పొగడ్త అగడ్త అని గిట్టనివారు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, నిజానికి పొగడ్తలను ఇష్టపడనివారు లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. పొగడుపూలవాన కురిపిస్తే, ఎంతటి ధీరగంభీరవదనులైనా పెదవులపై చిరునవ్వులొలికించక మానరు. పొగడ్తల శక్తి అలాంటిది మరి! మామూలు భాషలో పొగడ్త. పొగడ్తను కాస్త నాజూకుగా ప్రశంస అని, ఆధ్యాత్మిక పరిభాషలో స్తుతి అని కూడా అంటారు. పొగడ్తకు మన తెలుగు భాషలోనే దాదాపు అరవై వరకు పర్యాయపదాలు ఉన్నాయి. పొగడ్తనే ఇంగ్లిష్‌లో ‘కాంప్లిమెంట్’ అంటారు. ఈ మాటకు ఇంగ్లిష్‌లో నలభైకి పైగా పర్యాయపదాలు ఉన్నాయి. అంటే, పొగడ్తల్లో మన తెలుగువాళ్లదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు.
‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేన’ని కొందరి ప్రగాఢ విశ్వాసం. ఎంతటి అపర దుర్వాసులనైనా పొగడ్తలతో అవలీలగా పడగొట్టవచ్చనేది వారి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’లో గిరీశం ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి అగ్నిహో్రత్రావధానుల్లాంటి ప్రథమకోపిని చులాగ్గా బురిడీ కొట్టించగలిగాడు. అకాలంలో ఈ పొగడుపూల వానేంటని అయోమయం చెందుతున్నారా? మరేమీ లేదు– రేపు ‘వరల్డ్ కాంప్లిమెంట్ డే’– అనగా, ప్రపంచ ప్రశంసా దినోత్సవం. అందువల్లనే ఈ పొగడ్తల కథా కమామీషూ...
పొగడ్త పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన జాడ చరిత్రలో ఎక్కడా కనిపించదు గాని, బహుశ మాటలు పుట్టినప్పుడే పొగడ్తలు కూడా పుట్టి ఉంటాయని భావించవచ్చు. ‘ఆదియందు అక్షరము ఉన్నది. అక్షరము దైవము వద్ద ఉన్నది. అక్షరమే దైవమై ఉన్నది’ అని బైబిల్ చెబుతోంది. కాలక్రమమున దైవమై ఉన్న అక్షరమే దైవమును పొగడనేర్చినది. ఇది ఒక సృష్టి వైచిత్రి. పొగడ్తలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు దైవానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి మనుషులకూ విస్తరించాయి. జీవాత్ములైన మనుషులందరూ సమానులేనని అటు ఆధ్యాత్మికవాదులు, మనుషులంతా ఒక్కటేనని ఇటు సామ్యవాదులు ఏదో మాటవరసకు అంటుంటారు గాని, మనుషుల్లో కొందరు ఎక్కువ సమానులు ఉంటారు. సమాజంలో ఆస్తులూ అంతస్తులూ అధికారాలూ ఈ ఎక్కువ సమానుల సొంతం. ఎక్కువ సమానులను ప్రసన్నం చేసుకుని, వారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందడానికి తక్కువ సమానులు ఎప్పటికప్పుడు ‘పొగడు’పూల మాలలను అల్లుతుంటారు.
పురాతన కళ
పొగడ్త ఒక పురాతన కళ. వాంగ్మయారంభం నుంచే ఇది ఉనికిలో ఉంది. వేదపురాణాది పురాతన వాంగ్మయమంతా దైవాన్ని వేనోళ్ల పొగడటంతోనే వ్యాప్తిలోకి వచ్చాయి. రాచరికాలు ఏర్పడిన తర్వాత కవిపండితులు దైవంతో పాటు రాజులను కూడా పొగడటాన్ని అలవాటు చేసుకున్నారు. దైవాన్ని పొగిడితే చాలదా? మానవమాత్రులైన రాజులనెందుకు పొగడాలనే ధర్మసందేహం కొందరికి కలగవచ్చు. అలాంటి సందేహానికి ఆనాటి బతకనేర్చిన కవిపండితులు ‘నా విష్ణుః పృథ్వీపతిః’ అని సమర్థించుకున్నారు. అంటే, భూమినేలే రాజు సాక్షాత్తు మహావిష్ణువుతో సమానుడు. అందువల్ల రాజును పొగడటం తప్పుకాదనేది వారి వాదన.
ఈ వాదనతో ఏకీభవించి, రాజులను పొగడనేర్చిన కవిపండితులు, వాగ్గేయకారులు, విదూషకులు వంటి వారందరూ సునాయాసంగా సుభిక్షంగా సువిలాసంగా బతుకుతూ, సమాజంలో ఎక్కువ సమానులుగా చలామణీ అయ్యేవారు. పొగడటానికి ఇంతమంది ఉన్నా, తనివితీరని రాజులు కేవలం తమను పొగడటానికే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని, వారిని పెంచి పోషించేవారు. రాజులు ఎలాంటి వారైనా వారిని పొగడక తప్పని దుస్థితి ఆ రాజోద్యోగులది. ఎక్కడో తెనాలి రామకృష్ణుడిలాంటి తెలివైన కవులు రాజులను పొగుడుతున్నట్లే అనిపించే పద్యాలు చెబుతూ చురకలంటించేవారూ చరిత్రలో లేకపోలేదు. అలాంటి పద్యాల్లోని శ్లేషాలంకార మర్మాన్నెరుగని తెలివితక్కువ మారాజులు వారికి ఘనసన్మానాలూ చేసేవారు. పొగుడుతున్నట్లే చురకలంటించే ఆనాటి కవుల నైపుణ్యానికి ఒక ఉదాహరణ:
శ్రీకృష్ణదేవరాయల చిన్నల్లుడు తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడితో పొగిడించుకోవాలనే కోరిక పుట్టింది. రామకృష్ణుడికి కబురు పంపి సభకు పిలిపించుకుని, తనను పొగుడుతూ పద్యం చెప్పమన్నాడు. తిరుమలరాయడు ఏకాక్షి. శ్లాఘించవలసిన లక్షణాలేవీ పెద్దగా లేనివాడు. పొగడనని మొండికేస్తే తిక్క మారాజు ఎలాంటి శిక్ష విధించడానికైనా వెనుకాడడు. సమయస్ఫూర్తిమంతుడైన తెనాలి రామకృష్ణుడు కాసేపు ఆలోచించి, ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం:
అన్నాతిగూడ హరుడవె
అన్నాతి గూడకున్న నసురగురుడవె
అన్నా తిరుమలరాయా!
కన్నొక్కటి మిగిలెగాని కౌరవపతివే!
తిరుమలరాయడు భార్యతో కలసి సభలో కొలువుదీరాడు. భార్యతో కలసి ఉంటే, ఆమె రెండు కన్నులూ అతడి ఒంటికన్నూ కలసి మూడు కన్నులు. అందువల్ల ‘ఆమెతో కలసి ఉన్నప్పుడు సాక్షాత్తు ముక్కంటి అయిన పరమశివుడివేనని పొగిడాడు. పక్కన ఆమె లేనప్పుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడంతటి వాడివన్నాడు. వామనావతారంలో శ్రీమహావిష్ణువు దర్భపుల్లతో గుచ్చడంతో శుక్రాచార్యుడు ఒంటికంటితో మిగిలాడనే పురాణం అందరికీ తెలిసినదే. చివరి పాదంలో చెప్పినది వీటన్నింటినీ మించిన చమత్కారం. కన్నొక్కటి మిగిలిపోయింది గాని, లేకుంటే సాక్షాత్తు ధృతరాష్ట్రుడివేనన్నాడు. మహాభారతంలో గుడ్డిమారాజైన ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడి శ్లేష అర్థంకాలేదు కాబట్టి సరిపోయింది. రామకృష్ణుడు తనను నిజంగా పొగిడాడనే భ్రమలో మురిసిపోయాడా పిచ్చిమారాజు. తిరుమలరాయడికి అసలు విషయం అర్థమై ఉంటే రామకృష్ణుడి కథ వేరేలా ఉండేది. అధికార పీఠాలపై ఉన్నవారిని తప్పనిసరిగా పొగడాల్సిన పరిస్థితులు తటిస్థిస్తే తెనాలి రామకృష్ణుడి మార్గమే సురక్షితమైనది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నమయ్య అనుసరించిన మార్గం అత్యంత ప్రమాదకరం.
పెనుగొండ పాలకుడు సాళువ నరసింహరాయలు తన ఆస్థానంలో అన్నమయ్యకు ఆశ్రయం కల్పించాడు. అన్నమయ్య ఎంతసేపూ శ్రీనివాసుడిపైన కీర్తనలను గానం చేయడమే తప్ప ఏనాడూ తనకు ఆశ్రయం ఇచ్చిన రాజును పొగిడిన పాపాన పోలేదు. ఒకసారి సాళువ నరసింహరాయలకు ఎందుకో అన్నమయ్య చేత తనను పొగిడించుకోవాలనే దుగ్ధ కలిగింది. తనను పొగుడుతూ కీర్తనలను గానం చేయాలంటూ హుకుం జారీ చేశాడు. తిరుమలేశుని పరమభక్త శిఖామణి అయిన అన్నమయ్య అందుకు నిరాకరించాడు.
‘నరహరి పొగడగ నానిన జిహ్వ.... నరుల నుతింపగ నోపదు జిహ్వ’ అంటూ కరాఖండిగా మొండికేశాడు. ఈ నిరాకరణకు రాజైన సాళువ నరసింహరాయడి అహం దెబ్బతిన్నది. అన్నమయ్యను గొలుసులతో బంధించి, చెరసాలలో పెట్టించాడు. దైవకృప వల్లనో, మరెందు వల్లనో అన్నమయ్య ఆ తర్వాత సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది. అందువల్ల అధికారపీఠాన్ని అధిష్ఠించినవారిని పొగడక తప్పని పరిస్థితే ఏర్పడితే అన్నమయ్య మార్గం కంటే తెనాలి రామకృష్ణుడి మార్గమే మేలని వారి తర్వాతి తరాల బతకనేర్పరులందరూ ఏనాడో గ్రహించారు. అలాంటి బతకనేర్పరులు ఆనాటి రాచరిక కాలంలోనే కాదు, నేటి కార్పొరేట్ కాలంలోనూ ఉన్నారు. ఏ బాసుకు తగిన తాళాలను ఆ బాసు దగ్గర వాయిస్తూ ఇంచక్కా పబ్బం గడిపేసుకునే గడసరులు వారు. పొగడ్తలతో పనులు చక్కబెట్టుకోవడం కూడా ఒక కళ. ముఖస్తుతి కళలో ఆరితేరినవారిని మిగిలినవారంతా తప్పక ప్రశంసించి తీరాల్సిందే!
సామాజిక బహుమతి
‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి అర్ధసత్యం మాత్రమే! డబ్బును, డబ్బుతో కొనగలిగే వస్తువులను బహుమతులుగా ఇచ్చే ఆనవాయితీ చిరకాలంగా ఉన్నదే. ఇవన్నీ భౌతిక బహుమతులు. సామాజిక సామరస్యానికి ప్రశంసలే సోపానాలు. ప్రశంసకు డబ్బుతో పనిలేదు. ఎదుటివారిలోని సుగుణాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించగలిగే సహృదయం ఉంటే చాలు. మనిషి సామాజిక జీవి. ప్రశంస ఒక సామాజిక కానుక. డబ్బుతో ముడిపడిన భౌతిక కానుకలు ఇవ్వలేని సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి మంచి ప్రశంసకు మాత్రమే ఉంది. ఒకవేళ భౌతిక కానుకలు ఇచ్చినా, వాటికి కొన్ని ప్రశంసలను జతచేరిస్తే కానుకలు ఇచ్చేవారికి తృప్తి, పుచ్చుకునేవారికి ఆనందం కలిగిస్తాయి.
‘అదిగో వినరా ఆ చప్పట్లు– ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన’– సృజనాత్మక రంగంలోని కళాకారుల్లో మోతాదుకు మించి ఉండే గుర్తింపు కాంక్షకు అద్దంపట్టే డైలాగు ఇది– భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలోనిది. ప్రశంసలంటే మాటలే కాదు, చప్పట్లు కూడా. రసజ్ఞుల ఆమోదాన్ని వ్యక్తం చేసే కరతాళ ధ్వనులు కడుపు నింపవుగాని, కళాజీవుల మనసులు ఉప్పొంగేలా చేస్తాయి. ఎవరినైనా పొగడాలంటే భాషలో మాటలకు కరువులేదు. మరి పొగడటానికి మొహమాటమెందుకు? ఎదుటివారిలోని మంచిని గుర్తించి, మనసారా పొగడండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే హుందాగా స్వీకరించండి.
ప్రశంసలూ ప్రయోజనాలూ...
ప్రశంసలు విన్నప్పుడు ప్రశంసలు పొందినవారికి సంతోషం కలుగుతుంది. వారిలో తమను ప్రశంసించిన వారిపై సానుకూల భావనలు కలుగుతాయి. ఒకే చోట చదువుకునే సహాధ్యాయులు, ఒకే చోట పనిచేసే సహోద్యోగులు– అంతెందుకు, ఒకే ఇంట కాపురం చేసే భార్యాభర్తలు సందర్భోచితంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉన్నట్లయితే, వారి మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వారి పనితీరు కూడా మెరుగుపడుతుంది.
పొగడ్తలకు జ్ఞాపకశక్తిని మెరుగుపరచే శక్తి ఉన్నట్లు జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన మనస్తత్వశాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొత్తగా కళలు, శాస్త్ర విషయాలు నేర్చుకునే వారికి తొలి దశలో పొగడ్తలు టానిక్‌లా పనిచేస్తాయని, మెదడులో అవి కలిగించే జీవరసాయన చర్యలు వారి జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రశంసల వల్ల మనుషుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. మనుషుల్లో పరస్పర సహకార ధోరణి అలవడుతుంది. ‘ఒక మంచి ప్రశంస చాలు, నేను రెండు నెలలు బతికేస్తాను’ అన్నాడు మార్క్ ట్వేన్. ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే గొప్పగా మరెవరూ చెప్పలేరు. తోటివారిని ప్రశంసించే సంస్కృతి సమాజంలో శాంతి సామరస్యాలకు దోహదపడుతుంది.
ప్రశంసలు చిన్నపిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఏదైనా కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు, ఏదైనా మంచిపని చేసినందుకు పిల్లలను ప్రశంసించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రశంసలు పొందిన వారికి సంతోషం కలగడం సహజమే అయినా, ప్రశంసలు పొందిన వారి కంటే ప్రశంసలు కురిపించిన వారికే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పొగిడితే పోయేదేమీ లేదు... పొరపొచ్చాలు తప్ప!
పొగడ్తలు పొందడాన్ని దాదాపు అందరూ ఆస్వాదిస్తారు గాని, ఇతరులను పొగడటానికి మాత్రం కొందరు తెగ ఇబ్బందిపడిపోతుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా, లేకున్నా ఎదుటివారిపై ఎడాపెడా పొగడ్తలు కురిపించేస్తుంటారు. అనవసరంగా పొగిడే అలవాటు ఉన్నవారు ఎక్కువగా అధికారంలో ఉన్నవారి చుట్టూ, అందగత్తెల చుట్టూ, అపర కుబేరుల చుట్టూ చేరుతుంటారు. పొద్దస్తమానం జోరీగల్లా వారి చెవుల్లో పొగడ్తల రొద పెడుతుంటారు.
పొగడ్తలకు అలవాటు పడిన వారు ఒక్క పొగడ్త అయినా వినిపించని రోజున నిద్ర పట్టక, తిన్న తిండి సయించక నానా యాతన పడతారు. శ్రుతిమించితే పొగడ్త అగడ్తే అవుతుంది. అలాగని పొగడ్తలను తీసిపారేయడానికి లేదు. పొగడ్తలకు గల ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పొగిడితే పోయేదేమీ లేదు... మనుషుల మధ్య పొరపొచ్చాలు తప్ప. పొగడ్తలు మనుషుల మధ్య సఖ్యతను, సామరస్యాన్ని, పరస్పర సహకార ధోరణిని పెంచుతాయి. పిల్లలూ పెద్దలూ... మహిళలూ పురుషులూ... ఎలాంటి వారైనా పొగడ్తల ప్రభావానికి అతీతులు కారు.
ప్రశంసలను ఎందుకు కోరుకుంటారు?
సామాజిక జీవి అయిన మనిషి సమాజంలో ఒకరిగా మనుగడ సాగిస్తున్నా, తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటాడు. తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి, తన ప్రత్యేకతకు తగిన గుర్తింపును ప్రశంసల ద్వారా పొందడానికి అహరహం ప్రయత్నిస్తుంటాడు. మనిషి స్వభావమే అంత. గుర్తింపు కాంక్ష కొందరిలో కాస్త మోతాదుకు మించి ఉంటుంది. మోతాదుకు మించిన గుర్తింపుకాంక్ష ఉన్నవారే ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారు తిండి లేకపోయినా, పెద్దగా బాధపడరు గాని, ప్రశంసలు లేకపోతే తెగ కుంగిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment