
‘గు’ అంటే చీకటి.
‘రు’ అంటే కాంతి.
అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు.
కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం.
వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు.
శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు.
‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం.
ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు.
‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి.
మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment