సీతాకోకచిలుక: పది రోజులు గడిచిపోయాయి! కాబోయే వియ్యంకులు.. | Seethakokachiluka Funday Special Story Written By Dinesh | Sakshi
Sakshi News home page

సీతాకోకచిలుక: పది రోజులు గడిచిపోయాయి! కాబోయే వియ్యంకులు..

Published Sun, Aug 18 2024 2:30 AM | Last Updated on Sun, Aug 18 2024 2:30 AM

Seethakokachiluka Funday Special Story Written By Dinesh

అది నీలం రంగు సీతాకోకచిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలోని కొన్ని పశువృక్షకీటకపక్ష్యాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే! కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలి వర్ణద్రవ్యం (పిగ్మెంట్‌) సహజంగా ఉత్పత్తి అవదు. ఆయా ప్రాణుల ఈకలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండటం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి.

మరి అంతటి అరుదైన రంగున్న ఆ సీతాకోకచిలుక అక్కడికెలా వచ్చిందోగానీ, సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతోంది. తన రెండవ కూతురు దుర్గ ఆ సీతాకోకచిలుక కావాలని ఆశగా అడిగిందని ఇంటి వెనుక పెరట్లో అటూ ఇటూ దాని వెనుకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనుక గుమ్మం దగ్గర నిలబడిన దుర్గ ఆత్రుతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తోంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటోడ్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోకచిలుకని పట్టుకుని తన చిన్న కూతురు చేతికిచ్చాడు.

‘అది అడుగుడు సరే.. నువ్వు దానెనక వయసు యాదిమర్శి ఉరుకుడు సరే! సరిపోయిన్రు ఇద్దరూ’ అని తండ్రిని వారించింది లక్ష్మి.
    ‘పోనీతీ బిడ్డా, చిన్నపిల్ల.. ఆడుకోనీ’ అని అరుగు మీద కూర్చుని నిట్టూర్చాడు సుబ్బయ్య.
‘గంతే తీ, అది ఇంజనీరింగ్‌ సదువుతున్న గూడ నీకు చిన్నపిల్ల లెక్కనే కనవడ్తది.’
    ‘ఒసేయ్‌! ఏందే నీ లొల్లి. నాయిన నాకు సీతాకోకచిలుక పట్టిస్తే నీకేందే నొప్పి?’ ఎగతాళిగా వెక్కిరించింది దుర్గ.
‘ఏందే.. ఎక్కువ మాట్లాడుతుండవ్‌?’
    ‘పెండ్లి అయినాక నీ మొగుడు అమెరికాలో సీతాకోకచిలుకలు పట్టిస్తడులే.. ఏడ్వకు.’ సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మికి కోపమొచ్చింది. దుర్గ చేతి మీద ఫట్టుమని ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోకచిలుకను దుర్గ వదిలేసింది. అది కాస్తా సందు చూసుకుని తుర్రుమంది. దుర్గ కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది.

దుర్గ ఏడుపు మొహం పెట్టి, ‘నాయినో! అది ఎగిరిపోయిందే’ అని అరిచింది.
    ‘దాన్ని పట్టుడు ఇంగ నాతోని కాదు బిడ్డా.. ఇడిశెయ్‌. మళ్ళా కనిపిస్తే పట్టిస్తా’ అని తన జేబులో సిగరెట్‌ బయటకి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరికొచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వుమని అరిచి తల్లిని పట్టుకుంది.
    ‘ఏం పుట్టిందే నీకు? దాన్ని అట్లా గిల్లుతవెందే?’ కసిరింది సుజాత.
‘నా సీతాకోకచిలుకని ఎల్లగొట్టిందే అది’ అని స్టౌ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంది.
    ‘దానికంటే బుద్ధిలేకపాయె తింగరిది. నీకేమొచ్చిందే లక్ష్మీ?’
‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం గా సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’ బయట పెరట్లో అరుగు మీదే కూర్చుని సిగరెట్‌ తాగుతూ వంట గదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య.

‘పైసలున్నోళ్ళకే చెల్లుతయె గీ స్వేచ్ఛలు. అయినా గంత మాటంటివేందే.. నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినమే ఈ ఇంట్ల?’ చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత.
    ‘నాకీ పెండ్లొద్దే హైదరాబాద్‌ పోయి మాస్టర్స్‌ సదువుతానంటే నా మాట యింటున్నరా?’
‘మన పరిస్థితి తెలిశిగూడ నువ్వు గట్ల మాట్లాడ్తవేందే? అయినా మేం చూసినదేమన్న మామూలు సంబంధమానే? అమెరికా పొరడ్ని   చూసినం. ఇంకేం కావాల్నే నీకు?’
    ‘నాకేం అమెరికా పోవాలని ఆశల్లేవ్‌ తీ. నాకీడనే ఉండాలనుంది.’
‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారిన్‌ మ్యాచ్‌ అంటే ముక్కు, మొహం సూడకుండ పెండ్లి చేసుకుని మొగుడెంట పోతున్నరు. నువ్వేందక్కా గిట్లున్నవ్‌? ఇదే చా¯Œ ్స నాకొచ్చింటేనా అస్సలు ఆలోచించక పోతుండే.’

‘అయితే నువ్వే చేస్కో పో!’ మొహం తిప్పుకుంది లక్ష్మి.
    ‘హా! బరాబర్‌ చేస్కుంటా. అమ్మా, నాకు ఓకేనే ఈ పెండ్లి. నాకు చేయుర్రి.’ 
‘ఏయ్‌! నువ్వా సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంప్కరాపో.. నడువ్‌’ అని దుర్గను కసిరి బయటకి పంపించింది.
    అలిగి వంటగది తలుపుని ఆనుకుని నిలబడిన కూతురు దగ్గరికొచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకుని తల పైకి లేపి కూతురి కళ్ళలోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి.
    ‘నీ మనసు నాకు తెల్సు బిడ్డ. కానీ, నీకు పెండ్లి జేశి పంపుడు అమ్మ, అయ్యలుగ మా బాధ్యత.’
‘ఎవడు కనిపెట్టిండే ఈ బాధ్యతలు? నేనడిగిన్నా ఇప్పుడు నాకు పెండ్లి చేయమని?’
    ‘నువ్వే గదనే రెణ్ణెళ్ళ కిందట సంబంధాలు సూద్దుమా అంటే గొర్రెలెక్క తల ఊపితివి?’
‘ఏమో అప్పుడు నాయన నోరు తెరిశి అడిగిండని తలూపిన. నాకేం దెల్సు మీరు అమెరికా సంబంధం సూస్తరని? ఇప్పుడు మీయందరిని ఇడిశిపెట్టి ముక్కు మొహం తెల్వనోనితోని గంత దూరం పోవాల్నా? నాకేమొద్దు.’

‘ఆళ్లే ముచ్చటవడి నిన్ను సూడనికొస్తాన్నప్పుడు మనమొద్దంటే మంచిగుంటదా? మధ్యవర్తి ముంగట నాయినకి మర్యాద దక్కుతదానే?’
బుస్సుమని అన్నం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టౌ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి, గరిటతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది.
    సుజాత గరిట తిప్పుతూనే, ‘మీ నాయిన ఉన్న మూడెకరాలు సాగు చేసుకుంటనే ఇన్నేండ్లు మీకు నచ్చిన సదువులు సదివించిండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే వెడుతున్నడు. చానా కష్టపడి నీ పెండ్లి కోసం పదిలక్షలు కూడబెట్టిండు. ఇంకింతకన్నా కష్టవెట్టకే నాయనని. మా బుజ్జి కదా, నా మాటిను’ నచ్చజెప్పింది. 
   తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చింది సుజాత.

మరుసటిరోజు కాబోయే వియ్యాలవారి రాకతో సుబ్బయ్య ఇల్లు కళకళలాడింది. రాత్రి లక్ష్మి చేతికి దుర్గ పెట్టిన గోరింటాకు పొద్దుటికల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి, ఫొటోలో కన్నా అబ్బాయి చాలా బాగున్నాడని లక్ష్మి చెవిలో గుసగుసలాడింది దుర్గ. పెళ్ళిచూపుల్లో అమ్మాయి, అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని, అబ్బాయిని ఇంటి వెనుక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చున్న పెళ్ళి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు.

కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకొచ్చి కూర్చుని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అంతా బాగుంది. ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ, అబ్బాయి అమెరికాలో సెటిల్‌ అయ్యాడు గనుక యాభై లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పనయ్యింది. పెళ్ళి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని, త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకొమ్మని నచ్చజెప్పారు. కానీ, ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బులేదు. వచ్చే నెలలోపల పెళ్ళి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఈ సంబంధం చేయి దాటి పోతుంది.

ఆ రోజు సాయంత్రం ఇంటి వెనుక పెరట్లో అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఒక పెట్టె సిగరెట్లు గుప్పుమని ఊదిపడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తనని దేశంకాని దేశానికి పంపించే పెళ్ళి తనకొద్దంటే వద్దని మొండికేసి నానా హంగామా చేసి, అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపును ఆనుకుని కూర్చుని మొబైల్‌ చూస్తోంది దుర్గ. వంట గదిలో అందరి కోసం టీ కాస్తోంది సుజాత. అంతా నిశ్శబ్దం.

ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ పెరట్లోకొచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటబడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుర్లకి టీ ఇచ్చి, అటు నుండి పెరట్లోకి రెండు టీ గ్లాసులు పట్టుకుని వెళ్లింది. భార్య రాకను చూసి, సుబ్బయ్య సిగరెట్‌ కిందపడేసి కాలితో నలిపి ఒక టీ గ్లాసు అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరూ మౌనంగా టీ తాగసాగారు.

కాసేపటికి సుజాత నోరు తెరిచి, ‘పొలం అమ్ముదమా?’ అన్నది నెమ్మదిగా.
    ఆ మాటకు సుబ్బయ్య కంగుతిని భార్య వంక చూస్తూ ‘ఏం పుట్టిందే నీకు? గంత మాటంటివి?’ కరిచినంత పని చేశాడు.
‘మరేం చేస్తమయ్యా? గన్ని పైసలేడికెల్లి దెస్తం?’
    ‘అయితే? ఇన్నేండ్లు అన్నంబెట్టిన పొలాన్ని అమ్ముకొమ్మంటవా?’ కోపంగా చూస్తూ అన్నాడు.
‘మంచి సంబంధం.. కూతురు సుఖవడ్తది గదా అని..’
    ‘ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే? ఇంకా చిన్నదాని సదువైపోలే.. దానికేం బెడతవ్‌? దిమాగ్‌ పనిచేస్తున్నదా నీకు?’
‘వాయబ్బో! నువ్వు పెద్ద దిమాగ్‌ వెట్టి పనులు జేస్తున్నవ్‌ లే. ఈ ఏడు వరి పంట ఎయ్యిరా మొగుడా అంటే, పోయిపోయి ఆ టమాటా పంటేస్తివి. దానికేవేవో కొనుక్కొచ్చి పొలాన్ని ముస్తాబు జేస్తివి. ఎంత దిగువడొస్తదో చూస్త గదా..!’
   ‘నోర్ముయసో! అన్నీ తెలుసుకునే పంటేశిన. పోయినేడు వరి పంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేశిన అప్పులకే పాయే..’
‘ఓహో! గిప్పుడు టమాటాకు లచ్చలు రాల్తయ్‌ మరి’ వెటకారంగా అంది సుజాత.
   ‘యెహే! నా దిమాగ్‌ తినకు. నా కూతురికెట్ల పెండ్లి జేయాల్నో నాకు తెల్వదా?’ అని కసిరి, టీ గ్లాసు అరుగు మీద పెట్టి.. లేచెళ్ళిపోయాడు సుబ్బయ్య.

పది రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు, మధ్యవర్తులు రెండు రోజులకోసారైనా ఫోన్‌ కాల్స్‌ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చేయాలో తోచడంలేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి. కానీ, అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయలేడు. చేయడు కూడా. ఉన్నది మూడెకరాలే అయినా పొలమంటే అతనికి పిచ్చి ప్రేమ. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకి మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఏమైనా చేస్తాడు.

గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని, ఈ ఏడు ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి, అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించి వచ్చాడు.  తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో టమాటాలు సరిగా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.

భార్యకి చెప్పకుండా కూతురి పెళ్ళికోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి తన మూడెకరాలలో పంటకి ఎండ తగలకుండా నెట్, వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటాలు కోతలకు సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో పది రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్ళి చేద్దాం అనుకున్నాడు. ఆ ధైర్యం, నమ్మకంతోనే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడా పంట అమ్మినా వాళ్ళడిగిన కట్నం ఇచ్చుకోలేడు గనుక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు.

మరుసటిరోజు పొలంలో పంట కోతలు జరుగుతుండగా మధ్యవర్తి నుండి ఫోనొచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్ళేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటునట్టు చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్‌ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం. అలా రెండు మార్లు సిగరెట్‌ పొగని పీల్చి వదలగా ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ తన కంటపడింది. దాన్ని చూడగానే తన ఇద్దరు కూతుర్లు గుర్తొచ్చారు.

సిగరెట్‌ నోట్లో పెట్టుకున్నాడు. భుజం పైన ఉన్న తువాలు తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలుకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తుండగా చిన్నపిల్లాడిలా దాని వెనుక పరుగెత్తాడు. ఒక పదిహేను నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలా దాని వెనుకపడి చివరికి ఎలాగోలా పట్టుకోగలిగాడు. రొప్పుతూ ఒక గట్టు మీద కూలబడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్‌ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోకచిలుకని తన మొహానికి దగ్గరిగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ళనుండి విడిపించుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ కొట్టుమిట్టాడుతోంది. దాని అవస్థ చూడగానే పెళ్ళిచూపుల ముందు రోజు తాను పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి.. తల్లితో అన్న మాట గుర్తుకొచ్చింది.

‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం ఆ సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’
యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తరువాత సుబ్బయ్య మొహంలో ఒక నవ్వు విరిసింది. రోజుల తరువాత హాయిగా నవ్వినట్టు అనిపించింది అతనికి.

తన పొలంలో పండిన టమాటాలను లారీలలో ఎక్కించాక మరుసటిరోజు తెల్లవారుజామునే హైదరాబాద్‌ బయలుదేరాడు. ఆలస్యమైన రుతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలియదు. మార్కెట్లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్నదాని కన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. తన భార్య వెటకారంగా అన్నా ఆరోజు నిజంగానే టమాటాలకు లక్షలు రాలాయి. మొత్తంగా తన మూడెకరాల పంటకి డెబ్బై లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి.

మరుసటిరోజు ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఊరు ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యను మెచ్చుకుని అభినందించారు. కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్ళి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్‌ కాల్స్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ, ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుర్లిద్దరూ అక్కడే కూర్చున్నారు.

సుబ్బయ్య టీ తాగుతుంటే సుజాత గొంతు సరిచేసుకుని, ‘ఇప్పుడు మనకాడ పైసలున్నయి. గా అమెరికా సంబంధం కలుపుకుందామయ్యా?’ అన్నది నెమ్మదిగా. సుబ్బయ్య తిరిగి భార్య వంక గుర్రుమని చూశాడు. దుర్గ తన అక్క భుజం తట్టి నవ్వింది. లక్ష్మి నిట్టూర్చి తలని చేత్తో బాదుకుంది. ‘అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగ ఉంటది గదాని..’

సుబ్బయ్య వెటకారంగా నవ్వి, ‘మనుషులకు విలువనియ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురెట్ల సుఖంగ ఉంటదే? ఆడేం మంచిగా సూసుకుంటడు నా బిడ్డని?’ అన్నాడు.
    ‘అయితే పెండ్లి చెయ్యకుండ గిట్లనే ఉంచుతవా ఏందీ?’
‘ఎహేపో! నా కూతుర్లు సీతాకోకచిలుకల్లాంటోల్లే. రెక్కలొచ్చినాక గూడ ఎన్ని దినాలని చేతుల ఒడిశి పట్టుకుంటం? ఇడిశిపెట్టాల్నే. అవట్లా స్వేచ్ఛగ ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు గూడ గంతే. ఈ పైసలతో ఆళ్ళకి ఇష్టమొచ్చిన సదువులు సదువుకోనీ, నచ్చిన పనులు చేస్కోనీ. వాళ్ళకి నచ్చినప్పుడే పెండ్లి చేస్త. గంతే!’ – దినేష్‌

ఈ మాట విన్న వెంటనే కూతుర్లు ఇద్దరూ  చేతుల్లోని టీ గ్లాసులు పక్కన పెట్టి, ఠక్కున లేచొచ్చి సుబ్బయ్య చెరో పక్కన కూర్చుని, గట్టిగా తండ్రిని వాటేసుకుని ఇరు భుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది.
    ‘గీ మాటింటే ఊరోల్లందరు మనమీద ఉమ్మేస్తరు. నువ్వేం తండ్రివని దెప్పిపొడుస్తరు. అవసరమా?’ అని తిట్టింది
సుబ్బయ్య గట్టిగా నవ్వి, ‘గీ ఊర్ల సుబ్బయ్యను అనేంత దమ్ములు ఎవనికున్నయే? ఎవడంటడో అననీ.. సూస్కుందం. నా బిడ్డలు నా ఇష్టమే’ అని తన మీసం మేలేశాడు.
    ‘మా మంచి నాయిన’ అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. 
‘సరిపోయిన్రు తీ తండ్రీబిడ్డలు’ మూతి ముడిచింది సుజాత.
తండ్రీ, కూతుర్లు గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో అలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోకచిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురి చుట్టూ గిరగిరా తిరిగి మెల్లిగా దుర్గ చేతి మీద వాలింది. – దినేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement