
నిరంతరంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రామకృష్ణ మిషన్
సమాజంలో విలువలను పెంపొందించేందుకు కృషి
సాక్షి ప్రతినిధి, కడప: స్వచ్ఛంద సేవా సంస్థల్లో రామకృష్ణ మిషన్ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. కడపలోని చెన్నూరు బస్టాండ్ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయాన్ని నిర్వహించారు. 1992లో రామకృష్ణ సేవా సమితిని భక్తులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు.
2004 నుంచి దానిని రామకృష్ణ మఠంలో మార్చారు. రెండతస్తుల్లో గ్రంథాలయం, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించారు. 2007లో పుట్లంపల్లె వద్ద అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మఠం నిర్మాణానికి స్థలం ఇచ్చారు. అందులో 2007లో రామకృష్ణ మిషన్ ఏర్పాటైంది. పేదలు, అనాథ బాలలతో బాలకాశ్రామం నిర్వహిస్తున్నారు. వివేకానంద విద్యానికేతన్ పేరిట 7వ తరగతి వరకు మిషన్ ఆవరణంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే ఆవరణంలో వివేకానందుని పేరిట భారీ ఆడిటోరియం ఏర్పాటు చేశారు.
ఇందులో ఆధ్యాత్మిక, సామాజిక సభలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా స్వామిజీ, బ్రహ్మచారుల గృహాలున్నాయి. ఆశ్రమమంతా నిరంతరం ప్రశాంతంగా పూల, పండ్ల తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2012లో ఏర్పాటు చేసిన విశ్వజనీన ఆలయం రామకృష్ణ మిషన్‌కు తలమానికంగా నిలుస్తోంది.
ఇందులో అన్ని మతాలకు చెందిన చిత్రపటాలు, వారు తమ మతాచారం ప్రకారం ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా వేదికలు ఉంటాయి. సేవలు–మిషన్ ఆధ్వర్యంలో ‘విద్య’ పేరిట నైతిక విలువలుగల విద్యాబోధన గురించి పాఠశాలలు, కళాశాలల్లో మిషన్ ప్రతినిధులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమ ఆవరణంలో యేటా రెండుమార్లు మూడు నుంచి వారం రోజులపాటు యువ రైతులకు పంటలు, దిగుబడిపై నిపుణులైన వారితో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
యేటా ఉపాధ్యాయులకు విలువలుగల విద్యాబోధనపై మూడు రోజులపాటు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 18న జరిగిన రామకృష్ణ పరమహంస జయంతి నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment