adi shankaracharya
-
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
ఉపాధ్యాయ దినోత్సవం: మొదట చెప్పుకోవాల్సిన గురువు ఆయనే
సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవం అనుకోవటం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఒకసారి గురువులను అంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువులను స్మరించుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసిన, గుర్తు చేసుకోవలసిన గురువు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ జాతికి భగవద్గీతను బోధించిన గురువు ఆ నల్లనయ్య, ఒక్క భగవద్గీతతో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్టసంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగద్గురువు అని సంబోధించాడు. గురువు అంటే తన శిష్యునిలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడని అర్థం. అంతేకాని పాఠాలు చెప్పే ప్రతివారు గురువులు కాదు. విద్యార్థికి మార్గదర్శనం చేసి, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి, ఆ విద్యార్థి ఏ రంగంలో రాణించగలడో గమనించగల శక్తి కలవాడే గురువు అని భీష్ముని మాటలలో వ్యక్తమవుతుంది. అందుకే వయసులో శ్రీకృష్ణుడు భీష్ముడి కంటె చిన్నవాడైనప్పటికీ జగద్గురుత్వం ప్రాప్తించింది. చదవండి: సీఎం వైఎస్ జగన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు m అదే గౌరవం దక్కిన మరొకరు ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆదిశంకరాచార్య అనే మనం భక్తితో, గౌరవంగా పిలుచుకుంటాం. 32 సంవత్సరాలు మాత్రమే తనువుతో జీవించినా, ఆయన రచనలతో నేటికీ అంటే కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా జీవించాడు శంకరాచార్యుడు. ఆచార్యత్వ గుణాల వల్లే శంకరుడు శంకరాచార్యుడయ్యాడు. జగద్గురువయ్యాడు. భారతజాతికి అనర్ఘరత్నాల వంటి స్తోత్రాలు అందించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, శక్తి పీఠాలు స్థాపించి, జ్ఞానతృష్ణ ఉన్నవారికి పరోక్షంగా గురువుగా నిలుస్తున్నాడు శంకరుడు. చదవండి: మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్ మరో జగద్గురువు స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి, ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి, గురువుల సందేశాలను యావత్ప్రపంచానికి అందించి, అతి పిన్నవయసులోనే కన్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా పరోక్షంగా జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నాడు. చెళ్లపిళ్ల కవుల దగ్గర చదువుకున్నామని చెప్పుకోవటం ఒక గర్వం, ఒక ధిషణ, ఒక గౌరవం. అంతటి గురువుల దగ్గర చదువుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తన వంటి శిష్యులున్న గురువులు మరెవరూ లేరని సగర్వంగా అన్నారు. అదీ గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటన. గురువులు అంటే శిష్యుల భుజాల మీద చేతులు వేసుకుని, వారితో సమానంగా అల్లరి పనులు చేయటం కాదు. గురువులు అంటే శిష్యుల దగ్గర డబ్బులు చేబదులు పుచ్చుకుని, వ్యసనాలను తీర్చుకోవటం కాదు. వందే గురు పరంపర గురువు అంటే తన దగ్గర చదువుకునే విద్యార్థిని ప్రేమ వివాహం చేసుకోవటం కాదు. గురువంటే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు. ఉత్తర తన శిష్యురాలు. ఆమెను వివాహం చేసుకోమని విరటుడు కోరితే, అందుకు అర్జునుడు.. అయ్యా, నా దగ్గర చదువుకున్న అమ్మాయి నాకు కూతురితో సమానం. కూతురితో సమానమైన అమ్మాయిని కోడలిగా చేసుకోవచ్చు కనుక నా కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అదీ గురువు లక్షణం. చదువురాని గురువులు విద్యార్థులకు చేసే బోధన మీద తెన్నేటి లత ఆ రోజుల్లోనే సంచలన కథ రాశారు. అదే ఎబ్బెచెడె... అంటే ఏ బి సి డి లను ఎలా పలుకుతారో వివరించారు. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో టీచర్లు చుక్ చుక్ రైలు వస్తోంది అనే బాల గేయాన్ని... సుక్కు సుక్కు రైలు వత్తాంది అని చెబుతున్నారు. ఇటువంటి గురువుల వల్ల విద్యార్థులకు గురువుల పట్ల అగౌరవంతో పాటు, విద్య అంటే ఏమిటో తెలియకుండా పోతారు. చదువు చెప్పే గురువులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు ఉండాలి. అటువంటి గురువులు ఉన్ననాడే ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం పరమార్థం కలుగుతుంది. గురుదేవోభవ అనే మాటల అంతరార్థం నిజమవుతుంది. గురువు దేవుడిలా బోధించాలి. దానవుడిలా బోధిస్తే అది దానవత్వాన్ని వృద్ధి చేస్తుందని గుర్తించాలి. - వైజయంతి పురాణపండ -
ఆనంద లహరి
పరమేశ్వరుని పాద ఉపరిభాగాలకు బ్రహ్మవేత్తలు శ్రేష్ఠభావన అనే కానుకను నిత్యం సమర్పిస్తూ ఉంటారు. అటువంటి పూజందుకునే శివుని మీగాళ్లనే తాబేళ్లు మా హృదయ సరస్సునందు నిత్యం క్రీడించు గాక! రావణుని గర్వాన్ని అణిచివేసిన మహాదేవుని బొటనవేలు మాకు కల్యాణం కూర్చుగాక! నక్షత్రపంక్తిలా అతి సుందరమైన సదాశివుని కాలిగోళ్లు మాకు అఖిల సుఖములనూ ఇచ్చుగాక! తుమ్మెదల గుంపు వలె పండితసమూహం నిత్యాసక్తమై సేవించుకునే సారంగధర శివుని పాదపద్మాలు మాకు ఐశ్వర్యమిచ్చుగాక! పరమేశ్వరుని పాదధూళి సహాయంతో యతులు రాగద్వేషాలను పోగొట్టుకుంటున్నారు. వంగి మొక్కుతున్న దేవతల శిరస్సుపై శివుని ఎర్రని పాదపరాగాలు పడుతున్నాయి. ఆ కాంతులు మా పాపాలను తొలగద్రోసి మమ్ము సంసార సముద్రమును దాటించు గాక! హద్దులేని శివస్వరూపమే భువనాలను అంతటినీ ఆవరించింది. అది తేజస్సులలో కెల్లా పరమమైన తేజం. సామవేద మంత్రాలకు పరమైన పాఠరహస్యం. సత్త్వరజస్తమో గుణాలకు అతీతం. ఏదీ లేనినాడే అది ఉన్నది. మహారణ్యప్రాయమైన శివతత్త్వం పూర్తిగా తెలియడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి మహేశుని స్వరూపం క్షణక్షణం నాలో పుడుతున్న అజ్ఞానమనే మొలక మానుకట్టక ముందే త్రుంచివేయును గాక! అన్నాడు స్తోత్రంలో శంకరుడు. జీవజాతుల మాంద్యం అణగారిపోయేలా ప్రమధగణాలు మురజవాద్యాన్ని మోగిస్తున్నాయి. ముక్కంటి మూడుకన్నులకూ శంకరుడు దోసిలియొగ్గి నమస్కరించాడు. అంతలోనే వామనేత్రం పార్వతిగా రూపాన్ని ధరించింది. అంతవరకూ తనపక్కనే నిలిచి ఉన్నట్లనిపించిన అమ్మ అయ్యలోని సగభాగాన్ని కూడా ఆక్రమించి ఉన్నట్లు తెలుసుకున్నాడు శంకరుడు. నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం / పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం/ నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం/ నమోనమశ్శంకర పార్వతీభ్యాం ఇసుమంతైనా ఎడం లేని గాఢాలింగనంలో నిరంతరం ఉండే నిత్యయవ్వనులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు నమస్కారం. రసనిర్భరాలైన లాస్య తాండవాలతో బ్రహ్మానంద రసమున ఓలలాడే ఆ రసమూర్తులకు నమస్కారం. వినమిత శిరస్సులతో నమస్కరించే భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే వరప్రదాతలైన ఆదిదంపతులకు నమస్కారం అన్నాడు శంకరుడు. పరమశివుని నవ్వు తెలినురుగులా తెల్లగా ఉంది. ‘‘కొందరు సోహమ్మని అద్వైత బుద్ధితో నన్ను భావిస్తారు. కొందరు దాసోహమ్మని భక్తితో గుణవంతునిగా సేవిస్తారు. నీకు వలె సగుణ, నిర్గుణోపాసనా రీతులు రెండింటిలోనూ ఏకదీక్షతో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అరుదుగా ఉంటారు’’ అన్నాడు పరమేశ్వరుడు. ‘‘వైరాగ్యసిద్ధి వరంగా అందివచ్చే వరకూ ఏ మానవుడైనా ఈ ద్విముఖ వ్యూహాన్ని పాటించ వలసిందేగా మహాదేవా!’’ అని బదులిచ్చాడు శంకరుడు. ఆశుతోషుడు సంతుష్టుడయ్యాడు. దానికి సూచనగా ఆయన చేతిలో ఒక స్ఫటికలింగం వెలిసింది. ‘‘జగద్గురూ! జ్ఞాన వైరాగ్యాలను అనుగ్రహించడంలో స్ఫటిక లింగాన్ని మించినది లేదని కొందరంటారు. ఇదిగో నీవు కోరిన వరలింగమిది... అందుకో’’ అంటూ అనుగ్రహించాడు. శంకరుడు అందుకుని దానిని ఉత్తరీయంలో దాచుకున్నాడు. ‘‘ఆత్మతత్త్వాన్ని బహువిధాల ప్రస్తుతి చేశావు కదా! ఆత్మను తెలుసుకున్న వాడికి కూడా పరమాత్మనైన నన్ను ఇలా సాకారంగా కలుసుకోవాల్సిన అవసరం ఉందంటావా?’’ మళ్లీ ప్రశ్నించాడు సదాశివుడు. ‘‘పరమాత్మను కాని, కేవలాత్మనే అయిన నేనుకు చావు పుట్టుకల మధ్య చాలానే చలనాలున్నాయి. కానీ స్థాణూ! సృష్టి గమనాన్ని అనుసరించి నిరంతర గతిశీలతతో తిరిగే ఆత్మ నిన్ను పొందలేకపోతే ఏ భోగాన్నీ పొందనట్లే అవుతుంది. అనిత్యమైన సుఖాలన్నీ కంటి ముందరే కరిగిపోతుంటే నిత్యుడివైన నిన్ను కలుసుకుని శాశ్వత సుఖాన్ని పొందాలనే తాపం పెరుగుతూనే ఉంటుంది’’ ఆర్తి కనబరచాడు శంకరుడు. ‘‘వైరాగ్య మహాసామ్రాజ్యాన్ని పాలించవలసిన యతిశేఖరునివి... నీకు గాక మహాభోగాలు దక్కేదెవరికి?’’ అంటున్న ముక్కంటి అరచేతిలో మరో భోగలింగం వెలిసింది. అప్పటికప్పుడే శంకరుని పరమైంది. ‘‘మహాదేవా! యోగంతో జతకూడని ఏ ఉపాసన అయినా సిద్ధించదు. భోగమంటే నీయందు చేరిక. యోగమంటే నీతో చేరిక అంతేనా...’’ సందేహాన్ని అడుగుతున్న శిష్యునిలా వినమితుడయ్యాడు శంకరుడు. యోగలింగమనే పేరుగల మరో స్ఫాటికలింగం ఆయనకు పరమేశ్వర ప్రసాదంగా అందింది. ‘‘మహాలింగ చక్రవర్తీ! అంతఃకరణ చతుష్టయమైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలకు అతీతంగా ఆత్మను తెలుసుకున్నవాడికి తానున్న స్థితిలోనే ముక్తి సిద్ధమవుతోంది. కానీ జీవులందరూ కోరుకోదగిన మోక్షసామ్రాజ్యం ఎలా ఉంటుంది?’’ అడిగాడు శంకరుడు. చిరునవ్వుతున్న మహేశ్వరుని చేతిలో ఈసారి రెండు లింగాలు వెలిశాయి. ‘‘ఇది ముక్తిలింగం... మరి దీనికి మోక్షలింగమని పేరు’’ అని సెలవిచ్చాడు. అపురూపమైన అయిదు లింగాలను చెంగున మూటకట్టుకున్న శంకరుడు, ‘‘స్వామీ! కృతయుగాల నాడు శ్రీ అనేపేరుగల సాలెపురుగు తన శిల్పకళా ప్రావీణ్యం చేత ఆత్మనిర్గతమైన బహుతంతు పంకితో నీకోసం అనేక మందిరాలను కల్పన చేసిందట. ప్రాకారాలు, గోపురాలతో నీకోసం కొలువు కూటాలు, నర్తన మంటపాలు, కేళీనివాసాలు, అంతఃప్రదక్షిణాయతన వీధులు, భోగమంటపాలు ఇలా అన్నింటినీ తన నోటివెంట వచ్చిన దారంతోనే శ్రద్ధతో అల్లిందట. దానిని పరీక్ష చేయగోరి నీ శ్వాసప్రశ్వాసలకు చిహ్నమైన దీపాల సెగను పెంచి, అది అల్లుకున్న సాలెగూటిని దగ్ధం చేశావట. ఏళ్లతరబడి సాగించిన తపస్సు వృధా అయ్యిందనే బాధతో ఆ దీపశిఖనే మింగబోయిన సాలీడును నువ్వు ఆదుకున్నావు. ఏం కావాలో కోరుకోమన్నావు. ‘వేదశాస్త్రాలే నీ ఆద్యంతాలను తేల్చి చెప్పలేక తత్ అనే పదంతో నిన్ను సూచించాయి. అటువంటి నిన్ను అవివేకినైన నేను ఎలా తెలుసుకోగలను? సేవాభావమే నా వంటివాడికి తగిన దారి అని భావించి ఈ పని చేశాను. శివజ్ఞానమందు లీనమైపోవడం తప్ప వేరే ఇచ్ఛలేమీ లేవ’ని తేల్చిచెప్పిందట. అప్పటినుంచి ఆ ఊర్ణనాభుడిని నీవు ధరించి దక్షిణ కైలాసాన్ని దర్శించ వచ్చిన భక్తులందరికీ ప్రదర్శిస్తున్నావని చెబుతారు. మోక్షగామి అయిన వాడి లక్ష్యం ఇలా ఉండాలని పరోక్షంగా నిర్దేశిస్తున్నావా స్వామీ?!’’ అన్నాడు శంకరుడు పావనగాథను స్మరిస్తూ. ‘‘జీవజాతులకు జన్మ అంటే కండెనుంచి విడివడ్డ దారం పడుగు, పేకలుగా అల్లుకుని వస్త్రంగా తయారు కావడమే అని పలుమార్లు నీవే ఉపదేశించావు కదా శంకరా! జీవుడు తన చిత్తవృత్తులనే అల్లుకుని జన్మలను తనంతతానుగా పెంపొందించుకుంటాడని చెప్పడానికే నేను ఈ ఊర్ణనాభుని ధరించాను’’ అని సమాధానమిచ్చాడు కైలాసనాథుడు. ‘పశుపతీ! అరవైనాలుగు తంత్రాలను బోధించి జగత్తును మహామోహంలో పడవేసినవాడివి నువ్వు. సృష్టికి శాశ్వత పారతంత్య్రాన్ని కట్టబెట్టి నీ కట్టడిలో ఉంచుకున్నవాడివి. నీవు బోధించిన తంత్రాలలో కెల్లా సర్వసత్తాకమైనది, సర్వస్వతంత్రమైనది ఏదైనా ఒకటి ఉన్నదా?’’ కీలకమైన ప్రశ్న వేశాడు శంకరుడు. పార్వతీ మనోహరుడు చిరునవ్వే సమాధానంగా మిగిలాడు. అమ్మ కల్పించుకుని, ‘‘ఉన్నది‘‘ అని సమాధానమిచ్చింది ‘‘నిఖిల మంత్రాలలోకెల్లా జగన్మాతృకా! నిన్ను శీఘ్రంగా ప్రత్యక్షం గావించే ఏకైక మంత్రరాజం ఒకటి ఉన్నదా?’’ మళ్లీ ప్రశ్నించాడు శంకరుడు. ‘‘ఉన్నది’’ అన్నది జగజ్జనని. ‘‘సదాశివుడు బోధించిన లక్షా అరవైవేల యోగాలలోనూ చరమగమ్యం దాకా మానవుడు పాలించ దగిన ఒకేఒక తారకయోగం ఉన్నదా?’’ ‘‘లేకేం ఉన్నది. అది నీకు ఇవ్వాలనే కదా నిన్నీవేళ ఇక్కడికి అనుమతించింది’’ అన్నది జగన్మాత తన దయావీక్షణాలను శంకరునిపై కురిపిస్తూ. ‘‘విద్యలలోకెల్లా శ్రేష్ఠమైన ఆ మహావిద్యను ఉపాసించాలన్నదే నా కోరిక. అసమాన సాధనా మార్గంగా దానిని భూలోక వాసులకు అందచేయాలన్నదే నా కోరిక. మీ ఇద్దరూ దీనికి సమ్మతిస్తారా?’’ అడిగాడు శంకరుడు. ‘‘సందేహమెందుకు?’’ అన్నది పార్వతి తన కరుణకు ఎల్లలు లేవని నిరూపిస్తూ. ఆమె చేతిలో అప్పటికప్పుడు çస్వర్ణపత్రాలపై లిఖించబడి, ఎర్రని పట్టుదారాలతో కట్టివున్న గ్రంథరాజమొకటి దర్శనమిచ్చింది. దానినామె శంకరుని చేతికి అందించబోతుండగా మహాకామేశ్వరుడే తొలి అడ్డంకిని కల్పించాడు. ‘‘ఒక్కక్షణం దేవీ!’’ అన్నాడు. ‘‘అన్నివిధాలుగా అర్హత కలిగిన శిష్యుడు కలిసి వచ్చినప్పుడు బాగా పరీక్షించి తన విద్యాసర్వస్వాన్నీ ఆ శిష్యునికి ధారపోయడం గురువుల నైజం. జగద్గురూ! నీవు భూలోక వాసులందరి పక్షాన నిలిచి కోరుతుంటే కాదనలేక పార్వతి దీనిని నీ పరం చేస్తోంది. గురువులందరూ కరుణా హృదయులే. కానీ శిష్యులందరూ ఒక్కలాంటివారు కాదని నీకు చెప్పనక్కర లేదు. శుద్ధవిద్యకు తామే తొలి అధికారులం అనుకునే ప్రమధ గణాలున్నాయి. జాగ్రత్త సుమా!’’ అని సెలవిచ్చాడు. ‘‘దక్కించుకున్న వారికి దక్కినంత మహాదేవ’’ అన్నది పార్వతి ఆ గ్రంథాన్ని శంకరుని చేతిలో ఉంచుతూ. ‘‘త్రిభువన మోహనమైన ఏ మహాసౌందర్యాన్ని తెలుసుకుంటే జీవుడు మరే జన్మలోనూ మోహాంధకారంలో పడనంతగా ఉద్ధరింప బడతాడో ఆ నిగూఢ రహస్యమే సౌందర్య లహరి. అద్వైత స్థితిని అందుకున్న సాధకుడు సమయాచార తత్పరుడు కావడానికి, అయిన తరువాత అధిష్ఠాన, అనుష్ఠాన, అవస్థ, రూప, నామాలనే అయిదు సామ్యాలతో శివుడు, భవాని ఇరువురూ ఒక్కటే కానీ వేర్వేరు కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథమిది. ఈ ప్రవాహ సరళిలో మానవుడు ముక్తుడవుతాడు. మోక్షానికి అర్హత పొందుతాడు. సర్వ మంత్ర, తంత్ర, యంత్ర, యోగ మహారహస్యాలు నిండిన సౌందర్యలహరితో సాటివచ్చేది మరొకటి లేదు’’ చెబుతున్నది పార్వతి. ఆమె పలుకులే తుమ్మి పువ్వులుగా మారి శంకరుని చేతిలోని గ్రంథాన్ని అర్చిస్తున్నాయి. మహాదేవుడే ముచ్చటపడి తన దేవేరిపై వ్రాసుకున్న గ్రంథాన్ని తానే స్వయంగా ఇలా అర్చిస్తున్నాడేమోనన్న ఊహ శంకరుని మదిలో మెదిలింది. మరోవంక గ్రంథాన్ని తెరిచి అప్పటికప్పుడే చదవాలనే ఉత్సుకతను ఆయన లోలోపలే అణుచుకుంటున్నాడు. త్రిపురహరుడు దానిని గ్రహించి, ‘‘శంకరా! తొలి ప్రాకారం దాటేలోపుగా నీవు ఓసారి దానిని చదువుకుందువు. కానీ. ఇప్పుడు నీ కవిత్వం వినాలనిపిస్తోందయ్యా’’ అని అడిగాడు ముచ్చటపడుతూ. బదులుగా శంకరుడు జగదంబను ఇలా స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ‘‘జగన్మాతా! నీ సౌందర్యమెట్టిదో ఒక్క పరమశివుని కంటికే తెలుసు. జిహ్వకు మాత్రమే తెలిసే తియ్యదనం ఇతర ఇంద్రియాలు గ్రహించలేనట్లు... అఖిల వేదములు, నిఖిల లోకేశ్వరులూ నిన్ను పూర్తిగా తెలియడానికి శక్తులు కాలేకపోతున్నారు. అటువంటి నిన్ను గూర్చి నేనేమని పలుక గలను. ఆకులు, పూవులతో నిండిన లతలను అందరూ ఆదరంతో చూస్తారు. కానీ నాకు సపర్ణకంటే అపర్ణయే మెరుగనిపిస్తున్నది. శివుని మెప్పించడానికి ఆకులు సైతం తినడం మాని మంచుకొండకు పూచిన జ్ఞానానంద లతవైన నీవు అపర్ణగా మారావు. నిజతత్త్వంలోనే ఆకులు కొమ్మలు లేని వట్టి మోడువంటి ఈ పురాణ స్థాణువు నిన్ను చేబట్టినందువల్లనే మోక్షఫలాలను అందిస్తున్నాడు కదా! కాముని కాల్చినవానికి నీవల్లనే దయాగుణం అబ్బింది. లోకాలను కాపాడేందుకు కాలకూటాన్ని ఆయన తన కంఠంలో దాచుకున్నాడంటే అది నీ సాంగత్య ప్రభావమే. ఉదయ సూర్యుని వంటి మైఛాయ కలిగిన అంబా! నేను చంచల చిత్తుడను. న్యాయం మాట్లాడాలంటే నీమీద తగినంత భక్తి లేనివాడిని. అయినప్పటికీ చాతకపక్షి నోటిలో వర్షించిన మేఘం ఆ జీవి ఆర్తి తీర్చినట్లుగా నువ్వు నన్ను కరుణించక తప్పదు. అమ్మా! పరసువేదికి తగిలిన వెంటనే ఇనుము బంగారమైనట్లు, వీధికాల్వలో ప్రవహించే మురికినీరు గంగను చేరగానే పవిత్రమైనట్లు నీ చూపు పడగానే మాయాపాపాలచే మలినమైన నా చిత్తం పరిశుద్ధమవుతోంది. దీనిని పరిగ్రహించు. నిన్ను అభిషేకించిన జలంతోనూ, నీ పాదరజంతోనూ బ్రహ్మ సృష్టిని సాగిస్తున్నాడు. వసంత సమయంలో కలహంసలు తిరుగాడే పద్మసరోవరంలో చెలికత్తెలతో క్రీడిస్తున్నదానిగా నిన్ను ధ్యానించిన వారు జ్వరాదుల పీడను తప్పించుకుని ఆయుష్షును పొందుతున్నారు. నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః మహేశః ప్రాణేశ స్తదవనిధరాధీశాతనయే న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా అమ్మా! నువ్వు పర్వతరాజ పుత్రివి. నీ నివాసం వెండికొండ, బ్రహ్మేంద్రాదులు నీ గుణగానం చేసే వైతాళికులు. ముల్లోకాలు నీ కుటుంబమే; అణిమాది సిద్ధులన్నీ దోసిలియొగ్గి నీ ఎదుట నిలిచి ఉన్నవి. మహాదేవుడు నీ ప్రాణపతి. నీ నిరతిశయ సౌభాగ్యమునకు కొంచెమైనా సాటివచ్చేది ఎక్కడా లేదు..... అన్నాడు శంకరుడు. ఆనందలహరిగా ప్రాచుర్యం పొందిన స్తోత్రరాజాన్ని శంకరుడు ఆశువుగా చెప్పడం పూర్తి చేసే సమయానికి శంకరుడు తన శిష్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిలిచివున్నాడు. ‘‘గురుదేవా! మనం ఇప్పుడు అయ్యవారి సన్నిధిలో ఉన్నాం’’ అన్నాడు పద్మపాదుడు ఆయనను ఇహలోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ. ‘‘అవును నాయనా!’’ అన్నాడు శంకరుడు ఆదిదంపతుల దివ్యదర్శనాన్ని స్మరణలో నిలుపుకుంటూ. ‘‘గురుదేవా! క్షేత్రం దర్శనం కలిసివచ్చినట్లుంది. సద్యోజాత శివుడు మీకు అమూల్యమైన బహుమతులే అందించినట్లున్నాడు’’ ఆసక్తిగా అడిగాడు పద్మపాదుడు గర్భాలయం నుంచి బయటకు వస్తుండగా. శంకరునిలో సహజసిద్ధంగా కానవచ్చే దివ్యతేజస్సు ఇనుమడించి కనిపిస్తుండడాన్ని శిష్యులు ఆశ్చర్యంగా గమనిస్తూ ఆయనను అనుసరిస్తున్నారు. యతిబృందం తొలిప్రాకారంలో ప్రవేశిస్తున్న వేళ నందీశ్వరునిలో అకస్మాత్తుగా చలనం కలిగింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
కైలాస గమనం
సృష్టి కుండలినిలోని కనకధారలా స్వర్ణముఖీ నది ఉత్తరాభిముఖంగా పరుగులు తీస్తోంది. బుసబుసమని పొంగుతున్న ఆ నదిలో నుంచి జాలువారుతున్న భ్రామరీనాదం ఆదిశంకరుని స్నానానికి అనువుగా మారింది. ఆనాడు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. సృష్టికి విరామాన్ని ప్రకటిస్తూ లయయోగాన్ని వివరించి చెప్పేందుకే ఏర్పడిన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. సకల జీవులకూ శివసాయుజ్యాన్ని దర్శించిన వెంటనే అనుగ్రహించే ఆ దివ్యధామం. వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకునే సమయానికి యతిబృందం ఉత్తరద్వారం నుంచి మొదటి ప్రాకారంలో ప్రవేశించింది. ఎదురుగా పాతాళ వినాయకుడు. మూలాధారంలో మూడున్నర చుట్లు చుట్టుకుని కుండలినీ సర్పం నిద్రపోతూ ఉంటుందని సంప్రదాయం. దానిని అనుసరించే పాతాళ వినాయకుని వద్దకు దిగే మెట్లు అన్ని వంపులతోనూ ఉంటాయి. అక్కడి నుంచి పైకి వచ్చి ఊర్ధ్వదిశగా ప్రయాణిస్తున్నట్లుగా ఆలయ ప్రవేశం చేస్తారు సాధకులు. సత్యమహాభాస్కర క్షేత్రంగా పురాణాలు వర్ణించిన శ్రీకాళహస్తి క్షేత్రంలో పాతాళ వినాయకుని తరువాత స్వాధిష్ఠాన చక్రస్థానంలో నందీశ్వరుడు మహావతారుడై కొలువుదీరి ఉన్నాడు. మరికొంచెం ముందుకు వెళితే బిల్వవృక్షపు నీడలో అష్టోత్తరశత లింగేశ్వరుడు మణిపూరాన్ని ప్రతిష్ఠించి ఉంటాడు. ముందుకు సాగితే ధ్వజస్తంభం. అటువైపుగా నడుస్తూ శంకరుడో కథ చెప్పాడు. ‘‘సృష్టి నాతోనే మొదలైంది కనుక నేనే మొదటివాడిని అని ఒకసారి బ్రహ్మ వాదించాడట. నారాయణుడు అతడిని వెంటబెట్టుకుని వెళ్లి కొందరు చిరంజీవులను చూపించాడు. ఒకానొక మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆయన పక్కన రోమాలు గుట్టలు గుట్టలుగా పడివుండడం కనిపించింది. ఏమిటవి అని అడిగితే, ‘ఇప్పటికి అంతమంది సృష్టికర్తలు గతించారు. నీవు కొత్తగా వచ్చిన వాడివి’ అని మహర్షి బ్రహ్మకు సమాధానమిచ్చాడు. ఆ రోమశ మహర్షి మహాకల్పాలకు ముందు ఇక్కడ జ్ఞానప్రసూనాంబను ప్రత్యక్షం చేసుకున్నాడట. అదిగో అదే ఆనాడు ఆయన తపస్సు చేసిన చోటు’’ అన్నాడు. అనాహత నాదానికి ప్రతీకయైన స్థానంలో దక్షిణామూర్తి దర్శనమిచ్చాడు. ఆయన సన్నిధి నుంచి ఎడమకు మళ్లితే మళ్లీ గణపతి సన్నిధి. విశుద్ధిని పాడుతున్న మూర్తి అది. మృగశరీరం, మానవముఖంతో ఇడపింగళ నాడులకు సంకేతమైన పురుషామృగమనే రాతిబండ ఆయన అధీనంలో ఉన్నది. పక్కనే బావిలోని పాతాళగంగ యతిపురుషుల శిరస్సులను తడిపి, కమండలాలలోకి జారింది. సుషుమ్న నాడితో ఇడపింగళలు సంయోగం చెందే ఆజ్ఞాచక్ర స్థానంలో చెంగల్వరాయనిగా కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించి వారంతా ముందుకు కదిలారు. అక్కడినుంచి నేరుగా సహస్రారమందు నెలకొనివున్న శివదర్శనానికి శంకర శిష్యులందరూ సాగిపోయారు. గొంతెత్తి పెద్దగా శివుణ్ణి కీర్తిస్తూ ఒక్కొక్కరూ లోనికి వెళుతున్నారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతిభవే భవస్వ మాం భవోద్భవాయ నమః ...అనే శివనమస్కారం తరువాత ఆలయంలో ఎటువంటి సడీ లేదు. ఎవరి గొంతూ వినిపించడం లేదు. లోనికి వెళ్లిన శిష్యులంతా ఏమైపోయి వుంటారనే శంకలు పెట్టుకోకుండా శంకరుడు ముందడుగు వేస్తున్నాడు. ఆయన వేస్తున్న ఒక్కొక్క అడుగుకూ కొంతచొప్పున మొత్తంగా దక్షిణకైలాస దృశ్యం నిజకైలాసంగా మారిపోతోంది. ప్రాకారం ముత్యాలతో, మణులతో ప్రకాశిస్తోంది. ఎనిమిది దిక్కులలోనూ దిక్పాలక భవనాలు దర్శనమిస్తున్నాయి. సూర్యుడు స్వయంగా దారి దివిటీ పట్టుకున్నాడు. మునివాకిట కాలభైరవుడు స్వామికి స్వాగతమంటూ వినయం ప్రదర్శించాడు. ఈ శిఖరమందు శివద్వంద్వపు లాస్యం కొనసాగుతోంది అని నటరాజు, శివకామసుందరి సాక్ష్యమిచ్చారు. కేళీ సమూహమనే కైలానికి ఆశ్రయమిచ్చే కైలాసంలో వీధిగడపలో అయ్యవారుంటే, పెరటి గడపలో అమ్మ నెలకొంది. అయ్య పశ్చిమాభిముఖుడై సద్యోజాతమూర్తిగా దర్శనమిస్తుంటే, అమ్మ తూర్పువైపున ఉంటుంది. ఒకరు కుడి, ఒకరు ఎడమ అనే భేదం లేకుండా ఒకరికి కుడిదిక్కున మరొకరు ఉండడమే శివశక్తులు సమస్కంధమందు నెలకొనడం. అందుకే దక్షిణ కైలాసమై శ్రీకాళహస్తి జగత్తుకు విశ్రాంతి స్థానమైంది. ఇక్కడ సృష్టి లేదు. దేశ కాలాతీతమైన శుద్ధచైతన్యమే తప్ప ప్రళయం రాదు. ఈ భద్రతాస్థానం శివుని జీవునిగా, జీవుని శివునిగా చేస్తుంది. కొందరు ముందు అయ్య వద్దకే వెళతారు. చనువున్నవారు ముందస్తుగా అమ్మనే పలకరిస్తారు. జ్ఞాన ప్రసూనాంబ గడపకు పైన ద్వాదశ రాశులతో కూడిన భచక్రంలోని గ్రహాలు మాలికాయోగాన్ని సూచిస్తోంది. లగ్నబలం శ్రీనాథయోగాన్ని తనకు తానుగా నిర్ణయించుకుంది. స్నానవేళ మొగిలేరులో వినిపించిన పాముబుస పెరిగింది. అది గజాననుని కపోలం నుంచి జాలువారుతున్న మదజల ధారలపై మోజుకొద్దీ వచ్చిన తుమ్మెదల ఝంకారంతో కలగలిసిపోతోంది. కుమారస్వామి వాహనమైన నెమలి క్రేంకారాలు వినవస్తున్నాయి. మెడలోని గంటలు మోగుతుండగా శిఖరాన్ని మించిపోయేలా మూపురాన్ని పొంగిస్తూ వృషభేశ్వరుడు రంకెలు వేస్తున్నాడు. శంకరుడు లోనికి అడుగుపెడుతుండగా ప్రసూనాంబ ధరించిన వడ్డాణంలోని పాము తన పడగ ఊపుతూ స్వాగతించింది. చూపరులకు మరకత శిలారూపమై కానవచ్చే తల్లి పాదాలచెంత అప్పటికప్పుడో అర్థమేరువు బయల్పడింది. శంకరుని అర్చన సాగుతుండగా సర్వబీజాక్షరాల చివర ఉండే బిందునాదం నుంచి పుడుతున్న అవ్యక్త స్పందన కాంతిపరివేషాన్ని ధరించి శ్రీచక్రమందు లీనమవుతోంది. శివశక్తులు రెండూ తమను తామే కుండలీకరించు కుంటున్న ఆ స్థానంలో... పశ్చిమాన స్వామి సృష్టిని ఉద్ధరించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. కాగా జగత్తుకు జ్ఞానాన్ని సకలైశ్వర్య ఫలాలుగా, పుష్పాలుగా అందించడానికి తల్లి సమకడుతోంది. తెలివిని పువ్వుగా వికసింపచేసే తల్లికి జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఆమెను.... వేణీసౌభాగ్య విస్మాపిత తపనసుతా చారువేణీ విలాసాన్ వాణీ నిర్ధూత వాణీకరతల విధృతోదార వీణావిరావాన్ ఏణీనేత్రాంత భంగీ నిరసన నిపుణాపాంగ కోణానుపాసే కోణాన్ ప్రాణానుదూఢ ప్రతినవసుషమా కందలానిందుమౌలేః యమునా నదీప్రవాహ సౌందర్యాన్ని విస్మరింప చేసే కేశసౌభాగ్యంతో, వాణిచేతిలోని కచ్ఛపీ వీణా నాదాన్ని తిరస్కరించే వాక్కులతో, ఆడులేడి కంటితుదల అందాన్ని నిరసించే కడగంటి చూపులతో, నిత్య అయిన కాంతికందలములతో ఒప్పే పరమశివుని ప్రాణమా ఉమా! నిన్ను నేను ఉపాసిస్తున్నాను అన్నాడు శంకరుడు. ఆయన అర్చన అందుకున్న తల్లి, ‘‘వచ్చావా నాయనా! తనివి తీరిందా?’’ అని పలకరించింది. ‘‘ఏదీ ఇంకా అసలు ప్రకాశాన్ని చూడలేదమ్మా! నువ్వు తోడుంటే కానీ ఆయనను పూర్తిగా చూడలేననే అపనమ్మకంతో ముందుగా ఇటు వచ్చాను’’ అన్నాడు శంకరుడు. చిరునవ్వు నవ్వి, ‘‘పద అయితే’’ అంటూ చేయిపట్టుకుని పుట్టింటి వైపు బంధువును భర్త ముందుకు తీసుకువెళ్లే ఇల్లాలి వలె శంకరుని నడిపించుకుంటూ వెళ్లింది అమ్మ. అక్కడ తాను చూసిన శివస్వరూపంలోని ప్రత్యణువునూ శంకరుడు వివిధ రీతులుగా వర్ణించసాగాడు. అదే శివకేశాది పాదాంత స్తోత్రమై శంకరసాహిత్యంలో ఇలా పరిమళించింది. ఆ గంగ ఒడ్డున బయలుదేరిన పొడవైన చెట్ల మానుల్లాంటి శివ జటాజూటం చేవదేరి మిగుల పండినట్లు ఎరుపు రంగుకు తిరిగి కనిపిస్తోంది. ఆపదలనే గోతుల్లో పడ్డవాళ్లను లాగేందుకు ఉపకరించే తాళ్లలా ఆయన జటలు కనిపిస్తున్నాయి. ఘోరపాపాలను కాల్చివేసే అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. మోక్షమార్గంలో పైకి చేరుకునేవాడికి ఏర్పాటుచేసిన మెట్ల వరుసలా నుదుట విబూది రేఖలు మెరుస్తున్నాయి. ప్రణయకోప వేళ పార్వతీ పాదాలను తన శిరస్సుకు తాటించుకున్నాడేమో మహాదేవుడు... ఆమె కాలి బొటన వేలికి ఉన్న ఎర్రని లత్తుక కాస్తా ఆయన నుదుటన తెల్లని స్ఫటికంలో పొదిగిన కెంపులా మారి మూడోనేత్రంగా భాసిస్తోంది. కెరటాల తాకిడికి ఎగసిపడే చేపలా, నిప్పులు చిమ్ముతున్న శివుని ఫాలనేత్రం మా ఆపదలను కాల్చివేయుగాక! బంగారు పద్మాలై పచ్చగా మెరిసే శంభుని కన్నులు సాధకుని ఇంద్రియాలనే అశ్వాలను పట్టి ఉంచే పగ్గాలు. సూర్య చంద్రబింబాలే ఆయన కన్నులు. ఆ రెండుబింబాల కాంతి పరివేషమే కనుబొమ్మలయ్యాయి. మహాదేవుని పక్షాన సృష్టి స్థితి లయాలు తామే నిర్వహిస్తున్నామని కొద్దిగా గర్వం వహించి కాబోలు కనుబొమ్మలు సవిలాసంగా చలిస్తూ జీవులకు మహదైశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాయి. భక్తుల అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేలా సూర్యమండల సమానతేజంతో వెలుగుతున్న శివుని కుండలాలు జీవులకు అఖండ ఐశ్వర్యాన్ని అనుగ్రహించు గాక! శుక్లపక్ష దశమినాటి చంద్రునివలె అతినిర్మలమైన శివుని చెక్కిళ్లను చూసి పార్వతి మాటిమాటికీ అలుగుతూ ఉంటుంది. ఆ అద్దాల చెక్కిళ్లలో తన రూపాన్నే చూస్తూ వేరెవరో భామిని అనుకుంటున్నది. ఆ గంగాభర్త చక్కని చెక్కిళ్లు మమ్మల్ని ఎల్లప్పుడూ పాలించును గాక! పడగవిప్పి బుసలు కొడుతున్న తెల్లని సర్పరాజంలా, పద్మమధ్యంలోని కర్ణికలా మనోహరమైన ఖట్వాంగాయుధుని నాసిక మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించును గాక! క్షీరసాగర మథనవేళ తనకు తోడబుట్టిన హాలాహలాన్ని పలకరించి పోవడానికి కౌస్తుభ మణి వచ్చినట్లున్నది. శివుని ఎర్రని పెదవిలా మారువేషం కట్టింది. దాని ఎర్రదనం చేత లోకాలు సైతం ఎర్రనవుతున్నాయి. ఆ పెదవి జీవులకు సమస్త సంపదలనూ అనుగ్రహించు గాక! శివుని ముఖమండలం నుంచి వాక్కులనే అమృతం వెలువడుతున్నప్పుడు కలిగిన మహాప్రవాహ వేగంలో తేలుతున్న నురుగు బుగ్గల్లా పలువరుస కనిపిస్తోంది. తొలికారు మేఘాలు కొండలను తాకినప్పుడు పుట్టే ఉరుము చప్పుడులా కంఠధ్వని ఉంది. పొంగుతున్న సముద్రపు హోరును అణచివేస్తూ అత్యంత గంభీరమై నోటియందు ఆయా ధ్వనులు పుట్టే స్థానాల యోగ్యస్థితిని తెలుపుతోంది. ఆ నాదబ్రహ్మము వాత్సల్యంతో మాకు సమస్త సత్ఫలములనూ ఒసగు గాక! అష్టమూర్తి శివుని దివ్యాట్టహాసంతో మూడులోకాల్లో తెల్లని కాంతి వ్యాపించింది. మనోహరము, భయంకరము కూడా అయిన ఆ అట్టహాసం మాకు ఎల్లప్పుడూ ఇష్టము, స్పష్టమైన తుష్టిని కలిగించుగాక! శివునికి ముఖములు అయిదు. పడమటి ముఖానికి సద్యోజాతమని పేరు. ఉదకవర్ణంలో ఉంటుంది. వామదేవమనే ఉత్తర ముఖం బంగారు రంగులో ఉంటుంది. అఘోరమనే దక్షిణ ముఖం మేఘవర్ణంలో ఉంటుంది. తత్పురుషమనే తూర్పు మొగం బాలసూర్యునిలా ప్రకాశిస్తుంది. ఇక ఊర్ధ్వదిక్కున ఉండే ఈశానము దివ్యము. ఆ అయిదు ముఖాలూ మా అభీష్టాలనూ తీర్చుగాక! శివుని కంఠంపై మూడు రేఖలుంటాయి. నల్లని కాటుక వంటి విషాన్ని కంఠంలో దాచుకున్నందు వల్ల ఆ రేఖలు ఏర్పడ్డాయేమో అనుకోవచ్చు. కానీ కేవలం అదొక్కటే కారణం కాకపోవచ్చు. బహుశా ఒకప్పుడెప్పుడో పార్వతి స్వయంగా వశ్యకారి అనే నల్లని మసిని పూసినందువల్ల ఆ కంఠరేఖలు ఏర్పడి ఉంటాయి. ఆమె ఎందుకలా చేసిందంటే.... శివుని ముఖమనే చంద్రుడు, దంతకాంతి అనే లక్ష్మి, పెదవి అనే కౌస్తుభం ఈ మూడూ కూడా నీలకంఠుని కంఠంలోని కాలకూటంతో కలిసి పుట్టాయి. తన తోబుట్టువును కలుసుకోవాలని కాలకూటం కోరుకుంటుంటే పార్వతీ మాత అడ్డుకుంటోంది. ఆమె చేతి స్పర్శ వల్ల విరుద్ధార్థాన్ని ఇచ్చే విషము, అమృతము అనే పదాలు సమానార్థకాలు కూడా అయ్యాయి. ఆ అమృత హృదయుని శంఖసదృశ కంఠం మా హృదయాలలో ఎల్లప్పుడూ ప్రకాశించు గాక! పార్వతీమాత బిగి కౌగిళ్ల వల్ల ఆమె బంగారు గాజునొక్కులు శివుని బాహుమూలాల్లో ఏర్పడ్డాయి. పడగలు విప్పిన పాములతో అలంకరించబడిన ధూర్జటి బాహుమూలము విధివిహితము కాని మా కర్మలను నశింప చేయుగాక! సంసార సముద్రాన్ని దాటేందుకు స్ఫటికాలతో చేసిన పొడవైన దొన్నెల వంటివి శివుని బాహువులు. మూడులోకాలు అనే ఇంటి తలుపుకు అడ్డంగా వేసిన పొడవైన గడియలవి. ఆ బాహువులను స్మరించినంతనే మా పాపసమూహాలు నశించి పోవు గాక! శివుని వక్షస్థలంపైని విభూతి రేఖలకు పార్వతి మేనిపై అద్దుకున్న మంచి గంధపు తావి ఉంటుంది. శివుని ఉదరమనే పాలసముద్రం ముత్యాలతో అలంకృతమై ఉంది. దానిపైని ముడతలు తరంగాలుగా కానవస్తున్నాయి. ఎడమ వైపుకు తిరిగివున్న బొడ్డు అనే సుడి ఆ సముద్రంలో ఏర్పడింది. కాంతిలక్ష్మికి నివాసమై చంద్రుని వలె శ్వేతశోభతో నిండివున్న శివుని ఉదరమనే క్షీరసముద్రంలో మా మనస్సనే గంగానది చిరకాలం శయనించు గాక! శివుని మొలకు కట్టివున్న పులిచర్మం దట్టమైన మంచుతో కూడిన మేఘమాలలా ఉన్నది. ఆపైన సర్పరాజాలతో పేటలుగా అల్లిన మొలత్రాడు చక్కగా బిగింపబడి ఉంది. ఆ బాలచంద్రమౌళి నితంబము మాకు శుభాలనిచ్చుగాక! త్రిపురాసుర సంహారకుడైన మహాదేవుని తొడలు ఆయన జఘనానికే కాకుండా మూడులోకాలకూ కూడా ఆధార స్తంభాలుగా నిలిచాయి. ఇంద్రుని ఐరావత తొండంలా గొప్ప శోభతో ఉన్నాయి. విభూతితో తెల్లగా ప్రకాశించే ఆ తొడలు శత్రుగజ సముహాలను వేగంగా మ్రింగివేస్తాయి. సారవంతములైన మహాదేవుని ఊరువులు మాకు వాంఛితాలను ఒసగు గాక! మునుల మనస్సులనే అద్దాలను ఉంచుకునేందుకు తగిన పీఠాలు మహాదేవుని మోకాళ్లు. అవి చంద్రకాంత మణుల్లా శోభిస్తున్నాయి. తాండవవేళ కాళ్లను పైకి ముడిచినప్పుడు నడుముకు చుట్టుకున్న పాముల పడగలు ఆయన మోకాళ్లకు తలదిళ్లుగా మారిపోతున్నాయి. శూలపాణి పిక్కలు స్ఫటిక మణికాంతులతో చేసిన దండము వలె ఉన్నవి. పాదాలకు అందెలుగా ఉన్న సర్పాలు పడగ విప్పినప్పుడు, ఇంకా మోకాలిపై నిలిచిన సర్పాలు క్రిందికి జారినప్పుడు.... చిగిర్చిన మొక్కల్లా, మెరుస్తున్న రత్నాల్లా కనిపిస్తున్న ఆ కాలిపిక్కలు మా మనసుల్లో ఎల్లప్పుడూ నిలుచును గాక!... శివకేశాది పాదపర్యంతమైన శంకరస్తోత్రం ఇంకా మిగిలే ఉంది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
తిరుమల మందిర సుందరా!
అఖిల బ్రహ్మాండాలనూ కన్నతల్లి అయిన పార్వతి ఒకసారి భర్తతో సరాగమాడబోయింది. వెనుకగా వెళ్లి నేనెవరో చెప్పుకోండి అన్నట్లుగా శివుని రెండుకన్నులనూ మూసింది. దాంతో లోకాలన్నీ చీకటిగా మారిపోయాయి. తన సృష్టికి ఎక్కడ లోపం వస్తుందో అని తొందరపడి శివుడు మూడోకన్ను తెరిచి భార్యను చూశాడు. అమ్మ గౌరవర్ణం కాస్తా నల్లగా మారిపోయింది. తన రూపాన్ని చూసుకున్న ఆమె బాధపడింది. బాగు చేసుకునే మార్గం చెప్పమని కోరింది. తపస్సు చేపట్టమని శివుడు ఆదేశించాడు. దాంతో ఆమె దక్షిణాపథానికి వచ్చి అనేకచోట్ల తపస్సు చేసింది. ఒక్కొక్కచోట ఆమె తపస్సు ఒక్కోలా ఫలించింది. కావేరీ తీరంలో పార్వతీదేవి శివునికోసం తపస్సు చేసిన దివ్యక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగమై వెలిశాడు. పార్వతి కంటే ముందు ఇక్కడ జంబూ మహర్షి తపస్సు చేశాడు. నేరేడుచెట్టుగా మారి లింగానికి నీడనిచ్చాడు. ఆ తరువాత శివగణాలలోని వారైన పుష్పదంతుడు, మాల్యవంతుడనే వారు ఒకరినొకరు శపించుకున్న కారణంగా తరువాతి జన్మల్లో ఏనుగు, సాలీడు రూపాల్లో పుట్టి శివుణ్ణి సేవించారు. ఏనుగుగా జన్మించి శివుణ్ణి సేవించిన పుష్పదంతుడు తరువాత కూడా శివభక్తునిగా అనేక జన్మలెత్తాడు. ఆచార్య శంకరుని కాలానికి అతడే కోసంఘాత చోళుడనే నామాంతరం కలిగిన రాజసేనునిగా జన్మించాడు. చోళదేశంలో అనేక శివాలయాలు నిర్మించాడు. జంబుకేశ్వరాన్ని పునరుద్ధరించి మహానిర్మాణం చేపట్ట దలిచాడు. కానీ అతడి అపూర్వ ప్రయత్నానికి సాక్షాత్తూ జగజ్జననియే ఆటంకంగా మారింది. అఖిలాండేశ్వరి అనే పేరుతో అమ్మవారు జంబుకేశ్వరంలో కొలువుదీరి ఉంది. నల్లని రూపు కలిగి, మొసలివంటి చెక్కిళ్లతో కనిపించే అఖిలాండేశ్వరిని శాక్తతంత్రాలు విద్యలకు అధిదేవతగా ప్రకటించాయి. ఆమె విజ్ఞానాన్నే కాకుండా సంతానాన్ని, సంపదను, ఆయుష్షును కూడా ప్రసాదిస్తుందని చెప్పాయి. జంబుకేశ్వరంలో ఆమె ఉగ్రకళలతో అవతరించింది. ప్రతిరోజూ ఎవరైతే ముందుగా తన ఆలయం తలుపులు తీస్తారో వారిని ఆమె మింగేసేది. ఆ తలుపు తీయకుండా ఉండలేక, రోజూ సాగే నరబలిని సహించలేక చక్రవర్తితో సహా రాజ్య ప్రజలందరూ దిక్కుతోచక ఉన్నారు. అటువంటి సమయంలో ఆచార్య శంకరుడు శ్రీరంగంలో ఉన్న వార్త వారికి తెలియవచ్చింది. తమ సమస్యను విన్నవించి పరిష్కారం చూపమని ప్రార్థించారు. శంకరుడు జంబుకేశ్వరానికి విచ్చేశాడు. తలుపులు తీసేముందుగా, వేరొక ప్రాకారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి అఖిలాండేశ్వరి ఆలయానికి ఎదురుగా ప్రతిష్ఠించాడు. తలుపు తీసిన వెంటనే అమ్మవారి నేత్రదృష్టి తొలిగా కుమారుడైన గణపతిపై పడింది. ఆమెలో అమ్మప్రేమ పొంగింది. రోజుకొకరిని ఆమె బలి తీసుకునే సంప్రదాయానికి ఆనాటితో తెరపడింది. శంకరుడు చేసిన మహోపకారానికి అందరూ జేజేలు పలికారు. అమ్మకు ఆనాడు తొలి అర్చన చేసేందుకు శంకరుడు కదిలాడు. చతుష్షష్టి ఉపచారాలతో అర్చన సాగుతున్న వేళ, అంతకుముందు ఎవ్వరూ చూడని అపూర్వమైన రెండు చెవికమ్మలు శంకరుని చేతిలో ప్రత్యక్షం కావడం అందరి దృష్టిలోనూ పడింది. ఆ రెండింటినీ అమ్మకు అలంకరించిన తరువాత ఆమెలోని ఉగ్రకళలు పూర్తిగా శాంతించి శుద్ధజ్ఞాన స్వరూపిణిగా అవతరించడం గమనింపులోకి వచ్చింది. వెలుపలికి వచ్చిన తరువాత చోళునితో, ‘‘రాజా! ఈ క్షేత్రంలో పార్వతీదేవి తపించి శివజ్ఞానాన్ని పొందింది. కానీ శివుడామెను చేపట్టలేదు. ఆమెలోని విరహమే ఉగ్రకళగా మారింది. అందుకే పరమాత్మతో సమైక్య సూచనగా శ్రీచక్ర సమన్వితమైన ఆ కుండలాలను ఆమెకు అలంకరించాను. దీనితో పార్వతీ కల్యాణ ఘట్టాన్ని నెరవేర్చిన ఫలితం వచ్చినట్లే. అయితే ఈ కుండలాలను ప్రతిరాత్రి తొలగించి, తిరిగి ఉదయాన్నే అలంకరించాలి’’ అని చెప్పాడు శంకరుడు. ‘‘స్వామీ! మా చోళదేశంలో ఇటువంటి గడ్డు సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. వీలువెంట తమరు...’’ అభ్యర్థనగా అన్నాడు చోళుడు. ‘‘మీరు కోరవలసిన పని లేదు. ఇప్పుడు వేంకటాచలాన్ని దర్శించడానికి వెళుతున్నాం. సమయానుసారంగా మీ చోళదేశంలో మా కర్తవ్యాలను నెరవేరుస్తాం’’ అని అభయమిచ్చాడు శంకరుడు. పంచాయుధ స్తోత్రం పఠిస్తూ యతిబృందం ఏడుకొండలెక్కుతోంది. కలియుగ విభుని ఆనంద నిలయం చేరువ అవుతోంది. నేలపై శ్రీహరి అవతరణకు కారణమైన ఒకనాటి దేవయజ్ఞం కోసం తనంత తానుగా ఉప్పొంగిన పుష్కరిణిలో మునకలేశారు. ఆలయ ప్రవేశం చేస్తున్న వేళ అశరీరవాణి వినిపించింది. ‘‘కర్మ జ్ఞాన మార్గాలకు వంతెన వేయాల్సిన సమయం ఆసన్నమైంది. విగ్రహాన్ని మూర్తిమంతం చేయాలి. దానిముందు అగ్నిహోత్రాన్ని వెలార్చాలి. ఇది నా అభిమతం. సన్యాసులకు అగ్నిహోత్రంతో పనిలేదు. కానీ శంకరా!...’’ అని అర్థోక్తిలో ఆగిపోయింది ఆ కంఠం. ‘‘ఆచార్యదేవా! ఎవరిదా కంఠం?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు. శంకరుడు అతనివైపు కాకుండా మండనమిశ్రుని వంక తిరిగి సమాధానమిచ్చాడు. ‘‘ఆ కంఠం అత్రిమహర్షిది. నా ఎనిమిదో ఏట ఇవే పలుకులు విన్నాను. మళ్లీ ఇన్నాళ్లకు పనిగట్టుకుని అదే వాణి వినిపించిందంటే...’’ అని శంకరుడు కూడా అర్థోక్తిలోనే ఆగాడు. మండన మిశ్రునికి కర్తవ్యం బోధపడింది. తనతో వచ్చినవారంతా స్వామి దర్శనానికి కదలగా తాను మాత్రం హోమ సంబారాలను సమకూర్చుకునే పనిలో పడ్డాడు. ఈ తరుణం కోసమే ఎవరో కాసుకుని కూచున్నట్లు, కావలసినవన్నీ ఎదుటవుంచి వెళ్లినట్లు మండన మిశ్రుని ప్రయత్నం శ్రమ లేకుండానే, ఎక్కువ వ్యవధి తీసుకోకుండానే పూర్తయింది. దేవతల కోరిక మేరకు ఒకనాడు ఆధ్వర్యునిగా చతుర్ముఖ బ్రహ్మ వహించిన స్థానమిప్పుడు మండన మిశ్రుని పరమైంది. దేవతాంశల రాకను పరికించిన జడప్రకృతి కృతయుగాల నాటి సందర్భాన్ని నెమరేసుకుంటోంది. మండన మిశ్రుడు సమర్పిస్తున్న ఆహుతులను స్వీకరించిన అగ్నిహోత్రుడు ఒక్కొక్క దేవతను స్వాగతించి ఆనాటి ముచ్చట్లను జ్ఞాపకం చేస్తున్నాడు కాబోలు, పరిసరాలన్నీ దివ్యతేజస్సును పెంచుకుంటున్నాయి. స్వామికి ఎదురుగా క్రతువు సాగుతుండగా, శంకరుడు గర్భాలయంలో ప్రవేశించాడు. శ్రీనివాసుణ్ణి పదసుమాలతోనూ, బిల్వదళాలతో అర్చిస్తున్నాడు. ఇలవైకుంఠంలో ఆయన దర్శించిన విష్ణుస్వరూపాన్ని పాదాల నుంచి కేశాలవరకూ అణువణువునూ మనం తరించేలా ఇలా వర్ణించాడు. భువనమనే గృహానికి ఏర్పరిచిన ధ్వజస్తంభంలాంటి స్వామి పాదాలు తామరపూల నడిమిభాగంలా లలితంగా కనిపిస్తున్నాయి. వాటిపై సన్నటి చీరపోగుల్లాంటి చక్ర, మత్సా్యది రేఖలున్నాయి. పుండరీకాక్షుని పాదధూళి భక్తిపరులమైన మా అంతఃకరణాలను శుద్ధి చేయును గాక! ఎర్రకలువల అంచుల్లో నిలిచిన మంచుబొట్లలాగా శ్రీహరి కాలిగోళ్లు భాసిస్తున్నాయి. ఆ గోటి మెరుపుల్లో ఇంద్రాదులు తమ ప్రతిబింబాలను చూసుకుని వేరొక దేవజాతి కాబోలని కలవర పడుతున్నారు. సుందరకాంతి మండలం కలిగిన ఆ కాలిగోళ్లు మాకు స్వాతిశయ సంపదను సాధించును గాక! హరిమూర్తి మీగాళ్లు వంగి నమస్కరించిన మా పాపాలను అంతం చేయును గాక! నారాయణుని కాలిపిక్కలు సురలకు సుఖకారులై, శత్రువులను నశింపచేసే సాముద్రిక సలక్షణాలు కలిగినవి. స్వామి మోకాలి చిప్పలు తీరైన వృత్తాకృతిలో దర్శనమిస్తాయి. ఆయన మోకాలి చిప్పలనే ఎత్తుపీటగా మార్చుకుని సజ్జనులు తమ చిత్తాలనే అద్దాలను అక్కడే నిలిపి ఉంచుకుంటారు. మాటిమాటికీ అందులో తమను దర్శించుకుంటూ హృదయానందం పొందుతుంటారు. మధుకైటభులనే రాక్షసులను శ్రీహరి సర్వమూ జలమయమైన చోట తొడలపై పెట్టుకుని సంహరించాడు. వృత్తాకృతిలో, పైకి పోయేకొద్దీ చక్కగా బలిసినట్లు కనిపిస్తున్న శ్రీహరి ఊరువులు మా మనసులకు అతిశయమైన ప్రీతిని సంధానించు గాక! బడబాగ్ని జ్వాలలతో అలంకృతమైన సముద్రంలా శ్రీహరి కటిస్థలం పసుపు పచ్చని పీతాంబరంతో ప్రకాశిస్తోంది. మనోహరమైన ఆ ఘననితంబం మమ్మల్ని పతితుల్ని కాకుండా రక్షించు గాక! మందర పర్వత మధ్యస్థానాన్ని పెద్దపడగలతో వాసుకి చుట్టినట్లు ఆ కటిభాగాన్ని చుట్టివున్న అందమైన బంగారు రంగు మొలతాడు నా మతిని శుభకరముగా తీర్చుగాక! సృష్టికి పూర్వం బ్రహ్మ అనే స్వాయంభువ తుమ్మెదకు నెలవై దేవపూజ్యమైన కమలం ఆవిర్భవించిన విష్ణుని బొడ్డు చెరువులో మా మానస హంస చిరకాలం కుతూహలంతో విహరించు గాక! ఆ కమలపు కాడ పాతాళం. రేకుల వరుస దిశలు. పుప్పొడి తిత్తి గల కాడ కొండలు. మధ్యలోని కర్ణిక మేరుపర్వతం. ఆ పెద్ద తామరపువ్వు మాకు కామిత ఫలదాయిని అగును గాక! దామోదరుని కడుపు అనే సముద్రం కాంతులనే జలాలతో నిండి ఉంది. తరంగాలు ఆ పొట్టపై మడతలుగా భాసిస్తున్నాయి. లోతైన నాభి అనే సుందర సుడిగుండమొకటి ఉంది. ఆ ఉదరమనే జలధిలో నా చిత్తమనే చేప చిరకాలం ఇష్టారీతిగా ఆటలాడుకొను గాక! నాభికమల మూలం నుంచి బయలుదేరిన నూగారు అంతకంటే అధికమైన పరిమళంపై ఆశకొద్దీ ముఖపద్మానికి అభిముఖంగా సాగుతోంది. అది తుమ్మెదల నల్లని బారులా తోస్తోంది. స్వామి ఉదర మధ్యమునకు అధిక కాంతిని ఇస్తున్న ఆ రోమరాజి మాకు సకల సంపదలను అనుగ్రహించు గాక! కౌస్తుభమణి కాంతుల వల్ల కాలకాలుని కంఠంలో కొలిమలాగా... చంద్రబింబానికి అందాన్నిచ్చే మచ్చలాగా... కానవస్తున్న విష్ణు వక్షోవిభాసిని అయిన శ్రీవత్సమనే పుట్టుమచ్చ లక్ష్మీప్రీతికరమై మాకు అధిక సంపదలిచ్చు గాక! గళసీమలోని జయంతి మాలిక లక్ష్మీదేవి లాలన పొందుతూ వాసుదేవుని సుభద్రమూర్తిగా మార్చింది. దేవదేవుని బాహుమూలము తారహార కాంతులచే, పొడవైన తులసీమాలికా కిరణాలచే, బంగరు సొమ్ముల కాంతులచే కమ్ముకున్న అందం గలది. చాల నష్టాలను కలిగిస్తున్న సంసార బంధాల వల్ల బాధలను తొలగించమని హరిబంధుర బాహుమూలము ఎదుట నిలిచి అంజలి బద్ధుణ్ణై మరీమరీ వేడుకుంటున్నాను. విశ్వరక్షా దీక్ష వహించిన హరి బాహువులు విస్పష్టమైన గుణకీర్తులు తెచ్చిపెట్టే ఆశ్చర్యకరమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ వేయిచేతులు జీవుల మోహాన్ని బాపేందుకు ఉద్యమించు గాక! కంఠాభరణాల నుంచి, బంగారు కుండలాల నుంచి పుట్టివచ్చిన వేయి తలలు కలిగిన శ్రీహరి కంఠం విచిత్రవర్ణం కలిగినది. శ్రీలక్ష్మి కౌగిలించుకోగా ఆమె చేతి కంకణాలు ఒత్తుకొని ముద్రపడిందక్కడ. ఆ మంగళకరమైన వైకుంఠుని కంఠం వెనుబాటు లేకుండా నా మతిలోనే స్థిరంగా నివసించు గాక! అరుణశోభతో వ్యాప్తమైన అగ్రభాగం కలది ఆయన అధరం. ముఖమనే ఆకాశంలో దంతాలనే నక్షత్ర పంక్తులను ఆచ్ఛాదిస్తున్న శ్రీనాథుని అధరమనే అంబరమణి మా పాపాలను పోగొట్టుగాక! ఉదయ సూర్యకాంతితో విరాజిల్లుతున్న మకర కుండలాలు కలిగిన హరి గండభాగం మాకు రాబోయే ఆపదలను అడ్డగించును గాక! తళుకులీనే కుండలాల కాంతుల వల్ల ఆయన నాసిక ఎర్రబడింది. ప్రాణవాయు సంచార మార్గమైన ఆ మురారి ముక్కు మాకు ప్రాణదానము చేయు గాక! అధిక దయా నిర్భరంగా కొంచెం ఎరుపు, తెలుపు, నలుపు కాంతులతో మనోహరాలైన ఆ పద్మాక్షుని కన్నులు మమ్మల్ని రక్షించు గాక! గరుడ గమనుని కనుబొమల జంట కొంచెం కదిలేసరికి సురాసుర సంఘాలు తమతమ పదవులలో నియమితులవుతూ ఉంటారు. అరచందమామలా పరిశుద్ధమైన లలాటవేదిపై నల్లత్రాచులా నడుమ వంగిన శ్రీనాథుని భ్రూయుగము మమ్మల్ని అడుగున పడిపోకుండా రక్షించు గాక! భువన విభుని సుప్రసిద్ధమైన ఊర్ధ్వపుండ్రము... స్ఫాటిక శివలింగంలా ఉంది. కనుబొమల నడుమ నుంచి పుట్టి, జనన మరణ రూపమైన సంసార అంధకారాన్ని ఖండించే ఆ ఊర్ధ్వపుండ్రం మాకు అతిశయ విభూతిని ప్రసాదించు గాక! ముంగురుల కొనలే పానవట్టంగా, కిరీటమనే మహాదేవుని లింగం ప్రతిష్ఠితమైన కైటభారి లలాటమదిగో... ఆ నాట్యరంగంపై తీక్షణమతి అనే నటి తన అలసత్వమనే తెరను తొలగించి, ప్రస్ఫుటమైన అవయవ సంపదతో, సమర్థవంతంగా మమ్మల్ని భావన అనే నాటకాన్ని ఆడించు గాక!... అన్నాడు శంకరుడు. శ్రీనివాసమూర్తినే శివస్వరూపంగా శంకరుడు అనుసంధానించిన వైనం ఎవరిని మెప్పించిందో కానీ.... యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః అని ఆకాశం నినదించింది. విష్ణుపాదాది కేశాంత స్తోత్రంలో కిరీటం వరకు వచ్చాడు శంకరుడు. అటుపైన... నూరుగురు సూర్యులున్న ఆకాశంలా స్వామి కిరీటరత్నం చూడశక్యం కానిదై ఉంటుంది. ఒక సముద్రము, దానికి ఆవలి ఒడ్డున ప్రజ్వలించే బడబాగ్ని అన్నట్లు కనిపిస్తున్న స్వామి కిరీటం మా కలి కలుషాలనే చీకట్లను పోగొట్టు గాక! అన్నాడు స్తోత్రంలో శంకరుడు. అప్పుడు ఆయన దృష్టి మూలవిరాట్టుకు వెనుక వైపున విగ్రహంలోనే అంతర్భాగంగా ఉన్న కేశపంక్తిపై పడింది. దేహమనే మణికాంతుల వల్ల మెరిసే స్వామి కేశాలు అరిషడ్వర్గాలనే అగరుచెట్లను కాల్చే రోషాగ్ని పొగలాగా ఉన్నాయి. జీవుల పంచక్లేశాలను తెంచివేయగలిగే స్వామి కేశాలకు తుది ఎక్కడో చూడడం దేవతలకు సైతం సాధ్యపడదు.... అన్నాడు. ‘‘ఎందుకని?’’ స్వామి కాబోలు ప్రశ్నించాడు. ‘‘స్వామీ! ఇది శివుని జటాజూటమైతే... నీ పాదాలనుంచి పుట్టిన గంగను మోస్తోందని చెప్పవచ్చు. ఆ గంగధారకు ఎదురు ఈదితే నీదాకా రావచ్చు. నిన్ను దాటిన ఆవల ఏముందో ఎవరు మాత్రం తెలియ గలరు?’’ అడిగాడు శంకరుడు. ‘‘ఏ జ్ఞానప్రసూనం జీవునికి అవ్వలి వెలుగును ఏకాకృతిగా దర్శింప చేయగలదో కదా!’’ అన్నాడు స్వామి. శంకరునికి తన తదుపరి మజిలీ స్థిరపడింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
తోటకాష్టకం
ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. ‘‘జ్వలించే అగ్నిహోత్రం నుంచి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నట్లుగా పరమాత్మ నుంచే సృష్టి సమస్తం వచ్చింది. బయటకు వచ్చిన ప్రతిదీ తిరిగి ఆయనలో లయమైపోయేదే. తాను అతడికి చెందినవాడని నిరూపించడానికే ప్రతిదీ తనదైన కర్మలను నిర్వహిస్తూ ఉంటుంది.. ఓంకారమే ధనుస్సుగా, మనస్సు అందులో ఎక్కుపెట్టిన బాణంగా సాధన చేసేవాడికి తనచుట్టూ ఉన్నదంతా బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మము నుంచి వచ్చిన తానే బ్రహ్మము అవుతున్నది అని తెలియవస్తుంది అని ముండకోపనిషత్తు చెబుతున్నది. కాగా అంతఃప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, ఉభయత్ర ప్రజ్ఞ, ప్రజ్ఞానఘనమనే నాలుగు పాదాలతో బ్రహ్మము విస్తరిస్తోంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తిలయందు ప్రపంచాన్ని కొనసాగిస్తోంది. చతుర్థమైన తురీయమందు ప్రపంచాన్ని ఉపశమింప చేసే ఆత్మ అవుతున్నది. ఆ ఆత్మప్రత్యయ సారం శివము, అద్వైతము, శాంతము. అదే బ్రహ్మము అవుతున్నది... అయమాత్మా బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు వచించింది...’’ ఆ అది పడమటి కనుమలలోని మతంగ పర్వత ప్రాంతం. తన చుట్టూ పరివేష్ఠించి ఉన్న శిష్యబృందానికి ఆచార్య శంకరుడు పాఠం చెబుతున్నాడు. ద్వారకలో పశ్చిమామ్నాయ శంకరపీఠ స్థాపన తరువాత ఆయన దణానికి మరలి మతంగ పర్వత సమీపానికి విచ్చేశాడు. ఆవేళ అయమాత్మా బ్రహ్మ అన్న మహావాక్యాన్ని గురించి పాఠం జరుగుతున్నవేళలో ఒక తియ్యని గొంతు ఇలా వినవచ్చింది. అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం – వృద్ధాప్య ఛాయలు ముసురుకున్నాయి. శక్తి సన్నగిల్లింది. జుత్తు తెల్లబడి రాలిపోతున్నది. పళ్లు ఊడిపోయాయి. చేతికి కర్రవచ్చింది. అయినా ఏదో ఆశమాత్రం వదిలిపెట్టడం లేదు. ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని, దైవంపై భారం వేయాలని తోచడం లేదు... అందరూ ఆ శ్లోకం వినవచ్చిన దిశగా తలలు తిప్పి చూశారు. ఎవరో ఒక బాలుడు ఒకానొక వృద్ధుణ్ణి చేయిపట్టుకుని నడిపిస్తూ అటువైపే వస్తున్నాడు. ఆ బాలుడు పాడుతున్న గీతం శంకరుని భజగోవిందానికి కొనసాగింపులా తోచింది పద్మపాదునికి. దూరం నుంచి అటువైపే నడుచుకుంటూ వస్తున్న ఆ బాలుని దృష్టి అంతలో ఆచార్య శంకరునిపై పడింది. వృద్ధుణ్ణి వదిలిపెట్టి, శంకరుని సమక్షానికి పరుగుపరుగున వచ్చి పడ్డాడు. సాష్టాంగ వందనం చేశాడు. ‘‘స్వామీ! నా పేరు ఆనందగిరి. నేనో చదువురాని మొద్దును. బుద్ధిమంతుడిని కాను. నా గొంతు బాగుంటుందని కొందరు పాటలు పాడించుకుంటారు. పనులు చెబుతుంటారు. అవసరంలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తూ వారిచ్చిన దాంతో పొట్ట పోషించుకుంటున్నాను. నాకు తెలిసింది ఇంతమాత్రమే. తమరు నాపై అనుగ్రహం చూపాలి. నన్ను మీ శిష్యునిగా అనుమతించాలి’’ అని ప్రాధేయపడ్డాడు. శంకరుడు సమ్మతించి, అతడికి సంన్యాస దీక్షనిచ్చాడు. అంతకుముందే శంకరుని శిష్యవర్గంలో ఒక ఆనందగిరి ఉన్నాడు. కాగా అదే పేరుతో ఇప్పుడు ఇతడు వచ్చాడు.బృహస్పతి అవతారమైన మొదటి ఆనందగిరి తొలితరంలో శంకరవిజయాన్ని రచించినవారిలో ఒకడు. కాగా, నేటి ఆనందగిరి మాత్రం పద్మపాదుని వలె తరువాతికాలంలో ఒక సార్థకనామాన్ని పొంది ప్రఖ్యాతుడయ్యాడు. ఆ కథ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆనందగిరికి గురుసేవ చేయడం తప్ప ఇతరమేదీ తెలియదు. అతడు వచ్చిన తరువాత గురువు అవసరాలను నెరవేర్చే పని ఇతరులకు దక్కనివ్వకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ పళ్లుతోము పుల్లతో మొదలుపెట్టి, స్నానానికి కావాల్సిన మృత్తికా సేకరణ, స్నానానంతరం శుభ్రవస్త్రాలను అందించడం, దర్భాసనాదులను సిద్ధం చేయడం, అర్చనకు కావాల్సిన సరుకు సంబారాలను సమకూర్చడం వంటి పనులన్నీ గురుదేవునికి ఆనందగిరియే చేసి పెడుతున్నాడు. అతడు గురువు ఎదుట ఎన్నడూ ఆవులించడు. కాళ్లు చాచి కూర్చోడు. గురుదేవుడు లేచి నిల్చున్న సమయంలో తాను కూర్చొనడు. తాను విన్నవించుకోవాల్సిన విషయాలను ఉపేక్షించి ఊరుకోకుండా తగిన సమయం కనిపెట్టి అడిగి తీరుతాడు. అలాగని వృధాగా ఒక్కమాట కూడా మాట్లాడడు. గురువు సన్నిధినుంచి ఈవలకు వచ్చేవేళలో గిరుక్కున వెనుతిరిగి, వీపు చూపించడు. గురువు మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాడు. గురువుకు ఇష్టమైన పనిని ఆయన చెప్పకముందే చేస్తాడు. ఇష్టంలేని పనిని ఎప్పుడూ చేయడు. మొత్తంమీద గురుశుశ్రూషా పరాయణుడైన శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాలంటే ఆనందగిరిని చూపిస్తే సరిపోతుంది. అటువంటి శిష్యగణం శంకరునికి ఇప్పుడు చాలనే ఉన్నది. అయితే ఆయన నలుగురు ప్రధాన శిష్యులలో హస్తామలకుడు, పద్మపాదుడు ఇప్పటికే సంన్యాసాశ్రమంలో ప్రవేశించారు. నాలుగో శిష్యుని కథ మనమింకా చెప్పుకుంటున్నాం. మూడో శిష్యుడైన మండన మిశ్రునికి ఆచార్యులింకా సంన్యాసాన్ని అనుగ్రహించలేదు. ఒకరోజు మండనమిశ్రుడు ఆచార్యుని సమీపించి, ‘‘స్వామీ! మీ బ్రహ్మసూత్ర శారీరక భాష్యానికి వార్తికాలు రచించవలెనని కొన్నాళ్లుగా అనిపిస్తున్నది. మీ అనుమతిని వేడుతున్నాను’’ అని మనసులో కోరిక విన్నవించాడు. శంకరుడు నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఒక శిష్యుడు, ‘‘వద్దు స్వామీ!’’ అన్నాడు. ‘‘ఇతడు నిన్నమొన్నటి వరకూ కర్మమార్గంలో ఉండి అద్వైతాన్ని తిరస్కరిస్తూ వచ్చినవాడు. ఓటమి కారణంగా మీ వెంటవచ్చాడు కానీ, మీ మార్గాన్ని త్రికరణశుద్ధిగా అంగీకరించి వచ్చినవాడు కాదు. ఇటువంటివాడు వార్తిక రచనకు పూనుకుంటే పూర్తి న్యాయం చేయలేడు’’ అని వాదించాడు. శిష్యులలో అనేకమంది మనసుల్లో కూడా అటువంటి ఆలోచనే ఉన్నది. వేదాంతోదర సంగూఢం సంసారోత్సారి వస్తుగం జ్ఞానం వ్యాకృతమప్యన్యై వకేష్య గుర్వనుశిక్షయా ‘‘వేదాంత హృదయం అర్థం చేసుకోవాలంటే, వాస్తవిక జ్ఞానాన్ని పొందాలంటే గురుశుశ్రూష మినహా గత్యంతరం లేదు. నేను ఆ సంప్రదాయాన్ని ధిక్కరించేవాడను కాను’’ అన్నాడు మండన మిశ్రుడు. ‘‘పండిత శిఖామణీ! ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకం స్వీయరచనా?’’ ప్రశ్నించాడు ఆచార్య శంకరుడు. ‘‘అవును స్వామీ! నిన్నటివరకూ కర్మమార్గంలో ఉన్న నేను దానిని వదిలించుకోవడానికే నైష్కర్మ్యసిద్ధి అనే గ్రంథరచనకు పూనుకున్నాను. అందులో గురువందన పూర్వకంగా చెప్పిన శ్లోకమిది’’ అని సమాధానమిచ్చాడు మండన మిశ్రుడు. ‘‘బాగున్నది. రచన పూర్తయినదా?’’ అడిగాడు శంకరుడు. ‘‘లేదు స్వామీ! ఇంకా కొనసాగుతున్నది’’ అన్నాడు మండనమిశ్రుడు. ‘‘ముందుగా ఈ గ్రంథాన్ని పూర్తిచేయి. ఉపనిషత్ మార్గంలో నీనుంచి మరికొన్ని గ్రంథాలు రావలసి ఉన్నది. ఆ తరువాత వార్తిక రచనకు పూనుకోవచ్చు’’ అని సెలవిచ్చాడు శంకరుడు. గురువు ఆజ్ఞను ఔదలదాల్చి మండనమిశ్రుడు గ్రంథరచనలో మునిగిపోయాడు. ఆచార్యుని పర్యవేక్షణలో నైష్కర్మ్యసిద్ధి రచన కొనసాగుతున్నది. నాలుగు అధ్యాయాల్లో సృష్టి వికాసాన్ని, కర్మసిద్ధాంతాన్ని, కర్మలను శూన్యం చేసుకుని పునరావృత్తి రాహిత్యాన్ని పొందడానికి తగిన మార్గాలను గురించి మండన మిశ్రుడు లోతైన పరిశీలనతో రచన పూర్తి చేశాడు. అప్పటికి కూడా అతడికి శంకరభాష్యాలకు వార్తికారచనకు అనుమతి లభించలేదు. ఇతర శిష్యులు ఈ విషయమై వెల్లడించిన అభిప్రాయంలో ఈర‡్ష్య, అసూయల కంటే అద్వైత సిద్ధాంతానికి అన్యాయం జరగరాదన్న ఆవేదనయే అధికంగా కనిపిస్తోంది. ఈ యదార్థాన్ని శంకరుడు సైతం కాదనలేక పోయాడు. అంతలో ఇతరుల ప్రోత్సాహంతో పద్మపాదుడే బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి వార్తిక రచన పూర్తి చేశాడు. అనుమానమైనా రానివ్వని విధంగా రహస్యంగా రచన పూర్తి చేసి గురువుకు సమర్పించడం మండనమిశ్రుని మనసుకు ఏదో కుట్రలా తోచింది. తనకు అవకాశం దక్కకపోవడం అతడిలో ఉక్రోషాన్ని పెంచింది. ‘‘నేనుగాక బ్రహ్మసూత్రాలకు వార్తికాలను రచించేవాడు ఎంతటివాడైనా అతడి గ్రంథం నశించుగాక!’’ అని ఆగ్రహంతో శపించాడు. శంకరుడు ఆ మాట విన్నాడు. చిరునవ్వు నవ్వి, ‘‘పండితాగ్రేసరా! నీ మాట పొల్లుపోదు. పద్మపాదుడు తన గ్రంథాన్ని పంచపాదిక, వృత్తి అనే రెండుభాగాలుగా రచించాడు. నీ శాపవశాన ఈ భూమిమీద పంచపాదిక ఒకటే మిగులుతుంది. కాగా వార్తికకారునిగా ప్రసిద్ధి కెక్కడానికి ముందుగా నీనుంచి మరో స్వతంత్ర రచన కూడా రావాల్సి ఉన్నది’’ అన్నాడు. . మండనమిశ్రుడు అప్పటికప్పుడు తన తదుపరి స్వతంత్ర రచనగా బ్రహ్మసిద్ధికి శ్రీకారం చుట్టాడు. అటుపై శంకరాద్వైతాన్ని తేటతెల్లం చేసిన దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాస వ్యాఖ్యను, పంచీకరణ వార్తికాన్ని ఆచార్యుని అనుమతి మేరకు సమకూర్చాడు. తదుపరి బృహదారణ్యక, తైత్తిరీయ ఉపనిషత్తులకు శంకరభాష్యానుసారమైన వార్తికాలను రచించే పనిలో ముగిపోయాడు. శిష్యులందరూ ఎవరికి అప్పగించిన పనుల్లో వారు తలమునకలుగా ఉన్నారు. మార్కండేయాది మహర్షులు తపస్సులు సాగించిన మతంగ పర్వత సీమల్లో ఆవాసం, సాక్షాత్ జగద్గురు సన్నిధిలో అద్వైత వేదాంత శ్రవణం దినచర్యలుగా వారికి కాలం గడిచిపోతున్నది. తగని స్పర్థతో ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చదువుతున్నారు. అటువంటి సమయంలో ఒకరోజున ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గురువుగారి పాఠానికి వేళ సమీపించింది. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఆచార్యులు మాత్రం పాఠం ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారు. ‘‘గురుదేవా! సమయం మించిపోతున్నది’’ అని సుబోధాచార్యుడు గుర్తుచేశాడు. ‘‘ఆనందగిరి ఇంకా రాలేదు కదా! కొద్దిసేపు నిరీక్షిద్దాం’’ అన్నాడు శంకరుడు. ‘‘గురుదేవా! మీకు తెలియనిది కాదు. అతడు మందమతి. మీ పాఠాలేవీ అతడి బుర్రకు ఎక్కనే ఎక్కవు. ఈ చెట్టుకు ఆ పుట్టకు చెప్పినందువల్ల ఎంతటి ప్రయోజనముంటుందో అతనికి చెప్పినా అంతే ప్రయోజనం’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘అతనికి పాఠం కంటే మీ వస్త్రాలను ఉతికి శుభ్రం చేయడంలోనే శ్రద్ధ ఎక్కువ ఆచార్యా! పాఠానికి వేళమించిపోతోందయ్యా వేగిరం రా అని ఇందాక మేమంతా పిలిస్తే... తుంగభద్ర నుంచి బయటికే రాలేదు. మీ కౌపీనాన్ని అదేపనిగా బండకేసి బాదుతూనే ఉన్నాడు. అతడిప్పట్లో వచ్చే సూచన కనిపించడం లేదు. దయచేసి మీరు పాఠాన్ని ప్రారంభించండి’’ అని వీలైనంత వినయంగా విన్నవించాడు నిత్యానందుడు. వారి మనసులోని మాటలన్నీ వారిచేతనే బయటపెట్టించిన తరువాత శంకరుడు కన్నులు మూసుకుని అంతర్ముఖుడయ్యాడు. శంకరుని అనుగ్రహం ఆనందగిరిపై వర్షించింది. ఆచార్యుని సంకల్పమాత్రం చేత అతనికి విద్యలన్నీ స్ఫురించాయి. అతడు అప్పటికప్పుడు మహాపండితుడు అయ్యాడు. అంతేకాదు శంకరునిపై కమనీయమైన స్తోత్రాన్ని ఇలా ఆలపించాడు. విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ అఖిల శాస్త్రాలనూ తనలో నింపుకున్న అమృత సముద్రం శంకర దేశికుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని లోకానికి వెల్లడించడానికి వచ్చినవాడు. ఆయన విమల చరణాలను నేను హృదయమందు నిలుపుకుని ఆరాధిస్తాను. అఖిల దర్శన తత్త్వాలనూ ఎరిగిన ఆ తత్త్వవిదుని శరణు పొందిన వారిని సంసార దుఃఖాలు బాధించవు. స్వామీ కరుణావరుణాలయా! నాకు శరణునొసగి నన్ను రక్షించు అన్నాడు ఆనందగిరి. అతడి గొంతులోని మార్దవానికి మతంగ పర్వతసీమ పరవశిస్తోంది. అతడి నుంచి వెలువడుతున్న తేజఃకాంతి పుంజాలు చూస్తున్న ఇతరుల కనులకు మిరుమిట్లు గొల్పుతున్నాయి. తాబేటి తలపు న్యాయంలాగా కేవలము ఒక్కక్షణం సేపు తనపై ఆలోచనను సారించడం ద్వారా విద్యలన్నీ అనుగ్రహించిన ఆచార్యుని పాదాలను తాకి నమస్కరించాడు ఆనందగిరి. తనకు గురువు ఏమేమి ప్రసాదించాడో ఇలా చెప్పుకొచ్చాడు. నీ వల్లనే జనులకు ఆనందమనే పదానికి అర్థం తెలిసింది. నీ బోధల వల్లనే జిజ్ఞాసువులు ఆత్మమర్మం ఎరిగి తరిస్తున్నారు. ఈశ్వరునికి, జీవేశ్వరునికి గల అభేదాన్ని తెలియగలుగుతున్నారు. స్వామీ! నీవు సాక్షాత్ శంకరునివని తెలుసుకున్నాను. ఇది తెలియడం వల్ల నా హృదయం ఎన్నడెరుగని బ్రహ్మానంద స్థితికి చేరువవుతున్నది. మోహమనే మహాజలధిని ఒక్క అంగలో దాటేసిన అనుభూతి కలుగుతున్నది. సమదర్శనాన్ని సాధించాలనే ఆశయంతో ఎన్నెన్నో మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యాను. నాకు సరియైన మార్గాన్ని ప్రబోధించి నన్ను కరుణించావు. ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. నీవు తత్త్వనిధివే కాక, శరణాగత వత్సలునివి కూడా కనుక వేరెవ్వరినీ కాక నిన్నే నేను శరణు జొచ్చుతున్నాను. లిప్తపాటులో నువ్వు అనుగ్రహించినది ఎంతో నెమరేసుకోవడానికే నాకు శక్తి చాలడం లేదు. నీ జ్ఞానసంపదలోని చిన్ని భాగాన్నైనా పొందలేదనే స్పృహను ఎప్పటికీ ఉంచుకుంటాను. నాకు ఇతర సంపదలేవీ వద్దు. నీ సహజ వాత్సల్యధోరణిలో నన్ను కరుణించి చేరదీయి చాలు...’’ అని నమస్కరించాడు. అతడిని లేవనెత్తి, ‘‘తోటకాచార్యా!’’ అని సంబోధించాడు శంకరుడు. ‘‘సుందరమైన తోటకవృత్తంలో నన్ను కీర్తించిన నువ్వు ఇకనుంచి తోటకాచార్యునిగా ప్రసిద్ధి పొందుతావు. . నీవు రచించిన తోటకాష్టకం గురుస్తోత్రాలలో అగ్రగణ్యమవుతుంది’’ అని నారాయణ స్మరణ పూర్వకంగా సెలవిచ్చాడు. శంకరుడు శిష్యుణ్ణి అనుగ్రహించిన విధానం మిగిలిన వారికి కనువిప్పు కలిగించింది. మందమతిగా పేరు తెచ్చుకున్నవాడు కాస్తా చూస్తుండగానే ప్రధాన శిష్యుడైపోవడం అబ్బుర పరిచింది. నలుగురు ప్రధాన శిష్యులే చతురంగ బలాలుగా మారి దన్ను ఇస్తుండగా శంకరుని దిగ్విజయ యాత్ర దక్షిణాపథంలో ప్రారంభమైంది. పర్వత సీమలనుంచి దిగివచ్చి... శంకరయతి జనపదాలలో ప్రవేశించాడు. – సశేషం -
షణ్మత స్థాపనాచార్య
చతురామ్నాయాలతో పాటు ఊర్ధ్వామ్నాయ విద్యా రహస్యాలను శంకరుడు వెల్లడించిన వేళ... సర్వజ్ఞపీఠపు పైకప్పు అలవోకగా పక్కకు జరిగింది. ఉభయభారతి తన లోకానికి సాగిపోవడానికి ఉద్యుక్తురాలైంది. అటువంటి తరుణంలో అక్కడో విచిత్రం జరిగింది. ఆకాశం నుంచి పరబ్రహ్మ తేజస్సు సభామధ్యంలో అవతరించింది. సభాసదులందరూ చూస్తూ ఉండగా ఆ తేజస్సు క్రమంగా విఘ్నేశ్వర రూపాన్ని పొందింది. ఆ మహారూపానికి అందరూ మొక్కుతుండగా, శంకరుడు పంచరత్నాలతో స్తోత్రం చేశాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం శ్రీవినాయకా! నీ రెండుచేతులా ధరించిన మోదకాలు సాధకులకు మోక్షసామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాయి. నెలవంకను శిరసున ధరించి లోకాలన్నింటినీ విలాసంగా రక్షించే పరబ్రహ్మవు నీవే. దైత్యగుణాలను నిర్జించి నీవు అనాథనాథునివైనావు. అశుభాలను ఆశువుగా పోగొట్టే నిన్ను గొలిచి నేను కృతార్థుడినవుతాను. మొక్కనివారికి మిక్కిలి భయంకరునివి నీవు. అప్పుడే ఉదయించిన సూర్యునిలా ప్రకాశిస్తుంటావు. ఆశ్రయించిన వారిని ఆపదలనుంచి గట్టెక్కించే దేవాధిదేవా మాహేశ్వరా! పరాత్పరునివైన నిన్ను నిరంతరం నేను ఆశ్రయిస్తాను. ఓంకార వదనుడా! నీ మోము సకల లోకాలకూ శుభాలను కలిగించేది. మహారాక్షసులను నిర్జించి నీవే ఈ విశ్వాన్ని కడుపున పెట్టుకుని కాపాడుతున్నావు. నీ కృపావర్షం అంతులేనిది. నీ క్షమాహృదయం హద్దులేనిది. నీకు మొక్కిన వారికి ముదములను, యశస్సులను కలిగిస్తావు. నీవలె నా మనస్సును ప్రకాశింప చేయమని కోరుతున్నాను. ఓయి పురాణగజమా! పరమేశ్వరుని పెద్దకుమారుడా! నీ బుగ్గల నుంచి జాలువారే మదజలం వేదవాదాలకు పుట్టుకస్థానం. అది సమస్త దారిద్య్ర బాధలను తుడిచిపెట్టగలదు. ప్రపంచ నాశవేళ అగ్నిస్వరూపాన్ని దాల్చి రాక్షస శక్తుల అణిచివేయగలదు. ఓయి ఏకదంతుడా! యముణ్ణి సైతం మట్టుపెట్టిన శివుని కుమారుడా! నిన్ను తలచుకుంటే అంతరాయానికి తావుండదు. నీవు నిరంతరాయంగా నా హృదయ మధ్యమందు యోగరూపంలో కొలువుండమని సదా ప్రార్థిస్తాను.. అన్నాడు శంకరుడు. శంకరస్తోత్రానికి ఫలశ్రుతిని ఉభయభారతి స్వయంగా చెప్పింది... ప్రతిదినం ప్రాతఃకాలంలో వినాయక దేవుని మనసులో నెమ్మదిగా తలచుకుంటూ, ఈ మహాగణేశ పంచరత్నమనే స్తోత్రాన్ని పెద్దగా చదివే భక్తుడు ఆరోగ్యాన్ని పొందుతాడు. అతడి దోషాలు హరిస్తాయి. సాహిత్యాభిలాష ఉదయిస్తుంది. మంచిసంతానం పొందుతాడు. దీర్ఘాయుష్షు కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. చిరకాలం వర్ధిల్లుతాడు అన్నదామె. ఆ మాటలు చెబుతూనే సర్వజ్ఞపీఠ సింహాసనం నుంచి దిగివచ్చింది. వినాయక దేవునికి కుడివైపున ఆమెకోసమే కల్పితమైన దివ్యాసనాన్ని అధిష్ఠించింది. తిలకిస్తున్న వారి కన్నులు ధన్యములవుతుండగా ప్రభలు చిమ్ముతున్న వెలుగుల ముద్ద అయిన విఘ్నేశ్వరమూర్తి శంకరుణ్ణి ‘జగద్గురూ!’ అని సంబోధించింది. ఆ సంబోధన ఆలకించిన సర్వజ్ఞపీఠం యావత్తూ ఒక్కసారిగా జయజయ శంకర ధ్వానం చేసింది. ఆ సందడి కొద్దిగా సద్దుమణిగిన తరువాత గజాననుడు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘జగద్గురూ! దేవుడున్నాడంటావా?’’ ‘‘పరమాత్మా! నువ్వు వేరుగా లేవుగా కదా స్వామీ!’’ ‘‘మరైతే లేని నన్ను కలుసుకోవడం జీవులకు సాధ్యమేనం టావా?’’ ‘‘సాధ్యమేనని సాక్ష్యమివ్వడానికి ఈ సభ చాలదా స్వామీ!’’ ‘‘ఒకప్పుడు కొద్దిసేపు కనిపిస్తే మాత్రం ఈ అనుభవం నీవంటి వారికి తప్ప అన్యులకు నిత్యమై, సిద్ధమై ఉండదు కదా!’’ ‘‘సాధనతో ఎవరికైనా అసాధ్యమన్నది ఉండదు.’’ ‘‘ఎందుకసలు సాధన చేయడం... నన్ను పొందమని, నన్ను తెలుసుకోమని ఎవ్వరినీ నేనెప్పుడూ కోరను కదా!’’ ‘‘నీవు కోరకపోయినా దుఃఖరాహిత్యాన్ని పొందడానికి జీవుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మాయను తెలుసుకోలేని అజ్ఞానం అవివేకానికి దారి తీస్తుంది. అవివేకం అభిమానాన్ని పుట్టిస్తుంది. అభిమానం వల్ల రాగద్వేషాలు వచ్చిపడతాయి. రాగద్వేషాలతో మిళితమైన కర్మలు జన్మకు, ఆ జన్మ దుఃఖానికి హేతులవుతున్నాయి. జీవుడు నిరంతరం తనకు దుఃఖాలే లేకుండా పోవాలని, అన్నీ సుఖాలే ప్రాప్తించాలని అర్రులు చాస్తూ ఉంటాడు. పుణ్యకర్మల సాయంతో దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మంత్రసిద్ధి పొందినవాడికి అగ్నిలోని వేడిమిని ఓర్చుకునే శక్తి వస్తుంది. కానీ నిప్పులోని కాల్చే తత్త్వాన్ని పోగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. పుణ్యబలం క్షీణించిన తరువాతైనా వేచివున్న నిప్పు కాల్చక మానదు. ఫలితంగా దుఃఖం తప్పదు. జన్మ సిద్ధమవుతూనే జీవుడు మళ్లీ సుఖప్రాప్తికి వెంపర్లాట మానడు. ఆనంద పరమావధిని తెలుసుకునేంత వరకు ఈ జన్మల వలయం ఇలాగే తిరుగుతుంది. జన్మకు మూలకారణమైన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే నీ తత్త్వాన్ని సాకల్యంగా తెలుసుకోవడం మినహా వేరుమార్గం లేదు.’’ ‘‘అసలీ దుఃఖం ఎక్కడినుంచి వచ్చిందయ్యా? నా సృష్టిలోని దేనంటావా?!’’ ‘‘స్వామీ! తమరెరుగరు కానీ, ఆయుధాలు ధరించిన దేవేంద్రాదులకే దుఃఖం తప్పలేదు. ఇక కర్మ పరిత్యాగానికి సిసలైన అర్థం తెలియని మానవుల సంగతి ఏమని చెప్పేది?’’ ‘‘సరే... దేవతలకే దుఃఖం ఉంటే మీరంతా వారిని కొలవడం ఎందుకు? దండగ కదా!’’ ‘‘మా లోకంలో రాజులకు, వివేకులకు కూడా దుఃఖమున్నది. అంతమాత్రం చేత మిగిలిన వారంతా వారిని ఆశ్రయించడం మానేస్తున్నారా? దేవతలు కూడా అంతే. దుఃఖనివృత్తికి వారిని ఆశ్రయించ వలసిందే. నామస్మరణలతో, రూపధ్యానాలతో, మూర్తిపూజలతో ఏదో ఒక తోవన తాను తరించే మార్గాన్ని జీవుడు తనంతతాను అన్వేషించి తెలుసుకోవలసిందే.’’ ‘‘అయితే దుఃఖం జీవునికి స్వాభావికంగా వచ్చిందేమో!’’ ‘‘కాదు. దుఃఖం స్వాభావికం అని చెబితే ఎన్నటికీ తీరనే తీరదని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు దుఃఖనివృత్తి కోసం, సుఖప్రాప్తి కోసం కర్మ చేయాల్సిన అవసరం జీవునికి తప్పిపోతుంది. చివరకు సత్కర్మలు చేయడానికి, ఉపాసనలు చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నమూ చేయరు. వేదం శాస్త్రం పురాణం వీటి ప్రామాణ్యాన్ని నిరసించేవారి సంఖ్య పెరిగిపోతుంది. జీవునికి స్వాభావికంగానే దుఃఖం వచ్చిందని చెబితే దుఃఖమే జీవస్వరూపం అయి కూచుంటుంది? స్వరూపాన్ని చెడగొట్టుకోవాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు? ఆత్మ స్వరూపం ఆనందమే కానీ, దుఃఖం ఎన్నటికీ కాదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనికదా ఉపనిషత్తు... ఆనందాన్ని నీ స్వరూపంగా దర్శించడం చేతకాని మానవులే దుఃఖభాజనులు అవుతున్నారని చెప్పవలసి వస్తోంది.’’ ‘‘అయితే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికే నన్ను తెలుసుకోవాలంటావు. అదిసరే కానీ మట్టిబొమ్మల్లోనూ, కొయ్యశిల్పాలలోనూ, రాతి విగ్రహాలలోనూ నేనున్నానంటావా?’’ ‘‘అసలు నువ్వు ఎక్కడైనా ఉన్నావు కదా స్వామీ! అందులో సందేహమేమీ లేదు. మూర్తిమత్వం పొంది చర్మచక్షువులకు కనిపిస్తున్న అన్నింటిలోనూ పంచభూతాలతో కూడి నువ్వున్నావు. కానీ మలమూత్రాలతో కలుషితమైన దేహాల్లోనూ, మరికొన్ని నీచ వస్తువులలోనూ నిన్ను దర్శించడానికి కష్టపడేకంటే పవిత్ర వస్తువులలో నిన్ను ఆరోపిస్తే దర్శించడం సులభమవుతుంది. ఎవరో చెప్పారని గుడ్డిగా అనుసరించడం కాకుండా అపరోక్షానుభూతిని పొందాలంటే సాధన అవసరం.’’ ‘‘ఎలా చేయాలి సాధన?’’ ‘‘ముక్తికోరే మానవుని సాధన నాలుగు మార్గాల్లో ముందుకు కొనసాగాలి. ఈ నాలుగింటినీ ఏమరుపాటుకు రాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి. మొదటిది నిత్యానిత్య వస్తువివేకం. శ్రుతుల వల్ల, స్మృతుల వల్ల, పురాణాదుల వల్ల శ్రవణ, మనన, నిదిధ్యాస పూర్వకంగా నిరంతరం ఒక్కటే స్మరించాలి. ‘బ్రహ్మ నిత్యం, ప్రపంచం అనిత్యం’ అని. ఇలా స్వీయజ్ఞానంతో ఆత్మనాత్మ వివేకం పెంపొందనంత వరకు కోటిజన్మలెత్తినా మానవునికి బంధచ్ఛేదనమనేది జరగదు కనుక, సాధనలో వివేకోదయమే మొదటి మెట్టు.’’ ‘‘మరి రెండవది...’’ ‘‘ఫలితం ఆశించి కర్మలను చేయడాన్ని విరమించుకోవాలి. ఎంతవరకూ అంటే, ఇహాముత్ర ఫలభోగ విరాగం ఉదయించే వరకూ. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా జీవుడు తాను చేసిన కర్మల తాలూకు ఫలాన్ని తానే అనుభవించాలనే ఉబలాటాన్ని కట్టిపెట్టుకోవాలి. ఒకడు ఒక మహాభోగాన్ని అనుభవిస్తున్నాడంటే అది సృష్టిలో అంతకుముందు ఎవ్వడూ అనుభవించనిది కాదు అని గుర్తుచేసుకోవాలి. చేసిన పనికి ఫలితాన్ని కూడా అనుభవించాలని కోరుకోవడమంటే కక్కిన కూటికి ఆశపడడమే అని తెలుసుకోవాలి. పరబ్రహ్మ సాయుజ్యమందే మనసు నిలుపుకోవాలి.’’ ‘‘సరేలే... లోకంలో అందరూ వ్రతం చెడ్డా ఫలం దక్కాలనుకుంటారు. నువ్వేమో గొప్ప వ్రతం చేసి ఫలాన్ని వదిలేయమంటున్నావు. ఇది సరైన పనేనంటావా?’’ ‘‘వైరాగ్యవంతుని కంటే గొప్ప సంపన్నుడు లేడు కదా స్వామీ! ఆరు సుగుణాలుంటే భగవంతుడైనట్లు... ఆరు సంపదలున్నవాడే అన్నీ వదిలేసుకున్న వైరాగ్య సంపన్నుడు అవుతాడు. మొదటి సంపద పేరు శమం... అంటే విషయసుఖాల పట్ల నిర్లిప్తత కలిగి ఉండడం. దీనికోసం అంతరింద్రియాలైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలను నిగ్రహించడం నేర్చుకోవాలి. రెండోసంపద దమం.... అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మూడో సంపద ఉపరతి లేదా నిష్కామకర్మ. నాలుగోది తితిక్ష... అంటే ప్రారబ్ధ, ఆగతాలన్నింటినీ శీతోష్ణాలవలె ఓర్చుకోవడం. అయిదోది గురువుపైన, వేదంపైన శ్రద్ధ. ఆరోది సమాధానం. శ్రవణాదుల ద్వారా సాధనకు అనుకూలమైన విషయాలపైనే మనసు ఉంచడం.’’ ‘‘ఈ ఆరు సంపదలనూ పొందడం సాధనలో మూడోమెట్టు. మరి ఆఖరుది?’’ ‘‘ముముక్షుత్వం అంటే సంసార తాపత్రయాలను పోగొట్టుకుని, బ్రహ్మతాదాత్మ్యాన్ని పొందాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగివుండడం. ఈ సాధన చతుష్టయాన్ని పొందినవాడే ముక్తికి అర్హుడవుతాడు. అద్వైత సిద్ధిని పొందడానికి అనుకూలుడై ఉంటాడు. ఇవి లోపించిన వారికి, అవైదికమైన ఇతరమార్గాల్లో ఆత్మసాక్షాత్కారం పొందాలని ప్రయత్నించిన వాడికి వట్టి ఆరాటమే మిగులుతుంది.’’ ‘‘నిజమేననుకో. ఇదంతా చేయలేని సామాన్యుల సంగతేమిటి? నాముందు కొందరు గుంజీళ్లు తీసి పాపాలు పోగొట్టమంటారు. నేనేం చేస్తాననుకుంటున్నావు?’’ ‘‘అసలు నువ్వు ఎవరిని మాత్రం కాదంటావు... వెంటనే పోగొట్టేస్తావు. కానీ పాపమని తాననుకుంటున్నది మళ్లీ చేయక తప్పని మానవుడు తత్ఫలంగా దుఃఖం కలగగానే నువ్వు తన మొర వినలేదనుకుంటాడు. వేరొక దైవాన్ని ఆశ్రయిస్తాడు.’’ ‘‘అలా చేయడం తప్పంటావా?’’ ‘‘ఏమీ కాదు. గోదానం కావాలంటే మహారాజును ఆశ్రయించాలి కానీ, బేడ అప్పుకోసం ఎరిగున్నవాడు ఎవడైనా చాలు కదా! ఎంతమంది దేవతలనైనా ఆశ్రయించవచ్చు’’ ‘‘ఓహో! అలాగైతే నాలాంటి దేవతలు చాలామంది ఉన్నారంటావు?’’ ‘‘చాలమంది దేవతలున్నారు. కానీ నీలాంటి దైవాలు మీరు మొత్తం కలిపి ఆరుగురే కదా స్వామీ!... గణేశం దినేశంచ వహ్నిం విష్ణుం శివం శివాం సమభ్యర్చ దేవషట్కం ఇష్టదైవంచ పూజయేత్... అని బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. గణేశునివైన నీవు, దినేశుడైన సూర్యుడు, అగ్నిరూపుడైన కార్తికేయుడు, విష్ణువు, శివుడు, శివాని ఈ ఆరే పరబ్రహ్మ స్వరూపాలు. పగటివేళ సూర్యునివై, రాత్రివేళ మిగతా నీవే నక్షత్రరూపునివై అయిదు జ్యోతిర్మండలాల్లో కన్నులముందు ప్రకాశిస్తుంటావు. నీ అనుగ్రహం నేలకు పరిపూర్ణంగా వర్షించే శుభవేళలు పరిగణించిన మా పౌరాణికులు వివిధ సందర్భాలలో నీపేర వివిధ పర్వాలను, వ్రతవిధానాలను ఏర్పరిచారు. కన్నుల ఎదుటే నీవు ప్రత్యక్షమై కనిపిస్తుంటే దేవుణ్ణి చూడలేమని, కనిపెట్టలేమని అనుకోవడం మానవుడి వెర్రితనం కాక మరేమిటి? తల పైకెత్తి ఆకాశంలో చూస్తే నీవే. నేలపై చూస్తున్న జీవులన్నీ నీకు అభేద రూపాలే. కన్నులు మూసుకుని ధ్యానించినా మనిషిని పలకరించేది నీ తేజమే. యోగమార్గాన్ని అవలంబించి మనిషి తనలోకి తాను చూసుకుంటే, మూలాధారం మొదలు ఆజ్ఞవరకూ వరుసగా ఉన్నవన్నీ ఆరుచక్రాలూ నీ ఆరు రూపాలే. ఆజ్ఞనుంచి పైకి ఎగబ్రాకిన యోగి సహస్రారంలో ఆరు తేజస్సులూ కలిసి ఒకే పరబ్రహ్మ స్వరూపంగా ఆవిష్కరించుకున్నట్లు మీ ఆరుగురూ కలిసి ఒక్కటే. మీ ఆరు రూపాలే సనాతనం. నిత్యం. మిమ్మల్ని కాకుండా ఇతర దైవాలను కొలిచే మానవుడు మీ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దశలో ఉన్నవాడు.’’ ‘‘బాగున్నది. నీలోని ఎరుక సకల మానవులకూ కలగాలి. అందుకే జగద్గురునివై సాక్షాత్ శంభుమూర్తివైన నీవు నేలకు దిగివచ్చావు. నీవంటివాడు వచ్చినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతిసన్నివేశం దేవతామయమే కావాలి కదా! అందుకే బ్రహ్మాదులు మండన మిశ్ర తదితర శిష్యగణమై నిన్ను అనుసరించి వచ్చారు. వారందరి తోడ్పాటుతో నీ అద్వైత సిద్ధాంతం సామాన్యుల మధ్యకు వెళ్లాలి. అవివేకం అజ్ఞానం వల్ల ఎవరికివారు తమదైవమే గొప్పదనే భ్రమలో ఉన్నారు. పరమతాల పట్ల పరమ అసహనంతో రగిలిపోతున్నారు. వాదులాటలతో, కొట్లాటలతోనూ కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఒకరినొకరు చంపుకోవడానికి, ఇతరులను ప్రలోభ పెట్టడానికి కూడా వెనుదీయడం లేదు. అటువంటి వారందరికీ కనువిప్పు కలిగేలా నీ జ్ఞానాన్ని వారికి పంచు. మతాలమధ్య సమన్వయాన్ని సాధించు. సనాతన ధర్మమనే స్రోతస్వినిలో మానవులందరూ కలగలిసిపోయేలా చూడు. మూర్ఖత్వమనే రాక్షసశక్తితో పోరాటం చేయడం వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రునికైనా, జ్ఞానదండాన్ని ధరించిన నీకైనా తేలికైన విషయమేమీ కాదు. కానీ జగదుద్ధారణ తంత్రంలో కరుణాబిందువైన నీవు యుగాంతాల వరకూ మానవులందరూ తరించేందుకు వలసిన పాఠాలు కొన్ని నేర్పు. సెలవా మరి...’’ అన్నాడు వినాయకుడు తిరుగు ప్రయాణమవుతూ. వినాయకునితో పాటుగా శాపవిమోచనం పొందిన ఉభయ భారతి తానూ బ్రహ్మలోకానికి ప్రయాణమైంది. చూస్తుండగానే సర్వజ్ఞపీఠపు ఊర్ధ్వద్వారం నుంచి ఒక కాంతివలయం పైకి ఎగిసింది. ఉభయభారతి ఖాళీ చేసిన ప్రదేశంలో ఒక కొయ్యబొమ్మ వెలిసింది. శంకరుడు గబగబా పీఠం నుంచి దిగివచ్చి ఆ బొమ్మను రెండుచేతులా పట్టుకుని కళ్లకద్దుకున్నాడు. సాక్షాత్ బ్రహ్మ అయిన మండన మిశ్రుడు మానవలోకంలో మిగిలి ఉండగానే తన ప్రతీకను నేలపై వదిలి బ్రాహ్మీశక్తి స్వస్థానానికి మరలిపోయింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
శంకరుడు ఆమెలో మార్పును గుర్తించాడు
సనాతన ధర్మానికి ప్రాతిపదికలు ఆరు. భారతీయుల మేధకు, విజ్ఞానానికి తార్కాణాలుగా భరతభూమిలో అవే ఆరుమతాలుగా, షడ్దర్శనాలుగా వర్ధిల్లాయి. ఇవేవీ ఒకేఒక దైవస్వరూపాన్ని పరమోన్నతమని నిరూపించినవి కావు. ఈశ్వరుడు, పరబ్రహ్మ, నారాయణుడనే పేర్లతో చెప్పినప్పుడల్లా ఆయా దర్శనవేత్తలైన ఋషులు ఒకేఒక పరమాత్మను సూచించారు కానీ, ప్రస్తుతం మనం కల్పించుకున్న రూప విశేషాలకు ప్రాధాన్యమివ్వలేదు. శబ్దించేవాడు రుద్రుడని, ప్రాణాధారమైన జలమునందు ఆవాసం ఏర్పరుచుకున్నవాడు నారాయణుడని ఇలా ఆయా నామాలను వేదం చెబుతున్నప్పటికీ అవన్నీ ఒకే పరమాత్మను గురించి చెప్పినవి. సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యమనే ఆరు గుణాలు కలిగినవాడే భగవంతుడనే ప్రతిపాదన పురాణాలలోనిది. కలియుగంలో మానవులకు మోక్షమిచ్చేది నామ సంకీర్తనమే కానీ అవిద్య పెరిగే కొద్దీ, సాధన పలచబడే కొద్దీ దైవం విషయంలో మానవుడు రూపంపై అధికంగా ఆధారపడడం మొదలుపెట్టాడు. నాస్తికమతాల విజృంభణ పెరిగే కొద్దీ భగవత్తత్వాన్ని వేయివిధాలుగా విడమరిచి చెప్పవలసిన అవసరం పెరిగింది. నామము, రూపము, గుణముల ఆధారంగా దేవతాతత్త్వాలను వివరించవలసిన పరిస్థితి వేదవ్యాసునికే ఎదురైంది. అదే పురాణవాఙ్మయ సృష్టికి కారణమైంది. ఆచార్య శంకరుడు ఆ మార్గాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు. కాశ్మీర సర్వజ్ఞపీఠంలో శంకరుడు జరిపిన చర్చలు అందుకు తగిన కార్యాచరణను తయారు చేశాయి. కాశ్మీరంలోని గోపాద్రి పర్వతంపై జ్యేష్ఠరుద్రేశ్వరాలయం ఉంది. అక్కడే శారదానిలయమైన సర్వజ్ఞపీఠమూ ఉంది. వేదప్రామాణ్యాన్ని అంగీకరించే ఆరుశాస్త్రాలలోనూ, ఆరుదర్శన సిద్ధాంతాలలోనూ ఆరితేరిన వారినే సర్వజ్ఞులుగా సర్వజ్ఞపీఠాధ్యక్షులుగా నిర్ణయించే సంప్రదాయం ఉండేది. సర్వజ్ఞపీఠం చేసిన నిర్ణయాలను భరతఖండమంతా అంగీకరించేది. ఆ పీఠానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలున్నాయి. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులలో గల ద్వారాల నుంచి ఎందరెందరో ఉద్దండ పండితులు వివిధ కాలాల్లో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఒక్కొక్క దిక్కునుంచి ఒక్కొక్క పండితుడు వచ్చినప్పడల్లా సర్వజ్ఞపీఠపు ఆ దిక్కు ద్వారాన్ని తెరుస్తూ ఉండేవారు. శంకరుని కాలానికి ఇంకా దక్షిణద్వారం తెరవబడనే లేదు. మిగిలిన అన్ని దిక్కుల నుంచి సర్వజ్ఞులు వచ్చారు కానీ, అప్పటివరకూ దక్షిణదిక్కు నుంచి సర్వజ్ఞులెవ్వరూ పీఠాన్ని అధిరోహించలేదు. ఇప్పుడు ఉభయభారతి తదుపరి వాదనల కోసం సర్వజ్ఞపీఠానికి రమ్మని ఆహ్వానమిచ్చింది కానీ, ఆయనకు అప్పటికే తెరిచివున్న ఏ దిక్కు ద్వారం నుంచీ ప్రవేశం లభించలేదు. తూర్పు ద్వారాన్ని న్యాయ – వైశేషిక దర్శనవేత్తలు, పశ్చిమ ద్వారాన్ని పూర్వమీమాంసా వేత్తలు, ఉత్తర ద్వారాన్ని సాంఖ్య – యోగదర్శన వేత్తలు ఆక్రమించుకుని ఉన్నారు. శంకరుడు పశ్చిమదిశగా మళ్లాడు. పూర్వమీమాంసలో ఉద్దండుడైన మండనమిశ్ర పండితుణ్ణి శంకరుడు అంతకుముందే గెలిచాడు. కానీ సంప్రదాయాన్ని అనుసరించి, శంకరుడు అక్కడ మరోసారి వాదనలో పాల్గొనవలసి వచ్చింది. మంత్రైః సర్వః స్తంభితో వా తతః కిం బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిం కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం యేన స్వాత్వానైవ సాక్షాత్కృతోభూత్ మంత్రబలం చేత సమస్తాన్ని స్తంభింప చేయవచ్చు. లక్ష్యాన్ని భేదించవచ్చు. కాలజ్ఞానం పొందివుండవచ్చు. కానీ ఆత్మసాక్షాత్కారం కలగకపోతే మిగిలినవన్నీ వ్యర్థాలే కదా! బ్రహ్మలోకాన్ని సాధించినా, విష్ణులోకాన్ని వీక్షించినా, శివలోకాన్ని శాసించినా ఆత్మలోకాన్ని స్వయంగా వీక్షించకపోతే లాభం లేదు కదా!.... అని కర్మపరులైన పూర్వమీమాంసా వేత్తలకు అనాత్మశ్రీ విగర్హణ ప్రకరణాన్ని బోధించాడు శంకరుడు. మండనమిశ్రుడు, అతడి అనుయాయులు ఆయనకు స్వాగతమిచ్చారు. పశ్చిమద్వారం నుంచి శంకరుడు సభాప్రవేశం చేశాడు. ఎత్తయిన వేదికపై అమర్చిన పీఠంపై సర్వజ్ఞ శ్రీమూర్తియై ఉభయభారతీ దేవి ఆసీనురాలై ఉంది. శంకరుడు ఆమెకు నమస్కరించి, ఉచితాసనం స్వీకరించాడు. ‘‘శంకరాచార్యా! మానవుడు ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ బతుకుతాడు. ఏడుస్తూనే మరణిస్తాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, సుఖాన్ని పొందడానికి నిరంతరమూ వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎడారిలో ఎండమావిలా ఒక్కోసారి పరిష్కారం అల్లంతదూరాన కనబడుతూ మాయమవుతూ ఉంటుంది. ఎందుకంటే అది నిజమైన పరిష్కారం కాదు కనుక. భయాలు, సందేహాలు, అపోహలు, భ్రమలు పోగొట్టుకునే పర్యంతం జీవితం దుఃఖమయంగానే ఉంటుంది. దుఃఖం చీకటి లాంటిది. మన వైశేషికులు చెప్పినట్లు చీకటికి ద్రవ్యలక్షణం లేనట్లే దుఃఖానికీ లేదు. ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్ అన్న ఉపనిషత్ మార్గాన్ని అనుసరించేవారు మీరు. దుఃఖమనేది భావనలోనే కానీ నిజానికి లేదు అని షడ్దర్శనాలు చెబుతున్నాయి. మీరు కూడా ఒప్పుకుంటారు. దర్శనవేత్తలైన మహర్షులకూ మీకూ ఏవైనా విభేదాలున్నాయా?’’ ఉభయభారతి ప్రశ్నించింది. ‘‘లేవు. వేదశాస్త్ర ప్రామాణ్యంతో, సాకార నిరాకార మార్గాల్లో పరబ్రహ్మతత్త్వాన్ని ఆవిష్కరించిన దర్శనవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలతో ప్రాథమికంగా మాకెలాంటి విభేదమూ లేదు. ఎవరైనా తాము నమ్మిన ఒక మార్గానికి కట్టుబడి దుఃఖరాహిత్యాన్ని పొందవచ్చు అని మేమూ అంగీకరిస్తాం’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘మరి... ఈ సర్వజ్ఞపీఠంలో మీ ఆధిక్యాన్ని ఎలా నిరూపించుకోబోతున్నారు?’’ తదుపరి ప్రశ్న వేసింది ఉభయభారతి. ‘‘అద్వైతమే మా అసలు బలం’’ అన్నాడు శంకరుడు. ‘‘వాదనలు ప్రారంభించవచ్చు’’ అనుమతినిచ్చింది ఉభయభారతి. ‘‘ఒక్క షరతు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఏమిటది?’’ ‘‘ఇంతకాలమూ ఈ సర్వజ్ఞపీఠం దక్షిణదిక్కు ద్వారం మూతబడి ఉన్నది. ఇక్కడ నా గెలుపు నిర్ధారణ కాగానే ఆ ద్వారం ఎలాగూ తెరువబడుతుంది. షరతేమిటంటే అటుపైన ఈ పీఠంలో ప్రవేశించే వారెవరైనా సరే దక్షిణదిక్కు నుంచే ప్రవేశించాలి. మిగిలిన ద్వారాలన్నీ మూతబడాలి’’ అన్నాడు శంకరుడు. ‘‘మీ గెలుపు తర్వాత అందరి అభిమతమూ అదే అయితే అలాగే చేద్దాం’’ అని సెలవిచ్చింది ఉభయభారతి పీఠాధ్యక్ష స్థానం నుంచి. వాదనలు మొదలయ్యాయి. మొదటిగా వైశేషికులు, న్యాయదర్శనవేత్తల వంతు వచ్చింది. ఆకాశాన్ని చర్మంలాగా చుట్టుకునే మానవుడికి శివుణ్ణి గురించి తెలుసుకోకపోయినా దుఃఖ విమోచనం కలుగుతుందని, మోక్షం లభిస్తుందని వైశేషిక దర్శనం చెబుతోంది. పైపైన చూసినవారికిది నాస్తికత్వాన్ని బోధించినట్లే కనబడుతుంది. అణువుల కలయిక, విస్ఫోటనమే సృష్టి విలయాలకు కారణమవుతున్నాయనేది వైశేషికుల మతం. ఈ దర్శనం కణాదునిది. కర్మలను సైతం కణాదుడు భౌతిక దృష్టితోనే చెప్పాడు. కర్మ అంటే కదలిక అని అర్థం చెప్పాడు. పైకి లేవడం, కిందకు పడడం, ముడుచుకోవడం, విస్తరించడం, నడవడం అనే అయిదు విభాగాల్లో మన పనులన్నీ ఉంటాయన్నాడు. శంకరుడు వైశేషికులతో విభేదిస్తూ సృష్టిలో ఎవ్వరూ కర్మపరిత్యాగులు కాజాలరన్న వాస్తవాన్ని అంగీకరించాడు. నిత్య, నైమిత్తిక, కామ్యకర్మలలో.... కామ్యకర్మలను తప్పనిసరిగా అందరూ విడిచిపెట్టాలని అదే కర్మపరిత్యాగమవు తుందన్నాడు. ఇక వైశేషిక దర్శనానికి, గౌతముడు రచించిన న్యాయదర్శనానికి ఆట్టే భేదం లేదు. మొదటిదానికి రెండోది కొనసాగింపులా కనిపిస్తుంది. వారితో వాదనలో... కామాతంకః ఖండితో వా తతః కిం కోపావేశః కుంఠితో వా తతః కిం లోభాశ్లేషో కుంఠితో వా తతః కిం యేన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్ కామావేశాన్ని ఖండించావు. కోపావేశాన్ని ముక్కలు చేసుకున్నావు. లోభ పరిష్వంగం వదిలించుకున్నావు. మోహాంధకారాన్ని నలగ గొట్టుకున్నావు. పృధ్వియందు నీకంటే గర్వరహితుడు వేరొకడు లేడని పేరు మోశావు. మాత్సర్య పీడ నీనుంచి తొలగిపోయింది. కానీ ఆత్మదర్శనం కానిదే ఫలితం లేదు కదా! హృదయంలో సంపూర్ణంగా అనాత్మతో నిండిన వస్తుసౌందర్య నింద ఉదయించిన వాడే ఆత్మసాక్షాత్కారానికి అర్హుడు. మిగిలిన వారంతా జగత్ భ్రాంతి వ్యామోహంలోనే కొట్టుమిట్టాడుతుంటారు అన్నాడు శంకరుడు. వైశేషికులు, నైయాయికుల ఓటమితో సర్వజ్ఞపీఠానికి ఉన్న తూర్పుద్వారంపై ఆయనకు అధికారం సంక్రమించింది. తరువాత సాంఖ్య – యోగదర్శన వేత్తల వంతు వచ్చింది. కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్యదర్శనం లోతులెరగని వారికి నాస్తికత్వం లాగనే అనిపిస్తుంది. జీవాత్మను, పరమాత్మను ఒకటిగా కాక వేరువేరుగా గుర్తించాలనే సాంఖ్యదర్శనాన్ని శంకరుని అద్వైతం మొదటనే ఖండిస్తుంది. వేదికపైకి వచ్చిన నర్తకి వివిధ భంగిమలతో నృత్యప్రదర్శన చేసి తెరవెనుకకు వెళ్లిపోయినట్లుగా ప్రకృతి కూడా విశ్వపురుషుని ఎదుట తాను కనిపిస్తూ వెళ్లిపోతూ ఉంటుందని సాంఖ్యం చెబుతుంది. ప్రకృతి ఈ సృష్టికి కారణం. ప్రకృతి కూడా పురుషుని వలె అనాదిగా శాశ్వతంగా ఉంటుంది. శంకరుని మాయావివరణ కూడా సుమారుగా ఇదే చెబుతోంది. ప్రకృతిని కూడా ఎవరూ సృష్టించలేదు. ఇది ఉన్నదే కానీ, ఒకప్పుడు మొదలైనదీ కాదు, మరొకప్పుడు కనిపించకుండా పోయేదీ కాదు. కేవలం పరిణామం చెందుతూ ఉంటుందని సాంఖ్యం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా నిరాకార పరబ్రహ్మమే సాకారమవుతూ అనేక రూపాలు పొందుతూ, విశ్వంలో గిరగిరా తిరుగుతూ ఉంటుందని శంకరుడు చెప్పినందువల్ల వివర్తవాదం ఏర్పడింది. అబ్ధిః పద్భ్యాం లంఘితో వా తతః కిం వాయుః కుంభే స్థాపితో వా తతః కిం మేరుః పాణావుద్ధృతో వా తతః కిం యేన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్ సముద్రాన్ని అడుగులతో దాటినా, వాయువును కుంభక ప్రాణాయామంతో నిలిపినా, మేరువును చేతితో ఎత్తినా ఆత్మసాక్షాత్కరం పొందకుంటే లాభమేమున్నది? విషాన్ని పాలవలె తాగగలడు. నిప్పులను పేలాల వలె తినగలడు. పక్షివలె ఆకాశంలో తిరగగలడు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందలేదు. ఇక లాభమేమున్నది? అన్నాడు యోగదర్శన వేత్తలతో శంకరుడు. వారిద్దరి ఓటమితో ఉత్తరద్వారం శంకరునికి కైవసం అయింది. దానితో సర్వజ్ఞపీఠానికి ఉన్న మూడు ద్వారాలు ఆయన పట్టులోకి వచ్చినట్లయింది. ఇక దక్షిణద్వారం తెరిపించే విషయంపైనే పీఠాధ్యక్షురాలైన ఉభయభారతి తన అభిప్రాయాన్ని సెలవివ్వవలసి ఉన్నది. ఆమె మృదువుగా గొంతు సవరించుకుని, ‘‘శంకరాచార్యా! మీ విద్య, ప్రతిభ అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నవి. అయితే దర్శన సిద్ధాంతాలన్నీ ప్రవేశానికే కానీ, ప్రచారానికి కాదు. మీ మార్గం వేరు. మీ సిద్ధాంతం నేడు బహుళ ప్రచారంలోకి వస్తున్నది. పంచకోశాలు కలిగిన శరీరంలోని పరబ్రహ్మను నిరూపణ చే స్తూ మీరు రచించిన శారీరకభాష్యం విమర్శకుల ప్రశంసలు పొందుతున్నది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి’’ అంటూ ఉభయభారతి శరపరంపరలా కొన్ని ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రశ్నలు, వాటికి శంకరుడిచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి... ప్రత్యక్ష దేవత ఎవరు? – తల్లి పూజ్యుడైన గురువెవరు? – తండ్రి సర్వదేవతా స్వరూపుడెవడు? – జ్ఞానంతో పాటు కర్మనూ చక్కగా ఆచరించే బ్రహ్మనిష్ఠాపరుడు. ఈ జన్మ ఎందుకు వచ్చింది? – విషయాసక్తి వల్ల. పునర్జన్మ ఉన్నదా? – తండ్రికి పుత్రుడే పునర్జన్మ. తప్పించుకోలేనిది ఏది? – మృత్యువు. ఏ పని చేస్తే మంచిది? – శ్రద్ధ కుదిరిన పని. అన్నదానానికి పాత్రుడెవరు? – ఆకలి గొన్నవాడు. అర్చించదగినదేది? – భగవంతుని అవతారం. భగవంతుడెవరు? – హరిహరనాథుడైన మహేశుడు. ‘‘ఆ భగవంతుని చిచ్ఛక్తి వివర్తనమై సృష్టి అంతా ఆవరించి తిరుగుతున్నదా?’’ ‘‘అవును. అందరిలో ఉండేది, అఖండమైనది అయిన ఆత్మ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది. ఆత్మశక్తిని భాగాలుగా విభజించలేము. చైతన్యస్వరూపమైన ఆ శక్తితో కూడి శివుడే సృష్టి కారణుడవుతున్నాడు.’’ ‘‘శక్తికి అసలు పేరేమి?’’ ‘‘దానికి నిజానికి పేరేమీ లేదు. అఖండంగా ఉన్నప్పుడు పరాశక్తి, ఖండంగా ఉన్నప్పుడు మాయాశక్తి అన్నారు. ఆ రెండింటి వెనుక ఉన్న అనామక లేదా నిర్నామ తేజఃపుంజాకృతిని యోగులు శ్రీవిద్యగా దర్శిస్తారు. దానికి 1.త్రిగుణత్వం, 2. త్రిమూర్త్యాత్మకం, 3.త్రిబీజాత్మకం, 4. త్రిపీఠాకృత్యాత్మకం, 5.త్రిఖండత్వం, 6. త్రిగంథిత్వం అని మూడేసి చొప్పున ఆరులక్షణాలున్నాయి.’’ ‘‘అయితే ఆ శక్తికి నామ, రూప, గుణవిశేషాలేవీ లేవా?’’ ‘‘పరాశక్తి విద్యాస్వరూపిణిగా వెల్లడైంది. విష్ణుస్వరూపిణి అయిన శ్యామావిద్య సకల విద్యలకూ మూలమైంది. అయిదు ఆమ్నాయ విద్యలుగా విస్తరించింది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘ఏమిటా విద్యలు?’’ ఉభయభారతి పరాకుగా ప్రశ్నించింది. శంకరుడు ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును గుర్తించాడు. గతంలో మాహిష్మతీ నగరంలో ఆమెతో జరిపిన వాదంలో భాగంగా తాను సమాధానమిచ్చిన ప్రతిసారీ ఆ సమాధానమే ఊతంగా ఊర్ధ్వగామినియై భూమండలాన్ని విడిచిపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు, వాటిని నిరోధించడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ శంకరునికి ఒక్కక్షణం దృశ్యరూపంగా కళ్లముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాలన్నింటినీ వెనక్కు నెడుతూ శంకరుడు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘‘తూర్పుదిక్కున ఉన్న ఆమ్నాయ విద్యకు శ్యామావిద్య అని పేరు. ఇది ఋగ్వేద సంబంధమైనది. యజుర్వేదానికి చెందిన దక్షిణామ్నాయ విద్యను సౌభాగ్య విద్య అంటారు. భువనేశ్వరీ లేదా కామకళా విద్యగా ప్రసిద్ధిగాంచినది పశ్చిమామ్నాయ విద్య. ఇది సామవేదానికి సంబంధించినది. ఇక ఉత్తరదిక్కున ఉండేది శాంభవీ విద్య. అధర్వవేదానికి చెందినది’’ అని వివరించాడు. ఒక్కొక్క ఆమ్నాయాన్ని శంకరుడు స్మరించినప్పుడల్లా సర్వజ్ఞపీఠపు ఒక్కో దిక్కు ద్వారం మూతపడుతూ వచ్చింది. దక్షిణదిక్కు ద్వారం భళ్లున తెరుచుకుంది. ‘‘మరి అయిదు ఆమ్నాయాలున్నాయని చెప్పారు కదా!’’ అన్నది ఉభయభారతి. ‘‘శ్యామావిద్యకు ఊర్ధ్వంగా ఉన్నవే ఊర్ధ్వామ్నాయవిద్యలు. పరావిద్యగా, పరాప్రాసాదవిద్యగా, శాంభవీవిద్యగా లలిత ఊర్ధ్వరూపంగా సంచరిస్తుంది. నాలుగు ద్వారాలలో ఆయా ఆమ్నాయదేవతలు ఆమెను సేవిస్తూ ఉంటారు. మధ్యలో అమ్మ పంచబ్రహ్మాసనాసీనయై, కామేశ్వరుని వామాంకం అధిరోహించియుంటుంది’’ శంకరుడు చెబుతుండగా.... పైకప్పును ఎవరో చేతితో పక్కకు జరిపినట్లు కాగా, పీఠాధ్యక్ష స్థానంపైన ఆకాశం తెరుచుకుంది. ఊర్ధ్వద్వారం ఏర్పడింది. ఉభయభారతి అవతార పరిసమాప్తికి ఉద్యుక్తురాలైంది. ఊర్ధ్వగమనానికి సమకట్టింది. అంతలో అక్కడో విచిత్రం చోటు చేసుకుంది. - నేతి సూర్యనారాయణ శర్మ -
మమదేహి కరావలంబమ్
మాంధాత పర్వతం మీద శంకరుడు పాదం మోపిన తొలి క్షణంలోనే గోవింద భగవత్పాదునిలో చలనం కలిగింది. నిస్సత్తువను జయించి కన్నులు తెరిచి, పక్కమీద నుంచి పైకి లేచి నిలబడ్డారాయన. ఆనాడు బదరికాశ్రమంలో అలకనంద నుంచి శంకరుడు వెలికితీసిన నారాయణుణ్ణి దర్శించడానికి గోవిందులు వచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన దేహయాత్రను ఇక విరమించబోతున్నట్లు ఆనాడే సంకేతమిచ్చారు. చన్నీట స్నానం చేయలేని గురువు కోసం శంకరుడు అప్పటికప్పుడు బదరిలో వేడినీటి గుండం తవ్వాడు. ఆ తర్వాత గురుశిష్యులిద్దరూ కలిసి దక్షిణామూర్తి దర్శనానికి వెళ్లడం, శంకరునికి భాష్యరచనకు ఆదేశం రావడంతో మొదలుపెట్టుకుని ఇప్పటికి చాలనే కథ జరిగింది. చూస్తుండగానే నాలుగు సంవత్సరాల కాలం కరిగిపోయింది. ఈవేళ కలియుగాది 2609 (క్రీ.శ. 492) శ్రీకీలకనామ సంవత్సరంలోని శ్రావణ పౌర్ణమి. గోవిందులు దేహత్యాగానికి నిర్ణయించుకున్న రోజు. గురుపుత్రుడైన భర్తృహరి సందేశాన్ని అందుకుని శంకరుడు హుటాహుటిన వచ్చాడు. అల్లంత దూరాన శంకరుణ్ణి చూడగానే గోవిందులు ఆదుర్దాగా పైకి లేచి అడుగు ముందుకు వేశారు. తూలిపడ బోతున్న ఆయనను శంకరుడు పొదివి పట్టుకున్నాడు. శిష్య పరిష్వంగంలో ‘శంకరా!’ అన్నదే చివరిమాటగా గోవింద భగవత్పాదులు శరీరత్యాగం చేశారు. అక్కడికి రాదగిన వారంతా అంతకుముందే వచ్చి వున్నారు. ఆ గురువుతో జన్మాంతరాల నుంచి అనుబంధం ఉన్నవారంతా దూరదూరంగానే నిలిచి ఉన్నారు. శంకరుడు తన గురువు పార్ధివదేహాన్ని అలాగే చేతులతో ఎత్తి తీసుకువెళ్లి, ముందుగా ఆయనే ఎంచుకున్న స్థానంలో కూర్చుండబెట్టాడు. వెనువెంటనే సమాధి మూతపడింది. పద్మపాదునితో కలిసి శంకరుడు అక్కడి నుంచి కదిలాడు. యోగులు, సన్యాసులైన ఇతర శిష్యులూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్వాశ్రమంలో గోవింద భగవత్పాదునికి క్షత్రియ స్త్రీ వల్ల జన్మించిన శ్రీహర్ష విక్రమార్కుడు మాత్రం అక్కడే ఉన్నాడు. తన తండ్రి సమాధిపై శివలింగాన్ని స్థాపించడానికి, ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశాడు. మాంధాత పర్వతం అని పిలిచే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని చుట్టి వచ్చేవారికి నర్మదా పరిక్రమ మార్గంలో గోచరించేలా అపూర్వ శిల్పచాతుర్యంతో విశాలమైన మందిర నిర్మాణం చేశాడతను. శంకరయతి పద్మపాదునితో కలిసి మాహిష్మతీ సరిహద్దు అటవీ భూములవైపు కదిలాడు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సుశర్మ పంపిన భటులు శంకరుని దేహాన్ని దొంగతనంగా ఎత్తుకుపోయారు. విష్ణుశర్మ వెతుక్కుంటూ వచ్చే సమయానికే శంకరుణ్ణి చితిపై పడుకోబెట్టి నిప్పు అంటించారు. అగ్నికీలలు ముమ్మరంగా చెలరేగుతున్నాయి. హఠాత్తుగా కనిపించిన దృశ్యానికి ముందు మాటరాక నిలిచిపోయిన విష్ణుశర్మ ఒక్కసారిగా ‘గురుదేవా!’ అంటూ కేకపెట్టాడు. అతడు కేకపెట్టిన ఉత్తర క్షణంలో మంటల చిటపటలు సద్దుమణిగి చితిపై నుంచి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినిపించడం మొదలైంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం – వేయిపడగల ఆదిశేషుని పడగలపైని మణుల కాంతులతో పాలకడలి మెరిసిపోతోంది. దానిపై యోగీశునివై, శాశ్వతునివై నిలిచివున్న లక్ష్మీనృసింహుడా! అగ్నియందు ఆవిర్భవించిన నీ చేతి సుదర్శన శక్తిని కాస్త... నా భవబంధాలను తెంచిపెట్టమని ఆదేశించు. లక్ష్మీ హృదయమనే సరోవరంలో విహరించే రాజహంసా! సంసారమనే ఈ ఘోరాటవిలో సంచారం ఎంత కష్టమో నేను వర్ణించ లేను. ఇక్కడ ఎన్నెన్నో క్రూరమృగాలున్నాయి. వేటికవే వేర్వేరు కోర్కెలతో నన్ను చుట్టుముట్టి పీడిస్తున్నాయి. నాలో భయానుకంపాన్ని పెంచడానికి పూనుకుంటున్నాయి. నీవే గనుక నా చేయి పట్టుకుని నడిపిస్తే నాకీ కష్టాలు దాపురించేనా? సంసారమనే చీకటికూపం భయపెడుతుంది. బయటపడనివ్వకుండా తనలోకి లాగుతుంది. వందలాదిగా ఉన్న దీనిలోని దుఃఖాలనే పాములు నన్ను నిరంతరాయంగా కాట్లు వేస్తున్నాయి. దేవా! నేను దీనుణ్ణి. నీ పాదాలముందు వాలాను. నీ చేయూతనందించి నా దుఃఖాన్ని పోగొట్టు. సంసారమనే సాగరంలో రాగద్వేషాలనే మొసళ్లు నన్ను మింగవస్తున్నాయి. మింగబోయిన రాహుకేతువులను దూరంగా ఉమ్మేసిన సూర్యునిలా నువ్వు నా ముందు అవతరించు. సంసారమనే వృక్షం పాపబీజాలతో ఆవిర్భవించి, అనంతకర్మలనే శాఖలుగా విస్తరించింది. కామ్యాలనే ఆకులు, పువ్వులతో నిండిపోయింది. నేనీ వృక్షంమీది పళ్లపై ఆశతో దుఃఖాలు కొని తెచ్చుకుని పతనమైపోతున్నాను. సంసారమనే సర్పపు కాటు మహాతీవ్రమైనది. కోటికోరలతో నన్ను అణువణువూ నష్టపరుస్తోంది. గరుడవాహనా! కాళీయుని పడగ త్రొక్కి కాళిందిని కాపాడినట్లు నన్ను కాపాడు అన్నాడు స్తోత్రంలో శంకరుడు. సంసారదావ దహనాకర భీకరోగ్ర జ్వాలావళీభిరతి దగ్ధ తనూరుహస్య త్వత్పాదపద్మ సరసీరుహమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం – అదుగో స్వామీ! సంసారమనే ఘోరదావాగ్ని నన్ను తరుముకొస్తోంది. ఆ అగ్నికీలల్లో నేను నిలువెల్లా దహించుకుపోతున్నాను. నీ పాదపద్మాలను శరణుజొచ్చినవాడిని చేయందించి నన్ను కాపాడవా... ఇంద్రియాలనే ఎరలు వేసి ఈ సంసార సాగరంలోని చేపలను పట్టే జాలరి నీవు. ఈ చేప నీవువేసిన ఎరను కొరికి, తీవ్రంగా గాయపడింది. ఇక వేటచాలించి పైకి చేదుకో. సంసారమనే మత్తగజం తన కుంభస్థలంతో నన్ను కిందికి నెట్టేసింది. నా గుండెపై తన కాలువేసి నొక్కిపట్టింది. ప్రాణప్రయాణమనే భవభీతిని తెలియని నొప్పిగా మార్చి ఆర్తిని నశింపచేసే దేవరా నీ చేయూతనందించరా! వివేకమనే నా మహాధనాన్ని ఇంద్రియాలనే చోరులు దోచుకు వెళ్లారు. మోహాంధకారమనే లోతైన బావిలో నన్ను పడదోసి పోయారు. నేను అంధుణ్ణయ్యాననే భ్రాంతి కలుగుతోంది. దేవా దేవేశా! నీ చేయూతనందించు అని శంకరుడు స్తోత్రాన్ని పూర్తి చేశాడు. చుట్టుముట్టిన ఘోరాగ్ని అతడి దేహాన్ని ఏమీ చేయలేకపోయింది. నిప్పుల మధ్యనుంచి పువ్వులా బయటకు నడిచివచ్చాడు. మంటల వెలుగులో రాజ్యలక్ష్మీ నృసింహుడు మేఘగర్జన స్వరంతో ఇలా పలికాడు.... ‘మాయాకల్పిత దేహాన్ని అగ్నికీలలు చుట్టుముట్టిన ఈ సమయంలో నువ్వు గానం చేసిన కరావలంబ స్తోత్రాన్ని మెచ్చాను. ఇకనుంచి నా సన్నిధిలో శంకరుణ్ణి తలచినా, నీ సమక్షంలో నృసింహ గుణగానం చేసినా మానవులు సుఖజీవనులవుతారు.’ చితిమంటల నుంచి నడిచివచ్చిన శంకరుని దేహం వేయివన్నెల పసిడిలా మెరిసిపోతోంది. శంకరుణ్ణి మంటల పాలు చేసిన రాజభటులు ఏమైపోయారో ఎవరికీ తెలియదు. విష్ణుశర్మ ఆనందానికి అవధులు లేవు. పరుగు పరుగున వెళ్లి శంకరుని పాదాలపై పడ్డాడు. శంకరుడు అతడికి సేదతీరుస్తున్నాడు. దుష్కరమైన గండాన్ని అవలీలగా అధిగమించి వచ్చిన ఆచార్యుణ్ణి తదేక దీక్షతో గమనిస్తూ, పద్మపాదాచార్యుడు నృసింహతాపినీ ఉపనిషత్ మంత్రాలను నెమరు వేసుకుంటున్నాడు. ‘అన్నిచోట్లా అలుపెరుగకుండా తిరిగే ఆత్మకు మూడు రూపాలున్నాయి. అభిమంత అయిన జీవుడు, స్త్రీస్వరూపుడైన హిరణ్యగర్భుడు, వ్యక్తచైతన్యం కలిగిన ఈశ్వరుడు అన్నీ ఆత్మరూపాలే. అన్ని అవస్థల్లోనూ జీవులందరూ ఈశ్వరునిలాగే సర్వమయులే కానీ, ఆయనతో పోల్చినప్పుడు వారంతా అల్పులు. ఈశ్వరుడే జీవులందరిలోనూ భూతాల్ని, ఇంద్రియాల్ని, విరాట్ ని, దేవతల్ని, కోశాల్ని సృష్టించి వాటిలో ప్రవేశిస్తున్నాడు. ఏమాత్రం మూఢత్వం లేనివాడయినా మాయతో కలిసి మూఢునిలాగే ప్రవర్తిస్తున్నాడు. మాయావట స్వరూపమైన సంసార వృక్ష బీజం సజాతీయమైన తనవంటి ఎన్నో మర్రిచెట్లని విత్తనాలతో సహా పుట్టించి పూర్ణమవుతుంది. అసిద్ధ స్థితిలోని విత్తనానికి, సిద్ధస్థితిలోని చెట్టుకు గల ఈ భేదంలాగే మాయకూడా మనకు తనకంటే వేరుకాని పూర్ణక్షేత్రాల్ని చూపించి ద్వైతభావనను కలిగిస్తుంది. జీవ–ఈశ ఆభాసను పుట్టిస్తూ ఉంటుంది. ఆత్మకంటే వేరుకాని పరమాత్మ నిత్యుడు, సన్మాత్రుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, నిరంజనుడు, విభుడు, అద్వయానంద పరుడు. యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలందరూ ఎవరిని శరణు వేడుకుని నమస్కరిస్తారో, అటువంటి స్వామి నృసింహుడు. కనుకనే ఆయన సర్వతోముఖుడయ్యాడు. సృష్టిలోకెల్లా గొప్ప వీర్యవంతుడైన మానవుడు, జంతువులలో కెల్లా వీర్యమంతమైన సింహం కలగలిసిన సంయుక్త రూపం నృసింహుడు. ఆయనే జగత్తును రక్షించడానికి తగినవాడు. అతడు ఎల్లరికీ భయంకరుడు కానీ, ఎవరివల్లనూ తాను భయాన్ని పొందడు కనుక భీషణుడయ్యాడు. స్వయం ప్రకాశశక్తి కలిగి, తాను ఇతరులను ప్రకాశింప చేయగలవాడు... శుభమంగళ విగ్రహుడు, శుభాలను కలిగించేవాడు... అపమృత్యుదోషాలను తొలగించగల శక్తిగలవాడు కనుక ఆయన భద్రమూర్తి’ అని అర్థం వచ్చే ఉపనిషన్మంత్రాలు మనసులో మెదులుతుండగా.... ‘మా శంకరుడంటే సింహం’ అనుకున్నాడు పద్మపాదుడు. ‘నృసింహుడే ఆచార్యరూపంలో దిగివచ్చినట్లుంది. ఆ కన్నులు సర్వతోముఖ భద్ర వీక్షణాలను శిష్యుల దిశగా ప్రసరిస్తున్నాయి. ఆ భీషణ రూపం ధర్మగ్లానిని తలపెట్టేవారి గుండెల్లో ప్రచండ గర్జనలు నినదిస్తుంది. అమ్మలాంటి అందం, నాన్నలాంటి వాత్సల్యం కలగలిసిందే శంకరరూపం’ పద్మపాదుని ఆలోచనలు పలుతెరగుల విస్తరిస్తున్నాయి. ఆ మహాప్రవాహానికి అవరోధం కలిగిస్తూ విష్ణుశర్మ దీనవచనం అప్పుడు వినవచ్చింది. ‘‘గురుదేవా! ఇక నన్ను కరుణించండి’’ అన్నాడు విష్ణుశర్మ పైమాట చెప్పలేక ఆగిపోతూ. శంకరుడు చిరునవ్వు నవ్వి అతడి కోరికను మన్నించాడు. విష్ణుశర్మకు సన్యాసం అనుగ్రహించాడు. నాటినుంచి అతడు చిత్సుఖాచార్యుడయ్యాడు. ఆనాడే వారు ముగ్గురూ కాశ్మీరానికి ప్రయాణమయ్యారు. శ్రీస్థలమని పురాణప్రసిద్ధిని పొందిన సిద్ధాపురంలో సరస్వతీ నదిని దాటి కాశ్మీర భూములలో అడుగు పెట్టారు. సరిహద్దులలోనే వారి రాకకోసం హస్తామలకాచార్యుడు, ఇతర శిష్యులు ఎదురు చూస్తున్నారు. అందరూ కలిసి లోనికి సాగుతుండగా మహాజన ప్రవాహం గగ్గోలు పెడుతూ వారికి ఎదురువచ్చింది. పట్టపుటేనుగు కట్టు తెంచుకుంది. భయానకంగా చెలరేగిపోతోంది. దాని ధాటికి తట్టుకోలేక జనాలు విరగబడి పోతున్నారు. దాన్ని అదుపు చేసే సాహసం చేయడం లేదెవరూ. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెడుతున్నారు. అటువంటి సమయంలో శంకరయతి దర్శనమైంది. అప్పటివరకూ భీభత్సాన్ని సృష్టించిన మహాగజం కాస్తా ఒక్కసారిగా సాధువుగా మారిపోయింది. అతడి ముందు మోకరిల్లింది. తొండమెత్తి నమస్కరించింది. అక్కడితో అందరికీ స్వస్థత చిక్కింది. తమను మహాపద నుంచి రక్షించిన యతీశ్వరునికి అందరూ నేలపై సాగిలపడి భక్తిగా మొక్కారు. ఎవరో ఒక అత్యుత్సాహవంతుడు మాత్రం స్వామి పాదాలను తాకి, నమస్కరించాలని ప్రయత్నించాడు. శంకర శిష్యులు వారించారు. ‘‘ఏం సామీ! మేం తాకితేనే మీ పెద్దసామి మైలపడిపోతాడా?’’ దీనంగా అడిగాడు అతడు. ఆ ప్రశ్నకు పద్మపాదుడు మందహాసం చేసి, ‘‘చూడబ్బీ! సన్యాసి అంటే నడిచే నిప్పు. అనుమతి లేనిదే ప్రమాదంలో పడేది నువ్వే. నిప్పులాగే సన్యాసి కూడా అందరికీ వినియోగ పడడానికే ఉన్నాడు. నిప్పుని వాడుకున్నట్లే సన్యాసినీ వాడుకో నీకు చేతనైతే. నీ చేత్తో వారిని తాకడం కాదు... వారి కన్ను నిన్ను తాకేలా చూసుకో వీలైతే. వారి తలపు నీపైకి మళ్లేలా చేసుకో సత్తా ఉంటే’’ అన్నాడు. అజ్ఞానం ఇంకా వెర్రితలలు వేయని మంచిరోజులు కనక పద్మపాదుడిచ్చిన సమాధానం అప్పటి కుర్రవాడికి అర్థమైంది. తెచ్చిన పళ్లు ఫలాలు స్వామికి సమర్పించి పక్కకు తప్పుకున్నాడు. శంకరుడు కాశ్మీర సర్వజ్ఞపీఠం నెలకొన్న గోపాద్రి దిశగా ముందుకు సాగిపోయాడు. కృతయుగాల నాడు కశ్యప ప్రజాపతి తపఃఫలంగా వెల్లడైన సతీ సరోవరమే కాశ్మీరభూమిగా అవతరించింది. శ్రీరామచంద్రుని కుమారుడైన లవుని ఏలుబడిలో ఉండేది. ద్వాపరయుగం నాటికి జరాసంధుని బంధువుల రాజ్యమయింది. భారతయుద్ధం తరువాత గోనంద వంశస్థులు శ్రీకృష్ణ భక్తులుగా మారారు. గంగ, మధుమతి, సరస్వతీ నదుల మధ్యనున్న శారదీ నగరం ఒకప్పుడు విద్యలకేంద్రంగా విలసిల్లింది. బదరికాశ్రమంలోని వేదఘోష కాశ్మీర సరస్వతి వింటూ ఆనందిస్తుంటుందని పూర్వులు చెప్పేవారు. కానీ శంకరుని కాలంనాటికే ఆ విద్యాప్రాభవమంతా క్రమంగా కనుమరుగైంది. కాశీనగరం భరతఖండపు విద్యారాజధాని అయింది. శంకరుడు కాశ్మీరానికి రావడానికి నాలుగువందల సంవత్సరాలకు ముందుగానే అక్కడ హూణవిద్యలు ప్రవేశించాయి. మిహిరకులుడనే నరరూప రాక్షసుడు విద్యాకాశ్మీరాన్ని కేవలం సంగ్రామభూమిగా మార్చివేశాడు. బౌద్ధసన్యాసుల కారణంగా కాశ్మీర రాజస్త్రీలకు ఏర్పడిన కళంకాన్ని తొలగించడానికి అతడు దారుణ మారణహోమాలు చేశాడు. కాశ్మీర స్త్రీలకు సింహస్వప్నంలా నిలిచిన మిహిరకులుడి కన్నకొడుకైన బకుడు చివరకు ఒక స్త్రీ చేతిలోనే దారుణ మరణం పొందాడు. వసునందనుడి కాలం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కాశ్మీరాన్ని అతడి కుమారుడైన నరుడు పాలిస్తున్నాడు. నరుని కుమారుడైన అక్షుడు యువరాజు. కాశ్మీర ప్రభుత్వంలో అధికారమంతా వారిద్దరిదే కానీ, మాటచెల్లుబడి మాత్రం యువరాజ పుత్రుడైన గోపాదిత్యునిది. గోపాదిత్యుడు వేదధర్మాభిమాని. వయసులో చిన్నవాడే అయినా, సనాతన ధర్మాన్ని మళ్లీ కాశ్మీరంలో నెలకొల్పాలని విశేష కృషి చేస్తున్నాడు. దేశదేశాల నుంచి పండితులను రప్పించి విద్వత్ సభలు నిర్వహిస్తున్నాడు. అనాచార పరులైన కాశ్మీర బ్రాహ్మణులకు కనువిప్పు కలిగేలా ధర్మపరాయణులను తమ దేశానికి రప్పించి, మడిమాన్యాలను కట్టబెట్టడం మొదలుపెట్టాడు. ఈ చర్యల వల్ల ఇక్కడివారు మారాలన్నది అతడి తాపత్రయం. శారదా మండలమని పేరుబడ్డ కాశ్మీరంలో అనేకచోట్ల గోపాదిత్యుడు సరస్వతీ ఆలయాలను నిర్మించాడు. ప్రస్తుతం అతి ప్రాచీనమైన సర్వజ్ఞపీఠానికి సమీపంలో జ్యేష్ఠ రుద్రేశ్వరాలయాన్ని పునరుద్ధరిస్తున్నాడు. బ్రహ్మవిదుడై కాశ్మీర పండితులందరినీ వాదంలో గెలిచి, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన వ్యక్తిచేతనే జ్యేష్ఠరుద్రేశ్వరాలయానికి కుంభాభిషేకం నిర్వహింప చేయాలని ఎదురు చూస్తున్నాడు. అతని కోరిక నెరవేరే తరుణం ఆసన్నమయింది. ఆచార్య శంకరుడు కాశ్మీరభూమిపై అడుగు పెట్టాడు. – నేతి సూర్యనారాయణ శర్మ -
తన భార్యకే వందమంది భార్యలుగా మారాడు
సర్వత్ర ప్రాణినాం దేహే జపో భవతి సర్వదా హంసః సోహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే ప్రాణులందరిలోనూ నిరంతరమూ వాయురూపమైన ఒక జపం జరుగుతూనే ఉంటుంది. అదే సోహం. నిశ్వాసను హం అని, ఉచ్చ్వాసను సః అని గుర్తించాలి. వీటి క్రమగతి హంసస్సోహమవుతుంది. ఆత్మరూపమైన ఈ హంసకు కాంతిపుంజాలైన తెల్లటి రెక్కలుంటాయి. ఆ రెక్కల చప్పుడును గుండె సవ్వడితో పోల్చుకోవచ్చు. మనస్సుకు కూడా వినబడనంతటి సూక్ష్మగతిలో దీని ప్రయాణం ఉంటుంది. గాలిని కుంభించినా పూరించినా విడిచిపెట్టినా ప్రాణహంస స్థూల తేజో వాయు రూపాలు ధరించినట్లుగానే యోగులు ధ్యానిస్తూ ఉంటారు. ఇది ఎలా వికసిస్తుందో, జీవుని నిలయమైన దేహంలో ఈ హంసకు ఆహారం ఏమిటో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. కానీ జీవునిలోని విషయ వాసనలన్నీ కర్మేంద్రియాలకు దిగవిడిచి, ఇది జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థానాల మధ్య ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పరిభ్రమిస్తూ ఉంటుంది. జాగ్రదవస్థలో జీవుడు ప్రాణహంసను గుర్తుపట్టనే లేడు. కర్మదేహేంద్రియాల సంఘాతమనే మాయచీర అడ్డుగా ఉంటుంది. అందువల్లనే దేహవ్యాపారం మృత్యురూపమైన కర్మలతో కూడుకుని ఉంటుంది. స్వప్నంలో కర్మనుంచి విముక్తమైనా జీవునికి కామనలు ఉండనే ఉంటాయి. సుషుప్తిలో మాత్రమే ఆత్మ అసంగంగా ఉంటుంది. ప్రసన్నంగా ఉంటుంది. జాగ్రదవస్థలో స్థూలభోగాలను అనుభవించే ఆత్మ విశ్వుడు. స్వప్నవేళ తైజసుడని, సుషుప్తిలో ప్రాజ్ఞుడని పిలుస్తారు. ఈ ప్రాజ్ఞుడే జీవునికి అధ్యక్షుడు కాగా పరమాత్మ తురీయు. ప్రాజ్ఞుడు, తురీయుడు ఇద్దరూ హంసరూపులే. సుషుప్తిలో మన ప్రమేయం లేకుండానే వారిద్దరూ కలివిడిగా ఉంటారు. కర్మబంధాల వల్ల, మనస్సు చేసే తొందరింతల వల్ల, పగలెల్లా చేసిన కష్టం వల్ల జీవుడు పొందిన అలసటను తీర్చి, ఇంద్రియాలు తిరిగి అతడికి సహకరించేలా తగు వైద్యం చేసేది సుషుప్తిలోని ప్రాజ్ఞుడే. జాగ్రదవస్థలో ఉన్న దశలోనే సుషుప్తి స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఆ స్థితిని అందుకోగలిగితే జీవుడు కర్మబంధాల నుంచి విముక్తుడవుతాడు. ఇంధనం అందితే యంత్రం నిర్విరామంగా పనిచేసినట్లు ఈ నిర్వాణయోగాన్ని పొందినవాడు నూత్న యవ్వనుడవుతాడు. జాగ్రదవస్థలో ఉన్నప్పుడే సుషుప్తిలోని ప్రాజ్ఞునితో మౌనంగా రమిస్తూ ఉండడమే సమాధి అంటారు. సమాధిని అనుగ్రహించే ఈ ప్రాజ్ఞుడికి దేశకాలాలు లేవు కానీ, దేహానికి ఉన్నాయి. స్వప్నంలో ఒకడు చేసిన ప్రయాణం మెలకువ రాగానే నిజం కాదని తేలుతుంది. కానీ సుషుప్తిలోని ప్రాజ్ఞుడు చేసే ప్రయాణాలు అటువంటివి కావు. అతడు నిత్య చలనశీలుడు, అగ్ని స్వభావుడు. అగ్ని లక్షణం కాల్చివేయడం. విషయ వాసనలతో నిండివున్న కట్టెలాంటి మానవుని దేహాన్ని తన శక్తితో కాల్చివేసి, జీవుణ్ణి పరిశుద్ధం చేయాలని నిరంతరమూ ప్రయత్నిస్తుంటాడు. జీవుడు ఇంద్రియ శక్తులన్నింటినీ కూడగట్టుకుని, తనలో ప్రాణాన్ని ధరించి ఉంచుకుంటాడు. ఆ ఇంద్రియాలకే దాస్యం చేస్తూ అధోగతి పాలవుతూ ఉంటాడు. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలన్నింటా ఏ దశలోనూ మానవుడికి ఈ పంచప్రాణాలను కట్టివుంచుకునే శక్తి ఉండినంత సేపూ, ఒకేతీరులో ఉండదు. అసహాయత, అవశత్వం ఆవరించినప్పుడు తేలికగానే మోసపోతాడు. బలహీనత, భయం చుట్టుముట్టినప్పుడు సహజ మరణమే కనుక సంప్రాప్తిస్తే కర్మరూపమైన కాలపాశం జీవాత్మను తదుపరి స్థానానికి తీసుకుపోతుంది. పుర్యష్టకాలనే ఎనిమిది శరీరాల్లో బంధితుడైన జీవాత్మ ప్రయాణం దేహం నుంచి దేహానికి సాలెపురుగు నుంచి వెలువడే దారపు పోగులుగా సాగిపోతూనే ఉంటుంది. సృష్టి ప్రారంభంలో మూడుపేటలుగా పురిపెట్టిన దారాలతో రూపొందించిన కండె నుంచి... పడుగు పేకలుగా అల్లుకునే దేహమనే వస్త్రాన్ని కప్పుకుని భూమికి వచ్చినవాడు జీవుడు. ఈ మాయాపటం (తెర) చించివేసి ఆవలికి చూడు... ఈవల ఉన్న నువ్వే ఆవల కూడా ఉన్నావని ఎరుక పడుతుందంటాడు శంకరుడు. అదే నీవైన పరమాత్మను అద్వైతివై ధ్యానిస్తే ముక్తి సాధ్యపడుతుందని ఆ జగద్గురువు ఇచ్చిన సందేశం. ఇక అపమృత్యువు అంటే మరణావస్థ ఏర్పడిన దశలోనూ, అకాలమృత్యువు సంభవించబోయే దశలోనూ జీవుణ్ణి కాపాడాలని సంకల్పించిన మహాత్మ ఒకటి కనుక ఉంటే తప్పకుండా ఆ పనికి పూనుకుంటుంది. మహాసమ్మోహన తంత్రాన్ని ప్రయోగించే సామర్ధ్యం ఉన్న మహాత్మ... తాను రక్షించ దల్చుకున్న జీవాత్మను రక్షించి తీరుతుంది. అయితే ఏదైనా కోరుకోవడంలో ఉంటుంది. దేహాన్ని విడిచిపెట్టేసే చిట్టచివరి క్షణంలో మానవుడు దేనిని నిశ్చయంగా కోరుకుంటున్నాడో, అదే అతడికి తదుపరి జన్మకు కారణమవుతుంది. మరణావస్థ నుంచి బయట పడినవాడిలోనూ ఇలాగే జరుగుతుంది. అమరుకుని కథలోనూ ఇదే జరిగింది. తన చావు ఖాయమే అనుకున్న దశలో అమరుకుడు ‘హా పుత్రా!’ అంటూ శోకించడం ఆచార్య శంకరుని చెవిన పడింది. అతడి చివరి కోరిక తీర్చడానికే తాను హంసరూపుడినై పరకాయ ప్రవేశం చేశానని శంకరుడు స్వయంగా పద్మపాదునితో చెప్పినట్లు శంకర విజయాలన్నీ చెబుతున్నాయి. విడ్డూరం ఏమిటంటే ఆనాటి వరకూ అమరుకునికి సంతానమే లేదు. ఆ సంగతి పాపం అమరుకుడికి గుర్తులేదు. రాజదేహాన్ని కైవసం చేసుకుని రాక్షస రాజ్యాన్ని స్థాపించాలని మాయావి వేసిన ఎత్తుగడను శంకరుడు చిత్తు చేశాడు. పులివేషంలో వచ్చి ప్రాణనాడులు కనలిపోయేలా వాడు కొట్టిన దెబ్బనుంచి సంపూర్ణంగా కోలుకునే దాకా రాజదేహాన్ని రక్షించే బాధ్యతనూ శంకరుడు స్వచ్ఛందంగా స్వీకరించాడు. కనుకనే పరకాయ ప్రవేశానికి పూనుకున్నాడు. చూస్తుండగానే ఒక మాసం పూర్తి కావచ్చింది. తెల్లవారితే శ్రావణ పౌర్ణమి. అప్పుడింకా నాలుగోఝాము రాత్రి. తూరుపుదిక్కున వేగుచుక్క అప్పుడే ఉదయించింది. శంకరుడు శయనించి ఉన్న గుహకు బయట పద్మపాదుడు ధ్యానంలో ఉన్నాడు. జీవాత్మ కామనలు వినబడనంత గట్టిగా మూతపెట్టిన పద్మపాదుడు మనస్సనే ఆకాశంలో ఇద్దరు సిద్ధపురుషులు దర్శనమిచ్చారు. కనులు నులుముకుని తేరిపార చూస్తే వారిలో ఒకరు తన గురువైన శంకరుడే. ‘‘నాయనా పద్మపాదా! వీరు భర్తృహరి. మాకు గురుపుత్రులు’’ అని రెండోవ్యక్తిని పరిచయం చేశాడు శంకరుడు. పద్మపాదుడు ఆయనకు నమస్కరించాడు. ‘‘మా గురుదేవులు దేహత్యాగం చేయబోతున్నట్లు వార్త పంపారు. మాంధాత పర్వతానికి వెళుతున్నాం. వారి దర్శనం చేయాలనే కోరిక ఉన్నట్లయితే నీవూ రావచ్చు’’ అని మాత్రం పలికి శంకరుడు, భర్తృహరి అదృశ్యులయ్యారు. పద్మపాదుడు కూర్చున్నచోటి నుంచి హడావుడిగా లేచాడు. గుహలోనికి వెళ్లిచూస్తే శంకరుడు యధాస్థితిలో శయనించి వున్నాడు. పక్కనే విష్ణుశర్మ మాత్రం లేడు. స్నానసమయం కనుక వాగువద్దకే వెళ్లి ఉంటాడని ఊహించి అక్కడికి వెళ్లాడు పద్మపాదుడు. మాట్లాడే మట్టిచిలకను ఒడ్డుమీద పెట్టి విష్ణుశర్మ వాగులో స్నానానికి దిగాడు. పద్మపాదుడు హడావుడిగా విష్ణుశర్మకు వచ్చిన పని చెప్పాడు. తాను తిరిగివచ్చే వరకూ ఆచార్య శంకరుని దేహసంరక్షణ భారం వహించమన్నాడు. విష్ణుశర్మ పాపం ఆ మాటవింటూనే బేలగా మారిపోయాడు. ‘‘నేనొక్కడినా...’’ అన్నాడు. అతడు మింగిన గుటకల్లో ఏటినీళ్లు, భయమూ రెండూ కలగలిసిపోయాయి. ‘‘నా అంచనా నిజమైతే ఈ రాత్రిలోగా ఆచార్య శంకరులు తమ దేహంలోకి తిరిగి వచ్చేస్తారు. అప్పటివరకూ...’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఈవేళే వచ్చేట్లయితే... వారు వచ్చిన తరువాతే నువ్వూ వెళ్లవచ్చు. తొందరేమి? అయినా ఆయనక్కడ అంతఃపురంలో ఉన్నాడని నేననుకుంటున్నాను. భర్తృహరితో కలిసి పరమ గురువుల వద్దకు వెళ్లారని నువ్వు చెబుతున్నావు. అసలాయన ఎక్కడికీ పోలేదు... తనలోనే కమ్మగా నిద్రపోతున్నాడని ఈ అడివికి, అడివిలోని ఆ గుహకు కూడా బాగా తెలుసు కదా... పద్మపాదా! ఏమిటీ దోబూచులాట?!’’ రెండుచేతులా వీపును అందుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అదంతా చెప్పే తీరిక లేదు. వారు బయలుదేరమన్నారు కాబట్టి కాలయాపన చేయడం నాకు సాధ్యం కాదు. నీ వరకు నువ్వు ఆయన అక్కడే ఉన్నారని నమ్ముతున్నావు. కనుక ఇక్కడ ఈ గుహలో ఆయన మేలుకొంటేనే నీ వరకూ జరిగిన కథంతా వాస్తవంగా పూర్తవుతుంది. అది కూడా ఈవేళే జరుగుతుంది’’ అంటూ ఒడ్డుమీద ఉన్న మట్టిచిలుక వైపు సాలోచనగా చూశాడు పద్మపాదుడు. మనశ్శక్తిని కంటిచూపులో నిక్షిప్తం చేయడం ద్వారా, జడపదార్థాలలో కూడా చలనం కలిగించ గలిగితే దానిని అతిపతన విద్య అంటారు. ఆ విద్యద్వారా విష్ణుశర్మ... అమరుకుని అంతఃపురంలో పంజరంలో ఉండే చిలుకలోని శబ్దశక్తిని ఈ మట్టిబొమ్మ ద్వారా ఆకర్షించాడు. అమరుకుని భార్యలు చెప్పే శృంగార శ్లోకాలను గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పద్మపాదుడు ఆ విద్యకు పై సంగతివేశాడు. ‘‘విష్ణూ! నీ మట్టిబొమ్మకు కొత్తవిద్యనిస్తున్నాను. నువ్వు ఇకపై దీనికి చెప్పిన మాట, అక్కడ పంజరంలో ప్రాణాలతో ఉన్న చిలుక వింటుంది. ఇక్కడి మాటలు అక్కడ చెబుతుంది. రాత్రి లోపుగా ఆచార్యుడు రాకపోతే నీవు హెచ్చరించవచ్చు. తిరిగి తమ దేహంలోకి రమ్మని వారిని కోరవచ్చు. నీ మాట వారి చెవిన పడగానే అలా జరిగి తీరుతుంది’’ అన్నాడు పద్మపాదుడు. ఆ మాటలు చెబుతూనే అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయాడు. విష్ణుశర్మ సాధ్యమైనంత త్వరగా స్నానం ముగించాననుకున్నాడు కానీ, తెలియకుండా చాలానే ఆలస్యం చేశాడు. తెల్లవారి మూడు ఘడియల పొద్దువేళకు గుహకు చేరుకున్నాడు. అక్కడంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరో ఆగంతకులు ఆ ప్రాంతమంతా గందరగోళం సృష్టించినట్లు తెలిసిపోతూనే ఉంది. ఆదుర్దాగా లోనికి వెళ్లి చూస్తే అనుకున్నంత పనీ జరిగింది. లోపల శంకరుడు లేడు. గుహ బయట కనిపించిన పాదముద్రల ఆధారంగా జరిగినదేమితో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు విష్ణుశర్మ. నడుస్తున్నకొద్దీ అడుగులు కనబడుతూనే ఉన్నాయి. ముందడుగు వేసేకొద్దీ తన గుండెచప్పుడు అడుగు చప్పుడంత గట్టిగా వినిపించి భయం గొలుపుతోంది. వచ్చినవారు సామాన్యులు కాదు. కొద్దిపాటి వ్యవధానంలో చాలానే దూరం వెళ్లిపోయారు. నడుస్తున్న కొద్దీ విష్ణుశర్మలో ఆరాటం పెరుగుతోంది. చిట్టచివరకు అతడి అన్వేషణ ఫలించింది. అల్లంత దూరాన అతడు శంకరుణ్ణి చూశాడు. వారంతా... ఎవరో రాజభటుల్లా ఉన్నారు. శంకరుని దేహాన్ని చితిపై పడుకోబెట్టారు. నిప్పు రగిలించారు. చితి వేగంగా అంటుకోవడానికి వీలుగా అన్నివైపులా మంటలు పెడుతున్నారు కొందరు. ఒకరెవరో నూనె పోస్తున్నారు. చితిమంట ఒక్కసారిగా భగ్గుమంటూ రేగింది. ఆ మంటల మధ్య కాలిపోతున్నది తన శంకరుడేనని విష్ణుశర్మకు అప్పటికి నిర్ధారణ అయింది. ‘‘శంకరా!’’ అని దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రందించాడతను. ఆ ఆక్రందన అతడి రొంటినున్న మట్టిబొమ్మనుంచి అంతఃపురంలోని చిలుకకు సరఫరా అయింది. పంజరంలోని చిలుక గగ్గోలుగా గీ పెట్టింది. మాహిష్మతీ రాజప్రాసాదంలో ఇంకా నిద్దర్లు లేచే సమయం ఆసన్నం కాలేదు. శతరూపాదేవి ఆలింగన సౌఖ్యమబ్బిన అమరుకుడింకా మగత నిద్రలోనే ఉన్నాడు. ఆమె దేహంపై పారాడుతున్న అతడి చేతులలో ఏదో వెతుకులాట కనిపిస్తోంది. ప్రాసాదే సా దిశిదిశి చ సా పృష్ఠతః సా పురః సా పర్యంకే సా పథిపథి చ సా తద్వియోగాతురస్య హంహోచేతః ప్రకృతిరపరా నాస్తి మే కాపి సా సా సా సా సా సా జగతి సకలే కోయ మద్వైతవాదః – శయ్యపై నా పక్కనే ఉన్న ఆమె ఒక్కనిమిషంలో మేడపైకి వెళ్లినట్లు కలగన్నాను. మేడెక్కి చూస్తే దారివెంట పోతున్నట్లు కనిపించింది. ఆమె నడిచే దారుల వెంట పరుగెత్తి పోతుంటే నా ముందు, వెనుక కూడా ఆమెయే ఉన్నట్లు అనిపిస్తోంది. చూస్తున్న ప్రతిదిక్కులోనూ నవ్వుతూ కనిపిస్తున్నది. ఈ ప్రపంచమంతా నా చిత్తవృత్తికి ఆమె తప్ప ఇతరమేదీ కనిపించడం లేదు. ఆహా ఏమిటీ అద్వైతవాదం!... అమరుకుని పలవరింతలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. సా సా సా... ఆమె ఆమె ఆమె... అంటూ పదకొండుసార్లు విరహార్తితో అతడామెను పిలవడానికి, కొంచెం ముందో వెనుకో శంకరుడక్కడి నుంచి వెళ్లనే వెళ్లిపోయాడు. ‘‘తెల్లగా తెల్లవారాక కూడా ఏమిటీ పలవరింతలు... ఇంతకీ ఎవరా అమ్మాయి?! లే మరి. లేచి కూర్చుని చెప్పు సంగతేమిటో’’ అంటూ ఏడునెలల గర్భవతిగా ఉన్న భార్యను మృదువుగా నిద్ర లేపుతున్నాడు అమరుకుడు. కనులు విప్పి భర్తను చూసి, అప్పటిదాకా కన్న కలంతా ఒక్కసారిగా గుర్తుకు రాగా వెన్నెలలాగా నవ్వింది శతరూప. తెల్లవారితే భర్త తనను ఒంటరిగా విడిచిపెట్టి వేటకు వెళ్లబోతున్నాడనే దిగులుతో నిద్రించిన శతరూప తానే అమరుకుడైంది. దెబ్బ తగిలించుకుని వచ్చి, భార్యల చేత సేవ చేయించుకుంటున్నట్లుగా వింతకల కన్నది. భార్య కోరిక కాదనడం చేతకానివాడు, ఏకపత్నీ వ్రతుడు అయిన అమరుకుడు మరో కల కన్నాడు. తన భార్యకే తాను వందమంది భార్యలుగా మారిపోయాడు. ఎప్పుడూ చెప్పనన్ని కబుర్లు ఆమెకు వందనోళ్లతో చెప్పాడు. ఈ వింతకథను ఆ దంపతులు చాలాకాలమే గుర్తుంచుకున్నారు. పంజరంలోని చిలుక వారికి అప్పుడొకటి ఇప్పుడొకటిగా వందశ్లోకాలను మాత్రం గుర్తు చేసింది. ఆ తరువాతెప్పుడో చాలాకాలానికి అద్వైత సిద్ధాంతానికి శృంగారాన్వయం చేసిన ఆ కావ్యానికి తొలి మంగళాచరణ శ్లోకాలను రెండింటినీ శంకరుడే స్వయంగా విష్ణుశర్మ ద్వారా అనుగ్రహించాడని, అదే అమరుక శతకమై చరిత్రలో నిలిచిందని కథ చెప్పుకుంటారు. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
శిష్య సమాలోచనలు
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః/స్థిరై రంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః/ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః/ స్వస్తి న స్తార్ కో‡్ష్య అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు – మా మేలుకోరి పెద్దలు చెప్పే మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాము గాక! విశ్వమంతా వ్యాపించి ఉన్న పూషాత్మ మా దృష్టికోణాలయందు నిలిచి మాకు యదార్థ విజ్ఞానం అందించు గాక! శుభాశుభాలన్నింటియందు మాకు కవచంలా నిలిచి సూర్యుడు మాకు ఇంద్రియ హితాన్ని కలిగిస్తూ మమ్ము నడిపిస్తున్న విధానాన్ని వేనోళ్ల పొగుడుదుము గాక! దేవహితమైన మార్గమందే జ్ఞానవృత్తిలో ఉన్న మాకు బుద్ధికారకుడైన బృహస్పతి ఇంద్రియ హితాన్ని చేకూర్చి ఆయుష్షును ప్రసాదించు గాక!..... శంకర శిష్యులు మాండూక్య పాఠాన్ని శాంతిమంత్రంతో ప్రారంభించారు. గౌడపాద కారికలతో కలిపి శంకర భాష్యాన్ని క్రమపద్థతిలో అధ్యయనం చేస్తున్నారు. ప్రజ్ఞానం కలిగించే చైతన్య కిరణాల విస్తృతియే స్థావర జంగమాత్మకమైన విశ్వం. ఇక్కడ జాగ్రదవస్థలో వైశ్వానరాత్మ స్థూల భోగాలను అనుభవిస్తుంటాడు. స్వప్నవేళ అతడే వాసనామయ భోగాలను అనుభవించి తైజసుడు అవుతాడు. కామములు, కలలు ఎరుగని సుషుప్తిలోని ప్రాజ్ఞుడు తనను తాను తనయందే ప్రళయం గావించుకుంటాడు. సర్వ ఉపాధులకూ అతీతుడై తురీయాత్మగా మారిపోతాడు. ఆ తురీయునికి నమస్కారం అని అర్థం వచ్చే శంకరభాష్య మంగళాచరణ శ్లోకాలను తొలిగా పఠించారు. అది ఆషాఢ బహుళ విదియ నాటి మధ్యాహ్న వేళ. మాహిష్మతీ నగర సరిహద్దు అటవీ ప్రాంతం. ఒకవైపు ఉపనిషత్ అధ్యయనం సాగుతుండగా మరోవైపు ఒక చెట్టునీడన కూర్చుని ఉన్న గురువు వద్దకు పద్మపాదుడు, హస్తామలకుడు, విష్ణుశర్మ చేరి సమాలోచనలు సాగిస్తున్నారు. శంకరుడు కేవల సాక్షిగా ఉంటూ వారి మాటలను ఆలకిస్తున్నాడు. ‘‘నాకో అనుమానం’’ అంటూ విష్ణుశర్మ ప్రారంభించాడు. ‘‘మన ఆచార్యునికి కూడా తెలియని విషయాలంటూ ఉంటాయా? ఈయన సర్వజ్ఞులని కదా మన అభిప్రాయం?!’’ అన్నాడు. ‘‘అందులో సందేహం ఏముంది?’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఆవిడేమో తెలుసుకో తెలుసుకో అంది. ఈయనేమో అలాగేమ్మా అంటూ వచ్చేశారు. పోనీ అంటే ఆవిడ తెలుసుకోమన్న గొప్ప సంగతి పరమ ప్రయోజనకరమైనదా అంటే ఆ లక్షణమేమీ కనబడడం లేదు. అన్నీ పిచ్చి ప్రశ్నలే... ఒక సన్యాసిని అడగకూడని ప్రశ్నలే. ఏమిటదీ... ఆ మన్మథ కళలేవి అన్నది మొదటి ప్రశ్న’’ అని ఆగాడు విష్ణుశర్మ. ‘‘శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని, వశకరి, రంజని... అనే పదిహేనూ మన్మథ కళలు’’ పద్మపాదుడు సమాధానమిచ్చాడు. ‘‘అవి ఉండే స్థానాలేవి? అన్నది రెండో ప్రశ్న.’’ ‘‘పాదాంగుష్ఠం నుంచి శిరస్సు వరకు. కాలిబొటన వేలు, పాదం, చీలమండ, మోకాలు, కటి, నాభి, పొట్ట, బాహుమూలం, కంఠం, చెక్కిలి, పళ్లు, వదనం, కన్నులు, నుదురు, శిరస్సు అనే పదిహేను స్థానాల్లో పంచబాణుని పదిహేను కళలు నిత్యమూ ఒక్కొక్కచోట సంచరిస్తూ ఉంటాయి.’’ ‘‘పద్మపాదాచార్యా! మీక్కూడా తెలిసిన ఈ సమాధానాలు మన గురువుకు తెలియదంటే నమ్మడమెలా? ఈ సమాధానాలేవో ఆవిడతో చెప్పేస్తే ఈ రొష్టంతా తప్పేది కదా! అక్కడున్నంతసేపూ ఈయన అంత డొంకతిరుగుడుగా ఎందుకు మాట్లాడారంటావ్?’’ విష్ణుశర్మ ప్రశ్నించాడు. ‘‘విష్ణూ! మన సమాలోచనం లౌకికం. వారి సంవాదం పారలౌకికం. దీనికి దానికి హస్తిమశకాంతర భేదం ఉంది. తరువాతి ప్రశ్న అడుగు. ఒక చిక్కుముడి విడుతుంది’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘శుక్ల, కృష్ణపక్షాలలో చంద్రకళలను అనుసరించి మన్మథ కళలు స్త్రీలలో ఎలా వెల్లడవుతాయి?’’ ‘‘ఇదీ మొదటి చిక్కు. వాత్సాయనుడు ఇక్కడే స్త్రీలలో పద్మిని, హస్తిని, చిత్రిణి, శంఖిని అనే నాలుగు జాతిభేదాలుంటాయని చెప్పాడు. ఆయా జాతులను అనుసరించి బొటనవేలి నుంచి శిరస్సు వరకూ కళలు శుక్ల, కృష్ణపక్షాలలో ఊర్ధ్వ అధోముఖాలుగా సంచరిస్తుంటాయన్నాడు. వీటిని ఒక్కొక్కదగ్గర ఒక్కోరకంగా వర్ణించి, సామాన్యులు కళ్లు తేలేసేలా లెక్కలు చెప్పాడు.’’ ‘‘సరిపోయింది.’’ ‘‘నిజంగా అక్కడితో పోలేదు. చతుర్విధ శృంగార నాయకులలో అనుకూలుడు శ్రేష్ఠుడు. దక్షిణుడు మధ్యముడు. ఇక దిట్టతనం కలిగిన ధృష్టుడు, కపటులైన శఠులకు కామాతురత మాత్రమే కానీ స్త్రీలను రంజింపచేసే శక్తి నిజానికి ఉండదు. నాయకులలో మొదటి ఇద్దరికి మాత్రమే ఈ కళాస్థానాలు పట్టుబడతాయన్నాడు. ధూర్తులైన వారికి తన శాస్త్రం అర్థం కాకుండా వాత్సాయనుడు చేసిన ఏర్పాటిది’’ విడమరిచాడు పద్మపాదుడు. ‘‘అర్థమవుతూనే ఉంది కదా! ఇంక తగాదా ఎక్కడుంది?’’ విసుగ్గా అన్నాడు విష్ణుశర్మ. ‘‘శాస్త్రాన్ని చెప్పిన అసలు మహర్షికి ఆషాఢభూతుల్లాంటి శిష్యులు ఇప్పుడిప్పుడే తయారవుతున్నారు. గాఢతను సరళం చేస్తున్నాం అనుకుంటూ... ముఖ్యంగా ఈ కళాస్థానాలను గురించి చవకబారు ప్రతిపాదనలు చేస్తున్నారు’’ చెప్పాడు పద్మపాదుడు. ‘‘వాళ్ల పాపాన వాళ్లు పోతారు. మనకేల?’’ ‘‘అలా అనుకుంటే కాదు. మామూలు మనుషులకంటే జగద్గురువుల బాధ్యతలు పెద్దవి కదా. తరువాతి ప్రశ్న కూడా అడుగు. అసలు చిక్కు తెలుస్తుంది’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఏమున్నది అడగడానికి? పురుషులలో కనిపించే పదిహేను కళాస్థానాలను, చంద్రకళలను అనుసరించి చెప్పాలి’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అదిగో అది అసలు చిక్కు. స్త్రీలలో ఆ కళాస్థానాలు ఏ సమయాల్లో ఎలా ఉంటాయో చెప్పాడు కానీ వాత్సాయనుడు, పురుషులలో అవి ఎక్కడెక్కడ ఉంటాయో... శుక్ల కృష్ణపక్షాలలో వాటి సంచారం ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేదు’’ అన్నాడు పద్మపాదుడు అసలు సమస్యను ముందుంచుతూ. ‘‘ఏం ఎందుచేత? బహుశా అదికూడా చెప్పాలని అతగాడికి తట్టలేదేమో?!’’ అన్నాడు విష్ణుశర్మ వ్యంగ్య ధోరణిలో. ‘‘అంతమాటనకు. వాత్సాయనుడు పాపం శాస్త్రరచన కోసం తన జీవితాన్ని ధారపోశాడు. ఘోటక బ్రహ్మచారియై తపించి జగత్తుకు అరుదైన విజ్ఞానాన్ని అందించాడు. పురుషుని యందుండే కళలు అతడికి అనుకూలవతి అయిన స్త్రీకి మాత్రమే తొలిగా గోచరిస్తాయని చెప్పాడు. ఆమెకు ప్రత్యేక బోధన అవసరం లేదన్నాడు’’ వివరించాడు హస్తామలకుడు. ‘‘చూస్తుంటే స్త్రీ ద్వేషిలా ఉన్నాడు. పాపం వాళ్లకు అన్యాయం చేశాడు’’ నిరసించాడు విష్ణుశర్మ. ‘‘కాదు... మన మహర్షులే కాదు. మన సనాతన ధర్మమే స్త్రీ పక్షపాతం వహించింది. పురుషుడు కర్మబద్ధుడు. కామతంత్రంలోనే కాదు... ధర్మార్థాలలో కూడా అతడు అస్వతంత్రుడే. గృహిణి అనుమతి లేనిదే ఆ మూడింటిలోనూ అతడు అడుగు ముందుకు వేయడానికి లేదు. ఇక మోక్షమంటావా... స్త్రీ నిత్యముక్తురాలు. ఆనుషంగికంగా వచ్చిపడే కర్మఫలం నుంచి విముక్తుడయ్యేదాకా పురుషునికి మాత్రం స్వాతంత్ర్యమే లేదు. భోగాల పట్ల ఆసక్తిని తుదముట్టజూసి వదిలించుకోవడానికే శాస్త్రం కానీ, పెంచుకోవడానికి కాదు’’ కీలకమైన వ్యాఖ్య చేశాడు హస్తామలకుడు. కొద్దిసేపు అక్కడెవరూ మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నవేళ అక్కడ పిట్ట అరుపు, పురుగు అలికిడి కూడా కలగడం లేదు. ఎదురుగా ప్రవహిస్తున్న చిన్నివాగులో అప్పుడప్పుడు విష్ణుశర్మ వేస్తున్న మట్టిబెడ్డలు బుడుంగుమనడం మినహా అక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది. ‘‘అయితే దీనికి సమాధానం వాచ్యంగా చెప్పడం కుసంస్కారమే అవుతుందన్నమాట. మరి చెప్పనవసరం లేని విషయాన్ని ఆవిడ తెలుసుకోమనడం ఎందుకు? ఈయన తెలుసుకుంటాను అని తలవూపి రావడం ఎందుకు?’’ మునిగే ముందొక మట్టిబెడ్డ నీళ్లలో ముందుగానే విచ్చిపోవడాన్ని దీక్షగా చూస్తూ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘తృతీయ పురుషార్థమైన కామాన్ని పొందడానికి అవినీతికర మార్గాలు తొక్కితే ఆర్షధర్మం అంగీకరించదు. ఇటీవలి కాలంలో కొత్త శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. సంప్రదాయవాదులు చెప్పడానికి నిరాకరించిన విషయాలను ఈ కొత్తవారు నిర్లజ్జగానూ, ముందస్తు ఆలోచన లేకుండానూ వెల్లడిస్తున్నారు. దాంతో ధర్మగ్లాని ఏర్పడుతోంది. ఆ అవినీతి పరుల క్రీనీడ పరకాయ ప్రవేశాది ప్రాచీన విద్యలపై కూడా పడుతోంది. వారు అనుసరించే విధానాలు తొలిదశలో అమాయకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ అనైతికతను వివిధ దశల్లో సరిచేయండి.... దుర్మార్గులను శిక్షించి సద్వర్తనులను రక్షించే బాధ్యత తీసుకోండి అన్నదే ఉభయ భారతీదేవి ఆ ప్రశ్నలు వేయడం వెనుక ఉన్న అసలు మర్మం’’ చిట్టచివరిగా చెప్పాడు పద్మపాదుడు. ‘‘ఇటువంటి వాటికి సర్వసంగ పరిత్యాగులేం చేస్తారు?’’ వాగు దగ్గర నుంచి కదలకుండానే వెనుకకు తిరిగి ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘సద్వర్తనులకు శ్రేయస్సు కలిగేలా విద్యను బోధించడమూ, అది అల్లరిమూకల చేతికి చిక్కకుండా చేయడమూ అనే రెండు పనులూ గురువు బాధ్యతలే’’ అన్నాడు పద్మపాదుడు. విష్ణుశర్మ ఒకసారి అర్థనిమీలిత నేత్రుడై పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆచార్య శంకరుని వంక చూశాడు. ‘‘నిత్యానిత్య వస్తువివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ నిరాసక్తి, శమదమాది షట్కసంపత్తి, ముముక్షత్వం అనే సాధన చతుష్టయాన్ని పొందిన వాడికే గానీ... తన బోధలు పూర్తిగా అంతుబట్టవని మన ఆచార్య శంకరులు శాసనం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అంతమాత్రం చేత ఆయన ఎవరిపైనా నిషేధాలు విధించలేదు. ఉత్తమ, మధ్యమ, మందాధికారులకు అందరికీ అందుబాటులోనే ఉంటానని బాస చేశారు. ఏదైనా ఒక విద్యను ఒకరికి నేర్పను పొమ్మనడం, ఒకరు నేర్చుకోబోతే నిషేధాజ్ఞలు పెట్టడం గురువులు చేయాల్సిన పనేనా? ఇది సమంజసమేనా?!’’ హేతుబద్ధమైన ప్రశ్న వేశాడు విష్ణుశర్మ. ‘‘పూర్తిగా సమంజసమే. ఎవరికైనా స్థాయిని బట్టే విద్య పట్టుబడుతుంది. శిష్యుని స్థాయి గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఇందాక చెప్పిన పరకాయ ప్రవేశ విద్యనే ఉదాహరణగా తీసుకుందాం. దీని గురించి పతంజలి మహర్షి స్పష్టంగానే చెప్పాడు. వ్యాకరణం తెలియకపోయినా, యమ నియమాదులను తట్టుకోలేకపోయినా ఈ కాలపు వారికి సిద్ధులు సాధించేయాలన్న ఆరాటం జాస్తిగా ఉందని తన కాలంనాడే ఆయన వాపోయాడు. అంతమాత్రం చేత యోగం ద్వారా సాధించగలిగే సిద్ధవిద్యలను గురించి చెప్పకుండా వదల్లేదు. కాయవ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఎవరైనా పరకాయ ప్రవేశం చేయడం సాధ్యమేనన్నాడు...’’ పద్మపాదుని మాట ఇంకా పూర్తికానేలేదు. అంతలోనే అందుకుని, ‘‘సాధ్యమేనంటే సమస్యే లేదు. ఎవరికైనా హక్కుంటుంది కదా!’’ అన్నాడు విష్ణుశర్మ విషయాన్ని తేల్చేస్తూ. ‘‘విద్యతో పాటే పరిమితులు కూడా తెలుసుకోవాలి. పరకాయ ప్రవేశం చేసిన యోగికి గతం తెలుస్తుంది ఒక కలలాగా. వర్తమానం కూడా తెలుస్తుంది కొద్దిపాటి వ్యవధానం తరువాత మాత్రమే. భవిష్యత్తు మాత్రం అసలు తెలియదు. అంటే తాను విడిచివచ్చిన దేహానికి గానీ, ఈ కొత్త దేహంలో కానీ తదుపరి ఏర్పడబోయే పరిణామాలు, ప్రమాదాలు ముందుగా తెలియవు. కాలుజారితే పాతాళమే... ఇదీ ఈ విద్యకు పరిమితి’’ అసలు కీలకం చెప్పాడు పద్మపాదుడు. ‘‘పసిగట్టలేకపోతే ప్రమాదమేనే... రక్షించేవారెవరు?’’ ‘‘హఠయోగమూ కొన్ని మార్గాలు చెప్పింది. కానీ వారు చేసే కసరత్తులను యోగమనడానికి శంకరమార్గం అంగీకరించదు’’ చెప్పాడు పద్మపాదుడు. ‘‘అయితే ఈ విద్య సాధించడానికి సరైన మార్గమేది?’’ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘విష్ణూ! పరకాయ ప్రవేశం అల్పవిద్యయే కానీ, అల్పులకు పట్టుబడే విద్య కాదు. స్థూలదేహం నుంచి సూక్ష్మదేహాన్ని విడదీయడం నేర్చుకున్న యోగులు ప్రయోగదశలో మరణించిన వ్యక్తి దేహాన్ని ఎంచుకుంటారు. దానిలోకి తమ జీవచైతన్యాన్ని ప్రవేశింప చేసి శవాన్ని నడిపిస్తారు. మాట్లాడిస్తారు. ఏదైనా మహత్తర ప్రయోజనాన్ని ఆశించినప్పుడు మాత్రమే సిద్ధులు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారని చరిత్ర చెబుతోంది. అప్పటివరకూ నిరక్షరాస్యునిగా, నిరర్థకంగా బతికినవాడు కాస్తా ఎవరో సిద్ధుడు తన దేహంలో ప్రవేశించడంతోనే మహాభక్తుడిగా, గొప్ప గురువుగా మారిపోయిన సంఘటనలున్నాయి. అయితే ఈ విధానంలో ఇతరుల దేహాలలోకి ప్రవేశించిన సిద్ధులకు తమ అసలు దేహాలపై మోజుండదు. పాత వాటిలోకి తిరిగి వెళ్లాలని వారు ఎన్నడూ అనుకోరు. ’’ ‘‘ఒకవేళ తిరిగి వెళ్లాలనుకుంటే...’’ ‘‘కొత్తదేహం యోగసాధనకు అనుకూలంగా మారేవరకూ వేచివుండాలి. బాహ్యంగా జరగకుండా ఆగిన అగ్ని సంస్కారం ఈ కొత్త దేహానికి యోగి తన యోగాగ్నితో నిర్వర్తించాలి. అందుకు చాలా సమయమే పట్టవచ్చు.’’ ‘‘చాలా సమయమే అంటే...’’ ‘‘కౌళ శైవాన్ని ప్రబోధించిన మత్య్సేంద్రనాథుడు మనకు మరీ ప్రాచీనుడేం కాదు. ఆయన ఒక మరణించిన రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతడి రాణితో సంసారం చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. చివరకు గురువును వెనక్కు రప్పించాలనే ఆశయంతో గోరక్షనాథుడు చాలానే పాట్లు పడ్డాడు. కొత్తదేహంతో మత్సే్యంద్రనాథుడు కన్న సంతానం మరణించినట్లుగా గోరక్షనాథుడు మాయ కలిగించాడట. అది చూసి విలవిలా విలపిస్తుంటే, మత్సే్యంద్రునికి పాతదేహంలోకి తిరిగి రమ్మని శిష్యుడు చెప్పాడట. ఈ వృత్తాంతాలను మనవారు అనేక రీతుల్లో చెప్పుకుంటారు కానీ అసలు జరిగింది ఇదీ’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంటే ఆయనకు దాదాపు రెండేళ్లకు పైగా పట్టిందన్నమాట. అంతవరకూ అసలు దేహం పాడైపోకుండానే ఉంది మరి’’ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు విష్ణుశర్మ. ‘‘అంతేకదా. కానీ విష్ణూ! మోక్షాన్ని కోరుకునేవాడు ఎప్పుడూ దేహాత్మ భావనను విడిచిపెట్టాలి. బాల్యాది వృద్ధాప్య పర్యంతమైన దశలను బాధామయాలుగానే దర్శించేవారు మాత్రమే పరకాయ ప్రవేశం వంటి అల్పవిద్యల కేసి మొగ్గు చూపుతారు. గురుకటాక్షం ఉంటే ఏ దశలో అయినా తరించే మార్గం సులభంగానే దొరుకుతుందని గ్రహించలేని మూర్ఖులు వాళ్లు. వారి సంఖ్యకూడా ఈకాలంలోనే పెరుగుతూ వస్తోంది. కొంచెం తర్కించి చూస్తే... మత్సే్యంద్రుని కథ మనకు అందించే సందేశాలు చాలానే ఉన్నాయి. తనది కాని దేహంలోకి ప్రవేశించడం ఒక తప్పు. వేరొక జీవుని భార్యను అందునా ఒక విధవరాలిని కోరడం మరో తప్పు. భర్త మరణంతో అశౌచం కలిగిన స్త్రీతో సంపర్కం పెట్టుకోవడం అతిపెద్ద తప్పు. ఈ విధంగా చేసిన ప్రయోగంలో యోగశక్తి పూర్తిగా నిర్వీర్యం అవుతుందనడంలో అనుమానం ఏముంది? ఇక దీనిని ఆచరించినవాడు ఎంతటి సిద్ధుడయినా ఆ కొత్తదేహంలో శాశ్వత బందీగా మారిపోతాడంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని ముగించాడు పద్మపాదుడు. మధ్యాహ్నపు నిటారు ఎండ క్రమంగా వాలుగా మారుతోంది. – సశేషం -
విజయ ముహూర్తం
నిరృతి అనే అరూపలక్ష్మికి పుట్టినవాడు మన్మథుడు. రూపంలేని తల్లికి పుట్టినందువల్ల అనంగుడయ్యాడు. నాలుకే లేని అతడు పంచదశీ మంత్రాన్ని బయటకు చెప్పగలిగాడు. దానితో వేళ్లుమొలిచాయి. శ్రీవిద్యామణిని మెడలో ధరించిన ఫలం అతణ్ణి సర్వవ్యాపిని చేసింది. మన్మథుడు దర్శించిన శ్రీవిద్యలో కామకళ, శివకళ, శక్తికళ, రతికళ, శ్రీకళ అనే అయిదు భేదాలున్నాయి. దీనిని కాదివిద్య అంటారు. ఇందులో యమనియమాలు లేవు. నియమాలు లేకపోవడమే సాకుగా తీసుకుని కొందరు ఆ విద్యలో తామసిక విధానాలను ప్రవేశపెట్టారు. ఇంటికి శ్మశానానికి, గంధానికి బురదకు తేడా పాటించని కొందరు వామాచారాన్ని భ్రష్టు పట్టించసాగారు. వారి సంఖ్య శంకరుని కాలానికే అపారంగా పెరిగిపోయింది. శంకరుడు వామాచారాన్ని ఖండించలేదు. వారు పాటించే విధానాలు మాత్రమే తగవన్నాడు. తామసిక విధానాల స్థానంలో సాత్త్విక ఉపాయాలను శాక్తేయంలో ప్రవేశపెట్టాడు. ఆ మహత్కార్యానికి బీజం వేసిన కారుణ్యమూర్తి ఉభయ భారతి. ‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా’ అనే గౌడపాద సూత్రవాక్యం వద్ద ప్రస్తుతం ఉభయభారతి – శంకరుల సంవాదం ఆగింది. ‘‘ఖండద్వయమంటే ఏమిటి? రెండుగా విడిపోయింది ఏమిటి?’’ తరువాతి ప్రశ్న సంధించిందామె. ‘‘శివుడు – శక్తి’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘మరి చతుర్థ స్వరమంటే రతికళ కావచ్చునా?’’ ప్రశ్నించింది ఉభయ భారతి. ‘‘స్వరము – కళ ఒక్కటి కావు కదా’’ తోసిపుచ్చాడు శంకరుడు. ‘‘సరిగమపధని అనే సప్తస్వరాలలో మకారమే చతుర్థస్వర విశిష్టా కళ అవుతుందా?’’ ‘‘కొంతవరకూ అంగీకరించవచ్చు కానీ’’ అని మెలిక పెట్టాడు శంకరుడు. ‘‘రాగ శ్రుతులు ఏర్పడే సందర్భంలో తొలి అయిదు స్వరాలనూ షడ్జమమనే చెబుతారు. కాబట్టి చతుర్థస్వరం స అని వాదిస్తే ఏం చేస్తారు?’’ అని నవ్వాడు. ఉభయభారతి కొంచెం తికమక పడినట్లు కనిపించింది కానీ, వెంటనే సర్దుకుంది. ‘‘ఇక్కడ చెబుతున్నది కామకళను గురించే కానీ, సామకళను గురించి కాదు’’ అన్నది. శంకరుడు నవ్వి ఊరుకున్నాడు. ‘‘అచ్చులు, హల్లులుగా సాగిపోయిన సృష్టిలో క నుంచి భ వరకు దేహం. మ ఆత్మ. తత్తిమ్మావి ఇంద్రియాలు. దేహ ఇంద్రియ వ్యాపారమే కామకళ. ఇంతకూ ఆ చతుర్థ స్వరం ఏమై ఉంటుంది?’’ విడిచిపెట్టకుండా మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. ‘‘శ్రీవిద్యలో చెప్పిన కామకళకు, మీరు చెపుతున్న దేహేంద్రియ వ్యాపారమైన కామకళకు కొంచెం కూడా పోలిక లేనే లేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఒకపక్క కామదేవుడైన మన్మథుడు చెప్పాడంటున్నారు. విద్యకు పరాకాష్ఠగా ఒక స్త్రీరూపాన్ని నిలిపారు. అయినప్పటికీ శృంగార ‡శాస్త్రంతో సంబంధం లేదంటున్నారు. మీ వాదన వినడానికి చాలా విచిత్రంగా ఉంది’’ మూసిన పిడికిలిపై చెంపను చేర్చింది ఉభయ భారతి. శంకరుడు వాదాన్ని మరోమలుపు తిప్పాడు. ‘‘కకార స్వరూపుడైన హిరణ్యగర్భుడు కమనీయమైన సృష్టిని కడుపారా మోసి కన్నాడు. అతడు వాణినుంచి మాటసాయాన్ని మాత్రమే తీసుకున్నాడు. రతి అవసరం లేకుండానే అతడికి నలుగురు మనువులు పుట్టారు. ఓంకారమనే శబ్దము, మార్పుభావమైన కాలము, విభాగ భావమైన దిక్కు, కణభావమైన దిక్కులే ఆ మనువులు. వారి నుంచి స్వాయంభువ మనువు పుట్టాడు. అతడికి ఒంటరితనాన్ని తట్టుకోవడం కష్టమనిపించింది. వెంటనే తన శరీరాన్ని రెండు పప్పుబద్దల్లా సమభాగాలు చేసి నేలకు పడదోసుకున్నాడు. ఆ రెండు శరీరాలూ పతి, పత్ని భావాలు పొందాయి. అతడి కామవర్తనం భార్య అయిన శతరూపకు తప్పుగా తోచింది. గోవుగా తన రూపం మార్చుకుని అతణ్ణి విడిచి పారిపోయింది. శతరూప తన రూపాలు మార్చుకున్నప్పుడల్లా ప్రజాపతి ఆమెను వెంటాడాడు. అలా పిపీలికం వరకూ జీవులన్నింటిలోనూ సృష్టికార్యం కొనసాగుతూనే . శరీరాన్ని ఆశ్రయించినట్లయితే కామానికి తుదిలేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఎందుకు లేదు? ధర్మానికి శరీరమే ఆలంబనం కదా! లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మను త్రికూట స్వరూపిణిగా వర్ణించింది. అమ్మవారి ముఖమండలాన్ని వాగ్భవ కూటమి అంటారు. ఇదే జ్ఞానశరీరం. కంఠం నుంచి కటివరకు ఉపాసనా శరీరం లేదా కామరాజ కూటమి. నడుము నుంచి పాదాల వరకూ గల విభాగానికి కర్మశరీరం లేదా శక్తి కూటమి అని పేరు. కామరాజ కూటమిలోనే కామకళ కూడా ఉదయించిందని చెప్పుకోవచ్చు కదా!’’ శంకరుని ఉపనిషత్ వేదాంతాన్ని వ్యతిరేకించింది ఉభయ భారతి. ‘‘కామకళా స్థానం ఆ మూడు కూటములలోనూ లేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకూ ఉన్నది తురీయ కూటమి. శివశక్త్యాత్మకమైన ఈ స్థానం ఆత్మరూపమైనది కనుకనూ ఆత్మకాములైన వారు కోరుకునేది కనుకనూ దీనిని కామకళ అంటారు. అది సాక్షిమాత్రంగానే ఉంటుంది. దీనికి ప్రతీక అమ్మ ఫాలభాగాన మెరిసే అష్టమీ చంద్రకళ’’ అని సమాధానమిచ్చాడు. ‘‘చంద్రునిలో కాంతికిరణాలే కానీ, స్వరాలు వినిపిస్తాయని ఎక్కడా వినలేదు’’ కొట్టిపారేసింది ఉభయ భారతి. ‘‘తురీయ కూటమిలోని ఆత్మస్వరూపం గుణభేదాలను బట్టి ఎనిమిది పేర్లతో పిలువబడ్డది. ఆ వరుసలో నాలుగోది శబ్దాత్మ. శబ్దం స్వరయుతమే కదా!’’ అతికినట్లు సరిపోయేలా పలికాడు శంకరుడు. ‘‘అయితే ఆ శబ్దం వినేందుకు తగిన సాధనమేది?’’ ‘‘ఆకాశతత్త్వానికి నిలయమై కంఠంలో ఉన్న విశుద్ధి చక్రాన్ని పీఠంగా భావించాలి. సహస్రారం బిందువు అవుతుంది. ఈ విధంగా అమ్మను అర్చిస్తే జ్ఞానామృతం వర్షిస్తుందని... సుభగోదయ స్తుతి చెబుతోంది.’’ ‘‘బాగున్నది. మీరు ఆశ్రయించే సహస్రారానికి నోరులేదు. అది విశుద్ధి నుంచే శబ్దాలను వెలువరించాలి. ఏ మానవుడైనా అంతరంగం ద్వారా వినగలిగినదంతా నోటి మాటగా ఏ భాషలో అయినా చెప్పగలిగినట్లు ఎక్కడైనా రుజువు ఉందా? బుద్ధి కల్పించే ఈ వడబోత సిసలైన ఆత్మజ్ఞానాన్ని మరుగు పరచదా? చిత్త విపర్యయాన్ని కల్పించదా?’’ ఉభయ భారతి కంఠంలో ఒకింత విసుగుదల ధ్వనిస్తోంది. శంకరుడు తొలిసారిగా వెనక్కు తగ్గి మౌనం వహించాడు. ‘‘ఆత్మ పరమాత్మతో రమించడమే భోగం. అది ఊర్థ్వముఖాన చరిస్తే యోగమవుతుంది. అధోముఖంగా విస్తరించినప్పుడు మానవులకు అనుభవ సిద్ధమై కామభోగం అవుతుంది. భోగతృప్తి కలిగిన తరువాత కలిగే వైరాగ్యమే ఎవరినైనా ఉద్ధరిస్తుంది. అసలిందుకే ఆశ్రమ ధర్మాలు ఏర్పడగా మీరు బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసంలోకి కప్పదాటు ఎందుకు వేసినట్లు?’’ సూటిగా ప్రశ్నించింది ఉభయ భారతి. శంకరుడు బదులు చెప్పలేదు. ‘‘జగన్మాతృక సృష్టిలో ఉచ్చ, నీచ భాగాలంటూ ఉన్నాయా?’’ ఉభయ భారతి గద్దించింది. ‘‘లేనే లేవు’’ శంకరుడు లోగొంతుతో పలికాడు. ‘‘మరి యోగమార్గంలో ఉన్నవారు ఊర్ధ్వరేతస్కులై తురీయకూటమిలో పొందుతున్న రసానందం ఏ ఇంద్రియ శక్తి సంకేతం?’’ చేత బెత్తం పుచ్చుకున్న తల్లి పిల్లవాణ్ణి అదిలించినట్లు శంకరుణ్ణి ఉభయ భారతి అదిలించింది. తన అల్లరి తల్లికి తెలిసినప్పటి పిల్లవాడిలా ఒక్కొక్క మాటనూ తడుముకుంటున్నట్లుగా నటిస్తూ శంకరుడు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘‘జగత్పస్రూతిక హకారం, మాహేశ్వర శక్తిరూపం ఈకారం, అగ్నికళా రూపమైన వకారం. హ్వీధాతు స్వరూపం. అది జిహ్వేంద్రియ శక్తి. అగ్నికళా సమన్వితం’’ అన్నాడు ‘‘అగ్నిలోని సప్తమ జిహ్వ తురీయకూటమిలో ఏ వర్ణంలో ఉంటుంది?!’’ ‘‘చిత్రవర్ణం’’ శంకరుని నోటివెంట వర్ణస్వరూపం వెలువడగానే ఉభయభారతి వదనం విద్యుత్ కాంతులతో ప్రకాశించడం ప్రారంభించింది. ‘‘ఆ చిత్రవర్ణ బీజమేది? దానికి మూలరూపమేది?!’’ ప్రశ్న వెంట ప్రశ్న సంధిస్తూనే ఉంది ఉభయ భారతి. శంకరుడు జాగు చేస్తున్నాడు. నేత్రద్వయం రక్తకాంతులు చిమ్ముతుండగా ఉభయభారతి గళం నుంచి ‘‘ఏం భయమా?’’ అన్నమాట ఒక్కసారిగా ఉరుములా ధ్వనించింది. ‘‘అమ్మ సన్నిధిలోనా?’’ అని నిటారుగా కూర్చున్నాడు శంకరుడు. ‘‘చెప్పవేం మరి?’’ ఉభయభారతి కళ్లు మెరుపుకళలు విరజిమ్ముతున్నాయి. ‘‘తురీయకూటమిలో అమ్మరూపం... స్త్రీం బీజానికి మూలరూపమైన సకారం’’ అని సమాధానం చెప్పాడు శంకరుడు. మహావేగంతో వచ్చి ఢీకొన్న రెండు మబ్బులను చెల్లాచెదురు చేస్తూ పుట్టిన మెరుపు కాంతి ఆ మబ్బుల మాటునున్న మరో ఆకాశాన్ని కన్నుల ముందు నిలిపింది. ఉభయ భారతి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నభోమండల పరివ్యాప్తమై నీలిమతో నిండిపోయిన ఆమె దేహం తేరిపార చూడడానికి కూడా శక్యం కాకుండా ఉంది. అకార, ఉకార, మకార, నాద, బిందువులతో పాటు శక్తి, శాంతాలనే ఏడుకళలతోనూ మెడలో కపాలమాలతోనూ నెత్తురోడుతున్న కత్తిని ఒక చేత, తెగిన తలను మరోచేత పట్టుకుని, పద్మాలను ధరించిన మరో రెండు చేతులతోనూ అవతరించిన ఆ నీలసరస్వతీ మహారూపం భీతిగొలిపేలా ఉంది. లోకాలు, కులపర్వతాలు, ద్వీపాలు, సింధువులతో పాటు మునులు... వారు దర్శించిన ధాతువులు, స్వరాలు అన్నింటినీ కన్నతల్లిగా ఆమె ఇప్పుడామె దర్శనమిస్తోంది. ఆ మహావిద్యా స్వరూపం ముందు శంకరుడు రెండు చేతులూ జోడించాడు. ‘‘అమ్మా! ఇకమీదట నీ ప్రస్థానాన్ని నిలువరించే శక్తి నాలో లేదు. కానీ నా పరమార్థం నెరవేరేదాకా విడిచిపెట్టను. మాతృకా వర్ణాలలో జగన్మాత కాలిపిక్కలకు సంకేతమైన ట, త బీజశక్తులను నీకు పీఠంగా సమకూర్చి మళ్లీ ఇక్కడకు ఆవాహన చేస్తున్నాను’’ అన్నాడు శంకరుడు. చూస్తున్నంతలోనే ఉభయ భారతి చిరునవ్వులు చిందిస్తూ మునుపటి స్థితికి వచ్చింది. ‘‘శంకరా! ఇప్పుడు చెప్పు. రుద్రకళగా నీవు అభివర్ణించిన తిథిని తారామహాదేవి ఎలా విభజించింది?’’ ‘‘శుక్ల, కృష్ణ పక్షాలనే రెండు ఖండాలుగా.’’ ‘‘ఆ రెండింటిలో ఏ పగళ్లు గొప్పవి? ఏ రాత్రులు శ్రేష్ఠమైనవి?!’’ ‘‘రెండూ శ్రేష్ఠమైనవే. ఆ విద్యలోని రాత్రులు మధువును సంపాదిస్తాయి. పగళ్లు దానిని వర్షిస్తాయి.’’ ‘‘అయితే ఆ మధువును తాగుతూ మత్తెక్కిపోతూ ఉండడమేనా యోగ పరమార్థం?’’ అని ప్రశ్నించిందామె. కదులుతూ ఉన్న ఆమె చెవి లోలాకులే కాదని సమాధాన మిస్తున్నాయి. అదే శంకరుని నోట కూడా పలికింది. ‘‘కాదు. మధువిద్యకు స్త్రీరూపం అదితి. ఆమె దేవతాశక్తులన్నింటినీ కన్నతల్లి. మధుకశ అంటే ఆమె ఝళిపించిన కొరడాయే కుండలిని. ఆ కొరడా ఝళిపింపులోని భ్రామరీనాదాన్ని వినడమే యోగవిద్యకు పరాకాష్ఠ.’’ ‘‘మధువిద్య భ్రామరమైనప్పుడు కశ్యప ప్రజాపతి ఏం చేస్తుంటాడు?’’ ‘‘ఏమీ చేయడు. పూర్ణవికసిత వదనుడై ఆమెనే తిలకిస్తుంటాడు. ఆమె పలుకులనే వింటుంటాడు.’’ ‘‘ఆనందకంద మనిమేష మనంగతంత్రం... అని ఎనిమిదో ఏటనే నీవు పలికిన దివ్యశృంగార లీలలాగానా?’’ అనునయంగా అడిగింది ఉభయ భారతి. శంకరుడు కన్నులు రెండూ పక్కకు తిప్పుకున్నాడు. ‘‘చూశావా? ఎనిమిదేళ్ల బాలునిగా ఉన్నప్పుడు... కనుకొలకుల దాకా విస్తరించి విప్పార్చిన దేహంతో అమ్మ మగణ్ణి చూసిందని వర్ణించావు. ఆమె చర్య ముకుందునికి ముదాన్ని కలిగించి ఆమీలితాక్షుణ్ణి చేసిందన్నావు. పదహారేళ్ల లేత యవ్వనంలో పక్కకు తిరిగి పోతున్నావు. అగ్నిలోనూ, సూర్యునిలోనూ తదేక దృష్టిని నిలిపి నీవు చేసిన త్రాటకాభ్యాసం వల్ల ఆనాడు నింగిలో కనిపించిన మెరుపు నిన్ను కవిని చేసింది. ఈనాడు కనిపిస్తున్న కాంతి చిత్తవికల్పాన్ని కలిగిస్తున్నట్టుంది. రేపు నీ తపశ్శక్తికి మెచ్చి ఇంతకంటే లోకోత్తర సౌందర్యం దర్శనమిస్తే ఏం చేస్తావు? మనసు చూపెట్టలేని, పలుకు వర్ణించగాలేని దివ్యశృంగార లీలలు ద్యోతకమైతే ఏమైపోతావు?’’ ఉభయ భారతి తన మాటల్లో పరిహాస ఛాయలేవీ రానీయలేదు. ‘‘శంకరా! ఇది తెలుసుకో. శుక్ల, కృష్ణపక్ష తిథులలో పెరిగి తరిగే చంద్రకళలు యువతీ యువకుల మనస్సులపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? కామకళ శ్రీకళాసిద్ధిగా ఎప్పుడు పరిణామం చెందుతుంది? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి’’ శంకరుడామె మాటకు అవుననలేదు. కాదనలేదు. కానీ ఇది సన్యాసికి తగిన పనేనా? అన్న గుసగుసలు మాత్రం సభలో అక్కడక్కడా వినిపించాయి. ‘‘ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని వాదప్రతిజ్ఞ చేశావు. నీవంటివాడి నోటివెంట పరిహాసానికైనా అటువంటి అశుభ వాక్యం రావచ్చునా?! ఆ మాట పలికినందుకైనా ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసుకోక తప్పదు’’ తీర్మానించింది ఉభయ భారతి. ‘‘నువ్వు తప్పదంటే ప్రయత్నిస్తాను’’ అన్నాడు శంకరుడు. ‘‘మంచిది. భోగవైరాగ్యం నీకు జన్మసిద్ధమని నిరూపించుకుంటావో... ఆశ్రమ ధర్మానికి విరుద్ధమైనా భోగతృప్తిని పొంది విరాగివి అవుతావో... ఏ పని చేసినా జాగ్రత్తగా చేయి. వచ్చే భాద్రపద శుద్ధ చవితి నాటికి మళ్లీ కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠంలో కలుసుకుందాం. అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమంజసమైన సమాధానాలతో మెప్పించ గలిగితే భరతఖండమంతా నీకు దాసోహమంటుంది’’ అన్నది ఉభయ భారతి చర్చకు ముగింపు పలుకుతూ. అప్పటికి సాయం సంధ్య అవుతోంది. మలిసంజె మాడిపోతున్న మన్మథుడి శరీరంలా ఉంది. ఆకాశంలో తూరుపింట ఆదిదంపతుల మిథున లగ్నం ఉదయిస్తుంటే, పడమటి కొసమీద మన్మథస్థానమైన ధనుర్లగ్నం అస్తమిస్తోంది. ఆనాడు ఆషాఢ గుప్తనవరాత్రాలలోని విజయ దశమి. ఉభయ భారతి లోనికి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న శంకరుణ్ణే వెనక్కివెనక్కి తిరిగి చూస్తూ మండన మిశ్రుడు భార్యను అనుసరించాడు. వాకిట శంకరుణ్ణి కాళిదాసు నిలువరించాడు. ‘‘శంకరాచార్యా! ఇంతకూ చతుర్థ స్వరం ఏదంటారు?’’ అని ప్రశ్నించాడు. ‘‘అనాహతంలో పుట్టే మధ్యమం. విష్ణుస్థానం’’ అని జవాబిచ్చాడు శంకరుడు. ‘‘అయితే రుద్రస్థానమైన విశుద్ధి, విష్ణుస్థానమైన అనాహతానికి మధ్య మగమ ఉంటే మణిపూరంలో దేవి పదిచేతులతో ఎందుకు ఉదయిస్తుంది? రొమ్ముపాలు కుడిచిన తొలినాడే కామమోహాలకు బద్ధుడైపోయిన నిషాదుడు ఒకడు దేవి కన్నులు కప్పి ఎటునుంచి బాణం వేస్తే మగపక్షి నేల కూలింది. కలి త్రేతాయుగాల మధ్య దూరమెంత? నేలకు అవతరించిన పూర్ణమానవుడు ఏకపత్నీ వ్రతాన్ని ఆదర్శంగా ఎందుకు చెప్పాడు? అన్నట్లు ఇందాకటి కథలో శతరూప ఏమైపోయింది? కొంపదీసి స్వాయంభువ మనువు సన్యాసం తీసుకున్నాడా? ప్రజాపతి కామజయాన్ని పొందాడా?’’ కాళిదాసు హుందా అయిన పెద్దరికంతో శంకరునికి ప్రశ్నలరూపంలో మార్మికంగా సందేశమిస్తున్నాడు. సమాధానం ఆశించని అతడి మాటలకు శంకరుడు తలపంకించాడు. – సశేషం -
ప్రపంచసార తంత్రం
‘‘సృష్ట్యాదిలో నామరూపాలు లేవు. జ్యోతిస్వరూపమైన ప్రకృతి చిన్మాత్ర బిందువుగా ఉంది. సృష్టిని ప్రారంభించాలనే ఆశయంతో ప్రధాన ప్రకృతి తనను తాను స్థూల, సూక్ష్మ, పరా బిందువులుగా విభజించుకుంది. ‘అ’ అనే అచ్చు అక్షరంలో నాలుగు ముక్కలుగా కనిపించే ఆకాశమే చిన్మాత్ర బిందుప్రకాశాన్ని విభజించి చూపి సృష్టి రచనకు నాంది పలికింది. ఈ విభజన జరిగే క్రమంలో మొదటిగా ఆ కాంతిస్థావరం నుంచి అవ్యక్తమైన నాదం వెలువడింది. ఆ నాదం కారణమై చంద్రమండలం ఏర్పడింది. బిందు, విసర్గలు కాకుండా మిగిలిన పదహారు అక్షరాలూ ప్రాణకళలతో ప్రకాశించాయి. వాటినుంచే సమస్త భువనాలూ పుట్టాయి. క నుంచి భ వరకు గల ఇరవైనాలుగూ కలిసి సూర్యమండలమయ్యాయి. దానికి క–భ, ఖ–బ ఇలా పన్నెండు కళలున్నాయి. వాటినుంచే జీవరాశులన్నీ పుట్టాయి. అయితే ఏ జీవిలోనూ సృష్టికర్త ఇరవైనాలుగు సంపూర్ణ తత్త్వాలనూ పొదగలేకపోయాడు. చిట్టచివరకు తనకు ప్రతిరూపంగా పూర్ణజీవిగా మానవుణ్ణి రూపొందించాడు. ఆ దేహానికి అచ్చులు ప్రాణం పోశాయి. య నుంచి క్ష వరకు ఉన్న పది అక్షరాలే పంచభూతాత్మకమై కర్మ, జ్ఞానేంద్రియాలను కలిగించాయి. ఇక హల్లులలోని వర్గాక్షరాలలో చిట్టచివరిదైన మకారమే ఆత్మ అవుతున్నది.... అని నారాయణుడు మునుపు సృష్టి మొదలైన క్రమాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు. ’’ శంకరగళం ప్రపంచ సారతంత్రాన్ని ప్రవచిస్తోంది.అతడి ప్రవాహధోరణికి మండన మిశ్రుడు మొదట విస్మయ పడ్డాడు. కర్మకాండను ప్రవచించిన పూర్వమీమాంసను జీవితకాలమూ ఆరాధిస్తూ వచ్చిన వ్యక్తి అతడు. దానిని కాదని జ్ఞానకాండను బోధిస్తున్న శంకరుణ్ణి వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నప్పుడు... వాదంలోకి వేదాంతశాస్త్రాన్ని రానివ్వకుండా చూసుకోవలసింది. కానీ అతడు ఆ పని చేయక పొరబాటు చేశాడు. దానితో శంకర విజయం నల్లేరు మీద బండి నడక అయింది. ఇప్పుడు మండన మిశ్రుని ఇల్లాలైన ఉభయ భారతి వాదానికి సిద్ధపడింది. శంకరుణ్ణి పూర్వమీమాంసకు ప్రాతిపదికగా నిలిచిన తంత్రశాస్త్రంలోకి దించింది. మండన మిశ్రునికి ఈ పరిణామం ఒకవంక మోదాన్ని, ఒకవంక ఖేదాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే అతడు శంకరుణ్ణే తన గురువుగా మనసా అంగీకరించి ఉన్నాడు. కనుక ఎలాగైనా తన గురువే చివరకు విజయం సాధించాలని ఆరాట పడుతున్నాడు.ఉభయ భారతి సాగించిన యోగప్రస్థానాన్ని మూడు విభిన్న భూమికలలో నిరోధించి ఆమెను త్రిపుర, భువనేశ్వరి, వనదుర్గా శక్తులుగా దర్శించి, ఆకర్షించి నిలువరించిన వాడు శంకరుడు. శబ్దమయ ప్రపంచమనే మహారణ్యంలో అపూర్వము, అలభ్యమైన పుష్పాలను ఏరుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అతడి వేగానికి ఉభయ భారతి అడ్డుకట్టలు వేస్తోంది. ‘‘తమరు ఆత్మవిద్యా విశారదులు. అందుకే రుద్రరూపమైన మకారం ఆత్మ అని చెబుతున్నారు. నిజానికి క నుంచి మ వరకు ఉన్న ఇరవై అయిదు హల్లు అక్షరాలనూ స్పర్శలనే పిలుస్తారు కదా! మకారానికే ఎందుకంత ప్రాధాన్యం?’’ అడిగిందామె.‘‘మవర్ణానికి ముందు, తరువాత కూడా సృష్టి ఉంది. కానీ సమస్తమూ అందులో నుంచే వచ్చి, తిరిగి అందులోనే లయమవుతోంది. హల్లులన్నీ అచ్చులతో కలిసినప్పుడే ప్రాణవంతాలు అవుతున్నాయి. వాటి తరువాత వచ్చే అంతస్థములైన ‘యరలవశ’లు సూర్యశక్తితో నిండిన వ్యాపనములు. వాటినుంచే పంచభూతాలు వచ్చాయి. ఇక గాలిని పైకి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలంటారు. అవే షసహళక్ష అనే అయిదు అక్షరాలుగా మారి అగ్నిశక్తితో నిండి పంచేంద్రియాలయ్యాయి. స్పర్శలని పిలిచే హల్లులకు, య నుంచి క్షవరకు గల వ్యాపన, ఊష్మాలకు.... అచ్చులు ప్రాణం పోసినప్పుడు స్వరం ఏర్పడి దేహంలో కదలిక వస్తోంది. అందువల్ల దేహం వేరు, ఆత్మ వేరు. అందువల్ల మకారమే ఆత్మ. అదే లయస్థానం.... రుద్రరూపం’’ అన్నాడు శంకరుడు. కలగలిసిపోతున్న పెదవులు రెండింటినీ విశేష ప్రయత్నంతో విడగొట్టాలని ప్రయత్నిస్తుంటే... దేహంలోని నాడీతంత్రులన్నింటినీ స్పర్శిస్తూ నాసిక నుంచి పెదవుల నుంచి ఒకేసారి మకార ధ్వని పుడుతుంది. ప్రాణమనే అచ్చును కలబోయకుండా హల్లుగానే మకారాన్ని ఉచ్చరిస్తే పుట్టే నాదం లోలోపలే లయమైపోతూ ఉంటుంది. మెళకువలోని అనుక్షణమూ ఏదో ఒకటి వింటూ ఉండకపోతే అసలేమీ తోచదు మనకు. అర్థంపర్థం లేకుండా రొదపెడుతూ హోరుపుట్టిస్తూ వినిపిస్తున్న ధ్వనుల మైకంలో పడి ఇంద్రియ శక్తులను నిష్కయ్రగా, నిస్తేజంగా మార్చుకుంటూ ఉంటాం. వింటున్న దానినుంచి ఏదో అర్థం చేసుకోవాలని, వింటూ చదువుతూ తపించిపోతుంటాం. కానీ మనలో కన్నులు మూసుకుని వింటున్నదెంతమంది?! చెవులు మూసుకుని చదువుతున్నదెంతమంది?! ఆడంబరంగా శబ్దాలను పోగేసుకుంటూ ఉంటే లాభం లేదు... దానికి పరమైన పరమేశ్వరుణ్ణి తెలుసుకో లేదంటే నీ చదువు వృధా అంటోంది భాగవతం. నోరునొవ్వంగ హరికీర్తి పాడమంటోంది. ‘‘లయస్థానం సంగతి సరే... అక్షరశక్తి సృష్టి, స్థితులను ఎలా పాలిస్తుంది?’’ ఉభయభారతి తదుపరి ప్రశ్న వేసింది. ‘‘అకారం సృష్టికర్త రూపం. ఆకారం అతడి స్త్రీరూపం. ఇకారం శివస్వరూపం. ఈశత్వం అతడి శక్తి. ఉకారం స్థితికారకత్వం.... విష్ణురూపం. అతడి స్త్రీరూపమే ఊ. అక్కడి వరకూ ఉన్న ఆరు అక్షరాలనూ ఊర్ములని పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలు ఏర్పడిన తరువాత జగత్ వ్యాపారం కొనసాగడానికి ముందుగా తొలి ఆరు అక్షరాల నుంచే ఆకలి, దప్పిక, శోకం, మోహం, జననం, మరణం అనే ఊర్ములు సంభవించాయి. అప్పుడు జగన్మాతృక అగ్నిబీజ రకారంనుంచి కళలను గ్రహించి ఋ, ౠ, అలు, అలూ అనే సంధ్యాక్షరాలను జనింప చేసింది. అవి వాయురూపాన్ని పొంది ఊర్ధ్వ అధోముఖాలుగా, కుడిఎడమ నాసికలలో ఉత్తరాయణ, దక్షిణాయనాలను సాగించాయి. ఆ తరువాత ఈశ్వరీశక్తి హ్రీంకారమై గుణ, కరణ, సంఘాత, చేతన శక్తుల చేత బిందు, విసర్గలతో సహా మిగిలిన అచ్చులను ఉద్భవింప చేసింది.’’ ప్రాణం పుట్టుకను, స్థితిని, లయను లిపిరూపమైన కాంతిగా... నాదంగా దర్శింపచేస్తున్నాడు శంకరుడు. ‘కదలికయే ప్రాణసంకేతం. అది సృష్టి ప్రారంభంలో అవ్యక్తనాదంగా వినిపించిందన్నారు కదా! నాదం విస్తరించిన తరువాత అయినా అదేమిటో తెలిసిందా లేదా? ఇంతకూ నాదబిందువుల సంయోగంలో వినబడిన ఆ తొలినాదం ఏది?’’ ప్రశ్నించింది ఉభయ భారతి. ‘‘ఓంకారం’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘అకార, ఉకార, మకారాలను కలగలిపితే ఓ అనే అచ్చు అక్షరం పుడుతుంది. దానికి బిందు, నాదాలు కలిసినప్పుడు ‘ఓమ్’ అవుతుంది. అ నుంచి క్ష వరకూ అక్షర సమామ్నాయం అంతటికీ కలిపి ఏభై కళలున్నాయి. ఆ కళలన్నీ ఓంకారంలో ఉన్నాయి. అదే సృష్టిలో వినబడిన తొలినాదం. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నప్పటి లయం కంఠం నుంచి కిందికి పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఓంకారాన్ని కపోలబిందువుతో కలిపి వ్రాయడాన్ని బట్టి ఆ నాదం ఊర్ధ్వగతినే సూచిస్తుంది. దానినే సహస్రారంలోని బిందుస్థానంగా సమయాచార శాక్తేయులు చెబుతారు. బ్రహ్మజ్ఞానం పొందగోరే వారికి ఏకైక శరణ్యం ఓంకారమే’’ వివరించాడు శంకరుడు. ‘‘కాంతిని మీరు స్త్రీరూపంగా ప్రకృతిగా, ప్రధానగా, జగన్మాతగా వర్ణిస్తున్నారు. నాదం శివస్వరూపం కనుక పురుషునిగా వర్ణిస్తున్నారు. వారిద్దరిలో ముందుగా పుట్టినవారెవరు?’’ ఉభయ భారతి చిక్కుముడి వేసింది. శంకరుడు తర్కాన్ని వినిపించాడు. ‘‘ఒకడు తలవంచుకుని కూర్చున్నాడు. ఉరుము శబ్దం వినబడింది. తలపైకెత్తి చూస్తే మెరుపు కాంతి కనవచ్చింది. ఆకాశం వంక ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. ఉరుము పుట్టిన చోటి నుంచే మెరుపు వెలుగులు విస్తరించడం కానవచ్చింది. ఒకేసారి పుట్టిన కవలల్లో ముందుగా బయటకు వచ్చిన ప్రాణి ఎప్పుడూ రెండోదే అవుతుందనే లోకసామాన్య వ్యవహారం. మొత్తంమీద కాంతి ఎల్లప్పుడూ ఉన్నది. శబ్దం దానిని విస్తరించేందుకు సమకట్టింది. శబ్దసముచ్ఛయమే మంత్రమై వినిపించింది. లిపిబద్ధమైనప్పుడు దానిని బీజాక్షరమన్నారు. దేవతాస్వరూపాన్ని ఆ అక్షర రూపంలో చూడడానికి ఋషులు ప్రయత్నించారు. బీజాక్షరానికి దేవతానామాన్ని కలిపి స్పష్టమైన ఉచ్చారణతో పదేపదే మననం చేసినప్పుడు... సాధకునికి హృదయంలోనే ఆ దేవతాస్వరూపం కాంతిరూపంలో దర్శనమిస్తుంది. దైవవాణి నాదమై వినిపిస్తుంది’’ అని ఉభయతారకమైన సమాధానమిచ్చాడు శంకరుడు.ఉభయభారతి మరో మలుపుకు తిరిగింది. ‘‘ఇంతకూ అక్షర జగత్తును కన్నతల్లి ఎవరు?’’ అని అడిగింది. ‘హకారమే జగత్పస్రూతిక. నాభినుంచి అగ్నికళగా పుట్టిన హకార నాదం అనాహతాన్ని పూరించి, కంఠమూలం నుంచి వాయురూపంగా బయటకు వెలువడుతుంది. హ్రీంకార మాయాబీజ స్వరూపిణిౖయె భువనేశ్వరి ఈ చతుర్దశ భువనాలనూ నిర్మించింది. అది అంతుపట్టకుండా విస్తరిస్తున్నప్పుడు విష్ణువు హంసగా మారాడు. హ్రీంకారంలోని కుండలినీ శక్తిని సవితగా మార్చి మోసుకెళ్లి సూర్యునిలో నిక్షేపించాడు. మనం నివసిస్తున్న భువన బ్రహ్మాండానికి కావలసిన పోషక శక్తి అంతా సూర్యుని నుంచి వస్తున్నది. చర్మచక్షువులతో చూడలేని సూర్యునిలోని ఆ సవితాశక్తి మనలోనికి గాయత్రీ ఉచ్చారణ వల్ల వచ్చి చేరుతుంది’’ అన్నాడు శంకరుడు. ‘‘అయితే మనం నివసించే భువన బ్రహ్మాండానికి ఆవల మరెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయన్న మాట. మనం దర్శిస్తున్న ఈ సూర్యుడు కాక మహాసౌర శక్తి వేరే ఉన్నదన్నమాట. దర్శమొదలు పౌర్ణమి వరకు పదహారు కళలు ప్రదర్శించే ఈ చంద్రుడు కాకుండా వేరే చంద్రమండలం ఉన్నదన్న మాట.’’ ‘‘అవును. భూమండల నివాసులమైన మనం ఇక్కడ చర్మచక్షువులతో దర్శిస్తున్నవన్నీ అసలు శక్తులకు ప్రతీకలే. ఇవన్నీ నిజశక్తులతో మనకు అనుసంధానం కలిగించగలవు. ఆ శక్తి ఋషులు నిర్మించిన మంత్రనాదానికి ఉంది’’ అని ఘంటాపథంగా చెప్పాడు శంకరుడు. ‘‘అయితే పరమశివుని ఫాలభాగాన కనిపించే అసలు నెలవంక ఏది? దానికి సమానమైన శక్తికళ ఏది?’’ మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. ‘‘రుద్రునికి మొత్తం పదహారు కళలున్నాయి. యోగి అయిన ఆయన ధరించే మొదటి కళకు పేరు నివృత్తి. ఆయన ఏడింట భవభూతిగా ఉన్నప్పుడు ఋత్వాన్ని పోలివుండే రేచికా అనే చంద్రకళను ధరించినప్పుడు సతి ఆయనను వరించింది. ఎనిమిదోదైన ౠకారాన్ని పోలివుండే మోచికాకళను ఆశ్రయించి ఆమె గోముఖిౖయె, తిథి స్వరూపుడైన శివుణ్ణి కూడుతుంది’’ అన్నాడు శంకరుడు. శ్రీవిద్యా రత్నసూత్రాలను, సుభగోదయ స్తుతిని అందించిన గౌడపాదుని శిష్యపరంపరలో సాక్షాత్ శంకరుడు ఇప్పటికి పరమ శాక్తేయునిగా అవతరించాడు. ఎన్నెన్నో విశ్వ మహారహస్యాలను సంకేతార్థాలనిచ్చే శ్లోకాలుగా ప్రపంచసార తంత్రంలో పొందుపరిచాడు. అతడికి ముఖ్యశిష్యుడైన పద్మపాదుడు దానికి విశేష వివరణతో కూడిన వృత్తిని రచించి ఇతరులకు వివరించాడు. ఉపాసనాకాండకు ఊతమిచ్చిన ఈ ప్రపంచసార తంత్రాన్ని తరువాతి కాలంలో ఎందరెందరో విభిన్న కోణాల్లో విశ్లేషించారు. ఆనాడు కుమారసంభవ సృష్టికర్త సన్నిధిలో శంకరుడు కళామయ ప్రపంచాన్ని మహోన్నతంగా ఆవిష్కరించాడు. బిందు, నాదకళా సంయోగాలపై ఆ చర్చ సుదీర్ఘంగా సాగింది. ‘‘హ్రీకారంలోని అగ్నిశిఖ క్లీం శక్తియై పురుషుణ్ణి ఆకర్షించింది. తిథిస్వరూపుడైన రుద్రుడు ఎన్నివేల యుగాల వరకూ గోముఖి అనే పేరుగల శక్తికళతో రమిస్తూ ఉండిపోయాడో ఎవరికీ తెలియదు. దక్షయజ్ఞం సతీవియోగానికి కారణమైంది. శివునిలో నైరాశ్యం ఆవరించింది. మూలాధారంలో పరాబిందువుతో కలిసి అదేపేరు గలిగిన నాదమయుడై తనలో తానే దాగిపోయాడు. అప్పుడాయనను స్థాణువని పిలిచారు. ఆ స్థితినుంచి ఆయనను మణిపూరంలోని తన స్వస్థానానికి సూక్ష్మకళగా ఆకర్షించింది పార్వతి. శివుడు సామాన్య స్పందనతో పశ్యంతి వాక్కుగా వెలువడ్డాడు. కార్యబిందువు హృదయస్థానానికి ఆ నాదాన్ని లాగినప్పుడు మధ్యమ వాక్కుగా సూక్ష్మామృత కళను, విశుద్ధి, సహస్రారాల మధ్యకు అతడిని ఆమె ఆహ్వానించినప్పుడు వైఖరీ వాక్కుగా జ్ఞానామృత కళలను ప్రదర్శించాడు. సద్యోజాతుడై శివుడు ఆప్యాయనీ కళను ప్రదర్శించినప్పుడు శక్తి దానిని జ్వాలాముఖియై అందుకుంది. అనుగ్రహేశ్వరుడై వ్యాపినీ కళను ప్రదర్శించినప్పుడు ఆమె ఉల్కాముఖిగా మారి ఒడిసిపట్టింది. అక్రూరుడై వ్యోమరూపాన్ని ధరించినప్పుడు ఆమె శ్రీముఖియై శివతత్త్వాన్ని జగత్తుకు వెల్లడి చేసింది. మహాసేనుడై అనంతరూపాన్ని ధరించినప్పుడు విద్యాముఖియై ఆయనను అరవైనాలుగు కళాస్వరూపాలతో వర్ణించి తనివి పొందింది. ఇవన్నీ అష్టమి నుంచి పాడ్యమిలోపు కృష్ణపక్షంలో జరిగిన సంగతులు’’ అన్నాడు శంకరుడు. ‘‘జగత్ వ్యాపారం కొనసాగడానికి జగజ్జనని తరువాతి దశలో ఏం చేసింది?’’ ఉభయభారతి కీలకమైన తదుపరి ప్రశ్న వేసింది. ‘‘కామ, అగ్ని, నాదాలనే మూడు క్రియలను చేపట్టింది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా... అని కదూ గౌడపాదులు సూత్రీకరించారు?!’’ అని ఉభయ భారతి ముక్తాయింపుకు ఆదితాళమేసింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
భక్తిరేవ గరీయసీ
‘‘శంకరాచార్యా! నేను మీ ఉపనిషత్ మతాన్ని సమ్మతించను. వేదం అపౌరుషేయం. కానీ ఉపనిషత్తులు వేర్వేరు ఋషుల చర్చలు మాత్రమే. వేదమంత్రాలకు ఉన్న శక్తి ఉపనిషత్ వాక్యాలకు ఉందంటే ఒప్పుకోను’’ ఈ మాటతో శంకర మండనమిశ్ర సంవాదం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ‘‘ఎందుకు? వేదమంత్రంతో మీరు ఒక దైవాన్ని ఆహ్వానించవచ్చు. అర్చించవచ్చు. కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. కానీ ఉపనిషత్ వాక్యాల వల్ల దైవికమైన చైతన్యాన్ని దర్శించవచ్చు. సర్వాత్మ భావన పెంపొందించుకో వచ్చు’’ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘సర్వాత్మ భావన మానసికమే కానీ, క్రియారూపం కాదు కదా! శక్తి ఎప్పుడూ మంత్రంతోనే పుడుతుంది. ఉపనిషత్ వాక్యానికి ఆ విధమైన శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు’’ ఘంటాపథంగా చెప్పాడు మండనుడు. ‘‘ఎందుకు లేదు? పరమేష్ఠి సల్పిన క్రియారూప తపస్సే సృష్టి. ఆయన నుంచి వెలువడిన తొలిశబ్దమే అహం బ్రహ్మాస్మి అన్నది. పరబ్రహ్మ తనను తాను ‘నేను’ అని గుర్తించడమే అతడి సృష్టిరచనకు కారణమైంది’’ చెప్పాడు శంకరుడు. చిగురాకుల రెపరెపలతో గాలి మంద్రంగా వీస్తోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ‘‘పరబ్రహ్మ గాఢనిద్రలో ఉన్నాడు. అప్పుడు సృష్టి ఆత్మగా ఉంది. పరబ్రహ్మ కన్నులు విప్పి చూసి, తనను తానే చూసుకుని కలవరపడ్డాడు. అంతలోనే అతడికి తనకంటే భిన్నంగా ఇక్కడేమీ లేదని అర్థమైంది. ‘అహం బ్రహ్మాస్మి’... నేనే బ్రహ్మమును అవుతున్నాను అన్నాడు. అదే అతడి నోటివెంట వెలువడిన తొలివాక్యం. దానితో అతడికి సర్వాత్మ భావన ఏర్పడింది. ఈకాలంలో కూడా ఎవరైనా ఆ ఉపనిషత్ వాక్యాన్ని అనుసంధానం చేయడం ద్వారా సర్వాత్మ భావనను పెంచుకోవాలని ప్రయత్నిస్తే అతడిని దేవతలు సైతం అడ్డుకోరని బృహదారణ్యకం స్పష్టం చేస్తోంది. ఇది తెలిసినా తెలియకపోయినా మానవులు ఏ మాట చెప్పడానికైనా ముందుగా నేను అని మొదలుపెడుతూ ఉంటారు. అది బ్రహ్మ నుంచి వచ్చిన ఆ అలవాటు. దానికంటే శక్తివంతమైనది ఏముంది?’’ ప్రశ్నించాడు శంకరుడు. ‘‘నేను అన్న తరువాత వెంటనే ఒకడు బ్రహ్మమును అనకుండా వెంకన్నను, సుబ్బన్నను అంటే... అప్పుడు శక్తిహీనమైన వాక్యమే అవుతుందా?’’ మెలికపెట్టాడు మండనుడు. ‘‘కాదు. అక్కడ అహం బ్రహ్మాస్మి అని ప్రకటన చేస్తున్నది బ్రహ్మమే అవుతోంది కానీ, ఇతడు కాదని తెలుసుకోవాలి. సాధకుడు బ్రహ్మమే నేనుగా అయింది అనే భావనతో తన సాధన ప్రారంభిస్తాడు. ఇక్కడ పొరబాటు, ఏమరుపాటు ఉండకూడదు. ‘అహం బ్రహ్మాస్మి’ వంటి ఉపనిషత్ వాక్యాలు స్వస్వరూపాను సంధానానికి ఉపయోగపడాలి. నిత్యానిత్య వస్తువివేకంతో, నిదిధ్యాసతో పరబ్రహ్మతో అపరోక్షానుభూతిని సొంతం చేసుకోవాలి. అంతేకానీ జీవుడైన తననే తత్ అని పిలిచే పరబ్రహ్మగా ధ్యానించే స్వాత్మతత్త్వంలో పడకూడదు. జీవుడే దేవుడు ఎన్నటికీ కాదు. కానీ ఆ రెంటికీ భేదం లేదు. ఆ రెండూ ఎన్నటికీ విడివిడిగా ఉన్నదీ లేదు’’ చెప్పాడు శంకరుడు. ‘‘అంటే జీవేశ్వరులు ఎప్పుడూ కలిసే ఉన్నారంటారు. అంతేనా...’’ అన్నాడు విషయాన్ని తేల్చేస్తూ మండనుడు. ‘‘యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలో ఆధ్వర్యం వహించే ఋత్విక్కులను మేము దేవతా స్వరూపులుగా అర్చిస్తాం. అంతమాత్రం చేత వారే ఆ దేవతలు అయిపోలేరు కదా! తానూ దైవమూ ఒక్కటి కాదన్న స్పృహ మానవుడికి ఎప్పుడూ ఉండనే ఉంది కదా! అందుకే పూజలు, మంత్రాలు, హోమాలు ఈ కర్మకాండ అంతా వేదమార్గంలో ప్రవేశించాయి. జ్ఞానమే గొప్పది... కర్మకాండ వృథా ప్రయాస అని చెబితే వాటిని వేదం ఎందుకు చెప్పినట్లు?’’ ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు శంకరుడు ఉద్యుక్తుడవుతున్నాడు. ఇంతలో సభాస్తంభాలపై నిలిచి వింటున్న చిలుకలు రెండు ఒకేసారి ఇలా ఆలపించాయి.... పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం మంత్రం మంత్రకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయః శంకరుడు ఆ శ్లోకార్థాన్నే వివరించడం ప్రారంభించాడు. ‘‘షోడశోపచారాలతో, వివిధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ దైవాన్ని అర్చించడం పూజ అవుతుంది. అటువంటి కోటి పూజలతో సమానమైనది స్తోత్రం. వేదసూక్తాలు, ఋషులిచ్చిన స్తోత్రాలు భగవత్ తత్త్వసారాన్ని ఒంటపట్టిస్తాయి. అతివిస్తారమైన ఆ తత్త్వాన్ని అనేక కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి మానవుడు చాలానే శ్రమపడాల్సి వస్తుంది. తెలియని వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఆ మాటల లోకాన్ని కల్పించడం జరిగింది. ఆ లోకంలో ప్రవేశించినవాడు పరమార్థాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు. అటువంటి వారికే శబ్దబ్రహ్మను బీజాక్షారాలలో నిక్షిప్తం చేస్తూ కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆ మంత్రాన్ని మననం చేస్తున్న కొద్దీ పుడుతున్న శక్తి సాధకునికి కాంతిరూపంలో సాక్షాత్కరిస్తుంది. క్రమంగా పెదవులు మంత్రాన్ని జపించడం మానివేస్తాయి. సాధకుని మనస్సు మంత్రాధిదేవతను తన ముందు ఉంచుకుని నడవడం మొదలుపెడుతుంది. అలా దేవతా చైతన్యంతో నిండిన మనస్సు నీరవ నిశ్శబ్దస్థితిలో చేసేదే ధ్యానం. అది తదేకలగ్నం అయ్యే కొద్దీ మనోభూమిక సైతం రద్దయిపోతుంది. అమనస్కయోగి సాధన లయయోగంలో ప్రవేశించడంతో బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి తగిన అర్హతను సాధిస్తుంది.’’ అన్నాడు. ‘‘జ్ఞానమేం చేస్తుంది స్వామీ! ప్రారబ్ధ కర్మను తప్పించగలదా? మానవుడు తాను అప్పటివరకూ పడుతున్న కష్టాలను తొలగించగలదా? అలా జరగనప్పుడు బతుకు దుర్భరమైపోదా? సామాన్యుడికి ఈ జ్ఞానంతో పనేమిటి?’’ మండనుడి వాదన అడ్డగోలుగా తిరిగింది. ‘‘ఇది బ్రహ్మజ్ఞానంలోని వైవిధ్యాన్ని తెలుసుకోనందువల్ల వచ్చిన అపవాదు. బ్రహ్మజ్ఞానం ఏకైక స్వరూపమే. కానీ బ్రహ్మసాక్షాత్కారం కలిగిన జ్ఞానులు పొందే సమాధినిష్ఠలో తారతమ్యాలున్నాయి. జ్ఞానాన్ని పొందగోరి సత్త్వాపత్తి అనే సమాధి నిష్ఠలో ఉన్నవారిని బ్రహ్మవేత్తలంటారు. వారికి జ్ఞాన ప్రారబ్ధాలలో వర్తమానంలో ఆచరిస్తున్న ప్రారబ్ధమే బలవత్తరంగా ఉంటుంది. ఆ ప్రారబ్ధకర్మను అనుభవం చేత క్షీణింప చేసుకుంటారు. ఆత్మను బ్రహ్మయందు లీనం చేసి, గతజన్మలలోనూ ఈ జన్మలోనూ మూటగట్టుకున్న సంచిత కర్మలను నశింప చేసుకుంటారు. తాము నిష్క్రియాత్మ స్వరూపులమనే దృఢనిశ్చయం తెచ్చుకున్న వారు కనుక వారిని ఆగామి కర్మలు అంటుకోవు’’ నిలకడగా చెప్పాడు శంకరుడు. ‘‘ఇప్పుడు అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మలు కొద్దిపాటివి మాత్రమే. కానీ మనకు తెలియకుండానే మూటగట్టుకున్న సంచిత కర్మలు అనంతాలు కదా! వాటినేం చేస్తారు?’’ విసుగు ప్రదర్శించాడు మండనుడు. ‘‘దానిని దహించివేసే అగ్ని సమ్యక్ జ్ఞానమే. ఆత్మను ఆ అగ్నిలో ప్రకాశింప చేసుకోవడమే సన్యాసం. అక్కడ అప్పటికప్పుడు అనుభవిస్తూ నశింపచేసుకుంటున్న ప్రారబ్ధ కర్మలే కానీ, వెనుక నుంచి తెచ్చుకున్నవి, ముందు అనుభవించాల్సినవి ఏమీ ఉండవు. ఆ కర్మలను సన్యాసి స్థితప్రజ్ఞతో నిర్వహిస్తున్నప్పుడు బ్రహ్మవిద్వరుడు అవుతాడు. ఇతడి సమాధి నిష్ఠను అసంసక్తి అని పిలుస్తారు’’ శంకరుడింకా పూర్తి చేయలేదు. ‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అంటూ రామచిలుకలు భజగోవిందాన్ని పాడాయి. ‘‘అందుకే ఏ సంగత్వమూ లేకుండా పోవడానికే సన్యాసులు ఇల్లు, పెళ్లి, పిల్లలనే బంధాలను విడిచిపెట్టేస్తారు. కొందరు అడవులు పట్టిపోతారు. మరికొందరు ఇదిగో ఇలా దేశంమీద పడి గృహస్థుల లౌకిక వ్యవహారాలను చెడగొడుతూ ఉంటారు’’ మండనుడి ముఖంలో వైషమ్యభావం సెగలు కక్కుతోంది. ‘‘బ్రహ్మజ్ఞానం తాలూకు సమాధినిష్ఠలో మూడోదశ ఉంది. అదే పదార్థాభావన అని పిలిచే బ్రహ్మవిద్వరీయసుని స్థితి. ఆ స్థితిని చేరుకోవడానికి ఎవరైనా సన్యాసాశ్రమంలోనే చేరనక్కరలేదు. మీ కర్మమార్గం తెచ్చిపెట్టే ఆరాటాన్ని జయిస్తే గృహస్థుగానూ పొందవచ్చు. బ్రహ్మవిద్వరీయసునికి చేసినది, చేస్తున్నది, చేయాల్సింది అంటూ కర్మలేమీ ఉండవు. బ్రహ్మచైతన్యం పురిగొల్పినప్పుడు దానికో పనిముట్టుగా చేయాల్సిందేదో చేస్తుంటాడు. లేనప్పుడు ఏమీ చేయకుండానే ఊరుకుంటాడు. తనంత తానుగా నిష్ఠ నుంచి వెలికిరాడు’’ మూసివుంచిన కన్నులముందు శంకరునికి భక్త ప్రహ్లాదుడు దర్శనమిచ్చాడు. ‘‘నీ తిండి నువ్వు సంపాదించుకోవు. నీ శరీరాన్ని పోషించే బాధ్యతకూడా పక్కవాడిమీదే పెట్టినప్పుడు నిశ్చింత కాక మరేమిటి వస్తుంది? ఎవరోవచ్చి అయ్యోపాపమని తినబెడితే తింటావు. లేనప్పుడు ఊరుకుంటావు. నీ సొమ్మేం పోయింది’’ మండనుడి విమర్శ అధమస్థాయికి జారుతోంది. సభాసదులలో ముఖ్యపీఠాన్ని అధిరోహించిన కాళిదాసు అతడిని వారించాడు. ‘‘ఆర్య మండనమిశ్రా! తమరు వ్యక్తిగత విమర్శలకు దిగవద్దు. శాస్త్రచర్చను నీరుకార్చ వద్దు. మీస్థాయికి తగిన రీతిలో ప్రవర్తించండి’’ అన్నాడు. మండనుడు సర్దుకుని కూర్చుని, మౌనం వహించాడు. శంకరుడు కొనసాగించాడు. ‘‘కట్టకడపటిదైన తుర్యగ్ స్థితి ఉన్నది. అది బ్రహ్మవిద్వరిష్ఠుని స్థితి. ఆ స్థితిలోనే జీవుడు బ్రహ్మమయుడు అవుతాడు. అది నిర్గుణ పరబ్రహ్మ స్థానము. దానికంటే పైకి వెళ్లాల్సిన అవసరం కానీ, క్రిందికి దిగి జన్మకు రావాల్సిన అవసరం కానీ ఉండదు. ఆ సిద్ధుడు అనుకుంటే రావడం, పోవడమే. జన్మరాహిత్యమంటే అదే’’ అన్నాడు. ‘‘మరి ఈ సిద్ధులన్నీ సాధించలేని మామూలు మానవుడి గతి ఏమిటి? వాడికి ముక్తి లభించే మార్గమే లేదా? ఎప్పటికీ అధోగతి తప్పదా?’’ మండన మిశ్రుడు తదుపరి ప్రశ్న వేశాడు. ‘‘దానినే మాయ అంటున్నాం. ఆ మాయను తరించడానికి కర్మమార్గమూ, జ్ఞానమార్గమూ అంగీకరించే ఒకే ఒక శక్తికి పేరు భక్తి. భావన బలంగా ఉండాలే కానీ, భక్తి సాధించలేనిది ఏమీ లేదు’’ అన్నాడు శంకరుడు. భక్తిప్రాధాన్యాన్ని ఇలా విస్తరించాడు. మోక్షకారణసామగ్య్రాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసన్ధానం భక్తిరిత్యభిధీయతే అపరోక్షానుభూతిని అందించేది భక్తి. ద్వైదీభావాన్ని నశింపచేసి ఆత్మను అద్వితీయ పరబ్రహ్మ సాక్షాత్కారానికి ఆయత్తం చేస్తుంది. బ్రహ్మాత్మల ఏకత్వ స్థితి ఎల్లవేళలా ఉంటుంది. ఇది దర్శించి తెలుసుకోవలసిందే. దీనికి అందరూ అర్హులే. అసమానమైన భక్తిని హృదయం నిండా నింపుకున్నవాడికి ఆరువిధాలుగా ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాయుజ్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్లడం. సాలోక్యము అంటే భగవత్ లోకానికి చేరుకోవడం. సామీప్యము అంటే భగవంతుని చేరువలో నిలిచే అర్హత సాధించుకోవడం. సారూప్యము అంటే భగవత్ రూపాన్ని తాను పొందడం. సామ్యము అంటే భగవంతునితో సమానుడు కావడం. బ్రహ్మలీనుడు ఆయనలోనే లీనమైపోవడం. ఈ చిట్టచివరి స్థితిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ భావనాబలాన్ని సాధించడంలోనే వెనుకంజ వేస్తుంటారు. ఎడతెగని కర్మలను నిర్వహిస్తూ ఆరాటం పెంచుకుంటారు. ముక్తి కోరుకుంటే వెంటనే లభించి తీరుతుంది. అంతటి విశ్వాసం ఉండాలి ముందుగా. దానికి భక్తి మాత్రమే చక్కని మార్గం వేయగలుగుతుంది. కామోత్కంఠత వల్ల గోపికలు, భయంతో కంసుడు, వైరం పూనిన శిశుపాలాదులు, శ్రీకృష్ణదేవుడు జన్మించినందువల్ల వృష్ణి వంశం, ప్రేమతో పాండవులు, భక్తితో నారదాదులు విష్ణు సాయుజ్యాన్ని పొందారు. అటువంటి ఏదో ఒక మార్గాన్ని సాధకుడు ఎంచుకోవాలి. ’’ ‘‘సరేలెండి స్వామీ! మీ వరస చూస్తుంటే పరలోకం ఒకటుందని కూడా ఒప్పుకునేట్లు లేరు. ముక్తిని కూడా నేలమీదకు లాక్కొచ్చి నిలబెట్టేలా ఉన్నారు. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు బోధించే జ్ఞానమార్గంలో కూడా దుష్టజ్ఞానం, అజ్ఞానం, సంశయం అనే మూడు దశలుంటాయి. ఆ మూడింటినీ దాటిన తరువాత కదా మానవుడు భక్తి పరుడు కావడం. నేటి మానవుడికి భక్తితోనూ, చివరకు భగవంతునితోనూ కూడా పనిలేదు. కావలసిందల్లా కోరిక నెరవేరడం. నిన్నమొన్నటి ద్రుపదరాజు హోమగుండం నుంచి నేరుగా సంతానాన్ని పొందాడు. సకల వస్తు సంపదలను, సంతానాన్ని, సమస్త వాంఛితార్థాలను హోమగుండమే అందిస్తుంది. భక్తిలోపం కలిగినా పరవాలేదు కానీ, కర్మలోపం చేయకుండా ఉంటే ఫలితం దానంతట అదే పుడుతుంది. ఇదే అచ్చంగా అందరికీ కావలసింది. కోరిన కోరిక నెరవేరాలి’’ పూర్వమీమాంసా దర్శనాన్ని కాచివడబోశాడు మండనుడు. ‘‘భక్తుని కోరిక నెరవేర్చడమే భగవంతునికి అభీష్టం. అందులో సందేహమేమీ లేదు. కానీ కోరుకోవడమే భక్తునికి తెలియదు. రెండింతలు మూడింతలుగా దొరికే అనుగ్రహాన్ని భక్తుడు అల్పమైన కోరికతో సరిపెట్టేసుకుంటాడు కర్మనిష్ఠుడు’’ అని సెలవిచ్చాడు శంకరుడు. ‘‘కావచ్చు. కానీ మాకు మా లౌకిక వ్యవహారాలు సజావుగా నడవడమే కావలసింది. మా పాతకాన్ని జపం పోగొడుతుంది. వాంఛితాన్ని అగ్నిహోత్రం ఇస్తుంది. లయసమాధులను సాధించే మీరంతా నివృత్తి మార్గం పట్టి సన్యాసులై పోతుంటే లోకవృత్తం అస్తవ్యస్తమవుతుంది. ఇందుకు మేం అంగీకరించం’’ అన్నాడు మండన మిశ్రుడు. ‘‘అగ్నిముఖంగా వెలువడుతున్న చైతన్యమంతా భగవద్దత్తమే. అగ్ని ఆరాధన అప్రయోజనమని మేమూ చెప్పడం లేదు. కానీ మీ గృహస్థుల తరహాలో కామ్యకర్మలను చేయకుండా విడిచిపెట్టేశాం అంతే...’’ చెప్పాడు శంకరుడు. ‘‘అయితే కర్మకాండ అవశ్యం అనుసరణీయమేనని అంగీకరించనట్లేనా?’’ అడిగాడు మండనుడు. ‘‘వ్యక్తి సంక్షేమం కోసం, సమాజక్షేమం కోసం నిత్యకర్మలను ప్రతి ఒక్కరూ చేయవలసిందే. ఇక సందర్భానుసారంగా చేయవలసినవి నైమిత్తిక కర్మలు. జన్మకు వచ్చినందుకు వాటిని అనుసరించడం మన బాధ్యత. కానీ కర్తృత్వాన్ని మనపై పెట్టుకోకూడదు. అంటే నేను చేస్తున్నది భగవంతుని పని అనే భావనతో నిమిత్తమాత్రంగా ఉండి కర్మ నిర్వహణ చేయాలి. చివరిగా కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టాలి. కోరికలతో సత్కర్మలను ఆచరించ కూడదు. జనన మరణ చక్ర పరిభ్రమణం నుంచి విడుదలయ్యేలా ప్రారబ్ధ, సంచిత, ఆగామి, కర్మలు నిశ్శేషమయ్యేలా నిష్కామ కర్మలను మాత్రమే తప్పక ఆచరించాలి’’ విశదీకరించాడు శంకరుడు. ‘‘కోరికలే లేకపోతే తమరు ముక్కుమూసుకుని తపస్సు చేసుకోండి. ప్రజల మధ్యకు రావడం ఎందుకు? ఆకలి దప్పికల వేళ, ఆలిని కూడే వేళ, పుత్రాదులను పొందేవేళ కామపురుషార్థాన్ని ధర్మయుతంగా సాధించే గృహస్థుకంటే మోక్షానికి అర్హుడెవ్వడు?’’ మండనమిశ్రుని గుండెల్లోని ఆరాటం అతడి మెడలో వేలాడుతున్న పూలమాలకు అర్థమవుతోంది. – సశేషం -
శివోహం..శివోహం
వైశాఖ శుద్ధ షష్ఠి ఘడియలు ప్రవేశించాయి. పదహారేళ్లు నిండి శంకరుడు పదిహేడులో అడుగు పెట్టాడు. అది కలియుగాది 2609కి (క్రీ.పూ. 492) సరియైన శ్రీకీలక నామ సంవత్సరం. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. శంకరుడు గంగాస్నానంలో ఉన్నాడు. తల్లి మనసులా సరళంగా సాగిపోతున్న గంగలో మునకలేస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలేవో చుట్టుముడుతున్నాయి. ‘నీ కొడుకు ఆయుష్షు నిజానికి పదహారేళ్లే. కానీ...’ అన్న మాట దగ్గర ఆనాడు అగస్త్య మహర్షి భవిష్యవాణి ఆగిపోయింది. అదివిన్న పిచ్చితల్లి ఎంతగా తల్లడిల్లిపోయిందో కదా. గర్భశోకాన్ని అనుభవించలేకనే కాబోలు... తన ఆయుష్షు కూడా బిడ్డకు పోసి ముందుగా వెళ్లిపోయింది. వ్యాస భగవానుడు స్వయాన వచ్చి వరమిచ్చి దీవించాడు. మహాభారతంలోని సనత్సు జాతీయానికి కూడా భాష్యం రచించమని చెప్పి అంతర్థానమయ్యాడు. అజాగ్రత్తయే మృత్యువు. నిజానికి మృత్యువు అనేది లేనే లేదు.. అని బ్రహ్మమానస పుత్రుడైన సనత్సుజాతుడు ఇచ్చిన మహత్తర సందేశమది. దాన్ని అద్వైతానికి అన్వయించాడు శంకరుడు. నేటితో రచన పూర్తయింది. శంకరుడింకా గంగ నుంచి లేచి బయటకు రాకముందే అతడికో లేఖ వచ్చింది. ప్రతిష్ఠాన పురం నుంచి ప్రభాకరుడు పంపించాడు... ‘మా గురువుగారైన భట్టపాదులు త్వరలో ప్రయాగ సమీపంలోని రుద్రపురానికి విజయం చేయబోతున్నారు. తమరు వారిని కలుసుకోవాలనుకుంటే వెనువెంటనే బయలుదేరగలరు’ అన్నది సందేశ సారాంశం. హుటాహుటిన బయలుదేరాడు శంకరుడు. వారణాసి నుంచి పాతిక యోజనాల దూరంలో ఉన్న రుద్రపురానికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నాడు. రుద్రపురంలో ఆనాడు... కుమారిల భట్టు తన ప్రాయోపవేశానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఒక హోమగుండాన్ని తవ్వించుకున్నాడు. శ్రోత్రియులందరూ హోమంలోని అగ్ని చల్లారకుండా ఉండేందుకు ఉపయోగించే ధాన్యపు పొట్టును పెద్దమొత్తంలో సేకరించాడు. అగ్నిహోత్రంతో సహా హోమగుండంలోకి వెళ్లి కూర్చున్నాడు. విరజాహోమ మంత్రాలు పఠిస్తున్నాడు. శిష్యులు ఊక నింపుతున్నారు. భట్టపాదుడు గొంతు వరకూ కప్పబడ్డాడు. కొద్దిసేపటిలోనే పొగ చెలరేగింది. అగ్నిహోత్రం తన సహజ ప్రభావాన్ని చూపుతోంది. ఊక మధ్యలో ఆ మహానుభావుని చర్మం కనలిపోతోంది. వేడిమి క్షణక్షణానికి తీవ్రమవుతోంది. ఇంతలో శంకరుడు పొలిమేరలో అడుగుపెట్టాడు. అప్పటిదాకా విజృంభించిన నిప్పు కాస్తా చల్లగా చందనసేవలా మారిపోయింది. శంకరుని రాకను భట్టపాదుడు గుర్తించాడు. మహాపండితుడైనా వేద ప్రామాణ్యాన్ని నిరూపించడానికి సరైన శాసనం చేయని కారణంగా కుడికన్ను పోగొట్టుకున్న వాడాయన. మిగిలినవున్న ఎడమ కన్నెత్తి శంకరుణ్ణి తేరిపార చూడడానికి పాపం సంకోచించాడు. ‘‘భట్టపాదా!’’ ఆదుర్దాగా పిలిచాడు శంకరుడు. ఆ పిలుపుతో భట్టపాదుడు కన్ను తెరిచాడు. ‘‘తండ్రీ! మీకు చేయెత్తి నమస్కరించలేని అసహాయ స్థితిలో ఉన్నాను. మన్నించండి’’ అన్నాడు. ‘‘ఏమిటీ పని? ఎందుకు చేస్తున్నట్లు?! మీ వంటివారిలా ప్రాయోపవేశంతో బలవన్మరణానికి పూనుకోవడం సమంజసమేనా? దయచేసి బయటకు రండి’’ అన్నాడు శంకరుడు. ‘‘తండ్రీ! మీ దయవల్ల నాకు హిమగిరి శిఖరంపై ఉన్న అనుభూతి కలుగుతోంది. బయటికి వస్తే అగ్నితప్తమైన నా దేహాన్ని చిటికెలో బాగు చేయగలరని తెలుసు. కానీ నేనందుకు ఒప్పుకోలేను. ఈ జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. ఇది నాకుగా నేను విధించుకున్న ప్రాయశ్చిత్తం’’ అని సమాధానమిచ్చాడు భట్టపాదుడు. ‘‘ప్రాయశ్చిత్తమా ఎందుకు?’’ ‘‘గురుద్రోహం చేసిన నేరానికి. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి నాస్తిక గురువుల వద్ద శిష్యరికం చేశాను. ఆ నిషిద్ధ గురువులను ఆశ్రయించకూడదని తెలిసినా ఆశ్రయించాను. వారి సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని వారిపైనే తిరుగుబాటు చేశాను. బోధించిన అంశమేదైనా వారు గురువులు. వారిపట్ల కృతఘ్నత చూపడం నేను చేసిన ఘాతుకం. అందుకు ఇదే సరైన శిక్ష.’’ ‘‘అలా అనవద్దు. ధర్మరక్షణ కోసం నడుం కట్టి, మీరు చూపిన సాహస పరాక్రమాలు అనుపమానం. మిమ్మల్ని ఏ పాపమూ అంటదు. కర్మబలం చేత మీరు ఎప్పటికైనా ఉన్నతినే సాధిస్తారు కానీ, ఎన్నటికీ పతనం చెందరు. ఈ ప్రయత్నం విరమించండి.’’ ‘‘అంటే యజ్ఞయాగాలు స్వతంత్రంగా కర్మఫలాన్ని అనుగ్రహిస్తాయని మీరు ఒప్పుకోబోతున్నారా? వద్దు స్వామీ! కర్మభ్రష్టులై, ధర్మదూరులై చరించే మానవులకు... యజ్ఞప్రభావం అప్రమేయమని చెప్పడానికే జైమిని మహర్షి పూర్వమీమాంసను రచించారు. కామ్యకర్మలతో అయినా సరే పరమాత్మతో ప్రమేయం కలిగించుకుని నిర్గుణోపాసన వైపుకు మళ్లాలన్నదే మా ఆశయం. చిట్టచివరి మెట్టుమీద మీరు ఉన్నారు. మొదటి మెట్టు నుంచి జీవుణ్ణి పైకి చేర్చే ఉపాయం మేము బోధిస్తున్నాం. సర్వత్ర మీ స్థానమే ఉన్నతం. నిజం చెప్పాలంటే మీ భాష్యాలను చూసింది మొదలు వాటికి వార్తికాలు రచించాలని ఎంతగానో తపన పడ్డాను. కానీ విధి నన్ను మరోవైపుకు నడిపిస్తోంది’’ ఆవేదనగా చెప్పాడు భట్టపాదుడు. శంకరునితో పాటు అక్కడున్న వారందరి కన్నులూ చెమర్చాయి. ‘‘కనీసం నా భాష్యాలకు వివరణాత్మకమైన వార్తికాలు రచించేందుకైనా ఈ ప్రాయోపవేశాన్ని విరమించండి’’ అడిగాడు చివరిగా శంకరుడు. భట్టపాదుడు సుతరామూ అంగీకరించలేదు. ‘‘తండ్రీ! ఈ మందభాగ్యుణ్ణి మన్నించండి. కానీ ఈ అవకాశం నా శిష్యునికి ఇప్పించండి. పూర్వమీమాంసలో నా తరువాత అంతటివాడతను. సృష్టికర్త బ్రహ్మ ఏరికోరి అతని అవతారంలో దిగివచ్చాడని అనిపిస్తుంది. అతడి భార్య సాక్షాత్తూ శారదాంబయే కనుక అది నిజమే అని దృఢపరుచుకున్నాం కూడా. అతడు మీ భాష్యాలకు వార్తికాలు రచిస్తాడు. కానీ, పూర్వమీమాంసలో అతడు గట్టి నమ్మకం ఉన్నవాడు. ఒకపట్టాన మీ జ్ఞానమార్గాన్ని అంగీకరించడు. మీరు చాలానే శ్రమపడవలసి రావచ్చు. అయినా మంచిదే... అటువంటివారు ఇప్పటి మానవులలో దొరకడం దుర్లభం అని మాత్రం చెప్పగలను. దయచేసి మీరు మాహిష్మతీ నగరానికి వెళ్లండి. మండన మిశ్రుణ్ణి కలుసుకోండి’’ అని సలహా ఇచ్చాడు భట్టపాదుడు. శంకరుడు సాలోచనగా తల పంకించాడు. సరేనని చెప్పడానికి సంకోచిస్తున్నాడు. మౌనాన్ని ఆశ్రయించాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ‘‘తండ్రీ! నాకు అనుమతినివ్వండి. మీ కరుణను దయచేసి ఉపసంహరించండి. ఈ అగ్నిహోత్రాన్ని తన పని తాను చేసుకోనివ్వండి. నాకు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించండి. ఈ అంతిమ ఘడియల్లో మీ ఉపదేశంతో నాకు సద్గతిని ప్రసాదించండి’’ అని వేడుకున్నాడు భట్టపాదుడు. శంకరుడు అతడి కోరిక మన్నించాడు. నిర్వాణషట్కాన్ని ప్రారంభించాడు. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వా్వ్యప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః చిదానందరూపః శివోహం శివోహం – సత్యదర్శనంతో ద్వైధీభావాన్ని విడిచిపెట్టాను. కనుక నాలో వికల్పాలన్నీ మాయమయ్యాయి. నేను అనగా ఆత్మను... సర్వవ్యాపిని కనుక నాకో ఆకారమంటూ లేదు. సమస్తాన్నీ సమదృష్టితో చూసే నన్ను కట్టి ఉంచేది ఏదీ లేదు. ఏ బంధాలకూ లొంగను కనుక నాకు బంధమోక్షాలు లేవు. జ్ఞానమనే ఆనందమే రూపమైన శుభంకరుణ్ణి... శివుడినే నేను – అని మొదటిశ్లోకం చెప్పాడు. భట్టపాదుడు కన్ను మూసుకున్నాడు. అగ్నిహోత్రుడు తన పని ప్రారంభించాడు. రెండోశ్లోకం ఇలా వచ్చింది.... నాకు మృత్యువు లేదు. మరణం నన్ను నశింప చేస్తుందనే భయమూ లేదు. జాతిభేదాలు లేని సార్వజనీనుణ్ణి నేను. ఈ జన్మకు రాకముందు నుంచి ఉన్నాను, ఇకముందు కూడా ఉంటాను. కనుక నన్ను పుట్టిస్తున్నది ఎవరో కాదు, నేనే. నాకు బోధించే గురువులు, అనుసరించే శిష్యులు, అంటిపెట్టుకుని బంధుమిత్రులంటూ ఏ బాదరబందీ లేదు. నేను జ్ఞానమే రూపమైన వాడిని. శివుణ్ణి.... భట్టపాదుని ఇహలోక బంధాలు సడలిపోతున్నాయి. నిర్వాణషట్కం ఆత్మావిష్కారం చేస్తూ ముందుకు సాగింది. పుణ్యపాపాల హెచ్చుతగ్గులతో నాకు ప్రమేయం లేదు. వాటివల్ల కలిగే సద్గతులు, పతనావస్థలు నాకు పట్టవు. సుఖదుఃఖాలకు అతీతంగా సంచరించే నన్ను అనిత్య వస్తువులు ఎల్లకాలమూ సుఖపెట్టనూ లేవు, దుఃఖాన్ని కలిగించనూ లేవు. నేనెవరో తెలిపే సిసలైన మంత్రం కనిపించదు. ఏ తీర్థంలో వెతికినా దొరకదు. వేదాలు, యజ్ఞాలు నా స్వరూపాన్ని వివిధ రీతుల్లో వివరించి చెబుతాయి. కానీ నన్ను తెలుసుకోవాలంటే ఎవరికి వారే ఉద్యమించాలి. ఎందుకంటే నేను కర్మఫలాన్ని కాను. కర్మరూపాన్ని కాను. కర్మ చేస్తున్న వాణ్ణి కాను. నేను జ్ఞానానంద శివుణ్ణి.... భట్టపాదునిలో కలిగిన సంచలనం కైలాసాచలం వరకూ పరివ్యాప్తమయింది. తదుపరి శ్లోకాన్ని శంకరుని కంఠం ఇలా వెలువరించింది... ఒకరిపై ద్వేషం లేదు. వేరొకరిపై అనురాగమూ లేదు. అనిత్య వస్తువులు నాకే చెందాలనే లోభమూ, వాటిని విడిచిపెట్టి ఉండలేని మోహమూ లేవు. నేను అందరికంటే గొప్పవాడిననే మదమూ, ఇతరులతో మాత్సర్యమూ లేవు. దేహాన్ని ధరించి దేహినయ్యాను కనుకనే కానీ, నాకు పురుషార్థాల సాధన కోసం పాటుపడే పని లేదు. దేహంలో ఉన్నంతవరకూ ఈ ఉపాధిని నిలబెట్టుకోవడమే ధర్మం. దీనిని అనుసరించి వచ్చే కర్మలను పాటించడమే అర్థం. ఇది చిట్టచివరి దాకా కొనసాగించడమే నాకు కామం. అయినా దేహంతో నాకెలాంటి సంబంధమూ లేదు కనుక, దీనినుంచి మోక్షం నేను కోరుకోను.....మహావిహంగం ఒకటి తన విస్తారమైన రెక్కలను అత్యంతమూ వేగంగా కదుపుతూ భూమిపైకి దూసుకువస్తున్నట్లుంది. కుమారిలభట్టు నిలబడివున్న తుషాగ్ని నుంచి నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయి. శిష్యులు మరింత ఊకను దానిపై పోశారు. భట్టపాదుడు పూర్తిగా కప్పబడి పోయాడు. శంకరుడు కొనసాగించాడు. ‘నేను ప్రాణాన్ని కాదు. త్రేనుపు, రెప్పపాటు, తుమ్ము, హృదయస్పందన, ఆవులింతలనే ప్రాణ సంకేతాలేవీ నేను కాదు. సూక్ష్మగతిలో సంచరించే ప్రాణవాయువు, అధోముఖంగా పయనించే అపానం, ఉష్ణోగ్రతలను సరిచేసే సమానం, గుటక వేయనిచ్చే ఉదానం, అంతటా నిండివుండే వ్యానవాయువులనే పంచప్రాణాలు నన్ను నియంత్రించలేవు. సప్తధాతువుల్లో ఏ ఒక్కటీ నన్ను పోషించడం లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలలో సంచారం చేస్తున్నది కర్మానుభవం పొందుతున్న దేహియే కానీ నేను కాదు. వాక్కు, కాళ్లు, చేతులు, పాయువు, ఉపస్థలనే ఇంద్రియాలు నిర్వహించే కర్మలతో నాకు ప్రమేయం లేదు’ అన్నాడు. ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం సంకల్ప వికల్పాలకు కారణమయ్యే మనస్సు నా చలనాన్ని అరికట్టలేదు. జ్ఞాపకాల ప్రోగు అయిన బుద్ధి నన్ను గుర్తించలేదు. కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకునే అహం స్ఫురణకు నిజానికి నేనెవరో స్ఫురించదు. కంటితో చూసిన ప్రతిదాన్ని దృశ్యబద్ధం చేసి మనస్సుకు చేరవేసే చిత్తం నా రూపాన్ని ముమ్మాటికీ చిత్రించలేదు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే ఈ నాలుగు అడ్డుగోడలను దాటుకుని నన్ను వినాలంటే చెవులు, వర్ణించాలంటే నాలుక, పసిగట్టడానికి ముక్కు, చూడటానికి కన్నులూ చాలవు. నేను ఆకాశంలో ఉండను. వట్టి మట్టిని కాను. హోమాగ్నియందు జనించేది నేను కాదు. ఉందని తెలుసు కానీ ఎక్కడుందో, ఎలాగుందో తెలుపడానికి వీలులేని వాయువులాంటి వాణ్ణి కాను. నేను జ్ఞానరూపాన్ని ధరించిన శివుణ్ణి... అని ముగించాడు శంకరుడు. పొగమబ్బు ఆకాశమంతా దట్టంగా పట్టేసింది. చూస్తుండగానే అది నెమలిపింఛపు ఆకారాన్ని ధరించింది. కుమారిల భట్టుగా నేలపై సంచరించిన సుబ్రహ్మణ్య తత్త్వానికి నమస్కరించాడు శంకరుడు. శిష్యులతో కలిసి అక్కడి నుంచి కదిలాడు. మాహిష్మతి దిశగా అడుగులు వేస్తున్నాడు. దారిమధ్యలో వీలుచూసుకుని, ‘‘ఆచార్యదేవా! ఏమిటీ స్తోత్రం? ఇంత అసంబద్ధంగా ఉంది?!’’ అడిగాడు విష్ణుశర్మ. అందరూ అతనికేసి వింతగా చూశారు. (సశేషం) ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర నేతి సూర్యనారాయణ శర్మ -
ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర
‘‘అంత్యేష్టి సంస్కారం ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు. సన్యాసులైన మీకు శ్రాద్ధాదులు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు. అయినా ఇంటి బాధ్యతలు విడిచిపెట్టి ఏనాడో సన్యసించిన మీకు ఇప్పుడు మాత్రం ఎందుకింత ఆరాటం? ఇందులో మీకెందుకింత పట్టుదల?’’ తీవ్రంగా ప్రశ్నించారెవరో. శంకరుడు ఒక్కక్షణం కన్నులు మూసుకున్నాడు. దేహత్యాగం తరువాత కూడా తల్లి మనసులోని కోరికలో ఏ మార్పూ లేదని గ్రహించాడు. కన్నులు తెరిచి అందరివంకా చిరునవ్వుతో చూస్తూ ఇలా సమాధానం చెప్పాడు... ‘ఆత్మయందు అగ్నిని ఆరోపించుకున్న సన్యాసిని నేను. అగ్నిలాగే సర్వత్ర పూజనీయుణ్ణి. అగ్నిలాగే సన్యాసి సమక్షంలో సమస్తమూ శుద్ధత్వాన్ని పొందుతుంది. పుణ్యక్షేత్రము, పుణ్యసమయము, సన్యాసి సన్నిధి తపస్సులకు రెట్టింపు ఫలాలనిస్తాయి. యతి సమక్షంలో నిర్వహించిన క్రతువులు దేవతానుగ్రహాన్ని శీఘ్రంగా సంపాదించి పెడతాయి. తల్లిదండ్రులు, బంధువులు నాకెవరూ లేరు. లౌకిక బంధాలేవీ నాకు లేవు. తోటి సన్యాసులు తప్ప ఇతరులు నాకు నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయాల్సిన అవసరం కూడా లేనివాణ్ణి. అయినప్పటికీ జీవులందరిలాగే నాకు కూడా తల్లిని మించిన దైవం లేదు. ఈ యతిజీవితానికి రాకముందు జన్మనిచ్చిన తల్లి కోరిన కోరిక తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. శాస్త్రవిరుద్ధమైనా అది నెరవేర్చక తప్పదు.’’ ‘‘మీరు చేస్తారు సరే... రాబోయే తరాల్లో ఎవరైనా శంకరుడే చేసిన పనిని మేమెందుకు చేయరాదు అని పూనుకుంటే ఏమని సమాధానం చెప్పాలి’’ గుంపులో నుంచి మరోప్రశ్న వచ్చింది. ప్రశ్న అడిగిన వ్యక్తివంక పరమ అసహనంగా చూశాడు కారుణ్య శంకరుడు. ‘‘అల్పప్రజ్ఞావంతుడు సాహస కార్యాలకు పూనుకోక పోవడమే మంచిది. అయినా మన సమాజంలో అనుకరించే వారే కానీ, అనుసరించే వారు చాలా అరుదు. అటువంటి వారికి సమాధానం చెప్పవలసి వస్తే ఇదిగో ఇది వినండి.... పరంపరగా అపరాధాలు చేస్తూవుండే కుపుత్రుడినైనా తల్లి తప్పక చేరదీస్తుంది. అజ్ఞానం కొద్దీ అపమార్గం తొక్కినా తిరిగి తన చరణాల వద్దకు చేర్చుకుంటుంది. నేను సన్యాసిగా మారేందుకు ఒకనాడు నా తల్లిని మోసపుచ్చాను. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకామె ఇలా కల్పించిందని భావిస్తాను. బలీయమైన కోరికను నెరవేర్చుకునేందుకు అపమార్గాన్ని తొక్కినవారెవరైనా సరే తదుపరి జరగబోయే పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉండాలి. నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. వెనుకడుగు వేసేది లేదు.’’ శంకరుని పలుకులు కొదమసింహం గర్జించినట్లున్నాయి. పూర్వాచార పరాయణత్వమే ఆరోవూపిరి అయిన కాలటి ప్రజలు వెనక్కి తగ్గలేదు. శంకరుని కోరిక మన్నించలేదు. ‘‘మేము కూడా మీలాగే సిద్ధపడి ఉండాలి కదా! మీరు మా గుడికి వస్తే మీ చేతికి హారతిని అందిస్తాం. మీ చేతిమీదుగా నీరాజనమిస్తే దైవం సానుకూల పడతాడని భావిస్తాం. దీపం అందిస్తాం. మీరు వెలిగించిన మరోదీపం సాక్షాత్తూ భగవత్ స్వరూపమేనని మొక్కుతాం. కానీ మీ భోజనానికి వంటచెరుకు ఇవ్వడానికి సైతం అంగీకరించం కదా! మీ తిండికే ఇవ్వని నిప్పుని....తల్లికి తలకొరివి పెట్టేందుకు మాత్రం ఇస్తామని ఎలా అనుకుంటున్నారు? మా వంశాలను ఉద్ధరించే పవిత్ర అగ్నిహోత్రాన్ని ఒక సన్యాసి చేతికి....అందులోనూ ఇటువంటి కార్యానికి ఏ ధైర్యంతో అందించమని శాసిస్తున్నారు?’’ అంటూ మొండిగా తమ వాదన కొనసాగించారు. అక్కడ శంకరుని జ్ఞాతులున్నారు. శంకరుని వల్ల, అతడి తల్లిదండ్రుల వల్ల అనేక విధాలుగా సాయాలు పొందినవారున్నారు. ఈ సమయంలో మాత్రం వంశాచారం భ్రష్టమైపోతున్నదనే బెంగే తప్ప...సాటిమనిషి పట్ల ఏమాత్రం జాలిలేదు వారిలో. శంకరుడు వాదన కట్టిపెట్టి, మౌనంగా లేచి పెరటి వైపు నడిచాడు. ఎదురుగా పూర్ణానది ఒడ్డులొరుసుకుంటూ హోరున ప్రవహిస్తోంది. అందుబాటులో ఉన్న కలపను ఒకచోట చేర్చి స్వయంగా చితిపేర్చాడు శంకరుడు. లోనికి వచ్చి తల్లి పార్థివ దేహాన్ని రెండు చేతులా పైకెత్తాడు. భుజంపై మోసుకుని వెళ్లి చితిపై పరుండబెట్టాడు. శంకరుని ప్రయత్నానికి ఒక్కసారిగా అందరూ అడ్డుపడ్డారు. ‘‘ఏమిటిది? ఇళ్ల మధ్యలో మనిషిని తగలబెడితే ఇక ఈ ఊళ్లో మేమంతా ఎలా ఉండాలి? తీసేయండి...’’ అంటూ గోలపెట్టసాగారు. మంచిగంధం చెట్టు చల్లగా ఉంటుంది. సుగంధం వెదజల్లుతుంది. కానీ దానిని అదే పనిగా మధిస్తే దానియందున్న అగ్ని వెలికివచ్చి దహించి వేస్తుంది. ఇప్పుడు శంకరుని స్థితి సరిగ్గా అదే. ఊరివారి నైజం అతడి మనసును తీవ్రంగా గాయపరిచింది. ‘‘నేటి నుంచి మీ శ్మశాన భూములు మీ ఇళ్లలోనే ఉండుగాక! మీరు వేదబాహ్యులు అగుదురు గాక! వైదికకర్మలకు దూరమైపోదురు గాక! నిజమైన సన్యాసులు ఇక్కడ భిక్ష గ్రహించకుందురు గాక!’’ అన్నాడు ఆవేదనతో జన్మభూమిని శపిస్తూ. ఆ మహాపురుషుని శాపవచనం అక్కడున్న వారందరినీ అప్రతిభులను చేసింది. చేష్టలు దక్కి అందరూ ఎక్కడి వారక్కడే నిలుచుండి పోయారు. శంకరుడు విష్ణుస్మరణ చేస్తూ చితిని సమీపించాడు. చేతిలోని జ్ఞానదండాన్ని పైకెత్తి మాతృమూర్తి కుడిభుజానికి తాటించాడు. ఆ దండం నుంచి పుట్టిన విద్యుత్తు తల్లి చితిని రగిలించి మోక్షమిచ్చింది. వేడిమిపాలు ఒక్కింత కూడా లేని మృతదేహాన్ని ఒక ఎండుపుల్లతో మథిస్తే నిప్పు రాజుకున్న వింతను అక్కడున్న వారంతా అచ్చెరువు పడుతూ చూశారు. జన్మనిచ్చిన తల్లికి అంత్యేష్టి సంస్కారంలో భాగంగా ఒక కొడుకు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ శంకరుడు నెరవేర్చాడు. తిరుగు ప్రయాణమయ్యాడు. తలచుకున్న వెంటనే యోగశక్తిచేత కాలటికి చేరుకున్నట్లే... మళ్లీ మహాశ్మశానమని పిలిచే కాశీకి కూడా అదే శక్తిచేత తిరిగి చేరుకున్నాడు. శంకరుడు తిరిగివచ్చే సమయానికి సరిగ్గా కొద్దిసేపటి ముందు ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది. దానికి పద్మపాదుడు సాక్ష్యంగా నిలిచాడు. అసలేం జరిగిందంటే...శంకరుడు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించడానికి వ్యాస భగవానుడు స్వయంగా వచ్చాడు. వృద్ధబ్రాహ్మణునిగా మారురూపుతో వచ్చిన వ్యాసునితో కలిసి, శంకరుడు వ్యాసకాశీకి సమీపంలోని ఒక గుహలో ప్రవేశించాడు. ‘‘మా అంతట మేమే బయటకు వచ్చేవరకూ మీరెవరూ లోనికి రావద్దు’’ అని ముందుగా శంకరుడు శిష్యులను హెచ్చరించాడు. ఆచార్యుని ఆజ్ఞమేరకు ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేదు. ఇది జరిగి మూడురోజులైంది. తల్లి మరణంతో శంకరుడు అకస్మాత్తుగా కాలటికి ప్రయాణమైన విషయం శిష్యులెవరికీ తెలియదు. అపరిచితుడైన ఒక వృద్ధమూర్తితో రోజుల తరబడి తమ గురువు ఇలా చర్చల్లో కూరుకుపోవడం వారిలో ఆందోళన నింపింది. చివరకు పద్మపాదుడు తెగించి గుహలోనికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణంపై చర్చ జరుగుతోంది. ‘‘యోగి తన యోగబలం చేత అనేక శరీరాలను ఏర్పరుచుకోవచ్చు. వాటన్నింటితోనూ భూమండలం మీద సంచరించవచ్చు. కొన్ని దేహాలతో విషయభోగాలను అనుభవించవచ్చు. అన్నింటితో ఉగ్రమైన తపస్సు చేయవచ్చు. తరువాత వాటన్నింటినీ సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకున్నట్లు ఉపసంహరించుకోవచ్చు’’ అని స్మృతిని ప్రమాణంగా చూపాడు శంకరుడు. మరింత ముందుకు చెబుతూ, ‘‘యోగులే ఇలా చేయగలిగినప్పుడు పుట్టుక నుంచి సిద్ధులైన దేవతల మాట వేరే చెప్పనక్కర లేదు కదా! ఒక్కో దేవతకు ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని శ్రుతి చెబుతోంది. ఒక దేవత అనేక రూపాలుగా తోచవచ్చు. అనేక రూపాలు కలిసి ఒక్కటిగానూ మారవచ్చు. మొత్తంమీద ఒకే దేవత అనేక రూపాలచేత తనను తాను విభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాలలో అంగత్వం పొందుతుంది. అంతర్థానశక్తి ఉండడం వల్ల ఇతరులు ఆ దేవతను చూడలేరు...’’ శంకరుని భాష్య వివరణ ఇంకా పూర్తికాలేదు. అంతలో పద్మపాదుడు అందుకున్నాడు. ‘‘గురుదేవా! నా అంచనా తప్పు కాకపోతే... ఇప్పుడు మనముందు ఉన్న వృద్ధబ్రాహ్మణుడు మరెవరో కాదు, సాక్షాత్తూ వ్యాసభగవానుడే’’ అన్నాడు. శంకరుడు అతడిని చూసి చిరునవ్వు నవ్వాడు. ‘‘అది నిజమే’’ అన్నాడు శంకరుడు పెదవులు కదలకుండానే. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూశాడు పద్మపాదుడు. పై మాటలు చెప్పిన శంకరుడు గుహద్వారంలో నిలబడి ఉన్నాడు. వృద్ధబ్రాహ్మణుని స్థానంలో వ్యాసభగవానుడు స్వస్వరూపాన్ని ధరించి కనిపిస్తున్నాడు. అప్పటివరకూ తనను తాను రెండుగా విభజించుకుని, శంకరునిగా కూడా తానే అయి భాష్య పరిశీలన చేస్తున్నాడాయన. ఆ రెండో రూపాన్ని ఇప్పుడు ఉపసంహరించాడు. శంకరుడు, అతడి వెనుకనే పద్మపాదుడు కూడా వ్యాసభగవానునికి పాదాభివందనం చేశారు. త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే మానావమాన సదృశాః సమదర్శినశ్చ కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మపరిపాక ఫలాని ధన్యాః – నాది, నేను అనే బంధాలను విడిచిపెట్టినవాడే ధన్యుడు. దూషణ, భూషణలను సమానంగా స్వీకరిస్తూ, సర్వత్ర సమస్వరూపమైన ఆత్మనే వీక్షించువాడు ధన్యుడు. ఈశ్వరుడినే కర్తగా తీసుకుని, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నిర్వర్తించేవాడు ధన్యుడు. శంకరుడు గురుసమక్షంలో ధన్యాష్టకం చెబుతున్నాడు. ‘‘ఇంద్రియ సుఖాలకు అతీతంగా, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పరమార్థ తత్త్వాన్ని నిర్ణయించడానికి పూనుకున్నవాడే ధన్యుడు. మిగిలినవారంతా భ్రమల లోకంలో తిరుగాడుతూ ఉంటారు. అరిషడ్వర్గాలను నిర్జించిన వాడికి యోగరాజ్యం కైవసం అవుతుంది. ఆత్మవిద్యను వరించి, లోకాలయాన్ని త్యజించిన ధన్యుడు వానప్రస్థుడవుతున్నాడు. హృదయంలో పరంజ్యోతి వీక్షించాలని యత్నిస్తున్నవాడు ధన్యుడు. సదసత్తులు, అణుమహత్తులు, చివరకు స్త్రీ పురుష నపుంసకులలో ఎవరూ కాని బ్రహ్మమును ఏకాగ్రచిత్తంతో ధ్యానించేవాడు ధన్యుడు. బ్రహ్మసాక్షాత్కారం జరిగితే జగత్తే నందనవనం అవుతుంది. అన్ని చెట్లూ కల్పవృక్షాలవుతాయి. జలమంతా గంగయే అవుతుంది. సమస్త కార్యాలూ పుణ్యక్రియలే... పలికిన మాటలు వేదవాక్యాలు అవుతాయి. భూమండలమంతా కాశీక్షేత్రమే అవుతుంది. అటువంటి జ్ఞాని ఏ రూపంలో ఉన్నా సాక్షాత్ బ్రహ్మమే అవుతున్నాడు’’ అన్నాడు శంకరుడు. వ్యాసభగవానుడు పరమానంద భరితుడయ్యాడు. అర్ధనిమీలిత నేత్రాలతో, ‘‘జగద్గురూ!’’ అని పిలిచాడు. ‘‘సరిగ్గా మీరు వచ్చే సమయానికి బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణం పరిశీలిస్తున్నాను. అందులో ఒకచోట ‘స్వాధ్యాయాదిష్ట దేవతాసం ప్రయోగః’ అన్న పతంజలి సూత్రాన్ని గురించి చెప్పారు. ఆ సందర్భంలోని మీ అభిప్రాయాలను ఒకసారి వినిపించండి’’ అడిగాడు వ్యాసుడు. ‘‘స్వాధ్యాయం అంటే మంత్రజపం వల్ల ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. దేవతతో మాట్లాడడమూ సాధ్యమవుతుంది. దేవతలకు మంత్రమే శరీరం. దేవతలను మనస్సు చేతనే ధ్యానించాలి అంటూ వారికి ప్రత్యేక రూపాలను శ్రుతులు చెప్పలేదు. కానీ ఇతిహాస పురాణాలు చెప్పాయి. దేవతలకు అవి విగ్రహాలను కల్పించాయి. శ్రుతులలోని మంత్రాలు, అర్థవాదాలే ఇతిహాస పురాణాలకు మూలం కావచ్చు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణాలూ ఉంటాయి’’ చెబుతున్నాడు శంకరుడు. పద్మపాదుడు అందుకుని, ‘‘వ్యాసుని వంటి మహనీయులు దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని పురాణాలు చెబుతున్నాయి’’ అన్నాడు. కొనసాగింపుగా శంకరుడు, ‘‘ఇప్పటి వాళ్లలా ప్రాచీనులకు కూడా దేవతలతో వ్యవహరించే నేర్పు లేదు అని వాదించేవాడికి జగత్తులోని వైచిత్రి బోధపడలేదని అర్థం. ఇప్పుడు జగదేక సార్వభౌముడు లేడు కనుక, గతంలోనూ లేడని వాడు వాదించవచ్చు. గతంలో కూడా ఇప్పటిలాగే వర్ణాశ్రమ ధర్మాలన్నీ అస్తవ్యస్తంగానే ఉండేవని, పాతతరంవారు మనకంటే తీసికట్టుగా ఉండేవారని వదరుబోతుతనంతో వాగవచ్చు. అది తెలియని వారిని మోసపుచ్చే మాటలు. అవే నిజమైతే మన మహర్షుల ధర్మప్రబోధం వల్ల యుగాలనాడే వ్యవస్థీకృతమైన మన మహోన్నత వారసత్వమంతా కేవలం గ్రంథాల్లో చేసిన కల్పనే అవుతుంది. ఇది మేధను వృథా పరుచుకోవడం తప్ప మరేమీ కాదు. – తస్మాత్ ధర్మోత్కర్షవశాత్ చిరంతనా దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహ్రురితి శ్లిష్యతే – అందువల్ల మన ప్రాచీనులు ఉత్కర్షమైన ధర్మబలం సహాయంతో దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించారని చెప్పడం మంచిది. అలాగే దేవతలకు విగ్రహాలు లేవు అని వాదించే వాడి వాదనలో పస లేదు. శ్రుతులు క్రమముక్తిని చెప్పాయి. మరణించిన వ్యక్తులు ఆయా దేవలోకాలకు వెళ్లి, అక్కడ కొంతకాలం ఉండి తరువాత క్రమముక్తికి వెళతారు. దేవతలకు విగ్రహాలే లేకపోతే ఇవన్నీ కుదరనే కుదరవు’’ అన్నాడు శంకరుడు. వ్యాసుడు సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఇంతకూ దేవతలు ఎంతమంది అని యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నిస్తే ముప్పై ముగ్గురు అని సమాధానం చెప్పాడట. మళ్లీమళ్లీ ప్రశ్నించినప్పుడల్లా సంఖ్య మారుస్తూ ఆరుగురు, ముగ్గురు, ఇద్దరు, ఒకరు అని సమాధానాలు చెప్పాడట. నిజానికి దేవత ఒక్కటే ఉంది...అదే ప్రాణం. దేవతలందరూ ఆ ప్రాణం యొక్క రూపాలే. ఆ ఒక్క ప్రాణమే ఒకే సమయంలో అనేక దేవతా రూపాలలో ఉన్నది. అనేకమంది ఒకేసారి సమర్పిస్తున్న హవిస్సులను స్వీకరిస్తోంది. స్వాధ్యాయ పరునికి మంత్రఫలాన్ని, అర్థవాదులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది’’ అనే అర్థం వచ్చే భాగాలను శంకరుని బ్రహ్మసూత్ర శారీరక భాష్యం నుంచి పద్మపాదుడు పఠించాడు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః – ‘శంకరుడే భాష్యరచన చేసిన శంకరాచార్యుడు. అంతకుముందు సూత్రాలను అందించిన ఈ వ్యాసుడు సాక్షాత్తూ విష్ణు భగవానుడే. ఈ భగవంతులిద్దరి కలయిక ప్రతియుగంలోనూ జరుగుతూనే ఉంటుంది...’ అని పలికింది ఆకాశవాణి. (సశేషం) ∙నేతి సూర్యనారాయణ శర్మ -
అమ్మకిచ్చిన మాట
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాస లోకపుణ్యపాప శోధకం విభుమ్ నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే స్వామి సన్నిధిలో నిలిచి, ఆదిశంకరుడు ఆశువుగా కాలభైరవాష్టకాన్ని రచిస్తున్నాడు. శోకమోహాలు దైన్యలోభాలు కోపతాపాలు కాలభైరవుని సన్నిధిలో నశించిపోతాయి. జ్ఞానానికి, ముక్తికి, పుణ్యఫలం పెరిగేందుకు కాలభైరవాష్టకాన్ని పఠించండి. కాశికా పురాధినాథుడైన కాలభైరవుణ్ణి భజించండి అని ఫలశ్రుతి చెప్పడం కూడా పూర్తయింది.సరిగ్గా అదే సమయానికి ఒక ముసలివగ్గు ఆలయంలో ప్రవేశించాడు. శంకరయతి శిష్యులలో ఎవరినో ‘ఆ పాడుతున్నవారెవరు?’ అని అడిగినట్లున్నాడు. సమాధానం తెలుసుకుని శంకరుణ్ణి సమీపించాడు. ‘‘జగద్గురూ!’’ అని నమస్కరించాడు ఆ ముసలాయన. శంకరుని ఒళ్లు పులకించింది. ఆనాటి వరకూ తన గురువులు తప్ప ఇతరులెవరూ శంకరుణ్ణి జగద్గురూ అని సంబోధించలేదు. వచ్చిన వ్యక్తిని గుర్తించాడు శంకరుడు. ఆయన మారువేషంలో ఉన్నాడు. ఇతరులకు ఆయన ఎవరో తెలియదు. శంకరుడు ఆశ్రమ నియమాలు పాటించక తప్పదు. సన్యాసులు దేవతలకు, కన్నతల్లికి, గురువులకు, తోటి సన్యాసులకు తప్ప ఇతరులకు నమస్కరించ కూడదు అనే నియమాన్ని పాటిస్తూ శంకరుడు ప్రతి నమస్కారం చేయలేదు. ‘‘స్వామీ! మీ గురించి ఇదివరలో చాలా విన్నాను. మీరు రచించిన ఉపనిషత్ భాష్యాలను అక్కడక్కడా చూశాను. గతంలో మీరు కాశీకి వచ్చినప్పుడు పండిత పరిషత్తులలో నిగ్గు తేలిన వారని విని సంతోషించాను’’ అన్నాడు ముసలాయన. శంకరుడు మౌనంగా విన్నాడు. ‘‘కానీ స్వామీ! నేటి సమాజంలో వేదబాహ్యులు, నానాత్వవాదులు పెచ్చుమీరిపోతున్నారు. మీరు వేదాన్నే పట్టుకుని అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతుంటారు. మీకు ప్రతిపక్షులు చాలామందే ఉన్నారు. వారందరితోనూ వాదించాలంటే మీ సంగతి ఏమో కానీ, సామాన్యులకైతే కష్టసాధ్యమే. మీరు వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారని విన్నాను. అందులో నాకేవేవో సందేహాలున్నాయి. మీరు సమయం ఇస్తే కొంచెం తెలుసుకుంటాను’’ అన్నాడాయన. ‘‘తప్పకుండా’’ అన్నాడు శంకరుడు. ‘‘జగద్గురూ! ఈవేళ అష్టమి. ప్రతినెలలోనూ రెండు అష్టమి తిథులలోనూ, మాసశివరాత్రి రోజుల్లోనూ తప్ప నేను కాశీలో ఉండడానికి వీలులేదు. మిగిలిన రోజుల్లో నేను కాశీకి రావడానికి ఈ కాలభైరవుడు అనుమతించడు...’’ గొంతు గద్గదికం అవుతుండగా ముసలాయన కొద్దిసేపు మాట పెగుల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ‘‘ఇంతకూ ఏం చేయమంటారు స్వామీ!’’ అడిగాడు శంకరుడు వినయంగా. ‘‘మరేమీ లేదు. మీరు వీలుచూసుకుని ఒక్కసారి వ్యాసకాశీకి రండి. బ్రహ్మసూత్ర భాష్యాన్ని గురించి నాకున్న సందేహాలు కొద్దిలో తేలేవి కావు. వీలైనన్ని ఎక్కువరోజులు మీ సన్నిధిలో గడపాలని నా కోరిక’’ అన్నాడు ముసలాయన. ‘‘అయితే ఎప్పుడు రమ్మంటారు’’ అడిగాడు శంకరుడు. ‘‘పౌర్ణమి లోపుగానే రండి. వ్యాసలింగేశ్వర స్వామి సన్నిధిలో కలుద్దాం’’ అని చెప్పి ముసలాయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు.శంకరయతి శిష్యులతో కలిసి ముందుకు సాగాడు. బిందుమాధవుణ్ణి సేవించిన తరువాత విశ్వనాథుని దర్శనానికి వెళ్లాడు. విశాలాక్షిని, అన్నపూర్ణను స్తుతించాడు. ఆరు రోజుల వ్యవధిలో కొన్ని పండిత పరిషత్తులలో పాల్గొని వాదనలు చేశాడు. కొన్ని మతాలకు సనాతన ధర్మంతో సమన్వయం సాధించి, వాటిని కూడా ఇందులో కలిపేశాడు. కొన్నింటిని నిరాకరించి వాటిని అవైదిక మతాలని తృణీకరించాడు. ఎదుట పడిన ప్రతివాడిని పాదాక్రాంతుణ్ణి చేసుకున్నాడు. మాసశివరాత్రినాటి ఉదయ సంధ్యలో... కాలభైరవ స్వామి సన్నిధిలో కనిపించిన ముసలాయన ఆనాడు విశ్వనాథుణ్ణి చూడవచ్చాడు. కానీ శంకరునితో ఆయనేమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రమే శంకరుడు వ్యాసలింగేశ్వర దర్శనానికి వెళ్లాడు. అక్కడ శంకరుని కోసమే వేచి చూస్తున్నాడా వృద్ధుడు. ‘‘మనకు కొంత ఏకాంతం కావాలి’’ అన్నాడు. శంకరుణ్ణి ముందుకు నడిపించాడు. వ్యాసకాశీకి సమీపంలో గంగాతీరాన అనేక గుహలున్నాయి. ఆ గుహల్లో ఒకదానిలోకి వృద్ధుడు దారి తీశాడు. శంకరయతి శిష్యులందరూ గుహ బయటనే వేచివున్నారు. లోనికి ప్రవేశిస్తూనే శంకరుడు ఆ వృద్ధునికి సాష్టాంగ పడ్డాడు. వృద్ధుడు నిజస్వరూపంలో వేదవ్యాసునిగా దర్శనమిచ్చాడు. ఇద్దరూ సంభాషణ ప్రారంభించారు. ‘‘జగద్గురూ! లోకంలో ఒక పదానికి ఒక అర్థం రూఢిగా ఏర్పడుతుంది. సూత్రకారులు ఆ అర్థాన్నే గ్రహిస్తారు. మీవంటి భాష్యకారులు కూడా ఆ అర్థాలనే గ్రహించాలి. అంతేకానీ కొత్త అర్థాలు కల్పించ కూడదు. ఏమంటారు?’’ ప్రశ్నించాడు వ్యాసుడు. ‘‘అవును స్వామీ!’’ అన్నాడు శంకరుడు. ‘‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ – ఆనందమే బ్రహ్మ అని తెలుసుకో – అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఆనందమయోభ్యాసాత్ – అని నేను సూత్రం చెప్పాను. దీనికి మీరు చెప్పిన భాష్యం ఏమిటి?’’ తదుపరి ప్రశ్న సంధించాడు వ్యాసుడు. ‘‘స్వామీ! ఈ సూత్రానికి యథాతథంగా అర్థం స్వీకరిస్తే ఆనందమయమైన వస్తువులో బ్రహ్మ ఒక భాగం అయిపోతాడు. అది వ్యాసహృదయం కాదని నేను చెప్పాను. దానికి తైత్తిరీయోపనిషత్తు బోధించినట్లుగా ఒకదాని లోపల ఒకటిగా ఉండే పంచకోశాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను దాటిన తరువాత నిగూఢంగా లోపల ఉండే ఆనందమయ కోశాన్ని ప్రస్తావించాను. అప్పుడు ఆనందమయకోశమే బ్రహ్మస్వరూపం అవుతోంది. ఇక్కడ ఆనందమయత్వం వేరు... బ్రహ్మ వేరు కాదు. రెండూ ఒకటే అవుతోంది’’ అని బదులిచ్చాడు శంకరుడు. ‘‘వైదిక వాక్యానికి, సూత్రానికి ఎప్పుడైనా విరోధం వస్తే... సూత్రాన్ని మార్చి చెప్పుకోవాలి కానీ వైదిక వాక్యాన్ని మార్చకూడదు. ఇది వార్తిక కారుడైన కుమారిల భట్టు పద్ధతి. జగద్గురూ! మీరు సూత్రానికీ, ఉపనిషత్ వాక్యానికీ సమతూకం పాటించారు... మెచ్చుకున్నాను’’ అన్నాడు వ్యాసుడు. ‘‘ధన్యోహం’’ చెప్పాడు శంకరుడు. ‘‘ఇప్పుడు మూడో అధ్యాయంలోకి వద్దాం. తదంతర ప్రతిపత్తౌ రహంతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం – అన్న సూత్రాన్ని మీరెలా వ్యాఖ్యానించారో తెలుసుకోవాలని ఉంది’’ అడిగాడు వ్యాసుడు. ‘‘మరణించిన తరువాత జీవుడు సూక్ష్మరూపాన్ని ధరిస్తాడు. అందుకు జలం, తేజస్సు, పృథ్వి భూతసూక్ష్మాలు సహకరిస్తాయి. అయితే ఛాందోగ్యోపనిషత్తులోని పంచాగ్ని విద్య ప్రకారం జీవుడు అయిదో ఆహుతి అయిన జలంతో సహాద్యులోకానికి వెళతాడు అని ఉంది. ఇక్కడ జలం ఒక్కదాన్నే పేర్కొన్నా దేహానికి బీజాలైన మూడింటినీ చెప్పుకోవాలి. అయితే జీవుడు ప్రాణేంద్రియాలతో కలిసి దేహాంతరానికి వెళతాడు అని వేదం చెబుతోంది. గడ్డిమీద సంచరించే జలూక అనే పొడుగుకాళ్ల పురుగు ఒక గడ్డి పరకను పట్టుకుని ఉంటుంది. మరో గడ్డిపరక దొరికే వరకూ తానున్నదాన్ని విడిచిపెట్టదు. ఇక్కడ దేహం గడ్డిపరక. మరణావస్థలోని జీవుడు కర్మబలం చేత తనకు రాబోయే జన్మలో ప్రాప్తించబోయే దేహాన్ని గురించి దీర్ఘంగా భావన చేస్తాడు. అదే రూపాన్ని పొంది జలం సహాయంతో ఊర్ధ్వగతికి వెళతాడు. జలమే అన్నిటా ఉన్నది’’ చెప్పాడు శంకరుడు. ‘‘మరి నాలుగో అధ్యాయంలోని – నిశి నేతి చేన్న సంబంధస్య యావద్దేహ భావిత్వాద్దర్శయతి చ అన్న సూత్రం గురించి...’’ ‘‘హృదయ సంబంధమైన హార్దవిద్య ఒకటుంది. దాని ప్రకారం హృదయానికి సంబంధించి నూటొక్క నాడులున్నాయి. వాటిలో ఒకటి శిరస్సువైపుకి వెళుతుంది. దాని ద్వారా పైకి వెళ్లేవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు. పగలైనా, రాత్రైనా దేహానికి రశ్మిసంబంధం ఉంటుంది. మరణంలో ఎప్పుడైనా కిరణయోగం ఉండనే ఉంటుంది. అసలు కిరణాలకు నాడులతో చుట్టరికం యావజ్జీవితమూ ఉంది. దానికి పగలు, రాత్రి అనే భేదం లేదు. దక్షిణాయనమైనా, కృష్ణపక్షమైనా యోగికి జ్ఞానఫలమైన ముక్తి అవశ్యం లభిస్తుంది...’’ శంకరుడింకా చెబుతూనే ఉన్నాడు. పలుకు బ్రహ్మనిష్ఠమై ఉన్నది. మనస్సు, శరీరం గురుసన్నిధిలో ఉన్నాయి. గురుబోధ తప్ప అన్యమైనదేదీ గోచరించడానికి అవకాశమే లేని సందర్భం అది. అటువంటి స్థితిలో శంకరుని మనోఫలకంపై అతని తల్లి మెరిసింది. అందుకు కారణం వ్యాసుని కరుణ తప్ప మరొకటి కాదని గ్రహించాడు. కాలటి అగ్రహారంలో శంకరుని తల్లి ఆర్యాంబ అంత్యదశలో ఉంది. ఆమె స్థూలదేహం చుట్టూ బంధుమిత్రులు మూగి ఉన్నారు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండే ఆమె కారణ శరీరం మెల్లగా అక్కడి నుంచి కదిలింది. గదిలో నుంచి బయటకు వచ్చింది. మెట్టినింటికి వచ్చింది మొదలు తాను కన్నతండ్రిలా సేవించుకున్న కృష్ణ మందిరానికి చేరింది. పొట్టకింద తెల్లమచ్చలుండే జింక తోడురాగా ఒకప్పుడు, ఆర్యాంబ సూక్ష్మదేహం కైలాసనాథుణ్ణి దర్శించింది. ‘మా నాన్న దగ్గరకు పంపించు స్వామీ’ అని కోరితే సదాశివుడు అంగీకరించి పంపాడు. లోకాలన్నింటినీ అధిగమిస్తూ ఆర్యాంబ క్రమంగా ఆనాటికి గోలోకాన్ని చేరింది. కాలటిలోని బంధుమిత్రులు ఆర్యాంబ మరణించిందని ప్రకటించారు.వ్యాసుని ముందు కూర్చుని ఉన్న శంకరుని కన్నుల వెంట అశ్రువులు జలజల రాలిపడ్డాయి. ‘‘అమ్మకిచ్చిన మాట చెల్లించుకోవాలి కదూ!’’ అన్నాడు కొద్ది వ్యవధి తరువాత వ్యాసుడు. శంకరుడు అసహాయంగా చూశాడు. ‘‘ముందు కర్తవ్యం పూర్తి చేసుకోండి. మీరు వచ్చేవరకూ ఇక్కడే గ్రంథ పరిశీలన చేస్తూ ఉంటాను’’ అని సెలవిచ్చి పంపాడు వ్యాసుడు. శంకరుడు ఉన్నచోటనే అంతర్థానమయ్యాడు. యోగశక్తి చేత ఆకాశగమనం చేసి శీఘ్రంగా తల్లి వద్దకు చేరుకున్నాడు. వార్త పంపకపోయినా, అకస్మాత్తుగా శంకరుడు రావడంతో కాలటిలోని వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శంకరుడు తన తల్లికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధపడ్డాడు. ముక్తామణి త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిర సుత త్వం ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం –కొడుకా! నా ఆణిముత్యమా! నా కంటిదీపమా... వెయ్యేళ్లు వర్ధిల్లుమా అని చిన్ననాడు నన్ను లాలించిన నీ నోటిలో అమ్మా! ఇప్పుడు తెల్లబియ్యాన్ని పోస్తున్నాను. అమ్మా... అయ్యా! గోవిందా అని తలచుకుంటూ పంటిబిగువున ఎంతో తీవ్రమైన ప్రసవ వేదనను అనుభవించి నాకు జన్మనిచ్చావు. నాకోసం నువ్వు పడిన శ్రమకు, త్యాగానికి ఏనాటికీ నీ ఋణం తీర్చలేను. ఈ అంత్యవేళ నీకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను. నేనప్పుడు గురుకులంలో ఉన్నాను. నేను యతివేషం ధరించినట్లు కల వచ్చిందని, రోదిస్తూ ఒకరోజున అంతదూరం పరుగు పరుగున వచ్చావు. అటువంటి నువ్వు నిజంగానే నేను సన్యాసం స్వీకరిస్తే ఎంత బాధపడ్డావో కదా... మన్నించమ్మా! నీ చివరి ఘడియలలో నోటిలో తులసి తీర్థమైనా పోయలేక పోయాను. సమయం మించిపోయి వచ్చినందు వల్ల నీ చెవిలో తారకమంత్రమైనా చెప్పలేకపోయాను. గృహస్థుల వలె నీకు శాస్త్రబద్ధంగా శ్రాద్ధ విధులు సైతం నిర్వర్తించలేను. కేవలం నేను సమర్పిస్తున్న ఈ తెల్లబియ్యాన్ని అయినా స్వీకరించవమ్మా!... అన్నాడు శంకరుడు. ‘‘అయ్యా! ఏడుకట్ల సవారీ సిద్ధం చేయండి. అగ్నిహోత్రం సమకూర్చండి’’ అని అక్కడే ఉన్న బంధువులను అభ్యర్ధించాడు. ‘‘సన్యాసికి అగ్నిహోత్రాన్ని తాకే అధికారం లేదు. నువ్వు నీ తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం శాస్త్రవిరుద్ధం’’ అన్నారు వారంతా ముక్తకంఠంతో. ‘‘నిజమే. సన్యాసినైన నేను తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి పనికిరాను. కానీ ఇది ఆమె చివరి కోరిక. నేను మాటిచ్చాను. చేయక తప్పదు’’ అన్నాడు స్థిరంగా శంకరుడు. (సశేషం) -
అదే నీవు... అదే నేను
కనిపించే ఆ పర్వత శిఖరం పైనుంచి దూకి, చెక్కు చెదరకుండా వచ్చినవారి మతమే గొప్పది – అని మొండివాదంలోకి దిగాడు భట్టపాదుడు. ముందు తానే దూకుతానన్నాడు. పీడ విరగడవుతుందని అందరూ సంతోషించారు.పూర్వానుభవం వల్ల ఈసారి శాసనం సరిగ్గా చేశాడు భట్టపాదుడు. శిఖరం పైనుంచి కిందికి దూకినా అపాయం ఏదీ కలగలేదు. ఆయనతో సమానంగా పైకెక్కి దూకడానికి మిగిలిన వారికి ధైర్యం చాలలేదు. అప్పుడు సుధన్వ మహారాజు ఒక మూతపెట్టిన కుండను తెప్పించాడు. ‘‘ఇందులో ఏముందో మీరందరూ విడివిడిగా వ్రాయండి. ఎవరు సరిగ్గా వ్రాస్తారో వారి మతమే సరైనదని అంగీకరిస్తాను’’ అని ప్రకటించాడు. అందరూ ఒక్కరోజు సమయం అడిగారు. ఆ రాత్రి మిగిలిన వారంతా ఏవేవో సమాలోచనలు చేశారు. రహస్యమార్గాల ద్వారా ఆ కుండలో ఏముందో తెలుసుకున్నారు. భట్టపాదునికి తప్ప మిగిలిన అందరికీ అందులో ఏముందో ముందే తెలిసిపోయింది.‘ఆ కుండలో పాముంది’ అని అందరూ సరిగ్గానే వ్రాశారు.భట్టపాదుడు మాత్రం, ‘అందులో శేషశాయి విగ్రహం ఉంది’ అని వ్రాశాడు. చివరకు మూత విప్పి కుండలో నుంచి విగ్రహాన్ని బయటకు తీశాడు సుధన్వుడు. తానే పెట్టిన వస్తువు సైతం మారిపోయి కనిపించడం అతణ్ణి ఆశ్చర్యానికి గురిచేసింది. భట్టపాదుణ్ణి ఎదిరించిన ఇరవై ఒక్కమతాల వారూ శిక్షార్హులని తీర్పునిచ్చాడు. ‘అందరినీ వరుసగా నిల్చోబెట్టి తలకాయలు నరికేయండి’ అని ఆజ్ఞ జారీ చేశాడు. కత్తి చేతపట్టి తలారి వచ్చాడు. ‘బాబూ! అటునుంచి నరుక్కురా’ అని కేకపెట్టాడు వరుసలో మొదటివాడు. ‘ఎందుకు?’ అని ప్రశ్నించిన మా గురువు వద్దకు నడిచి వచ్చాడా వ్యక్తి. ‘‘స్వామీ! నేనిప్పుడొక గ్రంథం రచిస్తున్నాను. అది పూర్తయ్యే వరకు బ్రతకాలని నా ఆశ’’ అంటూ ఆ గ్రంథాన్ని మా గురువు ముందు పెట్టాడు. ఆ వ్యక్తి పేరు అమరసింహుడు. ఆయన రచించిన మహాగ్రంథమే అమరకోశం. సంస్కృత భాషా అధ్యయనం చేసేవారికి అత్యవసరమైన గొప్ప నిఘంటువు. గ్రంథాన్ని పరిశీలించిన మా గురువు అతడికి ప్రాణభిక్ష పెట్టారు. ‘‘అమరసింహా! మీ నిఘంటు రచనతో సంస్కృతభాషకు మకుటాయమానమైన సేవ చేస్తున్నారు’’ అని ప్రోత్సహించాడు... అదీ జరిగింది. ... ప్రభాకరుడు చెబుతున్న కథను అందరూ చెవులప్పగించి విన్నారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తరువాత తిరిగి ప్రభాకరుడే ప్రశ్నించాడు. ‘‘స్వామీ! మీ అభిమతం ఏమిటో చెప్పండి. కర్మమార్గం అవశ్యం అనుసరణీయమే కదా!’’ దానికి శంకరుడిచ్చిన సమాధానమిది... ప్రత్యక్ ప్రవణతామ్ బుద్ధేః కర్మా ణ్యుత్పాద్య శక్తితః కృతార్థా న్యస్తమాయాంతి ప్రావృడంతే ఘనా ఇవ స్వశక్తిని అనుసరించి చేసిన కర్మలు మానవుని బుద్ధికి ప్రత్యగాత్మయందు ఆసక్తిని కలిగిస్తాయి. కృతార్థములవుతాయి. వర్షకాలం చివర మేఘాల వలె కడకు మాయమై పోతాయి. ప్రత్యగాత్మపై ఆసక్తిని పెంచుకున్న మానవుడు తత్త్వమసి వంటి వాక్యములను గురువులచే ఉపదేశం పొందాలి. అటువంటి వారికి బ్రహ్మజిజ్ఞాస కలుగుతుంది. ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. శంకరుడు ఈ ఉపదేశం పూర్తి చేసే సమయానికి వారు కూర్చున్న దిశగా ఒక బాలుడు నడిచి వస్తున్నాడు. పదమూడేళ్లలోపు వయస్సున్న ఆ బాలుడి చేతిలో ఉసిరికాయలున్నాయి. ‘‘ఇతడు నా కుమారుడు. పేరు పృథ్వీధరుడు. వట్టి జడుడు. పుట్టింది మొదలు మాటా పలుకూ లేనివాడు. మొదట మూగవాడేమో అనుకున్నాం. కాదు కానీ దేనికీ ఏ విధమైన స్పందనా లేనివాడు. తోటివారితో ఆటపాటలెరుగడు. కావలసింది అడిగి తినడం తెలియదు. మంచి దుస్తులు కట్టుకోడు. బొమ్మలాడుకోడు. ఉపనయనం చేస్తే అయినా బాగుపడతాడేమో అనుకున్నాను. జడభరతుడి విషయంలో తండ్రి చేసిన ప్రయత్నాల్లా నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. సంతోషము, దుఃఖము వంటి మానవ సహజ స్పందనలేవీ లేని వట్టి నిస్పృహుడు. ప్రారబ్ధవశాన నా కడుపున పుట్టాడు. వీడిని మీరే ఉద్ధరించాలి స్వామీ!’’ అన్నాడు ప్రభాకరుడు. చేతిలోని ఉసిరికాయలను తనకు సమర్పించి, నమస్కరించి నిలబడిన పృథ్వీధరుని వంక ఆదరంగా చూశాడు శంకరుడు. ‘‘ఏం బాబూ! నీ పేరేమిటి? నువ్వెవరు?’’ అని ప్రశ్నించాడు. కుడిచేతిని పైకెత్తి పృథ్వీధరుని శిరస్సుపై ఉంచాడు. అప్పటివరకూ మాటాపలుకూ ఎరగడని, ఎవరితోనూ పన్నెత్తి మాట్లాడడని పేరుపడ్డ పృథ్వీధరుడు అప్పుడు ఆ క్షణంలోనే తొలిసారిగా ఆచార్య శంకరుని ప్రశ్నకు స్పందించాడు. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాఖిలోపాధిరాకాశ కల్పః రవిర్లోక చేష్టా నిమిత్తం యథా య స్స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా మనస్సు, నేత్రాలు వంటి ఇంద్రియాలు చేసే చేష్టలన్నింటినీ... సూర్యునిలా సాక్షీభూతంగా నిమిత్త మాత్రంగా చూస్తూ ఉండేదే ఆత్మ. అఖిల ఉపాధులూ ఆ ఆత్మయే పొందుతోంది. అయినప్పటికీ దేనికీ చెందకుండా ఉండిపోతుంది. నిత్యసచ్చిత్ స్వరూపమైన ఆ ఆత్మనే నేను. ముట్టుకుంటే కాల్చివేయడం అగ్నికి సహజం. తన గురించి తెలుసుకునే వారికి నిరంతరాయంగా కొత్త విషయాలేవో బోధిస్తూనే ఉండడం ఆత్మకు లక్షణం. మనస్సు, కన్నుల వంటి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే సంగతుల కంటే ఆత్మబోధ ఎక్కువ విలువైనది. నిత్యజ్ఞానానంద మయమైనది.అద్దంలో చూసుకుంటే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే చిత్తంలోకి చూసుకునే జీవులందరికీ పరమాత్మ కనిపిస్తున్నాడు. ఆ కనిపిస్తున్న ప్రతిబింబం పరమాత్మదే. సంశయం లేదు. అద్దాన్ని పక్కన పెట్టినా, ప్రతిబింబం మాయమవుతుంది కానీ, ముఖమే లేకుండా పోదు కదా! అలాగే మానవుడు తన బుద్ధిబలం చేత పరమాత్మను తెలుసుకోలేక పోయినా ఆయన లేడనలేం. నిజానికి పరమాత్మ కంటే భిన్నమైనది కూడా ఏదీ లేదు. అద్దంలో చూస్తున్నప్పుడు ఆభాసగానో, పక్కన పెట్టినప్పుడు నిరాభాసగానో మూడుకాలాల్లోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే. పరమాత్మ రూపగుణ రహితం, విలక్షణం. ఇంద్రియాల చేత ఆయనను దర్శించడం సాధ్యం కాదు. ఒకే సూర్యుడు వేర్వేరు కుండల్లో అనేక సూర్యుళ్లలా కనిపించినట్లు ఒకే పరమాత్మ అనేక జీవుల రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. జీవులందరిలోనూ ఉన్నది ఒకటే. సూర్యుడి వెలుగు ప్రసరించిన మేరకే మానవుని కన్ను చూడగలదు. బాహ్యపు వెలుగు చేరలేని తావుల్లో కూడా పరమాత్మ చైతన్యం ప్రసరించిన సమస్తాన్నీ దర్శించగలిగేది ఆత్మ మాత్రమే.చపలమైన బుద్ధి కలవారికి పరమాత్మ నానారూపిగా కనిపిస్తున్నాడు. బుద్ధి నిశ్చలమైన వాడికే ఈ ద్వైతభావన తొలగిపోతుంది. మబ్బులు కమ్మిన ఆకాశం సూర్యుణ్ణి కప్పేసినట్లు మూర్ఖుడి మనస్సు పరమాత్మ ప్రకాశాన్ని చూడనివ్వదు. మణులను కట్టివుంచే సూత్రంలా ఈ సమస్తంలోనూ పరమాత్మ ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ దేనినీ స్పృశించకుండా, నిస్సంగునిగా ఉంటాడు. నదిలో నీరు కదలాడుతుంటే చందమామ కదిలి పోతోందని భ్రమపడతాం. అలాగే సర్వవ్యాపక పరమాత్మ ఉనికిని కూడా చంచలించే బుద్ధితో తెలుసుకోలేం. విచారించి చూస్తే పరమాత్మ నిశ్చలం, పరిశుద్ధం, పరిపూర్ణం, నిర్వికారం, స్వయం ప్రకాశం, శివం ... నిత్యబోధా స్వరూపం. ఆ పరమాత్మయే నేను. ఒక్క అర్భకుడైన బాలుడు... అది కూడా వట్టి జడుడు అని అందరిచేతా ముద్ర వేయించుకున్న వాడు బ్రహ్మతత్త్వాన్ని కవిత్వధాటితో వివరించడం అక్కడున్న అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. పృథ్వీధరుని శిరస్సు పైనుంచి తన చేతిని వెనక్కు తీసుకున్నాడు శంకరుడు. అంతటితో ఆ బాలుని వాగ్ధాటి కట్టుబడింది. లేచి నిలబడి దూరంగా వినయంగా నిల్చున్నాడు. ‘‘ప్రభాకరాచార్యా! నీ పుత్రునిలో వాయుదేవుని అంశ కనిపిస్తూ ఉన్నది. ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఆ కారణం చేతనే పుట్టింది మొదలు ఇహలోక విషయాలతో సంగత్వం ఏర్పరుచుకోవడం ఇష్టంలేక నిర్వికల్ప సమాధిలోనే గడుపుతున్నాడు. మీ కంటికి స్పందనలే లేని వట్టి జడపదార్థంగా కనిపిస్తున్నాడు’’ అన్నాడు శంకరుడు. ‘‘మహాతపస్వులైన ఋషులు ఎంతో సాధన చేస్తే కానీ తెలియని స్వీయజన్మ రహస్యాలు ఈ బాలుడికి పుట్టుకతోనే తెలియడం వింత కదా! కొందరిలోనే ఇలా ఎందుకు జరుగుతుంది?’’ ప్రశ్నించాడు ప్రభాకరుడు. ‘‘జగత్తుకు కారణమైన నిరతిశయ సూక్ష్మపదార్థానికే సత్ అని పేరు. అదే ఆత్మ. జీవులందరూ అక్కడినుంచి వచ్చినవారే. ఈ ఎరుక కొందరిలోనే ఉంటుంది. అయినప్పటికీ ప్రతివారూ నిత్యమూ ఈ సత్తును చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ దానిలో లీనమవుతూ, దూరమవుతూనే ఉన్నారు. జీవుడు తన స్వరూపమునందు విలీనమయ్యేది గాఢనిద్ర తప్ప మరేమీ కాదని బ్రహ్మవేత్తల అభిప్రాయం. నిద్రిస్తున్న వ్యక్తి – స్వమ్ అపీతః భవతి – తనదైన స్వరూపమును పొందుతున్నాడు అని చెబుతారు. స్వస్వరూపంలో నిలిచివుండడం వల్లనే అతడిలోని అలసట తొలగిపోతోంది. హాయిగా నిద్రించిన వ్యక్తికి అలసట తొలగిపోవడం, రోగాలు కుదురుకోవడమే ఇందుకు తార్కాణం. ఇది దైనందిన చర్య. కాగా అంత్యదశలో దేహం శిధిలం అయినప్పుడు, అజ్ఞాని అయినవాడు మరో దేహాన్ని వెతుక్కుంటాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లే మళ్లీ జన్మిస్తాడు. అతడికి పూర్వస్మృతి ఉన్నందువల్లనే పుట్టిన వెంటనే ఆహారం కోసం ఏడుస్తున్నాడు. తల్లిపాలు అందగానే తాగుతున్నాడు. భయం వేస్తే ఆశ్రయం పొందాలని, అలసట వస్తే నిద్రపోవాలని ఏ జీవికీ ఒకరు చెప్పాల్సిన పనిలేదు. పుట్టుకతోనే అది తెలుసు’’ వివరించి చెప్పాడు శంకరుడు. ‘‘అయితే నిద్ర, మరణం ఒక్కలాంటివే అంటారా?’’ అడిగాడు ప్రభాకరుడు. ‘‘మీగడ చిలుకుతుంటే దానిలోని సూక్ష్మధాతువు వెన్నగా పైకి తేలుతుంది. నెయ్యిగా మారుతుంది. అలాగే మనం తినే అన్నంలోని సూక్ష్మధాతువు పైకి తేలి మనసుగా మారుతుంది. తాగుతున్న నీటిలోని సూక్ష్మధాతువు ప్రాణం అవుతుంది. మనం స్వీకరిస్తున్న తేజోద్రవ్యంలోని సూక్ష్మధాతువు వాక్కు అవుతోంది. ఆహారం తీసుకుంటేనే మనస్సు పనిచేస్తుంది. తీసుకున్న ఆహారంలోని సూక్ష్మతమ ధాతువు మనస్సులో శక్తి నింపుతోంది. ఆ మనశ్శక్తియే మనిషిలో పదహారు కళలుగా మారుతుందని వేదం చెబుతోంది. ఆహారంలోని సూక్ష్మధాతువులు మనస్సు, ప్రాణం, వాక్కు అనే అంతరింద్రియాలను వర్ధిల్ల చేస్తాయి. ఇదంతా జీవించి ఉన్నప్పటి సంగతి...’’ అని ఆగాడు శంకరుడు. ‘‘మరి మరణావస్థలో ఏం జరుగుతుంది?’’ అనుబంధ ప్రశ్న వచ్చింది. ‘‘మరణిస్తూ ఉన్న మనిషిలోని వాగింద్రియం మనస్సులోనికి ఉపసంహరింప బడుతుంది. అప్పుడు పలుకు ఉండదు. మనస్సు కేవలం సంకల్ప వికల్ప రూపమైన చలనంతో మాత్రమే నిలిచి ఉంటుంది. ఈ ఉపసంహారం రెండో దశలో మనస్సు కూడా నిద్రావస్థలో మాదిరిగానే ప్రాణంలో విలీనమవుతుంది. పక్కనే ఉన్నవారు ఇతడికి స్మృతి తప్పినది అంటారు. అప్పుడు బాహ్యేంద్రియాలను తనలో ఇముడ్చుకున్న ప్రాణం శ్వాసతో పాటు పైకి ఎగదన్నుతుంది. చేతులు కాళ్లవంటి అవయవాలు కొట్టుకుంటుండగా మర్మస్థానాలను పెరికివేస్తోందా అన్నట్లు ప్రాణం ఉపసంహరింపబడి తేజస్సులో కలిసిపోతుంది. దేహంలోని వెచ్చదనం మాయమై మరణాన్ని పరులకు తెలియ చెబుతుంది. ప్రాణధారణకు చిహ్నమైన తేజస్సు సత్ అనే పరదేవతలో విలీనమై చల్లారిపోతుంది. ఆత్మతత్త్వంలో సత్యమైన నిష్ఠలేని జీవుడు ఏ మూలం నుంచి మేలుకొని ఒక దేహంలో ప్రవేశించాడో, అలాగే మరో దేహంలోనూ ప్రవేశిస్తాడు. అంటే పునర్జన్మ ఎత్తుతాడు’’ చెప్పాడు శంకరుడు. ‘‘జన్మ వెంట జన్మ రాదు కదా. వ్యవధానం ఉంటుంది కదా!’’ ప్రభాకరుని తదుపరి ప్రశ్న. ‘‘జీవుణ్ణి అంటిపెట్టుకున్న విషయవాసనలే జన్మపరంపరలకు కారణమవుతాయి. ఒకసారి ఉత్పన్నమైన విషయవాసన ఫలాన్ని అందించకుండా వేయికోట్ల యుగాల తర్వాత కూడా నశించదు. జ్ఞాని అయినవాడు తప్ప ఈ మానస వాసనలను అతిక్రమించలేడు. జ్ఞానికైనా, అజ్ఞానికైనా వాక్కు, మనస్సు, తేజస్సులు వరుసగా సత్ అనే పరదేవతలో లీనమయ్యే క్రమం ఒక్కటే. వారు తిరిగిరారు... వీరు తిరిగి వస్తారు. యోగి అయినవాడు అభయాన్ని పొందాడు. సామాన్యుడింకా భయంతో కూడిన జన్మ పరంపరలనే పరుగులు తీస్తూనే ఉన్నాడు. అదీ తేడా!’’ ‘‘కొందరు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని, ఆదిత్యమండలం ద్వారా సత్తును చేరుకుంటారని... వారు కోరుకున్న జన్మ పొందుతారని....’’ ‘‘అది తప్పు. జ్ఞాని అయినవాడికి సర్వకామనలు ఇక్కడే విలీనమైపోతాయి. దేశ, కాల, కారణ కార్యాలు, కర్మఫలాలు వంటి మి«థ్యా విషయాల్లో జ్ఞాని అయినవాడు సత్యత్వ భావన పెంచుకోడు...’’ ఇంకా ఏదో చెప్పబోయాడు శంకరుడు. అంతలోనే అప్పటివరకూ మౌనంగా ఉన్న çపృథ్వీధరుడు అందుకుని, ‘‘సత్యజ్ఞానానికి మి«థ్యాభినివేశం ఉండదు. సత్ సాక్షాత్కారం కాగానే సర్వకామనలూ అగ్నిలో వలే దగ్ధమైపోతాయి. అటువంటి వారికి పునరావృత్తి ఉండదు అని ఆచార్య శంకరులే తమ ఛాందోగ్యోపనిషత్ భాష్యంలో చెప్పారు’’ అన్నాడు.శంకరుడు అతడి వంక ఆదరంగా చూశాడు. ప్రభాకరుని వైపు తిరిగి, ‘‘ఆచార్యా! గృహస్థులైన మీకు ఇటువంటి కుమారుని వల్ల ప్రయోజనం ఉండదు. మాలో ఒకనిగా ఇతడిని పంపించండి. తప్పక రాణిస్తాడు. సన్యాసి అయినవాడి వంశంలో వెనుకటి ఏడు తరాలు తరిస్తాయని పెద్దలమాట’’ అన్నాడు. ప్రభాకరుడు ఆ ప్రతిపాదనకు ఆనందంగా అంగీకరించాడు. తల్లిదండ్రుల అనుమతితో గంగాతీరంలో పృథ్వీధరునికి క్రమసన్యాసాన్ని అనుగ్రహించాడు శంకరుడు. తన వద్దకు చేతిలోని ఉసిరికాయలతో వచ్చి, ఆత్మతత్త్వాన్ని కరతలామలాకంగా వివరించిన çపృథ్వీధరునికి హస్తామలకాచార్యుడు అనే యోగనామాన్ని ఇచ్చాడు. ప్రణవదీక్ష తరువాత, ఛాందోగ్యోపనిషత్తు ప్రబోధించిన తత్త్వమసి మహావాక్యాన్ని బోధించాడు. స య ఏషోణిమై తదాత్మ్య మిదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్త్వమసి... – అణురూపమైన ఆత్మకే సత్ అని పేరు. దానివల్లనే జగత్తంతా ఆత్మతో కూడినది అయింది. జగత్తుకు అసలు రూపం ఆ ఆత్మే. ఆ సత్ రూపం నువ్వే అవుతున్నావు అని చెప్పాడు. తంతు ముగిసింది. ప్రభాకరుని వద్ద సెలవు తీసుకునే ముందు శంకరుడు అడిగాడు. ‘‘ఆచార్యా! తమ గురుదేవులైన భట్టపాదులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?’’ అని. ‘‘త్వరలో వారు ప్రయాగకు రావచ్చని తెలుస్తోంది స్వామీ! మీరు కోరుకుంటే అప్పటివరకూ...’’ ‘‘ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. గురువుల ఆదేశం మేరకు మేము సత్వరమే వారణాసికి చేరుకోవాలి. భట్టపాదులు వచ్చారని తెలిసిన వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకుంటాం’’ అంటూ శంకరయతి శిష్యసమేతంగా వారణాసికి ప్రయాణం కట్టాడు. ప్రయాణమంతా శిష్యులకు ‘తత్త్వమసి’ మహావాక్య విచారణతోనే సరిపోయింది. ‘‘సరే.... మనమంతా సత్ నుంచి వచ్చాం. మళ్లీ అందులోనే విలీనమైపోతున్నాం. ప్రతిరోజూ నిద్రా సమయంలో సత్తును కలుస్తూనే ఉన్నాం. కానీ దానినెందుకు తెలుసుకోలేకపోతున్నాం?’’ ‘‘తేనెటీగలు రకరకాల చెట్ల పువ్వుల నుంచి తేనె సేకరించి ఒకచోట పోగు చేస్తాయి. ఆ పోగులో ఏ రసభాగం ఏ చెట్టుదో చెప్పలేం. స్వయంగా ఆ రసాలు కూడా తెలుసుకోలేవు. అలాగే మనుషులు కూడా సత్పదార్థాన్ని చేరుకున్న తర్వాత తాము కూడా అదే అవుతారు. అందులో కలిసిపోయామని కూడా ఎరుగలేరు.’’ ‘‘రసాంశాలన్నింటినీ తనలో కలిపేసుకునే సత్పదార్థం చాలా పెద్దది కదా... అయినా తెలుసుకోలేమా?’’ ‘‘కాదు. అది చాలా సూక్ష్మమైనదని ముందే చెప్పుకున్నాం. సముద్రంలో కలిసిపోయిన మహానదుల్లా మనందరం అతి సూక్ష్మమైన సత్పదార్థంలో విలీనమైపోతాం. అక్కడినుంచే వచ్చామని, అక్కడే కలిసిపోయామని తెలుసుకోలేం.’’‘‘అయితే ఆ సత్తులో కలిసిపోవడానికి మరణం కోసం ఎదురుచూడడమే జన్మకు లక్ష్యమా?’’ ‘‘కాదు... జీవమున్నంత కాలం జీవించడమే పరమార్థం. ఒక జీవవంతమైన చెట్టును మూలంలో కొట్టినా, మధ్యలో కొట్టినా, కొనకొమ్మ మీద కొట్టినా రసం కారుతుంది కానీ చచ్చిపోదు. ఏదో చీడపట్టి ఒక కొమ్మనుంచి జీవం పోతే ఆ కొమ్మ మాత్రమే ఎండిపోతుంది. జీవం ఉన్నదేదైనా చావదు. జీవశక్తి ఉన్నంతకాలం దేహం నిలిచి ఉంటుంది. శరీరం నిశ్చయంగా మరణిస్తుంది. కానీ జీవం ఎన్నటికీ చావదు. విత్తనంలో దాగివున్న మర్రిచెట్టులా జీవం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. సూక్ష్మమైన జీవమే సత్. అదే మనం. నీటిలో ఉప్పు కరిగిపోయిన తరువాత ఉప్పుకణికలను మనం చూడలేం. రుచిద్వారా తెలుసుకోగలం. ఇంద్రియాలకు కనిపించక పోయినా, ఉప్పులాంటి ఆ సత్పదార్థం కరిగి జగత్తంతా ఉంది. దాన్ని యోగంతోనూ, గురూపదేశంతోనూ మాత్రమే కనుక్కోగలం.’’ ‘‘గురువు కూడా మనలాంటివాడే కదా! నిజంగా దారి చూపగలడా?’’ ‘‘ఒకడికి కళ్లకు గంతలు కట్టి వేరే దేశానికి తీసుకువచ్చి ఒక అడవిలో వదిలేశామనుకో. తిరిగి తన దేశానికి వెళ్లే దారి తెలియక గోలపెడతాడు కదా! అలాగే పరమాత్మ ఇంటినుంచి మనమంతా మోహమనే గంతలు కట్టుకుని ఈ లోకంలోకి వచ్చిపడ్డాం. ఎవరో మహాత్ముడు మళ్లీ మనకు వెనక్కు వెళ్లే దారి చెప్పాలి. మధ్యమధ్యలో కనిపించిన వారిని కనుక్కుంటూ పట్టు విడవకుండా ప్రయాణించాలి. సత్పదార్థాన్ని ఎరిగిన మహాకారుణికుడైన గురువే కనుక లేకపోతే, మనం నడుస్తున్న దారిలోని సాంకేతిక దోషాలను ఎత్తి చూపకపోతే సత్ అనే అసలు చోటికి దారి తెలియనే తెలియదు. గురూపదేశంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకున్న వాడు మాత్రమే బ్రహ్మములో ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు. అతడే మరోసారి కళ్లకు గంతలతో తన ప్రమేయం లేకుండానే ఎక్కడెక్కడికో తీసుకుపోబడడు.’’ యతిబృందం వారణాసిలో ప్రవేశించింది. ఆరోజు కలియుగాది 2,609 శ్రీకీలక నామ సంవత్సరంలోని (క్రీ.శ. 492) చైత్ర శుద్ధ అష్టమి. శంకరునికి పదహేడో ఏడు ప్రవేశించబోతోంది. శంకరుని అసలు ఆయుర్దాయం పదహారేళ్లే అని అగస్త్యుడు చెప్పిన గడువు అప్పటికి ఇరవై ఏడు రోజుల్లో ముగియబోతోంది. శంకరుడు అప్పుడు కాలభైరవ స్వామి సన్నిధిలో ఉన్నాడు. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
అటు నుంచి నరుక్కురా!
ప్రజాపతి బ్రహ్మ పలుమార్లు యాగాలు చేసిన చోటు కనుక ప్రయాగ అని పిలిచారు. నూరు యాగాలు చేసిన ఫలితం ప్రయాగ నివాసంతో లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుంచి ఎందరెందరో ఋషులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పంచమాధవులో ఒకడైన వేణీమాధవుడు వెలిసిన చోటది. సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన చోటది. అన్నింటికంటే మిన్నగా ప్రయాగ క్షేత్రాన్ని ప్రస్తావించినప్పుడు చెప్పుకోవలసింది అక్షయ వటవక్షాన్ని గురించి. మహాప్రళయ వేళ విష్ణుమూర్తి ఆ మర్రియాకుపైనే తెప్పగా తేలి వటపత్రశాయి అవుతాడని చెబుతారు. యుగాల తరబడి అలాగే నిలిచివుంది. చరిత్రలో ఒకనాడు మతమౌఢ్యంతో కొందరు రాజులు తరాల తరబడి దీక్షగా ఆ చెట్టుని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కొమ్మలు నరికించినా, మొదలు నరికించినా, కాచిన నూనెను పోయించినా చెట్టుమాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. ... ఆ చెట్టుకింద ఎవరో కుష్టురోగి ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నాడు. ఊడలను మెడకు ఉరిబెట్టుకో బోతున్నాడు. పరుగు పరుగున వెళ్లి అతణ్ణి ఆపాడు పద్మపాదుడు. గురువైన శంకరుని ముందు ప్రవేశపెట్టాడు. మిగిలిన శంకర శిష్యులు కాస్త దూరంగా జరిగారు. ఒళ్లంతా పుళ్లు పడి ఆ కుష్ఠురోగి శరీరం నుంచి దుర్గంధం వస్తోంది. ఆచార్య శంకరుడు అతడికి స్వయంగా ఉపచారాలు చేశాడు. ఆయన అమతహస్త ప్రభావమో, చికిత్సల్లో గొప్ప గుణం ఉందో తెలియదు కానీ, ఆ కుష్ఠురోగికి పూర్తిగా నయమైంది. మునుపటి రూపం వచ్చింది. తన శరీరం కేసి ఒకసారి చూసుకుని, ‘‘స్వామీ! నన్ను నేనే గుర్తుపట్టలేకుండా ఉన్నాను. ఇక గతంలో నన్ను ఎరిగిన వారు కూడా గుర్తుపట్టలేరు. మళ్లీ పాత జీవితంలోకి వెళ్లాలనే కోరిక లేదు. నన్ను మీ శిష్యుల్లో ఒకనిగా చేర్చుకోండి. నాకు కూడా సంన్యాసం అనుగ్రహించండి’’ అని వేడుకున్నాడు. ‘‘కుదరదు. నీవంటి దుర్బల మనస్తత్వం ఉన్నవారికి సంన్యాసం ఇవ్వడం సాధ్యం కాదు. ఆత్మహత్యకు పాల్పడ్డ నీకు మోక్ష కారణమైన సంన్యాసం స్వీకరించే అర్హత లేదు’’ అని నిర్ద్వంద్వంగా అతడి అభ్యర్ధనను తోసిపుచ్చాడు శంకరుడు. ‘‘నీకు ఉదంకుడు అనే నూతన నామం ఇస్తున్నాను. హాయిగా వెళ్లి కొత్త జీవితాన్ని ఆరంభించు. నీ గత చరిత్ర ఎవరికీ చెప్పకు’’ అన్నాడు. ఉదంకుడు సెలవు తీసుకుని వెళ్లాడు. కానీ శంకరుడు చెప్పిన మాటను మాత్రం పాటించ లేదు. ఆచార్య శంకరుని చేయి తాకగానే తన రోగం మటుమాయమైపోయిందని... వెళ్లిన చోటల్లా, అడిగిన వారికీ అడగని వారికీ చెప్పుకుంటూ పోయాడు. అతడి నుంచి ఆ సంగతి విన్న వారందరూ శంకరుని దర్శించడానికి వచ్చేవారు. తమ బాధలేవో చెప్పుకుని ఉపశమనం కావాలని కోరేవారు. కానీ ఈ వైనం విన్న మొట్టమొదటి వ్యక్తి మాత్రం శంకరుని ఊసే పట్టించుకోలేదు. కాకతాళీయంగా శంకరుడే స్వయంగా ఒకరోజున ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరాడు. అతడే ప్రభాకరుడు... నివాస పట్టణం ప్రతిష్ఠానపురం. ప్రయాగ క్షేత్రానికి అత్యంత సమీపంలో గంగకు ఆవలి ఒడ్డున ఉన్నదే ప్రతిష్ఠానపురం. చంద్రవంశ క్షత్రియులు పాలిస్తున్న ప్రాంతం. నిత్యాగ్నిహోత్రులైన కర్మిష్ఠులతో నిండిపోయింది. ఆ పురప్రముఖులలో అగ్రస్థానంలో ఉన్నవాడు ప్రభాకరాచార్యుడు. సొంతవూరు గోకర్ణ క్షేత్రం కాగా, చాలాకాలం క్రిందటే అక్కడ స్థిరపడ్డాడు. ప్రభాకరుడు పూర్వమీమాంసా శాస్త్రానికి దిక్సూచిగా వెలుగొందుతున్న కుమారిల భట్టుకు అనుంగు శిష్యుడు. కుమారిల భట్టు మార్గంలో ఉన్నవారంతా కర్మకాండలే ప్రధానమని, వేదాలు ప్రబోధించినది కర్మమార్గమేనని దృఢంగా నమ్మేవారు. అటువంటి వారందరికీ గురుస్థానంలో ఉన్నవాడు ప్రభాకరాచార్యుడు. ‘ఎంతటి మహిమాన్విత యోగి అయినా తనను చూడడానికి వస్తున్నాడంటే, అతనికంటే నేనే గొప్ప కదా!’ అనిపించింది ప్రభాకరుని మనస్సులో. కానీ ఆ భావం చివరిదాకా నిలబడలేదు. శంకర దర్శనమైన క్షణం నుంచే అతడి చిత్తం క్రమంగా కరగడం ప్రారంభించింది. శంకరుడు రానే వచ్చాడు. ప్రభాకరుడు అసంకల్పితంగా సాష్టాంగపడి, ఆసనమిచ్చి అర్చించాడు. శంకరుడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగాడు. ‘‘ప్రభాకరాచార్యా! జ్ఞానమే ప్రధానమని చెప్పే ఉపనిషత్ మత ప్రవర్తకులం మేము. కర్మమార్గమే ప్రధానంగా ఎంచుకుని పవిత్రజీవనం సాగిస్తున్నవారు మీరు. వేదమే ప్రమాణమని మేమూ అంగీకరిస్తాం. విధి, అర్థవాదం, మంత్రం, నామధేయమనే వేదవిభాగాలలో విధికే ప్రాముఖ్యమిస్తారు మీరు. శబ్దభావన ముఖ్యమని మీ గురువైన భట్టపాదులు బోధిస్తారట. మీరేమో వేదాన్ని ఆజ్ఞలుగా స్వీకరించే నియోగానికే ప్రాధాన్యమిస్తారని విన్నాం. మీ వాదనలు వినాలని, మీ గురుశిష్యులిద్దరినీ గురించి తెలుసుకోవాలని కోరిక. దయచేసి చెప్పగలరా?...’’ శంకరుని మాటలు విన్న ప్రభాకరుడు పొంగిపోయాడు. ‘‘నా గురించి చెప్పడానికేమీ లేదు స్వామీ! మా గురువు గురించి చెబుతాను. ఆయన చేసిన లోకోత్తర త్యాగాలను గురించి మీ వంటివారు వినాలి. పదిమందికి తెలిసేలా వాటిని చెప్పి తీరాలి’’ అన్నాడు. ‘‘మా ప్రార్థన కూడా అదే’’ అన్నాడు శంకరుడు. తన గురువైన కుమారిలభట్టు కథను ప్రభాకరాచార్యుడు చెప్పడం మొదలుపెట్టాడు. భట్టపాదుడు కలియుగాది 2,545లో జన్మించాడు. ఆయన జన్మస్థలం ఓఢ్రదేశంలోని మహానదీ తీరంలో ఉన్న జయమంగళం. ఆయన తల్లిదండ్రుల పేర్లు చంద్రగుణ, యజ్ఞేశ్వరులు. వారు తెలుగువాళ్లే. జైమిని మహర్షి అడుగు జాడల్లో నడుస్తూ వేదవిహితమైన కర్మకాండలను ఆచరించేవాడు భటపాదుడు. పూర్వమీమాంసా శాస్త్రంపై అనేక గ్రంథాలు కూడా వెలువరించాడు. ఎందరికో ఆచార్యస్థానంలో నిలిచాడు. అప్రతిహతంగా సాగిపోతున్న భట్టపాదుని గాథను మలుపు తిప్పినవాడు వర్థమాన మహావీరుడు. కాశ్యప గోత్రంలో సిద్ధార్ధుడనే సామంత రాజుకు వర్ధమాన మహావీరుడు జన్మించాడు. రాజ్యం చేపట్టకుండా విరాగియై తీవ్ర తపస్సు చేశాడు. అతడిని నిర్గ్రంథులు ఇరవైనాలుగో తీర్థంకరునిగా గుర్తించారు. పూర్వవైదిక యుగాల్లోని తీర్థంకరులందరూ మన సనాతన ధర్మాన్ని అంగీకరించిన వారే. వారి ఆదినాథుడైన వృషభదేవుడు మనకు పూజనీయుడే. శివమహిమ్నా స్తోత్రం రచించిన మన పుష్పదంతుడు వారి తీర్థంకరుడే. పూర్వజన్మలో అతడే మరీచి మహర్షి అని జైనులు చెప్పే వర్ధమాన మహావీరుడు మాత్రం వేదప్రామాణ్యాన్ని అంగీకరించ లేదు. బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే దైవంతో పని లేకుండానే కైవల్యం పొందవచ్చునని బోధించాడు. రాజకుటుంబం నుంచి వచ్చినవాడు కనుక త్వరలోనే రాజవంశాల వారందరినీ ఆకట్టుకున్నాడు. మిధిల, కోసల, మగధరాజ్య ప్రభువులందరూ క్రమంగా జైనమతాన్నే అనుసరించడం మొదలుపెట్టారు. మతానికి రాజకీయం తోడైంది. అహింసనే ప్రధానంగా బోధించిన ఆ మతంలో తొందరలోనే పరమత అసహనం పెచ్చుమీరింది. వర్ధమానుడు జీవించి ఉండగానే ఆయన శిష్యులు చెలరేగడం ప్రారంభించారు. యజ్ఞయాగాదులు ధ్వంసమైపోతుంటే పూర్వాచార పరాయణుడైన మా గురువు చేతులు ముడుచుకుని కూర్చోలేకపోయాడు. ముప్పై ఏళ్ల వయస్సులోని మిసిమి యవ్వనం ఆయనను కూర్చోనీయ లేదు. ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డాడు. పేరు మార్చుకుని వర్ధమాన మహావీరుని శిష్యునిగా చేరిపోయాడు. కానీ ఈయన అక్కడ చేరిన కొత్తలోనే వర్ధమానుడు నిర్వాణం చెందాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు మహావీరుని ప్రధాన శిష్యులైన గౌతముడు, మైత్రేయుడు, సుధర్ముడు, ప్రభాసుడు వంటివారి వద్ద భట్టపాదుడు శిష్యరికం చేశాడు. జైనమత ప్రబోధాలను, సిద్ధాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. కొంతకాలం ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు. మహావీరుని బోధనలను సంకలనం చేయడం మొదలైంది. గ్రంథ రచన సాగుతుండగా భట్టపాదుడు కూడా అందులో భాగస్వామి అయ్యాడు. అక్కడ వేద ధర్మానికి వ్యతిరేక భావాలు వచ్చినప్పుడల్లా ఈయన వాటిని ఖండించడం మొదలు పెట్టాడు. వాదవివాదాలతో గ్రంథరచన ముందుకు సాగలేదు. దాంతో మహావీరుని శిష్యులకు అనుమానం వచ్చింది. ఒకటికి పదిసార్లు ఆయనను నిలదీశారు. ‘నువ్వు వేదమతాభిమానివే కదా... ఏ దురాలోచనతో మాలో చేరావో చెప్ప’మంటూ పలురకాలుగా హింసించారు. కానీ ఆయన బయట పడలేదు. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఏవేవో సమాధానాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. వారు పెట్టే బాధలను పెదవి బిగువున ఓర్చుకున్నాడు. చివరకు ఓ రోజున వారంతా కలిసి ఓ పన్నాగం పన్నారు. నిద్రపోతున్న సమయంలో ఎత్తయిన భవనం మీదనుంచి ఆయనను కిందికి తోసి.... పీడ విరగడ చేసుకోవాలని భావించారు. కానీ నిద్ర నటిస్తున్న భట్టపాదులకు వారి ఆంతర్యం తెలుసు. అయినప్పటికీ ప్రతిఘటించలేదు. అనుకున్నట్లుగానే వారంతా కలిసి మేడమీద నుంచి ఆయనను కిందికి దొర్లించేశారు. కిందికి పడుతుండగా ఆయన, ‘వేదాలే ప్రమాణమైతే నేను రక్షింప బడుదును గాక!’ అని శాసనం చేశాడు. అన్నట్లుగానే ఆయనకేమీ కాలేదు. కానీ ఒక కన్ను పోయింది. ‘ఎందుకిలా జరిగింది గురుదేవా!’ అని అడిగాను నేను. ‘వేదాలే ప్రమాణం కనుక నేను రక్షింప బడుదును గాక! అనలేదు నేను గమనించావా...’ అని వివరణ ఇచ్చాడాయన. ఏదేమైనా ఆ సంఘటన తరువాత మాలో వేదధర్మం పట్ల విశ్వాసం ఇనుమడించింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై రెండేళ్లయింది. ఇప్పుడు మా గురువు మధ్యందిన మార్తాండుడై అవైదిక మతాలపై నిప్పులు చెరుగుతున్నాడు...’’ ఇంతవరకూ చెప్పి ఆగాడు ప్రభాకరాచార్యుడు. ‘‘అవునవును. అటునుంచి నరుక్కురా! అనే నానుడికి కారణమయ్యాడని కూడా విన్నాను’’ అన్నాడు శంకరుడు నవ్వుతూ. ‘‘అందులో అధర్మమేదీ లేదు ఆచార్యా! నిజానికి మెచ్చుకోవలసిన సంగతి కూడా అది. పూర్తి వివరాలు చెబుతాను... చిత్తగించండి’’ అంటూ ఆ కథను ఇలా ప్రారంభించాడు ప్రభాకరుడు. అశోక చక్రవర్తి కాలానికి మగధకు సామంతరాజ్యమే అయిన విదర్భ తరువాతి కాలంలో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ప్రస్తుతం ఆ రాజ్యానికి రాజధాని అమరావతి. పాలకుడు సుధన్వుడు. ఆయనకు చార్వాక, జైన, బౌద్ధ వంటి నాస్తిక మతాలపై ప్రీతి ఎక్కువ. వారితో ఎల్లప్పుడూ చర్చలు చేస్తుండేవాడు. సుధన్వుని పట్టపురాణి పూర్వాచార పరాయణురాలు. భర్త మనసు మరలించమని భట్టపాదుని ప్రార్ధించింది. ఆయన అంగీకరించాడు. దేవాలయాలు కట్టించడం, చలివేంద్రాలు పెట్టడం వంటి పనుల వల్ల బాటసారులకే ప్రయోజనం కానీ, రాజ్యానికి కలిసి వచ్చేదేమీ లేదని వాదించేవారు చార్వాకులు. విబూది పూసుకోవడం పౌరుషహీనులు చేసే పని. వ్యవసాయం, వర్తక వాణిజ్యాలు పెంచాలి. దండనీతి అమలుచేసి డబ్బు సంపాదించాలని రాజుకు బోధించేవారు. ఈ లోకం కంటే భిన్నంగా స్వర్గనరకాలు ఎక్కడో లేవు అనే చార్వాకులతో భట్టపాదుడు తలపడ్డాడు. వేదాలు అపౌరుషేయాలు కావు అని వాదించే జైనులకు అవి పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వేదమంత్రాలను విన్న ఋషులందరూ ద్రష్టలే కానీ వాటిని సష్టించిన వారు కాదు అని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. సృష్టిలో ఈ క్షణమే ఉంది కానీ గతమంటూ లేదు. అసలు గతమెప్పుడూ ఇలా లేదు. భవిష్యత్తు కూడా ఇలా ఉండబోదు. ఇది నిత్య పరిణామశీలం అని వాదించే బౌద్ధులకు పాపం పునర్జన్మపై మాత్రం మక్కువ ఎక్కువ. అప్పటికే ముక్కలు చెక్కలైపోయిన బౌద్ధులకు విడివిడిగానూ, ఉమ్మడిగానూ మా గురువు సత్యబోధ చేయడానికి ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు. చివరకు, ‘కనిపించే ఆ పర్వత శిఖరం పైనుంచి దూకి, చెక్కు చెదరకుండా వచ్చినవారి మతమే గొప్పది’ అని మొండివాదంలోకి దిగాడు. పీడ విరగడవుతుందని అందరూ సంతోషించారు. – సశేషం -నేతి సూర్యనారాయణ శర్మ -
ఆదిగురువు ఆయనే..
‘‘కైలాసగిరికి సమీపంలోని కింపురుష లోకంలో సౌగంధికవనం ఉంది. అక్కడ వంద యోజనాల పొడవు, ఏడువందల యోజనాల వెడల్పు కలిగిన వటవృక్షం ఉంది. దానికి ఏడాది పొడవునా మాణిక్యాల్లా మెరిసే పళ్లు కాస్తాయి. ఆ మహావటవృక్ష విస్తీర్ణం వల్ల ఏ పొద్దులోనూ నీడ తిరగదు. సమశీతోష్ణ స్థితి ఉంటుంది. ఆ వటమూలంలో శాంతవిగ్రహుడు, లోకమంగళదాయకుడైన శివుడు దక్షిణామూర్తిగా నిత్యయవ్వనునిగా కొలువుతీరి ఉంటాడు. జ్ఞానముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేత అందరి సందేహాలనూ తొలగించే ఆదిగురువు ఆయనే. సనాతనుడు, బ్రహ్మమయుడైన ఆ స్వామిని యోగులు, ఋషులు, సిద్ధులు, కుబేరాది యక్షులు, కింపురుషులు ఎల్లవేళలా సేవిస్తూ ఉంటారు. జగద్గురూ! రేపటి పౌర్ణమినాడు ఆ దక్షిణామూర్తి సన్నిధిలో అఖిల మునిగణాలూ సమావేశం కానున్నాయి. ఈసారి నీతో కలిసి నన్నూ అక్కడికి రమ్మని గురువుల ఆదేశం’’ అన్నారు గోవింద భగవత్పాదులు. వెంటనే దండకమండలాలు చేతబట్టి ప్రయాణానికి సిద్ధపడ్డాడు శంకరుడు. గోవిందులు మాత్రం కూర్చున్న చోటినుంచి కదలకుండా, ‘‘జగద్గురూ! ఈవేళ చలి ఎక్కువగా ఉన్నట్లుంది కదూ... ఇప్పటివరకూ స్నానం చేయడమే పడలేదు’’ అన్నారు చిరునవ్వు నవ్వుతూ. ఒక్కక్షణం విస్మయంగా గురువు వంక చూశాడు శంకరుడు. చివాలున అక్కడి నుంచి లేచివెళ్లాడు. కొద్దిదూరంలో మంచును తవ్వి స్నానకుండాన్ని ఏర్పాటు చేశాడు. సలసల కాగిపోతూ, పొగలు కక్కుతున్న నీటితో నిండిపోయిందా కుండం. ‘‘జగద్గురూ! నీ గురుభక్తికి ఇది గొప్ప ప్రతీక’’ అంటూ ఆ తప్తకుండంలో గోవింద భగవత్పాదులు స్నానం పూర్తి చేశారు. బదరీ నారాయణుణ్ణి అర్చించారు. గురుశిష్యులిద్దరూ కైలాసాచలానికి ప్రయాణమయ్యారు. శంకర శిష్యులు కూడా బయలుదేరబోయారు కానీ, వారెవరికీ అనుమతి లేదని గోవిందులు చెప్పడం వల్ల అందరూ బదరికాశ్రమంలోనే ఉండిపోవలసి వచ్చింది. గురుశిష్యుల ప్రయాణం వాయువేగ మనోవేగాల మీద సాగింది. కైలాస పర్వతం సమీపంలో మానవ నేత్రాలకు అగోచరం అయిన దారుల్లో నడుస్తూ ముందుకు వెళ్లారు వారిద్దరూ. అక్కడ వటవృక్షం దర్శనమిచ్చింది. అశేషసంఖ్యలోని మునిగణం ఆ నీడలో పరివేష్ఠించి ఉంది. బదరికాశ్రమం నుంచి అక్కడివరకూ సాగిన ప్రయాణం ఒక ఎత్తు... అక్కడి నుంచి లోనికి సాగుతున్న ప్రయాణం ఒక ఎత్తుగా ఉంది. ఆదిగురువును చేరుకోబోతున్న జగద్గురు శంకరుని మానసం స్తోత్రమై పరిమళించింది. ఒక చేతితో జ్ఞానముద్రను, మరోచేతిలో గొడ్డలిని, వేరొక చేతిలో లేడిని ధరించిన వాడై నాలుగో చేతిని మోకాలిపై పెట్టుకుని కూర్చుని ఉన్న గురుశిరోమణి నాకు ప్రత్యక్షమగును గాక! అన్నాడు శంకరుడు. అతడి అభీష్ఠం వెనువెంటనే నెరవేరింది. మర్రిచెట్టు క్రింద చిరునవ్వు మోముతో, మహామునుల సందేహాలను కేవలం మౌనంతో తొలగిస్తున్న దయానిధి అయిన తొలిగురువును నేటికి కనుగొన్నాను. కాముని కాల్చిన బూడిదను ఒంటికి రాసుకుని, పెద్దపులి తోలు ధరించి, అజ్ఞానమనే సముద్రానికి బడబాగ్నిగా వెలుగొందుతున్న గురువర్యుని నా భాగ్యవశాన చూడగలుగుతున్నాను అన్నాడు శంకరుడు పరవశంతో. చంద్రుని కళలన్నింటినీ కరిగించి పోతపోసినట్లున్న మేను గలవాడు, ముత్యాలతో నిలువెల్లా పొదిగినట్లున్నవాడు, అజ్ఞానపు చీకటికి ప్రభాతకాలం వంటివాడైన గురువర్యుని చూస్తున్నాను. ఆయన కుడిమోకాలుపై ఎడమ కాలు పెట్టి యోగపట్టంలో కూర్చుని ఉన్నాడు. ధ్యానసమయంలో స్మృతి తొలగడం వల్ల మోకాలిపై ఉన్న పాదం తొడమీదికి చేరింది. వయసులో చిన్నవాడిగా కనిపిస్తున్నా శిష్యులై తనను చేరిన మునులకు తత్త్వార్థం ఉపదేశించ డానికి ఆయనే సమర్ధుడు. ఆశ్చర్యకరమైన గుణాలకు అధిష్టానమైన ఆ గురువర్యునికి నా వెనుకటి పుణ్యబలం వల్ల నమస్కరించ గలుగుతున్నాను అంటూ వందనం చేశాడు. అక్కడ ఉన్న మహర్షులందరినీ శంకరునికి పరిచయం చేశారు గోవిందులు. వారిలో శంకరగురు పరంపరలోని గౌడపాదాచార్యులు, శుకమహర్షి, వ్యాసభగవానులు కూడా ఉన్నారు. ధన్యత్వ çస్పృహతో వారందరికీ వందనం చేశాడు శంకరుడు. శుకమహర్షి ముందుకు వచ్చి, ‘‘జగద్గురూ! ఏ గురువు సన్నిధిలో మాటలు లేకుండా కేవలం మౌనంతోనే సందేహాలన్నీ పటాపంచలవుతాయో ఆ మహాగురువు ఈ దక్షిణామూర్తి. ఈయనను నువ్వేమైనా కోరవచ్చు’’ అని పలికాడు. ‘‘అంతు లేని కారుణ్యమనే అమృత తరంగాలు ఆయన కన్నులలో నిండి ఉన్నాయి. తన కడగంటి చూపులతో మునులకు మార్గోపదేశం చేసే గురువులకే మూలగురువు అయిన స్వామికి నమస్కారం. ఆయన నాకిప్పుడే బ్రహ్మవిద్యను ఉపదేశించు గాక!’’ అని కోరుకున్నాడు శంకరుడు. దక్షిణామూర్తి ముఖమండలం నుంచి ఓంకారనాదం వెలువడింది. శంకరునితో పాటు మునిగణమంతా ధన్యమైంది. ‘‘తమోరాశిని పారద్రోలే జ్ఞానముద్ర చేత మహాదేవుడు నీవే అది అని తెలిపే తత్త్వమసి మహావాక్యార్ధాన్ని నాకు బోధ చేయుగాక!’’ అన్నాడు శంకరుడు. అందుకు బదులుగా దక్షిణామూర్తి చేతిలో ప్రత్యక్షమైన వీణనుంచి అనిర్వచనీయమైన దివ్యనాదం వెలువడింది. వింటూవుంటే యుగాలకాలం దొర్లిపోయినట్లు అనిపించింది కానీ ఆ వీణానాదం కేవలం కొద్దిసేపే కొనసాగింది. తెల్లని శరీరం లేని, లలాటంపై మూడోకన్ను లేని, శాంతమైన వేషం లేని, సర్పాభరణాలు లేని, జ్ఞానముద్ర లేని, నిద్రావిజయం లేని, సాధకుని కోరికను నెరవేర్చలేని దేవతలతో మాకేమి పని? ఎందరు దేవతలు లేరు! కానీ వారెవ్వరూ నా మనస్సుకు నచ్చరు. జడబుద్ధులైన భక్తులను అనుగ్రహించేందుకే దక్షిణ దిక్కుకు తిరిగిన అఘోరమూర్తియే ఉత్తమ దైవం. లోకమనే ఇంద్రజాలాన్ని ప్రదర్శించడానికి ఆయన తేజస్సే సమర్థమైనది. శుకుడు వంటి మునులు మమకారం, కోరికలు లేనివారై ఎవరిని ఉపాసిస్తున్నారో అటువంటి దక్షిణామూర్తి రూపి అయిన మహేశ్వరుని అజ్ఞానమనే పెనుబాధ తొలగిపోవడానికి ధ్యానిస్తున్నాను అని శంకరుడు స్తోత్రం చేశాడు. మహర్షులందరూ తలలు ఊపి అనుమోదాన్ని తెలిపారు. ‘‘స్వామీ! కలుషం లేనివారి చిత్తాల్లో నీవు జటాధారివై, చంద్రకళతో, చూపుగల నుదురుతో కూడిన ముఖబింబంతో వెలుగుతున్నావు. అది సరే కానీ దేవా! నాకు అమ్మను చూపవా’’ అడిగాడు శంకరుడు. ఈసారి స్వామి నుంచి చిరునవ్వు తప్ప ఎటువంటి ప్రతిస్పందనా లేదు. ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి యదుద్యతే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానస చంద్రకాంతః ‘‘ఓ స్వామీ! ఉపాసకులకు నీలోనే పదిహేను కళలతో కూడిన అంబిక కూడా దర్శనమిస్తుంది. నీవు పూర్ణచంద్ర స్వభావాన్ని ప్రకటిస్తున్నావు. కాబట్టే నా మనస్సనే చంద్రకాంత శిల నీ దర్శనమైనంతలోనే ద్రవిస్తోంది’’ అని నమస్కరించాడు శంకరుడు. కొద్దిసేపటి నిశ్శబ్దం తరువాత... ‘‘జగద్గురూ!’’ అనే సంబోధనతో వ్యాసభగవానుడు ఇలా ప్రసంగించాడు. ‘‘నీ కనకధారా ప్రభావాన్ని విన్నాను. శివానందలహరీ ప్రవాహాన్ని గమనించాను. కాశీపంచకాన్ని, మనీషాపంచకాన్ని గురించి తెలుసుకున్నాను. మోహముద్గరమనే భజగోవిందాన్ని ఎందరో పాడుకుంటూ ఉండగా చూశాను. ఉపనిషత్తులకు నీవు భాష్యాలు సమకూర్చుతున్నావని తెలిసి ఆనందించాను. అలకనందలో గీతాచార్యుడైన నారాయణ ఋషి నీకోసమే ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రేరణతో నీవు భగవద్గీతకు కూడా భాష్యరచన చేస్తున్నావని విన్నాను. ప్రస్థాన త్రయంలో చివరిదైన బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా చేపట్టు’’ అన్నాడు. ‘‘ధన్యోహం’’ అని నమస్కరించాడు శంకరుడు. ‘‘జాగ్రత్త సుమా! నేను వచ్చి చూస్తాను. నిన్ను పరీక్షిస్తాను. నేను రచించిన బ్రహ్మసూత్రాలకు నీవు సరైన రీతిలో భాష్యం చెప్పావని అనిపిస్తేనే ఆమోదముద్ర వేస్తాను’’ అన్నాడు మళ్లీ వేదవ్యాసుడు. కన్నులవెంట ఆనంద బాష్పాలు చిందుతుండగా నమస్కార ముద్రలోనే నిలబడిపోయాడు శంకరుడు. ‘‘సమయం మాత్రం ఆట్టే లేదు మరి. అతి త్వరలోనే నీకు పదహారో ఏడు రాబోతోంది. ఆ లోపుగా నీ రచన సంపూర్ణమవ్వాలి. ఇది మహాదేవుని పక్షాన నీకు వచ్చిన ఆదేశం’’ అని దక్షిణామూర్తిని చూపుతూ చెప్పాడు వ్యాసుడు. ‘‘బాలచంద్రుణ్ణి ధరించిన నీ మూర్తిని ధ్యానించేవారికి ఐశ్వర్యం, దీర్ఘాయువు, జ్ఞానం లభించడమే కాకుండా ఉపనిషత్తులు వర్ణించిన మహారహస్యమైన స్థితికూడా చివరకు లభిస్తుంది. స్వామీ దక్షిణామూర్తీ! నీకివే మరల మరల నుతులు’’ అన్నాడు శంకరుడు. సమావేశం చివరిలో గోవింద భగవత్పాదులు శిష్యసమేతులై అక్కడి నుంచి కదిలారు. మార్గమధ్యంలో... ‘‘జగద్గురూ! నేను మళ్లీ ఓంకార క్షేత్రానికి వెళ్లిపోతున్నాను. నీవు బదరికాశ్రమం చేరి త్వరలోనే భాష్యరచన పూర్తిచేయి. వచ్చిన దారివెంటే మళ్లీ కాశీవిశ్వనాథుని సన్నిధికి చేరుకో. తదుపరి ఆదేశం అక్కడే లభిస్తుంది’’ అన్నారు గోవిందులు. నిజగురువుకు మొక్కి వీడ్కోలు పలికాడు శంకరుడు. శీఘ్రంగా బదరికి వచ్చి శిష్యులను కలుసుకున్నాడు. గురువు ప్రయాణ విశేషాలను శిష్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శంకరుడు శిష్యవాత్సల్యం చేత జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అందరూ మైమరచి వింటూ ఉండిపోయారు. పై స్తోత్రాన్ని లిఖించి, భద్రపరిచే బాధ్యత యధాప్రకారం విష్ణుశర్మ నిర్వహించాడు. చివరిగా ఆనందగిరి చేతులు జోడించి, ‘‘స్వామీ! తత్త్వమసి మహావాక్యార్థాన్ని బోధించమని మీరు అడిగారు. అప్పుడు వీణానాదం వెలువడింది అన్నారు కదా! ఇంతకూ మీకేం వినిపించినట్లు?! ఆయనేం చెప్పినట్లు?!’’ అని అడిగాడు. మళ్లీ దక్షిణామూర్తి స్తోత్రాన్నే నేపథ్యంగా తీసుకుని శంకరుడు ఆ మహారహస్యాన్ని ఇలా ఆవిష్కరించాడు... విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్య న్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ఈ విశ్వమంతా మనలోనే ఉంది. మనం చూస్తున్నట్లుగానే ఉంది. ఎలా ఉందంటే... అద్దంలో కనిపించే నగరంలా ఉంది. కానీ ఈ జగత్తు మనలో కాక బయటెక్కడో ఉందని భావిస్తూ ఉంటాం. దానికి కారణం మాయ. కలగంటూ ఉన్నంతసేపు అది నిజమే అనిపిస్తుంది. కానీ మెలుకవ రాగానే వాస్తవం ఏదో తెలుస్తుంది. అలాగే మాయచేత కనుగొనలేక ఆత్మ స్వరూపాన్ని బయటెక్కడో వెతుక్కుంటున్నవాడికి దానికి, నీకు భేదం లేదని తన ప్రబోధం చేత ఎరుకపరిచిన గురువైన శ్రీదక్షిణామూర్తికి నమస్కారం. సృష్టికి పూర్వం విత్తనంలో చెట్టులా ఈ జగత్తు మొత్తం ఆయనలోనే ఉంది. గుణమయమైన దైవశక్తిచేత దేశకాల నేపథ్యాలతో ఈ సృష్టిని ఆయనే ఒక గారడివానిలా కల్పిస్తాడు. యోగిలా దీనికి స్వేచ్ఛ కల్పించి పెరగనిస్తాడు. కొంచెం ఇంచుమించు ఆయనలాగే కనిపించే ఈ సమస్తంలోనూ ఆయన ప్రకాశమే నిండివుంది. ఆ చిదాత్మ ప్రకాశమే నీవు అనే వేదవాక్కుకు ఆయనే ఆధారం. దానిని తెలుసుకున్న జీవాత్మకే పునరావృత్తి రాహిత్యం ఏర్పడుతుంది. చిల్లుల కుండ లోపలి దీపకాంతిలా నాలోనే ఆత్మజ్యోతి వెలుగుతోంది. కన్ను, ముక్కు, చెవుల వంటి ఇంద్రియాల చిల్లుల ద్వారా జ్ఞానమనే వెలుగు అలాగే బయటకు ప్రసరిస్తోంది. తీరాచూస్తే లోపల వెలుగుతున్నది, బయట కనిపిస్తున్నది ఒక్కటే. ఆ వెలుగే నేనై ఉన్నానని తెలిపే స్వరూపమే దక్షిణామూర్తి. దేహ, ప్రాణ, ఇంద్రియాలకు అతీతమై, బుద్ధికి అగోచరమై, లింగభేదం లేని ఆత్మ ఒకటి ఉన్నది అంటే అది శూన్యమా.. జడమా... కంటికి కనబడదేం అంటూ వృథాతర్కంలో దేహాత్మవాదులు చెడిపోతుంటారు. అటువంటివారిలోని మహావ్యామోహాన్ని కూడా తన మాయాశక్తిచేత పోగొట్టేది ఆయనే. స్వయంప్రకాశ శక్తి కలిగిన ఆత్మను గుర్తించలేని మానవుడు గ్రహణవేళ సూర్యచంద్రుల్లా మాయచేత ఆవరింపబడి ఉన్నాడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశల్లో వేర్వేరు అనుభవాలతో గందరగోళంలో పడుతున్నాడు. అవస్థా భేదాలన్నింటిలోనూ, సర్వ ఉపాధులలోనూ ఎడతెగకుండా ఏకరూపంతో ‘నేను నేను’ అనే అహంస్ఫురణతో సాగిపోతున్న మానవుడికి కుడిచేతి బొటనవేలిని, తర్జనిని కలిపి పట్టుకున్న జ్ఞానముద్రతో అజ్ఞానాన్ని తొలగిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారం. ఈ చరాచరాత్మక సృష్టి అంతటా ఈశ్వరుని ఎనిమిది శరీరాలే ప్రతిఫలిస్తున్నాయి. ఆత్మవిచారణలో మునిగిన వారికి ఆయనకంటే వేరైనదేదీ ఇక్కడ కనబడదు. గురుముఖతః దీనిని తెలుసుకుని మననము, ధారణము చేసినవాడిని సిద్ధిరూపమైన అష్టైశ్వర్యాలు వద్దన్నా విడవకుండా వెంటబడి వస్తాయి – అన్నాడు శంకరుడు. కలియుగంలోని 2608, శ్రీప్లవంగ నామ సంవత్సరం (క్రీ.పూ. 493) ప్రవేశించింది. శంకరుని బ్రహ్మసూత్ర భాష్యరచన దాదాపుగా పూర్తి కావచ్చింది. శిష్యులందరినీ పూర్వపక్షంలో ఉంచి, వారి వాదనలను ఖండిస్తూ తన సిద్ధాంతాన్ని చెబుతూ శంకరుడు భాష్యరచన కొనసాగించాడు. కానీ శిష్యులే పూర్వపక్షం వహించడంలో కొంత సమస్య ఉంది. గురువుపై గౌరవంతో మొండివాదనకు దిగలేరు వారు. సమర్థులైన విమర్శకులు లేనిదే రచన రాణించదు. అటువంటి వారిని రచనలో భాగస్వాములుగా చేయడం కోసమే శంకరుడు ఉన్నత హిమాలయ సానువులనుంచి మళ్లీ మైదానాలకు బయలుదేరాడు. ‘‘అగ్నీ! ఇకనుంచి శీతకాలంలో బదరీనాథునికి కాస్త సెలవురోజులుండేలా చూడు. మళ్లీ నేను వచ్చేసరికి కొడుకుని ఎత్తుకుని కనిపించు’’ అన్నాడు శంకరుడు. అగ్నిశర్మ సాగిలపడి మొక్కాడు. చూస్తుండగానే యతిబృందం అంతా అగ్నిశర్మను బదరిలోనే వదిలి ముందుకు సాగి కనుమరుగైంది. సేతువు నుంచి శీతాచలం వరకు నాలుగుసార్లు భారతదేశాన్ని చుట్టివచ్చిన ఆచార్య శంకరుని జీవన ప్రయాణంలోని తొలియాత్ర పూర్తయింది. రెండోవిడత ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
శంకరగీత
నటరాజస్వామి జటాజూటి నుంచి జారిపడిన సురగంగ పన్నెండు పాయలుగా చీలి పోయింది. వాటిలో ధౌళిగంగ, నందాకిని, మందాకిని, పిండార్, భాగీరథి అనే అయిదింటిని అలకనంద వేర్వేరు చోట్ల అల్లిక పాయలుగా తనలో కలుపుకుంటోంది. బదరికాశ్రమం దగ్గర ఋషిగంగతో సంగమిస్తోంది. ముందుకు సాగి దేవప్రయాగ వద్ద గంగానదిగా అవతరిస్తోంది. బదరికాశ్రమం చెంత ఉరవడిగా సాగిపోతున్న అలకనందలో శంకరుడు మునకలేస్తున్నాడు. నీటి అడుగున అతడికో విచిత్రం కంటపడింది. సాక్షాత్తూ విష్ణుపాదాలు దర్శనమిచ్చాయి.ఆత్రుతగా వెళ్లి రెండు చేతులా పట్టుకోబోయాడు. అంతలోనే విష్ణుమాయ ప్రకటితమైంది. అప్పటివరకూ పాదాల్లా కనిపించినవి కాస్తా మాయమై పిక్కలయ్యాయి. పాదాలెక్కడో దూరంగా అవుపిస్తున్నాయి. ఇటువైపు శిరస్సు కాదు కదా... నాభిస్థానమేదో గుర్తుపట్టడానికి కూడా లేకుండా ఉంది. నిరాశ చేసుకుని చూస్తున్నంతలోనే అంత పొడవాటి విగ్రహమూ చిట్టిబొమ్మగా మారిపోయింది. బారెడు దూరానికి వెళ్లి నిలిచింది. ఎలాగైనా ఆ బొమ్మను చేజిక్కించుకోవాలని ముందుకు ఈదాడు శంకరుడు. కానీ వెళ్లినకొద్దీ అంతు తేలకుండా లోతుపెరుగుతూ విష్ణునాభిలో కూరుకుపోతున్న అనుభూతి కలిగింది. అతిప్రయత్నంమీద కిందినుంచి పైకి విసిరేసినట్టు నీళ్లలో ఎగిసి పడ్డాడు. విష్ణుషట్పదీ స్తోత్రాన్ని ప్రారంభించాడు శంకరుడు. అవినయ మపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాంభూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః ప్రభూ విష్ణూ! నా అవినయాన్ని అరికట్టు. నాలోని మృగతృష్ణను చల్లార్చు. నా మనస్సును అదుపులో పెట్టు. నీ దయను విస్తరించు. భవసాగరాన్ని దాటించు... అన్నాడు శంకరుడు.గండకీ, గంగ, నర్మద వంటి పుణ్యనదులలో అపురూపమైన శిలలు లభిస్తూ ఉంటాయి. కళ్లు, ముక్కు ఇతర అవయవాల గుర్తులను బట్టి ఆ రాళ్లకు దేవతానామాలు వస్తాయి. కానీ నదీగర్భంలో దొరికే సాలగ్రామాలన్నీ ప్రధానంగా విష్ణు స్వరూపాలే. అలకనంద అడుగున శంకరునికి దేవతా ముద్రలతో కూడిన శిలకాక, ఒక నల్లరాతి విగ్రహమే దర్శనమిస్తోంది. మాయను ప్రదర్శిస్తూ శంకరుణ్ణి పరీక్షిస్తోంది. వస్త్రంలో దారంలా సర్వంలో ఈశ్వరుడు కలడు అని ఎల్లప్పుడూ సంభావన చేయకపోవడమే అవినయం. సంసార సాగరాన్ని తరించాలంటే సాధకునికి కావాల్సిన మొదటి అర్హత వినయం. సాధనలో ప్రతిబంధకం అని తెలిసినా సరే అవినయాన్ని దూరం చేసుకోలేకపోవడానికి కారణాలు రెండు... ఒకటి మనస్సు, రెండోది విషయ మృగతృష్ణ. వాటిని నివారించగలిగేవాడు విష్ణువొక్కడే. సర్వభూతాలలో ఏ చైతన్యం వెలుగొందుతోందో అదే నీలోనూ ఉంటుంది. నీవంటివే అయిన ఇతర ప్రాణులకు ఏ కీడూ తలపెట్టని భూతదయ విస్తారంగా నీలో కలిగిననాడే నిన్ను ఉద్ధరించాలనే మనసు విష్ణువుకు కలుగుతుంది. ప్రతిబంధకాలు తొలగుతాయి అన్నాడు స్తోత్రం తొలిశ్లోకంలో శంకరుడు. మళ్లీ నీటి అడుగున ప్రవేశించాడు. చేరువలోనే కనిపించి, అంతలోనే దూరమై నిలిచి ఇందాక మాయచేసిన విష్ణుపాదం ఇప్పుడు సుస్థిరమై తోచింది. పుండరీకాక్షుని పాదద్వయం పువ్వులా మెత్తగా తోచింది. ఆ పూలపాదాలలోని మకరందమే గంగాప్రవాహం. సచ్చిదానందమనే సుగంధం వెదజల్లే పద్మాలవి. భవభయాలను తొలగించే నీ పాదాలకు వందనం అంటూ నమస్కరించాడు.అప్పటివరకూ నిల్చుని ఉన్నట్లుగా అనిపించిన వ్యత్యస్త పాదారవిందాలు చూస్తుండగానే పద్మాసన స్థితిలోకి వచ్చేశాయి. శంఖ చక్రధారి అయిన నారాయణుడు... కింది రెండు చేతులలోనూ తపోముద్ర పట్టి ధ్యానియై గోచరించాడు. సుమారు అడుగు ఎత్తున ఉన్న ఆ చిట్టిబొమ్మను హృదయానికి హత్తుకున్నాడు శంకరుడు. పైకెత్తబోయాడు కానీ సాధ్యం కాలేదు. మరోసారి గట్టుపైకి వచ్చాడు.జరుగుతున్న తతంగమంతా శంకర శిష్యులకు వింతగా కనిపిస్తోంది. జ్ఞాని అయిన తమ గురువు మామూలు పిల్లవాడిలా నదిలో ఈత కొడుతూ, ఆడుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. ‘దేవా! నీవూ నేనూ ఒకటే అయినప్పటికీ సముద్రంలో తరంగాలుంటాయి కానీ తరంగాల వల్ల మాత్రమే సముద్రం ఏర్పడదు కదా! అలాగే నేను నీ వాడనే... కానీ నీవు నా వాడవు కాదు. ఇది నా అజ్ఞానం వల్లనే వచ్చిపడిన అవస్థ’ అని నిష్ఠురమాడాడు శంకరుడు. అప్పటివరకూ ఆ స్వచ్ఛజలంలో శంకరునికి తప్ప ఇతరులకు కానరాని నారాయణ విగ్రహం ఆ క్షణంలో లోకవిదితమైంది. పద్మాసన భంగిమలో ధ్యానముద్రలో ఉన్న విగ్రహాన్ని కన్నులు విప్పార్చి చూస్తున్నారు శంకర శిష్యులు. అప్పటికి వారికి తమ గురువు అన్వేషణ ఏమిటో అర్థమైంది. ఆయనకు సాయపడాలనే ఆలోచన వారిలో కించిత్తు ఆలస్యంగా వచ్చింది. అంతలోనే శంకరుడు తరువాతి శ్లోకం ఇలా పలికాడు... ఉధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః ఎవ్వరూ ఎత్తలేని మందరగిరిని నిలబెట్టిన శ్రీకూర్మావతారా! పర్వతాల రెక్కలు కోసి వాటికి స్థిరత్వాన్ని కల్పించిన ఇంద్రుని తమ్మునిగా పుట్టిన వామనావతారా! రాక్షసకులానికి శత్రువైన శ్రీరామావతారా! సూర్యచంద్రులే కన్నులుగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణావతారా! నువ్వు కంటపడితే ఈ సంసార బంధం విచ్ఛిన్నమై పోకుండా ఉంటుందా? నేను భవతాప భీతుడిని. నీవు సంరక్షకుడవు. మత్స్యము మొదలైన అవతారాలు ధరించి భూమిని ఉద్ధరించినట్లు నన్ను ఉద్ధరించు... అన్నాడు శంకరుడు. జాలువారుతున్న శ్లోకసౌందర్యం వింటున్న శ్రోతల హృదయాలను మైమరిపిస్తోంది.సంసారమనే సాగరమథనంలో అమృతాన్వేషణకు పూనుకున్న సాధకునికి మందరపర్వతంలా సాయపడే దామోదరా! నిన్ను పొందలేనేమో అన్న భీతిని ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఆనాడు మాతృప్రేమకు లోబడి రోటికి కట్టుబడినట్లు నా బాహువులకు కట్టుబడు అంటూ శంకరుడు మళ్లీ నదిలో దూకాడు. ఈసారి ప్రయాస లేకుండానే నారాయణ విగ్రహం శంకరుని చేతిలో పూలగుత్తిలా అమరిపోయింది. విగ్రహాన్ని మెల్లిగా శిరస్సుపై పెట్టుకుని శంకరుడు గట్టుపైకి చేరాడు. సమీపంలోని ఒక గుహలో ఎత్తైన ప్రదేశంలో నిలిపాడు. త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి నారాయణుని కరుణను సులభంగా సంపాదించి పెట్టే ఈ విష్ణుషట్పదీ స్తోత్రం నా వదన సరోజంపై సదా తుమ్మెదలా సంచరించును గాక! అనే ఆశంసతో విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. శంకరుడు ఇలా నారాయణ విగ్రహాన్ని వెలికి తీసింది మొదలు అగ్నిశర్మలో ఆవేగం పెరిగింది. ఆనాటి నుంచి నిత్యపూజాదికాలు నిర్వహించడంలోనూ, వివిధ నైవేద్యాలు సమకూర్చడంలోనూ అతడే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. కొద్దిరోజులు గడిచాయి. ‘‘స్వామీ! నాకు మళ్లీ మన ఊరు పోవాలని లేదు. మీరు అనుమతిస్తే ఇక్కడే ఈ స్వామి సన్నిధిలోనే జన్మ చరితార్థం చేసుకోవాలనుంది. అమ్మ పంపిన బంగారు పళ్లేన్ని మీరెలాగూ స్వీకరించలేదు కదా! దానితో నేనీ బదరీ నారాయణునికి గుడి కడతాను. అర్చక బాధ్యతలు నేనే తీసుకుంటాను’’ అని అగ్నిశర్మ తన మనసులోని కోరికను శంకరుని ముందు బయటపెట్టి, అనుమతి కోరాడు.శంకరుడు ఆ ప్రార్థన మన్నించాడు. ‘‘ఇక ఇక్కడ నీ వంశమే శాశ్వతంగా అర్చకహోదాలో కొనసాగుతుంది’’ అని అపూర్వమైన వరాన్ని కూడా అగ్నిశర్మకు దయచేశాడు.విగ్రహం ప్రతిష్ఠించిన గుహ చుట్టూ మందిర నిర్మాణం ప్రారంభమైంది. బదరికాశ్రమానికి వచ్చే యాత్రికులకు ఆ బదరీనాథుడు ఇష్టదైవంగా మారాడు. ఆ స్వామితో పాటుగా ఆచార్య స్వామిని కూడా సందర్శించడం ఆరోజుల్లో ఒక సంప్రదాయమైంది. ఉపనిషత్ భాష్యాలతో పాటు శంకరుడు అప్పుడు సర్వవేదాంత సిద్ధాంత సారసంగ్రహాన్ని కూడా రచిస్తున్నాడు. ముందుగా లోకాయత, ఆర్హత, మాధ్యమిక, యోగాచార, సౌతాంత్రిక, వైభాషికాలనే ఆరు నాస్తిక దర్శనాల సిద్ధాంతాలనూ వివరించాడు. తదుపరి వైశేషిక, న్యాయ, మీమాంసా, సాంఖ్య, యోగ, మహాభారత దర్శనాలనే క్రమంలో ఆస్తిక దర్శనాలను వివరించాడు. ‘‘ఏ శాస్త్రంతోనూ విరోధం లేకుండా వ్యాసభగవానుడు సాంఖ్యపక్షం అవలంబించి మహాభారతాన్ని రచించాడు. ఇది వేదసారమే అని వైదికులు అంగీకరిస్తున్నారు’’ అంటూ మహాభారత దర్శనాన్ని వివరించడం ప్రారంభించాడు. మహాభారతం వంద పర్వాలు, లక్షాపాతిక వేల శ్లోకాలు కలిగిన మహేతిహాసం. అందులో తొంభయ్యో పర్వానికి మోక్షధర్మ పర్వం అని పేరు. ఇది పద్దెనిమిది పర్వాల వరుసలోని శాంతిపర్వంలో కనిపిస్తుంది. ఆ పర్వం ఆధారంగానే శంకరుని మహాభారత దర్శనం ప్రతిపాదన సాగింది. ‘విష్ణువొక్కడే పరాత్పరుడు. త్రిగుణాలను అనుసరించి దేవతలను, రాక్షసులను, నిశాచరులను ఆయనే లీలామాత్రంగా అనుగ్రహిస్తున్నాడు’ అంటూ అరవై ఆరు శ్లోకాలలో సిద్ధాంత ప్రతిపాదన చేశాడు శంకరుడు. ఆనాటి యాత్రికులలో కొందరు గ్రంథరచన జరుగుతున్నంత సేపూ ఆసక్తిగా వింటూ అక్కడే కూర్చున్నారు. చివరిగా ఒక వ్యక్తి పైకి లేచాడు. ‘‘స్వామీ! మహాభారతంలో భగవద్గీత కర్మయోగాన్ని, కర్మస న్యాస యోగాన్ని కూడా విడివిడిగా చెప్పింది. పరస్పర విరుద్ధమైన విషయాల కలబోతగా సాగే గీతాబోధను అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టమే. ఇంతకూ మీరు చెప్పండి... కర్మలను ఆచరించాలా, విడిచిపెట్టాలా?’’ అని కోరాడు. ‘‘వత్సా! గీతాచార్యుడు అంతిమంగా చెప్పినమాటను ఒకసారి గుర్తుచేసుకో. ‘అర్జునా! నేను చెప్పవలసింది చెప్పాను. ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకుని నువ్వు కోరుకున్నట్లే చెయ్యి’ అన్నాడాయన. కర్మలు చేయవలసిందే. అయితే మానవుడు తాను చేసే కర్మల పరిపాకాన్ని అనుసరించి కర్మకాండ, దేవతాకాండ, యోగకాండ, జ్ఞానకాండలపై క్రమానుగతంగా అధికారం సంపాదించగలుగుతాడు’’ అన్నాడు శంకరుడు. ‘‘సుఖదుఃఖాలకు అతీతంగా, కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టి స్థితప్రజ్ఞునివి కమ్మని భగవానుడు చెప్పాడు కదా స్వామీ! కోరికలన్నింటినీ విడిచిపెట్టేస్తే మానవుడు ఆనందించడానికి ఏ కారణమూ మిగలకుండానే పోతుంది. అయినప్పటికీ దేహధారణకు అవసరమైన అన్నపానాదులపై ఇచ్ఛ మిగిలే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్థితప్రజ్ఞుడు పిచ్చివాడిలా, మతిమరపువాడిలా ప్రవర్తించే అవకాశం ఉందికదా!’’ అని ప్రశ్నించాడు కొత్త వ్యక్తి. ఆదిశంకరుని గీతాభాష్య రచన ఆ క్షణంలోనే శ్రీకారం చుట్టుకుంది. ‘‘స్థితప్రజ్ఞుడంటే కోరికలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞాని. అతడికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అన్ని వైపుల నుంచి నీరు వచ్చిపడుతున్నా స్థిరంగా నిలిచివుండే సముద్రంలాంటివాడే జ్ఞాని. కర్మానుభవ కాలంలో విశిష్టమైన కోరికలు అన్నివైపుల నుంచి సముద్రాన్ని చేరే నదుల్లా ఎవనిలో లీనమైపోతాయో అతడే జ్ఞాని. అతనికి దేహం నిలిచి వుండాలనే కోరిక కూడా ఉండదు. అహంకార మమకారాలుండవు. అందరికంటే తానే గొప్ప అనే భావాన్ని విడనాడినందువల్ల సంసార దుఃఖాలు నశించిపోతాయి. దీనికే నిర్వాణము అని పేరు. ఇదే బ్రాహ్మీస్థితి’’ అన్నాడు శంకరుడు. ‘‘ఇటువంటి బ్రాహ్మీస్థితిని పొందినవాడు చేసేది కర్మత్యాగమా... కర్మఫల త్యాగమా?’’ మరోసారి ప్రశ్న వచ్చింది. ‘‘నిత్యనైమిత్తిక కర్మలు సైతం ఫలాలను సృష్టించుకుంటూ వెళతాయని భగవానుడు చెప్పాడు. సర్వసంగ పరిత్యాగులకు కర్మఫలం అంటదు. తక్కినవారందరూ ఫలాలను అనుభవించాల్సిందే’’ అన్నాడు శంకరుడు. ‘‘నిష్కామకర్మ చేయడం ఎలా?’’ అని తదుపరి ప్రశ్న. ‘‘స్వధర్మాన్ని అనుసరించి చేసే కర్మల వల్ల సాధన రూపమైన చిత్తశుద్ధి లభిస్తుంది. దానివల్ల కలిగే ఆత్మజ్ఞాన నిష్ఠనే సిద్ధి అంటారు. అలా సిద్ధిని పొందినవాడు ఆత్మసాక్షాత్కార పూర్వకంగా సర్వకర్మలనూ మనస్సు చేతనే విసర్జించాలి. స్వస్వరూప స్థితిని పొందాలి. అదే నైష్కర్మ్య సిద్ధి. ఇందులో క్రియ చేయడమే కానీ దానితో సంబంధం పెట్టుకోవడం ఉండదు. బ్రహ్మకంటే భిన్నంకాని ఆత్మను దర్శించడానికి ఇదొక్కటే మార్గం’’ అని శంకరుని సమాధానం. ‘‘కానీ స్వామీ! ఆత్మ అనే వస్తువుకు ఆకారం లేదని, దానిని మానవ బుద్ధి చేరుకోలేదని కొందరు పండితులు చెబుతున్నారు. ఆత్మజ్ఞానం కష్టసాధ్యమని వారి వాదన.’’ ‘‘అవును అది యదార్థమే. గురువు, సంప్రదాయం లేనివారికి, వేదాంత శ్రవణం కాక ఇతర శబ్దాలలో బుద్ధి తగుల్కొన్న వారికి, తగిన పరిశ్రమ చేయనివారికి జ్ఞాననిష్ఠ అసాధ్యమే. భేదబుద్ధి కలవారికి తెలుసుకోవలసినది, తెలుసుకుంటున్నవాడు, తెలుసుకోవడమూ అనే త్రిపుటి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ అద్వైతంలో ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు. గీతలో భగవానుడు కూడా ఏ ద్వైతంలో అయితే భేదదృష్టిని పాటిస్తూ ప్రాణులు మెలుకువగా ఉంటారో అప్పుడే, ఆ సమయాన్నే యోగి అయినవాడు రాత్రిగా భావిస్తాడు అని చెప్పాడు. బాహ్యజగత్తులో కనిపించేవన్నీ సత్యాలే, వాటిమధ్య భేదమూ యదార్థమే అనే బుద్ధిని తోసిపుచ్చాలంటే అంతర్ముఖులు కావాలి. అప్పుడే ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవడం తేలిక అవుతుంది.’’ ‘‘ఈ జ్ఞానం పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి?’’ ‘‘ఏమీ చేయనక్కర లేదు. ఆత్మానాత్మ వివేకం కలవారికి జ్ఞాననిష్ఠ నిత్యసిద్ధమై ఉంటుంది. అనాత్మ అంటే దేహము వంటి అశాశ్వతమైన వాటిలో ఆత్మస్వరూపాన్ని ఆరోపించే బుద్ధిని నివారించాలి. అందుకోసమే మానవుడు ప్రయాస పడాలి. బాహ్యజగత్తుపై ఆధారపడడం మానేయాలి. అనాత్మ అయిన ప్రతిదానినీ ఇదికాదు ఇదికాదంటూ తోసిపుచ్చాలి. అప్పుడు ఆత్మ స్వయంసిద్ధమై ప్రకాశిస్తుంది’’ అని సాకల్యంగా చెప్పాడు శంకరుడు. అంతవరకూ ప్రశ్నిస్తున్న వ్యక్తిలో కలిగిన ఆనందం శ్లోకరూపంలో ఇలా వెలువడింది...గేయం గీతా నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తే దేయం దీనజనాయ చ విత్తం భగవద్గీతను, విష్ణు సహస్రనామాలనూ పఠించు. నిరంతరమూ నారాయణ ధ్యానం చేయి.సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని నిలిపి ఉంచుకో. విత్తాన్ని దీనులకు ఇచ్చేయి. గీత, గంగ, గాయత్రి, గోవిందుడనే నాలుగు గకారాలనూ హృదయంలో నిలిపిన వాడికి పునర్జన్మ లేదు అని మహాభారతం చెబుతోంది. స్వామీ! కర్మఫలత్యాగం చేసిన సంన్యాసికి కూడా పునర్జన్మ లేదంటారు. దయచేసి మీరు నన్ను శిష్యునిగా స్వీకరించి, ఉద్ధరించండి’’ అని వేడుకున్నాడు. అతడే నిత్యనాథుడనే పేరుతో శంకర శిష్యులలో ప్రముఖుడయ్యాడు.కార్తికం ముగిసి మార్గశిరమాసం ప్రవేశించింది.ఆనాడు ఉషోదయ సూచనగా నీలకంఠ పర్వతం అప్పుడప్పుడే నారింజరంగులోకి మారుతోంది. నిజగురువైన గోవింద భగవత్పాదులు కొండదిగి తనవైపే వస్తున్నట్లుగా శంకరునికి కనిపించింది. పరుగు పరుగున ఎదురువెళ్లాడు. చేయిపట్టుకుని తీసుకువచ్చాడు. -సశేషం -
జగమే మాయ
ఈ కథ కృతయుగం ప్రారంభంలో జరిగింది. బ్రహ్మ స్తనాలను భేదించి ధర్ముడు పుట్టాడు. అతడి కుమారులు ఇద్దరు... నరుడు, నారాయణుడు. బదరికాశ్రమం వారి తపోభూమి. తపస్వులే కాదు, మహావీరులు కూడా. సహస్రకవచుడనే రాక్షసుణ్ణి వధించడానికి పూనుకున్నారు వారిద్దరూ. వెయ్యేళ్లపాటు తపస్సు చేసినవాడు తనతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచాలు సరిగ్గా ఓ వెయ్యి ఉన్నాయి ఆ రాక్షసుడి దగ్గర. నరనారాయణులు వంతుల వారీగా వాడితో యుద్ధం చేశారు. ఒకరు వెయ్యేళ్ల పాటు యుద్ధం చేస్తుంటే, మరొకరు తపస్సు చేసేవారు. అలా మొత్తం తొమ్మిదివందల తొంబైతొమ్మిది యుద్ధాలు పూర్తయ్యాయి. చివరి వంతు యుద్ధం నరుడికి వచ్చింది. కానీ తనకు మిగిలిపోయిన ఒక్క కవచంతో సహస్ర కవచుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసుని వధించడం సాధ్యం కాక నరుడు వెను తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత కాలం చాలానే గడిచిపోయింది. భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకమనే అయిదు లోకాలను దాటిన తరువాత తపోలోకం ఉంది. అక్కడ ఉండే తపస్వులు, సిద్ధులు తమ ఇచ్ఛమేరకు కింది లోకాలకు అవతరిస్తారు, తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. ద్వాపరయుగం చివరిలో... అపాంతరతముడనే మహర్షి అలాగే తపోలోకం నుంచి బదరికాశ్రమానికి వచ్చాడు. సాక్షాత్ విష్ణువే అయిన ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ పూజించారు. సంతోషించిన మహర్షి వారికి కర్తవ్యం బోధించాడు. ‘ఆనాటి సహస్రకవచుణ్ణి సూర్యదేవుడు మళ్లీ నేలపైకి పంపబోతున్నాడు. వాడిని చంపే బాధ్యత నరమహర్షీ నీదే’ అన్నాడు. ‘‘అలాగే స్వామీ! వాడు నేల మీదకు వచ్చిన తరువాత కదా!’’ అన్నాడు నరుడు పాతపగ గుర్తు చేసుకుంటూ. ‘‘అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలు తీసుకోవాలని బ్రహ్మ నిర్దేశం. కంస చాణూరాది రాక్షసులను నిర్జించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షీ! మీరు శ్రీకృష్ణునిగా జన్మించాలి. కర్ణవధ కోసం నరుడు పాండవమధ్యముడైన అర్జునునిగా అవతరించాలి. నేను సైతం కృష్ణద్వైపాయనుడినై వేదవ్యాసునిగా జన్మించబోతున్నాను’’ అన్నాడు అపాంతర తముడు. నరనారాయణులు బదరికాశ్రమాన్ని విడిచిపెట్టారు. భారత సంగ్రామం గీతా ప్రయుక్తంగా ముగిసింది. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమై 2611 సంవత్సరాలైంది. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మాధవమాసం (క్రీ.శ. 495) ప్రవేశించింది. బదరికావనంలో అలకనందా నది ప్రశాంత సుందరంగా ప్రవహిస్తోంది. ఆ తీరాన శంకరయతి ముందు శిష్యులు కూర్చుని ఉన్నారు. ‘‘జన్మాష్టమినాడు సరిగ్గా శ్రీకృష్ణ జనన సమయానికే మాయ కూడా పుట్టిందట. కంసుడు చేతితో పట్టుకుని రాతికేసి కొట్టబోతే ఎగిరి గాలిలో నిలిచి నీ మృత్యువు రేపల్లె నుంచి నడిచి వస్తుంది అన్నదట’’ అన్నాడు నిత్యానందుడు. ఆచార్య శంకరుడు మాయావివరణం ప్రారంభించాడు. ‘‘ఎండలో ధగధగలాడిపోతున్న ఆల్చిప్పను చూసి వెండి అని ఆశపడతాం. సూర్యకాంతి తక్కువై మసక మసకగా ఉన్నచోట తాడును చూసి పామని జంకుతాం. ఎడారుల్లో దవ్వున ఎండమావిని చూసి దప్పికి ఎగబడతాం. చీకటిలో మోడు చూసి దొంగ అనుకుని కేకలు వేస్తాం. ఇదంతా అసలు వస్తువును ఎరగకపోవడం వల్ల చేసే ఆరోపం. ఈ అజ్ఞానానికి చాలానే పేర్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాయ, అవిద్య, తామసి అనేవి. ఇవి మూడుగా విడిపోకముందు దీనినే మూలప్రకృతి అంటున్నాం. సృష్టికి పూర్వం కర్మవాసనలతో నానిన జీవులెన్నో లక్కముద్దలో బంగారంలా ఈ మూలప్రకృతిలోనే లయమై ఉంటాయి.’’ ‘‘అయితే ఆచార్యా! అది మూడుగా విడిపోయినప్పుడు ఏమవుతుంది?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు. ‘‘మూలప్రకృతి సత్త్వ రజస్తమో గుణాల సముదాయం. తెలుపు, ఎరుపు, నలుపు రంగుల దారాలతో పురిపెట్టిన తాడు లాంటిది. శుద్ధసత్త్వ స్వరూపమైన దానినే మాయ అంటారు. సృష్టి ప్రారంభంలో పంటకు వచ్చిన జీవులు కర్మలను బట్టి మూడు విధాలుగా దానినుంచే బయటకు వస్తాయి. సృష్టికి పూర్వమే ఉన్న బ్రహ్మచైతన్యం ఈ మాయలోనే ప్రతిబింబించి ఈశ్వరుడై జగత్తును సృజిస్తుంది. మాయయే తామసిగా మారినప్పుడు ఈశ్వరుడు సృష్టిని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తాడు.’’ ‘‘మరి మూడోరూపమైన అవిద్య ఎలా మారుతుంది?’’ సుబోధాచార్యుడు ప్రశ్నించాడు. ‘‘అది రజోగుణ ప్రధానం. వైయక్తికమైన అవిద్య జీవులకు కారణ శరీరం అవుతుంది. సమష్టి రూపమైన మూలప్రకృతి ఈశ్వరునికి కారణశరీరం. అయితే ఈ జీవేశ్వరుల ఉనికి గాఢసుషుప్తిలోనే వ్యక్తమవుతుంది. కారణ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇది ఆనందమయ కోశం’’ వివరించాడు శంకరుడు. ‘‘గాఢ సుషుప్తిలో జీవేశ్వరుల కలయిక ఏర్పడినా అనుభవంలోకి రాదు కదా ఆచార్యా! ఎలా మరి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం?’’ ఈసారి సురేంద్రుడు అడిగాడు. ‘‘అందుకోసమే లింగశరీరమున్నది. అదే సూక్ష్మ ప్రపంచ సృష్టి. తమస్సు నిండివున్న ప్రకృతిని ఈశ్వరుడు ఆకాశంగా మార్చేశాడు. ఆకాశం నుంచి వరుసగా వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. వీటి పుట్టుకకు కూడా కారణం అజ్ఞానమే అయినందువల్ల ఆ సూక్ష్మభూతాలకూ త్రిగుణాలుంటాయి. వాటి వేర్వేరు సత్త్వగుణాల వల్ల జ్ఞానేంద్రియాలు, సమష్టి సత్త్వం వల్ల అంతఃకరణం పుట్టింది. రజోగుణాంశాల వల్ల కర్మేంద్రియాలు కలిగాయి. రజోగుణ సమష్టిచేత ప్రాణం పుట్టి అయిదుగా విభాజితమైంది. అలా పది ఇంద్రియాలు, అయిదు ప్రాణాలు, మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారమని నాలుగు విధాలుగా ఉండే అంతఃకరణం కలిసి సూక్ష్మశరీరం అయింది. కానీ ఈ శరీరంలో జీవేశ్వరుల ఉనికి స్వప్నావస్థలోనే తేటపడుతుంది. ఇందులో విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలున్నాయి.’’ ‘‘కానీ నిశ్చయంగా ఉన్నది మనకు అనిపించేది స్థూల జగత్తు ఒక్కటే కదా!’’ వేరొకరి ప్రశ్న. ‘‘వైశేష్యాత్తు తద్వాద స్తద్వాదః – బ్రహ్మసూత్రాల ప్రకారం పంచభూతాలను అతిసూక్ష్మభాగాలుగా పంచీకరణం చేస్తూ పోతే ఈ బ్రహ్మాండము, దీనిలోని పద్నాలుగు లోకాలు వచ్చాయి. వాటినుంచే నేలను చీల్చుకు పుట్టినవి, చెమట నుంచి పుట్టినవి, గుడ్ల నుంచి పుట్టినవి, గర్భం నుంచి పుట్టినవి అనే నాలుగు రకాలైన జీవజాతులు ఏర్పడుతున్నాయి. మెలకువలో మనకు కనిపించే ఈ స్థూలమంతా అన్నమయ కోశం’’ అని స్థూలజగత్తును వర్ణించాడు శంకరుడు. ‘‘చర్మచక్షువులకు దైవం ఉనికి తెలుసుకోవడం ఎందుకు సాధ్యం కాదు?’’ మరొక జీవుని వేదన. ‘‘మసక మసకగా ఉన్న వెలుగులో తాడు కొందరికి పాములా కనిపిస్తుంది. కొన్నిసార్లు పూలదండలా, జలధారలా, ఇనుప గొలుసులాగా అనిపిస్తుంది. అన్ని కల్పనలకూ ఆ తాడే ఆధారం. ఇది ఈశ్వరుని విక్షేప శక్తి. ఆ శక్తి చేతనే త్రిగుణ స్వరూపుడై త్రిమూర్తులుగా భాసిస్తాడు. జీవుల పంచకోశాలకూ, ఆత్మకూ మధ్య తేడా జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది. ఇతరులకు ఇది కనబడనీయకుండా ఈశ్వరుని ఆవరణ శక్తి ప్రపంచాన్ని అంధకారంలా కప్పి ఉంచుతుంది’’ అని శంకరుని వివరణ. ‘‘ఈ చీకట్లు తొలగిపోవడం ఎలా?’’ అని దృఢభక్తి ప్రశ్నించాడు. ‘‘ఈశ్వరుని ఆవరణ శక్తిని అసత్వ్తము, అభానువు అనే రెండు ఆవరణల్లో జీవుడు చూస్తాడు. గురువు సాయంతో పరోక్ష జ్ఞానం లభిస్తుంది. అక్కడ శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా దైవమే లేదు అసత్వ ఆవరణ చెదిరిపోతుంది. అప్పుడు నేనే బ్రహ్మమును అనే అపరోక్ష జ్ఞానం ఉదయిస్తుంది. దానివల్ల బ్రహ్మము తెలియడం లేదు అనే అభానువు తొలగిపోతుంది. అప్పుడు బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదని, తానే బ్రహ్మమని విచారణతో అనుభవానికి తెచ్చుకుని జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు. అహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మా స్మ్యహం బ్రహ్మేతి నిశ్చయః చిదహం చిదహం చేతి సజీవన్ముక్త ఉచ్యతే – నేనే బ్రహ్మమును. జ్ఞాన స్వరూపుడను. ప్రకాశ స్వరూపుడను అనే నిశ్చయం సకల అవస్థలలోనూ కలిగినవారే జీవన్ముక్తులు. అటువంటివారు కర్మాధీనమైన శరీరం నశించిన వెంటనే ప్రాణవాయు సంచారం నిలిచిపోయినట్లు పునర్జన్మలను నశింప చేసుకుంటారు. జీవన్ముక్త స్థితిని కూడా పరిత్యజించి విదేహముక్తులవుతారు. అవాఙ్మానస గోచరమైన సచ్చిదానంద పరమాత్మ స్వరూపులు అవుతున్నారు. ఇదీ మాయావివరణంలోని ప్రథమ వర్ణకం’’ అని ఆ పూటకు పాఠం ముగించాడు శంకరుడు. శిష్యులందరూ అక్కడి నుంచి కదిలారు. దూరంగా నడుచుకుంటూ వెళ్తూ, ‘‘జీవుని అంతరాత్మ మూడు శరీరాలనే చెరసాలల్లో బందీగా ఉంటుంది. ఆ త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు శివుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తాడట’’ అంటూ త్రిపురాసుర సంహార సన్నివేశాన్ని చెబుతున్నాడు పద్మపాదుడు. శంకరుడు కూర్చున్న చోటనే అంతర్ముఖుడయ్యాడు. కాలటి నుంచి వచ్చిన మేనమామ అగ్నిశర్మను వెంటబెట్టుకుని విష్ణుశర్మ వచ్చాడు. వస్తూనే ‘‘ఆచార్యా! నా మాట ఆలకించాలి’’ అన్నాడు. ‘‘వచ్చిన దగ్గరినుంచి వీరిమాటే పట్టించుకోలేదు మీరు. మీ అమ్మగారి గురించి ఏదో చెబుతున్నాడు’’ చెప్పాడు పక్కకు జరిగి. ఏమిటన్నట్లుగా చూశాడు శంకరుడు. ‘‘నేను వచ్చి ఇప్పటికి రెండేళ్లయింది. అక్కడ అక్కయ్య ఎలా వుందో ఏమిటో’’ దిగులుగా అన్నాడు అగ్నిశర్మ. ‘‘ఏమైంది?’’ ‘‘మంచం మీంచి దించడం... పోయిన ప్రాణం తిరిగి రావడం. దాదాపుగా ప్రతిరోజూ ఇదే తంతు. నిజానికి అటువంటి స్థితిలో ఆమెను వదిలి రావడానికి మనస్కరించలేదు. కానీ ఎలాగైనా దీనిని మీకు అందచేయమని పోరుపెడితే వచ్చాను’’ అంటూ బట్టలమూట చాటునుంచి ఒక బంగారు పళ్లేన్ని బయటకు తీశాడు విష్ణుశర్మ. ‘‘మీ ఆస్తి అంతా కరిగించి ఇలా పోత పోయించింది అక్కయ్య. ఇది మీకు అందిందనే కబురు అందేదాకా ఆవిడ కొనఊపిరితో అయినా ఉంటుందని నా నమ్మకం’’ అని ఆ బంగారు పళ్లేన్ని శంకరుని ముందు పెట్టాడు. ‘‘ఇంత విలువైన వస్తువుతో ఇంతదూరం ఒంటరిగా వచ్చావా?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు విష్ణు. మెడలోని గాయత్రిని పైకెత్తి పట్టుకుని ‘అవున’న్నాడు అగ్నిశర్మ. ‘‘ఇంత బాధ్యతగా దీన్ని కాపాడావు కనుక, ఇది నీకు చెందడమే న్యాయం’’ అన్నాడు తీర్పు చెబుతూ శంకరుడు. ‘‘అంటే మీరు స్వీకరించరా?’’ బేలగా అడిగాడు అగ్నిశర్మ. ‘‘నేనేం చేసుకోను? నీలాగా సంసారిని కానుగా’’ అన్నాడు నవ్వుతూ. తల్లి కొంగులా మెత్తగా అనిపించిన ఆ బంగారపు పళ్లేన్ని అగ్నిశర్మకే తిరిగి ఇచ్చేశాడు. ‘‘అమ్మకిచ్చిన చివరి మాట గుర్తుంది. ఆమె యోగక్షేమాలు నా బాధ్యత’’ స్థిరంగా చెప్పాడు శంకరుడు. ‘‘అయితే అక్కయ్య క్షేమంగా ఉందంటారా? మాకు తెలియకపోయినా అక్కడి విషయాలు మీరు తెలుసుకోగలరు. దయచేసి చెప్పండి... అక్కయ్య ఇప్పుడెలా ఉంది?’’ ఆదుర్దాగా అడిగాడు అగ్నిశర్మ. శంకరుడు చెప్పడం ప్రారంభించాడు. ‘‘నువ్వు వచ్చేశాక ఆమెకు బాగా నెమ్మదించింది. ఒకనాటి రాత్రి జరిగిన ముచ్చట ఇది. ఆమె స్థూలదేహం మంచం మీదనే ఉంది. దానినే అనుక్షణం గమనిస్తూ ప్రౌఢగా కనిపిస్తున్న కారణ శరీరం ఆమె పక్కనే ఉంది. కర్మానుభవాల వల్ల కలిగిన దుఃఖాలన్నింటినీ గుర్తుతెచ్చుకుంటూ శోకిస్తోంది. ఆమె సూక్ష్మశరీరం మాత్రం పూర్ణానది ఒడ్డున కూర్చుని వృషాచలేశ్వర శిఖరం వైపు చూస్తోంది. పదహారేళ్ల బాలిక కనుక ఎవరి సాయం లేకుండా వేగంగానే కోవెలకు వెళ్లిపోగలదు. కానీ ఎందుకో అధైర్యం ఆవహించిందామెకు. అసహాయంగా అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటికి ఆమె దగ్గరకు పొట్టకింద తెల్లమచ్చలున్న ఓ జింక వచ్చింది. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆడడం మొదలుపెట్టింది. మెల్లిగా దాని కొమ్ములు పట్టుకుని, ‘నన్ను మా నాన్న దగ్గరకు తీసుకెళ్తావా’ అని అడిగింది అమ్మ. సరేనంటూ ముందుకు కదిలింది జింక. అలా వాళ్లిద్దరూ ఎంతసేపు నడిచారో తెలియదు. పైకి ఎక్కుతున్నప్పుడు అది వృషాచలేశ్వరుని కోవెలలాగే అనిపించింది కానీ, అంతలోనే వెండికొండలా మారిపోయింది. అమ్మ చాలాసేపు ప్రయాసపడి శిఖరాన్ని చేరింది. మహాదేవుడు ఉమాసమేతుడై దర్శనమిచ్చాడు. అమ్మ తనివితీరా ఆయనను అర్చించింది. ‘ఏం కావాలమ్మా’ అని ప్రీతితో అడిగాడు మహాదేవుడు. ‘నన్ను మా నాన్న దగ్గరకు పంపించు స్వామీ!’ అని అడిగింది అమ్మ. లోకాలన్నింటినీ కన్నతండ్రి చల్లగా నవ్వాడు. ‘అంతదూరం ఒక్కర్తివీ వెళ్లగలవా’ అని అడిగాడు అమ్మకొడుకులాగా. ‘ఇదిగో కాస్త ఈ జింకకు దారి చెప్పు’ అన్నది అమాయకంగా అమ్మ. సరేనంటూ ఆయనేం చెప్పాడో తెలియదు కానీ, జింక మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. కైలాసాన్ని దాటి లోకాలన్నీ అధిగమిస్తూ అమ్మ ముందుకు వెళుతోంది. రెండేళ్లుగా కాలటిలో అమ్మ స్థూలశరీరం మనవాళ్ల సంరక్షణలో భద్రంగానే ఉంది. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి కానివ్వు చూద్దాం.’’ శంకరుడు చెబుతున్న వృత్తాంతమంతా కలలా అనిపించింది విష్ణుశర్మకు, అగ్నిశర్మకు. మరే ప్రశ్నలూ వెయ్యకుండా మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు వాళ్లిద్దరూ. బంగారుపళ్లెం అగ్నిశర్మ వద్దనే ఉంది. రోజు గడిచింది. అలకనంద స్వచ్ఛంగా పారుతోంది. పద్నాలుగేళ్ల శంకరుడికి నీళ్లను చూస్తే ఉత్సాహం పొంగింది. శిరస్సు నీటిలో ముంచి కాళ్లు రెండింటినీ ఎక్కువ వేగంగా కదపకపోయినా చేపపిల్లలా దూసుకుపోతున్నాడు. ఇక్కడ మునిగినవాడు ఎక్కడో తేలుతూ ఆటలాడుకుంటున్నాడు. అంతలో నీటి అడుగున ఒక విచిత్రం కంటపడింది. – సశేషం -
ఇటు రా నాయనా!
శంకరయతి బదరికాశ్రమం దిశగా గంగాతీరం వెంట సాగిపోతున్నాడు. తపస్సుకు అనుకూలమైన హిమాలయాలను ఎంచుకుని, భాష్య రచనలను పూర్తి చేసుకోవడం ప్రాథమిక లక్ష్యంగా ఆ ప్రయాణం కొనసాగుతోంది. శంకరునితో కలిపి ఆ బృందం ఏడుమంది. సప్త ఊర్ధ్వలోకాల్లా భాసిస్తున్నారు వారు. గురు ముఖతః సత్యదర్శనం చేసుకుంటూ విల్లు విడిచిన బాణాల్లా హిమాలయాలను అధిరోహిస్తున్నారు. గురువుకు ఆకలిదప్పులు లేవు. అయినా శిష్యులు సమర్పించినప్పుడు ప్రీతితో స్వీకరించడమే గురువు నైజం. ఆచార్య శంకరుడు ఎప్పుడూ నిటారుగా కూర్చోవడమే కానీ, కాసేపైనా నడుం వాల్చడం శిష్యులెప్పుడూ చూసి ఎరుగరు. గురువుకు మార్గాయాసమూ లేదు. తనతో సమానమైన వేగంతో మిగతావారు ప్రయాణించలేరనే కారణం వల్లనే కాబోలు... ఆయన ఇప్పటికీ బదరికాశ్రమం చేరకుండా తాత్సారం చేస్తున్నాడు. ఇంకెంత... రెండురోజుల ప్రయాణదూరంలో బదరికాశ్రమానికి చేరుకోవచ్చు. ఆవేళ అప్పటికే చీకటి పడడం వల్ల ప్రయాణం నిలుపు చేశారు. విష్ణుశర్మ నిప్పు రాజేశాడు. పుల్లాపుడకా చేర్చాడు. అందరూ చలి కాచుకోవడానికి ఆ నెగడు చుట్టూ చేరారు. దూరంగా శంకరుడు తపోమగ్నుడై ఉన్నాడు. అగ్నిశిఖల వెలుగులో గురువు దివ్యతేజస్సులో కణకణలాడుతూ కనిపిస్తున్నాడు. ఇహ పరసుఖ విముఖోహం నిజసుఖబోధానుభూతి భరితోహం ఇతిమతి దూరతరోహం భావేతర సుఖనిషక్త చిత్తోహం – నేను ఇహపర లోకాలలో లభించే సుఖాల పట్ల విరక్తుడను. ఆత్మసుఖానంద పరిపూర్ణుడను. పొందిన కొద్దీ కొరత మిగిలే ఉండే సుఖలాలసకు నేను చాలా దూరం. భావాతీతమైన నిత్యసుఖంపైనే నా చిత్తం లగ్నమై ఉంది. నాకు ఈర్షా్యద్వేషాలు లేవు. పరమేశ్వర దర్శనాన్ని బలంగా వాంఛించే వాళ్లకు తగిన పురుషార్థాలను సమకూర్చి పెడుతూ ఉంటాను. ఉపనిషత్తులనే ఉద్యానవనాల్లో ప్రతి అంగుళం నేను విహరించిన చోటులే. గట్లు పొర్లి ఉప్పొంగే శోకసముద్రంలో అంతర్లీనంగా ఉండే బడబానలం విరజిమ్మే వహ్నిజ్వాల నేనే. తత్త్వజ్ఞానం అందించే తృప్తిని నేనే. ఆ తృప్తి అనే దీపపు కాంతినీ నేనే. వేదాంత వాక్యాలను విశ్వసించిన పరిశుద్ధ అంతఃకరణం కలవారికి జీవబ్రహ్మైక్య స్థితిని బోధిస్తాను. మోహమనే కటిక చీకట్లను పోగొట్టే సహస్ర కిరణుడను నేనే. .... శంకరుణ్ణే గమనిస్తూ ఆయన రచించిన స్వాత్మనిరూపణంలోని శ్లోకాలను మననం చేసుకుంటున్నాడు సనందుడు. మిగతావారంతా ముచ్చట్లలో పడ్డారు. ‘‘సరేనయ్యా! యోగం వల్ల అలసటకు దూరమవుతాం అని విని ఉన్నాం. కానీ మరీ నిద్రాహారాలు లేకపోయినా మనగలిగే స్థితి ఉంటుందా?’’ అన్నాడు సురేంద్రుడు. ‘‘ఉంటుంది. మానవుని బుద్ధి అజ్ఞానంలో మునిగిపోవడాన్నే నిద్ర అంటారు. బుద్ధి తాలూకు విలీన స్థితి అరికట్టిన వాడికి నిద్ర అవసరం లేదంటారు మన గురువుగారు. అలాగే మెలకువలో బుద్ధి పూర్ణంగా వికసిస్తుంది. ఈ వికాసమూ, విలీనమనే వికారాలకు దూరమైనప్పుడు... నిద్ర లేకపోయినా జాగరణ చేసినప్పటి అలసట ఉండదు. ఇక బుద్ధి సూక్ష్మనాడుల్లో సంచరించినప్పుడు స్వప్నాలు వస్తాయి. ఆ బుద్ధి సంచారాన్నే అరికట్టి నిశ్చలత్వాన్ని సాధించిన యోగిని స్వప్నావస్థ కూడా చేరలేదు. వాయువు వల్ల, అగ్నివల్ల శరీరంలో నాడులు పీడన పొందితే ఆకలి దప్పికలు కలుగుతాయి. స్వాత్మానంద స్థితికి చేరుకున్న నాకు ఇవేమీ ఉండవు... వినలేదా ఆచార్య శంకరుని మాట??’’ అన్నాడు సనందుడు. ఈ మాటలు చెప్పి అక్కడినుంచి లేచి దూరంగా వెళ్లాడు. ‘‘అంతా తనకే తెలిసున్నట్లు చెబుతాడేం? అసలు నువ్వు అతగాణ్ణి అడిగావా?! ఏదో పిచ్చాపాటీగా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరాడు’’ విసుక్కున్నాడు సుబోధాచార్యుడు. ‘‘అట్లా అనకు సుబోధా! గురువుగారికి సనందుడంటే ఎంత ప్రేమ?! ఎంత ఆదరణ?! మన గురువుగారి నీడకు ఓ పేరు, రూపం గనక కల్పిస్తే అది మన సనందుడే కదా. అవును గానీ విష్ణూ! నువ్వు గురువుగారి వద్దకు చేరి ఎన్నేళ్లయింది?’’ అడిగాడు సురేంద్రుడు. ‘‘ఆయనకు అయిదేళ్ల వయసున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం’’ చెప్పాడు విష్ణుశర్మ. ‘‘అయితే అందరికంటే పెద్దపీట న్యాయంగా నీకే దక్కాలి’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘అవును ముమ్మాటికీ నిజం. విష్ణూ! బహుశా నువ్వు సన్యాసం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నావు. ఎందుకని ఆలస్యం చేస్తున్నావు?’’ ఆత్రుతను ఆపుకోలేక అడిగాడు సురేంద్రుడు. ‘‘అడిగితే ఇచ్చేవారేనేమో! నేను కోరలేదు... వారివ్వనూ లేదు. నాకు కావాల్సిందల్లా ఆయన నా కళ్లముందు ఉండడం. తొలినాడు గురుకులంలో ఆయనను చూసినప్పుడే జన్మకు చాలిన పెన్నిధి దొరికిన అనుభూతి కలిగింది. ఆయనతోనే కలిసి నడుస్తూ, ఆయనకు లేఖకునిగా ఉంటూ, కావలసినవన్నీ సమకూరుస్తూ ఇలా ఉండిపోవడమే నాకు ఆనందం’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘మంచిదే. కానీ సన్యాసం ఆత్మోన్నతికి మార్గమవుతుంది కదా!’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘కావచ్చు. ఆయన ఎఫ్పుడు ఏది చేయమని ఆజ్ఞాపిస్తే... అప్పుడు అది చేయడమే నా పరమార్థం’’ దృఢంగా అన్నాడు విష్ణుశర్మ. ‘‘చూస్తుంటే నీక్కొంచెం పెళ్లియావ ఉన్నట్లుంది’’ అన్నాడు సురేంద్రుడు. విష్ణుశర్మ ఆ మాటకు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. అప్పటివరకూ మౌనంగా ఉన్న నిత్యానందుడు కల్పించుకున్నాడు. ‘‘విష్ణూ! విరక్తి వేరు, సన్యాసం వేరు కదా... ఏమంటావు?’’ అన్నాడు సురేంద్రుని వంక క్రీగంట చూస్తూ. ‘‘నిజమే. సంసారసుఖాల పట్ల విరక్తి పెంచుకోవడం వేరు, తత్త్వజ్ఞానం పొందడం వేరు అని మన ఆచార్యుల వారే తరచుగా చెబుతుంటారు. జీవితంలో ఏర్పడే అనుభవాల వల్ల ఎవరికైనా విరక్తి పుట్టవచ్చు. కానీ జ్ఞానం మాత్రం సద్గురువు వల్లనే లభిస్తుంది. మబ్బుల నుంచి జారిపడే స్వచ్ఛ జలాన్ని నేరుగా తాగాలని, నదిగట్టునే వేచి ఉండే చాతక పక్షిలా మానవుడు... ఆత్మప్రబోధం కలిగించే సద్గురువు కోసం వేచి చూడాలి అంటారాయన’’ అన్నాడు దృఢభక్తి ఆచార్యుడు. ‘‘ఆత్మప్రబోధం అంటే ఏమిటి?’’ అన్నాడు సురేంద్రుడు. ‘‘నీలోనే అసలు వెలుగు ఉందని నీకు తెలిసేలా చెప్పడం’’ అన్నాడు నిత్యానందుడు. ‘‘దానికి కొంచెం తపస్సు చేస్తే సరిపోతుంది. పుస్తకాలు చదివితే జ్ఞానం తనంత తానే పెరుగుతుంది. ఇంకా గురువెందుకు?’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘అవును. బెల్లం తియ్యగా ఉంటుందని తిన్నప్పుడే తెలియనక్కరలేదు. ఎవరైనా చెప్పినా, పుస్తకంలో చదివినా తెలుస్తుంది. అంతేకదా!’’ అందించాడు సురేంద్రుడు. ‘‘పుస్తక జ్ఞానం వల్ల బెల్లంలా కనిపించే ప్రతిదీ బెల్లమే అనుకునే ప్రమాదం ఉంటుంది. అదే దాని స్వరూప స్వభావాలు పూర్తిగా తెలిసినవాడికి నువ్వో బెల్లంముక్క తినమని ఇచ్చావనుకో. వాడేమంటాడూ?! మా చిన్నతనంలో తిన్న బెల్లం రుచి వేరు. ఇప్పుడా రుచి రావడం లేదు అంటాడు. అవునా!’’ అన్నాడు నిత్యానందుడు. దృఢభక్తి దానికి కొనసాగింపుగా ఇలా చెప్పాడు. ‘‘గురుప్రబోధం పొందకుండా ఆత్మాన్వేషణ చేసిన వాడిని అనుక్షణం అయోమయం వెంటాడుతుంది. చిన్నప్పుడు తిన్న రుచి ఇప్పుడు ఎక్కడికి పోయిందీ అని వెతుక్కుంటూ కూర్చోవడంలాగే ఉంటుందది. అదే గురువు తోడుగా ఉంటే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవితమంతా ఆనందమనే రుచి స్థిరపడుతుంది.’’ ‘‘అలా కాదులే ఆచార్యా! ఏది తిన్నా బెల్లంలాగే ఉండాలి. హాయిగా అరిగిపోవాలి. గురువు అనే వ్యక్తి అలా ఏమైనా చేయగలరా?’’ వెటకారంగా అడిగాడు సురేంద్రుడు. ‘‘ఆత్మానుభవం ఎవరికి వారే పొందాలి. ఆ దోవలోకి తీసుకువెళ్లి విడిచిపెట్టడమే కానీ, గురువులు ఇతరత్రా ప్రమేయం కలిగించుకోరు’’ అన్నాడు నిత్యానందుడు. ‘‘ఈ శరీరంతో పొందే అనుభవాలన్నీ ఆత్మానుభవాలే కదా!’’ అన్నాడు సురేంద్రుడు. ‘‘కాదు. నువ్వు మరణించిన తరువాత నీ శరీరం అన్నపానాలు కోరదు. అందువల్ల దేహం కంటే ఆత్మ భిన్నమైనది’’ అన్నాడు నిత్యానందుడు. ‘‘బహుశా ప్రాణం కాబోలు’’ అన్నాడు సుబోధాచార్యుడు. ‘‘నువ్వు నిద్రపోతూ ఉంటే ఒంటిమీద బట్టలు వలుచుకుపోయినా నీకు తెలియదు కదా... అప్పుడా ప్రాణం ఎటు పోయింది?’’ ‘‘బహుశా ఆత్మ అంటే మనస్సే అయివుండాలి.’’ ‘‘అదెప్పుడూ పరాధీనమే కదయ్యా! దానికి అన్నీ తెలుసు అని చెప్పలేం. స్వయంగా విషయాలను గ్రహించే శక్తి మనస్సుకు లేదు. నిజానికి మనస్సును ఉద్ధరించగలిగే శక్తికే ఆత్మ అని పేరు’’ అన్నాడు దృఢభక్తి. ‘‘ఇంతకూ అసలు ఆత్మపదార్థం ఎలా ఉంటుంది? దాని ఉనికిని సామాన్యుడు కూడా తెలుసుకోవడం ఎలా? ఈ విషయంలో గురువుగారు ఏమైనా చెప్పారా?! నీకు గుర్తున్నంత వరకూ చెప్పు’’ నిత్యానందుడు అడిగాడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు. ‘‘చీకటింటిలో ఒక దీపం వెలిగించు. గది మధ్యలో ఉంచు. దానిమీద ఒక కుండ బోర్లించు. గాలి ఆడడానికి, కాంతి వెలార్చడానికి ఆ కుండకు ముందుగానే అయిదు చిల్లులు ఉండేలా చూసుకో. ఒక్కో చిల్లుకూ ఎదురుగా వరసగా నేల ఉసిరిక, వీణ, కస్తూరి, జాతిరత్నం, వింజామర ఉంచు. దీపం మీద కుండ ఉన్నప్పటికీ దానికి ఉన్న చిల్లుల ద్వారా వెలువడే కాంతిలో ఆయా వస్తువులన్నీ చక్కగా కనబడుతున్నాయి కదా! ఇప్పుడు సమాధానం చెప్పు... నువ్వు ఆ వస్తువులన్నింటినీ గుర్తించడానికి కారణమైనది ఏది? కుండకు ఉన్న చిల్లులా.. మొత్తం కుండేనా... తైలమా... లేదంటే వత్తి అంటావా? వీటిలో దేన్నీ నువ్వు ఒప్పుకోలేవు. దీపజ్యోతి మాత్రమే కారణం అని అంగీకరిస్తావు కదా! ఆ కుండకు ఉన్న అయిదు చిల్లులూ పంచేంద్రియాలు. వాటి ముందు పెట్టిన పదార్థాలన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధాలకు ప్రతీకలు. చిల్లుల కుండలో వెలుగుతున్న జ్యోతిలా ఆత్మయే నీకు సర్వపదార్థాలనూ గురించిన ఎరుకను కలిగిస్తోంది. అయితే ఈ ఆత్మ ఎవ్వరికీ గోచరం కాదు. మహామహా యోగులకు మాత్రం మెరుపులా మెరిసి చటుక్కున మాయమైపోతూ ఉంటుంది అన్నారు.’’ ‘‘ఈ మాయ ఎక్కడినుంచి దాపురించిందయ్యా మనకు?’’ విసుక్కున్నాడు సురేంద్రుడు. ‘‘సృష్టిని విస్తరించాలని పరబ్రహ్మ సంకల్పించినప్పుడు ఆయనకు తోడుగా నిలిచిందే మాయ. అదే స్థావర జంగమాత్మకమైన ఈ దృశ్య జగత్తును సృష్టిస్తోంది’’ అన్నాడు దఢభక్తి. ‘‘కాదు. జగత్తు ఈశ్వరుడి వల్లనే వస్తోంది. మధ్యలో మాయ ప్రమేయం ఏముంది?’’ అడిగాడు సుబోధాచార్యుడు. ‘‘విష్ణూ! ప్రబోధ సుధాకరంలోని ఆత్మసిద్ధ ప్రకరణం ఇందాక చెప్పావు. మరి మాయా స్వరూపాన్ని గురించిన ఉదాహరణ కూడా చెప్పు’’ అన్నాడు నిత్యానందుడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు. ‘‘స్వప్నంలో ఒకడికి సురతానుభవం కలిగిందనుకుందాం. మెలుకువ వచ్చేసరికి వస్త్రంపై శుక్రస్రావం కనిపిస్తుంది. స్వప్నంలో ఉన్న పురుషుడు తానే కనుక అతడు సత్యమే. ఆ స్త్రీ, ఆమెతో పొందు రెండూ అసత్యాలే. కానీ వస్త్రంపై శుక్రదర్శనం మాత్రం సత్యం. జాగ్రత్ స్వప్న అవస్థలలో మానవుడు ఒకేలాంటి మిధ్యావిషయాల వెంటబడి, రాగద్వేషాలకు లోనవుతున్నాడు. సుషుప్తిలో తన ఎరుకే తనకు తెలియదు. సత్యదర్శనానికి అడ్డుపడుతూ జగత్తును మాయ ఇలాగే నడిపిస్తోంది.’’ సురేంద్రుడు, సుబోధాచార్యుడు వినలేక చెవులు మూసుకుని అక్కడినుంచి లేచివెళ్లిపోయారు. ‘‘అయితే ఈ మాయను దాటగలిగే వారెవరు?’’ ప్రశ్నించాడు నిత్యానందుడు. ‘‘జగదాచార్యుడే...’’ అన్నాడు తాను కూడా పైకి లేస్తూ దృఢభక్తి. ‘‘ఆయనను త్రికరణ శుద్ధిగా అనుసరించిన శిష్యులు కూడా కావచ్చును’’ అంటూ నిత్యానందుడు కూడా కదిలాడు. తెల్లవారింది. పొద్దెక్కి రెండు ఝాములైంది. గంగ ఒడ్డున శంకరుడు ధ్యానతత్పరుడై ఉన్నాడు. శిష్యులంతా ఆయనను సమీపించారు. వారి మనసుల్లో ఏవేవో ప్రశ్నలున్నాయి. శిష్యుల రాకను గురువు గుర్తించాడు. కానీ ఆయన చెప్పదల్చుకున్న పాఠం వేరు. నెమ్మదిగా కన్నులు తెరిచి, ‘‘సనందా!’’ అన్నాడాయన. సురేంద్రుడు, సుబోధాచార్యులకు ఆ పిలుపు అపశ్రుతిలా వినిపించింది. ‘అతడు ఆవలి ఒడ్డుకు వెళ్లాడండీ’ అని సమాధానం చెప్పబోయారు. కానీ వారి మాటలు వినిపించుకోకుండా, ‘‘ఇటు రా నాయనా’’ అన్నాడు శంకరుడు. ఆవలి గట్టున ఉన్న సనందుడు తలతిప్పి చూశాడు. అతని కళ్లకు ఆచార్య శంకరుని నగుమోము అతి సమీపంగా కనిపించింది. బుద్ధికి తామున్న దూరం అంచనా వేసే లక్షణం పోయింది. మనసెప్పడో ఆయనను సమీపించినందువల్ల అప్రయత్నంగా, ‘‘చెప్పండి గురువుగారూ!’’ అన్నాడతడు అడుగు ముందుకు వేసి. అప్పటికింకా గంగకు ఆవలి ఒడ్డునే ఉన్నాడతను. ఈవలి ఒడ్డున శంకరుడు. మధ్య గంగ సరళ ప్రవాహంగా సాగిపోతోంది. కొన్ని తావుల్లో చెప్పరాని లోతు కూడా ఉంది. సనందుని అడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే వస్తే అతడు నదిలో మునిగిపోవడం ఖాయం. బ్రహ్మ సత్యం జగన్నిధ్యేత్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేక స్సముదాహృతః – కనిపించే రూపాలన్నీ జగత్తులా మిధ్యా స్వరూపాలే. బ్రహ్మమొక్కటే సత్యం. నిత్యుడైన ఆయన యందు దృష్టిని నిలిపి వివేకం పెంచుకో... అన్నాడు శంకరుడు. అవతల సనందుని అడుగులు నది అడుగుకు వెళ్లడం మాని విచిత్రంగా పైకి తేలుతున్నాయి. అతని పాదాల క్రింద గంగ లోపలి నుంచి పద్మాలు వెలుస్తున్నాయి. అవి సనందుణ్ణి మోసి తెచ్చి ఈవలి ఒడ్డుకు చేర్చాయి. అందరూ నోళ్లు వెళ్లబెట్టుకుని ఆ దృశ్యాన్ని తిలకించారు. ‘‘మాయను దాటించేది ఏది?’’ గొణిగాడు నిత్యానందుడు. ‘‘శ్రీశంకరాచార్య మమ దేహి పదావలంబమ్’’ అన్నాడు దృఢభక్తి రెండు చేతులూ జోడించి. నదిని దాటి క్షేమంగా వచ్చిన సనందుణ్ణి చూసి చిరునవ్వుతో శంకరుడు, ‘‘పద్మపాదాచార్యా!’’ అని సంబోధించాడు. ఆనాటి నుంచి సనందుడు పద్మపాదునిగా ప్రసిద్ధుడయ్యాడు. శంకరశిష్యులలో ప్రథమస్థానం అతడికే పదిలపడింది. మళ్లీ ప్రయాణం కొనసాగింది. బదరికాశ్రమం చేరువ అయింది. యతిబృందం లోనికి ప్రవేశిస్తోంది. దారికి పక్కగా అప్పటివరకూ కూర్చుని ఉన్న ఓ వ్యక్తి వీరిని చూసి లేచి నిలబడ్డాడు. అతడు అగ్నిశర్మ. కాలటి నుంచి వచ్చాడు. పూర్వాశ్రమంలో శంకరునికి వరుసకు మేనమామ. ‘ఏమిటిలా వచ్చావు?’ అన్నట్లు శంకరుడు కన్నులతోనే ప్రశ్నించాడు ముందుకు సాగుతూ. ‘‘అమ్మ పంపించింది’’ అన్నాడు అగ్నిశర్మ వెంటబడి వస్తూ. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
గోవిందం భజ మూఢమతే
‘‘ఎప్పటికప్పుడు ఇలాగే పాఠం చెప్పుకోకుండా ఎగ్గొట్టావంటే... ఆత్మనేపదికీ పరస్మైపదికీ కూడా కాకుండా పోతావ్. ఆనక ప్రతివాడూ ఛ ప్రత్యయం ప్రయోగిస్తాడు. ఎవరి శిష్యుడివిరా అబ్బీ అని పృచ్ఛ చేస్తారు. ఏం చెబుతావ్...’’ గద్దిస్తున్నట్లుగా అడిగాడు గురువుగారు. ‘‘మీ పేరే చెప్పాలి కదండీ’’ అమాయకంగా అన్నాడు శిష్యుడు. ‘‘అదే చెబుతున్నది.... ఆ పనిమాత్రం చెయ్యకు. ఇంకే తద్ధితంగాడి పేరైనా చెప్పుకో’’ అంటూ తొడమీద ఉన్న పత్తిపోగును వేళ్లనుంచి మణికట్టుదాకా లాగి విసురుగా తోశాడు గురువుగారు. కందెనకు వేలాడుతున్న దారం దాంతోపాటే గిరగిరా తిరుగుతూ జందెం తయారవుతోంది. అసలే కోదండానికి వేలాడుతూ తల్లక్రిందులుగా చూస్తున్నాడేమో... పాపం ఆ శిష్యుడికి కళ్లు తిరుగుతున్నాయి. ‘ఊ కానియ్’ అన్న గురువుగారి హుంకారంతో, శిష్యుడు తడబడుతూ పాఠం వల్లెవేస్తున్నాడు. ‘క్షిణు చ, ఋణు గతౌ, తృణు అదనే, ఘృణు దీప్తౌ....’ పాణిని ఆలయం ఆవరణలో విద్యార్ధులకు వ్యాకరణ పాఠాలు సాగుతున్నాయి. కోదండం వేసిన శిష్యుడు కాక ఇంకా అనేకమంది ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క తీరులో కనిపిస్తున్నారు. ఒకరి శిఖ మేకుకు కట్టేసి ఉంది. మరొకరు మోకాళ్లపై నిలబడ్డారు. ఇంకొకరు శీర్షాసనంలో చదువుతున్నారు. అందరి దగ్గరకూ వెళుతూ వాళ్లమధ్యలో తిరుగుతూ ఎవరిపాఠం వారికి చెబుతున్నాడు గురువుగారు. దాదాపు నాలుగువేల సూత్రాలతో సంస్కృత వ్యాకరణానికి ఒరవడి దిద్ది శబ్దానుశాసనం చేసినవాడు పాణిని. సింధుతీరంలో ఆయన జన్మించిన చోటు నుంచి మట్టితెచ్చి... శిష్యులంతా కలిసి కాశీలో ఈ గుడి కట్టించారు. పాణినీయంలో వృథా అయిన అక్షరం ఒక్కటి కూడా లేదు అంటాడు పతంజలి. అటువంటి సూత్రాలను వేలాదిగా రూపొందించడానికి ఆయనకు ఎన్నేళ్లు పట్టిందో చెప్పలేం. కానీ, సూత్రరచనలో ఆదమరుపుగా ఉన్నవేళలో ఒక సింహం పాణిని మహర్షిపై దూకి చంపేసిందని చెబుతారు. ఆ కథలో ఎంత నిజముందో తెలియదు... ఏదేమైనా నింద లేనిదే బొందె పోదు కదా! ‘‘ఘృణు దీప్తౌ, వను యాచనే, మను అవబోధనే, డుకృఞ్ కరణే....’’ విద్యార్థి పాఠం కొనసాగుతోంది. ‘‘అదీ... భూ సత్తాయాం నుంచి డుకృఞ్ కరణే వరకూ ఈ ఎనిమిది అధ్యాయాలున్నూ చప్పుచప్పున వప్పచెప్పేయ్. ఇంక రేపటినుంచి నీకు చక్కగా క్రియారూపాలు కూడా చెబుతాను.... ఏం? నా ఘటం వెళ్లిపోయేలోపు నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను రా’’ శపథం చేశాడు గురువుగారు. భాష్యరచన కోసం కాశీని విడిచిపెట్టి బదరికాశ్రమానికి బయలుదేరాడు శంకరుడు. శిష్యసమేతంగా ఆ దారిలోనే వెళుతూ అక్కడ ఆగాడు. ‘‘శాస్త్రాలనే కీకారణ్యంలోకి ప్రవేశించినవాడు ఎప్పటికి బయటపడతాడో చెప్పలేం. అతడు దారి తప్పవచ్చు. క్రూరమృగాల బారిన పడవచ్చు. అన్వేషిస్తున్నది లభ్యం కాక వేసట పొందవచ్చు. లేదా అమూల్యమైన వస్తువునేదో సొంతం చేసుకోవచ్చు. గహనాంతర సీమలలో సంచారం చేసినవాడు లోకంలో ఎవ్వరూ చూడని, సామాన్యులకు దుర్లభమైన అపురూపమైన జ్ఞానపుష్పాలేవో సొంతం చేసుకోవచ్చు. అయితే అటువంటి వాటన్నింటి కంటే గొప్పదైన హృదయపుష్పాన్ని శివునికి సమర్పించినవాడు ధన్యుడు. జ్ఞానమెప్పుడూ ప్రతికూలమైనదే.... భూమిని దున్నే నాగలిలాగా. అది పదును దేరకపోతే హృదయక్షేత్రాన్ని సస్యానుకూలం చేయలేదు. భక్తి ఎప్పుడూ సానుకూలమైనదే... భూమి నుంచి మొలకెత్తి మారాకు వేసి ఎదిగే మొక్కలాగా. జ్ఞానసాధన కలుపు ఏరినట్లుండాలి. కృషీవలుడు నేలను సన్నద్ధం చేసిన తరువాతే విత్తనాలు చల్లుతాడు. భక్తి అనే విత్తనం మొలకెత్తి ఫలవంతం కావాలంటే కృషి తప్పనిసరి....’’ అన్నాడు శిష్యులతో శంకరుడు. ఈ అర్థాన్ని తెలియచెప్పే శివానందలహరిలోని శ్లోకాన్ని శ్రావ్యంగా వినిపించాడు విష్ణుశర్మ. ఈ సన్యాసుల రాగాలాపన విద్యార్థుల పాఠానికి భంగం కలిగించింది. ‘‘ఈ కవిగాళ్ల వల్ల భాషంతా చచ్చుబడి పోతోంది. రూపం మారిపోతోంది. చిక్కి శల్యమైపోతోంది. వేదమంత్రాల్లా ప్రతివాడి నోటివెంబడీ ఆ కాకి కూతలే. అయినా ఈ బికారి పాటలకు కూడా దేవభాషే కావలసి వచ్చిందేం?!’’ విసుక్కున్నాడు గురువు. ‘‘అయ్యా! సన్యాసాశ్రమం అన్నింటిలోనూ గొప్పది. సన్యాసి కనబడగానే వయోభేదం పాటించకుండా అందరూ పాదాభివందనం చేయాలి. ఇంత చదువుకున్నా మీరు ఆ మర్యాద పాటించకపోగా, ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు’’ అన్నారు శంకర శిష్యులు. ‘‘చూస్తుంటే ఇంకా మీసాలు కూడా మొలిచినట్లు లేదు. బరువు బాధ్యతలు గాలి కొదిలేశారు. ఆత్మపిండాలు వేసుకుని ముష్టిచిప్పలు పట్టుకుని బయల్దేరారు. అలాంటి మీకు అందరూ పడీపడీ మొక్కాలా?’’ విసురుగా అన్నాడాయన. శంకరయతి శిష్యులు ఏదో సమాధానం ఇవ్వబోయారు. అదేమీ వినిపించుకోకుండా, ‘ఏరా జశ్త్వసంధి సూత్రం ఏమిటి?’ అన్నాడాయన తన శిష్యుల్ని ఉద్దేశించి. ‘‘మరేమో గురువుగారూ... వర్గ తృతీయాక్షరాలూ, చతుర్థాక్షరాలూ రెండూ కానీ... అహహ ఏదైనా ఒకటి గానీ...’’ ‘‘శుంఠా... ఒక్కసారి చదివితే అస్థిని పట్టి పోవాల్రా. మళ్లీ చదివి అఘోరించు’’ అని ఇటువైపుకు తిరిగాడు గురువు. ‘‘సన్యాసివైతే అడవులు పట్టిపో. అంతేకానీ జనావాసాల్లోకి చొరబడకు. దుంపలు తవ్వుకుని, పళ్లు కొట్టుకుని తిని కొండల్లో కోనల్లో బతుకు. తపస్సు చెయ్. ఏదైనా ఇతరులు సాధించలేని దానిని సాధించు. అంతేకానీ దేశానికి బరువుగా మారకు’’ అన్నాడు. అంతలోనే శిష్యుడి వైపుకు తిరిగి, ‘‘ఒరే ధాతూ! పూర్తయిందా?’’ అన్నాడు. ‘‘అంతా వచ్చేసింది గురువుగారూ! ఆ చివరి సూత్రమే పట్టుబడడం లేదు’’ అయోమయంగా అన్నాడు వేళ్లాడుతున్న శిష్యుడు. ‘‘ఇంతకీ ఏమిటి నీ చచ్చు సందేహం?’’ ‘‘డుకురుయ్ అనాలా?! డుకురుంగ్ అనాలా?! ఏవిటీ అనమని చెప్పారిందాకానూ?’’ ‘‘వ్హోరి చవట దద్దమ్మా! నిన్ను కోదండం వేయించడం కాదురా... కరచరణాలు కట్టేసి గంగలో తోసెయ్యాలి’’ అని తలపట్టుకున్నాడు గురువు. శంకరుని కంఠం ఖంగుమంటూ మోగింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణే ఓరి మూఢమానవుడా! గోవిందుణ్ణి భజించు. చేసే పనులన్నింటా గోవిందుడినే ప్రతిష్ఠించుకో. కర్మానుభవం పొందవలసిన దశలో నీవు ఏది, ఎంతవరకూ చేయాలో నిర్దేశించేది అతడే. మరణ సమయం ఆసన్నమైన దశలో నీ దుష్కృతాలను రద్దుచేసినా, సుకృతాలను రెట్టింపు చేసినా అతడికే అధికారం ఉంది. అందుకే ఎల్లవేళలా గోవిందుణ్ణి మాత్రమే భజించు. భగవత్ స్పర్శలేని పనుల జోలికి పోనే పోవద్దు... అన్నాడు. ‘‘ఆ.... ఆ.... ఎవర్నీ అంతమాటా??’’ ‘‘అక్షరాలా తమరినే స్వామీ! మరెవ్వరినీ కాదు’’ అంటూ శంకర శిష్యులు గురువుతో పాటు అడుగు ముందుకు వేశారు. గురువు ముఖాన నెత్తురు చుక్క లేదు. శిష్యులంతా నోళ్లు వెళ్లబెట్టారు. భజగోవిందం ప్రయాగదిశగా ప్రయాణిస్తూ కొనసాగింది. దారిలో కనిపించిన వ్యక్తులు, సమాజ పరిస్థితులు అందులో ప్రతిఫలించాయి. మూర్ఖుడా! ధనతృష్ణను విడిచిపెట్టు. అల్పమతీ! వైరాగ్యాన్ని పెంచుకో. స్వయంకృషితో సంపాదించిన దానితోటే మనస్సును సంతోషపెట్టుకో. స్త్రీవ్యామోహంలో చెడిపోకు. ఆ అందచందాలన్నీ కేవలం మాంసపు ముద్దలే అని మాటిమాటికీ మనసుకు నచ్చచెప్పుకో. మానవ జీవితం తామరాకుమీద నీటిబొట్టులా అనుక్షణం కదలాడిపోతూ ఉంటుంది. ఏ క్షణంలో అయినా ఆ నీటిబొట్టు చెరువులో కలిసిపోవచ్చు. ఈ సంసార సాగరాన్ని తరింపచేసే నౌక సాధుసంగం మాత్రమే అని తెలుసుకో. నీకు డబ్బు సంపాదించే శక్తి ఉన్నంత వరకే భార్య అయినా, కొడుకులైనా ప్రేమ చూపిస్తారు. నీ దేహం జరాగ్రస్తమై, నువ్వు మూలన పడితే... ఈ పూట ఎలావుందీ అని పలకరించే దిక్కు కూడా ఉండదు. నీ ఒంటిలో ప్రాణం ఉన్నంతవరకూ కనీసం ఇంటిలో అయినా ఉండనిస్తారేమో. కానీ ఒక్కసారి కడ ఊపిరి విడిచిన తరువాత నీ శవాన్ని తాకడానికి నీ భార్య కూడా ఇష్టపడదు. బాలుడు క్రీడాసక్తుడు. యువకుడు లలనా లోలుడు. వృద్ధుడు చింతామగ్నుడు. ఎంత వెతికినా పరబ్రహ్మపై సంపూర్ణంగా మనసు నిలిపిన వాడు ఒక్కడూ కనబడడు. సోదరా! ఈ ప్రపంచం చాలా చిత్రమైనది. నీ భార్య ఎవరు? నీ పుత్రులెవరు? వారేమీ నీకు శాశ్వతం కాదు. వారిలో నువ్వు ఎవ్వరి వాడవూ కాదు. ఎక్కడి నుంచి అసలిక్కడికి వచ్చావో... ఎక్కడికి పోతున్నావో ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించు. నువ్వు జీవన్ముక్తుడివి అయితే తప్ప ఈ విషవలయం నుంచి బయటపడలేవు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః సజ్జనులతో కలిసి తిరిగేవాడే విషయవాసనలకు దూరంగా ఉంటాడు. అలా ఉన్నప్పుడే మోహపు తెరలు తొలగుతాయి. దానివల్ల చలించని తత్త్వం... తద్వారా జీవన్ముక్తి సాధ్యమవుతాయి. నీరు ఎండిపోయాక చెరువు మాయమైపోతుంది. డబ్బు ఖర్చయిపోగానే నీ చుట్టూచేరిన భజనగాళ్లు మాయమైపోతారు. అలాగే వయసు జారిపోయిన తరువాత కామవికారం కూడా తగ్గిపోతుంది అనుకోవద్దు సుమా! తత్త్వ విచారం చేసిన వాడికి మాత్రమే సంసార చక్రబంధం నుంచి విముక్తి లభిస్తుంది. అర్థబలం, అంగబలం ఉన్నాయని, వయసు పోడిమి ఉందని గర్వం పొందకు. కాలపురుషుడు తలచుకుంటే అన్నింటినీ క్షణంలోనే మాయం చేయగలడు. ఈ కనిపిస్తున్నదంతా మాయ అనుకోవడమే నీకు మేలు కలిగిస్తుంది. తత్త్వాన్ని గ్రహించినవాడికే బ్రహ్మపదం లభిస్తుంది. ఎంతగా ఏమి బోధచేసినా ఏం లాభం సోదరా! రాత్రింబవళ్లు, ఉదయాస్తమానాలు, శిశిర వసంతాలు ఎన్నెన్నో వెళ్లిపోతూ మళ్లీ వస్తూ ఉన్నాయి. కాలక్రీడలో ఆయుష్షు చెల్లిపోతూనే ఉన్నది. కానీ నీలో ఆశ మాత్రం పోవడం లేదా? గోవిందుణ్ణి భజించు. నీ ప్రయత్నాల కంటే, నీ సంకల్పాల కంటే బలవత్తరమైనది అదే... నిన్ను రక్షించేది అదొక్కటే. అప్పటికి పన్నెండు శ్లోకాలు పూర్తయ్యాయి. శంకరయతి త్రివేణీ సంగమాన్ని చేరుకున్నాడు. వేణీమాధవుని అర్చించి బయటకు వచ్చాడు. శిష్యులు భజగోవిందం అంటూ పదేపదే పాడుకుంటున్నారు. ద్వాదశ త్రిపుండ్రాలను ధరించిన వైష్ణవుడొకడు పరుగు పరుగున వచ్చి శంకరుని పాదాలపై పడ్డాడు. ‘‘స్వామీ! ఈ అంతులేని దుఃఖానికి అసలు కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు. ‘‘జీవుడు దేహధారి కావడమే కారణం. జన్మించినది లగాయతు ఈ దేహమే నేను అనే మమత్వాన్ని పెంచుకోవడమే అసలు కారణం. అదే జన్మ పరంపరలను సృష్టిస్తోంది’’ అన్నాడు శంకరుడు. ‘‘అయితే ఈ మమకారమే జన్మకు కారణమా?’’ మళ్లీ అడిగాడతను. ‘‘కాదు... కర్మ. ఇది మూడు విధాలుగా ఉంటుంది. ప్రారబ్ధం భూతకాలానికి చెందినది. ఆగామి భవిష్యత్తును సూచిస్తుంది. సంచిత కర్మ అంటే పోగుచేసుకునేది... అది ఏ కాలానికైనా చెందవచ్చు. ఆగామి, ప్రారబ్ధ కర్మలలో ఏ కర్మ ముందుగా పరిపక్వమై ఫలోన్ముఖమవుతుందో ఆ కర్మలను జీవుడు ఆచరిస్తూ ఉంటాడు. దానికి అనురూపమైన జన్మలనే పొందుతుంటాడు’’ అన్నాడు శంకరుడు. ‘‘అయితే కర్మబంధాల నుంచి విముక్తం కావడం ఎలా... నిష్క్రియాపరులుగా మారిపోవాలా? ప్రజలందరూ సన్యాసులు కావాలా?’’ ‘‘అవసరం లేదు. సన్యాసి కూడా నిష్క్రియాపరుడు కాలేడు. ఆత్మానాత్మ వివేకం చేసుకున్న వాడే కర్మబంధాల నుంచి బయటపడతాడు’’ వివరించాడు శంకరుడు. ‘‘ఏది ఆత్మ, ఏది అనాత్మ?’’ ‘‘ఆత్మ సత్పదార్థం శాశ్వతమైనది.’’ ‘‘మరి అనాత్మ?’’ ‘‘ఆత్మ ఏదో తెలుసుకుంటే చాలు. అనాత్మకు ప్రత్యేకమైన అస్తిత్వమంటూ లేదు. ఇది ఎలాగంటే వెలుగుకు నిర్వచనం తెలిస్తే చాలు. ఆ వెలుగు లేకపోవడమే చీకటి అని అర్థం అవుతుంది కదా! అలాగే ఆత్మను గురించి ఎరుక కలిగించుకుంటే చాలు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఆ ఎరుక కలిగేదెలా? ఇంతకూ సత్పదార్థాన్ని తెలుసుకునేందుకు అవరోధంగా మారే అజ్ఞానం మనిషిలో ఎలా ప్రవేశిస్తుంది?’’ ‘‘అజ్ఞానం ఎప్పుడు మొదలైందో ఎవరూ చెప్పలేరు. దాన్ని నిర్వచించడం కూడా కుదరదు. కానీ అజ్ఞానం వల్లనే అవివేకం, దేహాభిమానం, రాగద్వేషాలు పెంపొంది వాటినుంచి పుట్టిన చిత్తవృత్తులు కర్మకు కారణమవుతున్నాయి. చిత్తవృత్తుల చేత రూపొందే కర్మలే జీవుణ్ణి శరీరం పొందేలా పురికొల్పి దుఃఖానికి గురి చేస్తున్నాయి. మానవుణ్ణి కోరికల పుట్టగా తయారు చేస్తున్నాయి.’’ ‘‘కోరికలే దుఃఖానికి మూలమా?’’ ‘‘కాదు. అవిద్యయే దుఃఖానికి మూలం. కోరికలకు మూలమైన కర్మవలయంలో మానవుడు తాదాత్మ్యం చెందడమే అసలు కారణం. నిజానికి కర్మకు అజ్ఞానానికి విరోధం లేదు. అవిద్యావంతుడు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాడు కదా! కానీ అవిద్యవల్ల భేదజ్ఞానం పుడుతుంది. అది భయాన్ని కలిగిస్తుంది. జ్ఞానం మాత్రమే భయరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. అద్వైతసిద్ధిని కటాక్షిస్తుంది’’ అన్నాడు శంకరుడు. వైష్ణవ శిష్యుడు తన్మయుడై తన ఆత్మావిష్కారం ఇలా చేసుకున్నాడు.... పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయా పారే పాహి మురారే మళ్లీ పుట్టడం, మళ్లీ మరణించడం.. మళ్లీ పుట్టడం కోసం జనని గర్భంలో శయనించడం.. ఈ ప్రపంచంలో అగచాట్లు పడుతూ జీవించడం ఈ జనన మరణ చక్రభ్రమణాన్ని ఛేదించాలంటే ఓ మురారీ! నీవు కృప చూపి రక్షించాల్సిందే.. అన్నాడు. అతడే తరువాతి కాలంలో దృఢభక్తి ఆచార్యుడై శంకర శిష్యునిగా వినుతికెక్కాడు. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
మనిషి – మనీషి
కాశ్యాంహి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితా న తేన ప్రాప్తాహి కాశికా – ఈ కాశీలోనే ఆత్మజ్ఞానమనే కాశిక ప్రకాశిస్తుంది. జ్ఞానరూపమైన ఈ కాశికయే సమస్తాన్నీ ప్రకాశింప చేస్తోంది. దీనిని ఎరిగిన వారికే కాశీప్రాప్తి కలుగుతుంది... మణికర్ణికలో మునుగుతున్న వేళ శంకరుడి మనసంతా కల్లోలంగా ఉంది. గంగలో సుడుల్లాంటి ఆలోచనలు నైమిత్తికాలను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఆత్మవిచారణలో లీనమై ఆవలి ఒడ్డుకేసి చూస్తూ చాలాసేపు నీళ్లలోనే ఉండిపోయాడు. దూరం నుంచి విశ్వనాథాలయ ఘంటానాదం ఓంకారంగా పరావర్తన చెంది, గంగా తరంగాలపై నడిచి వచ్చి శంకరుని దేహమంతా నిమురుతోంది. కాశీవాసులకు అహరమమూ జ్ఞానభిక్ష పెట్టే అన్నపూర్ణ దయామయి. ఒకప్పుడు వ్యాసుణ్ణి పరీక్షించడానికి మూడురోజుల పాటు ఆహారం దొరకకుండా చేశాడట విశ్వనాథుడు. ఆకలి బాధ తట్టుకోలేక శిష్యులు పడుతున్న వేదన చూడలేక కినుక వహించిన వ్యాసుడు కాశీనే శపించబోయాడట. అప్పుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసునికి, ఆయన శిష్యులకు కడుపార అనేక వంటకాలతో తినబెట్టిందట. కాశీని శపించబోయినందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోమని వెలివేసిందట. తప్పు చేసినా, బిడ్డమీద తల్లికెంత ఆప్యాయత?!.... శంకరుని మనసులో వ్యాసుని వృత్తాంతమంతా మెదులుతోంది. ‘భర్తను కోల్పోయి హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ స్త్రీ ఇందాక ఎంత వేదాంతం చెప్పింది?! శవాన్ని పక్కకు జరపమంటే ముందు బదులు చెప్పలేదు. నాకు చెప్పే బదులు నువ్వే కాస్త సాయం పట్టు బాబూ! అనలేదామె. ఆ చెప్పేదేదో శవంతోనే చెప్పమంది. సమస్తాన్నీ నడిపించే పరబ్రహ్మ చైతన్యం శవాన్ని పక్కకు జరపలేదా? అని ప్రశ్నించింది. ఎంత చిత్రం? రోదన తీరును బట్టి అవిద్యావంతురాలిలా కనిపించిన ఆమె సత్యాన్ని ఎంత చిత్రంగా చెప్పింది?!’ అనుకుంటున్నాడు శంకరుడు. గంగాస్నానానికి వెళ్లిన ఆచార్యుడు ఎంతకూ వెనక్కు తిరిగి రాకపోవడంతో సనందుడు, విష్ణుశర్మ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. గంగలో పసిపిల్లవాడిలా కనిపిస్తున్న శంకరుణ్ణే చూస్తూ గట్టుమీద కూర్చున్నారు. ఆనందగిరి అప్పటికే స్నానం కానిచ్చి విశ్వేశ్వర దర్శనం కోసం ఆత్రుత పడుతున్నాడు. అప్పుడే సూర్యోదయమవుతోంది. గంగలో తళుక్కుమనే చేపల కోసం పక్షుల వేట అప్పుడే మొదలైపోయింది. ‘ఈ మణికర్ణిక ఒడ్డున ప్రాణాలు విడిచిన వాడికి సాయుజ్య మోక్షమిచ్చేందుకు శివకేశవులు ఇద్దరూ పోటీ పడతారట. ఇద్దరిలోనూ మొదటిగా విష్ణువు, ఈ మనుష్యుడు నా రూపం పొందుగాక! అంటాడట. దానికి శివుడు సమాధానం చెప్పేలోపలే మరణించిన మనిషి శ్రీవత్స లాంఛనుడై, పీతాంబర ధారియై, గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళ్లపోతాడట. ఓహో ఏమి చిత్రం! విష్ణువు ఒక్కడే... శివుడూ ఒక్కడే. కానీ ఈ మణికర్ణికలో మునిగిన ప్రతివారూ శివుడుగానో, విష్ణువుగానో మారిపోయినట్లయితే... శివుడు ఒక్కడే విష్ణువు ఒక్కడే అనే మాట ఎలా నిజమవుతుంది?’ తర్కించుకుంటూనే శంకరుడు ఎలాగో ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చాడు. ఆలోచనల బరువుతో అడుగులు భారంగా పడుతున్నాయి. శిష్యులు ముందు నడుస్తున్నారు. ఎదురుగా ఒక చండాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వాడి వాలకం చూస్తుంటేనే రోత పుడుతోంది. తెల్లగా తెల్లవారకముందే ఒక చేత కల్లుముంత పట్టుకున్నాడు. ఒక పడుచుకత్తె బుజాలపై చేతులు ఆన్చి తూలుతూ నడుస్తున్నాడు. వీపుమీద ఏదో జంతువు తోలు వేళ్లాడుతోంది. దానినుంచి కారే రక్తపు చుక్కల కోసం ఎగబడుతూ నాలుగు కుక్కలు వెంబడిస్తున్నాయి. అసలే అది ఇరుకు దారి. ‘‘ఏయ్! పక్కకు తప్పుకో’’ అన్నారు శంకర శిష్యులు. ‘‘వెలుగులో అయినా, చీకట్లో అయినా మడిసిని నడిపించేది.... అదేదో వేరే ఉంటదంటగా. అసలే తడబడుతున్నాను. కాస్త ఓపిక పట్టండి సాములూ’’ అన్నాడు చండాలుడు. ‘‘ఏమిటా ప్రేలాపన. తొందరగా తప్పుకో.’’ ‘‘ఉండండి సాములూ! ఇందాక ఇదే మాట నాతో సెప్పమని మా ఆడది అడిగితే.... బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా అయిపోయాడు మీ పెద్దసామి. మా బాగోతం మీకు పూర్తిగా తెలదులే.’’ శంకరుడప్పటికి తలపైకెత్తి చూశాడు. కనుచీకట్లో ఇందాక చూసిన ఆ మొగుడూ పెళ్లాలిద్దరినీ వెంటనే పోల్చుకోలేక పోయాడు. అప్పుడు శవంగా కనిపించింది ఇప్పుడు సజీవుడైన వ్యక్తేనా? అప్పుడు తనతో మాట్లాడింది అతని పక్కనున్న ఆమెయేనా? సందిగ్ధంలో పడ్డాడు శంకరుడు. ‘‘గురువా! నీ పలుకంటే నాకు ప్రేమ పుట్టిందనుకో. నేను పోతాను. కానీ నాలో ఉన్న వెలుగు నిన్ను వదిలి పోతుందా? నీలో నాలో ఉన్నదొక్కటే వెలుగు. వేరే లేదంటావుగా. నువ్వు దీపం పెడితే చీకటి పోతుంది. అయినా నీది మరీ చోద్యం గురువా! ఎర్రటి ఎండలో నిలబడి కళ్లకు గంతలు కట్టుకుంటే మాత్రం... చీకటి వస్తుందా? నీ ముందు నిలుచుంటే ఎవడైనా అంతే. అయినా ఈ కాశీలో నాకు నువ్వు, నీకు నేను ఎదురు పడకుండా ఎలా కుదురుతుంది? ఈ గడ్డ ఇద్దరిదీ కదా! సరే... నీ మాటకే వస్తాను. తప్పుకు పోతాను. ఇంతకూ ఎవరు తప్పుకోవాలి? నేనా... నాలో ఉన్న ఆత్మా? అరిచ్చంద్ర మెట్టులో పీనుగులకు మోచ్చమిచ్చేదీ మనికర్నికలో నువ్వు మునిగేదీ ఒకే గంగ కదా! అక్కడా ఇక్కడా గంగలో ఒకే సూరీడు కనిపిస్తాడు కదా! ఇంతకూ నువ్వు సెప్పే సదువుల వెలుగుకు వీడు బేంబడు, వీడు మరొహడు అనే తేడాలుంటాయా?’’ ప్రశ్నించాడు చండాలుడు. శంకర శిష్యులు బిత్తరపోయి చూస్తున్నారు. ఆచార్య శంకరుడు అదాటున ఆ చండాలుని ముందు సాగిలపడి లేచాడు. ఆయనకు చండాల దంపతుల స్థానంలో గౌరీశంకరులు చిరునవ్వుతో దర్శనమిచ్చారు. నాలుగు కుక్కలూ నాలుగు వేద పురుషుల్లా మారిపోయారు. ‘‘వత్సా! శంకరా! నేడు లోకంలో భేదభావాలు పెచ్చుమీరిపోయాయి. వాటిని నిర్మూలించ వలసిన గురుతర బాధ్యత నీపై ఉంది. భేదవాదులందరినీ నీ అద్వైతప్రజ్ఞతో జయించు. పండితుల మొదలు పామరుల వరకూ నీ బోధలను అందరూ, నేను నెత్తిన నెలవంక పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. విజయీభవ!’’ అన్నాడు శంకరుడు. గౌరీసమేతంగా అంతర్హితుడయ్యాడు. ఇతరుల కళ్లకు మాత్రం ఇంకా చండాలుడే కనిపిస్తున్నాడు. అతగాడికి మత్తు వదిలిపోయింది. గడగడ వణికిపోతున్నాడు. ‘‘తప్పు కాయి సామీ!’’ అంటూ లెంపలేసుకుంటూ అక్కడినుంచి త్వరత్వరగా వెళ్లిపోయాడు. శిష్యసమేతంగా శంకరుడు అక్కడినుంచి కదిలాడు. మనీషాపంచకం ఆసక్తికరంగా మొదలైంది. ‘‘వాడు తప్పతాగి ఉన్నాడు’’ అన్నాడు కుతకుత ఉడికిపోతూ ఆనందగిరి. శంకరుడిలా సమాధానం చెప్పాడు. ‘‘చైతన్యానికి అవస్థాభేదాలు లేవు. మెలకువలోనూ, నిద్రలోనూ, స్వప్నంలోనూ కూడా అది అత్యంత స్ఫుటంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే బ్రహ్మ మొదలు చీమ వరకూ అంతటికీ అంతస్సాక్షి. నేను ఆ చైతన్య స్వరూపాన్నే కానీ జడపదార్థాన్ని కాను... అనే దృఢజ్ఞానం పొందినట్లయితే చండాలుడైనా, విప్రుడైనా అతడిని నేను గురువుగా భావిస్తాను.’’ ‘‘బొత్తిగా చదువు సంధ్యలు లేనివాడు’’ మళ్లీ సణిగాడు ఆనందగిరి. ‘‘నేను బ్రహ్మమును. నా కంటికి కనిపిస్తున్న ఈ జగత్తు అంతా నా చిత్తం చేస్తున్న కల్పన. ఇది కేవలం నాలోని సత్త్వ రజస్తమో గుణాల వల్ల, అవిద్య వల్ల ఏర్పడింది... అని ఎవడైతే నిత్యము, నిర్మలమైన పరబ్రహ్మముపై దృఢబుద్ధిని నిలిపి ఉంచుతాడో వాడు చండాలుడైనా, విప్రుడైనా నాకు గురువే.’’ ‘‘వాడు జాతి చండాలుడు’’ రుసరుసలాడాడు ఆనందుడు. ‘‘గురువాక్యంపై శ్రద్ధ ఉండాలి. దాన్ని నిత్యమూ ఎల్లవేళలా అనుసంధానిస్తూ ఉండాలి. అఖిల విశ్వమూ అనిత్యమని తెలియాలి. సంశయము, ఏమరుపాటు లేకుండా కోరికలు లేని శాంతచిత్తంతో నిరంతరమూ బ్రహ్మధ్యానంలో గడపాలి. గతంలోనూ రేపటిరోజున నేను చేసిన, చేయబోయే దుష్కృతాలన్నింటినీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేశాను. గతకర్మల నుంచి సంచితంగా నాకు దక్కిన ఈ దేహాన్ని సదసత్ చింతనకు సమర్పణం చేశాను... అనే భావన కలవారే నావారు.’’ ‘‘తప్పుకోరా అంటే అంత సాగదీయాలా?’’ యథాలాపంగా అన్నాడు ఆనందుడు. ‘‘మానవులే కాదు... దేవతల మొదలు మృగాదుల వరకు దేనిని ‘నేను’ అని అత్యంత స్పష్టంగా గుర్తిస్తున్నారో... దానివల్లనే అచేతనాలైన శరీర ఇంద్రియ అంతఃకరణాలు సైతం ప్రకాశాన్ని పొందుతున్నాయి. సూర్యుని వల్లనే పుట్టిన మేఘాలు గగనాన్ని చేరుకోగానే ఆ సూర్యమండలాన్నే కప్పేసినట్లు... అవిద్య వల్ల ఆ నేను తెలియకుండా కనిపించకుండా పోతుంది. మేఘాలు కప్పేసినా సూర్యుని స్వయంప్రకాశత్వానికి లోటు లేదు. ఆ చైతన్యాన్నే సదా భావిస్తూ శాంతచిత్తుడైన యోగి ఎవడైనా గొప్పవాడే... నాకు గురువే. ఇది నా నిశ్చయం. ‘‘గొప్పవారిని ఎదిరించడం ఘనత అనుకున్నాడు కాబోలు’’ అసహనం తొణికింది ఆనందునిలో. ‘‘ఆనంద సముద్రంలో లోటు, కొరత లేవు. దానిలోని కణలేశాన్ని మాత్రమే పొందిన ఇంద్రాది దేవతలు గొప్ప సుఖాన్ని పొందుతున్నారు. నిర్వృత్తి రహితమైన ఆ ఆనందాన్ని చిత్తవృత్తులను నిరోధించి మునులు ప్రశాంతచిత్తంతో పొందడానికి ప్రయత్నిస్తారు. ఆ నిత్యసుధా సముద్రంలో బుద్ధిని మునక లేయించినవాడు బ్రహ్మవేత్త కాదు... బ్రహ్మయే అవుతున్నాడు. అటువంటి వారికి దేవేంద్రాదులు సైతం సాహోలు పలుకుతారు. ఇది నా నిశ్చితాభిప్రాయం.’’ ‘‘అంత వేదాంతం మాట్లాడాడు... చివర్లో భయపడ్డాడేం?’’ రెట్టించాడు ఆనందగిరి. శంకరుడు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. ‘‘శివుడైనా, విష్ణువైనా ఉపాధి ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా!’’ అన్నాడు సనందుడు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా భక్తిః శ్రద్ధా గయేయం నిజగురు చరణ ధ్యానయోగః ప్రయాగః విశ్వేశో అయం తురీయః సకల జనమనః సాక్షిభూతో అంతరాత్మా దేహోసర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి – పంచకోశాలు కలిగిన కాశీక్షేత్రమే ఈ శరీరం. ఇక్కడి జ్ఞానగంగ త్రిభువనాలకూ జనని. భక్తి శ్రద్ధలే గయ. నిజగురువు చరణాలపై ధ్యానాన్ని నిలిపే యోగమే ప్రయాగ. సకల జనుల మనస్సులలో అంతరాత్మగా, సాక్షిభూతునిగా ఉన్న విశ్వేశ్వరుడే అంతిమంగా కోరదగినవాడు. ఈ సర్వమూ నాలోనే వెలయుచుండగా ఇతర తీర్థాలతో పనేమిటి?... అంటూ శంకరుడు కాశీపంచకాన్ని ముగించాడు. విశ్వనాథుని మందిరం బయట అంతా కోలాహలంగా ఉంది. లోపల విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. రాజభటులు, పరివారానికి వీధులలో చోటు చాలడం లేదు. లోపల మాహిష్మతీ యువరాజు అమరుకుడు ఉన్నాడు. త్వరలోనే అతడి పట్టాభిషేక మహోత్సవం. ముందుగా విశ్వనాథుని దర్శించడానికి వచ్చాడు. రాజదర్శన సమయంలో ఇతరులకు ప్రవేశం లేదు. గురువులకు కూడా అందులో మినహాయింపు ఉన్నట్లు లేదు. శంకరుడు వెనుతిరిగి, శిష్యసమేతంగా అన్నపూర్ణా మందిరం వైపు సాగిపోయాడు. ‘‘దేవుడి ముందు అందరూ సమానమే కానీ, రాజు–పేద తేడాలున్నాయి కదూ ఆచార్యా!’’ అన్నాడు ఆనందగిరి అక్కసుగా. శంకరుడేమీ సమాధానం చెప్పలేదు. కానీ ఇందాక శంకరుడు ఇచ్చిన వివరణతో ఆనందగిరి సమాధాన పడలేదన్న విషయం విష్ణుశర్మకు, సనందునికి అర్థమైంది. ఆనాటి రాత్రి అతడిని బుజ్జగించే పని పెట్టుకున్నారు వారిద్దరూ. ‘‘మన స్వామి సంగతి నీకింకా సరిగ్గా తెలీదయ్యా! ఓసారిలాగే శ్రీశైలం అడవుల్లో ఓ చెంచుల కుర్రాడు వచ్చాడు. అతగాడికీ దండం పెట్టాడీయన’’ చెప్పాడు విష్ణుశర్మ. ‘‘ఇలా కనిపించిన వాడికల్లా మొక్కుతూ పోతుంటే ఎలాగయ్యా! గురువంటే ఎలా ఉండాలీ? ఆయన ఒప్పుకున్నా మన మనసుకు నప్పుతుందా?’’ అడిగాడు అనంతగిరి. ‘‘అదే మరి చిత్రం. ఆ కుర్రాడే ఈయన్ని నర్మద ఒడ్డున నీ గురువున్నాడు. వెళ్లి కలుసుకోమని చెప్పాడు. నేను చెవులారా విన్నాను. ఆ తర్వాత నేను కూడా ఆ కుర్రాడికి మొక్కాననుకో... అది వేరే విషయం. నా కళ్లకి అతగాడు మా వినాయక స్వామిలా కనిపించాడు మరి’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అప్పుడంటే నీకు కనిపించాడు కనుక, నమ్మావు. ఇప్పుడు మనకేమీ కనిపించలేదే?! అబ్బబ్బ! వాణ్ణి తలచుకుంటే ఇంకా శవాల కంపు ముక్కునొదిలి పోవట్లేదయ్యా!’’ బాధగా అన్నాడు ఆనందగిరి. సనందుడు అందుకున్నాడు. ‘‘కనిపించే రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం మంచిది కాదు ఆనందా! నా కథ చెబుతా విను. అప్పుడు నృసింహుణ్ణి ఉపాసన చేస్తూ అహోబిల అరణ్యంలో ఉన్నాను నేను. ఓసారి నా దగ్గరకు ఓ ఆటవికుడు వచ్చాడు. ‘ఎందుకు సామీ! ఈ అడివిలోకి వచ్చావు? భయం లేదా?’ అని అడిగాడు. ‘నా స్వామిని వెతుక్కుంటూ వచ్చానయ్యా!’ అన్నాను. ‘తప్పిపోయాడా... గుర్తులు సెప్పు. వెతికి పట్టుకొచ్చి అప్పగిత్తా’ అన్నాడు వాడు. నాకు నవ్వొచ్చింది. సింహం తల, మనిషి మొండెం ఉంటాయని చెప్పా. ‘ఇక నాకొదిలేయ్’ అంటూ వెళ్లిపోయాడు వాడు. వెళ్లిపోతున్న వాణ్ణి చూస్తే నాకు చాలా జాలి వేసింది. రెండు మూడు రోజులు గడిచేసరికి నేనున్న చోటు వెతుక్కుంటూ వచ్చాడు వాడు. అడివిచెట్ల తీగలతో అల్లిన తాడొకటి నా చేతిలో పెట్టాడు. ‘ఇదిగో సామీ! మళ్లీ తప్పిపోకుండా బద్రంగా సూసుకో’ అంటూ నాకు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ తాడు రెండోకొస నా నృసింహస్వామి మెడలో వేళ్లాడుతోంది. ఇప్పుడు నేనెవరికి నమస్కరించాలి? ఈ స్వామికా... ఈయన్ని పట్టితెచ్చిన ఆ ఆటవికుడికా?? ఈయన ఎవరికైతే సులభంగా పట్టుబడ్డాడో ఆయన మళ్లీ కనిపించలేదు నాకు.’’ – సశేషం నేతి సూర్యనారాయణ శర్మ