లోపలికి చొరబడిన శింశుపాచెట్టు నీడలకింద కోమావార్డు వరండాలో ఇనుప అమడకుర్చీలో చేరగిలబడి పిలుపుకోసం ఎదురుచూస్తోంది యశోద. దూరంగా వరండా అటు చివర పెద్దడాక్టరు రూము కనిపిస్తోంది. పెద్దడాక్టరు రౌండ్సు నుంచి రాగానే యశోదను పిలుస్తానని నర్సమ్మ మాటయిచ్చింది. యశోద భర్త గంగారామ్ అప్పటికి నెలరోజులుగా మనతెలివిలో లేకుండా కోమావార్డులో తొమ్మిదో నెంబరు మంచం మీద ఉన్నాడు. కోమావార్డు.. ఆసుపత్రి వెనుకవైపు రెండో అంతస్తులో ఉంది. వరండాను ఆనుకుని చిట్టడవిలాగా అన్నీ చెట్లే. పక్షుల అరుపులు తప్ప మరో చప్పుడు లేదు. వార్డులోపల గంగారామ్‌కు, బయట వరండాలో యశోదకు నెలరోజులుగా కాలం స్తబ్దుగా అయిపోయింది.
ఉదయం పది దాటింది. పక్కన మరో అమడకుర్చీలో కూర్చున్న పోలమ్మ వక్కాకు సంచీలోంచి తమలపాకులు తీసి తొడిమలు తుంపుతోంది. పోలమ్మ భర్త ట్రాక్టరు నుంచి పడి తలకు దెబ్బతగిలింది. పదిరోజుల కిందట కోమావార్డుకి మార్చారు. ‘కాలం యెట్లమారిందో సూసినావా? అమ్మానాయన వయసైపోయి యింగ యింటికి పనికిరాకపోతే వాళ్లను సచ్చినోళ్లల్లో జమజేసేస్తారు. ఆల్ల బిడ్డలు గూడా ఆ మనిసి సావుకోసం యెదురుసూస్తారు. లోపల అంతమంది పేసెంట్లుంటే బయిట వొరండాలో మనిద్దరం తప్ప యెవురూ లేరు’ అంది పోలమ్మ.. యశోదవైపు చూసి విరక్తిగా.
యశోద తల అడ్డంగా వూపి ‘చిచ్చీ.. మనిషి చావుకోసం అట్లా యెవరూ యెదురుచూడరు. యెట్లావున్నా మన పెద్దవాళ్లను బాగా చూసుకోవాల. జీవితం విలువైంది, వొక్కసారే వొస్తుంది. మన శత్రువైనా బతకాలనే కోరుకోవాల అంటాడు మా ఆయన’ అంది.
పోలమ్మ వెనక్కి తగ్గకుండా ‘వొకమనిసి ఖాయిలాపడి యింగ బాగవడని తెలిసినా అంతే. డాకటర్లు తప్ప తక్కినోళ్లందరూ యెప్పుడు పోతాడా అని సూస్తారు. యిదే యిప్పుటి దిక్కుమాలిన లోకరీతి’ అంది. యశోదకు చేదువిషం తిన్నట్టయింది. తలవెనక్కి వాల్చి కళ్లుమూసుకుంది. నెలరోజుల్నుంచి రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, రోజూ తెల్లవారు జామున్నే లేచి పనంతా చేసుకుని ఆటోలో రావడం వల్ల యశోదకు ఒళ్లంతా పోటుగావుంది.
అది ఒక మఠం నిర్వహించే ధర్మాసుపత్రి. గంగారామ్ నాన్న బతికి వున్నప్పుడు పెద్దస్వామీజీకి శిష్యుడు. గంగారామ్‌ను శ్రద్ధగానే చూసుకుంటున్నారు. వాళ్ల నాగులూరు నుంచి ఆసుపత్రికి అరగంట ప్రయాణం. యశోద రోజూ పొద్దున వచ్చి సాయంత్రం వరకూ ఎదురుచూసి వెళ్తోంది. ఇంటి దగ్గర అత్త మణెమ్మ పిల్లలను చూసుకుంటూ స్కూలుకు పంపిస్తోంది. పొద్దున రాగానే లోపలికెళ్లి గంగారామ్‌ను చూసొచ్చింది యశోద. ఎప్పటిలాగే స్పృహలో లేడు. చేతికి, ముక్కుకు, తలకు పెట్టిన ట్యూబులు అలాగే వున్నాయి. వెనుక మిషన్లో ఏవేవో గీతలు మారుతూనే వున్నాయి. భర్త ప్రాణాలు భూమికి, ఆకాశానికి మధ్యలో తీగలుపట్టుకుని వేలాడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. లోపల ఎక్కువసేపు ఉండనీరు. వరండాలో కూర్చోనో, పడుకోనో కాలం గడపాలి.
పెద్దడాక్టరు కోసం ఎదురుచూస్తూ పొద్దున్నించీ ఆమె ఏమీ తినలేదు. కడుపులో ఆకలి అటూఇటూ కదిలింది. ‘యీ ఆకలొకటి, బతికినంతకాలం వొదిలిపెట్టదు. ఆకలేస్తేనే మనిషి బతికివున్నట్టా? గంగారామ్‌కి ఆకలేస్తే బావుండును’ అనుకుంది. ఒక రెక్కలపురుగు శబ్దం చేస్తూ యశోద తలచుట్టూ తిరిగింది. నర్సు వరండాలోకి వచ్చి ఆమెను రమ్మని చెయ్యి వూపింది. యశోద లేచి గబగబా వెళ్లింది. ‘గంగారామ్‌లో పెద్దగా మార్పేమీ లేదు. పెద్దస్వామీజీగారు నిన్న వచ్చి చూశారు. యెన్నాళ్లైనా సరే బాగయ్యేవరకు మనమే చూసుకోవాలన్నాడు’ అన్నాడు పెద్దడాక్టరు చేతులు కట్టుకుని నిలబడ్డ యశోదతో.
‘మా ఆయనకు బాగవుతుందా సార్’ ఆశగా అడిగింది యశోద. ‘చికిత్సవల్ల అతని మెదడులో కణితి పెరగడం ఆగిపోయినా అది మెదడును కొంత దెబ్బతీసింది. కోమాలోకి వెళ్లిపోయాడు. మిగతా అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. యిలా వున్నవాళ్లలో వందమందిలో వొకరు కోలుకుంటారు. యీ చికిత్స కొనసాగిద్దాం. కోలుకునే అవకాశం వుంది. మనం యెదురుచూడక తప్పదు!’ అని నిట్టూర్చి తనముందున్న పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు పెద్దడాక్టరు. యశోద అతనికి నమస్కారం చేసి బయటకు వచ్చింది. ‘ఒక్క నెలలోనే తన బతుకులో ఎంతమార్పు’ అనుకుంది వెయిటింగ్ కుర్చీలకేసి నడుస్తూ.
ఎమ్మే చదివిన గంగారామ్‌ది ఒక పెద్ద ఎరువుల కంపెని ఫీల్డాఫీసులో గుమాస్తా ఉద్యోగం. జీతభత్యాలు మంచివే. ఒళ్లొంచి పనిచేసే వాడు. మరో వ్యాపకం ఉండేదికాదు. భార్యాపిల్లల్తో ప్రేమగా గడిపేవాడు. అతనికున్న ఒకే ఒక బలహీనత తరచుగా సెలవుపెట్టి ఆశ్రమాలు, మఠాలకు వెళ్లిరావడం. అది అతనికి తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం. ఇద్దరాడపిల్లలు పుట్టాక కూడా దాచుకోకుండా తండ్రిలాగే డబ్బంతా అలా తగలేస్తున్నాడని తల్లి మణెమ్మ వాపోయినా పట్టించుకునేవాడు కాదు. అతనికి తాతల కాలం నుంచి వచ్చిన చిన్న ఇల్లు తప్ప మరో ఆస్తిలేదు.
మూడునెలల కిందటి వరకూ గంగారామ్ బాగానే వున్నాడు. క్రమంగా తలనొప్పి రావడం, వస్తువులు రెండుగా కనపడ్డం మొదలైంది. అప్పుడప్పుడూ స్పృహ తప్పేది. మఠం ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలన్నీ చేసి మెదడులో కణితి పెరుగుతోందని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. మూడోరోజున తెలివొచ్చి భార్యాపిల్లలను పలకరించాడు. నాలుగురోజులు బావున్నాడు, ఏడోరోజున కోమాలోకి వెళ్లిపోయాడు. నెలరోజులైనా ఇక తెలివి రాలేదు. అప్పట్నుంచి యశోద నాగులూరికీ మఠం ఆసుపత్రికీ మధ్య తిరుగుతూనేవుంది. ఆ వార్డు నుంచి కోలుకొని బయటికి వెళ్లేవాళ్లు తక్కువ. చుట్టాలు మొదట్లో వచ్చినంతగా తరువాత రారు. పగలంతా ఒక నైరాశ్య నిశ్శబ్దం కమ్ముకుని వుంటుంది..
యశోద సంచిలోంచి టిఫిన్ డబ్బా తీసింది. తినాలనిపించక మూత పెట్టేసింది. ‘తినమ్మా నీరసంగా అగపడతా వుండావు. మీ ఆయనకు లోపల టూబుల్లో అన్నం పెడతానే వున్నారు గదా. తినక నువ్వూ పడిపోతే యిల్లూ, ఆసుపత్రి యెవురు జూసుకుంటారు’ అంది పోలమ్మ కుర్చీలోకి కాళ్లు ముడుచుకుని. పోలమ్మది పెద్ద వయసు. కాస్త దూరంలోని పల్లెటూరు, రైతుకుటుంబం. అన్నీ తెలిసినట్టుగా కబుర్లు చెబుతూ అందరి వివరాలూ సేకరిస్తూంటుంది. తన భర్త విషయంలో ఆమె నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతుంది. వాళ్ల వూరి పూజారి ఇచ్చిన కుంకాన్ని భర్త నుదిటి మీద రాస్తుంది. ‘బెమ్మరాతను యీ కుంకమ మారస్తాదా’ అని నిర్లిప్తంగా తనే అంటుంది. ‘జనమ యెత్తినట్టే సావుగూడా మామూలు యిసయమేగదా’ అంటుంది. ఒకవేళ భర్త చనిపోతే అతని మరణాన్ని హుందాగా తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండడం యశోదకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
‘నిన్నరేత్రి మూడో నెంబరు మంచమామె కాలంజేసింది. బైట వొరండాలో వొచ్చినోల్ల యేడుపులు జాస్తిగా వుండినాయి. లోపలున్న పేసంట్లకు యివేమీ తెలీదు, అదొక సుకం’ అంది పోలమ్మ.
అలాంటి వార్త విన్నప్పుడంతా యశోద గుండె ఆగినట్టవుతుంది. రాకూడని ఆలోచనని అణచేసినట్టుగా చెట్లవైపు చూస్తుంది. నలుగురు మధ్యవయస్కులు పెద్దడాక్టరు రూము నుంచి వచ్చి వార్డులోకి వెళ్లి మూడునిముషాల్లో బయటికి వచ్చారు. ఇద్దరు మగవాళ్లూ అలసిపోయినట్టుగా కూర్చున్నారు. ఆడవాళ్లు వాళ్లెదురుగా నిలబడ్డారు. నలుగురూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల నాన్న కోటయ్య తలలో రక్తనాళాలు చిట్లి కొన్నిరోజులుగా ఐదోనెంబరు మంచంలో ఉంటున్నాడు. ఆయన భార్య పోయి చాలాకాలమైంది. పిల్లలందరూ స్థిరపడ్డారు.
‘యెట్లుంది మీ నాయనకు?’ వాళ్లను అడిగింది పోలమ్మ.‘పొద్దున కొంచెం సీరియస్సైందంట, ఆస్పత్రివాళ్లు రమ్మంటే పరిగెత్తుకొచ్చాం. యిప్పుడు ఫరవాలేదంటున్నారు. డాక్టర్లేదీ సరిగ్గా చెప్పడంలేదు’ అంది ఆడవాళ్లలో పెద్దగావున్నావిడ. కాసేపటి తరువాత వాళ్లు వెళ్లిపోయారు. ‘యీళ్లసంగతి గమనించినావా? ఆయనెప్పుడుపోతాడా అని సూస్తన్నారు. ఆస్తికోసమనుకుంటా’ అంది పోలమ్మ మొహం గంటుపెట్టుకొని. ‘అదంతా నీ భ్రమ. అట్లెందుకనుకుంటారు. వాళ్లు వున్నోళ్లు’ అంది యశోద. ఆ ఊహే ఆమెకు కష్టంగా, భయంగా ఉంది. ‘అది మనిషిని బట్టి వుంటాది, యీళ్లట్లాటోళ్లే. నిజం సేదుగానే వుంటాది’ అని ‘శానా ఆలెస్సమైంది, నాష్టాజెయ్యిపోమ్మా’ అంది పోలమ్మ.
సంచి తీసుకుని వరండా చివర వాష్ బేసిన్ దగ్గరికెళ్లింది యశోద. ఆమె ఎంగిలిపడి వచ్చి కూర్చోగానే వీర్రాజు వచ్చాడు. ‘అన్నకెట్లుంది?‘ అనడిగాడు. ‘అట్లేవుంది, యింగా టైం పడుతుందంట’ అంది యశోద. లోపలికి వెళ్లి గంగారామ్‌ను చూసొచ్చాక నాలుగైదు నిముషాలు మాట్లాడి ‘యేది కావాల్సొచ్చినా ఫోన్ చెయ్యి’ అని చేప్పి వెళ్లిపోయాడు వీర్రాజు. ‘సోగ్గా వుండాడు, యెవురతను?’ అడిగింది పోలమ్మ ‘వరసకు మా అత్తకొడుకు, మావూళ్లో సినిమాహాలు మేనేజరు’ జవాబిచ్చింది యశోద. పోలమ్మ ఆసక్తిగా వివరాలు అడగబోయిందిగాని యశోద తలతిప్పుకుంది.
ఆమెకు వీర్రాజంటే చిన్నప్పట్నుంచి ఇష్టంలేదు. వీర్రాజు మంచివాడే గాని సినిమాల పిచ్చితో థియేటర్ల చుట్టూ తిరిగి ఇంటర్ తప్పి చదువు వదిలేశాడు. యశోద బియ్యే పాసైంది. యశోదకు గంగారామ్‌తో పెళ్లికాక ముందు ఆమెను చేసుకోవాలని వీర్రాజు శతవిధాల ప్రయత్నించాడు. ఒకప్పుడైతే అసలు మాట్లాడేదిగాదు. భర్త జబ్బుపడ్డాక ఆమె గట్టిదనం తగ్గిపోయింది. వీర్రాజుకు పెళ్లైంది గాని పిల్లల్లేరు. పెళ్లి తర్వాత అతను యశోద దగ్గరికి రావడం తగ్గించేశాడు. గంగారామ్‌కి బాగలేనప్పట్నుంచి మళ్లీ వస్తున్నాడు. గంగారామ్ ఆసుపత్రిలో చేరిన నెలరోజుల తర్వాత ఇంకా యశోదను పట్టించుకుంటున్న ఏకైక చుట్టం అతనే.
సాయంత్రం ఇంటికొచ్చింది యశోద. ఆసుపత్రిలో స్తబ్దుగా ఉండిన కాలం ఇప్పుడు ముల్లుకర్రలా గుచ్చుకుంటోంది. ఇంట్లో సరుకులన్నీ దాదాపు నిండుకున్నాయి. చేతిలో వున్న డబ్బంతా అయిపోయింది. అత్త ఎవరి దగ్గరో అప్పుకోసం వెళ్లినట్టుంది. అన్నానికి పెట్టి వరండాలో గోడకానుకుని కూర్చొని గేటు బయట ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. చిక్కిపోయి నీరసంగా ఉన్నారు. ఆమె కళ్లు నీళ్లతో నిండాయి. వీర్రాజు వచ్చాడు. పిల్లలను పలకరించి లోపలికొచ్చి స్టూలు మీద కూర్చున్నాడు. ‘ఆఫీసులో గంగారామ్‌కు రావల్సిన డబ్బులు వుంటాయి. అంతేగాదు, వుద్యోగస్తుడు ఖాయిలాపడితే బాగయ్యేదాకా భార్యకు వుద్యోగమిస్తారంట. ఆఫీసుకు పొయ్యి మేనేజరుసారును కలుద్దాం’ అని ‘అర్జెంటు పనుంది, రేప్పొద్దునొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.
మరుసటిరోజు పదిగంటలకు వీర్రాజు వచ్చేసరికి యశోద తయారుగా ఉంది. తన మోటారుసైకిలు వెనుక సీటు మీద యశోదను కూర్చోమన్నాడు. యశోద కదల్లేదు. ‘వెళ్లిరామ్మా’ అంది తలుపు వరకు వచ్చిన మణెమ్మ. ఇక తప్పదన్నట్టు ఎక్కింది. మేనేజరు కలుపుగోలు మనిషి. రైతుల బాధలు వినీవినీ అతని మొహం ముడతలు పడి విచారంగా మారిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది. ఆయన యశోదను పలకరించి, గంగారామ్ స్థితిపట్ల విచారం వెలిబుచ్చాడు. ‘గంగారామ్ లేకపోవడంతో నాకు కుడి భుజం విరిగినట్టుంది. మొన్నాదివారం మేమంతా వెళ్లి గంగారామ్‌ను చూసొచ్చాం. కోలుకునే అవకాశాలు బాగా వున్నాయని చెప్పాడు డాక్టరు. గంగారామ్ మంచివాడు, తప్పకుండా తిరిగొస్తాడు’ అన్నాడు.
గంగారామ్ ఇంటి పరిస్థితి, యశోదకు ఉద్యోగం ఇవ్వడం గురించి వీర్రాజు ప్రస్తావించాడు. మేనేజరు వీర్రాజువైపు తిరిగి కంపెనీ రూల్సు చెప్పి ‘గంగారామ్‌కి యివ్వగలిగినవన్నీ యిప్పటికే ఇచ్చేశాం. అతను ప్రాణాలతో వుండగా అతని బదులు భార్యకు వుద్యోగం రాదు. ఆమెకు మరోచోట ప్రయత్నిద్దాం.. యేదోవొకటి దొరక్కపోదు’ అని చెప్పలేక చెప్పాడు. అతని మాటలు విన్న యశోద మొహం పాలిపోయింది. కిటికీ వైపు తల తిప్పుకుంది. ఇంటికొచ్చాక జరిగిందంతా అత్తతో చెప్పి ఏడ్చింది యశోద. మరోవారం గడిచింది. గంగారామ్‌లో మార్పు లేదు. యశోదకు వీర్రాజు ద్వారా ఒక స్కూటర్ల డీలరు వర్కుషాపులో పొద్దున షిఫ్టులో క్లర్కుగా చిన్న వుద్యోగం దొరికింది.
ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆసుపత్రికి వెళ్తోంది. మణెమ్మ పిండి మిషనులో పనికి కుదిరింది. కానీ అనారోగ్యంతో అడపాదడపా మానేస్తోంది. అవసరాన్నిబట్టి వీర్రాజు తన మోటారుసైకిల్ మీద యశోదను ఇంటి దగ్గర దింపడమేకాక ఆసుపత్రిక్కూడా తీసుకెళ్తున్నాడు. ‘ఇరుగుపొరుగు తన గురించి ఏమనుకుంటున్నారో’ అని అత్త దగ్గర బాధపడింది యశోద. అలాంటివన్నీ పట్టించుకోవద్దని ఆమె ధైర్యం చెప్పింది. ఆ సాయంత్రం ఆసుపత్రి వరండాలో యశోద, పోలమ్మ ఇద్దరే ఉన్నారు. ‘మా ఆయన గురించి యీరోజు పెద్దడాక్టరు ముందు మాదిరి నమ్మకంగా చెప్పలేదు’ అంది యశోద ఆందోళనగా. ‘యీ వ్యాధి అట్లాటిది. యేమాటా చెప్పలేం. నువ్వు గుండెను రాయి జేసుకోవాల బిడ్డా. నీ మొగుణ్ణి దేవుడే తీసుకోనిపోతే అది నీ మంచికోసమే జేసినట్టు అర్థంజేసుకో. నువ్వు మీ ఆయన వుద్యోగంలో జేరి పిల్లల్ని వుర్దిలేకి తీసుకోనిరావాలని దేవుడి నిర్నయమనుకో, అంతే. నీ మొగుణికి బాగైనా కాళ్లూసేతులూ పని జెయ్యకపోతే యిద్దరాడబిడ్డలను పెట్టుకోని యెట్లబతుకుతావు? సక్కటి మనిసివి, యింగా యెంతో బతుకుండాది నీకు’ అంది పోలమ్మ నిర్వికారంగా.
ఆమె మాటలు వినలేనట్టుగా యశోద చేతులతో చెవులు మూసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా యశోద స్థిమితపడలేదు. ఆరాత్రి చిన్నకూతురు తలను వొళ్లో పెట్టుకుని ఆలోచిస్తూ గోడకానుకుని కూర్చుంది. చిన్నవుద్యోగంతో రోజు గడిచేది కష్టంగా వుంది. పిల్లలను చూస్తే ఆమెకు బాగా బతకాలన్న కోరిక పెరుగుతోంది. ‘బతికేదానికి కోరికే మూలమ’నేవాడు గంగారామ్. అతనికి కోరిక తగ్గిపోయి అట్లా ఐపోయినాడా?’ తన ఈ పరిస్థితికి ముగింపెప్పుడో, ఎలా వుండబోతోందో ఆమెకు అంతుబట్టలేదు. వొళ్లు నొప్పులతో నిద్రపట్టక కదులుతున్న మణెమ్మ లేచివెళ్లి మంచినీళ్లు తాగి కోడలి దగ్గరికొచ్చింది. ‘జరిగేదాకా సత్తెమేదో యెవురికీ తెలీదు. సెడాలోశనలకు దుడుకెక్కువ, వొద్దన్నా వస్తాయి. ఐనా మంచిమాటే అనుకోవాల’ అంటూ కోడలి తలమీద చేత్తో రాసింది మణెమ్మ.
యశోద చివుక్కున తలెత్తి చూసింది. ‘దేవుడెట్టా రాసిపెట్టి వుంటే అట్టా జరుగుతుంది తల్లీ’ అంది మణెమ్మ వెళ్లి పడుకుంటూ.యశోదను ఆలోచనలు వదల్లేదు. ‘పోలమ్మ చెప్పింది సరైందేనా? బతకడం బరువైనప్పుడు యెవరైనా అట్లాగే ఆలోచిస్తారా? నిజంగా తను దేనికోసం ఎదురుచూస్తావుంది?’ ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె తలలో కదులుతున్న చిత్రమాలికలో మధ్యమధ్యన వీర్రాజు మోటారుసైకిలు మీద వచ్చిపోతున్నాడు. చేతులతో తలను నొక్కిపట్టుకుని పడుకుంది. ఆ తరువాతెప్పుడో గాని ఆమెకు నిద్రపట్టలేదు. రెండువారాలు గడచిపోయాయి. ఈ మధ్యలో ఒకరోజు కోమావార్డులో ఐదోనెంబరు మంచం మీదుండిన కోటయ్యకు తెలివొచ్చి జనరల్ వార్డుకు మార్చారు. ఆయన పిల్లలు సంతోషంగానే కనబడ్డారు. ‘అందురికోసం పైకి సంతోసంగా కనబడినా మొదుట్లో యిసుక్కున్నారు, నేను జూసినా’ అని చెప్పింది పోలమ్మ.
ఆ తరువాత రెండురోజులకు పోలమ్మ భర్త చనిపోయాడు. ఆసమయంలో యశోద అక్కడలేదు. ఆమె తన భర్త మరణాన్ని ఎలా తీసుకుందో తెలియలేదు. కాలక్షేపంగా వుండిన పోలమ్మ వెళ్లిపోయినందుకు యశోదకు దిగులేసింది. గంగారామ్ పైకి బాగానే కనపడుతున్నా రోజురోజుకీ డాక్టర్లు అతని గురించి ఆందోళనగా మాట్లాడ్డం పెరిగింది. నిస్పృహలోకి జారిపోకుండా పంటి బిగువున ఆపుకోవాల్సి వస్తోంది యశోదకి.
ఒక మధ్యాహ్నం వర్క్‌షాపులో మిగిలిపోయిన పని చేసుకుంటున్న యశోదకు వెంటనే రమ్మని ఆస్పత్రి నుంచి ఫోనొచ్చింది. కాళ్లుచేతులు ఆడక వీర్రాజుకు ఫోన్ చేసింది. అరగంటలో వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే గంగారామ్ ప్రాణాలు పోయాయి. గుండె ఆగి చనిపోయాడని చెప్పారు. యశోద కుప్పకూలిపోయింది. పెద్ద డాక్టరు, పెద్దస్వామీజీ వచ్చి ఆమెకు ఓదార్పు మాటలు చెప్పారు. యశోద అచేతనంగా ఐపోయింది. వీర్రాజే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు.
పదహైదురోజులు పోయాక ఒక సాయంత్రం వీర్రాజు కొన్ని కాగితాలు తీసుకుని యశోద యింటికొచ్చాడు. యశోద ఇంకా అన్యమనస్కంగానే ఉంది. ‘గంగారామన్న డెత్ సర్టిఫికెట్టు, కావలసిన యితర కాగితాలన్నీ తీసుకొచ్చినాను. ఆయన వుద్యోగాన్ని నీకిమ్మని అడుగుతా మేనేజరు సాయంతో యీ దరఖాస్తు తయారు చేసినాను. నువ్వు సంతకం పెట్టిస్తే మూణ్ణెల్ల లోపలే నీకు వుద్యోగం వచ్చేట్టు చూస్తాను’ అని పేపర్లు యశోదకిచ్చాడు వీర్రాజు.
యశోద కళ్లల్లో నీళ్లు బొటబొటా కారాయి. చివుక్కున తలపైకెత్తి ‘ఆయన పోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు, ఆ వుద్యోగం నాకొద్దు’ అంటూ వీర్రాజువైపు పేపర్లు విసిరేసి ‘నేనేదన్నా వేరేపని చూసుకుంటా. యింకెప్పుడూ నన్ను కలవొద్దు’ అని మొహం తిప్పుకుని లోపలికి వెళ్లిపోయింది యశోద. మణెమ్మ వొంగి పేపర్లన్నీ ఏరుకుని ‘రేపు నేను నచ్చజెప్పి సంతకం జేయించి పంపిస్తా, నువ్వేమనుకోవద్దు బాబూ’ అంది అనునయంగా. వీర్రాజు చాలాసేపు కొయ్యబారిపోయినట్టుగా అలా నిలబడేవుండిపోయాడు.
- డాక్టర్ కెవి రమణరావు
Comments
Please login to add a commentAdd a comment