కీడు గుడిసె.. మనసును కదిలించే కథ | Funday Special Story On Tribals Rituals | Sakshi
Sakshi News home page

కీడు గుడిసె.. మనసును కదిలించే కథ 

Published Sun, Jun 19 2022 9:20 PM | Last Updated on Sun, Jun 19 2022 9:20 PM

Funday Special Story On Tribals Rituals - Sakshi

తూర్పు కనుమలు ఆ చలికాలపు ఉదయాన మంచుముసుగు కప్పుకున్నాయి. చెట్టూపుట్టలూ, పశుపక్ష్యాదులూ మంచులో తడిసిముద్దయి చలికి వణుకుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో, దట్టమైన కీకారణ్యంలో ఎతై ్తన కొండలమీదుంది ఆ గూడెం.  నాగరికతకు చాలా దూరంగా వున్న ఆ గూడెంలో ఒక గిరిజన తెగకు చెందిన ఇరవైమూడు కుటుంబాలు.. అనాదిగా వస్తున్న ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూ జీవనం సాగిస్తున్నాయి. గూడేనికి కాస్త ఎడంగా,  చుట్టూ రక్షణగోడలా వున్న వెదురుతడికల మధ్య వుంది ఆ గుడిసె. అందులో వెదురుబొంగులతో కట్టిన అటకమీద ముడుచుకుని పడుకున్న సోము చలికి గజగజా వణికిపోతున్నాడు.

చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే... భార్య  సిసిరి గురించిన ఆలోచనలు అతని మనసును ముసురుతుంటే... నిద్రెలా పడుతుంది? హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిగ్గున లేచి, అటక దిగాడు సోము. బయట మంచు తప్ప ఏం కనిపించ లేదు, వినిపించ లేదు. ‘అంత నా బెమ’ అనుకున్నాడు. గుడెసెలో ఓ మూలనున్న పొయ్యి దగ్గరికెళ్లి ముట్టించాడు. చిన్న మంట వెచ్చగా తగిలి ప్రాణం లేచొచ్చింది.  చలి కాగుతుంటే అతడికి సిసిరి గుర్తుకొచ్చింది మళ్లీ.  ‘యీ సలిలో అదెట్టావుందో ఏటో?’ అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు.

‘ఆలుమగలను ఇడదీసే యీ ఆసారమేటి?  దాన్నట్టుకుని గూడెం పెద్ద యాలాడ్డమేటి?’ అనుకుంటూ మొహం చిరాగ్గాపెట్టాడు. పక్క పక్క గూడేలకు చెందిన సోము, సిసిరి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇరు గూడేల పెద్దలను తమ మనువుకు ఒప్పించారు. ఆచారం ప్రకారం మనువుకు ముందు గుడిసెకట్టి ఆనక మనువాడారు. ఆ కొత్తగుడిసెలో కాపురం పెట్టి యేడాదిన్నరయింది. నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరినీ, సిసిరి నెలసరి సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది. దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపమూ వచ్చేది. సిసిరిని ఆచారం తప్పమనేవాడు.

‘గూడెం కట్టుబాటు దప్పితే తొప్పు గట్టాలి గదా మావ’ అని నచ్చచెప్పేది సిసిరి. కీడు గుడిసెకు వెళ్ళి, అక్కడ మూడ్రోజులుండి వచ్చేది. ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు! దాంతో ఆమె మకాం కొద్దిరోజులక్రితం కీడు గుడిసెకు మారింది మళ్లీ.  రెండునెలలు అక్కడే వుంటుంది.  కొన్ని గిరిజన తెగల్లో వుండే ఆ ఆచారం.. సోము వాళ్ల  తెగలోనూ వుంది.  స్త్రీలు నెలసరి అయితే మూడ్రోజులు, గర్భిణీలు, రజస్వలైనవాళ్లు రెండునెలలు గూడేనికి కాస్త దూరంలో వుండే కీడు గుడిసెలో వుండాలి.  వారు గూడెంలో వుంటే వారి కీడు (మైల) గూడేనికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు. వారు ఆ కీడు గుడిసెలోనే వుంటూ, వారికి కేటాయించిన దారుల్లోనే బయటకెళ్లి రావాలి.

వారికి వారి బంధువులైన స్త్రీలు తింటానికి పట్టుకెళ్లిస్తారు. ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా వుంటాయి. గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా  వెలివేస్తారు. పురుడుకోసం కీడు గుడిసెలోకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా గూడేనికి తిరిగొస్తారన్నది సందేహమే! కీడు గుడిసెలో మంత్రసాని పురుళ్లు పోస్తుంది. ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాలమీదకు వచ్చినా సరే ఆసుపత్రికి తీసుకెళ్లరు. బలవంతంగా మోటుపద్ధతుల్లో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కీడు గుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో? సోము అలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు. మరెన్నో విన్నాడు.

అందుకే అతడు భయపడుతున్నాడు. చలి కాగుతూ సిసిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు. తమ ఆచారాల్లో కొన్నింటిని మూఢాచారాలుగా భావిస్తాడు సోము. అడవిలో తాము సేకరించినవి అమ్మి కావలసిన సరుకులు తెచ్చుకోవడంకోసం..  అప్పుడప్పుడు అతడు  సమీప పట్టణంలోకి వెళ్ళేవాడు.  వెళ్ళినప్పుడల్లా పట్టణ ప్రజల జీవనవిధానాన్ని పరిశీలించేవాడు. అక్కడ కీడు గుడిసె ఆచారంతోపాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలూ లేవని గ్రహించేవాడు. ఆ విషయాలను  తన నేస్తాలతో చెప్పి బాధపడేవాడు.

ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప, కీడు గుడిసెకు మరమ్మత్తులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యంచేసి, ‘పట్నంల యాడ ఇట్టాంటి కీడు ఆసారం నేదు. మనంగూడ మానుకుందాం’ అన్నాడు. గుర్రప్ప గుర్రుగా చూసి ‘నక్కబుట్టి నాలుగువోరాలు గానేదు, యీ గాలీవోన యెన్నడు సూడనేదన్నదంట. అట్టాగుంది నీ యెవ్వారం.  మూతిమీద మీసమే సరిగ్గ రానేదు పెద్దకొబుర్లు ఆడేతున్నవు’ వెటకారంగా అన్నాడు.‘ఆడోల్ని ఇబ్బందెట్టే, ఆల్ల పేనంమ్మీదకు దెచ్చే ఆసారం యెంతసెడ్డదో తెల్డానికి మీసమే రానొవసరం నేదు’ అన్నాడు సోము ఆవేశంగా.

గుర్రప్ప అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘ఏట్రా... ఇప్పసారా తల కెక్కేసినదేటి? ఏటేటో వోగుతున్నవు. గూడెం బాగు కోసరం మన పెద్దోల్లెట్టిన ఆసారం మనం పాటించల. మానుకుంతే కొండదేవతకు కోపమొస్తది. ఆసారం దప్పినప్పుడల్ల గూడెంల పీనుగులెగుతున్న ఇసయం నీకుతెల్ద? మల్ల ఇట్టాగ ఆసారాన్ని ఎటకారంసేత్తే గూడెం పెద్దగ  ఏటిసేయాల్నో అదే సేస్తను’ అంటూ హెచ్చరించాడు. అందుకే సోము మళ్లా ఆ మాట  ఎత్తలేదు.
‘ఒరే సోముగే... లెగిసినవ... గుర్రెట్టుకొని నిద్రోతున్నవ?’ అంటూ గుడిసెలోకి దూరాడు సోము అయ్య కన్నప్ప.
చలి కాగుతున్న సోము ‘నిద్రడితేనే కదర నిద్రోడనికి... సిసిరికి ఎట్టుందో తెలిసినదేటి?’ ఆత్రుతగా అడిగాడు.

‘అది సెప్పడనికే వొచ్చినను. సిసిరి పెరిస్తితి ఏం బాగోనేదంట. కాన్పుసేయడం కట్టమని మంత్రసాని అందంట. కోడలికేటవుతాదోనని మీయమ్మ రాగాలుదీత్తు నెత్తిబాదుకుంతున్నది’ చెప్పాడు కన్నప్ప. అది విని సోము భయంతో వణికిపోయాడు. సిసిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని ‘ఒరే అయ్య...  మరిప్పుడేటి సేయడం?’ అన్నాడు బేలగా. ‘సేసేదేటుందిర. సిసిరికి ఏటిగాకుండ కాన్పయితే కొండదేవతకు అడవిపందిని బలిత్తమని మొక్కీసుకోడమే! అంతకుమించి మనం సేసేది ఏటినేదు’ అన్నాడు కన్నప్ప విచారంగా.

‘ఒరే అయ్య... అలాగనకుర. సిసిరి నా పేనం! అది సావగూడదు. ఆలిస్యెం సెయ్యకుండ ఆసుపెత్రికి దీస్కుపోదం. దాన్ని బతికించుకుందం’ అన్నాడు సోము ఏడుస్తూ.
‘నీకేటి మతిపోనదేటిర... గూడెం ఆసారం నీకు తెల్దేటి? కిందటేడు కాసమ్మ కాన్పు జెరక్క గిలగిల కొట్టుకుంతుంటే, దాని పెనిమిటి కొండప్ప ఆసుపెత్రికి దీస్కుపోతన్నడు. గుర్రప్ప  ఒప్పుకున్నడేటి? ఆసారం దప్పుతావేట్ర ఎదవనాయాలంటు గయ్యిన లేసినడు గద...’
‘పేనం కంటే ఆసారం గొప్పదేటి? నాకు సిసిరికంటే మరేటి గొప్పది గాదు. దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం దప్పుతను. గుర్రప్ప ఏటిసేస్తడో సేసుకోమను’ తెగింపుగా అన్నాడు సోము.
‘గుర్రప్ప దయదాచ్చన్యంనేనోడు. గూడెం కట్టుబాటు దప్పితే సిచ్చేసి, ఎలేస్తడు. గూడెం ఇడిసి మనం బతకలేం. దేవతమీద బారమేసి వొల్లకుండడమే’ నచ్చజెప్తూ అన్నాడు కన్నప్ప.
‘ఎలేస్తడని బయిపడితే సిసిరి సస్తది. సిసిరికి ఉసురుంతే ఈడగాకబోతే ఏడన్న బతుకుతం. ఒరే అయ్య... నా మాటిని సాయం సెయ్య. సిసిరిని డోలీగట్టుకుని ఆసుపెత్రికి దీస్కుపోదం’ దీనంగా బతిమాలాడు సోము. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్ప ఆగ్రహానికి గురికావడమే! అయితే కొడుకు బాధను చూడలేకపోయాడు కన్నప్ప. ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. ‘సరే బయిలెల్లయితే’ అంటూ డోలీ కట్టడానికి దుప్పట్లు, పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు. సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు.                                                          

డోలీ ముందు కొమ్ము కన్నప్ప, వెనుక కొమ్ము సోము భుజాలమీద వుంచుకుని మోసుకుపోతున్నారు. మంచును చీల్చుకుంటూ, రాయీరప్పను దాటుకుంటూ, తుప్పలు డొంకలను తప్పించుకుంటూ దూసుకుపోతున్నారు. డోలీకి పక్కగా సోము అమ్మ నారమ్మ కంగారుగా నడుస్తోంది. ఏ క్షణంలో గుర్రప్పొచ్చి తమను అడ్డుకుంటాడోనని ఆమె భయపడుతోంది. మరోపక్క సిసిరిని ఆపదనుంచి గట్టెక్కించమని కొండదేవతకు పదేపదే మొరపెట్టుకుంటోంది. సిసిరి మూలుగు తప్ప మరే శబ్దమూలేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప, సోము హఠాత్తుగా ఆగిపోయారు.

ఓ అమ్ము వారిపక్క నుంచి రివ్వున దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్విచెట్టుకు గుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూసి హడలిపోయారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది. అల్లంత దూరంలో గుర్రప్ప, విల్లంబులు పట్టుకుని, గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నప్ప, సోము జడుసుకుని డోలీని కిందకు దించారు. గుర్రప్ప వస్తూనే కన్నప్పను మెడపట్టుకొని పక్కనున్న డొంకలోకి తోసేశాడు. నారమ్మ వైపు కొరకొర చూసి బండబూతులు తిట్టాడు. సోమును పట్టుకొని చెంపలు వాయించేశాడు.  ‘ఏరా గుంటనాయాల... గూడెం కట్టుబాటును దప్పే దయిర్యం వొచ్చేసిందన్న మాట నీకు’ అంటూ నిప్పులు కక్కాడు.

సోము గుర్రప్ప కాళ్ళమీద పడిపోయాడు ‘నీకు దన్నం పెడత గుర్రప్ప.  సిసిరికి వయిద్యమందకబోతే సచ్చిపోద్ది.  ఈ పాలికి మా తొప్పుకాసి ఒగ్గియ్యి’ అంటూ. ‘ఒగ్గియ్యిడానికేట్ర... మామంత పరుగు పరుగునొచ్చింది? ఆసారం కాపాడుకోటానికి’ గుర్రప్ప కోపంగా అన్నాడు. సోము ధైర్యం కూడగట్టుకొని ‘ మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు. కాలం మారినది గుర్రప్ప. దిగువున సాన గూడేలు మార్నయి. మనము మారదం’ అన్నాడు. ‘గుంటడు సెప్పే కొబుర్లు ఇనీడానికి నానేమి ఎర్రి మేకనుగాదు, మేకల్ని నమిలేసే పెద్దపులిని! గూడెం పెద్దగ ఆసారాన్ని రచ్చించడం కోసరం ఎంతకైన తెగిత్తను.’

డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి.. ‘గుర్రప్ప... కోపమిడిసి సాంతంగ ఆలోసించు. ఇంతవొరకు ఆసారం కోసరం ఎందరో ఆడకూతుర్ల ఉసురోసుకున్నం. పురుడు రాక గిలగిలకొట్టుకుంతున్న సిసిరిని బతికించుకుందం. కూస్త పెద్దమనుసు సేసుకుని మమ్ము ఆసుపెత్రికి అంపు’ బతిమాలుతూ అన్నాడు. ‘అరే కన్నప్ప... ఉప్పుడువొరకు కట్టుబాట్లకు అడ్డుసెప్పని నువ్వు, నీవొరకు వొచ్చేసరికి ఆటిని దప్పమంతన్నవు. నీకో నాయం, మరోల్లకింకో నాయం సేయమంతున్నవు? ఇలగయితే రేపు మరోడు మరో ఆసారం దప్పుతడు. అప్పుడు గూడ నాను సూస్తు కూకోవల? గూడెం ఆసారాలు, కట్టుబాట్లు అందరు ఆచెరించాల్సిందే!’ అన్నాడు గుర్రప్ప కళ్ళెర్రజేసి. 

మంచు క్రమంగా తొలగిపోతోంది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి విచ్చుకుంటున్నాయి. ప్రసవ వేదనతో సిసిరి గింజుకుంటోంది. గుర్రప్ప సిసిరిని సమీపించి ‘నొప్పులోర్సుకుని కులదేవతకు మొక్కుకోయే. నీకేటిగాదు’ అంటూ ధైర్యం చెప్పి, డోలీని కీడు గుడిసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు. వారు డోలీని భుజాలకెత్తుకుంటుంటే సోము, కన్నప్ప ఏడుస్తూ అడ్డుపడ్డారు. వారిని అక్కడున్న మగోళ్ళు తలోమాటతో దూషిస్తూ పక్కకు లాగారు. ఆడోళ్ళు చోద్యం చూస్తూ నిల్చున్నారు. అంతలో ఆ ఆడోళ్ళ మధ్యనున్న గుర్రప్ప పెళ్ళాం చుక్కమ్మ, జుట్టు విరబోసుకుని గట్టిగా అరుస్తూ పూనకంతో ఊగిపోతుంది.

ఆమెకు తమ కులదేవత పూనిందని, ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు. ఆమె తల గుండ్రంగా ఊపుతూ, రాగాలు తీస్తూ ‘నాను కొండదేవతన్రో గుర్రప్ప... నువ్వు తొప్పు సేత్తున్నవ్రో... తొప్పు సేత్తున్నవు’ అంటూ గుర్రప్పను వేపకొమ్మలతో కొడుతోంది. ఆడోళ్ళు చుక్కమ్మను గట్టిగా పట్టుకుని ‘తల్లీ... అమ్మా... తొప్పేటో సెప్పు తల్లీ. సెప్పు...’ అని అడుగుతున్నారు. చుక్కమ్మ రౌద్రంగా మొహంపెట్టి ‘సిసిరి నా బిడ్డరో బిడ్డ. అది పాపం పున్నెం దెలీని పిల్లరో... అది గూడేనికి ఎలుగురో... దాని కడుపులో బిడ్డ అడ్డం దిరిగినదిరో... దాన్ని ఆసుపెత్రికి దీసుకుబోనివ్వడ్రో... అది సస్తే గూడేనికి సేటుకాలమొస్తదిరో... గూడెం వొల్లకాడవుద్దిరో... నా మాటినికొండ్రో...’ అంటూ రాగాలు తీసి చెప్తూ, హఠాత్తుగా సొమ్మసిల్లి కింద  పడిపోయింది.

అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు. ఏనాడూ చుక్కమ్మ మీదకు రాని కులదేవత, ఇప్పుడిలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిసిరి చచ్చిపోతే గూడేనికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు. గుర్రప్ప తెగ భయపడిపోయాడు. ఆకాశంలోకి చూసి దండం పెడుతూ ‘తప్పైపోనది, సెమించు తల్లీ... గూడెమ్మీద గుర్రెట్టుకోకు. దయిసూపు తల్లీ... నువ్వు సెప్పినట్టే సిసిరిని ఆసుపెత్రికి దీస్కుబోతం’ అని లెంపలేసుకున్నాడు. సిసిరిని ఆసుపత్రికి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.  అంతే.. సోము, కన్నప్ప వేగంగా కదిలి డోలీని భుజాలకెత్తుకొని పరుగందుకున్నారు. నారమ్మతోపాటు గూడెంలోని కొందరు .. సాయంగా డోలీవెంట నడిచారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సిసిరిని చేర్చారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించారు. ఆపరేషన్‌ చేసి, తల్లీబిడ్డను కాపాడారు.

చలికాలం గడిచి, ఎండాకాలం  ఆఖరుకొచ్చింది.. ఓ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చుని, మూడ్రోజుల కిందట కీడు గుడిసెకెళ్లిన సిసిరికోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి  తలారా స్నానంచేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది సిసిరి.  సోము పక్కన కూర్చుని ‘ఎవురుతోటి సెప్పనంటే నీకో రహస్యెం సెప్పుతను!’ అంది నెమ్మదిగా. ‘సెప్పనుగనీ ఏటా రహస్యెం?’ అడిగాడు ఆత్రుతగా సోము.

‘సుక్కమ్మ నిన్న కీడు గుడిసెకొచ్చినది.  ఎవురుతోటి సెప్పొద్దని రేత్రి ఓ రహస్యెం సెవినేసింది. ఆ రోజున సుక్కమ్మమీదన నిజెంగ కొండదేవత పూన్లేదంట. నా పేనాలుగాపాడానికి ఇంకో మార్గంనేక దేవతకు సెమాపన సెప్పి అట్టా నాటకమాడినదంట. ఇన్నాక నా కల్లమ్మట నీల్లొచ్చిసినయి. సుక్కమ్మ కాల్లమీద పడిపోనను’ చెప్పింది ఉద్విగ్నంగా. 

అది విని సోము ఆశ్చర్యపోయాడు. చుక్కమ్మ చేసిన సాయానికి అతడి మనసు పులకించింది.  గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢాచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. సిసిరి ఒళ్ళోని బిడ్డను   ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ‘సిట్టితల్లీ... మీయమ్మడుతున్న  ఇక్కట్లు సూసి, ఆడబుట్టుక బుట్టినానని బెంగెట్టుకోకు... నువ్వు పెద్దయ్యేసెరికి యీ ఆసారాలేం వుండవునే. గూడెం పెద్దతోనే కీడు గుడిసెకు అగ్గెట్టేసే రోజు తొందర్లోనే వస్తది. ఆ రోజు కోసరం నాను పోరాడతనేవుంట’ అన్నాడు దృఢంగా, ఆశగా. ఆ చంటిబిడ్డకు ఏమర్థమయిందో తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది. -బొడ్డేడ బలరామస్వామి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement