అఖిల బ్రహ్మాండాలనూ కన్నతల్లి అయిన పార్వతి ఒకసారి భర్తతో సరాగమాడబోయింది. వెనుకగా వెళ్లి నేనెవరో చెప్పుకోండి అన్నట్లుగా శివుని రెండుకన్నులనూ మూసింది. దాంతో లోకాలన్నీ చీకటిగా మారిపోయాయి. తన సృష్టికి ఎక్కడ లోపం వస్తుందో అని తొందరపడి శివుడు మూడోకన్ను తెరిచి భార్యను చూశాడు. అమ్మ గౌరవర్ణం కాస్తా నల్లగా మారిపోయింది. తన రూపాన్ని చూసుకున్న ఆమె బాధపడింది. బాగు చేసుకునే మార్గం చెప్పమని కోరింది. తపస్సు చేపట్టమని శివుడు ఆదేశించాడు. దాంతో ఆమె దక్షిణాపథానికి వచ్చి అనేకచోట్ల తపస్సు చేసింది. ఒక్కొక్కచోట ఆమె తపస్సు ఒక్కోలా ఫలించింది.
కావేరీ తీరంలో పార్వతీదేవి శివునికోసం తపస్సు చేసిన దివ్యక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగమై వెలిశాడు. పార్వతి కంటే ముందు ఇక్కడ జంబూ మహర్షి తపస్సు చేశాడు. నేరేడుచెట్టుగా మారి లింగానికి నీడనిచ్చాడు. ఆ తరువాత శివగణాలలోని వారైన పుష్పదంతుడు, మాల్యవంతుడనే వారు ఒకరినొకరు శపించుకున్న కారణంగా తరువాతి జన్మల్లో ఏనుగు, సాలీడు రూపాల్లో పుట్టి శివుణ్ణి సేవించారు. ఏనుగుగా జన్మించి శివుణ్ణి సేవించిన పుష్పదంతుడు తరువాత కూడా శివభక్తునిగా అనేక జన్మలెత్తాడు.
ఆచార్య శంకరుని కాలానికి అతడే కోసంఘాత చోళుడనే నామాంతరం కలిగిన రాజసేనునిగా జన్మించాడు. చోళదేశంలో అనేక శివాలయాలు నిర్మించాడు. జంబుకేశ్వరాన్ని పునరుద్ధరించి మహానిర్మాణం చేపట్ట దలిచాడు. కానీ అతడి అపూర్వ ప్రయత్నానికి సాక్షాత్తూ జగజ్జననియే ఆటంకంగా మారింది.
అఖిలాండేశ్వరి అనే పేరుతో అమ్మవారు జంబుకేశ్వరంలో కొలువుదీరి ఉంది. నల్లని రూపు కలిగి, మొసలివంటి చెక్కిళ్లతో కనిపించే అఖిలాండేశ్వరిని శాక్తతంత్రాలు విద్యలకు అధిదేవతగా ప్రకటించాయి. ఆమె విజ్ఞానాన్నే కాకుండా సంతానాన్ని, సంపదను, ఆయుష్షును కూడా ప్రసాదిస్తుందని చెప్పాయి. జంబుకేశ్వరంలో ఆమె ఉగ్రకళలతో అవతరించింది. ప్రతిరోజూ ఎవరైతే ముందుగా తన ఆలయం తలుపులు తీస్తారో వారిని ఆమె మింగేసేది. ఆ తలుపు తీయకుండా ఉండలేక, రోజూ సాగే నరబలిని సహించలేక చక్రవర్తితో సహా రాజ్య ప్రజలందరూ దిక్కుతోచక ఉన్నారు.
అటువంటి సమయంలో ఆచార్య శంకరుడు శ్రీరంగంలో ఉన్న వార్త వారికి తెలియవచ్చింది. తమ సమస్యను విన్నవించి పరిష్కారం చూపమని ప్రార్థించారు. శంకరుడు జంబుకేశ్వరానికి విచ్చేశాడు. తలుపులు తీసేముందుగా, వేరొక ప్రాకారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి అఖిలాండేశ్వరి ఆలయానికి ఎదురుగా ప్రతిష్ఠించాడు. తలుపు తీసిన వెంటనే అమ్మవారి నేత్రదృష్టి తొలిగా కుమారుడైన గణపతిపై పడింది. ఆమెలో అమ్మప్రేమ పొంగింది. రోజుకొకరిని ఆమె బలి తీసుకునే సంప్రదాయానికి ఆనాటితో తెరపడింది. శంకరుడు చేసిన మహోపకారానికి అందరూ జేజేలు పలికారు. అమ్మకు ఆనాడు తొలి అర్చన చేసేందుకు శంకరుడు కదిలాడు. చతుష్షష్టి ఉపచారాలతో అర్చన సాగుతున్న వేళ, అంతకుముందు ఎవ్వరూ చూడని అపూర్వమైన రెండు చెవికమ్మలు శంకరుని చేతిలో ప్రత్యక్షం కావడం అందరి దృష్టిలోనూ పడింది. ఆ రెండింటినీ అమ్మకు అలంకరించిన తరువాత ఆమెలోని ఉగ్రకళలు పూర్తిగా శాంతించి శుద్ధజ్ఞాన స్వరూపిణిగా అవతరించడం గమనింపులోకి వచ్చింది.
వెలుపలికి వచ్చిన తరువాత చోళునితో, ‘‘రాజా! ఈ క్షేత్రంలో పార్వతీదేవి తపించి శివజ్ఞానాన్ని పొందింది. కానీ శివుడామెను చేపట్టలేదు. ఆమెలోని విరహమే ఉగ్రకళగా మారింది. అందుకే పరమాత్మతో సమైక్య సూచనగా శ్రీచక్ర సమన్వితమైన ఆ కుండలాలను ఆమెకు అలంకరించాను. దీనితో పార్వతీ కల్యాణ ఘట్టాన్ని నెరవేర్చిన ఫలితం వచ్చినట్లే. అయితే ఈ కుండలాలను ప్రతిరాత్రి తొలగించి, తిరిగి ఉదయాన్నే అలంకరించాలి’’ అని చెప్పాడు శంకరుడు.
‘‘స్వామీ! మా చోళదేశంలో ఇటువంటి గడ్డు సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. వీలువెంట తమరు...’’ అభ్యర్థనగా అన్నాడు చోళుడు.
‘‘మీరు కోరవలసిన పని లేదు. ఇప్పుడు వేంకటాచలాన్ని దర్శించడానికి వెళుతున్నాం. సమయానుసారంగా మీ చోళదేశంలో మా కర్తవ్యాలను నెరవేరుస్తాం’’ అని అభయమిచ్చాడు శంకరుడు.
పంచాయుధ స్తోత్రం పఠిస్తూ యతిబృందం ఏడుకొండలెక్కుతోంది. కలియుగ విభుని ఆనంద నిలయం చేరువ అవుతోంది. నేలపై శ్రీహరి అవతరణకు కారణమైన ఒకనాటి దేవయజ్ఞం కోసం తనంత తానుగా ఉప్పొంగిన పుష్కరిణిలో మునకలేశారు.
ఆలయ ప్రవేశం చేస్తున్న వేళ అశరీరవాణి వినిపించింది. ‘‘కర్మ జ్ఞాన మార్గాలకు వంతెన వేయాల్సిన సమయం ఆసన్నమైంది. విగ్రహాన్ని మూర్తిమంతం చేయాలి. దానిముందు అగ్నిహోత్రాన్ని వెలార్చాలి. ఇది నా అభిమతం. సన్యాసులకు అగ్నిహోత్రంతో పనిలేదు. కానీ శంకరా!...’’ అని అర్థోక్తిలో ఆగిపోయింది ఆ కంఠం.
‘‘ఆచార్యదేవా! ఎవరిదా కంఠం?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు.
శంకరుడు అతనివైపు కాకుండా మండనమిశ్రుని వంక తిరిగి సమాధానమిచ్చాడు. ‘‘ఆ కంఠం అత్రిమహర్షిది. నా ఎనిమిదో ఏట ఇవే పలుకులు విన్నాను. మళ్లీ ఇన్నాళ్లకు పనిగట్టుకుని అదే వాణి వినిపించిందంటే...’’ అని శంకరుడు కూడా అర్థోక్తిలోనే ఆగాడు.
మండన మిశ్రునికి కర్తవ్యం బోధపడింది. తనతో వచ్చినవారంతా స్వామి దర్శనానికి కదలగా తాను మాత్రం హోమ సంబారాలను సమకూర్చుకునే పనిలో పడ్డాడు. ఈ తరుణం కోసమే ఎవరో కాసుకుని కూచున్నట్లు, కావలసినవన్నీ ఎదుటవుంచి వెళ్లినట్లు మండన మిశ్రుని ప్రయత్నం శ్రమ లేకుండానే, ఎక్కువ వ్యవధి తీసుకోకుండానే పూర్తయింది. దేవతల కోరిక మేరకు ఒకనాడు ఆధ్వర్యునిగా చతుర్ముఖ బ్రహ్మ వహించిన స్థానమిప్పుడు మండన మిశ్రుని పరమైంది. దేవతాంశల రాకను పరికించిన జడప్రకృతి కృతయుగాల నాటి సందర్భాన్ని నెమరేసుకుంటోంది. మండన మిశ్రుడు సమర్పిస్తున్న ఆహుతులను స్వీకరించిన అగ్నిహోత్రుడు ఒక్కొక్క దేవతను స్వాగతించి ఆనాటి ముచ్చట్లను జ్ఞాపకం చేస్తున్నాడు కాబోలు, పరిసరాలన్నీ దివ్యతేజస్సును పెంచుకుంటున్నాయి.
స్వామికి ఎదురుగా క్రతువు సాగుతుండగా, శంకరుడు గర్భాలయంలో ప్రవేశించాడు. శ్రీనివాసుణ్ణి పదసుమాలతోనూ, బిల్వదళాలతో అర్చిస్తున్నాడు. ఇలవైకుంఠంలో ఆయన దర్శించిన విష్ణుస్వరూపాన్ని పాదాల నుంచి కేశాలవరకూ అణువణువునూ మనం తరించేలా ఇలా వర్ణించాడు.
భువనమనే గృహానికి ఏర్పరిచిన ధ్వజస్తంభంలాంటి స్వామి పాదాలు తామరపూల నడిమిభాగంలా లలితంగా కనిపిస్తున్నాయి. వాటిపై సన్నటి చీరపోగుల్లాంటి చక్ర, మత్సా్యది రేఖలున్నాయి. పుండరీకాక్షుని పాదధూళి భక్తిపరులమైన మా అంతఃకరణాలను శుద్ధి చేయును గాక!
ఎర్రకలువల అంచుల్లో నిలిచిన మంచుబొట్లలాగా శ్రీహరి కాలిగోళ్లు భాసిస్తున్నాయి. ఆ గోటి మెరుపుల్లో ఇంద్రాదులు తమ ప్రతిబింబాలను చూసుకుని వేరొక దేవజాతి కాబోలని కలవర పడుతున్నారు. సుందరకాంతి మండలం కలిగిన ఆ కాలిగోళ్లు మాకు స్వాతిశయ సంపదను సాధించును గాక! హరిమూర్తి మీగాళ్లు వంగి నమస్కరించిన మా పాపాలను అంతం చేయును గాక! నారాయణుని కాలిపిక్కలు సురలకు సుఖకారులై, శత్రువులను నశింపచేసే సాముద్రిక సలక్షణాలు కలిగినవి.
స్వామి మోకాలి చిప్పలు తీరైన వృత్తాకృతిలో దర్శనమిస్తాయి. ఆయన మోకాలి చిప్పలనే ఎత్తుపీటగా మార్చుకుని సజ్జనులు తమ చిత్తాలనే అద్దాలను అక్కడే నిలిపి ఉంచుకుంటారు. మాటిమాటికీ అందులో తమను దర్శించుకుంటూ హృదయానందం పొందుతుంటారు. మధుకైటభులనే రాక్షసులను శ్రీహరి సర్వమూ జలమయమైన చోట తొడలపై పెట్టుకుని సంహరించాడు. వృత్తాకృతిలో, పైకి పోయేకొద్దీ చక్కగా బలిసినట్లు కనిపిస్తున్న శ్రీహరి ఊరువులు మా మనసులకు అతిశయమైన ప్రీతిని సంధానించు గాక!
బడబాగ్ని జ్వాలలతో అలంకృతమైన సముద్రంలా శ్రీహరి కటిస్థలం పసుపు పచ్చని పీతాంబరంతో ప్రకాశిస్తోంది. మనోహరమైన ఆ ఘననితంబం మమ్మల్ని పతితుల్ని కాకుండా రక్షించు గాక! మందర పర్వత మధ్యస్థానాన్ని పెద్దపడగలతో వాసుకి చుట్టినట్లు ఆ కటిభాగాన్ని చుట్టివున్న అందమైన బంగారు రంగు మొలతాడు నా మతిని శుభకరముగా తీర్చుగాక!
సృష్టికి పూర్వం బ్రహ్మ అనే స్వాయంభువ తుమ్మెదకు నెలవై దేవపూజ్యమైన కమలం ఆవిర్భవించిన విష్ణుని బొడ్డు చెరువులో మా మానస హంస చిరకాలం కుతూహలంతో విహరించు గాక! ఆ కమలపు కాడ పాతాళం. రేకుల వరుస దిశలు. పుప్పొడి తిత్తి గల కాడ కొండలు. మధ్యలోని కర్ణిక మేరుపర్వతం. ఆ పెద్ద తామరపువ్వు మాకు కామిత ఫలదాయిని అగును గాక!
దామోదరుని కడుపు అనే సముద్రం కాంతులనే జలాలతో నిండి ఉంది. తరంగాలు ఆ పొట్టపై మడతలుగా భాసిస్తున్నాయి. లోతైన నాభి అనే సుందర సుడిగుండమొకటి ఉంది. ఆ ఉదరమనే జలధిలో నా చిత్తమనే చేప చిరకాలం ఇష్టారీతిగా ఆటలాడుకొను గాక!
నాభికమల మూలం నుంచి బయలుదేరిన నూగారు అంతకంటే అధికమైన పరిమళంపై ఆశకొద్దీ ముఖపద్మానికి అభిముఖంగా సాగుతోంది. అది తుమ్మెదల నల్లని బారులా తోస్తోంది. స్వామి ఉదర మధ్యమునకు అధిక కాంతిని ఇస్తున్న ఆ రోమరాజి మాకు సకల సంపదలను అనుగ్రహించు గాక!
కౌస్తుభమణి కాంతుల వల్ల కాలకాలుని కంఠంలో కొలిమలాగా... చంద్రబింబానికి అందాన్నిచ్చే మచ్చలాగా... కానవస్తున్న విష్ణు వక్షోవిభాసిని అయిన శ్రీవత్సమనే పుట్టుమచ్చ లక్ష్మీప్రీతికరమై మాకు అధిక సంపదలిచ్చు గాక!
గళసీమలోని జయంతి మాలిక లక్ష్మీదేవి లాలన పొందుతూ వాసుదేవుని సుభద్రమూర్తిగా మార్చింది. దేవదేవుని బాహుమూలము తారహార కాంతులచే, పొడవైన తులసీమాలికా కిరణాలచే, బంగరు సొమ్ముల కాంతులచే కమ్ముకున్న అందం గలది. చాల నష్టాలను కలిగిస్తున్న సంసార బంధాల వల్ల బాధలను తొలగించమని హరిబంధుర బాహుమూలము ఎదుట నిలిచి అంజలి బద్ధుణ్ణై మరీమరీ వేడుకుంటున్నాను.
విశ్వరక్షా దీక్ష వహించిన హరి బాహువులు విస్పష్టమైన గుణకీర్తులు తెచ్చిపెట్టే ఆశ్చర్యకరమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ వేయిచేతులు జీవుల మోహాన్ని బాపేందుకు ఉద్యమించు గాక!
కంఠాభరణాల నుంచి, బంగారు కుండలాల నుంచి పుట్టివచ్చిన వేయి తలలు కలిగిన శ్రీహరి కంఠం విచిత్రవర్ణం కలిగినది. శ్రీలక్ష్మి కౌగిలించుకోగా ఆమె చేతి కంకణాలు ఒత్తుకొని ముద్రపడిందక్కడ. ఆ మంగళకరమైన వైకుంఠుని కంఠం వెనుబాటు లేకుండా నా మతిలోనే స్థిరంగా నివసించు గాక!
అరుణశోభతో వ్యాప్తమైన అగ్రభాగం కలది ఆయన అధరం. ముఖమనే ఆకాశంలో దంతాలనే నక్షత్ర పంక్తులను ఆచ్ఛాదిస్తున్న శ్రీనాథుని అధరమనే అంబరమణి మా పాపాలను పోగొట్టుగాక!
ఉదయ సూర్యకాంతితో విరాజిల్లుతున్న మకర కుండలాలు కలిగిన హరి గండభాగం మాకు రాబోయే ఆపదలను అడ్డగించును గాక! తళుకులీనే కుండలాల కాంతుల వల్ల ఆయన నాసిక ఎర్రబడింది. ప్రాణవాయు సంచార మార్గమైన ఆ మురారి ముక్కు మాకు ప్రాణదానము చేయు గాక! అధిక దయా నిర్భరంగా కొంచెం ఎరుపు, తెలుపు, నలుపు కాంతులతో మనోహరాలైన ఆ పద్మాక్షుని కన్నులు మమ్మల్ని రక్షించు గాక! గరుడ గమనుని కనుబొమల జంట కొంచెం కదిలేసరికి సురాసుర సంఘాలు తమతమ పదవులలో నియమితులవుతూ ఉంటారు. అరచందమామలా పరిశుద్ధమైన లలాటవేదిపై నల్లత్రాచులా నడుమ వంగిన శ్రీనాథుని భ్రూయుగము మమ్మల్ని అడుగున పడిపోకుండా రక్షించు గాక! భువన విభుని సుప్రసిద్ధమైన ఊర్ధ్వపుండ్రము... స్ఫాటిక శివలింగంలా ఉంది. కనుబొమల నడుమ నుంచి పుట్టి, జనన మరణ రూపమైన సంసార అంధకారాన్ని ఖండించే ఆ ఊర్ధ్వపుండ్రం మాకు అతిశయ విభూతిని ప్రసాదించు గాక!
ముంగురుల కొనలే పానవట్టంగా, కిరీటమనే మహాదేవుని లింగం ప్రతిష్ఠితమైన కైటభారి లలాటమదిగో... ఆ నాట్యరంగంపై తీక్షణమతి అనే నటి తన అలసత్వమనే తెరను తొలగించి, ప్రస్ఫుటమైన అవయవ సంపదతో, సమర్థవంతంగా మమ్మల్ని భావన అనే నాటకాన్ని ఆడించు గాక!... అన్నాడు శంకరుడు.
శ్రీనివాసమూర్తినే శివస్వరూపంగా శంకరుడు అనుసంధానించిన వైనం ఎవరిని మెప్పించిందో కానీ.... యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః అని ఆకాశం నినదించింది. విష్ణుపాదాది కేశాంత స్తోత్రంలో కిరీటం వరకు వచ్చాడు శంకరుడు.
అటుపైన... నూరుగురు సూర్యులున్న ఆకాశంలా స్వామి కిరీటరత్నం చూడశక్యం కానిదై ఉంటుంది. ఒక సముద్రము, దానికి ఆవలి ఒడ్డున ప్రజ్వలించే బడబాగ్ని అన్నట్లు కనిపిస్తున్న స్వామి కిరీటం మా కలి కలుషాలనే చీకట్లను పోగొట్టు గాక! అన్నాడు స్తోత్రంలో శంకరుడు.
అప్పుడు ఆయన దృష్టి మూలవిరాట్టుకు వెనుక వైపున విగ్రహంలోనే అంతర్భాగంగా ఉన్న కేశపంక్తిపై పడింది. దేహమనే మణికాంతుల వల్ల మెరిసే స్వామి కేశాలు అరిషడ్వర్గాలనే అగరుచెట్లను కాల్చే రోషాగ్ని పొగలాగా ఉన్నాయి. జీవుల పంచక్లేశాలను తెంచివేయగలిగే స్వామి కేశాలకు తుది ఎక్కడో చూడడం దేవతలకు సైతం సాధ్యపడదు.... అన్నాడు.
‘‘ఎందుకని?’’ స్వామి కాబోలు ప్రశ్నించాడు.
‘‘స్వామీ! ఇది శివుని జటాజూటమైతే... నీ పాదాలనుంచి పుట్టిన గంగను మోస్తోందని చెప్పవచ్చు. ఆ గంగధారకు ఎదురు ఈదితే నీదాకా రావచ్చు. నిన్ను దాటిన ఆవల ఏముందో ఎవరు మాత్రం తెలియ గలరు?’’ అడిగాడు శంకరుడు.
‘‘ఏ జ్ఞానప్రసూనం జీవునికి అవ్వలి వెలుగును ఏకాకృతిగా దర్శింప చేయగలదో కదా!’’ అన్నాడు స్వామి. శంకరునికి తన తదుపరి మజిలీ స్థిరపడింది.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment