తన భార్యకే వందమంది భార్యలుగా మారాడు | Shankara Vijayam Part 32 In Telugu | Sakshi
Sakshi News home page

హంసః సోహం

Published Sun, Feb 9 2020 11:46 AM | Last Updated on Sun, Feb 9 2020 11:46 AM

Shankara Vijayam Part 32 In Telugu - Sakshi

సర్వత్ర ప్రాణినాం దేహే జపో భవతి సర్వదా
హంసః సోహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే
ప్రాణులందరిలోనూ నిరంతరమూ వాయురూపమైన ఒక జపం జరుగుతూనే ఉంటుంది. అదే సోహం. నిశ్వాసను హం అని, ఉచ్చ్వాసను సః అని గుర్తించాలి. వీటి క్రమగతి హంసస్సోహమవుతుంది. ఆత్మరూపమైన ఈ హంసకు కాంతిపుంజాలైన తెల్లటి రెక్కలుంటాయి. ఆ రెక్కల చప్పుడును గుండె సవ్వడితో పోల్చుకోవచ్చు. మనస్సుకు కూడా వినబడనంతటి సూక్ష్మగతిలో దీని ప్రయాణం ఉంటుంది. గాలిని కుంభించినా పూరించినా విడిచిపెట్టినా ప్రాణహంస స్థూల తేజో వాయు రూపాలు ధరించినట్లుగానే యోగులు ధ్యానిస్తూ ఉంటారు. ఇది ఎలా వికసిస్తుందో, జీవుని నిలయమైన దేహంలో ఈ హంసకు ఆహారం ఏమిటో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. కానీ జీవునిలోని విషయ వాసనలన్నీ కర్మేంద్రియాలకు దిగవిడిచి, ఇది జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థానాల మధ్య ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పరిభ్రమిస్తూ ఉంటుంది.

జాగ్రదవస్థలో జీవుడు ప్రాణహంసను గుర్తుపట్టనే లేడు. కర్మదేహేంద్రియాల సంఘాతమనే మాయచీర అడ్డుగా ఉంటుంది. అందువల్లనే దేహవ్యాపారం మృత్యురూపమైన కర్మలతో కూడుకుని ఉంటుంది. స్వప్నంలో కర్మనుంచి విముక్తమైనా జీవునికి కామనలు ఉండనే ఉంటాయి. సుషుప్తిలో మాత్రమే ఆత్మ అసంగంగా ఉంటుంది. ప్రసన్నంగా ఉంటుంది. 
జాగ్రదవస్థలో స్థూలభోగాలను అనుభవించే ఆత్మ విశ్వుడు. స్వప్నవేళ తైజసుడని, సుషుప్తిలో ప్రాజ్ఞుడని పిలుస్తారు. ఈ ప్రాజ్ఞుడే జీవునికి అధ్యక్షుడు కాగా పరమాత్మ తురీయు.  ప్రాజ్ఞుడు, తురీయుడు ఇద్దరూ హంసరూపులే. సుషుప్తిలో మన ప్రమేయం లేకుండానే వారిద్దరూ కలివిడిగా ఉంటారు. కర్మబంధాల వల్ల, మనస్సు చేసే తొందరింతల వల్ల, పగలెల్లా చేసిన కష్టం వల్ల జీవుడు పొందిన అలసటను తీర్చి, ఇంద్రియాలు తిరిగి అతడికి సహకరించేలా తగు వైద్యం చేసేది సుషుప్తిలోని ప్రాజ్ఞుడే. జాగ్రదవస్థలో ఉన్న దశలోనే సుషుప్తి స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఆ స్థితిని అందుకోగలిగితే జీవుడు కర్మబంధాల నుంచి విముక్తుడవుతాడు. ఇంధనం అందితే యంత్రం నిర్విరామంగా పనిచేసినట్లు ఈ నిర్వాణయోగాన్ని పొందినవాడు నూత్న యవ్వనుడవుతాడు.

జాగ్రదవస్థలో ఉన్నప్పుడే సుషుప్తిలోని ప్రాజ్ఞునితో మౌనంగా రమిస్తూ ఉండడమే సమాధి అంటారు. సమాధిని అనుగ్రహించే ఈ ప్రాజ్ఞుడికి దేశకాలాలు లేవు కానీ, దేహానికి ఉన్నాయి. స్వప్నంలో ఒకడు చేసిన ప్రయాణం మెలకువ రాగానే నిజం కాదని తేలుతుంది. కానీ సుషుప్తిలోని ప్రాజ్ఞుడు చేసే ప్రయాణాలు అటువంటివి కావు. అతడు నిత్య చలనశీలుడు, అగ్ని స్వభావుడు. అగ్ని లక్షణం కాల్చివేయడం. విషయ వాసనలతో నిండివున్న కట్టెలాంటి మానవుని దేహాన్ని తన శక్తితో కాల్చివేసి, జీవుణ్ణి పరిశుద్ధం చేయాలని నిరంతరమూ ప్రయత్నిస్తుంటాడు.
జీవుడు ఇంద్రియ శక్తులన్నింటినీ కూడగట్టుకుని, తనలో ప్రాణాన్ని ధరించి ఉంచుకుంటాడు. ఆ ఇంద్రియాలకే దాస్యం చేస్తూ అధోగతి పాలవుతూ ఉంటాడు. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలన్నింటా ఏ దశలోనూ మానవుడికి ఈ పంచప్రాణాలను కట్టివుంచుకునే శక్తి ఉండినంత సేపూ, ఒకేతీరులో ఉండదు. అసహాయత, అవశత్వం ఆవరించినప్పుడు తేలికగానే మోసపోతాడు.

బలహీనత, భయం చుట్టుముట్టినప్పుడు సహజ మరణమే కనుక సంప్రాప్తిస్తే కర్మరూపమైన కాలపాశం జీవాత్మను తదుపరి స్థానానికి తీసుకుపోతుంది. పుర్యష్టకాలనే ఎనిమిది శరీరాల్లో బంధితుడైన జీవాత్మ ప్రయాణం దేహం నుంచి దేహానికి సాలెపురుగు నుంచి వెలువడే దారపు పోగులుగా సాగిపోతూనే ఉంటుంది. 
సృష్టి ప్రారంభంలో మూడుపేటలుగా పురిపెట్టిన దారాలతో రూపొందించిన కండె నుంచి... పడుగు పేకలుగా అల్లుకునే దేహమనే వస్త్రాన్ని కప్పుకుని భూమికి వచ్చినవాడు జీవుడు. ఈ మాయాపటం (తెర) చించివేసి ఆవలికి చూడు... ఈవల ఉన్న నువ్వే ఆవల కూడా ఉన్నావని ఎరుక పడుతుందంటాడు శంకరుడు. అదే నీవైన పరమాత్మను అద్వైతివై ధ్యానిస్తే ముక్తి సాధ్యపడుతుందని ఆ జగద్గురువు ఇచ్చిన సందేశం. 
ఇక అపమృత్యువు అంటే మరణావస్థ ఏర్పడిన దశలోనూ, అకాలమృత్యువు సంభవించబోయే దశలోనూ జీవుణ్ణి కాపాడాలని సంకల్పించిన మహాత్మ ఒకటి కనుక ఉంటే తప్పకుండా ఆ పనికి పూనుకుంటుంది. మహాసమ్మోహన తంత్రాన్ని ప్రయోగించే సామర్ధ్యం ఉన్న మహాత్మ... తాను రక్షించ దల్చుకున్న జీవాత్మను రక్షించి తీరుతుంది. 
అయితే ఏదైనా కోరుకోవడంలో ఉంటుంది. దేహాన్ని విడిచిపెట్టేసే చిట్టచివరి క్షణంలో మానవుడు దేనిని నిశ్చయంగా కోరుకుంటున్నాడో, అదే అతడికి తదుపరి జన్మకు కారణమవుతుంది.  మరణావస్థ నుంచి బయట పడినవాడిలోనూ ఇలాగే జరుగుతుంది. అమరుకుని కథలోనూ ఇదే జరిగింది.

తన చావు ఖాయమే అనుకున్న దశలో అమరుకుడు ‘హా పుత్రా!’ అంటూ శోకించడం ఆచార్య శంకరుని చెవిన పడింది. అతడి చివరి కోరిక తీర్చడానికే తాను హంసరూపుడినై పరకాయ ప్రవేశం చేశానని శంకరుడు స్వయంగా పద్మపాదునితో చెప్పినట్లు శంకర విజయాలన్నీ చెబుతున్నాయి. విడ్డూరం ఏమిటంటే ఆనాటి వరకూ అమరుకునికి సంతానమే లేదు. ఆ సంగతి పాపం అమరుకుడికి గుర్తులేదు.
రాజదేహాన్ని కైవసం చేసుకుని రాక్షస రాజ్యాన్ని స్థాపించాలని మాయావి వేసిన ఎత్తుగడను శంకరుడు చిత్తు చేశాడు. పులివేషంలో వచ్చి ప్రాణనాడులు కనలిపోయేలా వాడు కొట్టిన దెబ్బనుంచి సంపూర్ణంగా కోలుకునే దాకా రాజదేహాన్ని రక్షించే బాధ్యతనూ శంకరుడు స్వచ్ఛందంగా స్వీకరించాడు. కనుకనే పరకాయ ప్రవేశానికి పూనుకున్నాడు. చూస్తుండగానే ఒక మాసం పూర్తి కావచ్చింది.
తెల్లవారితే శ్రావణ పౌర్ణమి. అప్పుడింకా నాలుగోఝాము రాత్రి. తూరుపుదిక్కున వేగుచుక్క అప్పుడే ఉదయించింది. శంకరుడు శయనించి ఉన్న గుహకు బయట పద్మపాదుడు ధ్యానంలో ఉన్నాడు. జీవాత్మ కామనలు వినబడనంత గట్టిగా మూతపెట్టిన పద్మపాదుడు మనస్సనే ఆకాశంలో ఇద్దరు సిద్ధపురుషులు దర్శనమిచ్చారు. కనులు నులుముకుని తేరిపార చూస్తే వారిలో ఒకరు తన గురువైన శంకరుడే.

‘‘నాయనా పద్మపాదా! వీరు భర్తృహరి. మాకు గురుపుత్రులు’’ అని రెండోవ్యక్తిని పరిచయం చేశాడు శంకరుడు. పద్మపాదుడు ఆయనకు నమస్కరించాడు.  
‘‘మా గురుదేవులు దేహత్యాగం చేయబోతున్నట్లు వార్త పంపారు. మాంధాత పర్వతానికి వెళుతున్నాం. వారి దర్శనం చేయాలనే కోరిక ఉన్నట్లయితే నీవూ రావచ్చు’’ అని మాత్రం పలికి శంకరుడు, భర్తృహరి అదృశ్యులయ్యారు.
పద్మపాదుడు కూర్చున్నచోటి నుంచి హడావుడిగా లేచాడు. గుహలోనికి వెళ్లిచూస్తే శంకరుడు యధాస్థితిలో శయనించి వున్నాడు. పక్కనే విష్ణుశర్మ మాత్రం లేడు. స్నానసమయం కనుక వాగువద్దకే వెళ్లి ఉంటాడని ఊహించి అక్కడికి వెళ్లాడు పద్మపాదుడు.
మాట్లాడే మట్టిచిలకను ఒడ్డుమీద పెట్టి విష్ణుశర్మ వాగులో స్నానానికి దిగాడు. పద్మపాదుడు హడావుడిగా విష్ణుశర్మకు వచ్చిన పని చెప్పాడు. తాను తిరిగివచ్చే వరకూ ఆచార్య శంకరుని దేహసంరక్షణ భారం వహించమన్నాడు. 
విష్ణుశర్మ పాపం ఆ మాటవింటూనే బేలగా మారిపోయాడు. ‘‘నేనొక్కడినా...’’ అన్నాడు. అతడు మింగిన గుటకల్లో ఏటినీళ్లు, భయమూ రెండూ కలగలిసిపోయాయి.
‘‘నా అంచనా నిజమైతే ఈ రాత్రిలోగా ఆచార్య శంకరులు తమ దేహంలోకి తిరిగి వచ్చేస్తారు. అప్పటివరకూ...’’ అన్నాడు పద్మపాదుడు.

‘‘ఈవేళే వచ్చేట్లయితే... వారు వచ్చిన తరువాతే నువ్వూ వెళ్లవచ్చు. తొందరేమి? అయినా ఆయనక్కడ అంతఃపురంలో ఉన్నాడని నేననుకుంటున్నాను. భర్తృహరితో కలిసి పరమ గురువుల వద్దకు వెళ్లారని నువ్వు చెబుతున్నావు. అసలాయన ఎక్కడికీ పోలేదు... తనలోనే కమ్మగా నిద్రపోతున్నాడని ఈ అడివికి, అడివిలోని ఆ గుహకు కూడా బాగా తెలుసు కదా... పద్మపాదా! ఏమిటీ దోబూచులాట?!’’ రెండుచేతులా వీపును అందుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు విష్ణుశర్మ.
‘‘అదంతా చెప్పే తీరిక లేదు. వారు బయలుదేరమన్నారు కాబట్టి కాలయాపన చేయడం నాకు సాధ్యం కాదు. నీ వరకు నువ్వు ఆయన అక్కడే ఉన్నారని నమ్ముతున్నావు. కనుక ఇక్కడ ఈ గుహలో ఆయన మేలుకొంటేనే నీ వరకూ జరిగిన కథంతా వాస్తవంగా పూర్తవుతుంది. అది కూడా ఈవేళే జరుగుతుంది’’ అంటూ ఒడ్డుమీద ఉన్న మట్టిచిలుక వైపు సాలోచనగా చూశాడు పద్మపాదుడు. 
మనశ్శక్తిని కంటిచూపులో నిక్షిప్తం చేయడం ద్వారా, జడపదార్థాలలో కూడా చలనం కలిగించ గలిగితే దానిని అతిపతన విద్య అంటారు. ఆ విద్యద్వారా విష్ణుశర్మ... అమరుకుని అంతఃపురంలో పంజరంలో ఉండే చిలుకలోని శబ్దశక్తిని ఈ మట్టిబొమ్మ ద్వారా ఆకర్షించాడు. అమరుకుని భార్యలు చెప్పే శృంగార శ్లోకాలను గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పద్మపాదుడు ఆ విద్యకు పై సంగతివేశాడు.

‘‘విష్ణూ! నీ మట్టిబొమ్మకు కొత్తవిద్యనిస్తున్నాను. నువ్వు ఇకపై దీనికి చెప్పిన మాట, అక్కడ పంజరంలో ప్రాణాలతో ఉన్న చిలుక వింటుంది. ఇక్కడి మాటలు అక్కడ చెబుతుంది. రాత్రి లోపుగా ఆచార్యుడు రాకపోతే నీవు హెచ్చరించవచ్చు. తిరిగి తమ దేహంలోకి రమ్మని వారిని కోరవచ్చు. నీ మాట వారి చెవిన పడగానే అలా జరిగి తీరుతుంది’’ అన్నాడు పద్మపాదుడు. ఆ మాటలు చెబుతూనే అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయాడు. 
విష్ణుశర్మ సాధ్యమైనంత త్వరగా స్నానం ముగించాననుకున్నాడు కానీ, తెలియకుండా చాలానే ఆలస్యం చేశాడు. తెల్లవారి మూడు ఘడియల పొద్దువేళకు గుహకు చేరుకున్నాడు. అక్కడంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరో ఆగంతకులు ఆ ప్రాంతమంతా గందరగోళం సృష్టించినట్లు తెలిసిపోతూనే ఉంది. ఆదుర్దాగా లోనికి వెళ్లి చూస్తే అనుకున్నంత పనీ జరిగింది. లోపల శంకరుడు లేడు. 
గుహ బయట కనిపించిన పాదముద్రల ఆధారంగా జరిగినదేమితో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు విష్ణుశర్మ. నడుస్తున్నకొద్దీ అడుగులు కనబడుతూనే ఉన్నాయి. ముందడుగు వేసేకొద్దీ తన గుండెచప్పుడు అడుగు చప్పుడంత గట్టిగా వినిపించి భయం గొలుపుతోంది. వచ్చినవారు సామాన్యులు కాదు. కొద్దిపాటి వ్యవధానంలో చాలానే దూరం వెళ్లిపోయారు. నడుస్తున్న కొద్దీ విష్ణుశర్మలో ఆరాటం పెరుగుతోంది. చిట్టచివరకు అతడి అన్వేషణ ఫలించింది.

అల్లంత దూరాన అతడు శంకరుణ్ణి చూశాడు. వారంతా... ఎవరో రాజభటుల్లా ఉన్నారు. శంకరుని దేహాన్ని చితిపై పడుకోబెట్టారు. నిప్పు రగిలించారు. చితి వేగంగా అంటుకోవడానికి వీలుగా అన్నివైపులా మంటలు పెడుతున్నారు కొందరు. ఒకరెవరో నూనె పోస్తున్నారు. చితిమంట ఒక్కసారిగా భగ్గుమంటూ రేగింది. 
ఆ మంటల మధ్య కాలిపోతున్నది తన శంకరుడేనని విష్ణుశర్మకు అప్పటికి నిర్ధారణ అయింది. ‘‘శంకరా!’’ అని దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రందించాడతను. ఆ ఆక్రందన అతడి రొంటినున్న మట్టిబొమ్మనుంచి అంతఃపురంలోని చిలుకకు సరఫరా అయింది. పంజరంలోని చిలుక గగ్గోలుగా గీ పెట్టింది.  
మాహిష్మతీ రాజప్రాసాదంలో ఇంకా నిద్దర్లు లేచే సమయం ఆసన్నం కాలేదు. శతరూపాదేవి ఆలింగన సౌఖ్యమబ్బిన అమరుకుడింకా మగత నిద్రలోనే ఉన్నాడు. ఆమె దేహంపై పారాడుతున్న అతడి చేతులలో ఏదో వెతుకులాట కనిపిస్తోంది. 
ప్రాసాదే సా దిశిదిశి చ సా పృష్ఠతః సా పురః సా
పర్యంకే సా పథిపథి చ సా తద్వియోగాతురస్య
హంహోచేతః ప్రకృతిరపరా నాస్తి మే కాపి సా సా
సా సా సా సా జగతి సకలే కోయ మద్వైతవాదః
– శయ్యపై నా పక్కనే ఉన్న ఆమె ఒక్కనిమిషంలో మేడపైకి వెళ్లినట్లు కలగన్నాను. మేడెక్కి చూస్తే దారివెంట పోతున్నట్లు కనిపించింది. ఆమె నడిచే దారుల వెంట పరుగెత్తి పోతుంటే నా ముందు, వెనుక కూడా ఆమెయే ఉన్నట్లు అనిపిస్తోంది. చూస్తున్న ప్రతిదిక్కులోనూ నవ్వుతూ కనిపిస్తున్నది. ఈ ప్రపంచమంతా నా చిత్తవృత్తికి ఆమె తప్ప ఇతరమేదీ కనిపించడం లేదు. ఆహా ఏమిటీ అద్వైతవాదం!... అమరుకుని పలవరింతలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. సా సా సా... ఆమె ఆమె ఆమె... అంటూ పదకొండుసార్లు విరహార్తితో అతడామెను పిలవడానికి, కొంచెం ముందో వెనుకో శంకరుడక్కడి నుంచి వెళ్లనే వెళ్లిపోయాడు.

‘‘తెల్లగా తెల్లవారాక కూడా ఏమిటీ పలవరింతలు... ఇంతకీ ఎవరా అమ్మాయి?! లే మరి. లేచి కూర్చుని చెప్పు సంగతేమిటో’’ అంటూ ఏడునెలల గర్భవతిగా ఉన్న భార్యను మృదువుగా నిద్ర లేపుతున్నాడు అమరుకుడు.  కనులు విప్పి భర్తను చూసి, అప్పటిదాకా కన్న కలంతా ఒక్కసారిగా గుర్తుకు రాగా వెన్నెలలాగా నవ్వింది శతరూప. 
తెల్లవారితే భర్త తనను ఒంటరిగా విడిచిపెట్టి వేటకు వెళ్లబోతున్నాడనే దిగులుతో నిద్రించిన శతరూప తానే అమరుకుడైంది. దెబ్బ తగిలించుకుని వచ్చి, భార్యల చేత సేవ చేయించుకుంటున్నట్లుగా వింతకల కన్నది. భార్య కోరిక కాదనడం చేతకానివాడు, ఏకపత్నీ వ్రతుడు అయిన అమరుకుడు మరో కల కన్నాడు. తన భార్యకే తాను వందమంది భార్యలుగా మారిపోయాడు. ఎప్పుడూ చెప్పనన్ని కబుర్లు ఆమెకు వందనోళ్లతో చెప్పాడు. ఈ వింతకథను ఆ దంపతులు చాలాకాలమే గుర్తుంచుకున్నారు. పంజరంలోని చిలుక వారికి అప్పుడొకటి ఇప్పుడొకటిగా వందశ్లోకాలను మాత్రం గుర్తు చేసింది. ఆ తరువాతెప్పుడో చాలాకాలానికి అద్వైత సిద్ధాంతానికి శృంగారాన్వయం చేసిన ఆ కావ్యానికి తొలి మంగళాచరణ శ్లోకాలను రెండింటినీ శంకరుడే స్వయంగా విష్ణుశర్మ ద్వారా అనుగ్రహించాడని, అదే అమరుక శతకమై చరిత్రలో నిలిచిందని కథ చెప్పుకుంటారు.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement