శంకరుడు ఆమెలో మార్పును గుర్తించాడు | Shankara Vijayam Part 34 In Telugu | Sakshi
Sakshi News home page

సర్వజ్ఞ శ్రీమూర్తి

Published Sun, Feb 23 2020 11:17 AM | Last Updated on Sun, Feb 23 2020 11:17 AM

Shankara Vijayam Part 34 In Telugu - Sakshi

సనాతన ధర్మానికి ప్రాతిపదికలు ఆరు. భారతీయుల మేధకు, విజ్ఞానానికి తార్కాణాలుగా భరతభూమిలో అవే ఆరుమతాలుగా, షడ్దర్శనాలుగా వర్ధిల్లాయి. ఇవేవీ ఒకేఒక దైవస్వరూపాన్ని పరమోన్నతమని నిరూపించినవి కావు. ఈశ్వరుడు, పరబ్రహ్మ, నారాయణుడనే పేర్లతో చెప్పినప్పుడల్లా ఆయా దర్శనవేత్తలైన ఋషులు ఒకేఒక పరమాత్మను సూచించారు కానీ, ప్రస్తుతం మనం కల్పించుకున్న రూప విశేషాలకు ప్రాధాన్యమివ్వలేదు. 
శబ్దించేవాడు రుద్రుడని, ప్రాణాధారమైన జలమునందు ఆవాసం ఏర్పరుచుకున్నవాడు నారాయణుడని ఇలా ఆయా నామాలను వేదం చెబుతున్నప్పటికీ అవన్నీ ఒకే పరమాత్మను గురించి చెప్పినవి. సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యమనే ఆరు గుణాలు కలిగినవాడే భగవంతుడనే ప్రతిపాదన పురాణాలలోనిది. 

కలియుగంలో మానవులకు మోక్షమిచ్చేది నామ సంకీర్తనమే కానీ అవిద్య పెరిగే కొద్దీ, సాధన పలచబడే కొద్దీ దైవం విషయంలో మానవుడు రూపంపై అధికంగా ఆధారపడడం మొదలుపెట్టాడు. నాస్తికమతాల విజృంభణ పెరిగే కొద్దీ భగవత్తత్వాన్ని వేయివిధాలుగా విడమరిచి చెప్పవలసిన అవసరం పెరిగింది. నామము, రూపము, గుణముల ఆధారంగా దేవతాతత్త్వాలను వివరించవలసిన పరిస్థితి వేదవ్యాసునికే ఎదురైంది. అదే పురాణవాఙ్మయ సృష్టికి కారణమైంది. ఆచార్య శంకరుడు ఆ మార్గాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు. కాశ్మీర సర్వజ్ఞపీఠంలో శంకరుడు జరిపిన చర్చలు అందుకు తగిన కార్యాచరణను తయారు చేశాయి. కాశ్మీరంలోని గోపాద్రి పర్వతంపై జ్యేష్ఠరుద్రేశ్వరాలయం ఉంది. అక్కడే శారదానిలయమైన సర్వజ్ఞపీఠమూ ఉంది. వేదప్రామాణ్యాన్ని అంగీకరించే ఆరుశాస్త్రాలలోనూ, ఆరుదర్శన సిద్ధాంతాలలోనూ ఆరితేరిన వారినే సర్వజ్ఞులుగా సర్వజ్ఞపీఠాధ్యక్షులుగా నిర్ణయించే సంప్రదాయం ఉండేది. సర్వజ్ఞపీఠం చేసిన నిర్ణయాలను భరతఖండమంతా అంగీకరించేది. 

ఆ పీఠానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలున్నాయి. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులలో గల ద్వారాల నుంచి ఎందరెందరో ఉద్దండ పండితులు వివిధ కాలాల్లో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఒక్కొక్క దిక్కునుంచి ఒక్కొక్క పండితుడు వచ్చినప్పడల్లా సర్వజ్ఞపీఠపు ఆ దిక్కు ద్వారాన్ని తెరుస్తూ ఉండేవారు. శంకరుని కాలానికి ఇంకా దక్షిణద్వారం తెరవబడనే లేదు. మిగిలిన అన్ని దిక్కుల నుంచి సర్వజ్ఞులు వచ్చారు కానీ, అప్పటివరకూ దక్షిణదిక్కు నుంచి  సర్వజ్ఞులెవ్వరూ పీఠాన్ని అధిరోహించలేదు. ఇప్పుడు ఉభయభారతి తదుపరి వాదనల కోసం సర్వజ్ఞపీఠానికి రమ్మని ఆహ్వానమిచ్చింది కానీ, ఆయనకు అప్పటికే తెరిచివున్న ఏ దిక్కు ద్వారం నుంచీ ప్రవేశం లభించలేదు. తూర్పు ద్వారాన్ని న్యాయ – వైశేషిక దర్శనవేత్తలు, పశ్చిమ ద్వారాన్ని పూర్వమీమాంసా వేత్తలు, ఉత్తర ద్వారాన్ని సాంఖ్య – యోగదర్శన వేత్తలు ఆక్రమించుకుని ఉన్నారు. శంకరుడు పశ్చిమదిశగా మళ్లాడు. పూర్వమీమాంసలో ఉద్దండుడైన మండనమిశ్ర పండితుణ్ణి శంకరుడు అంతకుముందే గెలిచాడు. కానీ సంప్రదాయాన్ని అనుసరించి, శంకరుడు అక్కడ మరోసారి వాదనలో పాల్గొనవలసి వచ్చింది. 
మంత్రైః సర్వః స్తంభితో వా తతః కిం
బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిం
కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం
యేన స్వాత్వానైవ సాక్షాత్కృతోభూత్‌
మంత్రబలం చేత సమస్తాన్ని స్తంభింప చేయవచ్చు. లక్ష్యాన్ని భేదించవచ్చు. కాలజ్ఞానం పొందివుండవచ్చు. కానీ ఆత్మసాక్షాత్కారం కలగకపోతే మిగిలినవన్నీ వ్యర్థాలే కదా! బ్రహ్మలోకాన్ని సాధించినా, విష్ణులోకాన్ని వీక్షించినా, శివలోకాన్ని శాసించినా ఆత్మలోకాన్ని స్వయంగా వీక్షించకపోతే లాభం లేదు కదా!.... అని కర్మపరులైన పూర్వమీమాంసా వేత్తలకు అనాత్మశ్రీ విగర్హణ ప్రకరణాన్ని బోధించాడు శంకరుడు. మండనమిశ్రుడు, అతడి అనుయాయులు ఆయనకు స్వాగతమిచ్చారు. పశ్చిమద్వారం నుంచి శంకరుడు సభాప్రవేశం చేశాడు.

ఎత్తయిన వేదికపై అమర్చిన పీఠంపై సర్వజ్ఞ శ్రీమూర్తియై ఉభయభారతీ దేవి ఆసీనురాలై ఉంది. శంకరుడు ఆమెకు నమస్కరించి, ఉచితాసనం స్వీకరించాడు.
‘‘శంకరాచార్యా! మానవుడు ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ బతుకుతాడు. ఏడుస్తూనే మరణిస్తాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, సుఖాన్ని పొందడానికి నిరంతరమూ వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎడారిలో ఎండమావిలా ఒక్కోసారి పరిష్కారం అల్లంతదూరాన కనబడుతూ మాయమవుతూ ఉంటుంది. ఎందుకంటే అది నిజమైన పరిష్కారం కాదు కనుక. భయాలు, సందేహాలు, అపోహలు, భ్రమలు పోగొట్టుకునే పర్యంతం జీవితం దుఃఖమయంగానే ఉంటుంది. దుఃఖం చీకటి లాంటిది. మన వైశేషికులు చెప్పినట్లు చీకటికి ద్రవ్యలక్షణం లేనట్లే దుఃఖానికీ లేదు. ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్‌ అన్న ఉపనిషత్‌ మార్గాన్ని అనుసరించేవారు మీరు. దుఃఖమనేది భావనలోనే కానీ నిజానికి లేదు అని షడ్దర్శనాలు చెబుతున్నాయి. మీరు కూడా ఒప్పుకుంటారు. దర్శనవేత్తలైన మహర్షులకూ మీకూ ఏవైనా విభేదాలున్నాయా?’’ ఉభయభారతి ప్రశ్నించింది.
‘‘లేవు. వేదశాస్త్ర ప్రామాణ్యంతో, సాకార నిరాకార మార్గాల్లో పరబ్రహ్మతత్త్వాన్ని ఆవిష్కరించిన దర్శనవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలతో ప్రాథమికంగా మాకెలాంటి విభేదమూ లేదు. ఎవరైనా తాము నమ్మిన ఒక మార్గానికి కట్టుబడి దుఃఖరాహిత్యాన్ని పొందవచ్చు అని మేమూ అంగీకరిస్తాం’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు.
‘‘మరి... ఈ సర్వజ్ఞపీఠంలో మీ ఆధిక్యాన్ని ఎలా నిరూపించుకోబోతున్నారు?’’ తదుపరి ప్రశ్న వేసింది ఉభయభారతి.
‘‘అద్వైతమే మా అసలు బలం’’ అన్నాడు శంకరుడు.
‘‘వాదనలు ప్రారంభించవచ్చు’’ అనుమతినిచ్చింది ఉభయభారతి.
‘‘ఒక్క షరతు’’ అన్నాడు శంకరుడు.
‘‘ఏమిటది?’’
‘‘ఇంతకాలమూ ఈ సర్వజ్ఞపీఠం దక్షిణదిక్కు ద్వారం మూతబడి ఉన్నది. ఇక్కడ నా గెలుపు నిర్ధారణ కాగానే ఆ ద్వారం ఎలాగూ తెరువబడుతుంది. షరతేమిటంటే అటుపైన ఈ పీఠంలో ప్రవేశించే వారెవరైనా సరే దక్షిణదిక్కు నుంచే ప్రవేశించాలి. మిగిలిన ద్వారాలన్నీ మూతబడాలి’’ అన్నాడు శంకరుడు.
‘‘మీ గెలుపు తర్వాత అందరి అభిమతమూ అదే అయితే అలాగే చేద్దాం’’ అని సెలవిచ్చింది ఉభయభారతి పీఠాధ్యక్ష స్థానం నుంచి.
వాదనలు మొదలయ్యాయి. మొదటిగా వైశేషికులు, న్యాయదర్శనవేత్తల వంతు వచ్చింది. 

ఆకాశాన్ని చర్మంలాగా చుట్టుకునే మానవుడికి శివుణ్ణి గురించి తెలుసుకోకపోయినా దుఃఖ విమోచనం కలుగుతుందని, మోక్షం లభిస్తుందని వైశేషిక దర్శనం చెబుతోంది. పైపైన చూసినవారికిది నాస్తికత్వాన్ని బోధించినట్లే కనబడుతుంది. అణువుల కలయిక, విస్ఫోటనమే సృష్టి విలయాలకు కారణమవుతున్నాయనేది వైశేషికుల మతం. ఈ దర్శనం కణాదునిది. కర్మలను సైతం కణాదుడు భౌతిక దృష్టితోనే చెప్పాడు. కర్మ అంటే కదలిక అని అర్థం చెప్పాడు. పైకి లేవడం, కిందకు పడడం, ముడుచుకోవడం, విస్తరించడం, నడవడం అనే అయిదు విభాగాల్లో మన పనులన్నీ ఉంటాయన్నాడు. శంకరుడు వైశేషికులతో విభేదిస్తూ సృష్టిలో ఎవ్వరూ కర్మపరిత్యాగులు కాజాలరన్న వాస్తవాన్ని అంగీకరించాడు. నిత్య, నైమిత్తిక, కామ్యకర్మలలో.... కామ్యకర్మలను తప్పనిసరిగా అందరూ విడిచిపెట్టాలని అదే కర్మపరిత్యాగమవు తుందన్నాడు. ఇక వైశేషిక దర్శనానికి, గౌతముడు రచించిన న్యాయదర్శనానికి ఆట్టే భేదం లేదు. మొదటిదానికి రెండోది కొనసాగింపులా కనిపిస్తుంది. వారితో వాదనలో...

కామాతంకః ఖండితో వా తతః కిం
కోపావేశః కుంఠితో వా తతః కిం
లోభాశ్లేషో కుంఠితో వా తతః కిం
యేన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్‌
కామావేశాన్ని ఖండించావు. కోపావేశాన్ని ముక్కలు చేసుకున్నావు. లోభ పరిష్వంగం వదిలించుకున్నావు. మోహాంధకారాన్ని నలగ గొట్టుకున్నావు. పృధ్వియందు నీకంటే గర్వరహితుడు వేరొకడు లేడని పేరు మోశావు. మాత్సర్య పీడ నీనుంచి తొలగిపోయింది. కానీ ఆత్మదర్శనం కానిదే ఫలితం లేదు కదా! హృదయంలో సంపూర్ణంగా అనాత్మతో నిండిన వస్తుసౌందర్య నింద ఉదయించిన వాడే ఆత్మసాక్షాత్కారానికి అర్హుడు. మిగిలిన వారంతా జగత్‌ భ్రాంతి వ్యామోహంలోనే కొట్టుమిట్టాడుతుంటారు అన్నాడు శంకరుడు.
వైశేషికులు, నైయాయికుల ఓటమితో సర్వజ్ఞపీఠానికి ఉన్న తూర్పుద్వారంపై ఆయనకు అధికారం సంక్రమించింది. 

తరువాత సాంఖ్య – యోగదర్శన వేత్తల వంతు వచ్చింది. 
కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్యదర్శనం లోతులెరగని వారికి నాస్తికత్వం లాగనే అనిపిస్తుంది. జీవాత్మను, పరమాత్మను ఒకటిగా కాక వేరువేరుగా గుర్తించాలనే సాంఖ్యదర్శనాన్ని శంకరుని అద్వైతం మొదటనే ఖండిస్తుంది. వేదికపైకి వచ్చిన నర్తకి వివిధ భంగిమలతో నృత్యప్రదర్శన చేసి తెరవెనుకకు వెళ్లిపోయినట్లుగా ప్రకృతి కూడా విశ్వపురుషుని ఎదుట తాను కనిపిస్తూ వెళ్లిపోతూ ఉంటుందని సాంఖ్యం చెబుతుంది. ప్రకృతి ఈ సృష్టికి కారణం. ప్రకృతి కూడా పురుషుని వలె అనాదిగా శాశ్వతంగా ఉంటుంది. శంకరుని మాయావివరణ కూడా సుమారుగా ఇదే చెబుతోంది. ప్రకృతిని కూడా ఎవరూ సృష్టించలేదు. ఇది ఉన్నదే కానీ, ఒకప్పుడు మొదలైనదీ కాదు, మరొకప్పుడు కనిపించకుండా పోయేదీ కాదు.  కేవలం పరిణామం చెందుతూ ఉంటుందని సాంఖ్యం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా నిరాకార పరబ్రహ్మమే సాకారమవుతూ అనేక రూపాలు పొందుతూ, విశ్వంలో గిరగిరా తిరుగుతూ ఉంటుందని శంకరుడు చెప్పినందువల్ల వివర్తవాదం ఏర్పడింది. 

అబ్ధిః పద్భ్యాం లంఘితో వా తతః కిం
వాయుః కుంభే స్థాపితో వా తతః కిం
మేరుః పాణావుద్ధృతో వా తతః కిం
యేన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్‌
సముద్రాన్ని అడుగులతో దాటినా, వాయువును కుంభక ప్రాణాయామంతో నిలిపినా, మేరువును చేతితో ఎత్తినా ఆత్మసాక్షాత్కరం పొందకుంటే లాభమేమున్నది? విషాన్ని పాలవలె తాగగలడు. నిప్పులను పేలాల వలె తినగలడు. పక్షివలె ఆకాశంలో తిరగగలడు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందలేదు. ఇక లాభమేమున్నది? అన్నాడు యోగదర్శన వేత్తలతో శంకరుడు.
వారిద్దరి ఓటమితో ఉత్తరద్వారం శంకరునికి కైవసం అయింది. దానితో సర్వజ్ఞపీఠానికి ఉన్న మూడు ద్వారాలు ఆయన పట్టులోకి వచ్చినట్లయింది. ఇక దక్షిణద్వారం తెరిపించే విషయంపైనే పీఠాధ్యక్షురాలైన ఉభయభారతి తన అభిప్రాయాన్ని సెలవివ్వవలసి ఉన్నది. 

ఆమె మృదువుగా గొంతు సవరించుకుని, ‘‘శంకరాచార్యా! మీ విద్య, ప్రతిభ అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నవి. అయితే దర్శన సిద్ధాంతాలన్నీ ప్రవేశానికే కానీ, ప్రచారానికి కాదు. మీ మార్గం వేరు. మీ సిద్ధాంతం నేడు బహుళ ప్రచారంలోకి వస్తున్నది. పంచకోశాలు కలిగిన శరీరంలోని పరబ్రహ్మను నిరూపణ చే స్తూ మీరు రచించిన శారీరకభాష్యం విమర్శకుల ప్రశంసలు పొందుతున్నది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి’’ అంటూ ఉభయభారతి శరపరంపరలా కొన్ని ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రశ్నలు, వాటికి శంకరుడిచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...
ప్రత్యక్ష దేవత ఎవరు? –  తల్లి
పూజ్యుడైన గురువెవరు? – తండ్రి
సర్వదేవతా స్వరూపుడెవడు? – జ్ఞానంతో పాటు కర్మనూ చక్కగా ఆచరించే బ్రహ్మనిష్ఠాపరుడు.
ఈ జన్మ ఎందుకు వచ్చింది? – విషయాసక్తి వల్ల.
పునర్జన్మ ఉన్నదా? – తండ్రికి పుత్రుడే పునర్జన్మ.
తప్పించుకోలేనిది ఏది? – మృత్యువు.
ఏ పని చేస్తే మంచిది? – శ్రద్ధ కుదిరిన పని.
అన్నదానానికి పాత్రుడెవరు? – ఆకలి గొన్నవాడు.
అర్చించదగినదేది? – భగవంతుని అవతారం.
భగవంతుడెవరు? – హరిహరనాథుడైన మహేశుడు.
‘‘ఆ భగవంతుని చిచ్ఛక్తి వివర్తనమై సృష్టి అంతా ఆవరించి తిరుగుతున్నదా?’’

‘‘అవును. అందరిలో ఉండేది, అఖండమైనది అయిన ఆత్మ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది. ఆత్మశక్తిని భాగాలుగా విభజించలేము. చైతన్యస్వరూపమైన ఆ శక్తితో కూడి శివుడే సృష్టి కారణుడవుతున్నాడు.’’    
‘‘శక్తికి అసలు పేరేమి?’’
‘‘దానికి నిజానికి పేరేమీ లేదు. అఖండంగా ఉన్నప్పుడు పరాశక్తి, ఖండంగా ఉన్నప్పుడు మాయాశక్తి అన్నారు. ఆ రెండింటి వెనుక ఉన్న అనామక లేదా నిర్నామ తేజఃపుంజాకృతిని  యోగులు శ్రీవిద్యగా దర్శిస్తారు. దానికి 1.త్రిగుణత్వం, 2. త్రిమూర్త్యాత్మకం, 3.త్రిబీజాత్మకం, 4. త్రిపీఠాకృత్యాత్మకం, 5.త్రిఖండత్వం, 6. త్రిగంథిత్వం అని మూడేసి చొప్పున ఆరులక్షణాలున్నాయి.’’    
‘‘అయితే ఆ శక్తికి నామ, రూప, గుణవిశేషాలేవీ లేవా?’’
‘‘పరాశక్తి విద్యాస్వరూపిణిగా వెల్లడైంది. విష్ణుస్వరూపిణి అయిన శ్యామావిద్య సకల విద్యలకూ మూలమైంది. అయిదు ఆమ్నాయ విద్యలుగా విస్తరించింది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు.    
‘‘ఏమిటా విద్యలు?’’ ఉభయభారతి పరాకుగా ప్రశ్నించింది.
శంకరుడు ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును గుర్తించాడు. గతంలో మాహిష్మతీ నగరంలో ఆమెతో జరిపిన వాదంలో భాగంగా తాను సమాధానమిచ్చిన ప్రతిసారీ ఆ సమాధానమే ఊతంగా ఊర్ధ్వగామినియై భూమండలాన్ని విడిచిపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు, వాటిని నిరోధించడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ శంకరునికి ఒక్కక్షణం దృశ్యరూపంగా కళ్లముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాలన్నింటినీ వెనక్కు నెడుతూ శంకరుడు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

‘‘తూర్పుదిక్కున ఉన్న ఆమ్నాయ విద్యకు శ్యామావిద్య అని పేరు. ఇది ఋగ్వేద సంబంధమైనది. యజుర్వేదానికి చెందిన దక్షిణామ్నాయ విద్యను సౌభాగ్య విద్య అంటారు. భువనేశ్వరీ లేదా కామకళా విద్యగా ప్రసిద్ధిగాంచినది పశ్చిమామ్నాయ విద్య. ఇది సామవేదానికి సంబంధించినది. ఇక ఉత్తరదిక్కున ఉండేది శాంభవీ విద్య. అధర్వవేదానికి చెందినది’’ అని వివరించాడు. 
ఒక్కొక్క ఆమ్నాయాన్ని శంకరుడు స్మరించినప్పుడల్లా సర్వజ్ఞపీఠపు ఒక్కో దిక్కు ద్వారం మూతపడుతూ వచ్చింది. దక్షిణదిక్కు ద్వారం భళ్లున తెరుచుకుంది.
‘‘మరి అయిదు ఆమ్నాయాలున్నాయని చెప్పారు కదా!’’ అన్నది ఉభయభారతి.
‘‘శ్యామావిద్యకు ఊర్ధ్వంగా ఉన్నవే ఊర్ధ్వామ్నాయవిద్యలు. పరావిద్యగా, పరాప్రాసాదవిద్యగా, శాంభవీవిద్యగా లలిత ఊర్ధ్వరూపంగా సంచరిస్తుంది. నాలుగు ద్వారాలలో ఆయా ఆమ్నాయదేవతలు ఆమెను సేవిస్తూ ఉంటారు. మధ్యలో అమ్మ పంచబ్రహ్మాసనాసీనయై, కామేశ్వరుని వామాంకం అధిరోహించియుంటుంది’’ శంకరుడు చెబుతుండగా....
పైకప్పును ఎవరో చేతితో పక్కకు జరిపినట్లు కాగా, పీఠాధ్యక్ష స్థానంపైన ఆకాశం తెరుచుకుంది. ఊర్ధ్వద్వారం ఏర్పడింది. ఉభయభారతి అవతార పరిసమాప్తికి ఉద్యుక్తురాలైంది. ఊర్ధ్వగమనానికి సమకట్టింది. అంతలో అక్కడో విచిత్రం చోటు చేసుకుంది.
- నేతి సూర్యనారాయణ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement