
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.
సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ!
చారిత్రకత (1925–2025)
ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు.
తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.
సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు.
ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు.
తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు.
సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు.
ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు.
ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న.
వీడ్కోలు (2, మార్చి 1949)
దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది.
తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా.
(చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్‌లో బెస్ట్..!)
Comments
Please login to add a commentAdd a comment