మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి.. ఈ వారం కథ | Sakshi Funday Story By Mohammed Anwar | Sakshi
Sakshi News home page

మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి.. ఈ వారం కథ

Published Sun, Jun 19 2022 7:31 PM | Last Updated on Sun, Jun 19 2022 7:31 PM

Sakshi Funday Story By Mohammed Anwar

సూరీడుతో పాటు ఓ వార్త భళ్లుమనడంతో... తెల్లారింది. పేపర్‌ ఫ్రంట్‌ పేజీలో పెద్ద పెద్ద ఫొటోలతో ప్రత్యక్షమయ్యాడు ... మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి. టీవీలో ప్రతీ చానల్‌లోనూ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ ... మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి. వాట్సప్‌ గ్రూపుల్లోనూ అదే పేరు కూస్తోంది. కానీ నాకే ఆ వార్తలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆ న్యూసు నాన్సెన్సులా వినిపిస్తోంది.

‘ఏవండోయ్‌.. విన్నారా.. మీ ఫ్రెండు పీటర్‌ శాస్త్రి ఏం చేశాడో...’ ఆనందాన్ని నటిస్తూ, అసూయని లోలోపల దాచేస్తూ.. అయోమయంగా అంది మా ఆవిడ. మహహ్మద్‌... పీటర్‌.... శాస్త్రి... వాడు నా ఫ్రెండా... శత్రువా..?  ఫ్రెండే అయితే... వాడి పేరు చెప్పగానే ఎందుకు మనసు కుతకుత లాడుతోంది? శత్రువు అయితే వాడెప్పుడు ఏం చేస్తాడో తెలుసుకోవాలన్న ఆత్రుత ఎందుకు పెరుగుతూ పోతుంటుంది? పేపర్లో హెడ్డింగులు బ్లరైపోయి, టీవీలో వార్తలు సైడైపోయి... ఇప్పుడు నా మనసంతా పీటర్‌ శాస్త్రినే ఆక్రమించుకున్నాడు.. నన్నో నలభై ఏళ్లు వెనక్కి లాక్కెళ్లాడు.

అప్పుడు నాకు పద్నాలుగేళ్లుంటాయేమో..! ఇప్పటిలా కాదు కానీ... ఆరోజు భళ్లుమనకుండానే తెల్లారింది. లేచిన వెంటనే తూర్పు వైపున్న కిటికీ తెరిచి ఉదయాల్ని కళ్లార్పకుండా చూడడం నా అలవాటు. ఇంటి పక్కనే ఓ వేప చెట్టు ఉంది. వేప చెట్టు గాలి ఒంటికి మంచిదని నాన్న చెప్పేవాడు. ఆరోజూ అలానే పచ్చటి గాలి కోసం కిటికీ తెరిస్తే... సూరీడితో పాటు చురుక్కుమనే శాల్తీ ఒకడు కనిపించాడు. అప్పటి నుంచి ప్రతీసారీ... వాడివైపు చూస్తూనే ఉన్నాను.

నేను చూడడం కాదు. వాడే నా చూపుల్నీ, ఆలోచనల్నీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. వాడికీ నా అంత వయసుంటుంది. సన్నగా రివటలా ఉన్నాడు. ఒంటిమీద చొక్కా లేదు. పొట్ట లోపలకు వెళ్లిపోవడం వల్ల మొలతాడు వదులయ్యిందేమో.. మాటి మాటికీ నిక్కరు జారిపోతూ ఉంది. ఆ వేప చెట్టు అరుగున.. అట్ట ముక్కల్ని పేర్చి, కొబ్బరాకులు అమర్చి.. ఓ కుటీరంలా మారుస్తున్నాడు. పొద్దుట నుంచి కష్టపడుతున్నాడనడానికి సాక్ష్యంలా.. ఒంటి మీద నుంచి చెమట ధారలా కారుతోంది. వాడెవడో, వేప చెట్టు కింద ఏం చేస్తున్నాడో... తెలుసుకోవాలనిపించింది.

‘ఏరా.. పొద్దుటే ఎక్కడికి.... పళ్లు కూడా తోముకోకుండా..’ అంటూ అమ్మ అడ్డు పడుతున్నా పరుగున వెళ్లా.
‘ఏయ్‌.. ఎవడ్రా నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావ్‌?’ పెద్ద మనిషి తరహాలో గొంతు పెంచి అడిగా.
ఓ కొబ్బరాకు భుజాన వేసుకుని... నా వైపు నవ్వుతూ చూశాడు.
‘ఏం చేస్తున్నావ్‌.. అని అడుగుతున్నా..’
‘ఇల్లు కడుతున్నానండీ...’ మళ్లీ అదే నవ్వు.
‘ఇల్లా.. ఎందుకు? నువ్విక్కడ ఉంటావా..?’
‘ఆయ్‌.. ప్రెసిడెంటు గారిని అడిగానండీ.. ఇక్కడ ఉండు పర్లేదు అన్నారండీ.. ఇక నుంచి ఇదే నా ఇల్లు..’
నాకేం అర్థం కాలేదు. రెండు అట్టముక్కలు పేర్చి.. దానిపై కొబ్బరాకులు పడేస్తే ఇల్లయిపోతుందా..? మా ఇంటివైపు చూశా. విశాలమైన ఆరు గదుల పెంకుటిల్లు. ఎంచక్కా మా చుట్టాలంతా వచ్చినా... ఇంకో గది ఖాళీగానే ఉంటుంది. ఇల్లంటే అది. వీడేంటి..?  దీన్ని పట్టుకుని ఇల్లంటాడేంటి?
‘ఇంతకీ నీ పేరేంటి..?’
‘మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి..’
అంత విచిత్రమైన పేరు వినడం అదే మొదటి సారి. చనిపోయేలోగా మళ్లీ ఇలాంటి పేరు వినను కూడా. అది నాకు గ్యారెంటీగా తెలుసు. అప్పటి నుంచీ ఆ పేరు నా చెవిలో మార్మోగుతూనే ఉంది.
‘మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రా..’
‘అవునండీ.. నేనే పెట్టుకున్నానండీ..’
‘నువ్వు పెట్టుకోవడం ఏమిటి? అమ్మానాన్న పెడతారు కదా..’
‘నాకు అమ్మా నాన్న లేరండీ..’
ఆ మాట అనగానే నాక్కొంచెం జాలేసింది. నేను వాడి మీద జాలిపడడం అదే మొదటి సారి.. అదే చివరి సారి. అయినా వీడిమీద జాలెయ్యడం ఏమిటి.. ఛీఛీ అనుకుని జాలిపడడం మానేశా. అదేంటో అప్పటి నుంచీ.. ఎవ్వరిపైనా జాలి కలగడం లేదు.
‘అదేం పేరు..?’
‘యాండీ.. బాగుంది కదా..?’అనేసి మళ్లీ తన పనిలో పడిపోయాడు.
‘నాకెవరూ లేరు కదండీ.. ఎక్కడికి వెళ్లినా.. నీ పేరేంటి? నీ పేరేంటి? అనే అడుగుతున్నారండీ.. ఏం పేరు పెట్టుకోవాలో తెలీక ఇలా పెట్టేసుకున్నానండీ..’ తను మాట్లాడుతూనే పని చేసుకుంటున్నాడు. పని చేస్తూనే మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఓ చిన్న ఇల్లు తయారైపోయింది. పక్కింటి రత్తమ్మత్త, వాళ్లింట్లో పనిచేసే ముత్యాలు... నోరెళ్లబెట్టుకుంటూ వచ్చేశారు.
‘ఓరి భడవా... భలే కట్టేశావురా.. అట్టముక్కల ఇల్లు..’ అంది రత్తమ్మత్త మెచ్చుకోలుగా.
‘మాకోగది అద్దికిస్తావేంటబ్బాయ్‌...’ అని ముత్యాలు నవ్వేసింది.
‘అమ్మా – నాన్న లేరటగా.. ఇంత చిన్న వయసులో ఎంత కష్టమొచ్చిందయ్యా... సర్లే పనయ్యాక.. ఇంటికి రా... అట్టు ముక్క పెడతా. కొబ్బరి పచ్చడితో తిందువు గానీ’ అంది రత్తమ్మత్త.
‘వస్తాను గానండీ.. నాకేదైనా పని చెప్పండి. చేస్తా.. ఊరికనే అట్టు ముక్కొదు..’
‘ఆత్మాభిమానం ఎక్కువే పిలగాడికి.. సరేలే.. దొడ్లో డొక్కలున్నాయి... ఎండకేద్దువు గానీ.. రా..’ అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ వెనకే ముత్యాలు కూడా.
‘ఆత్మాభిమానం...’ ఈ మాట కూడా నేను మొదటిసారే విన్నా. కానీ... అప్పటి నుంచీ ఆ మాటకు మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి కేరాఫ్‌ అడ్రస్సయిపోతాడని ఆ సమయంలో నాకు తెలీదు.

మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి అనేవాడు ఒకడొచ్చాడని... వాడు వేప చెట్టుకింద ఇల్లే కట్టేశాడన్న సంగతి ఊరంతటికీ తెలిసిపోయింది.
‘ఆడెవడో, ఎక్కడ్నుంచి వచ్చాడో  తెలీకుండా.. అక్కడ చోటెందుకు ఇచ్చారు’
‘ప్రెసిడెంటు గారు మంచి పనే చేశార్లే’
‘అలాంటోళ్లని చేరనివ్వకూడదండీ..’
ఇలా తలో మాట. కానీ అందరూ అవాక్కయిన మూకుమ్మడి విషయం... ఆ పేరు.

‘మూడు మతాల్నీ చుట్టగా చుట్టి తన పేరుకి కట్టేశాడు’ అని నాలానే అంతా నవ్వుకుంటూ ఆశ్చర్యపోయారు. వాడి పేరే కాదు.. తీరు ఇంకా గమ్మత్తుగా ఉండేది. పొద్దుటే లేచి సూర్య నమస్కారాలు చేసేవాడు. ఆ పక్కనే రాములోరి గుళ్లో ప్రవచనాలు చెబుతుంటే.. వాలిపోయి ‘ఊ’ కొట్టేవాడు. అయిదు పూటలా నమాజ్‌ చదివేవాడు. ఆదివారమైతే చర్చి వదిలేవాడే కాదు. ఎనిమిదో తరగతి చదువుతూ.. చుట్టుపక్కల ఏడో తరగతి వరకూ పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ‘ఈ పూట మా ఇంట్లో భోంచేద్దువు గానీ..’ అని ఎవరు ఎంత బలవంతం పెట్టినా, ‘ఏదైనా పన్జెప్పండి.. అప్పుడు తింటా’ అనేవాడు.

బజారుకెళ్లి సరుకులు తెచ్చేవాడు. పాలు పితికే వాడు. పేడ పిసికి పిడకలు కొట్టేవాడు. వాడు చేయని, వాడికి చేతకాని పనంటూ ఉండేది కాదు. ఒక్కోసారి అలానే ఖాళీ కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకునేవాడు.
‘ఏరా... భోం చేశావా...’అని ఎవరైనా అడిగితే...

‘రత్తమ్మత్త నూతిలో నీళ్లు తీయగుంటాయని అందరూ చెబితే నమ్మలేదండీ.. నిజంగా ఎంత తీపో.. తాగుతూనే ఉన్నా. అలా... రెండు చేదల నీళ్లు తాగానా..అంతే... కడుపు నిండిపోయిందండీ..’ అని ఆకలికి కూడా రంగులద్ది.. సీతాకోక చిలుకలా ఎగరనిచ్చేవాడు. పేదరికాన్ని కూడా పండగలా చేసుకునేవాడు.
‘చూడ్రా ఆ శాస్త్రి.. ఎంత బుద్ధిగా చదువుకుంటున్నాడో.. చూసి నేర్చుకోరా..’ అని అమ్మ ఎప్పుడూ నన్నే తిట్టేది. నా దగ్గర కొత్త కొత్త పుస్తకాలు, ఖరీదైన పెన్నులూ ఉండేవి. వాడి దగ్గర చదువుండేది.

నేను సైకిలు కొనుక్కొని, తొక్కుతుంటే రాని ఆనందం.. వాడు టైరాట ఆడుతూ అలిసిపోయినప్పుడు చూశాను. ఆ అట్టపెట్టెల ఇంట్లో కాలు మీద కాలేసుకుని.. కొబ్బరాకుల సందుల్లోంచి ఆకాశం వైపు చూస్తూ.. నవ్వుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటుంటే.. మా ఆరుగదుల పెంకుటిల్లు కూడా ఇరుగ్గా అనిపించేది.
అదేంటో గానీ.. వాడి పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు చెరిగేది కాదు.
‘నువ్వెప్పుడూ బాధపడవా...’ అడిగానోసారి.

‘బాధ పడకూడదండీ... పడితే పడిపోయినట్టేనండీ... మళ్లీ లెగమండీ.. అలాంటప్పుడు ఎందుకు బాధ పడాలండీ. కష్టాలేం చుట్టాలు కాదండీ. బొట్టు పెట్టి రమ్మనడానికి. అయినా నాకు చుట్టాలూ లేరండీ.. కష్టాలూ వద్దండీ..’ అంటూ బరువైన మాటల్ని తేలిగ్గా చెప్పేసేవాడు.

ఎందుకో పిల్లలంతా వాడి వెనకే ఉండేవాళ్లు. అది నాకు సుతరామూ నచ్చేది కాదు. చాక్లెట్లు, బిస్కెట్లు, పుల్లయిసులూ.. పిప్పరమెంట్లూ.. ఇచ్చి వాళ్లందరినీ మచ్చిక చేసుకుందామనుకునేవాడ్ని. కానీ వాడు.. పచ్చి మామిడిని సన్నగా తరిగి.. ఉప్పు కారం చల్లి.. తీసుకొచ్చేవాడు. నేరేడు పళ్లు కోసుకొచ్చేవాడు. రేగుపళ్లు, ఉసిరి కాయలైతే సరే సరి. వాడికంటూ మిగుల్చుకోకుండా అందరికీ పంచేవాడు. అందుకే అందరికీ ఫ్రెండయిపోయాడు. నాకు తప్ప. ఏళ్లు గడుస్తున్నాయి.. వాడూ పాతుకుపోతున్నాడు. ఆ వేప చెట్టుకంటే విశాలంగా విస్తరిస్తున్నాడు. వాడిమీద ఒక్కసారైనా గెలవాలని ఉండేది. వాడి దగ్గర లేనిది.. నా దగ్గర ఉన్నది డబ్బొక్కటే. దాంతో గెలిస్తే..?

దీపావళి వచ్చింది. పీటర్‌ శాస్త్రిని ఓడించేందుకు ఇదే తగిన అవకాశం. నాన్న దగ్గర అరచి గోల పెట్టి మరీ... డబ్బులు లాక్కొన్నా. డిబ్బీ పగలగొట్టా. బజారుకు వెళ్లి..  ఓ బస్తాడు బాణసంచా కొనుక్కొచ్చా. కాకరపువ్వొత్తులు, మతాబులు, లక్ష్మీ బాంబులు ఒక్కటేంటి..? ఓ దుకాణమే నా దగ్గరుంది. వాడి దగ్గరేముంది..? వెళ్లి చూస్తే.. తాటాకులు తెంపుతూ, పేపర్లు చిన్నగా చింపుతూ కనిపించాడు.
‘ఏం చేస్తావ్‌ వాటితో..’
‘ఈ తాటాకులతో పెటేపు కాయలు..ఈ కాగితాలేమో సిసింద్రీల కోసం’
‘ఓస్‌ అంతేనా.. నా దగ్గర బోలెడన్ని సరుకులున్నాయి..’ అని సంబరపడుతూ ఇంటికొచ్చేశా. అరగంటలో.. అన్నీ ఊది పడేశా. 
‘కొన్నయినా దాచుకోరా.. నాగుల చవితికి కాల్చుకుందువు గానీ...’ అని అమ్మ అన్నా వినిపించుకోలేదు. కానీ.. ఎందుకో ఏ ఆనందమూ లేదు. పీటర్‌ శాస్త్రి గుర్తొచ్చాడు. కిటికీ తలుపు తెరచుకొంది. నిప్పుల్లో కాలిన కొబ్బరి డొక్కని బాగా ఊది, పెటేపు కాయ ఒత్తి వెలిగాక.. దూరంగా విసిరేస్తున్నాడు. ఆ శబ్దానికి వీధి వీధింతా... దద్దరిల్లుతోంది.

‘పీటర్‌ శాస్త్రి పెటేపు కాయలు బాగా పేల్తున్నాయ్‌రోయ్‌’ అంటూ చుట్టుపక్కల పిల్లలంతా వాడి దగ్గరకు చేరిపోయారు. వచ్చినవాళ్లందరికీ తన దగ్గరున్న పెటేపుకాయలు కట్టలు కట్టలుగా పంచుతూనే ఉన్నాడు. సిసింద్రీలు నేలమీద దూసుకుపోతున్నాయి. పిల్లలంతా గాల్లో ఎగురుతున్నారు. అప్పుడు అనిపించింది. పండగంటే – పంచుకునేది. కొనుక్కొని దాచుకొనేది కాదు అని. ఈసారీ వాడే గెలిచాడు. దీపావళే కాదు.. అన్ని పండుగలూ అంతే. ప్రతీ పండక్కీ నా దగ్గర కొత్త బట్టలు మాత్రమే ఉండేవి. వాడు మనిషే కొత్తగా కనిపించేవాడు. రంజాన్‌కి పూర్ణాలు పంచిపెట్టేవాడు. క్రిస్మస్‌కి పులిహోర చేసేవాడు. శ్రీరామనవమికి సేమ్యా. తీసుకొనేటప్పుడు పడే ఇబ్బంది.. ఇచ్చే దగ్గర వచ్చేది కాదు.
‘రేపటికి ఉంచుకోవచ్చుగా.. ఎందుకు ఈరోజే ఖర్చు పెట్టేసుకుంటావ్‌..’ అని ఎవరైనా అంటే..
‘ఈరోజు హాయిగా గడిచిపోతోంది కదండీ.. రేపు ఎలాగూ సంపాదించుకుంటా కదా..’ అనేవాడు. వాడి కష్టమ్మీద వాడికంత నమ్మకం.
‘పెద్దయ్యాక ఏం చేస్తావ్‌..’
‘బాగా కష్టపడి.. డబ్బులు సంపాదిస్తానండీ.. సంపాదించి.. మళ్లీ అందరికీ పంచిపెట్టేస్తానండీ.. మళ్లీ ఇదిగో ఈ చెట్టుకిందకే వచ్చేస్తానండీ..’
‘సంపాదించడం ఎందుకు.... అదంతా మళ్లీ ఇచ్చేయడం ఎందుకు?’
‘మరి దాచుకోడానికేంటండీ... దాచుకుని ఏం చేస్తామండీ.. నా చేతిలో డబ్బులుంటే నేను బాగుంటానండీ. అదే పంచేస్తే.. అందరూ బాగుంటారండీ. అయినా డబ్బుంటే సుఖాలుంటాయండీ.. అనుభవాలు ఉండవండీ. నా దగ్గర ఏమీ లేనప్పుడు రూపాయి సంపాదించినా ఆనందంగానే ఉంటుందండీ.. లక్ష రూపాయలు ఉంటే, మరో లక్ష సంపాదించినా.. తృప్తి ఉండదండీ.. ఏమీ లేకపోవడంలోనే ఎంతో ఉంటుందన్న ఫీలింగ్‌ ఉంటుందండీ..’
‘అంతా ఇలానే చెబుతారు’
‘నేనలా కాదండీ..  అయినా మీరే చూస్తారుగా..’

ఓసారి రత్తమ్మత్త ఆ అట్టముక్కల ఇంట్లోకెళ్లి రావడం చూశాన్నేను. అప్పుడు... శాస్త్రి లేడు.
‘ఏంటత్తా... గాలి ఇటు మళ్లింది.. శాస్త్రి లేడు కదా.. లోపల ఏం చేస్తున్నావ్‌...’ అంటూ ఆరా తీశా.
‘ఓ అదా.. పొద్దుట కొబ్బరుండలు చేశా.. వాడికి అవంటే చాలా ఇష్టం. కుర్ర సన్నాసి.. చేతికిస్తే తీసుకోడు.. ‘‘ఏదైనా పని చెప్పత్తా..’’ అంటాడు.. చదువుకునే కుర్రాడు. ఇంటి పని, దొడ్డి పనీ చేస్తుంటే మనసు అదోలా ఉంటుంద్రా.. అందుకే.. వాడు లేనప్పుడు... ఇంట్లో పెట్టి వచ్చేశా.. వెధవ.. ఇవి కూడా తినడు.. ఎవరికో ఒకరికి పంచేస్తాడు. అయినా వాడేం పిల్లాడో.. ఇంత చిన్న వయసులోనే ఇవ్వడం నేర్చేసుకున్నాడు. ఇన్నేళ్లొచ్చినా.. అదేమిటో నాకింకా అర్థమే కాలేదు..’
‘అయినా శాస్త్రంటే.. మా దొడ్డ ఇష్టం కదా..’ కుళ్లుకుంటూనే అడిగా. కానీ అత్త అది గమనించలేదు.

‘నాదేముందిరా.. మనుషుల్ని ఇష్టపడడంలో వాడి తరవాతే ఎవరైనా. వాడికంటే చిన్నవాళ్లనైనా..‘‘ మీరు.. అండీ..’’ అంటూ  మర్యాదగా పిలుస్తాడెందుకో తెలుసా? అది నీమీదో, నామీదో ఉన్న ఇష్టం కాదు. వాడికి మొత్తంగా మనుషులంటేనే ఇష్టం.. పిచ్చి. మొన్న నాకు మశూచి వచ్చిందా.. ఎన్ని సేవలు చేశాడో. అరె.. ఇది అంటు వ్యాధిరా.. వద్దురా.. అన్నా వినలేదు. ఆఖరికి మా ఆయన కూడా.. నేనున్న గదికి వచ్చేవాడు కాదు.. వాడొచ్చాడు.. ‘‘అత్తా.. అత్తా’’ అంటూనే ఓ అమ్మలా సేవ చేశాడు.. ఏమిచ్చి.. వాడి రుణం తీర్చుకోను..’ అత్త కళ్లల్లో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయ్‌. ‘మహమ్మద్‌ పీటర్‌ శాస్త్రి.. అని పెట్టుకున్నాడు గానీ... వాడికి ఏ మతం అంటలేదు. మనిషే గట్టిగా అంటేసుకున్నాడు.. అందుకే మనుషుల్ని వాడలా ప్రేమిస్తూనే ఉంటాడు.. నిజంగా వాడికి అమ్మనైపోతే బాగుంటుంది అనిపిస్తుందిరా... ఉత్తినే అన్నం పెట్టినా తీసుకోనోడు... ఏకంగా అమ్మనైపోతానంటే.. ఒప్పుకుంటాడా.. దానికీ అదృష్టం ఉండొద్దూ..’ అని చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ మాట చెప్పింది. ‘చాలా మంది దగ్గర డబ్బుంటుందిరా.. అదొక్కటే ఉంటుంది. కానీ వాడి దగ్గర డబ్బు మాత్రమే లేదు.. అన్నీ ఉన్నాయ్‌’ 
ఆ మాటెందుకో నాకు చురుక్కున తగిలింది.

పదో తరగతిలో వాడే ఫస్టు. ఇంటర్‌లోనూ అంతే. అన్నింటా వాడే. వాడికి తెలియని సబ్జెక్టు లేదు. వాడి మేధస్సుకి తలొంచని డిగ్రీ లేదు. డబ్బే డబ్బుని కూడబెడుతుందటారు. అలానే వాడి చదువే వాడ్ని చదివించింది. స్కాలర్‌షిప్పులు తెచ్చుకున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు. కంపెనీలు పెట్టాడు. కోటాను కోట్లు సంపాదించాడు. అంతా చేసి.. ఇంతా సంపాదించి.. మొత్తం.. మళ్లీ పేద ప్రజలకు విరాళంగా రాసిచ్చేశాడు. ఒక్క పైసా.. ఒక్క పైసా కూడా తన దగ్గర ఉంచుకోలేదు. తన ఆస్తినంతా పేదలకు ధారాదత్తం చేసిన మహోన్నతుడిగా.. ప్రపంచం మొత్తం పీటర్‌ శాస్త్రిని కీర్తిస్తోందిప్పుడు.

‘ఆఖరికి మీ సొంతిల్లు కూడా డొనేట్‌ చేసేశారు. ఇప్పుడు ఎక్కడుంటారు?’ టీవీ చానల్‌ రిపోర్టర్‌ అడుగుతున్నాడు.
‘నా జీవితం.. ఓ వేప చెట్టుకింద.. అట్ట పెట్టెల ఇంట్లో మొదలైంది.. ఇప్పుడు అక్కడికే వెళ్లిపోతున్నా.. అక్కడ నా స్నేహితుడు ఒకడు నా కోసం ఎదురు చూస్తుంటాడు..’ అని నవ్వుతూ నమస్కారం పెట్టాడు మహహ్మద్‌ పీటర్‌ శాస్త్రి. పద్నాలుగేళ్ల వయసులో నేను చూసినప్పటి నవ్వది. ఇంకా చెక్కు చెదరలేదు. ఆ స్వచ్ఛత ఎక్కడికీ పోలేదు. నాకు తెలుసు. ఇంకో వందేళ్లయినా అది వాడ్ని విడిచిపెట్టి పోదు. మేడల్లో మిద్దెల్లో, ఏసీ రూముల్లో వాడెంత సంతోషంగా గడిపాడో నాకు తెలీదు.

కానీ ఈ చెట్టు కింద వాడింకా ఆనందంగా బతికేస్తాడు. టీవీ ఆఫ్‌ చేసి.. కిటికీ తలుపు తెరిచాను. వేప చెట్టు అలానే.. దృఢంగా నిలబడి మహ్మద్‌ పీటర్‌ శాస్త్రి కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వాడికీ నాకూ ఉన్న తేడా నాకు మరోసారి తెలిసొచ్చింది. సంపాదించింది వదలుకోవడానికి ఆకాశమంత మనసు కావాలి. జీవితం మొదలెట్టిన చోటికే మళ్లీ రావడానికి ధైర్యం ఉండాలి. పరుగు ఎక్కడ మొదలెట్టాలో కాదు. ఎక్కడ ఆపాలో తెలిసుండాలి. ఇవన్నీ పీటర్‌ శాస్త్రి చేసేశాడు. అన్నట్టే మళ్లీ ఇక్కడకి తిరిగి వస్తున్నాడు. ఈసారి ఇంకెన్ని పాఠాలు నేర్పుతాడో.. ఇంకెన్ని అనుభవాలు అందిస్తాడో..? -మహమ్మద్‌ అన్వర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement