Ramakrishna Mission
-
లోక కల్యాణమే హితంగా...
రామకృష్ణ మిషన్ అధ్యక్షులు, అత్యంత సీనియర్ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహను పెంచుతూనే... విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని ఎందరో సాధువులు ఆశీర్వదించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ అనే సిద్ధాంతానికి స్వామి స్మరణానంద జీవితం చెరగని ఉదాహరణ. లోక్ సభ ఎన్నికల ఘన పండుగ హడావిడిలో ఓ వార్త మనసులో కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారత దేశ ఆధ్యాత్మిక చింతనలో అగ్ర గణ్యులైన శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ గతించడం (మార్చ్ 26) వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానంద జీ మరణం, ఇప్పుడు స్వామి స్మరణా నంద శాశ్వతంగా నిష్క్రమించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. కోట్లాది మంది భక్తులు, సాధువులు, రామకృష్ణ మఠం, మిషన్ అనుచరుల మాదిరిగానే నా హృదయం కూడా బాధగా ఉంది. ఈ నెల ప్రారంభంలో బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద జీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాను. స్వామి ఆత్మస్థానంద జీ మాదిరిగానే, స్వామి స్మరణానంద జీ... ఆచార్య రామకృష్ణ పరమహంస, మాతా శారద మరియు స్వామి వివేకానంద ఆలోచనల ప్రపంచవ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలు, ఆయనతో నా సంభాషణలు, ఆ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగా కదలాడుతున్నాయి. 2020 జనవరిలో బేలూరు మఠంలో ఉన్న సమయంలో స్వామి వివేకానంద గదిలో కూర్చొని ధ్యానం చేశాను. ఆ పర్యటనలో నేను స్వామి స్మరణానందతో స్వామి ఆత్మస్థానంద గురించి చాలాసేపు మాట్లాడాను. రామకృష్ణ మిషన్‌తో, బేలూరు మఠంతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు తెలుసు! ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, గత ఐదు దశాబ్దాలుగా నేను వివిధ సాధువులను, మహాత్ములను కలిశాను, అనేక ప్రదేశాలకు వెళ్ళాను. రామకృష్ణ మఠంలో కూడా ఆధ్యాత్మికతకు తమ జీవితాలను అంకితం చేసిన సాధువులతో నాకు పరిచయం ఏర్పడింది. వారిలో స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ప్రముఖులు ఉన్నారు. వారి పవిత్రమైన ఆలోచనలు, జ్ఞానం నా మనస్సుకు నిరంతర సంతృప్తినిచ్చాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలంలో, అటువంటి సాధువులు నాకు ‘ప్రజా సేవయే దేవుని సేవ’ అనే నిజమైన సూత్రాన్ని బోధించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ (స్వీయ విముక్తి కోసం మరియు లోక కల్యాణం కోసం) అనే రామకృష్ణ మిషన్ సిద్ధాంతానికి స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద జీవితాలు చెరగని ఉదాహరణ. విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహ, విద్యా సాధికారత, మానవతా సేవ సంకల్పానికి రామకృష్ణ మిషన్ పని చేస్తోంది. 1978లో బెంగాల్‌ను వరదలు ముంచెత్తినప్పుడు రామకృష్ణ మిషన్ తన నిస్వార్థ సేవతో అందరి çహృదయాలను గెలుచుకుంది. 2001లో కచ్ భూకంపం వచ్చినప్పుడు విపత్తు నిర్వహణకు రామకృష్ణ మిషన్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని నాకు ఫోన్ చేసి చెప్పిన మొదటి వ్యక్తుల్లో స్వామి ఆత్మస్థానంద ఒకరు. ఆయన సూచనల మేరకు రామకృష్ణ మిషన్ భూకంప విపత్కర సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసింది. కొన్నేళ్లుగా స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వివిధ పదవుల్లో ఉంటూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఆధునిక విద్య, నైపుణ్యం, మహిళా సాధికారత పట్ల ఇలాంటి మహానుభావులు ఎంత గంభీరంగా ఉండేవారో వీరి జీవితాలు తెలిసిన వారికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది. స్వామి ఆత్మస్థానందజీ మహోన్నత వ్యక్తిత్వంలోని ప్రత్యేకత నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ దీనికి కారణం. ఆయన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చాలాకాలం గడిపారు. నిరంతరం ప్రయాణించే వారు. గుజరాత్లో ఉంటూ గుజరాతీ మాట్లాడటం నేర్చుకున్నారు. నాతో కూడా ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు. ఆయన గుజరాతీ మాట్లాడుతుంటే వినడం నాకు బాగుండేది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ఎందరో సాధువులు ఆశీర్వదించారు. వారు సామాజిక మార్పు గురించి మనకు కొత్త చైతన్యాన్ని అందించారు. సమాజ శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేయాలని ఈ సాధువులు మనకు దీక్షను అందించారు. ఈ సూత్రాలు ఎప్పటికీ శాశ్వతమైనవి. రాబోయే కాలంలో ఈ ఆలోచనలు అభివృద్ధి చెందిన భారతదేశానికి, అమృత్ కాలానికి సంకల్పశక్తిగా మారతాయి. అలాంటి మహనీయులకు యావత్ దేశం తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నాను. రామకృష్ణ మిషన్‌తో సంబంధం ఉన్నవారంతా ఆయన చూపిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. ఓం శాంతి. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
భారత్‌కు కాళీమాత అపార ఆశీస్సులు
కోల్‌కతా: భారత్‌కు కాళీమాత అపరిమిత ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’కు స్వామీజీలు, సాధువులు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తున్నారని కొనియాడారు. రామకృష్ణ మిషన్ సైతం ఆ దిశగా పనిచేస్తోందని అన్నారు. రామకృష్ణ మిషన్ మాజీ అధినేత స్వామీ ఆత్మస్థానందా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మన నమ్మకం పవ్రిత్రమైనది అయినప్పుడు కాళీమాత మనకు మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ప్రపంచ సంక్షేమం అనే స్ఫూర్తితో ఆధ్యాత్మిక శక్తి సహకారంతో భారత్ ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి కాళీమాతను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వామీ ఆత్మస్థానందకు మోదీ నివాళులర్పించారు. ఫొటో బయోగ్రఫీ, డాక్యుమెంటరీని విడుదల చేశారు. మరోవైపు, రైతులంతా సహజ సాగు పద్ధతుల వైపు మళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఇదొక సామూహిక ఉద్యమంగా మారి, విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం జరిగిన సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రకృతి సేద్యం చేయడం భూమాతకు సేవ చేయడమే అవుతుందన్నారు. ఆర్థిక ప్రగతికి ప్రకృతి సేద్యమే ఆధారమని స్పష్టం చేశారు. గోమాతను సేవించుకొనే అవకాశం లక్ష్యాన్ని సాధించాలన్న గట్టి పట్టుదల ఉంటే అడ్డంకులు ఏమీ చేయలేవని మోదీ వివరించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే పెద్ద లక్ష్యమైన సాధించడం సులువేనని అన్నారు. ప్రకృతి సేద్యం విషయంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. మన అన్నదాతల సౌభాగ్యానికి, మన వ్యవసాయ రంగం అభివృద్ధికి, మన దేశ ప్రగతికి ప్రకృతి వ్యవసాయం ఒక చుక్కాని కావాలని ఆకాంక్షించారు. సహజ సాగు పద్ధతులతో నేల తల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, గోమాతను సేవించుకొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. రసాయనాలకు తావులేని వ్యవసాయం ద్వారా ప్రాణాంతక రోగాల బారి నుంచి మనుషులను రక్షించుకోవచ్చని వివరించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ‘పరంపరాగత్ కృషి వికాస్ పథకం’ ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. -
నా సోదర సోదరీమణులారా...
కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, నిత్యస్మరణీయుడిగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచి ఉన్న భారతీయ ఆధ్యాత్మిక యువకెరటం స్వామి వివేకానంద. ఈ పుణ్యపుడమి ఘనతను తాను గుర్తించడమేగాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశ దిశలా చాటిన స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుండెలోతుల్లోకి చొచ్చుకొనిపోతాయి. లోకంలో కనిపించే చెడు, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే అని బలంగా విశ్వసించిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... హైందవ ధర్మ, ఆర్ష సంప్రదాయ బావుటాలను దేశదేశాలలోనూ ఎగురవేసి, భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను నెలకొల్పి ఎందరో విద్యావంతులైన శిష్యులను మానవసేవకు అంకితమయ్యేలా చేసిన ఆ ధన్యమూర్తి జన్మించిన జనవరి 12ను యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా వివేకానందుడు చెప్పిన మంచి మాటలు కొన్ని...ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. భగవత్సాక్షాత్కారం పొందనంతవరకు నీ మతం నిష్ప్రయోజనమే. ఎవరు మతం పేర కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తూ ఉంటారో, వారు చక్కెర బస్తాలను మోసే గాడిద వంటివారు. ఆ గాడిదకు చక్కెర రుచి ఇసుమంతైనా తెలియదు. దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. ఇతరులకు ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచేవాడు మనుష్యుల్లో మహోత్కృష్ట స్థానాన్ని అలంకరిస్తాడు. ఎందుకంటే నీ చెయ్యి ఎల్లప్పుడూ ఇవ్వడం కోసమే రూపొందించబడింది. సమస్త నీతికి, ఆధ్యాత్మికతకు, ఉత్కృష్టతకు జనని భారతదేశం. రుషులు నడచిన దేశమిది. నేటికీ ఇక్కడ దివ్యపురుషులున్నారు. ఆ పుణ్యపురుషుల నుండి దీపాన్ని బదులు తెచ్చుకుని, నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను సోదరా! ఈ విశాల ప్రపంచంలోని పట్టణాలలో, పల్లెల్లో, మైదానాలలో అడవులలో అన్వేషిస్తాను. అంతటి మహానుభావులను మరెక్కడైనా చూపగలరా? భగవదనుగ్రహాన్ని పొందాలంటే, మానవుడు వినిర్మల హృదయుడై ఉండాలి. ఆ నిర్మలత్వం శీలం వల్లనే సిద్ధిస్తుంది.ఆధ్యాత్మిక ధర్మం పుస్తకాలలో లేదు. సిద్ధాంతాల్లో లేదు. విధివాక్యాలలో లేదు. ఉపన్యాసాలలో అంతకన్నా లేదు. తర్కంలో అసలే లేదు. అది ఒక స్థితి. ఆ స్థితి ఒక్క సిద్ధులలోనే ఉంది. ఆ సిద్ధులు ఎవరో కాదు, మీరే! ఆ సిద్ధి పొందాలంటే, మీలో ప్రతివారూ రుషిౖయె, ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకునే వరకు, మీకు ఆధ్యాత్మిక జీవనం ఆరంభం కానట్లే. అతీంద్రియ దశ మీకు కలిగేవరకు ఆధ్యాత్మిక జీవనమనేది వట్టి అర్థంలేని మాట. మీరు భగవంతుని తెలుసుకొన్నప్పుడు మీ ముఖ వర్ఛస్సు మారుతుంది. మీ కంఠస్వరం మారుతుంది. మీ ఆకారమంతా మారుతుంది. మీరు మానవజాతినే ఉద్ధరించేవారవుతారు. రుషికి ఎవరూ ఎదురు లేరు. ఎవరూ ఎదురు నిలవలేరు. రుషిత్వమంటే అదే మరి. అది మన జాతికి పరమావధి. మన ఉపనిషత్తులలోనూ, శాస్త్రాలలోనూ, పురాణాలలోనూ దాగిన మహాద్భుత సత్యాలను వెలికి లాగాలి. మఠాల నుండి వాటిని బయటకు తీయాలి. అరణ్యాల నుండి తరలించుకు రావాలి. ప్రత్యేక వర్గాల అధీనం నుండి వాటిని గుంజుకు రావాలి. అవి దేశమంతటా– ఆసేతు హిమాలయ పర్యంతం దావానలంగా వ్యాపించడానికి మనం పూనుకుంటే కార్యం సాధించామన్నమాటే. ఈ సత్యాలను మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. వాటిని ప్రజలకు మొట్టమొదట వివరించాలి. నేడు దీనికి మించిన సత్కర్మ మరొకటి లేదు. కర్మలలో దాన కర్మ ఒక్కటే గొప్పది. అన్ని దానాలలోనూ ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైనది. భారతీయుడు నా సోదరుడు! భారతీయుడే నా ప్రాణం! భారతదేశపు దేవీదేవతలే నా ఆరాధ్యదైవాలు; భరతభూమి నా చిన్నప్పటి ఊయల, పడచుదనపు పూదోట, వార్థక్యపు వారణాసి అని గర్వంగా పలకండి. కష్టాలనే అభేద్యమైన అడ్డుగోడల్ని చీల్చుకొని ముందుకు సాగేది, సచ్ఛీలంతో శక్తిని సంతరించుకున్న సంకల్ప బలమే కానీ ధనం, పేరు ప్రతిష్ఠలు, పాండితీ ప్రకర్షలు కావు. ఓటమిలేని జీవితం ఉండదు. పరాజయం పలకరించని ప్రభువుండడు. జీవితానికి మెరుగులు దిద్దేది ఓటమే!తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడుసేవకుడిగా ఉండడం అలవరచుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్న ఇసుమంత ఆచరణ మిన్నలక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపినప్పుడే విజయం వరిస్తుంది.నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది. స్వామి వివేకానంద పలుకులన్నీ కలకండ పలుకులలా తియ్యగా ఉండకపోవచ్చు కానీ, మనలోని అనారోగ్యాన్ని నయం చేసి, ఆరోగ్యాన్ని చేకూర్చేది చేదు గుళికలేనని మరచిపోకూడదు. ఆయన మాటలు వెన్నలా మెత్తగా ఉండకపోవచ్చు కానీ, కొండరాళ్లను పిండి చేసేది ఇనుప పలుగేనని గుర్తుపెట్టుకుని, ఆ మాటల స్ఫూర్తిని మనసులో నింపుకుని ముందుకు సాగిపోవాలి. -
సాధ్వీమణులకు వందనం..
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత, నిబద్ధత అవసరం.. అవి చేకూరాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి.. అందుకు ఏకైక మార్గం ఆధ్యాత్మికత.. తమ ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా ఎందరికో సాంత్వన చేకూర్చిన సాధ్వీమణులను ఓసారి స్మరించుకుందాం.. శ్రీ శారదా దేవి భారత మహిళా సాధువుల్లో అత్యంత ప్రముఖులు. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. 1858లో శారదామణి ముఖోపాధ్యాయ్గా జన్మించిన ఆమెకు ఐదేళ్ల ప్రాయంలో 23 ఏళ్ల రామకృష్ణ పరమహంసతో వివాహం జరిగింది. కౌమార దశలోకి ప్రవేశించగానే దక్షిణేశ్వర్‌లోని కాళీమాత గుడిలో పూజారిగా పనిచేసే భర్తను కలుసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించారు. భర్తను చేరుకునే సమయానికి ఆయన ఆధ్యాత్మిక యోగిగా మారారు. భార్యగా, భక్తురాలిగా, సహాయకురాలిగా పరమహంస సాహచర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. పరమహంస ఆమెను కాళీ మాత అవతారంగా, దైవ మూర్తిగా భావించి శారదాదేవిగా నామకరణం చేశారు. తమ ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తుల్ని సాదరంగా ఆహ్వానించేవారు. వారికి ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. భర్త దైవైక్యం పొందిన తర్వాత శిష్యులందరికీ గురువుగా మారారు. ఎంతో మంది భక్తులను పొందారు. శారదాదేవి గౌరవార్థం ఆమె భక్తుల్లో ఒకరు 1954లో శ్రీ శారదా మఠ్ రామకృష్ణ శారదా మిషన్ స్థాపించారు. దీని ద్వారా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో శాఖలు కలిగి ఉంది. మైత్రేయి ప్రాచీన భారతదేశంలో అత్యంత మేధావిగా పేరుగాంచిన మహిళగా అనేక పురాణాల్లో మైత్రేయి ప్రస్తావన ఉంది. విద్యా వ్యాప్తికై ఆమె ఎంతగానో కృషి చేశారు. వైదిక భారతదేశంలో స్త్రీలకు కూడా విద్యావకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు. భారతీయ మహిళా మేధావులకు దర్పణంగా నిలిచిన మైత్రేయి స్మారకార్థం ఢిల్లీలోని ఒక విద్యా సంస్థకి ఆమె పేరు పెట్టారు. భైరవీ బ్రాహ్మణి రామకృష్ణ పరమహంస 1861లో భైరవీ బ్రాహ్మణిని గురువుగా స్వీకరించారు. ఆమె ఎల్లప్పుడూ రామ, వైష్ణవ దేవతల ప్రతిమలను ప్రతిబింబించే ‘రఘువీర్ శిల’ను తన వెంట తీసుకువెళ్లేవారు. గౌడీయ వైష్ణవం, తంత్ర విద్యను ఆచరించేవారు. దైవత్వం పట్ల నమ్మకాన్ని, భక్తి శాస్త్రాలను బోధించారు. శక్తిని పూజించేందుకు కావాల్సిన తంత్ర విద్యను రామకృష్ణకు ఉపదేశించారు. 64 రకాల తంత్ర సాధనాలను కేవలం రెండేళ్లలో రామకృష్ణకు బోధించారు. రామకృష్ణ వీటిని పూర్తి స్థాయిలో ఆచరించేందుకు చిత్తశుద్ధి, నిగ్రహం పొందేందుకు మంత్ర, జప, పురస్కరణ వంటి సంస్కృతులు పాటించేవారు. సంప్రదాయ విరుద్ధమైన వామాచార ఆచారాన్ని(పూర్తిస్వేచ్ఛగా జీవించడం, మాంసాహారం భుజించడం, బ్రహ్మచర్యం వదలటం) కూడా రామకృష్ణకు బోధించారు. కానీ ఆయన ఈ ఆచారాన్ని పూర్తిస్థాయిలో ఆచరించలేదు. కుమారి పూజ, కుండలిని యోగ, యోగాసనాలు బోధించిన పరిపూర్ణ గురువుగా మన్ననలు అందుకున్నారు. అవ్వయ్యార్ తమిళంలో అవ్వయ్యార్ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. ఉభయ భారతి ఒకప్పటి మాహిష్మతి(మహిషి) రాజు మందన మిశ్రా భార్య. జైత్ర యాత్రలో భాగంగా ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు మాహిష్మతి రాజ్యానికి చేరుకున్నపుడు రాజుతో మేధో చర్చకు సిద్ధమవుతారు. ఈ చర్చలో విజేతను నిర్ణయించే బాధ్యతను రాజు భార్యకు అప్పగిస్తారు. చర్చలో ఓడితే రాజు సన్యాసం స్వీకరించాలనే షరుతు కూడా విధిస్తారు. వాదోపదవాదాలను, గణాంకాలను బేరీజు వేస్తూ శంకరాచార్యుల వారిని విజేతగా నిర్ణయిస్తుంది ఉభయ భారతి. షరతు ప్రకారం రాజు సన్యాసం స్వీకరిస్తారు. భర్త అడుగుజాడల్లో నడిచే భారతీయ స్త్రీ కనుక ఆమె కూడా సన్యాసం స్వీకరించి, ఇద్దరూ కలిసి ఙ్ఞాన మార్గాన్ని వ్యాప్తిచేస్తూంటారు. ఈ క్రమంలో ఆమె గంగా నది ఒడ్డున ఆశ్రమంలో శిష్యురాళ్లతో కలిసి జీవిస్తూ ఉంటారు. స్నానపానాదుల కోసం రోజూ గంగా నదికి వెళ్లే దారిలో బ్రహ్మఙ్ఞానిగా పిలువబడే సన్యాసి వారికి తారసపడతారు. అన్నింటినీ పరిత్యజించిన ఆ సాధువు ఒక మట్టికుండను మాత్రం ఎల్లప్పుడూ తన వద్దే పెట్టుకుని, ఒక దిండులాగా భావించి దానిపై నిద్రిస్తూ ఉంటారు. ఇది గమనించిన ఉభయ భారతి ‘నిజమైన సన్యాసులు దేనిని కూడా ఆస్తిగా, ప్రేమపూర్వకమైన దానిగా భావించరని’ తన శిష్యులకు చెబుతుండగా ఆ మాటలు విన్న సన్యాసి ఆగ్రహించి కుండను దూరంగా విసిరివేస్తారు. ‘నాడు ఆ కుండను మీ దగ్గర పెట్లుకుని అభిమానం పెంచుకున్నారు. నేడేమో అహంకారంతో దానిని పగులగొట్టారు’ అన్న ఉభయ భారతి మాటలు ఆయనకు కనువిప్పు కలిగిస్తాయి. ఈ విధంగా ప్రతిఒక్కరినీ ఙ్ఞాన మార్గాన్ని బోధిస్తూ తన జీవితాన్నిసంఘసంస్కరణకు అంకితం చేశారు ఉభయ భారతి. శ్రీ ఆండాళ్ వైష్ణవ మతాన్ని ఆచరించిన 12 మంది అళ్వార్లలో ఏకైక మహిళా అళ్వార్. 8వ శతాబ్దానికి చెందిన వారు. పెరుమాళ్(విష్ణుమూర్తి)ని స్తుతిస్తూ పదిహేనేళ్ల ప్రాయంలో ‘తిరుప్పావై’(తమిళం) రచించారు. ఇందులో గల 30 చరణాలను పసురామాలు అంటారు. వైష్ణవ మతాన్ని ఆచరించే అళ్వార్లు సంకలనం చేసిన ‘దివ్య ప్రబందం’లోని అంతర్భాగాలుగా వీటిని పేర్కొంటారు. పెరియళ్వార్గా పిలువబడే విష్ణుచిత్త అనే సాధువు తులసి మొక్క కింద కనిపించిన పసిపాపను చేరదీసి, కొదాయి(గోదా)గా నామకరణం చేశారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ భగవంతుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, ఆరాధనా భావం వలన భగవంతుడినే తన భర్తగా భావించి ఊహాలోకంలో విహరించేవారు. విష్ణుమూర్తి విగ్రహానికి అలంకరించే పూలమాలను తాను ముందుగా ధరించేవారు. ఇది గమనించిన ఆమె తండ్రి విష్ణుచిత్త ఆగ్రహించారు. అతని కలలో విష్ణుమూర్తి కనిపించి, తాను గోదా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు చెప్పడంతో నాటి నుంచి గోదా, ఆండాళ్,-దేవున్ని పాలించే బాలికగా పేరుపొందారు. కొంతమంది భక్తులు ఆమెను ‘సూది కొడుత సుదర్కోడి’గా పిలుచుకుంటారు. గోదా వివాహం రంగనాథ స్వామితో జరిపించేందుకు విష్ణుచిత్త ఆమెను శ్రీరంగం గుడికి తీసుకువెళ్లగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆమె దేవునిలో ఐక్యమైపోయింది. మీరా బాయి కృష్ణ భక్తురాలుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మీరాబాయి. రాజస్థాన్‌లోని కుడ్కి జిల్లాలో జన్మించారు.16వ శతాబ్దానికి చెందినవారు. మీరాబాయి రాజపూత్ వంశానికి చెందినవారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రీ కృష్ణుడిని తన భర్తగా పూజించడంతో అత్తారింటివారు ఆమెను పీడించినట్లుగా కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో సాగిన వీరశైవ భక్తి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ముఖ్యులు. కన్నడ భాషలో 430కి పైగా వచన పద్యాలు రచించారు. మంత్రోగోప్య, యోగత్రివిధి రచనలు కన్నడ సాహిత్యంలో ఆమెకు ఉన్నత స్థానం కల్పించాయి. వీరశైవ ప్రచారకులు బసవన్న, సిద్ధారామ, అల్లమప్రభు భక్తి ఉద్యమంలో మహాదేవి కృషికి గౌరవసూచకంగా ఆమెను ‘అక్క’ అని పిలిచేవారు. చెన్న మల్లికార్జుడిని(శివుడు) ఆమె భర్తగా భావించేవారు. శ్రీ దయామాత అమెరికాలోని ఊథా నగరంలో 1914లో జన్మించిన చెందిన రాచెల్ ఫాయె రైట్ తన 17వ ఏట భారత ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానందను కలుసుకున్నారు. పరిపూర్ణమైన ప్రేమ గురించి, జీవిత సత్యాల గురించి యోగానంద చేసిన ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. యోగానంద తన మొదటి శిష్యురాలిగా స్వీకరించారు. ‘దయా మాత’గా నామకరణం చేశారు. యోగానంద మరణానికి ముందు తన వారసత్వాన్ని కొనసాగించాల్సిందిగా ఆమెను కోరారు. అతికొద్ది మంది మహిళా ఆధ్యాత్మికవేత్తలు ఉన్న సమయంలో యోగానంద వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతను స్వీకరించారు. మహిళాఅనుచర గణాన్ని సంపాదించుకున్నారు. 1955లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రస్తుతం సుమారు 60 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉంది. తన శిష్యులకు కర్మ యోగాను బోధించారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగాను ప్రవేశపెట్టి, ప్రాచుర్యం కల్పించారు. సంపన్న కుటుంబంలో జన్మించిన మాతాజీ బాల్యం నుంచే గాంధీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1947లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయత, నైతిక విలువల పట్ల యువతకు అవగాహన కల్పించేవారు. 1970లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘నిన్ను నడిపించే శక్తి ఏదో నీవు కనుగొనాలంటే ధ్యాన సాధన చేయాల’ని బోధించేవారు. ఈవిధమైన ధ్యాన ప్రక్రియకు సహజ యోగాగా నామకరణం చేశారు. ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. ఈ క్రమంలోనే నిర్మలా శ్రీ వాస్తవను ఆమె అనుచరులు మాతాజీ నిర్మలాదేవిగా పిలిచేవారు. 90వ దశకంలో అంతర్జాతీయ సహజ యోగా ఆరోగ్య, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పారు. అనేక పాఠశాలలు, అంతర్జాతీయ సంగీత, కళా అకాడమీని స్థాపించారు. మా నిత్యా స్వరూప ప్రియానంద ఈమె అసలు పేరు సుదేవి. కెనడాకు చెందిన సుదేవి 2010లో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ‘ఫ్రీ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ఎన్లైటెన్మెంట్’ పేరుతో వీడియోలు పోస్ట్ చేసేవారు. తన ఛానెల్లో ముఖ్యంగా హిందుత్వ, మార్మికత, శాకాహార, ఙ్ఞానోదయ, భూలోకేతర అంశాల గురించి చర్చించేవారు. 2011లో తాను భూలోకేతర మూలాలు కలిగిన వ్యక్తినని ప్రకటిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 40 వేల మంది అనుచరగణాన్ని సంపాదించారు. 2015లో నిత్యానంద ఆశ్రమంలో చేరి స్వరూపాప్రియానందగా మారారు. ‘లివింగ్ అద్వైత’ అనే టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. జంతు ప్రేమికురాలైన మాతాజీ, వాటి హక్కుల కోసం పోరాడుతున్నారు. శ్రీ ఆనందమయి మా బెంగాల్‌కు చెందిన వారు. హిందూ ఆధ్యాత్మిక గురువు. 20 శతాబ్దానికి చెందిన తత్త్వవేత్తగా, సాధ్విగా గుర్తింపు పొందారు. వేలాది మంది అనుచరులను సంపాదించుకున్నారు. వారందరూ ఆమెను ఒక గురువుగా, దేవుని ప్రతిరూపంగా, దేవీ మాతగా కొలిచేవారు. సాధ్వి రితంభరా జీ(దీదీ మా) పంజాబ్‌కు చెందిన రితంభరా జీ సమకాలీన భారతీయ ఆధ్యాత్మికవేత్తల్లో ప్రముఖులు. హిందూ మత ప్రచారకులు. మానవతావాది. సామాజిక వేత్త. విశ్వహిందూ పరిషత్,ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. ‘దుర్గా వాహిని’ సేన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘వాత్సల్యగ్రామ్’ అనే సంస్థను స్థాపించి అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆప్యాయంగా అమ్మలా ఆదరించే గుణం కలిగిన ఆమెను అనుచరగణం ‘దీదీ మా’ అని పిలుస్తారు. ఆనందమూర్తి గురూ మా నవతరం ఆధ్మాత్మికవేత్త. క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు,యూదులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా మతాలకతీతంగా ఆమెకు అనుచరులు ఉన్నారు. ఆమె ప్రవచనాలకు లింగ, వర్గ, మత, రాజకీయ, భౌగోళిక హద్దులంటూ ఏమీలేవు. జైనిజం, బుద్ధిజం, కళలు, ఉపనిషత్తులు, యోగాలలో ప్రావీణ్యం కలవారు. ప్రతీ అంశాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయతను జోడించి తర్కించగల ఙ్ఞాననిధి. బాలికా విద్యను ప్రోత్సహించడానికి, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడానికి ‘శకి’్త అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థినులకు విద్యా అవకాశం కల్పించడంతో పాటు, ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. బ్రహ్మకుమారి భారతీయ మూలాలతో ప్రారంభమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బ్రహ్మకుమారీస్’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. బ్రహ్మకుమారీలు శివుడిని గురువుగా భావిస్తారు. సామాజిక సేవను బాధ్యతగా స్వీకరించి జీవితాంతం సేవకే అంకితం అవుతారు. ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ, సంస్కృతులతో పాటు ధ్యానం, రాజయోగా వంటి ఆధ్మాత్మిక భావనలు ప్రచారం చేస్తున్నారు. రాణి హేమలేఖ ఒక గురువుగా భర్త హేమచూడ, అత్త ఇలా ఎంతో మందిని తన ఙ్ఞాన సంపద ద్వారా అభ్యుదయ మార్గంలోకి నడిపించారు. ఆమె ప్రవచనా ప్రభావం ఎంతగా ఉండేదంటే.... ఒకానొక సమయంలో రాజ్యమంతా బ్రహ్మ ఙ్ఞానులుగా మారారట. వారి రాజ్యంలోని చిలకలు కూడా ఆమె ప్రవచనా వల్లెవేసేవట. ఈ విషయాలు ‘త్రిపుర రహస్యం’లో పేర్కొనబడినాయి. రాణి చూడల యోగ వశిష్ఠ గ్రంథంలో ఈమె గురించి పేర్కొనబడింది. మేధావుల నుంచి ఆర్జించిన ఙ్ఞానాన్ని తన భర్త రాజా సిఖిధ్వజ్కు బోధించడం ద్వారా గురువుగా మారారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
కృష్టుడిలా నాట్యం ఆడిన ముస్లిం డ్యాన్సర్
కొల్‌కత: పశ్చిమ బెంగాల్లో ఓ ముస్లిం డ్యాన్సర్ శ్రీ కృష్ణుడి పాత్రలో నాట్యం ఆడి మైమరిపించాడు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిస్టర్ నివేదిత 150 వ జయంతి వేడుకల్లో కృష్ణ లీలలు, దశావతారాలను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న ఇమ్రామ్ షైక్ కృష్ణునిలా నాట్యం ఆడి మతసామరస్యాన్ని చాటుకున్నాడు. అస్సాంకు చెందిన రంగపార డ్యాన్స్ అకాడమీలో సభ్యుడైన ఇమ్రామ్ నాల్గొరోజు ప్రదర్శన వేడుకల్లో దశావతార, కృష్ణలీలాలో కృష్ణుడిలా నాట్యం ఆడాడు. ఇమ్రామ్ను హిందూ ప్రోగ్రామ్‌లో పాల్గొనడంపై మీడియా ప్రశ్నించగా నేను నటున్ని, నటునికి మతాలు,కులాలతో సంబంధం ఉండకూడదని సమాధానమిచ్చాడు. రామకృష్ణ, వివేకానందలు మతాలను ప్రోత్సహించలేదని, భారత దేశ ఐక్యతను, మానవ విశ్వాసాలను బోధించారని 18 ఏళ్ల యువ డ్యాన్సర్ తెలిపాడు. మానవత్వమే ఒక మంచి మతమని దానికి మించింది ఏది లేదని ఇమ్రామ్ పేర్కొన్నాడు.