శారద సాక్షాత్కారం | Special story on Adinatha temple | Sakshi
Sakshi News home page

శారద సాక్షాత్కారం

Published Sun, Mar 4 2018 8:25 AM | Last Updated on Sun, Mar 4 2018 8:25 AM

Special story on Adinatha temple - Sakshi

నమ్మాళ్వార్‌ పుట్టిన చోటు, పెరిగిన చింత చెట్టు, ఆదినాథుని ఆలయం అన్నీ ఉన్న తిరునగరికి చేరారు. నమ్మాళ్వార్‌ను ధ్యానించారు. నమ్మాళ్వార్‌ జన్మించిన స్థలంలో వైష్ణవం సుస్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ శిష్యగణాన్ని విస్తరింపచేశారు. అక్కడినుంచి రామానుజుని జైత్రయాత్ర కేరళ ప్రాంతానికి మళ్లింది. తిరువాన్‌ పరిశరం, తిరువట్టార్‌ నారాయణ దివ్యదేశాలను చూశారు. తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభుని మూడు ద్వారాల ద్వారా దర్శించుకున్నారు. రామానుజుడికి స్వాగతం చెప్పి తిరువనంతపురం రాజసభలో పండితగోష్టి ఏర్పాటు చేశారు. వాద ప్రతివాదాల తరువాత రామానుజ విజయం సిద్ధించింది. భక్తి ప్రపత్తులకు సంపూర్ణ శరణాగతికి అత్యున్నత స్థాయిని కల్పించే దివ్యమైన వైష్ణవం పట్ల రాజు ఆకర్షితుడైనాడు.

రాజుతోపాటు ఆయనను ఆశ్రయించిన పండితులు కూడా వైష్ణవులై రామానుజ దీక్ష తీసుకున్నారు. ఒక విశాలమైన రామానుజ మఠాన్ని తిరువనంతపురంలో నెలకొల్పారు. పడమట సముద్రతీరం నుంచి ఉత్తరదేశ యాత్ర ప్రారంభించారు రామానుజులు. సముద్రం వెంట ప్రయాణిస్తూ తీర పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ ద్వారకాధీశుని సేవించుకున్నారు. వస్త్రధామమైన ద్వారకాపురిలో శ్రీకృష్ణమంత్రాన్ని జపించారు.  అక్కడినుంచి మధుర, బృందావనం, గోవర్ధన గిరి, నందవ్రజం తదితర క్షేత్రాలను సందర్శించారు. అక్కడినుంచి నేపాల్‌ రాజ్యానికి వెళ్లి ముక్తినాథుడు, సాలగ్రామం, సాకేతపురం, మళ్లీ హిమాలయాలవైపు మళ్లి నర నారాయణగిరులతో విరాజిల్లే బదరికాశ్రమానికి వెళ్లారు, దిగువకు వచ్చి సనాతన దివ్యదేశమూ హరి అరణ్యరూపమై వెలసిన నైమిశారణ్య క్షేత్రానికి చేరుకున్నారు. పుష్కరం చూసి, అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలాన్ని స్పృశించి, బాలరాముని మనసారా సేవించుకున్నారు. ఉత్తరాదిలో కూడా అనేకానేక రామానుజ పీఠాలను స్థాపించారు. నారాయణాలయాలను నిర్మించారు.

అక్కడినుండి మళ్లీ కాశ్మీర దేశానికి బయలుదేరారు. శారదాపీఠాన్ని చేరారు. భట్టిమంటపానికి వెళ్లారు. అక్కడ చర్చాగోష్టి ముగిసిన తరువాత బయటకు వెళుతుండగా ధవళ వస్త్రధారియైన ఒక స్త్రీమూర్తి దివ్యమంగళ రూపంతో ఎదురుగా నిలబడింది. ఆమె తిరు (శ్రీ) ముఖ మండలం తేజస్సులీనుతున్నది.
‘తస్యయదా కప్యాసం పుండరీక మేవ మక్షణీ’ అనే శ్రుతివాక్యానికి  నీవిచ్చిన అన్వయం, సమయోచితంగా హృద్యమై భాసిల్లుతున్నది రామానుజా అని ఆమె మధుర వీణాస్వనం వంటి స్వరంతో వచించగానే రామానుజుడు ఆశ్చర్యపోయాడు. అది తన విద్యార్జనాకాలం నాటి మాట. గురువు యాదవప్రకాశులతో విభేదించి కష్టాలు కొనుక్కున్న గాధ. ఆనాడు గురువుగారి అన్వయాన్ని వినలేక అశ్రువులు రాల్చి, తరువాత సందర్భోచిత వ్యాఖ్య చేసిన నాటి విశేష సంఘటన ఈ మాతృమూర్తికి తెలియడమేమిటి, ఆమె ప్రశంసించడమేమిటి. ‘‘అమ్మా అంతా పెరుమాళ్ల అనుగ్రహం తల్లీ, పలుకుల తల్లి దీవెన. నాకు ఆ క్షణాన మనసుకు స్ఫురించిన అర్థాన్ని అన్వయాన్ని వివరించాను తల్లీ..

‘‘నీల నీరదమూర్తి అయిన పరమాత్ముని ఆర్ద్రనేత్రాలకు సరస్సులో నులివెచ్చని సూర్యకిరణాలు లీలగా విచ్చుకున్న తామర పూరేకులతో పోల్చడం నీకే చెల్లింది రామానుజా..‘‘క..పి..అన్న పదంలో దాగిన అంతరార్థాన్ని వెలికి తీసావు. ‘‘క’’ అంటే నీరనీ, పి అంటే పిబతి, అంటే తాగునది, కిరణాల వేడితో నీటిని తాగేవాడు సూర్యుడు, దాని అర్థం లేలేత రవికిరణాల తాకిడిచేత మెల్లగా విచ్చుకున్న తమ్మిపూవులు, రవికిరణ స్పర్శ చేత వికసిత పులకితమయ్యే పవిత్రపుష్పం తామర. ఆ పురుషోత్తముని కన్నులు భాస్కరకర వికసిత జలజపత్రవర్ణ శోభితమై ఉబ్బుగా, లేత ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నాయని నీవు పరంధాముని పుండరీకాక్షములను వర్ణిస్తూ ఉంటే ఆనందం కలిగింది నాయనా అన్నారామె. అక్షరాలను విరిచి, వాటికి అసందర్భ అర్థాలను ఏవేవో వివరిస్తూ ఉంటే ఆ కువ్యాఖ్యానాలు విని నేనెంత బాధపడ్డానో. వాగర్థముల అద్వైతాన్ని స్థిరీకరించి, విశిష్టాన్వయంతో ఆ శృతి వాక్యాన్ని విశిష్టాద్వైతం చేసిన భావనాగరిమ నా దుఃఖాన్ని దూరంచేసింది నాయనా.. అని ఆ తల్లి వివరిస్తూ ఉంటే, రామానుజుడికి అర్థమైంది... ఆమె ఎవరో కాదు. సాక్షాత్తూ వాగ్దేవత. సరస్వతీ మాత. ధవళతరాం శుక గంధ మాల్యశోభిత, వీణాపాణిని, పుస్తక ధారిణి, హంస వాహిని.

‘‘అమ్మా నాకు దర్శనమిచ్చి ధన్యుడిని చేశావు తల్లీ..’’ అని రామానుజుడు సాష్టాంగ దండప్రమాణం చేశాడు. ‘‘ఏదీ నీవు ఇటువంటి సమన్వయంతో చేసిన శ్రీభాష్య గ్రంథం. ఒక్క శ్రుతి వాక్యానికి నీవిచ్చిన అర్థాన్ని విని పులకించిన నేను, నాపతి బ్రహ్మసూత్రాలన్నిటికీ నీవిచ్చిన సమగ్ర అన్వయాన్ని చూడాలని ఉంది ఏదీ నీ శ్రీభాష్యగ్రం«థం.. అని’’ పలుకుల తల్లి అడుగుతూ ఉంటే పులకించిన రామానుజుడు, ‘‘అంతకన్నానా తల్లీ, ఇదిగో శ్రీ భాష్యగ్రంథం. నా నాలుకపై నీవు నిలిచి పలికించిన పలుకులు తల్లీ, నా మనసులో స్ఫురణగా వెలిగి నాచేత నీవే వ్రాయించిన వాక్యాలమ్మా చూడు తల్లీ చూడు’’ అని ఆ గ్రంథాన్ని అమ్మవారికి సమర్పించుకున్నాడా యతివరేణ్యుడు. తాళ పత్రాలను తిప్పి చూసి మళ్లీ మూసి, కట్టి, తన కళ్లకు అద్దుకుని శిరస్సున ధరించింది సరస్వతీమాత. రామానుజుడు మరింత పొంగిపోయాడు.

మళ్లీ మళ్లీ నమస్కరించినాడు. కళ్లు ఆనందభాష్పాలను వర్షిస్తూ ఉంటే తనకు అయాచితంగా జన్మజన్మల సౌభాగ్యంగా లభించిన ఆ సరస్వతీ సాక్షాత్కారానికి ఉప్పొంగిపోతూ ఉన్నాడు. యతిరాజా, ఇంతటి అద్భుతమైన శ్రీభాష్యమును రచించిన నీవు ఇకనుంచి శ్రీభాష్యకారుడివై భాసిస్తావు. నీ కీర్తి ఆచంద్రతారార్కం నిలిచి వెలుగుతుంది. నీ పలుకు మంత్రమై, నీ సూత్రం సిద్ధాంతమై, నీ మతం అజరామరమై నిలిచిపోతుంది’’ అని వరమిచ్చింది చదువుల తల్లి. అంతేకాదు. సకల విద్యలకు అధిష్ఠాన దేవత, శ్రీ లక్ష్మీ హృదయ వదనుడి విగ్రహాన్ని రామానుజుడికి బహూకరించింది. ‘‘ఇందాకా నేను బ్రహ్మదేవుడు ఉపాసిస్తున్న ఈ మూర్తిని ఇక నీవు ఉపాసించు నాయనా’’ అని ఆదేశించింది.

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

‘‘ధన్యోస్మి తల్లీ’’ అని ఆ లక్ష్మీ హయగ్రీవ విగ్రహాన్ని స్వీకరించి శిరస్సున ఉంచుకున్నారు శ్రీభాష్యకారుడు. ఆ విగ్రహం పరపరాగతంగా రామానుజుని శిష్య ప్రశిష్యులకు సంక్రమిస్తూ వస్తున్నది. ప్రస్తుతం మైసూర్‌ నగరంలోని పరకాల మఠాధీశుని నిత్య తిరువారాధనలో పూజలందుకుంటున్నది. పరకాల స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడ వారి అర్ఘ్యపాద్య ఆచమన పూర్వక ధూపదీప నైవేద్యాలను స్వీకరిస్తున్నారు హయగ్రీవస్వామి. పరకాల స్వామి మైసూరులో ఉంటే సరస్వతీ దత్తమైన హయగ్రీవస్వామిని దర్శించుకోవడం సాధ్యమే.సరస్వతీ సాక్షాత్కారాన్ని పొంది ధన్యుడైన రామానుజుడు ఆ తరువాత కశ్మీరు రాజుగారిని దర్శించారు. అక్కడ శ్రీభాష్యంపైన చర్చలో పాల్గొన్నారు. మహారాజు శ్రీభాష్యాన్ని కొంతసేపు పరిశీలించి, ‘‘యతిరాజా మీరు ఈ వేదాంత సూత్రాలకు ఏ ఆధారాలను పరిశీలించారు. ఏ సూత్రాలపైన మీరు భాష్యాన్నిచ్చారు’’ అని సగౌరవంగా అడిగారు.

‘‘అయ్యా ఇక్కడ మీ శారదాపీఠంలో ఉన్న బోధాయన వృత్తితోపాటు టంక, గుహదేవ కపర్ది, భరూచి మొదలైన పండితులు వ్రాసిన అన్వయాలను పరిశీలించి, నా అన్వయాన్ని జోడించి వివరించాను’’ అని సవినయంగా సమాధానం చెప్పారు రామానుజులు. శారదాపీఠంలో ఉన్న ఆ గ్రంథాలనన్నీ తెప్పించుకున్నారు రాజు. ఓ రోజంతా పరిశీలించారు. అప్పటికి అర్థమైంది రామానుజుని రచనా విశిష్టత. మళ్లీ రాజసభకు రామానుజుని రప్పించి, పాదాభివందనం చేసి, సత్కరించి యుగయుగాలు నిలబడే అద్భుత గ్రంధాన్ని వ్రాసిన భాష్యకారులను ప్రశంసించారు. అప్పడికే అసూయాదగ్ధులైన కశ్మీరు పండితులు రామానుజుని వైభవాన్ని స్వయంగా రాజుగారు ప్రశంసించడం తట్టుకోలేకపోయారు. మరింత అసూయతో మళ్లీ రగిలిపోయారు. అంతులేని తమ అసూయను చల్లార్చుకోవడానికి రామానుజునే అంతం చేయడానికి ప్రయత్నించారు. ఈసారి కుతంత్రాలతో కాకుండా దుష్టశక్తులను ఆవాహనచేసే కుమంత్రాలతో కుట్ర పన్నారు. అభిచార హోమ క్రియద్వారా దుష్టశక్తిని ప్రయోగించారు.

ఆ శక్తి రామానుజుడు విడిదిచేసిన ఆశ్రమాన్ని చేరింది. కానీ ఆశ్రమమంతా రామానుజుడు, శిష్యుల నిత్యజప హోమమంత్ర స్తోత్ర కీర్తనలతో వైభవంగా ప్రజ్వరిల్లుతున్నది. ప్రతి వైష్ణవుడూ సమాశ్రయణం ద్వారా భుజాలమీద శంఖ చక్రాలు తిరునామాలు ధరించిన వాడే. ఆశ్రమం నిండా శ్రీవారి ఆయుధ చిహ్నాలే. నారాయణుడి కరకమలాలను అలంకరించే పంచమహాయుధాల స్వరూపాలతో అలంకృతమైన ఆశ్రమం అది. సుదర్శనుడు (చక్రం), పాంచజన్యం (శంఖం), గరుడుడు, శేషుడు, ఆంజనేయుడు, తిరునామాల చిత్రాలు, అలంకారాలు ప్రతిచోటా కాంతులీనుతున్నాయి. పంచాయుధాల దివ్యతేజస్సు ముందు దుష్టశక్తి నిలవలేకపోయింది, పలాయనం చిత్తగించింది. నారాయణుని చరణారవిందాలను స్మరించే వారిని ఏ దుష్టశక్తీ ఏమీ చేయజాలదని రుజువైపోయింది. అంతేకాదు. నారాయణతేజస్సు వల్ల ఆ దుష్టశక్తి ప్రయోగించిన వారిపైకే దాడికి మళ్లింది. ద్వేషదగ్ధులైన పండితులు పరుగెత్తుకొచ్చి రామానుజుని ఆశ్రయించి శరణు పొందేవరకు వారిని వెంటాడింది.

 రామానుజుడు అభయం ఇవ్వగానే నారాయణ తేజం అంతర్ధానమైంది. శ్రీమద్రామానుజుడు యతి. అంటే సన్యాసి. తనకంటూ ఏదీ ఉండదు. తనకు దేనిమీదా ఆసక్తి ఉండదు, భగవన్నామం, భగవత్పాదం తప్ప. రేపటి రంధి లేదు. కుక్షికి సరిపడా భుక్తి దొరుకుతుందా అనే ఆలోచన లేదు. భయం అసలే లేదు. ఏడిళ్లు బిచ్చమెత్తి వారిచ్చిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. ఏరోజుకారోజు ఏడిళ్ల యాచనే యతి జీవనం. భిక్షమెత్తడం సోమరితనంతో కాదు, భౌతిక విషయాల పట్ల తిండి రుచులు, సంపదల పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా ఆ స్థానంలో భక్తి, ఆర్తి ఏర్పడాలన్నదే అంతరంగార్థం. ఇటువంటి భక్తులను పోషించడం గృహస్తుడి ధర్మం. చాలా పరిమితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం అదీ ఏ ఒక్కరికీ భారం కాకూడదనేదే ఉద్దేశం.

నిస్వార్థుడైన రామానుజుడు, తనకోసం భిక్షమెత్తి తెచ్చుకున్న తిండి తప్ప మరేదీ తీసుకోని యతిరాజు శ్రీరంగ ఆలయంలో అవినీతిని పూర్తిగా నిలిపివేయడంతో కొంతమంది పూజారులకు కంటగింపు అయింది. రామానుజుడికి వేసే భిక్షంలో విషం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక గృహస్తుడిని ఒప్పించారు. కాని ఆయన భార్యకు ససేమిరా ఇష్టం లేదు. కాని విధిలేక విషాహారమే భిక్షంగా వేయవలసి వచ్చింది. కాని ఆమె కన్నీళ్లపర్యంతం కావడం చూసి రామానుజులు అనుమానించారు. చేతినుంచి జారి ఆ ఆహారం పడింది. అటుగా వస్తున్న కుక్క తిని పడిపోయింది. ‘‘సగరమైన ఈ అన్నము సాగరమును చేరుగాక’’ అని యతి దాన్ని కావేరీలో విసిరి, ఆశ్రమాన్ని చేరుకున్నాడు. భిక్షాటనమూ చేయక శరీరధర్మము పాటించుటెట్లు అని బాధపడ్డాడు రామానుజుడు.

అక్రమాలపై రామానుజుని పోరాటం
ఆలయనిర్వహణ, అర్చావిధానాల నిర్ధారణ, అవినీతిరహితమైన పాలనా పద్ధతులను ప్రవేశ పెట్టినందుకు రామానుజునిపై విషప్రయోగం చేసేంత పగ అర్చకులకు రగిలింది.  శ్రీరంగనాథుడు అర్చామూర్తిగా అచేతనుడివలె కనిపిస్తాడు. కాని ఆయన సుకుమార శరీరుడనీ, చిన్నారి శిశువువలె భక్తులు ఆదుకోవలసిన పరమాత్ముడని భావించి ఆవిధంగానే ఉపచారాలు చేయడమే సరైన ఆరాధన. ప్రాణప్రతిష్ట జరిగిన అర్చామూర్తిని సజీవ చేతనమూర్తి అయిన భగవంతుడని విశ్వసించి ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా మారుతున్న రుతువులకు తగిన తాజాపదార్థాలతో శుచిగా శుభ్రంగా తళిహె తయారుచేసి పెరుమాళ్లకు ఆరగింపు చేయాలి. పసిపాపను ఆదుకున్నంత శ్రద్ధగా స్వామికి అన్ని సేవలను, షోడశోపచారాలను (అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, ధూప, దీప, నైవేద్యం వంటి 16 సేవలు) సమర్పించాలనీ, అంత ప్రేమతో సమర్చించాలని ఆగమ శాస్త్రం నిర్దేశిస్తున్నది.

 ఆ శాస్త్రం ప్రకారమే రామానుజులు ఆలయంలో పద్ధతులను క్రమబద్ధం చేస్తున్నరోజులవి. ఎంత వద్దన్నా శ్రీరంగనాథుడికి రోజూ రాత్రి శీతాకాలంలో కూడా దధ్యోదనం, రేగుపండ్లు ఆరగింపు చేస్తుండడం గమనించారు. రెండూ పులుపు పదార్థాలే. రాత్రిపూట తింటే ఆరోగ్యం దెబ్బతినదూ..  ఏ తల్లయినా పసివాడికి పెట్టడానికి ఒప్పుకోని పదార్థాలను భగవంతుడికి నివేదిస్తారా? అని రామానుజులు ఆగ్రహించారు. అనేక ఇతర తప్పిదాలతోపాటు ఎన్నిసార్లు చెప్పినా మారని ధోరణి వల్ల ఇద్దరు పాకశాల ఉద్యోగులను రామానుజులు తొలగించారు. వారికి తీవ్రమైన కోపం వచ్చింది. పగబట్టి రామానుజుని ప్రాణాలు తీయడానికే తెగించారు. భగవత్‌ సాన్నిధ్యంలో పనిచేసే వారి చేత కూడా అవినీతి అహంకారం ఎంతపనైనా చేయిస్తుంది. కొందరు అర్చకులు ఉద్యోగులు కలిసి అంతకుముందు ఒకసారి రామానుజుల పైన హత్యాప్రయత్నం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement