో ఎమ్మెస్ చేసి యాపిల్‌లో పని చేసి భారతదేశం వచ్చేసి ప్రస్తుతం ఇండిపెండెంట్ కన్సల్టన్ట్ గా పనిచేస్తోంది) -
విదుర నీతి
పాండవులతో యుద్ధం తప్పదని తెలిసిన ధృతరాష్ట్రుడు, జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి కలవరపడుతూ విదురుని పిలిచి ‘‘విదురా! నాకు మనసు అస్థిమితంగా ఉంది. నాకు మంచిమాటలు చెప్పి, ఉపశాంతి కలిగించు’’ అని అడిగాడు. అప్పుడు విదురుడు అతనితో ఇలా అన్నాడు. ‘పక్వానికి రాక మునుపే పండును కోస్తే తినడానికి రుచిగా ఉండక పోవడమే కాక, దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. దండలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులు కోసే విధంగా, తేనెటీగలు పూవు నుంచి తేనెను గ్రహించే విధంగా ఎదుటివాడు బాధ పడకుండా పనిచేసి ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టు మొదలంటా నరకకూడదు. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి, తేజస్సుకు, ఈర‡్ష్య చెందే వాడు ఏ రోగం లేకుండానే బాధ పడతాడు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోతే మాట్లాడకుండా ఊరకే ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మం, పాపం, కీర్తి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది. కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. శరీరంలో విరిగిన బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలనే గాయాలను ఎన్ని ఉపాయాలతోనైనా మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు. కాని నీ కొడుకులు ఒకరిని మించి ఒకరు నీచవాక్యాలు అనేకం పేలుతూ ఉంటే నీవు దానిని జంకూగొంకూ లేకుండా వింటూ ఊరుకుంటున్నావు. నీకు ఇది తగునా? చేటు కాలం దాపురించినప్పుడు చెడ్డ మాటలు, చెడు చేతలూ కూడా మనసుకు ధర్మ బద్ధంగానే కనిపిస్తాయి. పాండురాజు నీ సోదరుడు. అతని కుమారులు కూడా నీకు తేజస్సు, లాభం సంపాదించి పెట్టారు. వారిని ఆదరించు. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది. మిక్కిలిగా దుఃఖిస్తే శత్రువుకు అది సంతోషాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను. జ్ఞాతి వైరం వదిలి పెట్టు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను రక్షించుకో. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు’’ అన్నాడు. ధృతరాష్ట్రుడు ‘‘విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను’’ అన్నాడు. పైకి అలా అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహం, రాజ్యకాంక్ష, దాయాది వైరం వదులుకోలేక నశించిపోయాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతులు అనేకం ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
అనుబంధం
రోజలీనా ఆ మూడు కొబ్బరిచెట్లకూ తన పిల్లల పేర్లు పెట్టుకుంది: ఏంజిలా, ఆంథోనీ, ఏబెల్. ఇప్పుడు మొదటి రెండు చెట్లకు నీరు పొయ్యడం పూర్తయింది. పైపు పట్టుకుని మూడో చెట్టు వద్దకు వచ్చింది. ఏబెల్ ఇంకా చిన్న చెట్టే. ఇప్పుడిప్పుడే కాపుకొస్తోంది. అంతలో ఇంటి ముందు కంచెకు ఆవల సైకిలు బెల్ మోత వినపడింది. రోజలీనా నీటిపైపును ఏబెల్ చెట్టు మొదట్లో పడవేసి గేటు వద్దకు పరుగు తీసింది. పోస్ట్‌మేన్ వాసు వచ్చాడు. ‘‘అమ్మా! మధ్యాహ్నం కావస్తోంది. నువ్వింకా చెట్లకు నీరు పెట్టడం పూర్తి కాలేదా?’’ అంటూ ప్రవేశించాడు. సైకిలును కంచె వెలుపల విడిచిపెట్టాడు. ‘‘రాత్రి నిద్ర పట్టలేదు నాయనా! వేకువనే కునుకు పట్టేసింది. తీరా లేచే సరికి బాగా పొద్దెక్కిపోయింది’’ అంది రోజలీనా. వాసు ఆ ఉత్తరాన్ని చేతికి అందివ్వకుండానే అది ఆంథోనీ నుంచేనని ఆమె గ్రహించింది. దాని కోసమే ఆమె కొద్ది రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆ భూసేకరణ తాఖీదును అందుకున్నప్పటి నుంచి రోజలీనా ఎంతో ఆందోళన చెందుతోంది. ‘‘అబ్బాయి ఆ ఉత్తరంలో ఏం రాశాడో? నా ఉత్తరం వాడికి అందే ఉంటుంది. రావాలని నిర్ణయించుకున్నాడో లేక రాలేనని చెప్పబోతున్నాడో?’’ ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవడానికి ఆత్రపడుతోంది. కాని వయసు ప్రభావం వల్ల ఈ మధ్య ఆమె దృష్టి మందగించింది. తన భర్త ఉన్నంతకాలమూ ఇతరుల సహాయం అవసరమయ్యేది కాదు. కాని రెండేళ్ల కిందట అతడు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడామె ఒంటరిదైపోయింది. ఉత్తరం చదవడానికి బయటివారి మీద ఆధారపడటం తప్పనిసరి అవుతోంది. ఒక పెద్ద గ్లాసుతో పోస్ట్‌మేన్‌కు మంచినీరు అందించింది. ‘ఇతడినే ఉత్తరం చదివి పెట్టమని ఎందుకు అడక్కూడదు?’ అనుకుంది. ‘‘ఈ ఉత్తరం చదివి అందులో ఏముందో చెప్పు..’’ అని అడిగింది. ‘‘తప్పకుండా! రహస్యాలేమీ ఉండవు కదా!’’ ఛలోక్తిగా అంటూ కవరు అందుకుని తెరిచాడు. ఈ మధ్య ఆంథోనీ తను చదవడానికి వీలుగా ఉత్తరాన్ని టైప్ చేసి పంపుతున్నాడు. కాని భర్త చనిపోయిన తర్వాత ఆమె బాగా కుంగిపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఒక చిన్న ఉత్తరం చదవడానికి చాలాసేపు పడుతోంది. అయినప్పటికీ ఉత్తరంలోని అంశాలను నిర్ధారించుకోవడానికి పొరుగింటామెపై ఆధారపడక తప్పడంలేదు. ఉత్తరం చూస్తూ వాసు ఇలా చెప్పాడు: ‘‘అమ్మా! ఇది ఆంథోనీ నుంచి వచ్చింది. ఈ నెలాఖర్లో భార్యా పిల్లలతో ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశాడు. ఏబెల్ అతడికి ఉత్తరం రాశాడట. ఏబెల్ ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట. అందుకోసం కువైట్ నుంచి ఆంథోనీ, బహ్రెయిన్ నుంచి అక్క ఏంజిలా ఆస్ట్రేలియా వెళుతున్నారట. వివాహం డిసెంబరులో జరుగుతుంది. ఆంథోనీ తిరిగి వచ్చి వివరాలన్నీ ఉత్తరం రాస్తాడట. ఇక పైకి చదవనా అమ్మా!’’ ఈ వార్తలను ఒకేసారి అవగాహన చేసుకునే స్థితిలో రోజలీనా లేదు. ఆమె మనస్సు పరిపరివిధాలుగా పోతోంది. ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చి ‘‘అవసరం లేదు నాయనా! విషయం అర్థమైపోయింది. సరే! దేవుడు నిన్ను దీవిస్తాడు. వెళ్లిరా!’’ వాసు తన సైకిలు తీసుకుని వెళ్లిపోయాడు. రోజలీనా వరండాలోనే ఒక కుర్చీలో కూలబడిపోయింది. ‘‘సరి.. ఇక చివరి పక్షి ఏబెల్ కూడా తన గూడు నిర్మించుకుంటున్నాడు. నిజానికి వాడు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడ స్థిరపడిపోతాడు. భార్యను తీసుకుని గోవా వస్తాడు. వస్తాడా? రాడా? తప్పకుండా వస్తాడు. తండ్రి చనిపోయినప్పుడూ అందరూ వచ్చి వెళ్లారు. అలాగే తల్లి చనిపోయినప్పుడూ అందరూ వస్తారు. అందరికన్నా చిన్నవాడు గోవాలోనే స్థిరపడి తనకు ఆసరాగా ఉంటాడనుకుంది. ఆ ఆశలు అడియాసలవుతున్నాయి. తను ఒంటరిగానే జీవిస్తుంది. ఒంటరిగానే కాలం చేస్తుంది.’’ ఇంతలో బయటి నుంచి ఎవరో పిలిచారు. ‘‘అమ్మా! ఇంట్లోనే ఉన్నారా? కుళాయి విప్పే ఉంది. కట్టడం మర్చిపోయినట్లున్నారు’’ తన ఆలోచనలను ఆపి పరుగెత్తుకుంటూ వెళ్లి కుళాయిని కట్టింది. చెట్లకు నీరు పోసే పైపుని వేరు చేసి దాన్ని చుట్టగా చుట్టి ఒక స్తంభానికి వేలాడదీసింది. ఇంటి లోపలికి వెళ్లింది. పొయ్యి మీద గంజి ఉడుకుతోంది. ఆమెకు ఇప్పుడు ఆకలిగా లేదు. తినాలనీ లేదు. మరింత దగ్గరగా మరిగించాలని నిర్ణయించుకుంది. అప్పుడు మరి కూర చేసే శ్రమ ఉండదు. కేవలం ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలు. భర్త చనిపోయిన తర్వాత కూర అరుదుగా వండుతోంది. కొద్ది రోజుల కిందట భూసేకరణ తాఖీదు అందిన తర్వాత ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. తన భర్త చనిపోయినప్పుడు అందరు పిల్లలూ ఇంటికి పరుగెత్తుకుని వచ్చారు. అందరికన్నా పెద్దది ఏంజిలా బహ్రెయిన్ నుంచి వచ్చింది. రెండోవాడు ఆంథోనీ కువైట్ నుంచి వచ్చాడు. ఏబెల్ చిన్నవాడు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఏంజిలా ఒక నెలరోజుల పాటు ఉంది. కాని అబ్బాయిలు ఇద్దరూ కార్యక్రమాలు పూర్తయిన రెండు వారాల లోపే తిరిగి వెళ్లిపోయారు. కువైట్ బయలుదేరుతూ ఆంథోనీ ఇలా అన్నాడు: ‘‘అమ్మా! మన ఇంటి పక్క నుంచి ఒక కొత్త రైల్వేలైను పడబోతోంది. మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇంటి వద్ద ఉదయం రైలు ఎక్కితే సాయంత్రానికి బొంబాయి చేరుకుంటావు.’’ ఈ ఆలోచన ఏంజిలాకూ సంతోషం కలిగించింది. ఇంటికి తాకుతూనే రైల్వేలైను ప్రతిపాదన అందరిలోనూ ఒక ఉత్సాహాన్నీ ఉద్వేగాన్నీ నింపింది. కాని ఈ రైల్వే భూతం నేరుగా తమ ఇంటి కంచె లోనికే ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భూసేకరణ ఆఫీసు నుంచి గుమస్తా తాఖీదు అందజెయ్యడానికి వచ్చినప్పుడు ఆ కాగితాన్ని అందుకోవడానికి రోజలీనా సందేహించింది. భర్త బతికి ఉండగా ఆమె ఏ అంశంలోనూ తలదూర్చి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. అన్నీ ఆయనే చూసుకునేవాడు. నోటీసు వచ్చినప్పుడు తన సంతానంలో ఒక్కరైనా ఉండి ఉంటే బావుండేదని భావించింది. ఆమె వైఖరిని చూసి ఆ గుమస్తా ధైర్యం చెప్పాడు. ‘‘ఇటువంటి నోటీసులు మన ఊళ్లో చాలామందికి వచ్చాయి. మీరొక్కరే బాధపడనక్కర్లేదు. నిజానికి మీది చాలా చిన్న ముక్క. ఎంతోమంది తమ విశాలమైన పొలాలనూ తోటలనూ వదులుకోవలసి వస్తుంది’’ అన్నాడు. ‘‘మరి ఇంత భూమి వాళ్లేం చేస్తారు?’’ రోజలీనా అమాయకంగా ప్రశ్నించింది. ‘‘అమ్మా! అది వారి విధానం. ప్రతిపాదించిన రైల్వేలైనుకు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. అంతే.. మీకెందుకు విచారం? ఇక్కడ సంతకం పెట్టండి చాలు..’’ అన్నాడతను. సందేహిస్తూనే రోజలీనా సంతకం చేసింది. అప్పటికి ఆమెకు వివరాలేవీ తెలీవు. ఒకసారి పోస్ట్‌మేన్ అన్నాడు: ‘‘బహుశా మీ కంచెలో కొంత భాగం, దాంతోపాటు మరికొన్ని చెట్లు కూడా పోవచ్చు.’’ ‘‘సరిగ్గా కంచెలో ఎంత భాగం, ఏ చెట్లు పోతాయో చెప్పగలవా?’’ ఆమె ఆత్రంగా అడిగింది. ‘‘మా పంట పొలంతో కలసి ఉన్న భాగం పోవచ్చు. మావి ఇరవైనాలుగు కొబ్బరిచెట్లు, ఒక మామిడిచెట్టు, మర్రిచెట్టు, మా పశువులశాల కూడా పోతున్నాయి. కాబట్టి మీ కంచె ముందు భాగం దాంతో పాటు ఆ గేటూ, కొబ్బరిచెట్లూ, ఆ బోగన్విల్లా పొద పోవచ్చు.’’ పోస్ట్‌మేన్ కచ్చితంగా అంచనా వేసి చెప్పాడు. ఈ మాటతో రోజలీనా మనసు చెదిరిపోయింది. ముఖ్యంగా కొబ్బరిచెట్లు పోతాయనే విషయం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఆ రోజు ఆమెకు పీడకల వంటిది. ఆమె ముగ్గురు పిల్లల పేరున నాటిన మూడు కొబ్బరి మొక్కలూ ఆరోగ్యవంతమైన చెట్లుగా ఎదిగాయి. ఆమె తల్లిప్రేమ సముద్రాలకావల ఉన్న వారికి నేరుగా చేరలేకున్నా ఈ కొబ్బరిచెట్లపై ప్రసరిస్తోంది. ఆమె ఒక విధమైన సంతోషాన్నీ, సాంత్వననీ పొందుతోంది. ఆమె దృష్టిలో అవి చెట్లు కావు. కడుపున పుట్టిన బిడ్డలే. వారి పేర్లతోనే ఆ చెట్లను పిలుస్తుంది. ఆమె భర్త అంటూ ఉండేవాడు: ‘‘ఆ చెట్లపైన అంత మమకారం పెంచుకోవద్దు సుమా! ఎందుకంటే అవి కేవలం చెట్లు మాత్రమే. రేప్పొద్దున్న గాలికీ తుఫానుకీ ఏ చెట్టయినా కూలిపోతే నీ గుండె బద్దలవుతుంది.’’ ఆ మాటకు రోజలీనాకు కోపం వచ్చేది. ‘‘ఇవి ఎందుకు పడిపోతాయి? పడితే నా మీదనే పడాలి. ఏ ఒక్కటైనా విరిగితే దాంతో పాటు నేను కూడా కూలిపోవాలి...’’ ‘‘నేనన్నదీ అదే!’’ పదహారేళ్ల కిందట ముగ్గురిలో పెద్దది ఏంజిలా బడి నుంచి ఒక కొబ్బరి మొక్కను తెచ్చింది: ‘‘అమ్మా! మన ఎమ్మెల్యేగారు కొబ్బరి మొక్కలను పెంచుతున్నారు. నేను కూడా ఒకటి తెచ్చాను. మన ఇంటి ఆవరణలో నాటుదాం...’’ అంది. అప్పటికి భర్త కువైట్‌లో పనిచేస్తూ సెలవు మీద వచ్చి ఉన్నాడు. రోజలీనా అతనితో అంది: ‘‘ఈ మొక్కను వాకిట్లో నాటుదాం. ఏంజిలా పెద్దదయి అత్తవారింటికి పోతుంది. కాని ఈ మొక్క ఇక్కడే ఉండి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.’’ ఆ మాట అనగానే భర్త ఆ మొక్కని తన చేతుల్తో నాటి పెట్టాడు. చెట్టు పెరిగి కాయలు కాయక ముందే ఏంజిలా పెళ్లి చేసుకుని బహ్రెయిన్ వెళ్లిపోయింది. భర్త కువైట్ నుంచి ఆంథోనీకి వీసా పంపాడు. అప్పటికి వాడు కాలేజీలో చదువుతున్నాడు. అయినా వెళ్లిపోయాడు. ఈ మార్పులన్నీ త్వరగా జరిగిపోయాయి. ఏబెల్ ఇంకా బడిలోనే ఉన్నాడు. ఆంథోనీ అందుబాటులో లేకపోయినా చిన్నవాడు ఏబెల్ గోవాలోనే ఉంటాడనీ తనకు తోడుగా ఉంటాడనీ భావించింది. ఆంథోనీకి ఆమె భర్త పోలికలు ఉంటాయి. కచ్చితంగా వాడు ఇంటి బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంటాడనీ తలచింది. ఆంథోనీ వెళ్లే ముందు అతడితో ఇలా అంది: ‘‘నాయనా! నువ్వు వెళ్లిపోతే నా జీవితంలో వెలితి ఏర్పడుతుంది. కానీ కేవలం నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నిన్ను నేను ఆపదలచుకోలేదు. కాని ఒక కొబ్బరిమొక్కను తెచ్చి ఈ అక్క మొక్క పక్కనే నాటు. అది నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది.’’ ఆ ప్రకారమే ఆంథోనీ బెనాలియా నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చాడు. దాన్ని రోజలీనా అతడి చేతనే నాటించింది. ఈరోజు అది బాగా పెద్దదయి కాయలు కాస్తోంది. భర్త రిటైరై కువైట్ నుంచి ఇంటికి రావడం, ఏబెల్కు ఉద్యోగం వచ్చి ఆస్ట్రేలియా వెళ్లిపోవడం ఒకేసారి జరిగాయి. ఈ రెండు మార్పులూ రోజలీనాలో మిశ్రమానుభూతులు కలిగించాయి. ఏబెల్ బయలుదేరే ముందురోజే ఎవరూ చెప్పకుండానే నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చి గత రెండింటి పక్కనే చేత్తో నాటాడు. తల్లి పట్ల కుమారుడికి గల తపనకూ బాధ్యతకూ రోజలీనా ఎంతో ముచ్చటపడింది. వార్ధక్యంలో భర్త ఇంటి వద్దనే ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. కానీ తన ముగ్గురు పిల్లల గురించి మాత్రం ఆందోళన చెందడం మానలేదు. భర్త సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లేవాడు. ఆ సమయంలో రోజలీనా ఒంటరిగా ఇంటి వద్ద మిగిలిపోయేది. పిల్లలను తలచుకుని దిగులుపడేది. నూతి వద్దకు వెళ్లి ఒక డజను బకెట్ల నీరు తెచ్చి పిల్లల పేర్లు గల చెట్ల మొదళ్లలో పోసేది. ‘‘ఇలా పెంచుకున్న చెట్లను ఇప్పుడు నరికివేస్తారా? ఇక నేను మాత్రం బతికి ప్రయోజనమేమిటి?’’ ఆమెకు కోపం వచ్చింది. భయమూ వేసింది. ఆ నిద్రలేని రాత్రి తర్వాత వేకువనే త్వరగా లేచింది. పొరుగామె ఇంటికి వెళ్లింది. ‘‘జాక్విమ్! అయితే నా కొబ్బరిచెట్లను కొట్టేస్తారంటావా?’’ ‘‘నేనూ ఆ మాటే విన్నాను. వచ్చి నష్టపరిహారం డబ్బు కూడా తీసుకొమ్మని కబురు చేస్తున్నారు. మన నేలను వారు ఉచితంగా తీసుకోవడం లేదు. పరిహారం కూడా బాగానే ఉందనిపిస్తోంది.’’ రోజలీనా చాలా చికాకుపడిపోయింది. ‘‘నాకు వారిచ్చే డబ్బు అవసరం లేదు. నా బాధ వారికేం తెలుసు? నా చెట్లకు ధర కట్టడానికి వారెవరు?’’ అంటూ భూసేకరణ చేసేవారిని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. చాలామంది నష్టపరిహారం డబ్బు తీసుకున్నారు. కొంతమంది మరింత ధర కోరుతూ అప్పీలు చేసుకున్నారు. పొరుగామె తండ్రి కూడా తన మొత్తాన్ని అందుకున్నాడు. కాని రోజలీనా మాత్రం తీసుకోలేదు. ఆమె అసలు ఆ ఆఫీసుకే వెళ్లలేదు. కాని ఒక్క పని మాత్రం చేసింది. వెంటనే ఇంటికి రమ్మని ఆంథోనీకి ఉత్తరం రాసింది. అయినా వాడొస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం కలగడంలేదు. ఈ మధ్య వారికి గోవా రావాలనే కోరిక తగ్గింద. ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు. పెద్దది ఏంజిలా తన కుటుంబ వ్యవహారాల్లో తలమునకలై ఉంది. ఆంథోనీ కూడా దూరమైపోతున్నాడు. గతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా వచ్చేవాడు. ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతటితో అతడు ఇంటికి రావడం తగ్గిపోయింది. అతడా అమ్మాయిని కువైట్‌లోనే కలుసుకున్నాడు. ఆమె కూడా అక్కడే పనిచేస్తోంది. ఆమె కుటుంబమంతా బొంబాయిలోనే ఉంటారు. కాబట్టి వివాహం అక్కడే జరిగింది. తన భర్తకు సెలవు దొరక్క రాలేకపోయాడు. కాని ఆంథోనీ తల్లిని పెళ్లికి బొంబాయి తీసుకువెళ్లాడు. పెళ్లి తర్వాత ఆంథోనీ మూడేళ్లకు గోవా వచ్చాడు. అది కూడా భార్యనీ కుమారుడ్నీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత తండ్రి అంత్యక్రియలకు వచ్చాడు. ఈసారి కుమార్తెనూ తీసుకొచ్చాడు. తన భార్యా ఇద్దరు పిల్లలతో పడితేనే అతడికి సరిపోయింది. తల్లిని ఓదారుస్తూ కూర్చోవడానికి సమయాన్ని కేటాయించలేకపోయాడు. ఇప్పుడు ఆంథోనీ నుంచి ఉత్తరం వచ్చింది. తప్పకుండా రాగలడని రోజలీనా నమ్ముతోంది. దాంతో కొంత ఉపశమనం కలిగింది. ఆంథోనీకి తండ్రి పోలికలు ఎక్కువ. ఏ విషయంలోనైనా కచ్చితంగా ఉంటాడు. ఒకసారి ఇంటికి వస్తే అన్ని వ్యవహారాలనూ చక్కబెట్టగలడు. భర్త మరణం వల్ల ఏర్పడిన శూన్యం, ఒంటరితనం ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరు. ఆ చెట్లను చూస్తూ గంటల తరబడి కూర్చుండిపోతుంది. ఎదురుగా లేని పిల్లలతో సంభాషిస్తుంది. ‘‘ఏంజిలా! మీ నాన్న నీ పెళ్లి ఘనంగా చేశాడు. డ్రింకులు వరదనీటిలా ప్రవహించాయి. గుర్తుందా!’’ ‘‘నాన్నా! ఆంథోనీ! మీ కోసమే మీ నాన్న ఈ ఇంటిని చెమటోడ్చి కట్టారు. మీ అమ్మను మరచిపోవద్దు.’’ ‘‘నాన్నా! ఏబెల్! అందరికన్నా చిన్నవాడివి. నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడివని గుర్తుపెట్టుకో!’’ ఆమె ఇలా ఉండగా పైపునీరు వృథా కావచ్చు. లేక పొయ్యి మీద వంటకం మాడిపోవచ్చు. మరో వారం తర్వాత ఏబెల్ నుంచి ఉత్తరం వచ్చింది. తన కాబోయే భార్య వివరాలు రాశాడు. పెళ్లికి రాగలవా అని రాశాడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. ఏదో ఒకరోజు ఏబెల్ యాత్రికుడిలాగా తన భార్యాపిల్లలతో గోవా సందర్శిస్తాడు. ఆ దృశ్యం ఆమె కళ్లకు కట్టినట్టుగా ఉంది. ‘‘ఇది బేసిలికా చర్చి.. ఇది ప్రఖ్యాతమైన కాలంగూట్ బీచ్.. ఇది డోనా పౌలా.. ఇది మాండొవీ నది.. ఇది నా చిన్నప్పటి ఇల్లు.. ఈమె నా తల్లి..’’ ఇక్కడ ఫొటోలు తీసి తన ఆల్బమ్ కోసం ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు. అంతే! మళ్లీ ఎన్నాళ్లకో! ఈలోగా తన జీవితమే ముగిసిపోవచ్చు. ఆరోజు ఆమె ఏబెల్ చెట్టు వద్ద సుమారు నాలుగు గంటల పాటు తన దిగులంతా ఒలకబోసుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఒక అభద్రతాభావంతో కుంగిపోయింది. ఆంథోనీ ఉత్తరం వచ్చి సుమారు నెల గడిచింది. అతడు బొంబాయి చేరుకున్నాడని, ఒక వారంలోగా గోవా రానున్నాడని ఎవరో సమాచారం ఇచ్చారు. అతడికి ఇష్టమైన పదార్థాలన్నీ చేస్తూ ఆ వారమంతా ఎదురు చూడసాగింది. ఆమె ఆలోచనలను భంగం చేస్తూ ఇరుగు పొరుగు పిల్లలు రోజలీనాను పిలిచారు. ‘‘అమ్మా! అమ్మా! బయటకు రా! మీ చెట్లు కొట్టడానికి వచ్చారు..’’ ఆమె ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఎవరో తన తలపైకి గొడ్డలి ఎక్కుపెట్టినట్టుగా అనిపించింది. మరుక్షణం ఇంటి బయటకు పరుగెత్తింది. కొందరు కూలీలు గొడ్డళ్లతో సిద్ధంగా ఉన్నారు. గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకతను చేతిలోని ఫైలును చూస్తూ.. ‘‘అమ్మా! మీరు రోజలీనా ఫెర్నాండెజ్ ఔనా?’’ అని అడిగాడు. ఆమె తల ఊపింది. ‘‘మేం మీ కంచె, ముందు భాగమూ తొలగించడానికి వచ్చాం. ఇక్కడున్న పొదలూ ఆ మూడు కొబ్బరిచెట్లూ తెగిపోతాయి. మీరింకా నష్టపరిహారపు మొత్తం తీసుకున్నట్లుగా లేదు.’’ రోజలీనా కోపంతో వణికింది. ‘‘ఆ కొబ్బరిచెట్లను తాకడానికి వీల్లేదు.’’ ‘‘అమ్మా! వినండి. మేం ప్రభుత్వోద్యోగులం. మా చేతిలో ఏమీ లేదు. మీవి మాత్రమే కాదు. చాలామంది చెట్లను ఈరోజు కొట్టాల్సి ఉంది. దయచేసి మా పనిని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. కూలీలారా! రండి ముందు కంచె తొలగించండి’’ అధికారపూర్వకమైన అతడి స్వరానికి రోజలీనా జంకింది. ‘‘ఆ నేల తీసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కాని చెట్లను మాత్రం కొట్టకండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.’’ ఆమె ఉద్యోగి ముందు మోకరిల్లింది. ‘‘అమ్మా! మీ చెట్లు బాగానే ఉన్నాయి. వాటికి ఎక్కువ మొత్తమే మీరు పరిహారం కోరవచ్చు. కంచెను కూడా తిరిగి నిర్మించే మొత్తాన్నీ ఇస్తారు’’ అన్నాడతను. ‘‘అయ్యా! నా చెట్లకు వెలకట్టడానికి మీరెవరు? మీరు నా పిల్లల తలలకూ ధర నిర్ణయిస్తారా? రెండు రోజుల్లో అబ్బాయి వస్తున్నాడు. మాట్లాడతాడు. ఉద్యోగికి కోపం వచ్చింది. ‘‘మీ అబ్బాయి వచ్చే వరకు పని ఆపి కూర్చోవాలా? మాది కాలంతో ముడిపడిన కార్యక్రమం. మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు.’’ ఈలోగా పనివారు కంచెను తొలగలించి ఆంథోనీ చెట్టు వద్ద గొడ్డళ్లతో నిల్చున్నారు. రోజలీనా కోపంతో రెచ్చిపోయింది. మెరుపువేగంతో ఆ పనివారిపైన పడింది. ఈ హఠాత్పరిణామానికి వారు గొడ్డళ్లతో సహా కింద పడిపోయారు. ఆమె ఆంథోనీ చెట్టును ఆలింగనం చేసుకుంది. ‘‘రండి. ముందు నన్ను చంపి, ఆ తర్వాతే నా బిడ్డను నరకండి.’’ ఈ గొడవకు చుట్టుపక్కల జనం పోగయ్యారు. ‘‘అమ్మా! మీరు ప్రభుత్వం పనికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇది నేరం. దయచేసి దూరంగా వెళ్లండి. మా పనిని మేం చేసుకోనివ్వండి.’’ అన్నాడు ఉద్యోగి. రోజలీనాకు కోపం తారస్థాయికి చేరింది. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు. నా చెట్లను మీరు ముట్టడానికి వీల్లేదు.’’ కూలీలు రెండో చెట్టు వద్దకు చేరారు. రోజలీనా అక్కడకూ చేరింది. ఉద్యోగి పరుగెత్తుకొచ్చాడు. ‘‘అమ్మా! మీరు హద్దు మీరుతున్నారు’’ అన్నాడు. రోజలీనా ఉద్యోగి పైకి ఉరికింది. అతడ్ని నేలపై పడవేసింది. అతడి చేతిలోని కాగితాలు చెల్లాచెదురయ్యాయి. ‘‘మీరు నా బిడ్డల్ని చంపుతున్నారు’’ అంటూ తిట్లు మొదలుపెట్టింది. సరిగ్గా పొరుగింటామె తండ్రి సమయానికి వచ్చి కలగజేసుకున్నాడు. రోజలీనాను పట్టుకున్నాడు. సర్దిచెప్పబోయాడు. విపరీతమైన కోపంతో ఉద్యోగి చెదిరిపోయిన తన కాగితాలను పోగు చేసుకున్నాడు. ‘‘ఈమెకు గుణపాఠం చెబుతాను’’ అంటూ బయల్దేరాడు. జీపు స్టార్టయి వెళ్లిపోయిన శబ్దం వారికి వినపడింది. ‘‘నువ్వలా చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది. ఎంతయినా ప్రభుత్వోద్యోగి’’ పొరుగింటామె తండ్రి శాంతింపజేయబోయాడు. ‘‘అయితే మాత్రం ప్రభుత్వానికి నా బిడ్డలను చంపే హక్కుందా?’’ కావాలంటే ఆ నేలనీ నా ఇంటినీ తీసుకోనివ్వండి. నా చెట్లను మాత్రం తాకవద్దని చెప్పండి..’’ అంది రోజలీనా వగరుస్తూ. ఒక అరగంటలో ఒక పోలీసు వ్యాను వచ్చింది. ఇందాక వచ్చిన ఉద్యోగికి తోడుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు పోలీసులూ వచ్చారు. చుట్టూ ఉన్న జనవాహినిని చూసి ఇన్స్పెక్టర్ కాస్త మృదువైన స్వరంతో అన్నాడు: ‘‘చూడమ్మా! మీరు ప్రభుత్వోద్యోగిపై చెయ్యి చేసుకుని నేరం చేశారు. నీ మీద అభియోగాన్ని వెనక్కు తీసుకొమ్మని నేను వారికి నచ్చచెబుతాను. వారి పనిని వారు చేసుకోనివ్వండి...’’ రోజలీనాకు పరిస్థితి అర్థమైంది. ఇదే ఆమెకు చివరి అవకాశంగా భావించింది. ఆంథోనీ చెట్టు వద్దకు పరుగెత్తి దాన్ని కౌగలించుకుంది. ‘‘నేను నా చెట్లను కొట్టనివ్వను. ఇవి నా బిడ్డలు. నన్ను ముక్కలు చెయ్యండి. ఆ తర్వాతే చెట్ల జోలికి వెళ్లండి’’ అంది. ఆమె వెర్రి ఆవేశం జనసమూహం మధ్య గందరగోళానికి దారితీస్తుందని ఇన్స్పెక్టర్ గ్రహించాడు. తన కానిస్టేబుళ్లకు సంజ్ఞ చేశాడు. వారు చెట్టుకు చుట్టి ఉన్న ఆమె చేతులను జాగ్రత్తగా విడిపించారు. ఆమెను మోసుకుని వెళ్లి పోలీసు వ్యానులోకి ఎక్కించారు. పొరుగామె తండ్రి, మరికొందరు పెద్దలు ఇన్స్పెక్టరుతో వాదించబోయారు. కాని వారిని పట్టించుకోకుండా పోలీసు వ్యాను ముందుకెళ్లింది. చాలా దూరం వరకు వ్యానులోంచి ఆమె అరుపులు వినిపించసాగాయి. ఆ రోజే ఏంజెలా, ఆంథోనీ, ఏబెల్ పేర్లు గల కొబ్బరిచెట్లు నేల కూలిపోయాయి. ఆ ఊరి హెడ్మెన్తో కలసి ఒక యాభై మంది గ్రామపెద్దలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రోజలీనాను విడిపించమని అభ్యర్థించారు. మధ్యాహ్నానికల్లా ఆమెను విడిచిపెట్టి ఇంటికి పంపించారు. తిరిగి రాగానే కిందపడి ముక్కలైన చెట్లను చూసి రోజలీనా గుండెలు బాదుకుంది. అపస్మారక స్థితిలోకి పోయింది. ఇరుగు పొరుగులూ, వైద్యుల ప్రయత్నంతో మూడు రోజుల తర్వాత రోజలీనా ఈ లోకంలోకి వచ్చింది. ఆ రోజు ఆమె ఆంథోనీ నుంచి ఒక ఉత్తరాన్ని అందుకుంది. ‘‘అమ్మా! నేను గత వారమంతా వేర్వేరు పనులతో బొంబాయిలో చిక్కుకున్నాను. గోవా వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అంతలోనే మా ఆఫీసు నుంచి వెంటనే రమ్మని టెలెక్స్ వచ్చింది. తిరిగి కువైట్ వెళ్లిపోతున్నాను. వచ్చే సంవత్సరం వస్తాను. నువ్వేమీ దిగులుపడకు. భూసేకరణ గురించి, ఆ చెట్ల గురించి పట్టించుకుని ఆందోళన చెందవద్దు. నీకు కావలసిన డబ్బు పంపిస్తాను. ఆరోగ్యం జాగ్రత్త!’’ ఇట్లు నీ ప్రియమైన కుమారుడు ఆంథోనీ -
మీకు మాత్రమే చెప్తా
కళ్లకున్న గంతలు విప్పగానే ‘‘ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేసింది?’’ గట్టిగా అరిచాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ‘‘హ్హాహ్హాహ్హా... నిన్ను కిడ్నాప్ చేసింది నేనే. నా పేరు అల్ బాగ్దాదీ. పేరు మోసిన ఉగ్రవాదిని. చచ్చాడనుకున్నారు కదా...నేను చచ్చినా చావను’’ విలన్ నవ్వుతో అన్నాడు ట్రంపు ముందు నిలుచున్న వ్యక్తి. ‘‘అచ్చం అలాగే ఉన్నావు. మేకప్ చేసింది ఎవరు? హాలివుడ్ మేకప్‌మెన్ సాండ్ర్ కొండ్రనా? భేష్! భలే చేశాడు’’ కితాబు ఇచ్చాడు ట్రంప్. ‘‘ఎలా గుర్తుపట్టావ్ గురూ!’’ మేకప్ తీస్తూ అడిగాడు ఉత్తర కొరియా సర్పంచ్ కిమ్–జోంగ్. ‘‘బరువు తగ్గిన తరువాత, ఇలాంటి వెధవ వేషాలు వెయ్యి. కాస్తో కూస్తో నమ్ముతారు. ఈ బరువుతో ఎన్ని వేషాలు వేసినా ఇట్టే గుర్తు పడతారు. ఇది సరే...అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావో చెప్పు’’ కోపంగా అడిగాడు ట్రంప్. ‘‘ఏంలేదు బ్రో..రహస్య పరిశోధన కోసం రెండు సంవత్సరాల క్రితం మీరు రోదసిలోకి పంపిన ఎక్స్37బి మిస్టీరియస్ స్పేస్ ప్లేన్ ఈమధ్య భూమికి తిరిగి వచ్చింది కదా...’’ అన్నాడు కిమ్–జోంగ్. ‘‘వచ్చింది. అయితే ఏంటి?’’ కోపంగా అన్నాడు ట్రంప్. ‘‘బ్రో...ఆ మిస్టీరియస్ స్పేస్ ప్లేన్ రోదసిలో ఏం చేసింది? ఆ రహస్యం ఏమిటి? మీ లక్ష్యాలు ఏమిటి? నువ్వు చెప్పింది విన్న తరువాత మేము కూడా మీలాగే రహస్య వ్యోమనౌకను రోదసిలోకి పంపాలనుకుంటున్నాం. చెప్పు ప్లీజ్’’ అని బతిమిలాడాడు కిమ్–జోంగ్. ‘‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ సీకెట్ల్రు ఎవ్వరికీ చెపొద్దు... కాని నాకెందుకో నీకు మాత్రమే చెప్పాలని ఉంది. నీ చెవి నా నోటి దగ్గరకు తీసుకురా’’ అన్నాడు ట్రంప్. అలాగే చేశాడు కిమ్. అంతే...ఆ చెవిని రక్తం కారేలా కొరికాడు ట్రంప్. ‘చచ్చాన్రో’ అని గట్టిగా అరిచాడు యు.ఎస్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పెర్. ట్రంపు కొరికింది కిమ్–జోంగ్ చెవిని కదా...మరి సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అరిచినట్టు? ఇంతకీ ఏం జరిగిందంటే... ‘నెక్స్›్ట ఎవరిని లేపేద్దాం?’ అనే టాపిక్‌పై పెంటాగన్లోని పెద్ద హాలులో సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పెర్‌తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యాడు ట్రంప్. మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలోనే అతనికి ఒక కల వచ్చింది. తాను కిడ్నాప్ అయినట్లు వచ్చిన కల అది! కలలో, తాను కిమ్–జోంగ్ చెవి కొరుకుతున్నానే భ్రమలో తన పక్కన కూర్చున్న సెక్రెటరీ చెవి కొరికాడు ట్రంప్. ఇదీ కథ. -
కొండవీటి కోటలో ఓ రోజు
అది 1990, ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’ సినిమా రిలీజైంది. శ్రీదేవిని తెలుగు తెర మీద చూసి అప్పటికి చాలా రోజులైంది. దేవకన్యగా శ్రీదేవిని చూడాలని సినిమాకి వెళ్లాను. శ్రీదేవికంటే ముందు గొప్ప పర్యాటక ప్రదేశంగా కొండవీడు కోట ఫ్రేమ్‌లోకి వచ్చింది. గైడ్ రాజు పాత్రలో చిరంజీవి ప్రేక్షకుల కళ్లకు కట్టిన కొండవీటి చరిత్రలో ప్రతి దృశ్యమూ ఇప్పటికీ తడి ఆరని జ్ఞాపకంగానే ఉంది. ఆ జ్ఞాపకాల ఒరలోకి స్వయంగా ప్రవేశించే అవకాశం అక్టోబర్ 12వ తేదీన కలిగింది. ఆ రోజు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, హౌస్ గణేశ్ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ ప్రారంభోత్సవం. ఆ మ్యూజియం మూడంతస్తుల భవనం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పల్నాటి నాగమ్మ విభాగం, ప్రోలయ వేమారెడ్డి విభాగం, రేచర్ల రుద్రారెడ్డి విభాగం, శిల్ప విభాగం, గ్రంథాలయం ఉన్నాయి. మ్యూజియం ఎదురుగా 15వ శతాబ్దం నాటి నంది విగ్రహం పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మ్యూజియంలో 70 విగ్రహాలు, పురాతన నాణేలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 14వ శతాబ్దం నాటి ఘనమైన తెలుగు వారి చరిత్రకు ఆనవాలు ఈ మ్యూజియం. మ్యూజియంలో ఉన్న కొండవీడు కోట నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత కొండవీడు కోటకు వెళ్తే టూర్‌ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. కొండ మీద కోట వీడు అంటే నివాస ప్రదేశం. కొండవీడుకి ఆ పేరు కొండలున్న ప్రదేశం అనే అర్థంలోనే వచ్చింది. కోట ఉన్న కొండ సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో ఉంది. కొండ కింద నుంచి కొండ మీద కోట వరకు చక్కటి రోడ్లో సాగింది ప్రయాణం. కొండమీదకు వెళ్లడానికి పన్నెండు వందల మెట్లతో మెట్లదారి కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు పాలించారు. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిలో రాజ్యస్థాపన చేశాడు. అతడి వారసుడు అనపోతా రెడ్డి రాజధానిని కొండవీడుకి మార్చి కోటను పటిష్టం చేశాడు. కోట రక్షణ కోసం పహారా కాయడానికి బురుజులున్నాయి. జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, సజ్జా మహల్ బురుజు, బి. ఖిల్లా బురుజు, మిరియాల చట్టు బురుజు, ఆళ్లవారి బురుజు, ఎ. రమణాల్బురుజు, గుర్రం నాడా బురుజు, బుంగబావి, రెడ్డి వారి భోజనశాల, తారా బురుజు ఉన్నాయి. తారా బురుజును స్థానికులు చుక్కల కొండ బురుజని పిలుస్తారు. ఈ పక్కనే ఉన్న మండపం పేరు తీర్పుల మండపం. యోగివేమన మండపం అని కూడా అంటారు. ఆళ్ల వారి బురుజు శిథిలమై పోయి ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తంగా కోట గోడ 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. చెరువుల కొండ కొండమీద వెదుళ్ల చెరువు, పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువుతోపాటు ఒక కోనేరు కూడా ఉంది. వెదుళ్ల చెరువులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. ఆ చెరువు పచ్చగా కనిపించింది, కానీ నీటిని చేతిలోకి తీసుకుంటే స్వచ్ఛంగా ఉన్నాయి. అంత ఎత్తులో కోటల నిర్మాణమే ఆశ్చర్యచకితమైతే, చెరువుల తవ్వకం నీటి పారుదల కాలువల ఏర్పాటు... ఊహకు అందలేదు. టూరిజం డిపార్ట్మెంట్ కోటలోపల ఉన్న మూడు చెరువులను, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరిస్తోంది. రాజుల కాలం నాటి రాజమందిరాన్ని బ్రిటిష్ వాళ్లు బంగ్లాగా మార్చారు. ఇప్పుడది కూడా శిథిలావస్థలోనే ఉంది. రెడ్డిరాజులు శైవాన్ని ఆచరించినప్పటికీ వైష్ణవాన్ని కూడా బాగా ఆదరించారు. కోటలోపల శివాలయంతోపాటు లక్ష్మీ నరసింహాలయం, గంగాధర రామేశ్వరాలయం కూడా ఉన్నాయి. ముత్యాలమ్మ చెరువు పక్కన దర్గా, మరో రెండు మసీదులను కుతుబ్‌షాహీలు కట్టించారు. గుర్రపుశాలలు, వరహాల కొట్టు, నేతికొట్టు ఉన్నాయి. రాత్రిళ్లు దివిటీలు వెలిగించడానికి అవసరమైన నెయ్యిని ఈ నేతికొట్టులో నిల్వ చేసేవారని చెబుతారు. గుప్తనిధుల కోసం దుండగులు విచక్షణారహితంగా తవ్విపోయడంతో కళ తప్పింది కోట. ఒకప్పటి రాజధాని ఇప్పుడు ఒక గ్రామంగా తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నంలో ఉంది. నాటి ఆర్కిటెక్చర్లోనే ఇప్పుడు కొత్త నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. మహిళల దార్శనికత మ్యూజియంలోని ఆడియో విజువల్ థియేటర్లో కొండవీటి రెడ్డిరాజుల పాలన డాక్యుమెంటరీ ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మహాభారతాన్ని తెలుగీకరించిన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రాప్రగడ ఇక్కడి వాడే, కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ ఆస్థానంలోని వాడే. హలం వదిలి కత్తి పట్టిన రెడ్డిరాజులు, కత్తితోపాటు కలంతోనూ స్వైర విహారం చేసిన వైనానికి నిదర్శనమే కొండవీటి కోట. రాజుల గొప్పదనాలు ఒక ఎత్తయితే, ఇక్కడి రాజవంశ మహిళల సామాజిక చైతన్యం మరొక ఎత్తు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక కొండవీడు దగ్గర సంతాన సాగరం అనే చెరువు తవ్వించింది. రెడ్డి రాజుల కాలంలో మహిళలకు నిర్ణయాధికారం ఉండేది. విత్త నిర్వహణలో చొరవ ఉండేది. పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరాన్ని గుర్తించారు వాళ్లు. నేలను చదును చేసి సాగుభూమిని విస్తరింపచేయడం నుంచి, నీటి లభ్యత కోసం చెరువులు తవ్వించడంలో కూడా ముందుండే వాళ్లు. ‘దేవతల రాజధాని అమరావతికి తీసిపోని నగరం’ అని కొండవీడు కోటను శ్రీనాథుడు చాటుపద్యాల్లో వర్ణించినట్లు చెప్పారు స్థపతి ఈమని శివనాగిరెడ్డి. అలాగే మరో ఆశ్చర్యకరమైన సంగతి కూడా తెలిసింది... రక్షణ బాధ్యతలో ఉన్న ఉద్యోగి దొంగను పట్టుకుని సొమ్మును తిరిగి ఖజానాకు జమ చేయడంలో విఫలమైతే అతడు నష్టపరిహారం చెల్లించాల్సిందే. నాటి సమాజానికి దర్పణం మ్యూజియంలో మోటుపల్లి రేవు చిత్రంలో అప్పటి రవాణా విధానాలన్నింటినీ పొందుపరిచారు. ఒక్క చిత్రం పది వాక్యాల పెట్టు అనేది నానుడి అయితే... ఈ చిత్రం ఏకంగా అప్పటి సమాజాన్ని, వృత్తి పనివాళ్ల జీవితాన్ని, వర్తక వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోంది. పద్నాలుగవ శతాబ్దంలో మహిళలు, మగవాళ్లు దుస్తులను మోకాళ్ల వరకు ధరించేవాళ్లని చెప్తున్నాయి ఈ చిత్రాలు. మ్యూజియంలో తిరుగుతుంటే టైమ్ మెషీన్లో పద్నాలుగవ శతాబ్దంలోకి ప్రయాణించినట్లు ఉంటుంది. గోపీనాథ ఆలయం నిర్మాణంలో పెద్దదే, కానీ గర్భగుడిలో దేవుడి విగ్రహ ప్రతిష్ఠ జరగనే లేదు. దీనిని కత్తుల బావి అంటారు. కొండవీడు అనగానే లకుమాదేవి కూడా గుర్తుకు వస్తుంది. ఆమె కుమారగిరి ఆస్థానంలో నర్తకి. మ్యూజియంలో ఆమె చిత్రం కూడా ఉంది. అక్కడికి రాగానే ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’లో లకుమాదేవిగా నాట్యం చేసిన బేబీ షాలిని కళ్ల ముందు మెదిలింది. కోటకు కొత్త కళ చరిత్రను అక్షరబద్ధం చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆనవాలుకు కూడా దొరకకుండా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న శిథిలాలను పునరుద్ధరిస్తోంది కొండవీడు కోట డెవలప్మెంట్ కమిటీ. ఆ కమిటీ కన్వీనర్ శివారెడ్డి ఒక అలుపెరుగని సైనికుడు. ఆయన ఇంటర్ చదివే రోజుల్లో కొండవీడును చూడడానికి వచ్చి, శిథిలాల నుంచి ఊడిపడిన ఒక రాయిని తీసుకెళ్లి ట్రంకుపెట్టెలో దాచుకున్నట్లు ‘కొండవీడు’ పుస్తకంలో రాసుకున్నారు. శివారెడ్డి పదిహేనేళ్ల శ్రమ, భక్తప్రియ వంటి ఓ యాభై– అరవై మంది సైనికుల అకుంఠిత దీక్షతో కొండవీడు కొత్త కళను సంతరించుకుంటోంది. ‘అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య– శ్రీశైలం’ వాళ్లు మ్యూజియం కోసం పడిన శ్రమను చూసినప్పుడు... చరిత్రను సృష్టించడం కంటే చరిత్రను పరిరక్షించడమే పెద్ద పని అనిపించింది. – వాకా మంజులారెడ్డి,ఫొటోలు: గజ్జెల రామ్‌గోపాల్ రెడ్డి కొండవీడు సమీపంలోని అమీనాబాద్ గ్రామంలో మూలాంకురేశ్వరి ఆలయం ఉంది. ఈ అమ్మవారు కొండవీడు రెడ్డిరాజుల కులదైవం. రాజకుటుంబీకులు అమ్మవారి నిత్యపూజల్లో పాల్గొనేవారు. రోజూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు మోగే గంటారవం వినిపించిన తరవాత మాత్రమే రాజకుటుంబీకులు ముద్దముట్టేవాళ్లని చెప్పారు స్థానికులు. అమీనాబాద్ చెరువు దగ్గర ఒక రెస్ట్‌హౌస్ ఉంది. అంతఃపుర మహిళలు చెరువు స్నానానికి వచ్చినప్పుడు దుస్తులు మార్చుకోవడానికి, సేదదీరడానికి ఈ రెస్ట్‌హౌస్‌ను ఉపయోగించేవారు. -
దారితప్పిన బస్సు
రామలింగం మేష్టారికి తన సొంత పిల్లల్నే అదుపులో పెట్టడం చేతకాదు ఆయన ఖర్మానికి పాతికమంది కోతి మూకని ఎక్స్కర్షన్ తీసికెళ్ళవలిసిన పని పడింది. ఈ కుర్ర కుంకల్ని హంపీ తీసుకుపోవాలట. అక్కడి శిథిలాలు చూసి, గతించిన విజయనగర సామ్రాజ్యం తాలూకు గొప్పతనం అవగాహన చేసుకుంటారట. చరిత్ర అంతా స్పష్టంగా రాసి ఉంది. చదువుకుని ఏడవకూడదూ? ఏవిటో రకరకాల కొత్త సిద్ధాంతాలొచ్చి పడ్డాయి. ఏమయితేనేం, ఈ అధికమాసపు తద్దినం తనకి తప్పలేదు. ఉదయం ఎనిమిందిటికి బుల్లిపాలెం నించి బయలుదేరవలసిన టూరిస్టు బస్సు స్కూలు దగ్గరకు వచ్చేసరికి పదిన్నరయింది. రామలింగం మేస్టారు సీట్లో వెనక్కి జేర్లబడి కళ్ళు మూశారు. నలభై ఏభై మంది సంతగోల చేస్తున్న క్లాసులోనే గుర్రుపెట్టి నిద్రపోగల యోగసాధన ఆయనకుంది. కిటికీలోంచి చల్లని కొండగాలి వీస్తోంది. మేస్టారు నిద్రపోయారు. బస్సు ఆగిన కుదుపుకి మేస్టారు ముందుకు పడబోయి మేలుకుని నిలదొక్కుకున్నారు. పిల్లలు బిలబిల గంతులేస్తూ దిగిపోయారు. వంటవాడు జంబుఖానాలు దారి పక్కన పచ్చిక మీద పరిచాడు. రామలింగం మేస్టారికి ఒకటే కంగారు, ఈ కొండదారుల్లో ఎక్కడ ఎవరు తప్పిపోతారో, ఎవరు పారిపోతారోనని, దిగే పిల్లల్ని తిరిగి లెక్క పెట్టారు మేస్టారు. కిష్టప్ప ఒక కొండ కొమ్మ మీదికి ఎక్కుతుంటే, సుబ్బిగాడు, వెంకటం, గౌరి వెంటపడుతున్నారు. మేస్టారు అరిచారు అలాంటి కోతిపనులు చెయ్యొద్దని. ఈ కిష్టప్పగాడు కోతిమూకకి లీడరు కూడా. వాణ్ని ఓ కంట కనిపెట్టి చూడకపోతే, కొంప మునుగుతుంది. మేస్టారు రవంత ఈతిబాధ తీర్చుకోడానికి ఒక బండరాతి పక్కకి వెళ్ళి తిరిగొచ్చేసరికి, కిష్టప్ప మరో నలుగురు గల్లంతు. వెతగ్గా వెతగ్గా, వాళ్లు ఒక కొండవాల్లో ఉన్న చెట్టెక్కి సీతాఫలాలు కోస్తున్నారు. వాళ్ళని నాలుగు తిట్టి బెదిరించి, బస్సులో ఎక్కించేసరికి గంటన్నర పట్టింది. బస్సు కదిలింది. కిష్టప్ప సందేహాం! సీతాఫలాలు వర్షాకాలంలోనూ, మామిడి కాయలు వేసవిలోనూ ఎందుకు కాస్తాయి, అని. తనకి మాత్రం ఏం తెలుసు? అయినా తెలీదంటే మేస్టారి మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. అందుకని, దేవుడు అలా ఏర్పాటు చేశాడని పోటీలేని సమాధానం చెప్పారు. ఈ కుర్రాళ్ళందరికీ అనుమానాలు అంటువ్యాధిలా పుట్టుకొస్తాయి. వరసగా అడగడం మొదలుపెట్టారు. ఇంత ఎత్తు కొండ మీద నీళ్ళు ఉండవుగదా మొక్క లెలా మొలుస్తున్నాయని ఒకడు. వర్షాలు కురుస్తాయిగా అని మేస్టారి సమాధానం. కురిస్తే అవన్నీ కొండ కిందికి పారి వెళ్ళిపోతాయి గదండి? అని ఇంకొకడి ఎదురుప్రశ్న. కిట్టప్ప కొంటెగా, దేవుడు కింది నించి వాటికి నీళ్ళు ఏర్పాటు చేస్తాడని జవాబు చెప్పాడు. డ్రైవరు రేడియో మోగించాడు. సినిమా పాట లొస్తున్నాయి. వాటి వ్యామోహంలో పడి పిల్లలు ఆయన్ని మరిచిపోయారు. ఆయన వాళ్ళనీ మరిచిపోయి, హాయిగా గుర్రు నిద్రలో మునిగిపోయాడు. ఆ నిద్రలో ఓ కల. చటుక్కున బస్సు తేనెపట్టులా మారిపోయింది. పిల్లలంతా తేనెటీగలు. అందులో గౌరి రాణి ఈగ. తను మాత్రం చెట్టు మీద నిలబడిపోయాడు. ఇన్ని తేనెటీగల్ని ఎలా పట్టడం? తేనెపట్టు చిటారు కొమ్మన ఉంది. పిల్లలంతా ఇలా అయిపోయారంటే, బుల్లిపాలెం ఊరంతా కలిసి తన్ను కొరత వేస్తారు. తేనెటీగల్ని బతిమాలాడు–తేనెపట్టు కిందికి దింపి దాన్ని మళ్లీ బస్సుగా మార్చేయమని, తమందరు తిరిగి పిల్లలుగా మారిపొమ్మని. పెద్ద తీనెటీగ కిష్టప్పగాడి మొహంతో తన చుట్టూ నవ్వుతూ ఎగిరింది. చెయ్యి విసిరారు, కొట్టబోయారు, పట్టుకోబోయారు. చురుక్కున ఒక పోటు పొడిచి కిష్టప్పగాడు ఎగిరిపోయాడు. కోపం వచ్చింది మేస్టారికి. ధైర్యం చేసి చెట్టెక్కారు చిటారు కొమ్మదాకా. చెయ్యి జాపారు పట్టు అందుకోడానికి. అంతే పిల్లతేనెటీగలన్నీ ఒక్క పెట్టున చేతిచుట్టూ మూగి కుట్టడం మొదలెట్టాయి. ‘అబ్బ’ అనుకుంటూ చెయ్యి వెనక్కి లాక్కున్నారు. పట్టు తప్పింది. కింద పడిపోతున్నారు, కొన్ని వందల అడుగులు. తేనెటీగలు మాత్రం కుడుతూనే ఉన్నాయి చేతిని. ‘కెవ్వు’మని అరుస్తూ లేచారు రామలింగం మేస్టారు. తను బస్సులోనే ఉన్నాడు. పక్క కిటికీలోంచి సన్నజల్లు చురుకు చురుకుమని చేతి మీద పడుతోంది. మేస్టారు పక్క కిటికీ అద్దం దింపేశాడు. అప్పుడాయనకి అర్థమైంది, చీకటి పడుతోందని, అవతల గాలీ, సన్న జల్లూ ప్రారంభమైందని. రోడ్డు చూస్తే ఆయనకి అనుమానం వచ్చింది, ‘తారురోడ్డులా లేదే’ అన్నారాయన. ‘అడ్డుదారి’ అన్నాడు డ్రైవరు. ‘‘ఎక్కడి కెడుతుందీ అడ్డుదారి?’’ ‘‘మళ్లా ధర్మారం మేన్ రోడ్డులో కలుస్తాదంట, 12 మైళ్ళు కలిసొత్తాదంట’’ ఏడు గంటలకి ధర్మారం చేరాల్సింది. టైం చూస్తే పావు తక్కువ ఏడు. రోడ్డు మరింత అధ్వాన్నంగా ఉంది. కొండదారి..మలుపులు బస్సుదీపాల వెలుగులో అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. బస్సు పరుగెత్తడం లేదు. పాకుతోంది. ఎనిమిదయింది. అప్పటికీ మెయిన్‌రోడ్డు రాలేదు సరిగదా, పల్లె కూడా తగల్లేదు. వాన జోరు హెచ్చింది. ‘‘ఏం దారయ్య ఇది. నీ మొహం అడ్డుదారి’’ అన్నారు మేస్టారు. ‘‘దారి తప్పినట్టున్నామండి. ఆ మడిసి సెప్పిన ఊరేదీ తగల్లేదు’’ అన్నాడు వంటవాడు. ‘‘బస్సు వెనక్కి తిప్పు. నీ మొహం లాగుంది, నీ అడ్డదార్లూ నువ్వూ’’ ‘‘బస్సు తిరగదండి, ఓ పక్క కొండ, ఓ పక్క ఎయ్యి అడుగుల లోయ’’ అన్నాడు డ్రైవరు. రామలింగం మేస్టారికి ఓ పక్క కోపం, రెండో పక్క భయం. ఇంతమంది పిల్లలతో ఈ బస్సు సురక్షితంగా మనుషులుండే చోటికి చేరితే చాలునని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నారు. తొమ్మిదింబావు. బస్సు రెండుసార్లు గుంజి ఆగిపోయింది. మేస్టారి పై ప్రాణాలు పైకి పోయాయి. ఇప్పుడేవిటి గతి? డ్రైవర బోనెట్ ఎత్తి బాటరీలైట్ల సహాయంతో ఇంజిన్ చూస్తున్నాడు. నిద్ర పోతున్న పిల్లలంతా మేలుకున్నారు. పిల్లల్లో పిరికివాళ్ళు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టు వొణికిపోతున్నారు. కిష్టప్ప, సుబ్బు బస్సు దిగారు. వాళ్ళు కొండ మీదికి ఎక్కుతుంటే ఆయన గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ‘‘మేస్టారూ’ అదిగో ఏదో దీపం. పెద్ద ఇల్లులా ఉంది’’ అని అరిచాడు కిష్టప్ప. బిలబిల పిల్లలంతా దిగారు, ‘‘మేస్టారు! ఈ మలుపు తిరిగితే ఏదో ఇల్లుందండి. దీపం ఉంది లోపల’’ అన్నాడు కిష్టప్ప. ‘‘బస్సు కేమయింది?’’ అని అడిగారు మేస్టారు. ‘‘డెల్కోలోకి నీల్లెల్లిపోయాయ్. ఈ వోనలో కదల్దు’’ అన్నాడు డ్రైవర్. మేస్టారి అనుమతి కోసం చూడకుండా కిష్టప్ప బాటరీలైట్ల సహాయంతో మిగతా పిల్లలకి దారి చూపిస్తూ నడిచాడు. అదృష్టవశాత్తు వానజోరు కొంత తగ్గింది. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. బాటరీ లైటు వేసి చూశారు–రంగు పచ్చగానే ఉంది! తలుపు బాదగా బాదగా తెరుచుకుంది. వయసు చెప్పడానికి వీల్లేని ఒక వ్యక్తి చేత్తో హరికెన్ లాంతరు పట్టుకుని గుమ్మంలో నిలబడ్డాడు. ‘‘మా బస్సు దారి తప్పింది. ఈ పక్క సందులో ఆగిపోయింది. బాగు అయేదాకా మేం ఇక్కడ ఉండొచ్చా?’’ అని అడిగాడు కిష్టప్ప. వ్యక్తి సమాధానం చెప్పలేదు సరిగదా, గుమ్మంలోంచి తప్పుకోలేదు. ‘‘తమరు కాస్త అనుగ్రహించాలి. పిల్లలు, బయట వాన’’ అన్నారు మేస్టారు. అప్పటికీ ఆ వ్యక్తి తప్పుకోలేదు. కిష్టప్ప ధైర్యం చేసి, అతని పక్క నించి లోపలికి జారాడు. ఇంక మర్యాద కాదన్నట్టు ఆ వ్యక్తి పక్కకి నిలబడ్డాడు. పిల్లలంతా ధైర్యం చేసి లోపలికొచ్చారు. ఆ వెనక మేస్టారూ వచ్చారు. ‘‘మూగతనేమో పాపం’’ అన్నాడు కిష్టప్ప. వ్యక్తి అతని వంక చూశాడు. పిల్లలు రవంత బెదిరి కిష్టప్ప వెనక చేరారు. ‘‘ఇదే ఊరు?’’ అని అడిగాడు మేస్టారు. వ్యక్తి కళ్ళప్పగించి అరగంట చూసినట్టు చూశాడు ఆయన వంక. కిష్టప్ప చెప్పినట్టు అతడు నిజంగా మూగవాడేమోనన్న అనుమానం మేస్టారికి ధ్రువపడుతుండగా, అతడు నోరు తెరిచాడు. ‘‘దుగ్గన్న సత్రం’’ అన్నాడా వ్యక్తి. మేస్టారు ఆత్రంగా ఎన్నో ప్రశ్నలడిగారు, ఈ కొండదారి ఎక్కడికి పోతుంది? దగ్గర ఉన్న పట్నం ఏది? ఎంత దూరం? దేనికి ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. హరికేన్ లాంతరు చేతపట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. లాంతరు గుమ్మంలో పెట్టి తన మంచం మీద పడుకున్నాడు. సరే ఈమాత్రమయినా ఆశ్రయం దొరికినందుకు సంతోషించారు మేస్టారూ పిల్లలూ. బుల్లిపాలెంలో తయారుచేసి తీసుకొచ్చిన సాంబరు అన్నం పిన్నలూ పెద్దలూ అందరూ తిన్నారు. నీళ్ళు ఎక్కడున్నాయని కిష్టప్ప వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి లేచి వచ్చి లాంతరు తీసుకుని దారి చూపించాడు. అది పెద్దభవంతి. ఎన్నో గదులున్నాయి. అన్నీ బూజు పట్టి దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఎంతో దూరం నడిచాక, వెనక పక్క వరండాలోకి వచ్చారు ఆ పిల్లలూ ఆ వ్యక్తీ. అక్కడొక పెద్ద నీళ్ళకుండీ ఉంది. అవి మంచినీళ్లేనని నిర్ధారణ చేసుకుని పిల్లలంతా చేతులు కడుక్కొని నీళ్ళు తాగారు. వ్యక్తి ఈసారి గదిలోకి పోకుండా గొడవారని ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ‘‘బాబాయి’’ అన్నాడు కిష్టప్ప. ఆ పిలుపుతో ఆ వ్యక్తి కొంత మెత్తబడ్డాడు. అతని ముభావం సడలింది. కిష్టప్పా మేస్టారూ ఈ ఇంటిని గురించీ దీని ఒంటరితనాన్ని గురించీ ప్రశ్నలు వేశారు. అతను అతి క్లుప్తంగా దీని కథ చెప్పాడు. రెండు వందల ఏభై ఏళ్ళ క్రితం దుగ్గన్న సేనాని బీజాపూర్ నవాబు కింద సేనాపతిగా ఉండేవాడు. అతని పెళ్ళాం చాలా అందగత్తె. అతన్ని యుద్ధభూమికి పంపి, అతని భార్యని చెరపట్టాడు. విజయం సాధించి తిరిగివచ్చిన దుగ్గన సేనానికి ఈ సంగతి తెలిసింది. సైన్యంలో అతనికి చాలా పలుకుబడి ఉండేది. కొందరు నమ్మిన అనుచరులతో నవాబు జనానాలో ప్రవేశించి తన భార్యను బలత్కారం చెయ్యబోతున్న నవాబుని నరికేసి, తను రాజయ్యాడు. ఇది అప్పుడు బీజపూరికి రహదారి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ సత్రం కట్టించాడు. దీని వెనక చాలా అందమైన పూలతోట వేయించాడు. ఆరోజుల్లో ఎంతో కలకల్లాడుతూ ఉండేది ఈ సత్రం. ఇంతలో తెల్లవాళ్ళు ఈ ప్రాంతం క్రమంగా ఆక్రమించడం మొదలు పెట్టారు. దుగ్గన్న సేనాని మాత్రం ఎంతో ధైర్యంతో ప్రతిఘటించాడు. కాని అతని భార్య, బావమరుదులు, ఎలాగా ఓడిపోతామన్న భయంతో తెల్లవాళ్ళతో కుట్ర పన్నారు. అది తెలిసిన దుగ్గన్న భార్యనీ బావమరుదుల్ని చంపేసి, ఈ సత్రంలోకి పారిపోయి వచ్చేశాడు. వెనక తోటలో ఒక చిన్న ఇల్లుంది. ఆ ఇంట్లో దాక్కున్నాడు. ఇక్కడున్న ఆయన నమ్మినబంటు, తెల్లసైన్యాలు సత్రాన్ని చుట్టుముట్టడం చూసి, తోటలో చిన్న ఇంటికి బయట తాళం వేసి, దుగ్గన్న సేనాని అక్కడలేడన్నాడు. తెల్లవాళ్ళు అతన్ని బంధించి పట్టుకుపోయారు. సేనాని ఆ ఇంట్లోంచి బయటపడే దారి లేక, కొన్నిరోజులు ఆకలిదప్పులతో బాధపడి, చచ్చిపోయాడు. ఇప్పుడు దెయ్యమై ఆ తోటలోనూ ఇంట్లోనూ తిరుగుతుంటాడు. దుగ్గన్న దెయ్యం మహా భయంకరమైంది. రకరకాల ఆకారాలు ధరించి, రాత్రిపూట ఆ తోటలో అడుగు పెట్టిన మనుషుల్ని భయపెట్టి చంపుతుంటుంది. ఇరవై ఏళ్ళక్రితం ఒక కలెక్టర్‌గారు ఇలాంటి రాత్రే ఈ సత్రంలో మకాం పెట్టి, ఈ కథంతా విని దెయ్యాలంటే తనకి నమ్మకం లేదని, ఆ తోటలోకి వెళ్ళాడు. తెల్లారేసరికి ఆయన శవం కింద లోయలో ఉంది. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. సగంమంది పైగా పిల్లలకి, మేస్టారికీ భయంతో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ‘‘ఈ భవనంలోకి కూడా వొస్తుందా ఆ దెయ్యం?’’ అని అడిగారు మేస్టారు. రాదన్నట్టు తల ఊపాడు ఆ వ్యక్తి. ‘‘వెనకాల మంచి పూలతోట ఇంకా ఉందే’’ అని అడిగాడు కిష్టప్ప. ‘‘అది తోట కాదు, రెండు వందల ఏళ్ళనించీ ఆ మొక్కలకీ పూలతీగెలకీ ఎదుగూ బొదుగూ లేదు. ఆ దెయ్యం స్పర్శకి అవన్నీ రాళ్లుగా మారిపోతుంటాయి. రాత్రి గుడ్డి వెలుగులో అవన్నీ పూలమొక్కల్లాగ కనిపిస్తాయి. పగలు చూద్దురుగాని, అన్నీ రాళ్ళు’’ అన్నాడు వ్యక్తి. ‘‘అదంతా కట్టుకథ, ఎవడో మహాశిల్పి ఆ మొక్కలూ లతలూ అతి సున్నితంగా చెక్కి ఉంటాడు’’ అన్నారు రామలింగం మేస్టారు. ‘‘అవి మహాశిల్పాలు కావు, రాళ్ళయి పోయిన పూలమొక్కలు. అవి తాకితే తెలుస్తుంది. చెయ్యి కూడా గడ్డ కట్టుకుపోతుంది’’ అన్నాడు వ్యక్తి. రామలింగం మేస్టారికి ఈ కథలన్నీ నమ్మాలని లేదు. కాని తను నమ్మడం లేదని ఆ దెయ్యానికి తెలిస్తే, తన మీద విజృంభిస్తుందేమోనని భయం. ఎందుకైనా మంచిదని, సింహద్వారం తెరిచే ఉంచి, పారిపోవడానికి వీలుగా గుమ్మం దగ్గర పక్కపరుచుకున్నారాయన. కుర్రవాళ్ళందరినీ తెల్లవారకుండానే లేవాలని హెచ్చరించి, ఆయన నడుం వాల్చారు. పిల్లలంతా పడుకున్నారు. ఆ వ్యక్తి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు–క్రమంగా అందరికీ నిద్ర పట్టింది. కాని కిష్టప్పకు మాత్రం ఆ కథే బుర్రలో తిరుగుతోంది. ఆ దెయ్యాన్ని చూడాలని గట్టి కోరిక. రవంత భయం కూడా. కాని కుతూహలం. ఆ మొక్కలన్నీ నిజంగా రాళ్ళయిపోయినవేనా? ఇంతలో సన్నగా ఏ పక్క నించో విచిత్రమైన ధ్వని వచ్చింది. చెవులు నిక్కించి విన్నాడు. ఈ లోకంలో విన్నచప్పుడులా లేదు. ఆవు అరుపు సింహం గర్జన కాకుండా రెండూ కలిసినట్లుంది ఆ ధ్వని. మెల్లిగా లేచాడు. అతని వెనక సుబ్బు, వెంకటం, గౌరి కూడా లేచారు. వాళ్ళూ నిద్ర పోలేదు అతనిలాగే–నలుగురూ పిల్లుల్లాగ బాటరీ లైట్ల సహాయంతో వెనక వరండా చేరుకున్నారు. చూశారు. వందగజాల అవతల మరో ఆవరణ ఉంది. రాళ్ళతో కట్టిన ప్రహరీ ఉంది దానికి. అదే రాతి మొక్కల తోటై ఉంటుంది. నలుగురూ ధైర్యం చేసి ఆ వైపు నడిచారు. గేటు లేదు, కాని ఆ చోట కంప అడ్డంగా ఉంది. అది మెల్లిగా తొలిగించారు. వాళ్ళు ఆ తోటలో అడుగు పెట్టడంతోటే, విచిత్రమైన వెలుగు, వెన్నెలకాని వెన్నెలలాంటిది తోటంతా ఆవరించింది, ఎవరో స్విచ్చి నొక్కినట్టు. ఆ వెలుగులో తోట ఎంతో అందంగా ఉంది. లతల కొసల్లో పువ్వులు ఎవరో శిల్పి తీర్చిదిద్దినట్లున్నాయి. రవంతా గాలి వీస్తున్నా, లతలు మాత్రం ఊగడం లేదు. ఒక చెట్టు మీద పిట్ట కూడా కూచ్చుని ఉంది. కిష్టప్ప దాని మీదికి రాయి విసిరాడు, గురి చూసి. తగిలింది. కాని పిట్ట ఎగిరిపోలేదు. రాయి రాతికి తగిలిన చప్పుడు మాత్రం వినిపించింది. ధైర్యం చేసి కిష్టప్ప ఒక పువ్వు కొయ్యబోయాడు. గట్టిగా రాయిలా తగిలింది చేతికి! మంచుకున్న తీవ్రమైన చల్లదనం అతని శరీరంలోకి విద్యుత్తులా ప్రవహించింది. చట్టుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని రెండో చేత్తో వేడి పుట్టేదాకా రాసుకున్నాడు–మిగతా ముగ్గరూ బిత్తరపోయి చూశారు–ఇంతలో పెద్ద వింత శబ్దం. చటుక్కున అందరూ అటు చూశారు. పెద్ద బస్సు అంత ఆకారం ఏదో తమవంక వస్తోంది. సింహం నోట్లో సగం ఆవు. ఆవు ముందు కాళ్ళు గాలిలో గిలగిల కొట్టుకుంటున్నాయి. పెద్ద గుహలాగుంది ఆవు నోరు. నలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులు దాని వంటి మీద మారిపోతున్నాయి. గుహలోంచి వచ్చినట్టు పెద్ద గంభీరమైన గొంతు. ‘‘కుర్రకుంకల్లారా! మా తోటలో అడుగు పెట్టడానికి మీకు ఎన్ని గుండెలున్నాయి’’ అంటూ ఆ ఆకారం వాళ్ళ మీదికి ఉవ్వెత్తున వచ్చిపడింది. నలుగురూ ఒకరికొకరు గట్టిగా పట్టుకు నిలబడ్డారు. పారిపోవడానికి కాళ్ళు రాలేదు వాళ్ళకి. ఆ ఆకారం వాళ్ళని దూసుకుని తుపానుగాలిలా వెళ్ళిపోయింది. కిష్టప్పటికి భయం పోయింది. దెయ్యమంటే వట్టిగాలి, గాలి తమని ఏంచెయ్యగలదు? భయపెడుతుంది. అంతే. కాని సుబ్బు, వెంకటం, గౌరి తోట అవతలికి పారిపోయారు. కాని కిష్టప్ప రావడం లేదని చూసి ఆగిపోయారు. కిష్టప్ప తోటంతా పరీక్షగా చూడ్డం మొదలు పెట్టాడు. చాలా పెద్ద తోట. ఎన్నో రకాల మొక్కలుండేవి, ఇప్పుడన్నీ రాళ్ళయిపోయాయి. చిన్న ఇల్లు, దాని మీద ఒక పెద్ద నీళ్ళకుండీ, ఆ నీళ్ళ కుండీలోంచి ఇందాకా కురిసిన వాననీళ్ళు ధారగా కిందికి కారుతున్నాయి. ఆ నీళ్ళు చక్కగా రాళ్ళతో కట్టిన బోదుల ద్వారా మొక్కల్లోకి పారుతున్నాయి. అన్ని మొక్కలకీ చుట్టూ పాదులు చేసి ఉన్నాయి. నీళ్ళు ఆ పాదుల్లో నిండి పొర్లి మరో బోదిలో పడుతున్నాయి. ఆ బోది నీళ్ళను మరో మొక్కకి మర్లిస్తోంది. చాలా బాగా కట్టిన బోదులు. ఇంతలో దుగ్గన్న దెయ్యానికి మళ్ళీ కోపం వచ్చింది. ఇంత సాహసించిన కుర్రకుంకని బెదిరించి రాయిగా మార్చెయ్యాలని తీర్మానించుకుంది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు. దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్ అతని మీదికి వచ్చింది. అతనప్పుడు ఒక బండరాయి మీద ఎక్కి ఉన్నాడు ఇంజను మీదికి వచ్చిపడుతుంటే, అతను వెనక పక్కకి దూకి నేల మీద పడుకున్నాడు. ఇంజను రాయికి తగిలి రెండుగా చీలి, రెండు బండరాళ్లకు ఢీకొని, చప్పగా రంగులు మారుతూ నేలమట్టం అయిపోయింది. కొంతసేపు కదల్లేదు. కిష్టప్ప మళ్ళీ సురక్షితంగా లేవడం చూసి, మిగతా ముగ్గురూ ధైర్యం చేసి లోపలికొచ్చారు. మెల్లగా దెయ్యం పడి పోయిన చోటికి వచ్చారు–దెయ్యం మెల్లగా మనిషి ఆకారం దాలుస్తోంది. బిత్తరపోయి చూశారు నలుగురూ. దెయ్యం మనిషిగా మారింది. అయినా పూర్తిగా కాదు–గాజులాంటి దూదితో చేసినట్టుంది ఆకారం. తలవంచుకుని, రాతికి జేర్లబడి కిందికి చూస్తూ కూచుంది దెయ్యం. ఔనన్నట్టు తల ఊపింది. బాధగా నిట్టూర్చింది. ‘‘ఎందుకండీ ఏదో బాధపడుతున్నట్టున్నారు?’’ అని అడిగాడు కిష్టప్ప. ‘‘నా పరువంత నువ్వు మంట కలిపేశావురా కుర్రకుంకా! రెండువందల ఏళ్ళుగా ఎందరు మహావీరుల్ని హడల గొట్టేశాను! వేలెడు లేవు. నా భయంకరాలకు తట్టుకుని ధైర్యంగా నిలబడ్డావు. ఇంకేముంది? నన్ను చూసి మనిషన్నవాడు ఎందుకు భయపడతాడు? ఇంత గొప్ప దెయ్యమై లాభం ఏముంది?’’ కిష్టప్పకి జాలి వేసింది. ‘‘సార్! అసలు మీరు మనుషుల్ని ఎందుకు భయపెట్టాలి?’’ ‘‘మరింక దెయ్యం కావడం ఎందుకు? అయి ప్రయోజనం ఏమిటి? పైగా మనుషులు నన్ను చూసి భయపడి ప్రాణాలు విడుస్తుంటే నాకెంతో సరదాగా తృప్తిగా ఉండేది. అది కూడా లేకపోతే ఇంకా దెయ్యంగా ఎలా బతికేది? నాకింక రాత్రుల్ళు ఎలా గడుస్తాయి?’’ ‘‘మనుషుల్లా మీరు కూడా హాయిగా మెత్తని పరుపు మీద వెచ్చగా పడుకుని నిద్రపోకూడదు?’’ ‘‘నిద్రా? దెయ్యానికా?’’ దెయ్యం బరువుగా నవ్వింది. తరువాత మెల్లగా అంది– ‘‘నాకు వెచ్చని పరుపు ఏదో తెలుసా? ఊరి బయట, ఏటి ఒడ్డున, కట్టెలు పేర్చి నాకు పరుపే ఏర్పాటయి ఉంది. నేను పడుకున్నాక అది అంటించాలి. ఆ వెచ్చని మంటల దుప్పటి కప్పుకుని నేను శాశ్వతంగా నిద్ర పోవాలి. అంత వరకు నిద్ర లేదు, మెలకువ లేదు. నేను బ్రతికీ లేను, చచ్చీ లేను. చావు బతుకుల మధ్య ఇలా ఊగులాడుతూ శాశ్వతంగాగా ఉండిపోవలసిందే, నాకీ స్థితి నించి విడుదల లేదు?’’ కిష్టప్ప మిత్రులకీ కళ్ల నీళ్ళు తిరిగాయి–గౌరి అంది–‘‘తాతగారూ! మేం కట్టెలు పేర్చి మీకు పరుపు ఏర్పాటు చేస్తామండి’’ దెయ్యం ముఖంలో రవంత ఆశ, వెంటనే నిరాశ, మీవల్ల కాదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు, కిష్టప్ప అడిగాడు ‘‘సార్! మీరు బతికున్నప్పుడే చాలామందిని చంపేశారట. మరి పాపం కాదండీ!’’ ‘‘పాపం! మీరు అమాయకులు. పాపం అనే మాటే మీకు తెలుసు. అర్థం తెలియదు. అందుకే నన్ను చూసి మీరు భయపడలేదు. మీ మనసుల్లో పాపం ఉంటే, మీ పెద్దల్లాగే మీరూ నన్ను చూసి హడలి చచ్చిపోయి ఉందురు. రెండువందల ఏళ్ళుగా లోకాన్ని చూస్తున్నాను, అంతకంతకూ పాపం పేరుకుని లోకంలో గడ్డ కట్టుకుపోతోంది. స్వార్థం, దుర్మార్గం, క్రౌర్యం, ఇవే లోకాన్ని నడిపిస్తున్నాయి. మంచితనాన్ని చంపెయ్యడం మనిషి లక్ష్యం. నేను చాలా ఘోరాలు చేశాను, నా మీదా ఎందరో ఎన్నో ఘోరాలు చేశారు. ఒక మనిషినిహత్య చేస్తే హంతకుడికి ఉరిక్ష వేస్తారు లేదా యావజ్జీవ కారాగారం వేస్తారు. అదయినా ఏ పది పదిహేనేనేళ్లో. ఆ తరువాత హంతకుడు హాయిగా చనిపోతాడు. నేనో, చావూ కాని, బ్రతుకూ కాని, ఈ దెయ్యం రూపంలో రెండు వందల ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నాను. ఇంకా ఎన్ని వందల ఏళ్ళు నేనిలా గడపాలో. ఈ ఒంటరితం ఎలా భరించేది? అందుకే ఈ తోటని దెయ్యపుతోటగా మార్చేశాను, కసిదొద్దీ. ఈ మొక్కలకు చావూ లేదూ బ్రతుకూ లేదు. ఈ తోటలో ఉన్న పువ్వులకీ పిట్టలకీ కూడా అదే గతి. నేను వాయురూపంలో ఉన్న దెయ్యాన్ని, అవి ఘనరూపంలో దెయ్యాలు. నా తోడు కోసం తాకినదంతా దెయ్యంగా మార్చెయ్యాలని నా కోరిక. వీలయితే ఈ స్వార్థపరుల లోకాన్నంతా దెయ్యపు లోకంగా మార్చెయ్యాలని. ఈ క్షణం వరకూ ఈ లోకంలో మంచితనం, ధైర్యం, అమాయకత్వం ఉన్నాయని నేననుకోలేదు. ఉన్నాయని మీ ద్వారా నా కర్థమయింది...ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ స్థితి నుంచి బయటపడాలి? ఎలా శాశ్వత నిద్రలో మునిగిపోవాలి? మిమ్మల్ని చూశాక, లోకాన్ని మీ కోసమన్నా మిగల్చాలనిపిస్తోంది. నేను చచ్చిన దెయ్యాన్ని. మీ లోకంలో బతికున్న దెయ్యాలున్నాయి. పెరిగి పెద్దవాళ్లై మీరూ ఆ దెయ్యాల్లో ఒకరై పోతారని నా భయం. మీ అమాయకత్వం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని మీరు మార్చెయ్యాలని మంచితనానికి స్థావరంగా చెయ్యాలనీ నా కోరిక. ఏది నిజమౌతుంతో నాకు తెలియదు. అందుకే నాకేం పాలు పోవడం లేదు. గౌరి కిదంతా అర్థం కాకపోయినా దెయ్యంతాత ఎందుకో చాలా బాధపడుతున్నాడని గ్రహించింది. ‘‘తాతా! నీకు పరుపు మేం ఏర్పాటు చేస్తాం. ఈ తోటని మాత్రం మూములుగా చెయ్యి. వెనకటిలాగా పూలతో పిట్టలతో ఉంటే ఎంతో బాగుంటుంది. రా తాతా! నా చెయ్యి పట్టుకో. ఈ తోటలో కట్టెలు లేవు. అవతల నీకు కట్టెలతో పరుపు వేసి వెచ్చగా అంటిస్తాం. రా తాతా! రా మరి!’’ దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు. తోట ఆవరణకి అవతల కట్టెలతో చితి పేర్చారు. కిష్టప్ప లాంతరు పట్టుకొచ్చాడు. గౌరి అలిసిపోయిన దెయ్యం తాతని చితి మీద పడుకోబెట్టారు. కిష్టప్ప లాంతరు చిమ్నీ తీసి చితి అంటించాడు. వెచ్చని మంటల్లో సగం మగత నిద్రలోకి పోతున్న దుగ్గన్న సేనాని దెయ్యం అంది– ‘‘నా చేతులతో ఆనాడు వేసిన తోట నేనే దెయ్యపుతోటగా మార్చేశాను. నేనింక విముక్తి పొందుతున్నాను. నాతో పాటు ఈ తోట విముక్తి పొందుతుంది. నేను శాశ్వత నిద్రలో చావును చేరుకుంటాను. ఈ రాతి మొక్కలు, లతలు, పువ్వులు, పిట్టలు బ్రతుకును చేరుకుంటాయి. కలకల్లాడుతూ వెనకటిలాగ అయిపోతుంది తోట. కానీ...స్వార్థం ఏమాత్రం మమస్సులో ఉన్నవాళ్లకయినా ఇది రాతితోటే. అమాయకులైన పిల్లలకే ఇది సజీవంగా కనిపిస్తుంది. మీలాంటి పిల్లలే...రాతితోటలాంటి లోకానికి తిరిగి ప్రాణం పొయ్యాలి’’ దుగ్గన్న సేనాని దెయ్యం మంటల్లో వెలుగుగా మారిపోయింది. తోటంతా పిట్టలు కిలకిలమంటూ ఎగురుతున్నాయి. పువ్వులు కలకల్లాడుతున్నాయి, అనేక రంగులతో. పిల్లలు ఆనందంగా ఆ తోటమధ్య గంతులేస్తూ తిరుగుతున్నారు. కాని– వాళ్లని వెతకడానికి వచ్చిన రామలింగం మేస్టారికీ, డ్రైవరుకీ, వంటవాడికీ రాతి మొక్కలే, రాతిపువ్వులే, రాతి పిట్టలే కనిపించాయి. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు. దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్ అతని మీదికి వచ్చింది. దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు. ∙పాలగుమ్మి పద్మరాజు -
కిష్కింద కాండ
మా ఊరిలో కోతుల పీడ చాలాఎక్కువ. అలా అంటే కోతులకు కోపం వస్తుందేమోనని నాకు అనుమానం. తట్టుకుని పడితే హంపి. వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు పాలించిన కిష్కింధ. వారి సామ్రాజ్యాన్నే మేము ఆక్రమించి ఇప్పుడు దాడి అంటే ఎలా? ఆంగ్లేయులే భారతీయులను ‘భారతాన్ని వదలి వెళ్ళండి’ అని చెప్పినట్టు. అందువల్ల మేమందరం ఈ కోతులకు సర్దుకున్నాం. మా మధ్యన అవి కూడా సర్దుకున్నాయి. ఎంతగా సర్దుకున్నా కోతులు కోతులే! పుట్టుకతో వచ్చిన గుణాలను అవి వదులుకుంటాయా? గవాక్షాల ద్వారా తొంగి చూసి, వంటింట్లో పెట్టిన ఆహారాన్ని చూసుకుని, మెల్లగా ఇంట్లోకి దూరి కావలసినదాన్ని పాత్రలతో సహా తీసుకునిపోయి, మళ్ళీ కడగవలసిన అవసరమే లేకుండా తిని, మరొకరి పెరట్లో ఆ పాత్రను పారవేసి, ‘‘మేమేమీ దొంగలం కాదండి...’’ అని రెండిండ్లవారూ కొట్టుకునే జగడపు సన్నివేశాన్ని సృష్టిస్తాయి. ఎవరి పెరట్లో ఏ చెట్టులో ఎలాంటి పళ్ళున్నాయో తెలుసుకుని, ఆ పళ్ళను సరిగ్గా మాగే కాలానికి వచ్చి అన్నీ తిని తేన్చి వెళతాయి. నిప్పులు చెరిగే వేసవిలో ఎక్కడా నీళ్ళు దొరకక నోరు ఎండిపోయి, మేము కొళాయి నీళ్ళు పట్టుకునే కాలానికి మా దగ్గరికి వచ్చి, మేము గుంతలో నిలిచిన నీళ్ళను బకెట్లో పట్టి పెడితే, మేమున్నామనే çస్పృహనే లేకుండా ఒక్కొక్కటిగా వచ్చి నీళ్ళు తాగి వెళతాయి. దీపావళి పండుగ వేళలో టపాసుల ఆర్భాటానికి బెదిరి కంగారు పడి చెట్లలో వణుకుతూ కూర్చుంటాయి. మా ఊరి ఆడవాళ్ళకు వడియాలు, అప్పడాలు చేసే సంబరం.ఆ బళ్ళారి ఎండకు వేరే ఇంకేమి చేయగలరు? వర్షం వచ్చినపుడు పురి విప్పుకుని నృత్యం చేసే నెమళ్ళ సంభ్రమంతో ఆడవాళ్ళు మండే ఎండలో వారి వారి మిద్దెల మీద వడియాలు, అప్పడాలను ఎండకు ఆరబెట్టేవారు. అత్తగారు సేమ్యాలు, వడియాలు, పువ్వు వడియాలు ఎండకు ఆరబెడుతుంటే, చెట్టుకొమ్మ మీద, ఇంటి చూరు మీద కోతులు తమ సంసార సమేతంగా ఎదురుచూస్తుంటాయి. పిల్లలు బెత్తం, ఖాళీడబ్బా, జేగంట, క్యాటర్‌బాల్ పట్టుకుని గొప్పయుద్ధరంగంలో సిద్ధమైన సిపాయిల్లా నిలబడినప్పటికీ వానర సైన్యం ముందు వాళ్ళేం లెక్కకు వస్తారు? అవి పిల్లలనే బెదిరించి వడియాలు, అప్పడాలను ఖాళీ చేస్తాయి. ఒకసారి మా పక్కింటి గృహిణి ఎక్కడో చదివి కోతులకు ఇంగువ మింగుడుపడదనే చిదంబర రహస్యాన్ని అందరికి చెప్పేసింది. ఆడవాళ్ళందరూ రాశులు రాశులుగా ఇంగువ వేసి వడియాలు, అప్పడాలు చేయసాగారు. దాంతో కోతులు ఒక ముక్క కూడా తినలేక ఉమ్మేసి వెళ్ళిపోయాయి. ఆ గృహిణి అయితే ‘నేను చెప్పలేదా?’ అని అందరి దృష్టిలో హీరోయిన్ అయిన సంభ్రమంతో మెరిసిపోయింది. మా అమ్మ, ‘‘అదికాదు, కోతిలాంటి కోతే అసహ్యపడే ఇంగువను మనం కోరికోరి తింటాం కదా... లొట్టలేసుకుంటూ తింటాం కదా...’’ అని సణుగుతూ, మరొక కొత్త శంకను అందరి ముందు పెట్టింది. ఆ రోజు నుంచి ఊరి ఆంజనేయుడికి పంపే నైవేద్యపు వంటకంలో ఇంగువ వేయటం ఆపేసింది. అయితే కోతులు ఎన్ని రోజులు వడియాలు, అప్పడాలు తినకుండా ఉంటాయి? కొద్ది రోజుల్లోనే ఇంగువను అలవాటు చేసుకున్నాయి. వడియాలు, అప్పడాలను తినటం మొదలుపెట్టాయి. అప్పుడు మా అమ్మకు సంతృప్తి కలిగింది. ‘‘బ్రాహ్మణుల వంట అంటే తమాషానా? ఎవరైనా లొంగాల్సిందే’’ అని దర్పంగా మాట్లాడింది. మళ్ళీ ఆంజనేయుడి నైవేద్యానికి ఇంగువ వేయసాగింది. ఊరికి కొత్తగా టీవీ వచ్చినపుడు ప్రజలకు కోతుల దాడి భరించటం అసాధ్యమైంది. వీధిలోని జనమంతా కన్నీరు ప్రవహింపజేసే ఏదో ధారావాహికను చూస్తూ కూర్చునివుంటే, కోతులు యాంటెనా మీద దూకి తెర మీద కేవలం చుక్కలను ఏర్పరిచేవి. జనమంతా ‘హో...’ అని గోలపెట్టసాగారు. మళ్ళీ ఎవరో ఒకరు మేడ ఎక్కి యాంటెనను దశదిక్కులకు తిప్పి, కింద నుంచి, ‘‘సరిగ్గా వచ్చింది, సరిగ్గా వచ్చింది...’’ అంటూ కేక పెట్టిన తరువాత టీవీ చూడానికి పరుగెత్తిపోతే మళ్ళీ పదినిముషాలకంతా మరొక కోతి దాని మీద ఎగిరేది. కొందరు తుమ్మ ముళ్ళను యాంటెనా మీద వేసి చూశారు. ఇంకొందరు భయంకరమైన రంగుల బట్టలను దానిమీద పరిచారు. మరికొందరు ఎత్తయిన కర్రను బిగించి యాంటెనా ఎత్తును పెంచారు. ఏమి చేసినా కోతుల దాడి ఆగలేదు. ప్రజలకు కోతులు ఎంతగా అలవాటైపోయాయంటే, ‘అది మొండితోక కోతికొడుకు’, ‘ఇది కుంటి కాలు కోతి కూతురు’, మొదలైన పేర్లతో గుర్తించేవారు. (కోతి పిల్లలకు తల్లి ఎవరని గుర్తిస్తారే తప్ప తండ్రి ఎవరో గుర్తించే మూర్ఖత్వాన్ని ఎవరూ చేయరు) మా అమ్మ కూడా ఒక కోతిని చాలా అలవాటు చేసుకుంది. మరీ సంప్రదాయపరులమైనందువల్ల స్నానం చేసి, పూజాపునస్కారాలు ముగించే వరకు నోట నీళ్ళు కూడా వేసుకునేవారు కాదు. అయితే దోసకాయ, బీరకాయలు కోసేటప్పుడు దాని రుచిచూసి తీపు–చేదు అని చెప్పడానికి ఎవరో ఒకరి సహాయం కావలసి వచ్చేది. మా చిన్నతనంలో మేము ఆశతో ఆ పని చేస్తున్నప్పటికీ కాస్త పెద్దవారమైన తరువాత లేని పొగరు చూపిస్తూ ’’పోమ్మా, నీవొకటి...’’ అని తప్పించుకునేవాళ్ళం. ఆ పనిని ఈ కోతి సంతోషంగా చేసేది. తియ్యగా ఉంటే చప్పరిస్తూ తినేది. చేదుగా ఉంటే బయిటికి వెళ్ళి ఉమ్మేసేది. అంతా ముగిసిన తరువాత సగం దోసకాయ దానికి ఇస్తే తీసుకునిపోయేది. ఒకసారి మా అమ్మ దురదృష్టానికి కోసిన దోసకాయలన్నీ చేదుగా ఉండాలా? కోతి కోపంతో మా అమ్మ మీద అరవటంతో అమ్మ భయపడిపోయింది. చివరికి గూట్లోఉన్న ఒక కొబ్బరి చిప్పను ఇచ్చి పంపింది. వకీలు సుందరావుగారి తల్లి కాశవ్వకు కోతులంటే చాలా ఇష్టముండేది. ఇంట్లో మిగిలిన సద్ది పదార్థాలన్నీ దాచిపెట్టి కోతులకు ఇచ్చేది. కాయగూరలు అమ్మేవారి దగ్గర కుళ్ళిన టమోటాలు, వంకాయలు వేడుకుని తెచ్చి కోతులకు ఇచ్చేది. మేడ మీద కుండలో ఒకటి రెండు కడవల నీళ్ళు వేసిపెట్టేది. అలాంటి కాశవ్వ చనిపోయినపుడు సుందరరావు హంపిలోని తుంగభద్ర ఒడ్డున కార్యక్రమాలను చేపట్టారు. మిగలిన కార్యక్రమాలన్నీ సుసూత్రంగా జరిగిపోయినా ఎంత ప్రయత్నించినా పిండాన్ని కాకి ముట్టలేదు. ఇంట్లో వాళ్ళందరూ ఏవేవో ఆశలు చూపించి వేడుకున్నా కాకరాయుడు వచ్చి పిండం ముట్టలేదు. పురోహితులు ’’ఈ రోజు చాలామంది కర్మలు చేశారు. అందుకే కాకులంతా పిండాలు తిని తిని పొట్ట నింపుకున్నట్టు కనిపిస్తోంది. ఏదీ రావటం లేదండి’’ అని ఓదార్చారు. సుందరరావుగారు చివరికి విసిగి ‘‘తొందరగా వచ్చి భోజనం చేయమ్మా, మా భోజనానికి ఆలస్యం చేయకు’’ అని వేడుకుని నిస్సహాయంగా కూర్చున్నారు. కొద్దిసేప్లోనే ఒక కోతివచ్చి ఆ పిండాన్ని ఎత్తుకునిపోయింది. జనం ‘‘ఏ...ఏ...’’ అని అరిచేలోపే కోతి పరారయ్యింది. జరిగిన సంఘటన వల్ల బెదిరిపోయిన పురోహితులు ‘‘కాకి పిండానికి బదులుగా కోతి పిండం అయిపోయింది కదండి’’ అని చేతులు నలుపుకున్నారు. అందుకు సుందరరావుగారు, ‘‘మా అమ్మకు కాకుల కన్నా కోతులమీద ప్రేమ ఎక్కువలెండి. మంచే జరిగింది’’ అని జవాబిచ్చారు. ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ గుహలో నరసింహస్వామి దేవస్థానం ఉంది. నరసింహుడు కొండ గుహలో కాకుండా ఇంకెక్కడ ఉండానికి సాధ్యం? చుట్టుపక్కల అడవి ఉన్న కారణంగా ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా ఉండేవి. పట్టణ కోతులకన్నా ఇవి బలమైనవి. భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిటిపళ్ళ కారణంగా దేవస్థానం చుట్టుపక్కలంతా సంచరిస్తుంటాయి. మేము పిల్లలం వాటి చేష్టలను చూడటంలోనే సంతోషపడేవాళ్ళం. ఒకసారి ఒక చిన్న కోతిపిల్ల గరుడస్తంభం దగ్గర కూర్చునివుంది. చుట్టుపక్కల ఏ కోతి కనిపించకపోవటంతో నాకు ధైర్యం వచ్చింది. అరుగు కింద వేలాడబడిన దాని తోకను సద్దు చేయకుండా వెళ్ళి లాగాను. చెట్టుమీద ఆ కోతిపిల్ల తల్లి ఎక్కడ కూర్చునివుందో తెలియదు. ఎగిరొచ్చి నా చేతిని రక్తం వచ్చేలా గోళ్ళతో గీరి తన బిడ్డను ఎత్తుకుని పారిపోయింది. నేలానింగీ ఏకమయ్యేటట్టు ఏడ్చాను. గుడిలో ఉన్నవారందరూ పరుగున వచ్చారు. రక్తం కారుతున్న నా చెయ్యి చూసి మా అమ్మకు దుఃఖం కలిగింది. ‘‘నువ్వేం చేశావు?’’ అని అడిగింది. నేను అత్యంత అమాయకంగా, ‘‘నేనేమీ చేయలేదు. మౌనంగా నుంచున్నాను. అదేవచ్చి గీరి వెళ్ళింది’’ అని అబద్ధం చెప్పాను. అమ్మ బాధను భరించలేక నా రక్తం కారుతున్న చెయ్యిని చెట్టు మీద తన బిడ్డతో కూర్చున్న కోతికి చూపించి ‘‘నీ ఇల్లు పాడైపోను. పిల్లల్ని కన్న నువ్వూ ఇలా బిడ్డకు గాయం చేశావుకదా?’’ అని దానికి శాపనార్థాలు పెట్టింది. గాయానికి తడిబట్టను కట్టి, నా ఏడ్పులోని ఆర్భాటమంతా తగ్గిన తరువాత ఎందుకో మా అమ్మకు అనుమానం వచ్చి ‘‘నువ్వేం చేశావో నిజం చెప్పు. అబద్ధాలు చెప్పకు’’ అని గద్దించటంతో మెల్లగా పిల్లకోతి తోకను లాగిన విషయం కక్కాను. మా అమ్మకు కోతిని శపించిన తన కృత్యానికి భయంవేసి మరుసటి రోజున ఆంజనేయస్వామికి శెనగపప్పు వడల దండను వేయించింది. ఇప్పటికీ నా చేతి మీద ఆ కోతి గీరిన గాయపు మచ్చ అలాగే ఉంది. అప్పటి నుంచి పిల్లకోతి తంటాలకు వెళ్ళలేదు. కోతి పిల్లనుకానీ, చిన్నపిల్లల బుగ్గలు నిమిరేటప్పుడూ వాళ్ళ అమ్మల వైపు ఓరచూపు చూసి గట్టిగా నిమిరానని కోప్పపడలేదని నిర్ధారించుకునేవాణ్ణి. ఈ నరసింహస్వామి దేవస్థానం దగ్గర్లోనే ఒక అరుగు ఉంది. ఆడవాళ్ళు తల జుట్టు విప్పుకుని ఈ అరుగుకింద కూర్చుంటే చాలు ఏదో ఒక కోతి అరుగుమీద కూర్చుని పేలు చూస్తుంది. దొరికిన పేనును గుటుక్కున నోట వేసుకుంటుంది. పక్కన దాని పిల్ల వచ్చి కూర్చుంటే దాని నోటికి ప్రేమగా ఒకటి రెండు పేన్లను ఇస్తుంది. అయితే ఇలా పేలు చూస్తున్నప్పుడు ఆడవాళ్ళు తలెత్తి అటూ ఇటూ కదిలిస్తే దానికి చాలా కోపం. ప్చ్‌మని తలమీద ఒక్కటిచ్చేది. దాని దెబ్బకు ఆడవాళ్ళు భయపడుతున్నప్పటికీ, అది తన సూక్ష్మమెన కళ్ళతో మరీ చిన్నగా వున్న పేనును సహితం పట్టి కుక్కుతుండటం వల్ల అరుగు కిందికి వెళ్ళి కూర్చునేవారు. సీతక్క అని మా పెద్దమ్మ ఒకరుండేవారు. ఆమె హరపనహళ్ళి ఆడపిల్ల. మహా గయ్యాళి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఆమె నోరుకి భయపడుతారు. అలా సీతక్క ఒకసారి తన తలజుత్తు విరబోసుకుని వెళ్ళి అరుగుకింద కూర్చుంది. కోతి యథాప్రకారం వచ్చి పేలు చూడసాగింది. ఎందుకో తలా కదిలించినందుకు కోపగించుకున్న కోతి ప్చ్‌మని ఆమె తల మీదొక దెబ్బ వేసింది. సీతక్క ఊరుకుంటుందా? అక్కడే పక్కనే ఉన్న చింత బరికెను తీసుకుని దానికి బొబ్బలు లేచేలా వాయించేసింది. కలవరపడ్డ కోతి బాధతో అరుస్తూ పారిపోయింది. ఆడవాళ్ళంతా ‘‘చూశారేమే ఆమె గట్టితనం? కోతిని కూడా వదల్లేదు మహాతల్లి...’’ అని మాట్లాడుకున్నారు. మొదటే దైవభక్తిగల మా అమ్మకు కోతిని సీతక్క ఇలా కొట్టడం భయాన్ని కలిగించింది. ‘‘అదికాదు సీతక్కా, కోతి అంటే సాక్షాత్ ఆంజనేయస్వామి ఉన్నట్టేకదా, నువ్వు ఇలా కొట్టవచ్చా?’’ అని అడిగింది. సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు బంధుబలగంతో, స్నేహితులతో కలిసి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళి నైవేద్యమిచ్చి రావడం మాలో అలవాటు. బియ్యం, బెల్లం, మొదలైన ఆహార సామాగ్రులు, పాత్రలు ఎద్దుల బండిలో వేసుకుని పోయి, అక్కడే వంట చేసుకుని, నైవేద్యం సమర్పించి, కాలువ నీళ్ళతో పాత్రలు కడుక్కుని తిరిగొస్తాం. ఉదయం వెళితే సాయంత్రం వరకు అక్కడే ఉంటాం. అక్కడ మేమంతా మైదానంలో భోజనానికి కూర్చుంటే కోతులు ఊరుకుంటాయా? అందుకు మా దగ్గర ఒక ఉపాయం ఉంది. అడవిలో భోజనానికి కూర్చునే సమయానికి నాలుగైదు సేర్ల వేరుశెనగకాయలను దగ్గర్లోని సరిగ్గా చల్లి వస్తాం. కోతులకు మా ఇంగువ వాసన భోజనం కన్నా వేరుశెనక్కాయలు ఇష్టం. తమ సంసార సమేతంగా అడవిలో ఈ కాయలను ఏరుకుని తినడానికి వెళతాయి. మా అందరి భోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. రోజూ ఉష్...ఏయ్...అని కోతులను కసురుకున్నా, అవి మరణించినపుడు వాటికి ఎక్కడలేని డిమాండ్. మామూలుగా వయస్సు మీరి చనిపోయిన కోతులను ఎవరూ అంతగా గమనించకపోయినా విద్యుత్ఘాతానికి గురై మరణించిన కోతుల శవాలకు వైభవం ఎక్కువ. భిక్షగాళ్ళు కూడా శవసంస్కారానికి పదిపైసలు ఇస్తారు. పూలహారంతో అలంకరించి, అగరొత్తులు వెలిగించి, కొత్తబట్టలో చుట్టి, నలుగురు మనుషులు భుజాల మీద శవాన్ని మోసుకుని వెళుతుంటే, చెట్లమీద, ఇండ్ల చూరుమీద కూర్చున్న కోతులు కలవరపాటుతో చూస్తాయి. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి. మునుపట్లా కోతిచేష్టలూ లేకుండా నిశ్శక్తితో బలహీనంగా కనిపించాయి. ఎందుకో వాటి పరిస్థితి చూసి చాలా బాధవేసింది. అర్చకులను విచారించినపుడు కొన్ని వాస్తవాలు తెలిపారు. ‘‘అడవిలో ఉండే అన్ని పండ్లచెట్లను ప్రభుత్వం కౌలుకు ఇస్తూ ఉంది. సీతాఫలం, ఉసిరికాయ, వెలగకాయలు, చింతకాయలు... అన్ని రకాల పండ్ల చెట్లనూ జనం కౌలుకు తీసుకున్నారు. రాత్రీపగలూ కాపలాకాసి పంటను కోసుకుని పోతారు. అంతేకాకుండా కొండను తవ్వితవ్వి మైన్స్‌గా మార్చి చెట్లన్నీ నరికి కూర్చున్నారు. కోతులు ఏం తినివుంటాయో చెప్పండి? ఇదొక్కటే చాలదన్నట్టు వన్యమృగ సంరక్షణ చేయాలని నాలుగైదు చిరుతలను తెచ్చి అడవిలో వదిలారు. అవి రోజూ రాత్రి ఒకో రెండో కోతులను చంపి తింటాయి. భయంతో కోతులు నిద్రకూడా పోకుండా హెచ్చరికతో రాత్రి గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరబాటున నిద్రపోయినా, చిరుత ఒక్కసారి గర్జిస్తే చాలు. భయపడి చెట్టు మీది నుంచి పట్టుతప్పి కింద పడిపోతాయి’’ అని బాధపడ్డారు. కేవలం భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిపళ్ళతోనే కోతులు ఎలా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమో చెప్పండి? సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి. కన్నడ మూలం : వసుధేంద్ర అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
లగేజ్ ట్యాగ్
ఇండిగో కౌంటర్ మీద ఉన్న అమ్మాయి లగేజ్ ట్యాగ్ ఇవ్వలేదు రాజీవకు. ‘అక్కర్లేదు మామ్. మీ హ్యాండ్‌బ్యాగ్‌ను అది లేకుండానే తీసుకెళ్లవచ్చు’ అంది– చెక్ ఇన్ బ్యాగ్‌ను కన్వేయర్ బెల్ట్ మీదకు దొర్లిస్తూ. బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ వైపు నడిచింది రాజీవ. ఇంతమునుపు ఎయిర్‌పోర్ట్‌కు వస్తే ఫ్లయిట్లో తీసుకెళ్లాల్సిన బ్యాగ్‌లకు లగేజ్ ట్యాగ్ ఇచ్చేవారు. అది ఉంటేనే ఫ్లయిట్ లోపలికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదని ఆమెకు అర్థమయ్యింది. చాలా ఏళ్లయ్యింది ఆమె విమాన ప్రయాణం చేసి. ఒంటరిగా ప్రయాణం చేసి కూడా. హ్యాండ్‌బ్యాగ్‌లోని డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఎంప్లాయి కార్డ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంది రాజీవ. మామూలుగా అయితే ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదామెకు. భర్తో, కొడుకో వాటిని తమ దగ్గర పెట్టుకుని ఇటు నడువూ అటు నడువూ అంటూ తీసుకెళ్లి తీసుకొచ్చేస్తుంటారు. ఇవాళ తనే సొంతంగా చేసుకోవాలి. సెక్యూరిటీ చెక్ అయ్యాక, ఫ్లయిట్‌కు టైమ్ చూసుకుంటే దాదాపు గంటన్నర ఉంది. కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తూ ఉంది. ఎర్లీమార్నింగ్ ఏడున్నరకు ఫ్లయిట్ అంటే అయిదున్నరకు ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. దాని బదులు ట్రైనే హాయి. కాని సెమినార్ కండక్ట్ చేస్తున్నవారు ఫ్లయిట్లోనే రమ్మని చెప్పారు. ఫ్లయిటే కరెక్ట్ కూడా. హైదరాబాద్ నుంచి కేరళకు ట్రైన్లో ఎప్పటికి చేరాలి. ‘నేను ఎవరినైనా తోడు తెచ్చుకుంటే మీకు అభ్యంతరమా?’ అని నిర్వాహకులను అడిగింది రాజీవ. భర్తనో, కొడుకునో పిలిస్తే కాదనరు. వాళ్లు లేకుండా ఎక్కడికీ కదలదు ఆమె. ‘అభ్యంతరం లేదు’ అన్నారు వాళ్లు. ఇవాళ ప్రయాణం అంటే మూడు రోజుల క్రితం భర్తను అడిగిందామె– ‘టికెట్లు బుక్ చేశారా మనిద్దరికీ’ అని. అతను చాలా క్యాజువల్‌గా ‘నాకు కుదిరేలా లేదు బుజ్జీ’ అని పేపర్లో మునిగిపోయాడు. ‘అంటే?’ ‘నేను లేకపోతే నువ్వూ వెళ్లవుగా. అందుకని చేయలేదు’ చేతి వేళ్ల నుంచి పాదాల వరకు ఏదో చురుకు పాకినట్టయ్యింది. ‘వాణ్ణి తీసుకెళ్లేదాన్నిగా’ ‘వాడికేదో యూత్ ఫెస్టివల్ ఉందట కాలేజీలో’ అన్నాడు. ‘మీరూ మీరూ మాట్లాడుకున్నారు. నాకు మాట మాత్రం చెప్పలేదు’ ‘ఏముంది చెప్పడానికి? టిఫిన్ రెడీనా?’ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు. కాలేజీలో చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమే కావచ్చు. ఎన్నాళ్లు చేసినా పద్దెనిమిది, ఇరవై వేల జీతమే వస్తుండవచ్చు. కాని దక్షిణాది భాషా సాహిత్యాల మధ్య ఉండే సామీప్యత, తులనాత్మకత పట్ల రాజీవకు అభిరుచి, లోతైన ప్రవేశం ఉన్నాయి. చాలా జర్నల్స్‌కు రాస్తూ ఉంటుంది. కాని ఇలా సెమినార్లకు పిలిచేవాళ్లు తక్కువ. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు ఎవరో ఒకరి సెక్యూరిటీలో వెళ్లి రావాలి. వాళ్లకు కుదరకపోతే ఆ అవకాశం కూడా పోయినట్టే. ఆ రోజంతా మనసు మనసులో లేదు. కాలేజ్‌లో ఒక లెక్చరర్‌కి ఇలా టికెట్లు గట్రా బుక్ చేయడం బాగా తెలుసు. ‘అయ్యో మేడమ్. డేట్స్ చెప్పండి. టూ మినిట్స్‌లో బుక్ చేస్తాను’ అని చేసి ఇచ్చాడు. ఆ రాత్రి చెప్పింది ఇంట్లో ‘నేను ఒక్కదాన్నే వెళుతున్నాను’ అని. ‘ఎలా వెళ్తావ్?’ ‘ఒక్కత్తే ఎలా వెళ్లి రాగలవ్?’ ఇద్దరూ ఒకే ప్రశ్నను అటు ఇటుగా వేశారు. మౌనంగా కప్‌బోర్డ్‌లో ఉన్న బ్యాగ్‌ను బయటకు దించే పనిలో మునిగిపోయింది. తెల్లవారుజాము నాలుగూ నాలుగుంపావుకు క్యాబ్ ఎక్కుతుంటే భయం వేసింది. భర్త నిద్ర కళ్లతోనే కిందకు దిగి, క్యాబ్ నంబర్‌ను సెల్లో ఫొటో తీసుకొని, మొక్కుబడిగా జాగ్రత్త అని చెప్పి, క్యాబ్ కదలే లోపే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని తిరుగుతూ ఉంది. ఒకచోట చిట్టి ఇడ్లీల స్టాల్ ఉంది. పాలరంగులో ఉన్న, వేడివేడి ఇడ్లీలు అమ్ముతున్నారు. ‘ఒన్ ప్లేట్ ప్లీజ్’ అంది రాజీవ. టోకెన్ తీసుకుంటూ ఉంటే ఆమెకు ఏదోలా అనిపించింది. ప్రయాణాల్లో ఇలా ఒన్ ప్లేట్ ఎప్పుడూ తీసుకోలేదు. ఆ టూ, త్రీ ప్లేట్ల హక్కుదారులు లేకుండా కేవలం ఒన్ ప్లేట్ తీసుకోవడం కొత్తగా కూడా అనిపించింది. ఇడ్లీ, కారప్పొడి, చట్నీ, పొగలు గక్కే సాంబారు... ఒక్కతే తను. అందరినీ చూస్తూ తింటూ ఉంది. చుట్టుపక్కల అనేకమంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒంటరి మగ ప్రయాణికులు చాలా మందే ఉన్నారు. ఆడవాళ్లు మాత్రం పిల్లలతోటో, భర్తలతోటో, బంధువులతోటో ఏదో ఒక ముడితో ఉన్నారు. తనలా ఒంటరివాళ్లు చాలా తక్కువ. ఎదురుగా వున్న గోడకేసి చూసింది. వెలిగిపోయే రంగులతో రైన్బో అనే అక్షరాలతో ఏదో అడ్వర్టైజ్మెంట్. గతుక్కుమంది. అది ఒక కండోమ్ అడ్వర్టయిజ్మెంట్. కొంచెం దూరంగా కూర్చున్న బిజినెస్ ఎగ్జెక్యూటివ్ విచిత్రంగా చూడబోయి తల దించుకుని కప్పులో కాఫీ వెతుక్కున్నాడు. ఒక్క క్షణం ఆగి మళ్లీ యాడ్ వైపు చూసింది. ఏం..కండోమ్ యాడ్ చూడకూడదా? అనుకుంది. అది కూడా ఒక హెల్త్ ప్రాడక్ట్. ప్రివెంటివ్ డివైజ్. పెళ్లయిన కొత్తలో పిల్లలు అప్పుడే వద్దనుకుని భర్తను కండోమ్ వాడమని సిగ్గు విడిచి అడిగింది. ‘ఛీఛీ నేను వాడను’ అన్నాడతను. ‘నువ్వే పిల్స్వాడు’ అని ఫోర్స్ చేశాడు. భర్త ఆర్డర్. పిల్స్ తినడం భార్య వంతు. భార్య బాధ్యత. భార్య ధర్మం. ఈమారు మరీ తీక్షణంగా ఆ యాడ్‌ను చూసింది. గమనిస్తున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఏముంది అందులో అలా చూస్తోంది అని చూసి లేచి వెళ్లిపోయాడు. ప్లేట్ ఖాళీ అయ్యింది. కపుచ్చినో గటగటా తాగేసింది. బ్యాగ్‌ను డ్రాగ్ చేస్కుంటూ గేట్ నంబర్ ఇరవై మూడు ఎక్కడా అని వెతుక్కుటుంటే షాపింగ్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. వెళ్ళేది కొచ్చికి కనుక గాగుల్స్ తీస్కోవడం కరెక్ట్ అనుకుంది. ఇంట్లో రెండు జతల గాగుల్స్ ఉన్నాయి. ఒకటి భర్తది. ఒకటి పుత్రరత్నానిది. ఆడవాళ్లకు కూడా కళ్లు ఉంటాయి...వాళ్లకూ గాగుల్స్ పెట్టుకోవాలని ఉంటుంది...అని వాళ్లకు ఉండదు. అప్పటికీ ఒకసారి అడిగింది– ‘కాలేజీకి వెళ్లేటప్పుడు కళ్ల మీద ఎండ పడకుండా కావాలని’. ‘నువ్వేమైనా త్రిషావా?’ అని నవ్వేశాడు భర్త. ‘నీకు బాగుండవులే మదర్ ఇండియా’ అన్నాడు కొడుకు. నిలబడి, ఒక్క క్షణం కూడా బేరం చేయకుండా రెండు వేల ఐదువందలు పెట్టి గాగుల్స్ కొంది రాజీవ. ఆ తర్వాత వాటిని పెట్టుకుని చాలాసేపు చూసుకుంది. దారిన ఎవరో టీనేజీ అమ్మాయి వెళుతుంటే రిక్వెస్ట్ చేసి యాంబియెన్స్ అంతా వచ్చేలా ఒక ఫొటో దిగింది. చలో.. ఇదీ మజా అనుకుని గేట్ నెంబర్ 26 దగ్గర తీరుబడిగా సెటిల్ అయ్యింది. ఆరేడు నెలలుగా కాలేజీలో బాగా వొత్తిడిగా ఉంది రాజీవకు. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరి సలపని పనులు మీద పడ్డాయి. ఇన్సె్పక్షన్ అంటూ రిపోర్టులు అంటూ మేనేజ్మెంట్ పీక్కు తినిందనే చెప్పాలి. ఒళ్లు హూనం అయ్యింది. ఎప్పుడైనా నలతగా అనిపించి ఒక గంట పడుకుంటే ‘మానేయ్మని అన్నాను కదా’ అంటాడు భర్త. ఉద్యోగం మానేయగలదా తను? మానేస్తే పది, ఇరవై రూపాయలకు కూడా భర్తకు లెక్క చెప్పాలి. జాకెట్ కుట్టించుకోవాలన్నా ముందూ వెనుకా ఆడాలి. కొడుక్కు డబ్బులివ్వడానికి వచ్చే చేతులు భార్యకు ఇవ్వడానికి రావు. అమ్మలక్కలతో కాలక్షేపం కబుర్లు చెప్తే బంగారం, నగలు అని విసిగిస్తుందని పుస్తకాలు చదువుకుంటుంటే ఊరుకున్నాడు భర్త. రెండుమూడు సార్లు పెద్ద పత్రికలలో రాజీవ పేరు వచ్చింది. అప్పుడు మాత్రం ‘ఇది నీకు అవసరమా?’ అన్నాడు. ‘చదువుకో. రాయకు’ అని కూడా అన్నాడు. ఆమె రాయడం మానలేదు కానీ పెన్నేమ్తో రాస్తోంది. రాత్రి గదిలో జరిగిన రాద్ధాంతం గుర్తుకొచ్చింది. ‘నేను రాకపోతే నువ్వు వెళ్లవనుకున్నాను. ఇప్పుడు ఏడుస్తూ కూచుంటావని సరేనంటున్నాను’ ‘అది కాదు.. మాట పోతుంది కదా. వెళ్లకపోతే నన్ను మళ్లీ పిలువరు’ ‘అసలు ఇదంతా ఏమిటి? నేను నా పనులు చూసుకోవాలా... నువ్వు ఎక్కడ తిరుగుతావో వాటికి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో అనుకుంటూ టెన్షన్ పడాలా?’ ‘ఏమిటి అలా అంటారు? మీకు నా మీద ప్రేమ లేదా?’ ‘ఉంది. చాలా ఉంది. ప్రమాణం చేసి చెబుతున్నాను ఉంది. నేను ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో కనిపిస్తూ, నేను ఇంట్లో లేనప్పుడు ఇంటిని చక్కదిద్దుకుంటూ, నేను ఇల్లు దాటిస్తే దాటేలా ఉంటే చాలు అనుకునేంత ప్రేమ ఉంది. ఇలా నేను అనుకుంటున్నది నీ కోసమే. నీ సుఖం కోసమే. నీకు అర్థం కాదు’... తెలియకుండానే కళ్లల్లో నీళ్లు నిండాయి. ‘ఊరుకో. నాకు నిజంగా కుదరకే రావడం లేదు. లేకుంటే తీసుకెళ్లుండేవాణ్ణి. పోనీ ఈసారికి ఒక్కదానివే వెళ్లు. కాని వీడియోకాల్స్ చేస్తుంటాను. నువ్వు నాకు కనపడుతుండాలి. సరేనా?’ ‘ఊ’... ఎందుకైనా మంచిదని పక్క మీద అతడు సంతోషపడేలా వ్యవహరించింది. అప్పటికిగాని శాంతించలేదు. అనౌన్స్మెంట్ వినిపించింది. ఒక్కొక్కరుగా ఫ్లయిట్‌లోకి ఎక్కుతుంటే సీట్ నంబర్ సరిగ్గా చెక్ చేసుకోకుండానే కూచుంది. ‘ఎక్స్‌క్యూజ్‌మీ. మీరు నా సీట్లో కూచున్నారు’ అంటున్నాడతను చిరునవ్వుతో. ‘ఓ.. సారీ’ సీటు మార్చుకుంది. అరసెంటీ మీటర్ కన్నా పొడుగు లేని జుత్తు, ఆరడుగుల ఎత్తు, పలచని చెంపలు, టాన్ అయినట్టున్న స్కిన్... ఏదో గెస్ క్వశ్చన్ లా ‘మీరు ఆర్మీలోగానీ ఎయిర్ ఫోర్స్లోగానీ చేస్తారా’ అడిగిందామె. అతడు ఆశ్చర్యంతో ‘అవును. అయితే మీరన్న రెంటిలోనూ కాదు.. నేవీలో. నా పేరు బాబీ’ అన్నాడు. కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. ‘అది అమ్మాయి పేరు కదా’ నవ్వింది. ‘మా పేరెంట్స్‌కి ఆ సినిమా బాగా నచ్చి నాకు పెట్టేశారు’ అంటూ నవ్వేశాడు. సంభాషణ అంతా ఇంగ్లీష్‌లోనే జరుగుతోంది. అతడు పదాలు పలికే తీరులో మళయాళీ అని అర్థం అవుతూనే వుంది. ‘చిన్నప్పుడు మిలట్రీవాళ్లను చూడటం థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఊరి మీదుగా అప్పుడప్పుడు మిలట్రీ వెహికల్స్ వరుసగా వెళుతుంటే నోరు తెరుచుకుని చూసేవాళ్లం. ఇలా యూనిఫామ్ లేని మిలట్రీ మనిషిని చూడటం బాగుంది’ అంది. అతడు తలాడించి అన్నాడు. ‘యూనిఫామ్ లేని, డ్యూటీ లేని, సుపీరియర్ల కమాండ్లు లేని ఒక మనిషి నాలో ఉంటాడు కదా. ఆ మనిషిని ఊపిరి తిప్పుకోనివ్వడానికే ఇలా అవకాశం రాగానే ఊరికి వచ్చేస్తుంటాను. నాకు నేను మిగిలే ఈ నాలుగు రోజులే మళ్లీ నాకు ఊపిరిపోస్తూ ఉంటాయి’ ‘ఇన్ఫాక్ట్.. ప్రతి ఒక్కరూ తమ లోపలి ఒక మనిషిని బతికించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి’ అన్నాడు మళ్లీ. సాలోచనగా తల ఊపింది. ప్లేన్ లాండ్ అయ్యింది. ‘కొచ్చి ఏర్పోర్ట్లో రెస్ట్‌రూమ్స్ చాలా బాగుంటాయి. హావ్ ఏ ట్రయల్’ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆర్గనైజర్ కమ్ స్నేహితురాలు బయటి నుంచి మెసేజ్ పెట్టింది. ‘అటు నుంచే స్ట్రయిట్‌గా ముందుకి వచ్చేస్తే డిపార్చర్ అన్న బోర్డ్ కనిపిస్తుంది. ఆ కారిడార్ చివరికి వచ్చెయ్యి. అక్కడే వున్నాను’ అని కూడా మెసేజ్. ఫ్రెష్ అయ్యి తల దువ్వుకుంటూ ఉంటే మొక్కల సంగతి గుర్తుకు వచ్చింది. పని మనిషిని రావద్దని ముందే చెప్పేసింది. వీళ్లిద్దరూ వాటికి నీళ్లు పోయరు. పక్క ఫ్లాట్‌లో ఉండే ఆమెకు కాల్ చేసింది. ‘సునందా.. కొంచెం బయట ఉన్న మొక్కలకు నీళ్లు పోయవా?’ ‘అయ్యో. పోస్తానులే. మీ ఆయనా, కొడుకు వెళ్లిపోయాక పోస్తాను’ ‘అదేమిటి? వాళ్లు బయటకు వెళ్లలేదా?’ టైమ్ చూసుకుంది. తొమ్మిదిన్నర అవుతోంది. కొడుకు ఎనిమిదికంతా వెళ్లిపోతాడు. భర్త తొమ్మిదీ తొమ్మిందింబావుకే. ‘అసలు ఇంకా బ్రష్షులే చేసినట్టు లేరు. ఇద్దరూ కాఫీ కప్పులు పట్టుకొని తలుపు తెరిచి పెట్టి పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కాబోలు’ మౌనంగా ఫోన్ కట్ చేసింది.బయట కేరళ. ఆకుపచ్చగా. చినుకులు చినుకులుగా. చేతులు సాచి పిలుస్తున్నట్టుగా. ఎగ్జిట్‌లో నుంచి బయటకు వస్తుంటే వుత్సాహంగా చేతులు ఊపుతున్న స్నేహితురాలు. ఒక్క నిమిషం ఆగి భర్తకు మెసేజ్ చేసింది. ‘కేరళ వెదర్ అద్భుతంగా ఉంది. వాన చాలా అందంగా ఉంది. మీరు లేరన్న వెలితి డిస్ట్రబ్ చేస్తోంది. మీ కోసం ఈ కేరళ అంతటినీ నా కళ్లల్లో అనుక్షణం నింపుకోవాలనుకుంటున్నాను. మీ ఫోన్ వస్తే మీరు గుర్తుకొచ్చి డిస్ట్రబ్ అవుతాను. ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను. వచ్చాక ప్రతిక్షణం మీ సన్నిధిలో ఉండి ఆ విశేషాలు చెబుతాను. బై’ ఫోన్ ఆఫ్ చేసింది. మైండ్‌లో ముడిపడి ఊగులాడుతున్న లగేజ్ట్యాగ్ను కత్తిరించి పడేసినట్టయ్యింది. ఈ రెండు రోజులు ఆమెవి. అచ్చంగా ఆమెవే. - జయశ్రీ నాయుడు -
ఆపరేషన్ కాదంబిని
‘భారత జాతీయ కాంగ్రెస్ సభా వేదిక మీద కనిపించిన తొలి భారతీయ మహిళ శ్రీమతి కాదంబిని గంగూలీ. తుది పలుకులు చెప్పవలసిందని కోరగానే ఆమె వేదిక ఎక్కి ప్రసంగించారు. స్వేచ్ఛాభారతం మహిళకు చేయూతనిస్తుందని చెప్పడానికి ఇదొక సంకేతం.’ అనిబీసెంట్ ‘హౌ ఇండియా రాట్ ఫర్ ఫ్రీడమ్’ అన్న పుస్తకంలో రాసిన మాటలు ఇవి. కాదంబిని గంగూలీ జీవితంలో ఇలాంటి ‘తొలి’ఘనతలు చాలా ఉన్నాయి. ఆమె భారతదేశ చరిత్రలో కనిపించే ఒక అద్భుత మహిళ. ఆమె సేవలను బట్టి ఫ్లారెన్స్ నైటింగేల్, అనిబీసెంట్లతో సమంగా కీర్తి పొందవలసిన విదుషీమణి వెంటనే అర్థమవుతుంది. కానీ భారతీయ చరిత్రకు ఏదో శాపం ఉంది. ఇలాంటి వారిని నిర్దాక్షణ్యంగా పట్టించుకోకుండా సాగింది. కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే తప్ప ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం కాదు. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు. ఇంకాస్త వెనక్కి వెళితే దారుణమైన దృశ్యం కనిపిస్తుంది. 1803లో కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని ఒక గైనకాలజిస్ట్‌గా అవతరించారు. బ్రహ్మ సమాజీకుల కుటుంబంలో పుట్టారామె. కానీ సనాతన హిందువులు సరే, మహిళను ఉద్ధరించడమే ఉద్యమ ధ్యేయమని చెప్పుకున్న బ్రహ్మ సమాజీకులు కూడా ఆమె వైద్య విద్యను అభ్యసించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ పేర్కొంటున్న ఈ ఉదాహరణకి మనుషులను తప్పు పట్టాలో, కాలాన్ని తప్పు పట్టాలో ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే సంస్కరణోద్యమాలకీ, రాజకీయోద్యమాలకీ, సాంస్కృతికపునరుజ్జీవనోద్యమాలకి ఆటపట్టయిన వంగదేశంలో ఇది జరిగింది. పురిటి నెప్పులు పడుతున్న బాలికను పరీక్షించేందుకు కలకత్తాలోనే ఒకసారి ఒక ధనిక కుటుంబం కాదంబినిని ఇంటికి పిలిచింది. పురుడొచ్చింది. తల్లీ, శిశువు క్షేమంగా బయటపడ్డారు. తరువాత కాదంబినికీ, ఆమె సహాయకురాలికీ భోజనం పెట్టిందా కుటుంబం– బయట వరండాలో. అంతేకాదు, ఎంగిలి విస్తళ్లు తీసి, అక్కడ శుభ్రం చేయమన్నారు కూడా. ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ (జూలై 18, 1861–అక్టోబర్ 3, 1923) అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్‌కు చెందిన చంద్రముఖి బసు. నిజానికి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలు వారు. దేశంలో వైద్యవృత్తి చేసిన తొలితరం స్త్రీలలో కాదంబిని ఒకరు. అయితే కాదంబిని పాశ్చాత్య వైద్యం చేయడానికి సర్టిఫికెట్ పొందిన మహిళగా ఖ్యాతి గాంచారు. ఆమె వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. నిజానికి వీరి అసలు ఊరు వంగదేశంలోని బారిసాల్ జిల్లాలోని చాండ్సి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. ఆమె తండ్రి బ్రజ్ కిశోర్ బసు. ఆయన స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. బ్రహ్మ సమాజ సభ్యుడు కాబట్టి సంఘ సంస్కరణోద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించేవారు. స్త్రీ విముక్తి కోసం బ్రహ్మ సమాజం పాటు పడేది. కాదంబిని బ్రాహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్లో ఆంగ్ల విద్యను అభ్యసించింది. ఇది ఢాకాలో ఉంది. తరువాత కలకత్తాలోనే బాల్యాగంజ్లో హిందూ మహిళా విద్యాలయంలో (1876) చదువుకున్నారు. తరువాత దీనిని బెతూన్ స్కూల్లో విలీనం చేశారు. ఇందులో చేరడమూ ఆమెకు గగనమైపోయింది. దీనికి కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష నిర్వహించేది. కానీ మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న మోడ్రన్ దురాచారమే అనుకోనక్కరలేదు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ల సంప్రదాయాన్ని అనుసరించే కలకత్తా విశ్వవిద్యాలయం కూడా మహిళలకు ప్రవేశం కల్పించేది కాదు. ఆమెతో పాటే డెహ్రాడూన్‌కి చెందిన చంద్రముఖి బసు కూడా దరఖాస్తు చేశారు. ప్రవేశ పరీక్ష కోసం పెద్ద పోరాటమే చేసిన వ్యక్తి ద్వారకానాథ్ గంగూలీ. ఆయన అదే స్కూల్లో ఉపాధ్యాయుడు. మొత్తానికి ఆ ఇద్దరు బాలికలు ప్రవేశ పరీక్ష 1877లో రాశారు. మరుసటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఒక్క మార్కు తక్కువగా కాదంబిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. చంద్రముఖి కొంచెం తక్కువ మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. కాదంబినికి బెతూన్‌లో కళాశాల స్థాయిలో ప్రవేశం దక్కింది. చంద్రముఖి ఫ్రీ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ కళాశాలలో ప్రవేశించారు. 1880లో ఇద్దరూ ఫస్ట్ ఆర్ట్స్ (ఎఫ్ఏ) పట్టా తీసుకున్నారు. తరువాత కాదంబిని కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని ఆశించారు. కానీ మహిళలకు ప్రవేశం లేదు. దీనితో కాదంబిని, చంద్రముఖి ఇద్దరూ బెతూన్ కళాశాలలోనే డిగ్రీలో చేరారు. 1883లో ఉత్తీర్ణులయ్యారు. ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలుగా పేరు సంపాదించారు. తరువాత కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని కాదంబిని కోరుకున్నారు. ఇందుకూ మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మద్రాస్ మెడికల్ కాలేజీ 1875 నాటికే మహిళలను చేర్చుకోవడానికి సిద్ధపడింది. కానీ 1882 నాటికి కూడా కలకత్తా వైద్య కళాశాల మాత్రం అందుకు సిద్ధపడలేదు. మళ్లీ ద్వారకానాథ్ రంగంలోకి దిగి పోరాడారు. 1884లో ఆ వైద్య కళాశాలలో చేరిన తొలి మహిళ కాదంబిని. వైద్య విద్య చదవడానికి ఆమెకు ప్రభుత్వం నెలకు 20 రూపాయలు విద్యార్థి వేతనం మంజూరు చేసింది. కానీ ఈ విజయం కోసం ఆమె ఎన్నో అవరోధాలను అధిగమించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వైద్య కళాశాలలో మహిళల ప్రవేశం నిర్వాహకులకు రుచించేది కాదు. ఒక బెంగాలీ ఆచార్యుడు కూడా ఆమె వ్యతిరేకులలో ఉన్నారు. ఆయనే మెటీరియా మెడికా, కంపేరిటివ్ అనాటమీ పరీక్షలో మార్కులు తగ్గించాడు. దీనితో ఆమె ఎంబి (బేచిలర్ ఆఫ్ మెడిసిన్) పట్టాను కోల్పోయింది. గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ బెంగాల్ (డిప్లొమా) పట్టా మాత్రమే దక్కింది. ఇన్ని ఆటంకాల నడుమ 1886లో ఆమె ఆ స్థాయికి చేరడం మహోన్నత చరిత్రాత్మక విజయమే. ఆ డిప్లొమాతో కాదంబిని లేడీ డఫ్రిన్ ఉమెన్స్ హాస్పిటల్లో చేరారు. జీతం రెండువందల రూపాయలు. అక్కడ కొద్దికాలమే ఉన్నారు. కారణం– వివక్ష. ఆమెతో పాటు పనిచేసే పాశ్చాత్య మహిళా వైద్యులు ఆమెను చులకనగా చూసేవారు. కారణం ఆమెకు ఎంబి పట్టాలేదు. మూడేళ్లు గడిచినా ఆమెకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. దీనితో కొద్దికాలంలోనే ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రైవేటు ప్రాక్టీసు ఆరంభించారు. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. అప్పుడే ఆమె లండన్‌లో పాశ్చాత్య వైద్య విద్య చదివి మరో శిఖరం అధిరోహించాలన్న నిర్ణయానికి వచ్చారు. 1892లో అనుకున్న విధంగానే కాదంబిని లండన్ వెళ్లారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఆర్సిపి పట్టా, డబ్లిన్ విశ్వవిద్యాలయం నుంచి సీఎఫ్పిసి పట్టా, గ్లాస్గో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఆర్‌సీఎస్ పట్టా తీసుకుని ఇండియా వచ్చారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి ఆ వృత్తిని నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. ఆమె మళ్లీ సగౌరవంగా డఫ్రిన్ ఆస్పత్రిలో చేరారు. కొద్దికాలమే పనిచేసి ప్రైవేట్ ప్రాక్టీసు పెట్టారు. నేపాల్ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు. కాదంబిని ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. అప్పటికి ఆయన భార్య పోయింది. ముగ్గురు పిల్లలు. బెతూన్‌లో ఉపాధ్యాయుడైన ద్వారకానాథ్ కాదంబినికి అన్ని విధాలా సహకరించారు. అన్నట్టు ఇద్దరూ బ్రహ్మ సమాజీకులే అయినా ఈ వివాహాన్ని బ్రహ సమాజంలో కొందరు అంగీకరించలేదు. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. 1891లో మరొక దారుణ సంఘటన జరిగింది. ఆనాడు ‘బంగా బసి’ పేరుతో ఒక ప్రముఖ పత్రికకు నడిచేది. దానికి మహేశ్‌చంద్ర పాల్ సంపాదకుడు. కాదంబినిని చూస్తే బ్రహ్మ సమాజ స్త్రీలోకం తల దించుకుంటోందని విమర్శిస్తూ, ఆమెను పరోక్షంగా ‘వేశ్య’ అని రాసింది. దీనితో ద్వారకానాథ్, డాక్టర్ నీల్‌రతన్ సర్కార్, శివనాథశాస్త్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ పత్రికకు వంద రూపాయల జరిమానా, సంపాదకుడికి ఆరుమాసాలు జైలు శిక్ష విధించింది. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్‌వాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. విదేశాలలో వైద్య విద్య చదివి వచ్చి దేశంలో సేవలు అందించిన వారిలో కాదంబిని తొలి మహిళ కాదన్న వాదన ఒకటి ఉంది. అందులో నిజం లేకపోలేదు. కానీ ఇదొక వ్యర్థ వాదన. ఆనందీబాయి జోషి పాశ్చాత్య దేశాలలో వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన తొలి భారతీయ వనిత. మహారాష్ట్రకు చెందినవారు. ఆమె 1885లోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో వైద్య విద్యను పూర్తి చేశారు. 1886లో భారత్ వచ్చారు. ఆ తరువాత సంవత్సరమే ఆమె కన్నుమూశారు. ఆమె వైద్య సేవలు అందుకునే అవకాశం నాటి భారతీయ మహిళకు దక్కలేదు. కాదంబిని 1886లో కలకత్తాలోని బెంగాల్ మెడికల్ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు. 1892లో ఇంగ్లండ్‌లో వైద్య విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ప్రసూతి వైద్యురాలిగా ఆమె సేవలు చిరకాలం భారతీయ మహిళలు అందుకున్నారు. ఆనందీబాయి, కాదంబిని ఎవరు ముందు అంటూ ఆ మధ్య అమెరికా నుంచి వెలువడే వైద్య విశేషాల పత్రిక ‘యూరాలజీ’ ఒక ప్రశ్న వేసింది. ఆనందీ తొలి మహిళ కావచ్చు. కానీ భారతీయ సమాజానికి సేవలు అందించిన మహిళగా కాదంబిని కూడా గుర్తుంటారు. ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 1886–1887లో మద్రాస్ వైద్య కళాశాల నుంచి అనీ జగన్నాథన్ అనే మహిళ వైద్య విద్యలో డిప్లొమా తీసుకున్నారు. అయినా తొలితరం కాబట్టి ఎవరి విలువ వారిదే. చరిత్ర వీరిని సమంగా గౌరవించవలసిందే. · కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. -
మేమేం చేయాలి?
∙పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. – కె.వీణ, తిరుపతి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ప్రయత్నం చేయాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. దాని కోసం నడక, యోగా వంటివి పాటించాలి. మితమైన పోషకాహారం తీసుకోవాలి. థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, షుగర్, బీపీ వంటి పరీక్షలు చేసుకుని, సమస్యలు ఏవైనా ఉన్నాయేమో ముందే తెలుసుకోవాలి. సమస్యలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకుని, వాటిని అదుపులో ఉంచుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఫిట్స్, కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఇతరత్రా సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వాటికి డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మందులలో మార్పులు ఉంటే చేసుకుని గర్భం కోసం ప్రయత్నం చెయ్యడం మంచిది. రుబెల్లా పరీక్ష చేయించుకుని, రుబెల్లా యాంటీబాడీస్ నెగటివ్ వస్తే, రుబెల్లా వ్యాక్సిన్ తీసుకుని నెల తర్వాత గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడాలి. సిగరెట్, మద్యపానం అలవాటుంటే మానేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవాలి. కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకుని, అవసరమైతే దంపతులిద్దరూ రక్తపరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే దానికి మాత్రలు వేసుకుని, అదుపులోకి వచ్చిన తర్వాత గర్భం కోసం ప్లాన్ చెయ్యడం మంచిది. ∙నా వయసు 29 సంవత్సరాలు. మర్మాగంపై పుండు ఏర్పడింది. సిఫిలిస్ అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏమిటి? – యన్ఎన్, విజయనగరం సిఫిలిస్ అనేది ‘ట్రిపోనిమా ప్యాలిడమ్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే లైంగిక వ్యాధి. దీనిలో మొదటగా జననేంద్రియాల దగ్గర, నోట్లోను, మలద్వారం దగ్గర నొప్పిలేని చిన్నపుండులాగ ఏర్పడుతుంది. అవి వాటంతట అవే తగ్గిపోతాయి. కాని, తర్వాత ఈ పుండ్లు దశల వారీగా శరీరమంతా పాకుతాయి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది నరాలకు, గుండెకు, కాలేయానికి, కీళ్లకు, ఎముకలకు, రక్తనాళాలకు పాకి వాటిని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే ఈ బ్యాక్టీరియా జీవితకాలం శరీరంలోనే ఉండిపోతుంది. గర్భవతులలో తల్లి నుంచి బిడ్డకు పాకి అబార్షన్లు, కడుపులోనే శిశువు చనిపోవడం, పుట్టిన పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిర్ధారణ కోసం వీడీఆర్ఎల్, ఆర్పీఆర్ వంటి రక్తపరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ తర్వాత పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో బ్యాక్టీరియా నశించిపోతుంది. కాని,దాని వల్ల ముందుగా అవయవాలపై ఏర్పడిన దుష్ప్రభావాన్ని తిరిగి తగ్గించడం జరగదు. నివారణ మార్గాలలో అనేక లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. కండోమ్స్ వాడుకోవాలి. చికిత్స ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ∙నాకు కొత్తగా పెళ్లయింది. ‘వెజైనిస్మస్’ సమస్యతో బాధ పడుతున్నాను. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని ఒకరంటే, తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలనుంటున్నారు మరొకరు. ఏది నిజం? చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలరు. – ఆర్వి, హైదరాబాద్ యోని భాగంలోని కండరాలు కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోవడాన్ని వెజైనిస్మస్ అంటారు. ఇది కలయిక సమయంలో కావచ్చు. పెల్విక్ పరీక్ష చేసేటప్పుడు కావచ్చు. దాని వల్ల ఆ సమయంలో బాగా నొప్పిగా ఉండటం, కలయికకు, పరీక్షకు సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరిలో నొప్పి ఉంటుందనే భయంతో, గర్భం వస్తుందనే భయంతో ఆందోళన, మానసిక సమస్యలు, జననేంద్రియాల దగ్గర దెబ్బలు, ఆపరేషన్లు, ఏవైనా లైంగిక సమస్యలు, బాల్యంలో కొన్ని సంఘటనలు చూడటం, చదవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కారణం తెలుసుకోవడానికి వారితో విడిగా మాట్లాడటం, కౌన్సెలింగ్ చెయ్యడం, మెల్లగా యోని భాగం దగ్గర పరీక్ష చేయడం వంటివి అవసరం. తర్వాత సమస్యను విశ్లేషించి, కౌన్సెలింగ్ చెయ్యడం వల్ల చాలామందిలో సమస్య తగ్గుతుంది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే చికిత్స తీసుకోవడం, పెల్విక్ కండరాల వ్యాయామాలు, మానసిక ఒత్తిడి తగ్గడానికి నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం, యోని భాగంలో లూబ్రికేషన్ జెల్ వాడటం, లేదా డైలేటర్స్ వాడటం, భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ ఓపికగా కలయికకు ప్రయత్నం చేయడం వల్ల చాలామందిలో మార్పు ఉంటుంది. అరుదుగా కొద్ది మందిలో ఎలాంటి మార్పు లేనప్పుడు చిన్నగా కోసి కండరాలను వదులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బోటిలినమ్ టాక్సిన్ (బోటాక్స్) అనే ఇంజెక్షన్ నేరుగా యోని కండరాలకు ఇవ్వడం వల్ల యోని కండరాలు వదులయ్యి వెజైనిస్మస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
రెక్కల పుస్తకం
పసితనంలో పిల్లలు జోలపాటలను ఇష్టపడతారు. మాటలు నేర్చి, ఊహ తెలిశాక ఎన్నెన్నో ఊసులు చెప్పడం మొదలుపెడతారు. అలా ఊసులు చెప్పే దశలోనే వాళ్లు కథలకు చెవులొగ్గుతారు. పిల్లల కథలు ఈనాటివి కాదు, భాషలు ఊపిరి పోసుకున్నది మొదలు పిల్లల కథలు ప్రచారంలో ఉన్నాయి. తల్లులు చెప్పే కథలను పిల్లలు ఊ కొడుతూ వింటారు. కథలు వింటూ వాళ్లు తమ ఊహలకు పదునుపెట్టుకుంటారు. లోకంలోని మంచి చెడులను ఆకళింపు చేసుకుంటారు. అచ్చు యంత్రం అందుబాటులోకి వచ్చాక నానా ఉద్గ్రంథాలతో పాటు పిల్లల పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. టీవీలు, ట్యాబ్‌లు, స్మార్టఫోన్లు వంటి ఆధునిక వినోద సాధనాలు అందుబాటులో లేని కాలంలో కథల పుస్తకాలే పిల్లలకు వినోద సాధనాలు. వీడియోగేమ్స్‌లో తలమునకలయ్యే మీ పిల్లలకు ఈ వేసవి సెలవుల్లో చక్కని కథల పుస్తకాలనివ్వండి. వాళ్లే గనుక ఒకసారి కథల రుచి మరిగితే, ఇతరేతర వినోద సాధనాల జోలికి ఇక వెళ్లాలనుకోరు. అనగనగా ఓ తాతా బామ్మా! 2000–2020 ‘రండర్రా పిల్లలూ మీ కోసం కథల పుస్తకాలు తెచ్చాను’ అని ముసలావిడ ఆందో లేదో, ‘అబ్బా నీ కధల పిచ్చితో చంపుతున్నావు, నేను పబ్జీ ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నానా’ అని బుడుగు గాడి అరుపు. ‘నానమ్మా! నీ పేదరాశి పెద్దమ్మ కథ, లేదంటే రామాపురంలో సోములు అనే రైతుండేవాడు అని బోరు కొడతావు, ఎంచక్కా టీవీలో షించేన్ చూస్తూంటే’ అని బుజ్జి చిరాకుపడుతోంది. ‘అమ్మా వాళ్ళని వదిలేయేవే, అలా బలవంతంగా పుస్తకాలు చదివిస్తే వాటి మీద ఆసక్తి పోతుంది, యూట్యూబ్‌లో బోల్డు వినోదాత్మక విజ్ఞానంతో కూడిన వీడియోలున్నాయి చూసుకుంటారులే’ అని కొడుకు విసుక్కొంటున్నాడు. 1970–1990 ’ఏమర్రా పిల్లలూ ఎందుకు దెబ్బలాడుకొంటున్నారు’? ’చూడు బామ్మా! చందమామ చదువుతుంటే లాగేసుకొని చదువుతున్నాడు అన్నయ్య’. ‘నిన్న బాలమిత్ర వచ్చిన వెంటనే చెల్లే మొదట చదివింది. ఇవాళ నా వంతు బామ్మా.’ సెల్ ఫోన్లు, సామజిక మాధ్యమాలు రాకముందు పిల్లల పుస్తకాలు లేని గడప ఉండేది కాదు, గ్రంథాలయాకు వెళ్లని పిల్లలుండేవారు కాదు. బుడి బుడి అడుగులేస్తున్నప్పుడే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పురాణాలు, ఇతిహాసాల నుంచి కథలు చెప్పి, వారికి పుస్తకాలను అలవాటు చేసేవారు. పంచాయతీ నుంచి పట్టణం వరకు ఊరూరా గ్రంథాలయాలుండేవి. ఎన్నో పిల్లల మాస పత్రికలు ప్రచురణలో ఉండేవి. కొత్త మాసపత్రిక చేతికందగానే చదవడానికి ఎగబడేవారు. చదువుతున్నంతసేపూ ఆకలి దప్పులను కూడా మరచేవారు. మంచి సాహిత్యం చదివితే మెదడు చైతన్యవంతమవుతుంది. రేవులోని నావలకు దారి చూపించే దీప స్థంభాల్లాంటివి పుస్తకాలు. అవి పిల్లల బంగారు భవిష్యత్తుకు పూల బాట వేస్తాయి. కాబట్టి పిల్లలకు చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవాటు చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్లతో కూర్చుని కథలు చెబుతూ, వాళ్ల చేత కథలు చదివించాలి. 2013 లో జపాన్‌లో తోహోకూ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఒక విద్యా విషయ కార్యక్రమం పిల్లలకు టీవీలో చూపించారు. అదే అంశంపై రాసిన పుస్తకమిచ్చి మరో వర్గం పిల్లలచేత చదివించారు. మర్నాడు టీవీ చూసిన పిల్ల్లలు కంటే పుస్తకం చదివిన పిల్లల పదకోశం, విజ్ఞానం ఎన్నో రెట్లు మేలుగా ఉందని నిరూపించారు. బాల్యం నుంచి తరచు పుస్తకాలు చదివేవారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 2.5 రెట్లు తక్కువగా ఉంటుంది. టెలివిజన్ నరాలను ఉద్వేగానికి లోనుచేస్తే, పుస్తకపఠనం ఉద్వేగాన్ని అదుపులో పెడుతుంది. ఇంగ్లాండ్ లో సస్సెక్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం ఆరు నిమిషాల పుస్తక పఠనం ఒత్తిడి స్థాయిని 68 శాతం మేరకు తగ్గిస్తుంది.బాలల సాహిత్యానికి నాంది మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వివిధ భాషలలో, మాండలికాలలో లాలిపాటలు, జానపద కథలు గేయాలు, లయబద్ధమైన పద్యాలూ మనుగడలో ఉండేవి, కాకపోతే అక్షరరూపం దాల్చలేదు. పిల్లల సాహిత్యం ప్రజాదరణ పొందుతున్న కొద్దీ క్రమేపి ప్రపంచంలోని వేర్వేరు భాషల్లో పుస్తకరూపం దాల్చాయి. పిల్లల సాహిత్యంలో ఆదిగ్రంథం ‘పంచతంత్రం’ అని చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం 200 ప్రాంతంలో కాశ్మీర్ రాజ్యంలో విష్ణు శర్మ చేత పంచతంత్ర ప్రాణం పోసుకుంది. భారతదేశ సుగంధ ద్రవ్యాల పరిమళం పర్షియన్లు, అరబ్బులు, రోమన్లు, పోర్చుగీసులు, డచ్చు వారి ముక్కుపుటాలకు తగిలి వాటి కోసం ఎగబాకారు. సముద్ర మార్గం గుండా వాణిజ్యం ఆరంభించారు. ఎగుమతులు, దిగుమతుల ద్వారా వస్తుమార్పిడితో పాటు మన పిల్లల సాహిత్యం కూడా పట్టుకెళ్లారు. భారతదేశం నుంచి పంచతంత్ర పర్షియాకు, అరేబియాకు అక్కడ నుంచి జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆఫ్రికా, చివరికి అమెరికాకు వ్యాప్తి చెందిందని ప్రముఖ వ్యాకరణవేత్త మాక్స్ ముల్లర్ తన అధ్యయనం ‘మైగ్రేషన్ ఆఫ్ ఫేబుల్స్’లో వెల్లడించాడు. పశ్చిమ దేశాల వారి ‘టామ్ అండ్ జెర్రీ’కి గాని, ‘లయన్ కింగ్’కి గాని, మరో జంతు విషయ పుస్తకమేదైనా వాటికి మూలం మన పంచతంత్రమే. అందుకే అత్యధిక దేశాల్లో పిల్లలు మనదేశంలో మాదిరిగానే కోతి బావ, జిత్తులమారి నక్క మామ, కపట మొసలి ప్రధానాంశంగా ఉండే నీతి కథలు చదివేవారు. క్రమేపి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు నేపథ్యాలతో పిల్లల సాహిత్యం రూపుదాల్చింది. భారతదేశంలో సుమతీ, వేమన శతకాలు, రామాయణ, భారత గాథలు, ఐరోపా దేశాల్లో ’సిండ్రిల్లా’ లాంటి కథలు, పశ్చిమాసియా ప్రాంతంలో ‘ద అరేబియన్ నైట్స్’ కథలు, ఉత్తర అమెరికాలో ‘ది నెర్గో ఫోక్ స్టోరీస్’, ’అంకుల్ రేమూస్’ వంటి కథలు 17వ శతాబ్ది నాటికి పుట్టుకొచ్చాయి. ఆధునిక బాల సాహిత్యానికి నాంది 17వ శతాబ్దంలో పడింది. పారిశ్రామిక విప్లవం పుట్టుకొచ్చినప్పుడు నిరుపేద కుటుంబాల పిల్లలను బొగ్గు గనులలో, కర్మాగారాల్లో, బాల కార్మికులుగా నియమించుకొనేవారు. అగ్ర రాజ్యం అమెరికాలో సైతం నాలుగేళ్ల ప్రాయమున్న పిల్లలను ఫ్యాక్టరీ చిమ్నీలోకి పంపి లోపల శుభ్రం చేయించేవారు. బాల కార్మిక చట్టాలు లేని 19వ శతాబ్దంలో పిల్లలను బానిసలుగా భావించే వారు తప్ప పిల్లల కోసం సాహిత్యం రాసేంత గొప్ప ఆలోచన అప్పటికి కలగలేదు. ఏడాదిలో 50 పుస్తకాలు వివిధ దేశ భాషల్లో ముద్రణయితే గొప్పే. 19వ శతాబ్దం చివరిలో ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ బాలకార్మికుల చట్టాలను పటిష్ఠంగా తీర్చిదిద్ది, పిల్లలకు అన్ని హక్కులతో పాటూ విద్యాహక్కు కల్పించి, నిర్బంధ విద్యను ప్రోత్సహించాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తెచ్చిన సామాజిక మార్పుల క్రమంలో గణనీయంగా అభివృద్ధి చెందిన పిల్లల సాహిత్యం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చతికిలబడింది. అధిక ముద్రణ ఖర్చు, తగ్గిన గిరాకీ, కాగితం కొరత వలన ప్రచురణకర్తలు పిల్లల సాహిత్యంపై ఆసక్తి కోల్పోయారు. అయితే 1950లు నుంచి మొదలు పిల్లల సాహిత్యంలో ఆధునిక పోకడలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి. 1990 ల వరకు రేడియో, టెలివిజన్ల ప్రభావం పిల్లలపై పడలేదు, పుస్తకాలకు ఆటంకం ఏర్పడలేదు. బాల సాహిత్యం వైపు మొగ్గుచూపిన ప్రముఖ రచయితలు 1936లో ఒక తాత మరో ఊళ్లో పెరుగుతున్న తన మనవడికి రెండు కథలు రాసి పంపాడు. ఆ మనవడు పెద్దవాడయ్యాక తన తాత జేమ్స్ జోయిస్ చిన్నప్పుడు పంపిన ‘ది క్యాట్ అండ్ ది డెవిల్‘ కథల పుస్తకంగా అచ్చు వేయించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రచయితయిన జేమ్స్ జోయిస్ అద్భుతమైన బాల సాహిత్యం కూడా రాశాడు. వేలాదిగా పద్యాలు, పెద్ద సంఖ్యలో నవలలు రాసిన ఇ. ఇ. కమ్మింగ్స్ తన బంగారు పట్టి కోసం నాలుగు కథలు రాశాడు. తండ్రి జ్ఞాపకార్థం కుమార్తె నాన్సీ వాటిని 1965లో ‘ఫేరీ టేల్స్’గా పుస్తకం వేయించింది, ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం పాఠకాదరణ పొందింది.ప్రముఖ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే తన ప్రేయసి మేనల్లుడి కోసం రాసిన ‘ది గుడ్ లయన్ అండ్ ది ఫెయిత్ఫుల్ బుల్’ కథను 1951లో మొదటిసారి హాలిడే మ్యాగజైన్ ప్రచురించింది. ‘బ్రేవ్ న్యూ వరల్డ్’ రాసిన ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లే 1944లో తన ఐదేళ్ల మేనకోడలి కోసం రాసిన కథానికను ‘ది క్రోస్ ఆఫ్ పియర్బ్లోసమ్’గా 1967లో ర్యాండమ్ హౌస్ ప్రచురించింది. డజన్ల కొద్దీ నవలలు వ్రాసి సాహిత్యంలో రెండుసార్లు పులిట్జర్ బహుమతి గెలుచుకున్న జాన్ అప్డైక్ తన కూతురు ఎలిజబెత్ కోసం రాసిన కథలు ‘ఏ చైల్డ్స్ క్యాలండర్’, ‘ది మేజిక్ ఫ్లూట్’, ‘బాటమ్ డ్రీమ్’, ఏ హెల్ప్‌ఫుల్ ఆల్ఫాబెట్ అఫ్ ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్స్’ వంటివి ప్రాచుర్యం పొందాయి. తన సోదరి కొడుకుని ముఖ్య పాత్రధారిగా చేసుకొని బాల్యం ఎంత మధురమైంది అనే అంశాన్ని ప్రతిబింబించే ‘లిటిల్ బోయ్ లిటిల్ బోయ్’ అనే పిల్లల పుస్తకాన్ని జేమ్స్ బాల్డ్విన్ రాశాడు. ఇరవయ్యో శతాబ్దపు ప్రఖ్యాత కవులలో ఒకరైన టి. ఎస్. ఇలియట్ తన ప్రేయసి పిల్లల కోసం మారు పేరుతో కథలు రాశాడు. ఆ కథలను ‘ఓల్డ్ పాసమ్స్ బుక్ ఆఫ్ ప్రాక్టికల్ క్యాట్’ పేరిట ఫేబర్ – ఫేబర్ ప్రెస్ వారు 1939లో ప్రచురించారు. అతంత్య వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీ 1980ల్లో రాసిన ‘సెటానిక్ వెర్సస్’ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూంటే, తొమ్మిది ఏళ్ల కొడుక్కి బాధనిపించి ‘ఈ సమస్యాత్మక రాతలు మానేసి పిల్లల కథలు రాయొచ్చు కదా నాన్న మా స్కూల్లో స్నేహితులందరూ నిన్ను విలన్‌గా అభివర్ణిస్తున్నారు’ అని వాపోతే రష్డీ రాసిన పుస్తకం ‘హారూన్ అండ్ ది సీ ఆఫ్ స్టోరీస్’. కథలు రాసే నైపుణ్యం, ఇచ్ఛ, సామర్థ్యాన్ని కోల్పోయి, మానసికంగా కుంగిపోయిన ఒక ప్రముఖ రచయితని తన పదేళ్ల కొడుకు సాహసయాత్రకు తీసుకువెళ్లి తండ్రి కోలుకునేలా శతవిధాలా ప్రయత్నిస్తాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని అత్యద్భుతంగా చెప్పి స్ఫూర్తినిస్తుంది ఈ కథ. దీనికి అనుబంధంగా టీనేజ్ పిల్లల కోసం 2010లో, ‘లూకా అండ్ ఫైర్ ఆఫ్ లైఫ్’ పుస్తకాన్ని రాశాడు సల్మాన్ రష్డీ. ప్రముఖ నవల ‘ఫౌకాల్ట్స్ పెండ్యూలం’తో ప్రసిద్ధికెక్కిన ఇటలీ తత్వవేత్త ఉంబెర్టో ఎకో అత్యద్భుత సైన్స్ ఫిక్షన్ రాసి అంతరిక్షం, అణుబాంబు వంటి అంశాల పై పిల్లలకు ఆసక్తి పెంపొందించేటట్టు చేశాడు. అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములు తమ దేశాల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరు బయలుదేరి మార్స్ గ్రహం మీద తామే ముందు అడుగిడాలని ప్రయత్నిస్తారు, చివరికి ముగ్గురూ ఒకే సమయంలో మంగళగ్రహం మీదకు చేరుకొనే నేపథ్యంలో ఎకో రాసిన పుస్తకమే ‘ది త్రీ ఆస్ట్రోనాట్స్’ చిన్నపిల్లలకు అణువు పరమాణువుని విశదీకరించి చెప్పడమే కాకుండా యుద్ధం వలన కలిగే నష్టాన్ని, శాంతి సందేశాన్ని బొమ్మలను జోడించి మరీ వివరించాడు ఎకో ‘ది బాంబ్ అండ్ ది జనరల్’ అనే పుస్తకంలో. కయ్యానికి కాలుదువ్వే మిలిటరీ జనరల్ అణుబాంబులు ప్రయోగించి యుద్ధం చేద్దామనుకొంటూండగా, ప్రజలను చూసి జాలిపడి ఆ దుష్పరిణామం ఊహించుకోలేక అణువులన్నీ కూడగట్టుకొని బాంబుల్లోంచి బయటకు వచ్చేస్తాయి. పేలుడు జరగదు. కథ సుఖాంతం. లియో టాల్‌స్టాయ్‌కి పిల్లలంటే ప్రేమ. తన ఎస్టేట్‌లో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు. అయ్యో ఇప్పటి వరకు పిల్లల కోసం ఏమీ రాయలేదే అని అనుకున్నదే తడవుగా రాయడం మొదలెట్టి ‘ఏబీసీ బుక్’, ‘న్యూ ఏబీసీ బుక్’ బాల కథాసంపుటాలను ప్రచురించాడు. – సునీల్ ధవళ సీఈఓ, ద థర్డ్ అంపైర్ మీడియా పుస్తకాలే మార్గదర్శి మంచి పుస్తకాల కంటే పిల్లలకు గొప్ప స్నేహితులుండరు. విజ్ఞానాన్ని అందించడంలో పుస్తకాలు కల్పవృక్షాల్లాంటివి. బుద్ధి బలాన్ని పెంచి మనోవికాసాన్ని కల్పించడంలో పుస్తకాలకు మించిన అక్షయపాత్ర ఉండదు. పిల్లల ప్రవర్తనకి మూలం ఆలోచనలయితే, వాటికి ప్రతిబింబం చదివిన సాహిత్యమే. పిల్లల స్వభావం పాక్షికంగా వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకాలలోని పాత్రధారులు, సన్నివేశాలు ప్రేరణనిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. మంచి సాహిత్యం, పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతూ, పుస్తకపఠనాన్ని దినచర్యగా చేసుకొంటే మేధస్సు వికసిస్తుంది. పుస్తకాలు సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి దొహదపడతాయి. టీవీ, వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, సామజిక మాధ్యమాలు మానసిక వ్యాకులతకు దారితీస్తే, పుస్తకాలు ఆ వ్యాకులతను తరిమికొడతాయి. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అనూహ్యం, అమోఘం. -
ఆత్మాభిమానం ఒక వైపు ఆత్మవంచన మరొకవైపు...
కవి సామ్రాట్ నవలకు వెండితెర రూపం ఈ చిత్రం.పాటలే కాదు మాటలు కూడా రాసి దృశ్యాలకు కవిత్వం చిలికారు సినారె. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... శోభనపు గదిలో పూలు గుబాళిస్తున్నాయి. తమలో తాము గుసగుసలు పోతున్నాయి. చిన్నగా నవ్వుకుంటున్నాయి.అందాలభరిణె నవవధువు ఆ గదిలోకి వచ్చేసింది.ఏదో చప్పుడైంది.‘‘ఎవరది?’’ అన్నాడు వరుడు.‘‘నేను’’ అన్నది ఆమె సిగ్గుగా.మాటలు శృంగారాభరణాలు ధరించాల్సిన ఆ పూట వరుడి పెదాలపై వేదాంతం ప్రతిధ్వనిస్తోంది.‘‘నిన్నటి వరకు నీ వెవరో నేనెవరో’’ అన్నాడు అతడు.‘‘బతుకు బాటలో ఇద్దరినీ కలసిపొమ్మన్నది ఒక బంధం’’ అంటూ తమ వివాహబంధాన్ని గుర్తుచేయబోయే ప్రయత్నం చేయబోయింది ఆమె.‘‘అది బంధం మాత్రమే’’ తీసిపారేసినట్లుగా అన్నాడు అతడు.‘‘అనుబంధం కాదా?’’ అని అడిగింది ఆమె. అంతేకాదు కొంగులు ముడివడిన తరువాత ఏమవుతుంది ఇలా చెప్పింది. ‘‘కొందరికి మనసులు కలిసిన తరువాత మనువులు కుదురుతాయి. మరి కొందరికి కొంగులు ముడివడిన తరువాత గుండెలు కలుసుకుంటాయి. ఏమంటారు?’’‘‘ఏమంటాను. పడిన ముడి విడిపోనిదని తెలుసంటాను’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు అతడు.‘‘పోనీలెండి. ఇంటి తలుపు తెరిచి లోనికి రానిచ్చారు మీరు. ఇక మీ ఎద తలుపు తెరిచి అనురాగం అందుకోవాల్సింది నేను’’... ఆమె మాటల్లో అంతులేని ఆశాభావం!∙ చెలికత్తె చంపమాల ఆ తోటలో అదేపనిగా ఏడుస్తోంది.‘‘అదేమిటి! ఏడుస్తున్నావెందుకు? పొద్దున్నే పూలను చూస్తూ ఏడుస్తావెందుకు?’’ అని ఆరాతీశాడు భటుడు.‘‘ఏడ్వక ఏంచేయమంటారు? అమ్మగారి పడగ్గదిలోని ఈ పూలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి!’’ ఏడుస్తూనే సమాధానం చెప్పింది ఆమె.‘‘ఉంటే మాత్రం’’ ఆశ్చర్యపోయాడు భటుడు.‘‘ఏడ్వక ఏంచేయమంటారు’’ పాతపాటే అందుకుంది చంపకమాల.‘‘అది కాదు బాలా...’’ ఏదో చెప్పబోయాడు భటుడు.‘‘నా పేరు బాలా కాదు చంపకమాల’’ అన్నది ఆ చిన్నది.‘‘చంపకమాల ఇలా చంపకు మాల...ఇంతకీ మీ అమ్మగారికి ఈ పెళ్లంటే ఇష్టం ఉందా?’’ సూటిగా అడిగాడు భటుడు.‘‘ఎవరన్నారు? ఇష్టం లేనిది మీ అయ్యగారికే’’ కోపం అన్నది ఆమె. ∙∙ ‘‘విధి నిర్ణయమైపోయింది. ఆనాడే అయిపోయింది. ఇప్పుడు గతానికి వగచి ప్రయోజనం లేదు’’ కుమారుడితో అన్నాడు మహారాజు.‘‘అది నాకూ తెలుసు. అయినా మరొకరికి అర్పించిన మనసు నా ఆధీనంలో ఉంటుందా నాన్నా?’’ నిస్సహాయంగా అన్నాడు వీర.‘‘ఉండాలని చెబుతున్నాను. కోరికలు మచ్చిక చేయని గుర్రాల్లాంటివి. అదుపులో పెట్టుకోకపోతే రౌతుకు అపాయం బాబూ’’ జీవితసత్యాన్ని గుర్తు చేశాడు మహారాజు.కానీ వీరాది కోరిక కాదు...ప్రేమ!స్వచ్ఛమైన ప్రేమ... అంతస్తులను పట్టించుకోని అచ్చమైన ప్రేమ! ‘‘వలచిన హృదయం కోటి ముక్కలైనా కొట్టుకుంటూనే ఉంటుంది’’ బాధగా అన్నాడు వీర. కొడుకు మాటలు మహారాజులో ఆందోళన రేపాయి. ‘‘ఆ మాటలు అనకు బాబు. ఒక్కగానొక్క కొడుకువి. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను. నీ మనసు కుదుటపడితేనే ఈ వృద్ధుడికి మనశ్శాంతి’’ దీనంగా అన్నాడు మహారాజు. ‘‘నన్ను అర్థం చేసుకోండి నాన్నా. నా మనసు కుదుట పడే మార్గం ఒక్కటే. అది నా ప్రాణమిత్రుడు సేతుపతి చల్లని నీడ’’ అంటూ మిత్రుడిని వెదుక్కుంటూ వెళ్లాడు వీర. ∙ ‘‘నేను లేకుండా పెళ్లి చేసుకుందామనుకున్నావా? కళ్యాణపత్రిక అటుంచి కనీసం కాకితోనైనా కబురు పంపిచకపోయావా!’’ మిత్రుడిని నిలదీస్తున్నాట్లుగా అన్నాడు వీర. ‘‘కబురు! ఏంచూస్తావని కబురంపాలి మిత్రమా’’ నిర్వేదంగా అన్నాడు సేతు. ‘‘ఏం కళ్యాణం కన్నులపండగగా జరగలేదా?’’ అడిగాడు వీర. ‘‘ఆ కళ్యాణం లోకానికి మాత్రమే’’ మనసులో మాట ప్రియమిత్రుడికి చెప్పాడు సేతు.‘‘నీకు కాదా?! ఇంతకీ నీకు కలిగిన కొరత ఏమిటి సేతు? అడగకూడనిది అడుగుతున్నాను...ఆమె రూపవతి కాదా?’’ అడిగాడు వీర.‘‘ఆమె అందాన్ని పెళ్లిపందిట్లోనే కాదు శోభనపుగదిలో కూడా చూడలేదంటే బహుశా నువ్వు నమ్మవు వీరా’’ అని గుండెల మాటున బాధను బయటపెట్టాడు సేతు.‘‘సేతు...నీ హృదయం ద్రవించలేదా? ఆవిడ నీ అర్ధాంగి అని ఆమెకు ఆశలు ఉంటాయని, పది కాలాల పాటు పచ్చగా కాపురం చేయాలని పసిడి కలలు పెంచకుంటుందని అవి తీర్చవలసిన బాధ్యత నీదేనని విస్మరించావా?’’ బాధ్యత గుర్తు చేశాడు వీర. ‘‘చాలు వీరా చాలు. నీవు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేది...పోగొట్టుకున్న నా మనసు పొందే వేదన. వీరా! నీకు ప్రేయసి ఉండి, హృదయగవాక్షాలు విప్పి ఆమె నీకై ఎదురు చూస్తూ వసంతసుందరిలా నీ బతుకుతోటలో అడుగిడుతుంటే నీ వొడి లోపల తన నీలాల కళ్లలో నీ బొమ్మ గీస్తు ఉంటే పరవశించిన పెదవులతో నీ నుదుట ఒక చక్కని ముద్దు ముద్రిస్తుంటే తన మనసుని నీ చేతుల్లో పెట్టి తన వలపును నీ కళ్లలో నింపి తన సర్వస్వాన్ని నీ పాదాల ముందు సమర్పిస్తుంటే అప్పుడు తెలిసేది వీరా! వలచిన గుండెలో చెలరేగిన అలజడి’’ సేతు మాటలు విని తట్టుకోలేకపోయాడు వీర.‘‘చాలు సేతు చాలు!’’ అని అరిచాడు.‘‘ఆత్మాభిమానం ఒకవైపు ఆత్మవంచన మరోవైపు. తనువు ఒకచోట మనసొకచోట. ఈ విషాన్ని ఎలా దిగమింగాలి వీరా?’’ మిత్రుడి భజం మీద చేయివేసి తల్లిడిల్లిపోయాడు సేతు.‘‘అచ్చమైన ప్రేమ అలల మీద ప్రతిబింబింబే చుక్కల కాంతిలా ఉండాలి. జ్వలిస్తున్న హృదయానికి శాంతినివ్వాలి. పువ్వు వాడుతుంది. తావి వీడుతుంది’’ జీవితసత్యాన్ని చెప్పాడు వీర.‘‘కాదు వీరా! ప్రణయకుసుమం వాడదు. పరిమళం వీడదు’’ ప్రేమ గొప్పదనాన్ని చెప్పాడు సేతు. -
వన్ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ
ఈ ఏడాది విడుదలైన సినిమాల జయాపజయాలను బేరీజు వేసుకుంటే, తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘గీత గోవిందం’ చిత్రాల ఘనవిజయం కొత్తదనంపై తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అద్దంపట్టాయి. ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత..’ వంటి మాస్ సినిమాలు ఎటూ హిట్లు కొట్టాయి. అలాగని తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి పట్టం కట్టకుండా ఉండలేదనడానికి ఈ ఏడాది బాక్సాఫీస్ ఫలితాలే నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. సగటున ప్రతినెలా ఓ సినిమా విజృంభించింది. ఇప్పటి వరకు 120కి పైగా తెలుగు సినిమాలు విడుదలైతే, వాటిలో విజయవంతమైనవి దాదాపు 20 లోపే. గతంలో పోలిస్తే డబ్బింగ్ సినిమాల హవా తగ్గిన ట్లే. డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకాదరణ కొరవడటంతో ఈసారి దాదాపు 30 నుంచి 35 సినిమాలు మాత్రమే తెలుగులోకి దిగుమతి అయ్యాయి. గతంలో ఆ సంఖ్య దాదాపు రెండు రెట్లు ఎక్కువగానే ఉండేది. భాగమతితో హిట్ల బోణీ జనవరి నెల అనగానే కొత్త సంవత్సరం హడావిడి మొదలవుతుంది ఏ పరిశ్రమకైనా. సినిమా అభిమానులకైతే మరీను. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఫరవాలేదు అన్నీ ఆడేస్తాయి అనే ధోరణిలో ఉంటారు సినీ పరిశ్రమ వర్గాలు. కానీ ఈ జనవరి కొంచెం ట్రేడ్‌ని నిరాశపరచిందనే చెప్పాలి. ఈ నెలలో మొత్తం 6 సినిమాలు విడుదలయ్యాయి. ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన పవన్ కల్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’, తమిళ దర్శకుడు కె.యస్.రవికమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ సినిమాలతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘రంగులరాట్నం’ కూడా పండక్కి విడుదలయ్యాయి. ఈసారి జనవరి చాలా నిరాశ కలిగింది అనుకునే లోపు నెలాఖరున వచ్చిన ఆఖరు శుక్రవారం అనుష్క నటించిన ‘భాగమతి’ విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టింది. ఈ చిత్రాన్ని ‘పిల్ల జమీందారు’ ఫేమ్ అశోక్ తెరకెక్కించారు. ఇవికాక నెల మొదటి వారంలో ‘చిలుకూరి బాలాజీ’ మూడవ వారంలో ‘త్రిముఖి’ విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. మొత్తానికి మొదటి నెల ఓ మంచి హిట్‌తో ముగిసింది. ‘తొలిప్రేమ’కు ప్రేక్షకులు ‘ఛలో’ ఈ నెలలో మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెల రెండో రోజే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించారు. రెండో చిత్రం హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి ‘ఛలో’ అన్నారు. సినిమా కొన్న బయ్యర్లు భలే అన్నారు. తర్వాత రోజే ‘హౌరా బ్రిడ్జి’ అంటూ ప్రేక్షకుల ముందు కొచ్చారు రాహుల్ రవీంద్రన్. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరుసటి వారం మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. మదన్ దర్శకత్వంలో విడుదలైన ‘గాయత్రి’ ఓ సినిమా అయితే, మరో చిత్రం వినాయక్ దర్శకత్వంలో తయారైన ‘ఇంటిలిజెంట్’. ‘గాయత్రి’ చిత్రంలో గాయత్రి పటేల్, దాసరి శివాజీ రెండు పాత్రలను మోహన్‌బాబు పోషిస్తే, ఆయన యువకునిగా (దాసరి శివాజీ) ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు పోషించారు. ‘గాయత్రి’ మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలి పోయింది. ఇక ‘ఇంటిలిజెంట్’ విషయానికొస్తే సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఆయన ఆ సినిమా చేయటం ‘ఇంటిలిజెంట్’ కాదని జనం తేల్చేశారు. ఆ మరుసటి రోజు మరో ప్రేమకథా చిత్రం ‘తొలిప్రేమ’తో హిట్ ఎంట్రీ ఇచ్చారు వరుణ్‌తేజ్. వెంకీ అట్లూరికి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటుకున్నాడు. ఫిబ్రవరి మూడో వారంలో ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. తరుణ్ చాలాకాలం తర్వాత ఓ లవ్ స్టోరీలో నటించారు. నాని మొదటిసారి ప్రొడ్యూసర్‌గా పరిచయం అయిన చిత్రం ‘అ!’. ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేశారు నాని. సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా క్రిటిక్స్ దగ్గర శభాష్ అనిపించుకుంది. ఇండస్ట్రీకి కొత్త జోనర్‌ను ‘అ!’ చిత్రం ద్వారా పరిచయం చేశారు నిర్మాత, దర్శకులు. సందీప్ కిషన్ హీరోగా నటించగా, మహేశ్ బాబు సోదరి మంజుల మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం ‘మనసుకు నచ్చింది’ ప్రేక్షకులకు నచ్చలేదు. రంగస్థలం కలెక్షన్ల ‘మార్చి’oగ్ మార్చి నెల అనగానే అందరికీ పరీక్షలు గుర్తొస్తాయి. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉంటే ప్రతి ఇల్లు బిజీగా ఉన్నట్లే. అందుకే చాలామటుకు సినిమాలను విడుదల చేయరు. అయిన అంతకుముందు రిలీజు డేట్లు దొరక్కుండా ఉన్న సినిమాలు ఈ నెలలో విడుదలకు నోచుకున్నాయి. మొత్తం 13 సినిమాలు విడుదలయ్యాయి. మార్చి 9న ‘ఏం మంత్రం వేశావే’, 16న ‘ఐతే 2.0’, దండుపాళ్యం–3తో పాటు మరో మూడు సినిమాలు వచ్చాయి. 17న మరో సినిమా విడుదలైంది. వాటి గురించి ప్రస్తావించాల్సిన పని లేదు. 23న నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘యంఎల్‌ఏ’, శ్రీవిష్ణు నటించిన ‘ నీదీ నాది ఒకే కథ’ చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు వచ్చాయి. అన్నింటిలోకి ‘నీది నాది ఒకే కథ’కు మాత్రమే ప్రేక్షకలు ఓకే అన్నారు. చివరి శుక్రవారం రిలీజైంది ‘రంగస్థలం’. రామ్ చరణ్ కెరీర్ మొత్తం ఒక ఎత్తు, ఈ సినిమాలోని రామ్‌చరణ్ నటన ఒక ఎత్తు అన్నట్టుగా ప్రేక్షకులు ఫిక్సయ్యారు. అబ్బురపరచే కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ అయిందనేంతగా కలెక్షన్లతో విరుచుకుపడింది. బాహుబలి తర్వాత టాప్ కలెక్షన్ల లిస్ట్‌లో మొదటిస్థానంలో ఈ సినిమా నిలిచింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టికి మంచి పేరు వచ్చింది. పాటలు ఇప్పటికీ టాప్ లిస్ట్‌లోనే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా డీఎస్పీ మంచి ఫోక్ సింగర్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ‘ఆ గట్టునుంటావా నాగన్నా.. ఈ గట్టుకొస్తావా..’ పాట ద్వారా శివనాగులును, ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ద్వారా రేలా కుమార్, వెంకటలక్ష్మిలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి మూడు నెలలు ముగిసే సరికి ‘రంగస్థలం’ పెద్ద హిట్‌గా మిగిలిపోయింది. ఏప్రిల్ అనే నేను... ఏప్రిల్ నెలలో సినిమా పరిశ్రమకు పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలు పరీక్షలు ముగించుకుని సినిమా థియేటర్ల వైపు చూస్తుంటారు. ఈ నెలలో మొత్తం పది సినిమాలు విడుదలయ్యాయి. మొదటివారం ఏప్రిల్ 5న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛల్ మోహన రంగ’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనా, పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత రోజు ‘సత్యాగ్యాంగ్’ రిలీజై వెళ్లిపోయింది. రెండో వారంలో రిలీజైన పెద్ద సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అప్పటి వరకు వరుస విజయాలతో జైత్రయాత్ర చేసిన హీరో నానికి చిన్న స్పీడ్ బ్రేకర్ పడిందనే చెప్పాలి. తను ఎంతో కష్టపడి ద్విపాత్రాభినయం చేశారు. పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడే పాత్ర ఒకటి, రాక్‌స్టార్ పాత్ర మరొకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది. ఏప్రిల్ మూడో వారంలో ‘భరత్ అనే నేను’ అంటూ వచ్చిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు భారీ హిట్ కొట్టారు. కొరటాల శివ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి కియరా అద్వాణీ తెలుగు తెరకు దిగుమతి అయ్యారు. ఏప్రిల్ నాలుగో వారంలో ‘ఆచారి ఆమెరికా యాత్ర’తో మంచు విష్ణు వచ్చినా, పెద్దగా సందడి చేయలేదు. మార్చిలో రామ్ చరణ్ సందడి చేస్తే ఏప్రిల్‌లో ఆ బాధ్యతను మహేశ్ కంటిన్యూ చేశారు. ‘మహానటి’ని ‘కీర్తి’ంచడ‘మే’ రామ్‌చరణ్, మహేశ్‌బాబుల తర్వాత నేను వస్తున్నానంటూ మే మొదటివారంలో వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్‌తో ప్రారంభమైనా, కలెక్షన్ల జోరును నిలుపుకోలేకపోయింది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మాటల రచయిత వక్కంతం వంశీ తన పనితనాన్ని నిరూపించుకోలేకపోయారు. ఈ ఏడాది విడుదలైన గొప్ప చిత్రాల్లో ఒకటైన ‘మహానటి’ 9న వచ్చింది. తెలుగువారి ఆరాధ్యనటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ సావిత్రే నటించిందా అన్నంత గొప్పగా నటించారు చిత్ర కథానాయిక కీర్తి సురేశ్. ఈ చిత్రం ద్వారా ఎనలేని కీర్తి సంపాదించారు నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్ అశ్విన్. ‘నా పేరు నిలబెట్టింది నా కూతురు’ అని మురిసిపోయారు వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వనీదత్. సినిమాపై ఎన్నో రకాల విమర్శలు వినిపించినా, అవేవీ ప్రేక్షకులను థియోటర్లకు రప్పించకుండా ఆపలేక పోయాయి. ఈ నెల అంతా ఆ సినిమా పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా రిలీజైన రెండు రోజులకు అంటే మే 11న దర్శక–నిర్మాత పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘మెహబూబా’ విడుదలైంది. పూరి గారబ్బాయి ఫరవాలేదనిపించినా, కథలో ఉన్న కంటెంట్‌తో జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ఎన్నో రోజులు నిలవలేక పోయింది. తర్వాత వారం ఎర్రసూర్యుడు ఆర్.నారాయణమూర్తి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు ఆవశ్యకతను తెలుపుతూ తీసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’ మే 18న విడుదలై, ఫరవాలేదనిపించుకుంది. మే చివరి వారంలో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. హీరో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, నాగశౌర్య హీరోగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’. ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. ‘సమ్మోహనం’ తొలకరింత జూన్ నెలలో మొత్తం తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. నెల మొదటిరోజు రెండు చిత్రాలు విడుదలయ్యాయి. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆఫీసర్’. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రమిది. అనుకున్నంతగా సినిమా ఆడలేదు. నాగ్ ఫ్యాన్స్ ఆర్జీవీతో చేసిన సినిమా చూడనవసరం లేదనుకున్నారు. అదేరోజు రాజ్‌తరుణ్ నటించిన ‘రాజుగాడు’ విడుదలైంది. జర్నలిస్ట్ సంజనారెడ్డి ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆశించిన ఫలితం రాలేదు. మరుసటి వారం పెద్ద సినిమా ఏదీ రాలేదు. ఈ నెల 14న కళ్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. ఆ మర్నాడే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ విడుదలైంది. సుధీర్ బాబు. అదితీరావు హైదరీ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్నన లు పొందింది. ఈ చిత్రంతో సుధీర్‌బాబు ఖాతాలో మరో హిట్ చేరింది. మే 21న కమేడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జంబలకిడి పంబ’ విడుదలైంది. ఇది పెద్దగా హడావిడి చేయలేదు. చివరి వారం మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో ట్రేడ్‌లో హల్చల్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన రెండో ప్రయత్నంగా తీసిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. మంచి సినిమాగా క్రిటిక్స్ మార్కులు వేసినా, యావరేజ్ అనిపించుకుంది. మాన్సూన్ ప్రిస్క్రిప్షన్ ఆర్ఎక్స్–100 జూలై నెలలో మొత్తం పదకొండు చిత్రాలు రిలీజయ్యాయి. గోపీచంద్ హీరోగా నటించిన ‘పంతం’ 5న విడుదలైంది. ఆ మర్నాడే మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్యూ’. కరుణాకరన్ దర్శకత్వంలో కె.యస్ రామారావు నిర్మించారు. ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరుసటి వారం 12న విడుదలైన చిత్రాలు ‘ఆర్ఎక్స్–100’, ‘విజేత’. వీటి ద్వారా ఇద్దరు కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఓ హీరో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి వచ్చారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. కంటెంట్ పరంగా బావున్నా ఇంకా ఏదో కావాలనిపించింది ప్రేక్షకులకి. మరో సినిమా ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా నటుడు కార్తికేయ పరిచయమయ్యాడు. యదార్థ సంఘటన ఆధారంగా లె రకెక్కిన ఈ చిత్రాన్ని పేక్షకులు ఆదరించారు. ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతికి చక్కటి అవకాశాలు వస్తున్నాయి. మూడో వారంలో విడుదలైన సినిమాలు ‘ఆట గదరా శివ’, ‘లవర్’, ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రాలు వచ్చాయి. ‘ఆ న లుగురు’ చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్థ చాలా కాలం తర్వాత ‘ఆట గదరా శివ’ చిత్రంతో బరిలోకి దిగాడు. ‘లవర్’ చిత్రం ద్వారా రాజ్‌తరుణ్ విజయం కోసం మరో ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం రాలేదు. మంచు లక్ష్మి నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ఫరవాలేదనిపించింది. జూలై చివరి వారంలో ‘సాక్ష్యం’ చిత్రంతో పలకరించాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ప్రకృతి తలచుకుంటే ఎంతటి వినాశమైనా జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో పంచభూతాల సాక్షిగా శత్రు సంహారమే లక్ష్యంగా యాక్షన్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. ‘రా’సిపెట్టిన ‘గీత’ ఆగస్టు 3న ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రెండు చిత్రాల గురించి చెప్పుకోవాలి. అందులో ఓ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరు ‘చి.ల.సౌ’. సుశాంత్ హీరోగా నటించారు. చాలా కాలం తర్వాత హీరో సుశాంత్ మంచి కథను ఎన్నుకున్నాడనే చెప్పాలి. 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలతో అల్లుకున్న చిత్రం ‘చి.ల.సౌ’. ఈ చిత్ర దర్శకునిగా మంచి మార్కులు కొట్టేసిన రాహుల్ రవీంద్రకు లడ్డూ లాంటి ఆఫర్ వచ్చింది. ఈ చిత్ర విజయంతో హీరో నాగార్జున తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్‌కు అవకాశం ఇచ్చారు. అదేరోజు విడుదలైన మరో చిత్రం ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా నటిస్తూ తను సొంతంగా రాసుకున్న కథతో ఈ సినిమా చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడమే కాకుండా, క్రిటిక్స్ దగ్గర మంచి పేరు సంపాదించింది. ‘గూఢచారి’ చిత్రంతో అడివి శేషు ‘రా’ ఏజంట్‌గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున మేనకోడలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్ సుప్రియ 22 సంవత్సరాల తర్వాత ‘గూఢచారి’లో నటించటం విశేషం. ఈ చిత్రం ద్వారా శోభిత దూళిపాళ్ల హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ నెల రెండో వారం 9న విడుదలైన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకుడు. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ దర్శక, నిర్మాతల కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తమ కాంబినేషన్లో మరోసారి ఈ ఫీట్‌ను రిపీట్ చేద్దామనుకున్నా, అది సాధ్యం కాలేదనే చెప్పాలి. మంచి నిర్మాణాత్మక విలువలతో రిలీజైన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తర్వాత వారం ఆగస్టు 15న రిలీజైంది విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’. ఏ అంచనాలు లేకుండా విడుదలైనా ట్రేడ్‌లో సంచలనంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురాం (బుజ్జి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ పాట శ్రోతలను ఉర్రూతలూగించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్‌కు మరచిపోలేని విజయాన్ని మిగిల్చింది ‘గీత గోవిందం’. ఈ చిత్రం ద్వారా ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. మరుసటి వారం 24న మరో మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం ‘నీవెవరో’. తాప్సీ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు. కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. సినిమా మంచి ప్రయత్నంగా మిగిలింది. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి: ‘సూపర్ స్కెచ్, ఃనర్తనశాల, పేపర్ బాయ్, సమీరం’ చిత్రాలు. వీటిలో నాగశౌర్య నటించిన ‘ఃనర్తనశాల’ మంచి హోప్‌తో విడుదలైనా, అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘పేపర్ బాయ్’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణ బాధ్యతలు చేయటంతో ఆ చిత్రం మీద కొంత పాజిటివ్‌గానే ఓపెనింగ్స్ సాధించినా, యావరేజ్‌గా నిలిచింది. సక్సెస్ కేరాఫ్ రానా సెప్టెంబర్ మొదటివారం 7న ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘కేరాఫ్ కంచెరపాలెం’తో పాటు ‘అల్లరి’ నరేశ్, సునీల్ నటించిన ‘సిల్లీ ఫెలోస్’ మంచి పబ్లిసిటీతో విడుదలయ్యాయి. మిగతా సినిమాల గురించి పెద్దగా చర్చ అక్కరలేదు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమా విషయానికొస్తే ఒక మనిషి జీవితంలోని నాలుగు దశలను ఎంతో అద్భుతంగా దర్శకుడు వెంకటేశ్ మహా ఆవిష్కరించారని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన హీరో రానా గొప్పగా అనిపించడంతో ఈ సినిమాను తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఆ చిత్రంలో నటించిన ఒక్క నటుడూ ప్రపంచానికి తెలియకపోయినా ఆ సినిమాకి అంత గొప్ప మైలేజీ వచ్చిందంటే దానికి కారణం రానానే. మిగతా చిత్రాలు పెద్దగా ఆడలేదు. తరువాత శుక్రవారం మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో భార్య భర్తలు నాగచైతన్య, సమంతలు వారిద్దరి పెళ్లయ్యాక మొదటిసారి పోటీ పడ్డారు. ఈ ఇద్దరూ విడివిడిగా నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలై పోటీ పడ్డాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్గా విడుదలయ్యింది. సమంత నటించిన కన్నడ రీమేక్ మూవీ ‘యూటర్న్’ థ్రిల్లర్‌గా విడుదలై మంచి పేరు సంపాదించింది. కానీ రెండో వారంలో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. నాగచైతన్య సినిమా కమర్షియల్‌గా ఫరవాలేదనిపించినా, కంటెంట్ పరంగా మంచి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మూడో వారంలో మరో మూడు సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఓ చిత్రం ఎన్నో చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించిన విజయ్ మాస్టర్ తన కొడుకు రాహుల్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ ప్రేక్షకులను మాయ చేయలేకపోయింది. సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ మంచి ఎంటర్టైనర్ అనిపించుకున్నా, బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. ఈ నెల చివరి వారంలో నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ 27న విడుదలైంది. విడుదలైన అన్నిచోట్ల మంచి రిపోర్ట్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన మూడవ ప్రయత్నంగా తీసిన చిత్రంతో ఫుల్ హ్యాపీ. ఈ సినిమాలో నాని సరసన నటించిన ‘రష్మికా మండన్నా’ ‘దేవదాస్’ చిత్ర విజయం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ‘విజయ’దశమి సమేత.. అక్టోబర్‌లో పది సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల మొదటివారంలో మూడు చిత్రాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ నటించిన మొదటి ద్విభాషా చిత్రం ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. రెండు చోట్ల వ్యాపరపరంగా మంచి బిజినెస్ చేసిన ఈ చిత్రం నిరాశపరచింది. ఈ చిత్రం ద్వారా నిర్మాతలు బాగానే లాభాలు సంపాదించారు. కానీ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోయారు. పబ్లిసిటీ పరంగా ఈ చిత్రం మార్మోగిపోయింది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులకు దసరా సందర్భంగా విడుదలైంది ‘అరవింద సమేత వీర రాఘవ’. యన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే మొదటివారం బెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. యుద్ధం వల్ల వచ్చే నష్టాలను, యుద్ధం జరిగిన తరవాత పరిస్థితులను, యుద్ధంతో ఆరంభించి తన స్టైల్ ఆఫ్ విజన్‌ను కొత్తగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యన్టీఆర్ నటన పరిణతి చెందినట్లు కనపడింది. ఈ సినిమాలోని సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని, తన అనుభవాన్నంతా జోడించి, టాలెంట్‌తో ఒడిసిపట్టి ప్రేక్షకులకు వీనుల విందైన సంగీతాన్ని అందించారు తమన్. నెల మూడో వారంలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ అంటూ వచ్చారు హీరో రామ్. క్యూట్ లవ్ స్టోరీస్‌ను చక్కగా తెరకెక్కించే ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా, నానీతో ‘నేను లోకల్’ తీసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ఫలితాన్నే సాధించింది. రామ్, ప్రకాశ్‌రాజ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత సుభాష్ నటనను అందరూ ప్రశంసించారు. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలైనా, అవేవీ ఏమాత్రం రాణించలేదు. చక్రం తిప్పిన ట్యాక్సీవాలా నవంబర్ 2న మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీమూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా తమిళ హీరో మాధవన్‌ను విలన్‌గా పరిచయం చేశారు. ఒక మనిషి రెండు చేతుల్లో రెండు రకాలైన స్పందనలు ఉంటే ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో, తన రెండు చేతుల్లో రెండు రకాలైన మనుషులు, రెండు చేతులకు రెండు రకాలైన ఆలోచనలు ఉండే మనిషి ఏ విధంగా ఉంటాడో నాగచైతన్య క్యారెక్టర్ ద్వారా చెప్పటానికి ప్రయత్నించారు దర్శకుడు చందూ. అయితే, ఈ సినిమా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. మంచి హిట్ మూవీస్‌తో ముందుకెళ్తున్న మైత్రీమూవీస్ సంస్థకు ఈ చిత్రంతో తన మొదటి ఫ్లాప్‌ను మూటకట్టుకుంది. ఈ నెల 7న నటుడు, దర్శకుడు రవిబాబు పందిపిల్లతో చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీ ‘అదుగో’ విడుదలైందని జనాలకు తెలిసే లోపే వెళ్లిపోయింది. 8న ‘కర్త కర్మ క్రియ’ అనే చిన్న సినిమాను కోటి రూపాయల ఖర్చుతో తీసుకొచ్చారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రిటిక్స్ మంచి ప్రయత్నం అన్నారు గానీ ప్రేక్షకులు ఆదరించలేదు. తర్వాత వారం రవితేజ, ఇలియానా జంటగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాణంలో విడుదలైన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత రోజు విడుదలైంది ‘టాక్సీవాలా’. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ నటించిన ఈ చిత్రానికి జీఏ2, యూవీ పిక్చర్స్ పతాకంపై ఎస్కెఎన్ నిర్మించారు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హవాతో మొదటిరోజు వచ్చిన కలెక్షన్‌తో సినిమాకి పెట్టిన ఖర్చంతా వచ్చేసిందని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాతో 2018లో విజయ్ దేవరకొండవి ముచ్చటగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నెల 22న ‘శరభ’ చిత్రం విడుదలయ్యింది. కత్తి కథ నాదంటూ తమిళ నిర్మాతలపై కేసు వేసి గెలిచిన నరసింహారావు ఈ చిత్రంతో మొదటిసారి దర్శకునిగా పరిచయమయ్యారు. ప్రముఖ నటి జయప్రద ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా రాణించలేదు. నవంబర్ 23న ఐదు చిత్రాలు వచ్చాయి. వాటిలో హెబ్బా పటేల్, అదిత్ జంటగా నటించిన బోల్డ్ సినిమా ‘24 కిస్సెస్’ ఒకటి. సినిమా బోల్డ్‌గా ఉన్నా ప్రేక్షకులు అంత బోల్డ్‌నెస్‌ని ఒప్పుకోలేదు. కొత్త దర్శకుల హవా ఈ ఇయర్ కొత్త దర్శకులు టాలీవుడ్లో మోత మోగించారు. ‘ఛలో’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఆ చిత్రవిజయంతో ఇమ్మిడియేట్‌గా హీరో నితిన్ సినిమాను పట్టాలెక్కించారు. ‘తొలిప్రేమ’ ఇచ్చిన కిక్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి రెండో ప్రయత్నంగా ‘మిస్టర్ మజ్ను’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ‘అ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మొదటి ప్రయత్నంతోనే శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు హీరో రాజశేఖర్‌తో సినిమా రూపొందిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ కిక్ తో మంచి హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ ఇచ్చిన హిట్‌తో వెంకటేశ్ మహా మరో సినిమా బిజీలో ఉన్నారు. ‘టాక్సీవాలా’తో హిట్ కొట్టిన మరో దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 2018లో సీనియర్ దర్శకులు గడ్డుకాలాన్నే ఎదుర్కొన్నారు. సీనియర్ దర్శకుల్లో వీవీ వినాయక్ ‘ఇంటిలిజెంట్’, పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’లతో పాటు శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ అంటోని’తో నిరాశపరచారు. ‘రంగస్థలంతో’ ఫెయిర్ íß ట్ను అందుకున్నారు సుకుమార్. త్రివిక్రమ్ 50–50 మార్కులతో ఓ పెద్ద ఫ్లాప్ ‘అజ్ఞాతవాసి’కి, ‘అరవింద సమేత’ లాంటి మంచి హిట్‌తో లెక్క సరిచేశారు. 2019ని హ్యాపీగా ప్రారంభించటానికి రెడీ అయ్యారు. కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తన రెండవ సినిమా ‘మహానటి’తో సంచలనం సృష్టించారు దర్శకుడు నాగ్ అశ్విన్. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సినిమా ఇండస్ట్రీలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండకు కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వడం ద్వారా దర్శకుడు పరశురాం (బుజ్జి) తన సత్తా నిరూపించుకున్నారు. ‘గీత’ తారుమారు అనూ ఇమ్మన్యుయేల్ ఈ సంవత్సరం అన్నీ టాప్ హీరోల సినిమాల్లోనే నటించింది. పవన్‌కళ్యాణ్ సరసన జనవరిలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’, మేలో విడుదలైన అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’చిత్రంలోను, ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాగచైతన్య సరసన నటించారామె. మామూలుగా అయితే ఈ ఇయర్ టాప్ హీరోయిన్ ఆమె అనుకోవాలి. కానీ ఫలితాలు తారుమారవడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయనే అనుకోవాలి. కంటితుడుపు ఏంటంటే 2018 బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారామె. ‘ట్వంటీ ప్లస్’ డిసెంబర్ ఏడాది చివరి నెల అయిన ఈ డిసెంబర్లో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన ‘కవచం’ ఒకటి. ఇదివరకటి సినిమాల కంటే ఈ చిత్రంలో హీరో శ్రీనివాస్ నటనలో పరిణతి కనిపించింది. కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. నూతన దర్శకుడు మామిళ్ల శ్రీనివాస్ ఈ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో సుమంత్ ప్రధాన పాత్రలో విడుదలైన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. నూతన దర్శకుడు సంతోశ్ జాగర్లమూడి దర్శకత్వంలో, నూతన నిర్మాత బీరం సుధాకర రెడ్డి నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో సందీప్ కిషన్, నవదీప్ , శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 7న విడుదలైన మరో చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రాన్ని నూతన నటీనటులు, నూతన దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఇవికాకుండా ఈ నెలలో రెండో శుక్రవారం రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ‘భైరవగీత’ విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేరోజు ‘హుషారు’, ‘అనగనగా ఓ ప్రేమకథ’, మరుసటి వారం వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘అంతరిక్షం’, శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడిపడిలేచె మనసు’లు విడుదలవుతున్నాయి. ఇవికాక చివరి వారంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లఫ్‌మాస్టర్’, నిఖిల్ నటించిన ‘ముద్ర’తో పాటు ఈ నెలలో డబ్బింగ్ వాటితో కలుపుకొని మరో పది చిత్రాల దాకా విడుదల కానున్నట్లు సమాచారం. డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ అంతంతే! 2018లో మొత్తం 34 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 26 తమిళ చిత్రాలు, 4 మలయాళ చిత్రాలు, 2 కన్నడ, 2 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. పేరుకి డబ్బింగ్ చిత్రాలే కానీ, సినిమా బాగుంటే తెలుగు వారికి భాషాబేధం ఉండదు అనే విషయం చాలాసార్లు రుజువయ్యింది. గత ఏడాది రిలీజైన ‘బిచ్చగాడు’ చిత్రమే ఉదాహరణ. గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గినట్లే. క్వాలిటీ చిత్రాలు ఏ భాషలో అయినా 15 నుంచి 20 శాతం మాత్రమే. ఈ సంవత్సరం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ అంటూ జూన్ 7న, ‘2.ఓ’తో నవంబర్ 29న రెండుసార్లు దర్శనమిచ్చారు. ‘కాలా’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయకపోయినా, ‘2.ఓ’ భారీ బిజినెస్ చేసింది. ఒక ఫ్లాప్, ఒక హిట్‌తో లెక్క సరిచేశారు రజనీకాంత్. ఆయన దారిలోనే హీరో విక్రమ్ నటించిన ‘స్కెచ్’ ఫిబ్రవరి 23న, ‘సామి’ సెప్టెంబర్ 21న విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచాయి. తమిళ మాస్ హీరో విశాల్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేశారు. జూన్ 1న వచ్చిన ‘అభిమన్యుడు’ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. అలాగే తనని మాస్ హీరోగా తెలుగు తెరపై సెటిల్ చేసిన చిత్రం ‘పందెంకోడి’. 2005లో వచ్చిన ఈ చిత్ర సీక్వెల్ పదమూడేళ్ల తర్వాత ఈ ఏడాది ‘పందెంకోడి–2’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కూడా 2018లో రెండుసార్లు తెలుగు తెరపై సందడి చేశారు. ఈసారి ఆయన చిత్రాల్లో ఒకటి ‘కాశి’, మరోటి ‘రోషగాడు’. రెండు చిత్రాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ హీరోలే కాకుండా కమల్ హాసన్, సూర్య, కార్తీ, ప్రభుదేవా చిత్రాలు కూడా విడుదలైనా, అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘జయం’రవి నటించిన ‘టిక్ టిక్ టిక్’ చిత్రం మంచి ప్రయత్నం అన్నారు ప్రేక్షకులు. విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం ట్రేడ్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మలయాళం నుండి 4 చిత్రాలు విడుదలైతే అందులో మమ్ముట్టి ఓ చిత్రం (ది ట్రైన్), ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్వి రెండు చిత్రాలు ‘అతడే’, ‘జనతా హోటల్’ విడుదలయ్యాయి. వీటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. హిందీ చిత్ర సీమ నుంచి రెండు చిత్రాలు ‘పద్మావత్’, ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ వచ్చాయి. దీపికా పదుకొనే పద్మావతిగా మురిపిస్తే, ఆమిర్ ఖాన్ తన హిట్ ఫార్ములా చార్మ్‌ను నిలుపుకోలేకపోయాడు. లక్కీ రష్మికా ఫిబ్రవరిలో విడుదలైన ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. ఆ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె తన తదుపరి చిత్రం ‘గీత గోవిందం’ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘దేవదాస్’ చిత్రంలో నాని సరసన నటించిన ఆమె ముచ్చటగా మూడు విజయాలను సొంతం చేసుకున్నారామె. – శివ మల్లాల