‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’
అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్‌గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు.
ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను.
ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్‌కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె.
‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్‌గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు.
కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు.
ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్‌లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది.
చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది.
మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్‌కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు.
నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను.
ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది.
నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు.
మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్‌కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది.
క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది.
‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్‌ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు.
యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’
దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి.
అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు.
ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు.
నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి.
ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్‌లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు.
యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2).
క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు.
‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి.
ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్‌లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది.
యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు.
జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు.
మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది.
అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్‌నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది.
నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్‌నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు.
రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్‌నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి.
ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి.
ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి.
అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది.
వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది.
హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం.
పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు.
ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు.
ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు.
అక్కడకు వెళ్ళి బైబిల్‌లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు.
దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు.
జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు.
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది.
ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి.
ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది.
‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి.
పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు.
ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు.
శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం.
ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది.
ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు.
ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము.
కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు.
‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు.
అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది.
సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’
సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి
Comments
Please login to add a commentAdd a comment