నటి కీర్తి సురేష్ అందమైన నటి అంతకుమించిన అభినయం ఈమెకు ఆభరణం. కుటుంబ కథాచిత్రాలకు, ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన ఈ బ్యూటీ మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. తర్వాత కొన్ని గ్లామర్ పాత్రలోనూ నటించి తన సత్తాను చాటుకున్నారు. కాగా గత నెల 11వ తేదీన తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త చిత్రం ఏదీ కమిట్ కాలేదు.
దీంతో ఈమె నటనకు విరామం పలికినట్లు ప్రచారం అందుకుంది. కాగా కీర్తి సురేష్ చివరిగా నటించిన చిత్రం బేబీ జాన్. ఈమె నటించిన తొలి హిందీ చిత్రం ఇదే. అయితే ఈ చిత్రంలో నటించి ఉండేదాన్ని కాదని కీర్తి సురేష్ ఇటీవల ఒక భేటీలో పేర్కొనడం విశేషం. దీని గురించి ఆమె తెలుపుతూ ఇంతకుముందు తమిళంలో తను నటించిన 'రఘు తాత' చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకునే తీరాలంటూ ఒత్తిడి చేయడాన్ని తప్పు అనే ఇతివృత్తంతో రూపొందించినట్లు చెప్పారు. ఆ చిత్ర ట్రైలర్‌లో హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్ చోటు చేసుకుందన్నారు.
తమిళ ప్రేక్షకులు పలువురు రఘు తాత చిత్రంలో కీర్తి నటించినందుకు ఎంతగానో ప్రశంసించారన్నారు. కాగా ఆ వెంటనే తాను బేబీ జాన్ అనే హిందీ చిత్రంలో నటించడం జరిగిందన్నారు. దీంతో హిందీ భాషకు వ్యతిరేక రూపొందిన కథ చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బాలీవుడ్‌లో ఎంట్రీ అయ్యావు అంటూ పలువురు హిందీ ప్రేక్షకులు విమర్శించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. తాను హిందీ భాషకు వ్యతిరేక కథా చిత్రంలో నటించలేదని, హిందీ భాషను కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ తీసిన చిత్రంలోనే నటించానని చాలా భేటీల్లో చెప్పానన్నారు. అసలు ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగా ఊహించి ఉంటే బేబీ జాన్ చిత్రంలో నటించేదాన్నే కాదని నటి కీర్తి సురేష్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment