నా సోదర సోదరీమణులారా... | Swami Vivekananda Jayanti on 12 | Sakshi
Sakshi News home page

నా సోదర సోదరీమణులారా...

Published Sun, Jan 6 2019 12:24 AM | Last Updated on Sun, Jan 6 2019 12:24 AM

Swami Vivekananda Jayanti on 12 - Sakshi

కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, నిత్యస్మరణీయుడిగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచి ఉన్న భారతీయ ఆధ్యాత్మిక యువకెరటం స్వామి వివేకానంద. ఈ పుణ్యపుడమి ఘనతను తాను గుర్తించడమేగాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశ దిశలా చాటిన స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుండెలోతుల్లోకి చొచ్చుకొనిపోతాయి. లోకంలో కనిపించే చెడు, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే అని బలంగా విశ్వసించిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... 

హైందవ ధర్మ, ఆర్ష సంప్రదాయ బావుటాలను దేశదేశాలలోనూ ఎగురవేసి, భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను నెలకొల్పి ఎందరో విద్యావంతులైన శిష్యులను మానవసేవకు అంకితమయ్యేలా చేసిన ఆ ధన్యమూర్తి జన్మించిన జనవరి 12ను యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా వివేకానందుడు చెప్పిన మంచి మాటలు కొన్ని...ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. భగవత్సాక్షాత్కారం పొందనంతవరకు నీ మతం నిష్ప్రయోజనమే. ఎవరు మతం పేర కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తూ ఉంటారో, వారు చక్కెర బస్తాలను మోసే గాడిద వంటివారు.

ఆ గాడిదకు చక్కెర రుచి ఇసుమంతైనా తెలియదు. దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. ఇతరులకు ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచేవాడు మనుష్యుల్లో మహోత్కృష్ట స్థానాన్ని అలంకరిస్తాడు. ఎందుకంటే నీ చెయ్యి ఎల్లప్పుడూ ఇవ్వడం కోసమే రూపొందించబడింది. సమస్త నీతికి, ఆధ్యాత్మికతకు, ఉత్కృష్టతకు జనని భారతదేశం. రుషులు నడచిన దేశమిది. నేటికీ ఇక్కడ దివ్యపురుషులున్నారు. ఆ పుణ్యపురుషుల నుండి దీపాన్ని బదులు తెచ్చుకుని, నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను సోదరా! ఈ విశాల ప్రపంచంలోని పట్టణాలలో, పల్లెల్లో, మైదానాలలో అడవులలో అన్వేషిస్తాను. అంతటి మహానుభావులను మరెక్కడైనా చూపగలరా? భగవదనుగ్రహాన్ని పొందాలంటే, మానవుడు వినిర్మల హృదయుడై ఉండాలి. ఆ నిర్మలత్వం శీలం వల్లనే సిద్ధిస్తుంది.ఆధ్యాత్మిక ధర్మం పుస్తకాలలో లేదు.

సిద్ధాంతాల్లో లేదు. విధివాక్యాలలో లేదు. ఉపన్యాసాలలో అంతకన్నా లేదు. తర్కంలో అసలే లేదు. అది ఒక స్థితి. ఆ స్థితి ఒక్క సిద్ధులలోనే ఉంది. ఆ సిద్ధులు ఎవరో కాదు, మీరే! ఆ సిద్ధి పొందాలంటే, మీలో ప్రతివారూ రుషిౖయె, ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకునే వరకు, మీకు ఆధ్యాత్మిక జీవనం ఆరంభం కానట్లే. అతీంద్రియ దశ మీకు కలిగేవరకు ఆధ్యాత్మిక జీవనమనేది వట్టి అర్థంలేని మాట. మీరు భగవంతుని తెలుసుకొన్నప్పుడు మీ ముఖ వర్ఛస్సు మారుతుంది. మీ కంఠస్వరం మారుతుంది. మీ ఆకారమంతా మారుతుంది. మీరు మానవజాతినే ఉద్ధరించేవారవుతారు. రుషికి ఎవరూ ఎదురు లేరు. ఎవరూ ఎదురు నిలవలేరు. రుషిత్వమంటే అదే మరి. అది మన జాతికి పరమావధి. 

మన ఉపనిషత్తులలోనూ, శాస్త్రాలలోనూ, పురాణాలలోనూ దాగిన మహాద్భుత సత్యాలను వెలికి లాగాలి. మఠాల నుండి వాటిని బయటకు తీయాలి. అరణ్యాల నుండి తరలించుకు రావాలి. ప్రత్యేక వర్గాల అధీనం నుండి వాటిని గుంజుకు రావాలి. అవి దేశమంతటా– ఆసేతు హిమాలయ పర్యంతం  దావానలంగా వ్యాపించడానికి మనం పూనుకుంటే కార్యం సాధించామన్నమాటే. ఈ సత్యాలను మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. వాటిని ప్రజలకు మొట్టమొదట వివరించాలి. నేడు దీనికి మించిన సత్కర్మ మరొకటి లేదు. కర్మలలో దాన కర్మ ఒక్కటే గొప్పది. అన్ని దానాలలోనూ ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైనది. భారతీయుడు నా సోదరుడు! భారతీయుడే నా ప్రాణం! భారతదేశపు దేవీదేవతలే నా ఆరాధ్యదైవాలు; భరతభూమి నా చిన్నప్పటి ఊయల, పడచుదనపు పూదోట, వార్థక్యపు వారణాసి అని గర్వంగా పలకండి. కష్టాలనే అభేద్యమైన అడ్డుగోడల్ని చీల్చుకొని ముందుకు సాగేది, సచ్ఛీలంతో శక్తిని సంతరించుకున్న సంకల్ప బలమే కానీ ధనం, పేరు ప్రతిష్ఠలు, పాండితీ ప్రకర్షలు కావు. 

ఓటమిలేని జీవితం ఉండదు. పరాజయం పలకరించని ప్రభువుండడు. జీవితానికి మెరుగులు దిద్దేది ఓటమే!తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడుసేవకుడిగా ఉండడం అలవరచుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్న ఇసుమంత ఆచరణ మిన్నలక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపినప్పుడే విజయం వరిస్తుంది.నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది. స్వామి వివేకానంద పలుకులన్నీ కలకండ పలుకులలా తియ్యగా ఉండకపోవచ్చు కానీ, మనలోని అనారోగ్యాన్ని నయం చేసి, ఆరోగ్యాన్ని చేకూర్చేది చేదు గుళికలేనని మరచిపోకూడదు. ఆయన మాటలు వెన్నలా మెత్తగా ఉండకపోవచ్చు కానీ, కొండరాళ్లను పిండి చేసేది ఇనుప పలుగేనని గుర్తుపెట్టుకుని, ఆ మాటల స్ఫూర్తిని మనసులో నింపుకుని ముందుకు సాగిపోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement