రెక్కల పుస్తకం | Children Special Story In Sakshi | Sakshi
Sakshi News home page

రెక్కల పుస్తకం

Published Sun, Apr 7 2019 10:16 AM | Last Updated on Sun, Apr 7 2019 10:16 AM

Children Special Story In Sakshi

పసితనంలో పిల్లలు జోలపాటలను ఇష్టపడతారు. మాటలు నేర్చి, ఊహ తెలిశాక ఎన్నెన్నో ఊసులు చెప్పడం మొదలుపెడతారు. అలా ఊసులు చెప్పే దశలోనే వాళ్లు కథలకు చెవులొగ్గుతారు. పిల్లల కథలు ఈనాటివి కాదు, భాషలు ఊపిరి పోసుకున్నది మొదలు పిల్లల కథలు ప్రచారంలో ఉన్నాయి. తల్లులు చెప్పే కథలను పిల్లలు ఊ కొడుతూ వింటారు. కథలు వింటూ వాళ్లు తమ ఊహలకు పదునుపెట్టుకుంటారు. లోకంలోని మంచి చెడులను ఆకళింపు చేసుకుంటారు. అచ్చు యంత్రం అందుబాటులోకి వచ్చాక నానా ఉద్గ్రంథాలతో పాటు పిల్లల పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. టీవీలు, ట్యాబ్‌లు, స్మార్టఫోన్లు వంటి ఆధునిక వినోద సాధనాలు అందుబాటులో లేని కాలంలో కథల పుస్తకాలే పిల్లలకు వినోద సాధనాలు. వీడియోగేమ్స్‌లో తలమునకలయ్యే 
మీ పిల్లలకు ఈ వేసవి సెలవుల్లో చక్కని కథల పుస్తకాలనివ్వండి. వాళ్లే గనుక ఒకసారి కథల రుచి మరిగితే, ఇతరేతర వినోద సాధనాల జోలికి ఇక వెళ్లాలనుకోరు.

అనగనగా ఓ తాతా బామ్మా!
2000–2020
‘రండర్రా పిల్లలూ మీ కోసం కథల పుస్తకాలు తెచ్చాను’ అని ముసలావిడ ఆందో లేదో, ‘అబ్బా నీ కధల పిచ్చితో చంపుతున్నావు, నేను పబ్జీ ఆడుతున్నప్పుడు డిస్టర్బ్‌ చేయొద్దన్నానా’ అని బుడుగు గాడి అరుపు.

 ‘నానమ్మా! నీ పేదరాశి పెద్దమ్మ కథ, లేదంటే రామాపురంలో సోములు అనే రైతుండేవాడు అని బోరు కొడతావు, ఎంచక్కా టీవీలో షించేన్‌ చూస్తూంటే’ అని బుజ్జి చిరాకుపడుతోంది. ‘అమ్మా వాళ్ళని వదిలేయేవే, అలా బలవంతంగా పుస్తకాలు చదివిస్తే వాటి మీద ఆసక్తి పోతుంది,  యూట్యూబ్‌లో బోల్డు వినోదాత్మక విజ్ఞానంతో కూడిన వీడియోలున్నాయి చూసుకుంటారులే’ అని కొడుకు విసుక్కొంటున్నాడు.

1970–1990
’ఏమర్రా పిల్లలూ ఎందుకు దెబ్బలాడుకొంటున్నారు’? ’చూడు బామ్మా! చందమామ చదువుతుంటే లాగేసుకొని చదువుతున్నాడు అన్నయ్య’. ‘నిన్న బాలమిత్ర వచ్చిన వెంటనే చెల్లే మొదట చదివింది. ఇవాళ నా వంతు బామ్మా.’  సెల్‌ ఫోన్లు, సామజిక మాధ్యమాలు రాకముందు పిల్లల పుస్తకాలు లేని గడప ఉండేది కాదు, గ్రంథాలయాకు వెళ్లని పిల్లలుండేవారు కాదు.  బుడి బుడి అడుగులేస్తున్నప్పుడే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పురాణాలు, ఇతిహాసాల నుంచి కథలు చెప్పి, వారికి పుస్తకాలను అలవాటు చేసేవారు.

పంచాయతీ నుంచి పట్టణం వరకు ఊరూరా గ్రంథాలయాలుండేవి.  ఎన్నో పిల్లల మాస పత్రికలు ప్రచురణలో ఉండేవి. కొత్త మాసపత్రిక చేతికందగానే చదవడానికి ఎగబడేవారు. చదువుతున్నంతసేపూ ఆకలి దప్పులను కూడా మరచేవారు. మంచి సాహిత్యం చదివితే మెదడు చైతన్యవంతమవుతుంది. రేవులోని నావలకు దారి చూపించే దీప స్థంభాల్లాంటివి పుస్తకాలు. అవి పిల్లల బంగారు భవిష్యత్తుకు పూల బాట వేస్తాయి. కాబట్టి పిల్లలకు చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవాటు చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్లతో కూర్చుని కథలు చెబుతూ, వాళ్ల చేత కథలు చదివించాలి.

2013 లో జపాన్‌లో తోహోకూ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఒక విద్యా విషయ కార్యక్రమం పిల్లలకు టీవీలో చూపించారు. అదే అంశంపై రాసిన  పుస్తకమిచ్చి మరో వర్గం పిల్లలచేత చదివించారు. మర్నాడు టీవీ చూసిన పిల్ల్లలు కంటే పుస్తకం చదివిన పిల్లల పదకోశం, విజ్ఞానం ఎన్నో రెట్లు మేలుగా ఉందని నిరూపించారు. బాల్యం నుంచి తరచు పుస్తకాలు చదివేవారికి అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం  2.5 రెట్లు తక్కువగా ఉంటుంది. టెలివిజన్‌ నరాలను ఉద్వేగానికి లోనుచేస్తే, పుస్తకపఠనం ఉద్వేగాన్ని అదుపులో పెడుతుంది.

ఇంగ్లాండ్‌ లో సస్సెక్స్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం ఆరు నిమిషాల పుస్తక పఠనం ఒత్తిడి స్థాయిని 68 శాతం మేరకు తగ్గిస్తుంది.బాలల సాహిత్యానికి నాంది మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వివిధ భాషలలో, మాండలికాలలో లాలిపాటలు, జానపద కథలు గేయాలు, లయబద్ధమైన పద్యాలూ మనుగడలో ఉండేవి, కాకపోతే అక్షరరూపం దాల్చలేదు. పిల్లల సాహిత్యం ప్రజాదరణ పొందుతున్న కొద్దీ క్రమేపి ప్రపంచంలోని వేర్వేరు భాషల్లో పుస్తకరూపం దాల్చాయి. పిల్లల సాహిత్యంలో ఆదిగ్రంథం ‘పంచతంత్రం’ అని చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం 200 ప్రాంతంలో కాశ్మీర్‌ రాజ్యంలో విష్ణు శర్మ చేత  పంచతంత్ర ప్రాణం పోసుకుంది.

భారతదేశ సుగంధ ద్రవ్యాల పరిమళం పర్షియన్లు, అరబ్బులు, రోమన్లు, పోర్చుగీసులు, డచ్చు వారి ముక్కుపుటాలకు తగిలి వాటి కోసం ఎగబాకారు. సముద్ర మార్గం గుండా వాణిజ్యం ఆరంభించారు. ఎగుమతులు, దిగుమతుల ద్వారా వస్తుమార్పిడితో పాటు మన పిల్లల సాహిత్యం కూడా పట్టుకెళ్లారు. భారతదేశం నుంచి పంచతంత్ర పర్షియాకు, అరేబియాకు అక్కడ నుంచి జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆఫ్రికా, చివరికి అమెరికాకు వ్యాప్తి చెందిందని ప్రముఖ వ్యాకరణవేత్త మాక్స్‌ ముల్లర్‌ తన అధ్యయనం ‘మైగ్రేషన్‌ ఆఫ్‌ ఫేబుల్స్‌’లో వెల్లడించాడు.

పశ్చిమ దేశాల వారి ‘టామ్‌ అండ్‌ జెర్రీ’కి  గాని, ‘లయన్‌ కింగ్‌’కి గాని, మరో జంతు విషయ పుస్తకమేదైనా వాటికి మూలం మన పంచతంత్రమే. అందుకే అత్యధిక దేశాల్లో పిల్లలు మనదేశంలో మాదిరిగానే కోతి బావ, జిత్తులమారి నక్క మామ, కపట మొసలి ప్రధానాంశంగా ఉండే నీతి కథలు చదివేవారు. క్రమేపి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు నేపథ్యాలతో పిల్లల సాహిత్యం రూపుదాల్చింది. భారతదేశంలో సుమతీ, వేమన శతకాలు, రామాయణ, భారత గాథలు, ఐరోపా దేశాల్లో ’సిండ్రిల్లా’ లాంటి కథలు, పశ్చిమాసియా ప్రాంతంలో ‘ద అరేబియన్‌ నైట్స్‌’ కథలు, ఉత్తర అమెరికాలో  ‘ది నెర్గో ఫోక్‌ స్టోరీస్‌’, ’అంకుల్‌ రేమూస్‌’ వంటి కథలు 17వ శతాబ్ది నాటికి పుట్టుకొచ్చాయి.

ఆధునిక బాల సాహిత్యానికి నాంది 17వ శతాబ్దంలో పడింది. పారిశ్రామిక విప్లవం పుట్టుకొచ్చినప్పుడు నిరుపేద కుటుంబాల పిల్లలను బొగ్గు గనులలో, కర్మాగారాల్లో, బాల కార్మికులుగా నియమించుకొనేవారు. అగ్ర రాజ్యం అమెరికాలో సైతం నాలుగేళ్ల ప్రాయమున్న పిల్లలను ఫ్యాక్టరీ చిమ్నీలోకి పంపి లోపల శుభ్రం చేయించేవారు. బాల కార్మిక చట్టాలు లేని 19వ శతాబ్దంలో పిల్లలను బానిసలుగా భావించే వారు తప్ప పిల్లల కోసం సాహిత్యం రాసేంత గొప్ప ఆలోచన అప్పటికి కలగలేదు.

ఏడాదిలో 50 పుస్తకాలు వివిధ దేశ భాషల్లో ముద్రణయితే గొప్పే. 19వ శతాబ్దం చివరిలో ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ బాలకార్మికుల చట్టాలను పటిష్ఠంగా తీర్చిదిద్ది, పిల్లలకు అన్ని హక్కులతో పాటూ విద్యాహక్కు కల్పించి, నిర్బంధ విద్యను ప్రోత్సహించాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తెచ్చిన సామాజిక మార్పుల క్రమంలో గణనీయంగా అభివృద్ధి చెందిన పిల్లల సాహిత్యం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చతికిలబడింది. అధిక ముద్రణ ఖర్చు, తగ్గిన గిరాకీ, కాగితం కొరత వలన ప్రచురణకర్తలు పిల్లల సాహిత్యంపై ఆసక్తి కోల్పోయారు. అయితే 1950లు నుంచి మొదలు పిల్లల సాహిత్యంలో ఆధునిక పోకడలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి. 1990 ల వరకు రేడియో, టెలివిజన్ల ప్రభావం పిల్లలపై పడలేదు, పుస్తకాలకు ఆటంకం ఏర్పడలేదు.

బాల సాహిత్యం వైపు మొగ్గుచూపిన ప్రముఖ రచయితలు
1936లో ఒక తాత మరో ఊళ్లో పెరుగుతున్న తన మనవడికి రెండు కథలు రాసి పంపాడు. ఆ మనవడు పెద్దవాడయ్యాక తన తాత జేమ్స్‌ జోయిస్‌ చిన్నప్పుడు పంపిన  ‘ది క్యాట్‌ అండ్‌ ది డెవిల్‌‘ కథల పుస్తకంగా అచ్చు వేయించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రచయితయిన జేమ్స్‌ జోయిస్‌ అద్భుతమైన బాల సాహిత్యం కూడా రాశాడు.

వేలాదిగా పద్యాలు, పెద్ద సంఖ్యలో నవలలు రాసిన ఇ. ఇ. కమ్మింగ్స్‌ తన బంగారు పట్టి కోసం నాలుగు కథలు రాశాడు. తండ్రి జ్ఞాపకార్థం కుమార్తె నాన్సీ వాటిని 1965లో ‘ఫేరీ టేల్స్‌’గా పుస్తకం వేయించింది, ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం పాఠకాదరణ పొందింది.ప్రముఖ రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వే తన ప్రేయసి మేనల్లుడి కోసం రాసిన ‘ది గుడ్‌ లయన్‌ అండ్‌ ది ఫెయిత్‌ఫుల్‌ బుల్‌’ కథను 1951లో మొదటిసారి హాలిడే మ్యాగజైన్‌ ప్రచురించింది.

‘బ్రేవ్‌ న్యూ వరల్డ్‌’ రాసిన ప్రముఖ రచయిత ఆల్డస్‌ హక్స్‌లే 1944లో తన ఐదేళ్ల మేనకోడలి కోసం రాసిన కథానికను  ‘ది క్రోస్‌ ఆఫ్‌ పియర్‌బ్లోసమ్‌’గా 1967లో ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించింది. డజన్ల కొద్దీ నవలలు వ్రాసి సాహిత్యంలో రెండుసార్లు  పులిట్జర్‌ బహుమతి గెలుచుకున్న జాన్‌ అప్డైక్‌ తన కూతురు ఎలిజబెత్‌ కోసం రాసిన కథలు ‘ఏ చైల్డ్స్‌ క్యాలండర్‌’, ‘ది మేజిక్‌ ఫ్లూట్‌’, ‘బాటమ్‌ డ్రీమ్‌’, ఏ హెల్ప్‌ఫుల్‌ ఆల్ఫాబెట్‌ అఫ్‌ ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్స్‌’ వంటివి ప్రాచుర్యం పొందాయి.
 
తన సోదరి కొడుకుని ముఖ్య పాత్రధారిగా చేసుకొని బాల్యం ఎంత మధురమైంది అనే అంశాన్ని ప్రతిబింబించే  ‘లిటిల్‌ బోయ్‌  లిటిల్‌ బోయ్‌’ అనే పిల్లల పుస్తకాన్ని జేమ్స్‌ బాల్డ్‌విన్‌ రాశాడు. ఇరవయ్యో శతాబ్దపు ప్రఖ్యాత కవులలో ఒకరైన టి. ఎస్‌. ఇలియట్‌ తన ప్రేయసి పిల్లల కోసం మారు పేరుతో కథలు రాశాడు. ఆ కథలను ‘ఓల్డ్‌ పాసమ్స్‌ బుక్‌ ఆఫ్‌ ప్రాక్టికల్‌ క్యాట్‌’ పేరిట ఫేబర్‌ – ఫేబర్‌ ప్రెస్‌ వారు 1939లో ప్రచురించారు.

 అతంత్య వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీ 1980ల్లో రాసిన ‘సెటానిక్‌ వెర్సస్‌’ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూంటే, తొమ్మిది ఏళ్ల కొడుక్కి బాధనిపించి ‘ఈ సమస్యాత్మక రాతలు మానేసి పిల్లల కథలు రాయొచ్చు కదా నాన్న మా స్కూల్లో స్నేహితులందరూ నిన్ను విలన్‌గా అభివర్ణిస్తున్నారు’ అని వాపోతే రష్డీ రాసిన పుస్తకం ‘హారూన్‌ అండ్‌ ది సీ ఆఫ్‌ స్టోరీస్‌’.  కథలు రాసే నైపుణ్యం, ఇచ్ఛ, సామర్థ్యాన్ని కోల్పోయి, మానసికంగా కుంగిపోయిన ఒక ప్రముఖ రచయితని తన పదేళ్ల కొడుకు సాహసయాత్రకు తీసుకువెళ్లి తండ్రి కోలుకునేలా శతవిధాలా ప్రయత్నిస్తాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని అత్యద్భుతంగా చెప్పి స్ఫూర్తినిస్తుంది ఈ కథ.  దీనికి అనుబంధంగా టీనేజ్‌ పిల్లల కోసం 2010లో,  ‘లూకా అండ్‌ ఫైర్‌ ఆఫ్‌ లైఫ్‌’  పుస్తకాన్ని రాశాడు సల్మాన్‌ రష్డీ.

ప్రముఖ నవల ‘ఫౌకాల్ట్స్‌ పెండ్యూలం’తో ప్రసిద్ధికెక్కిన ఇటలీ తత్వవేత్త ఉంబెర్టో ఎకో అత్యద్భుత సైన్స్‌ ఫిక్షన్‌ రాసి అంతరిక్షం, అణుబాంబు వంటి అంశాల పై పిల్లలకు ఆసక్తి పెంపొందించేటట్టు చేశాడు. అమెరికా, రష్యా,  చైనాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములు తమ దేశాల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరు బయలుదేరి మార్స్‌ గ్రహం మీద తామే ముందు అడుగిడాలని ప్రయత్నిస్తారు, చివరికి ముగ్గురూ ఒకే సమయంలో మంగళగ్రహం మీదకు చేరుకొనే నేపథ్యంలో ఎకో రాసిన పుస్తకమే  ‘ది త్రీ ఆస్ట్రోనాట్స్‌’ చిన్నపిల్లలకు అణువు పరమాణువుని విశదీకరించి చెప్పడమే కాకుండా యుద్ధం వలన కలిగే నష్టాన్ని, శాంతి సందేశాన్ని బొమ్మలను జోడించి మరీ వివరించాడు ఎకో ‘ది బాంబ్‌ అండ్‌ ది జనరల్‌’ అనే పుస్తకంలో. కయ్యానికి కాలుదువ్వే మిలిటరీ జనరల్‌ అణుబాంబులు ప్రయోగించి యుద్ధం చేద్దామనుకొంటూండగా,  ప్రజలను చూసి జాలిపడి ఆ దుష్పరిణామం ఊహించుకోలేక అణువులన్నీ కూడగట్టుకొని బాంబుల్లోంచి బయటకు వచ్చేస్తాయి. పేలుడు జరగదు. కథ సుఖాంతం.

లియో టాల్‌స్టాయ్‌కి పిల్లలంటే ప్రేమ. తన ఎస్టేట్‌లో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు. అయ్యో ఇప్పటి వరకు పిల్లల కోసం ఏమీ రాయలేదే అని అనుకున్నదే తడవుగా రాయడం మొదలెట్టి ‘ఏబీసీ బుక్‌’, ‘న్యూ ఏబీసీ బుక్‌’ బాల కథాసంపుటాలను ప్రచురించాడు.  – సునీల్‌ ధవళ సీఈఓ, ద థర్డ్‌ అంపైర్‌ మీడియా

పుస్తకాలే మార్గదర్శి 
మంచి పుస్తకాల కంటే పిల్లలకు గొప్ప స్నేహితులుండరు. విజ్ఞానాన్ని అందించడంలో పుస్తకాలు కల్పవృక్షాల్లాంటివి. బుద్ధి బలాన్ని పెంచి మనోవికాసాన్ని కల్పించడంలో పుస్తకాలకు మించిన అక్షయపాత్ర ఉండదు. పిల్లల ప్రవర్తనకి మూలం ఆలోచనలయితే, వాటికి ప్రతిబింబం చదివిన సాహిత్యమే. పిల్లల స్వభావం పాక్షికంగా వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.

పుస్తకాలలోని పాత్రధారులు, సన్నివేశాలు ప్రేరణనిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. మంచి సాహిత్యం, పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతూ, పుస్తకపఠనాన్ని దినచర్యగా చేసుకొంటే మేధస్సు వికసిస్తుంది. పుస్తకాలు సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి దొహదపడతాయి. టీవీ, వీడియో గేమ్స్, ఆన్‌లైన్‌ గేమ్స్, సామజిక మాధ్యమాలు మానసిక వ్యాకులతకు దారితీస్తే,  పుస్తకాలు ఆ వ్యాకులతను తరిమికొడతాయి. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అనూహ్యం, అమోఘం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement