చతురామ్నాయాలతో పాటు ఊర్ధ్వామ్నాయ విద్యా రహస్యాలను శంకరుడు వెల్లడించిన వేళ... సర్వజ్ఞపీఠపు పైకప్పు అలవోకగా పక్కకు జరిగింది. ఉభయభారతి తన లోకానికి సాగిపోవడానికి ఉద్యుక్తురాలైంది. అటువంటి తరుణంలో అక్కడో విచిత్రం జరిగింది.
ఆకాశం నుంచి పరబ్రహ్మ తేజస్సు సభామధ్యంలో అవతరించింది. సభాసదులందరూ చూస్తూ ఉండగా ఆ తేజస్సు క్రమంగా విఘ్నేశ్వర రూపాన్ని పొందింది. ఆ మహారూపానికి అందరూ మొక్కుతుండగా, శంకరుడు పంచరత్నాలతో స్తోత్రం చేశాడు.
ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసి లోకరక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం
శ్రీవినాయకా! నీ రెండుచేతులా ధరించిన మోదకాలు సాధకులకు మోక్షసామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాయి. నెలవంకను శిరసున ధరించి లోకాలన్నింటినీ విలాసంగా రక్షించే పరబ్రహ్మవు నీవే. దైత్యగుణాలను నిర్జించి నీవు అనాథనాథునివైనావు. అశుభాలను ఆశువుగా పోగొట్టే నిన్ను గొలిచి నేను కృతార్థుడినవుతాను.
మొక్కనివారికి మిక్కిలి భయంకరునివి నీవు. అప్పుడే ఉదయించిన సూర్యునిలా ప్రకాశిస్తుంటావు. ఆశ్రయించిన వారిని ఆపదలనుంచి గట్టెక్కించే దేవాధిదేవా మాహేశ్వరా! పరాత్పరునివైన నిన్ను నిరంతరం నేను ఆశ్రయిస్తాను.
ఓంకార వదనుడా! నీ మోము సకల లోకాలకూ శుభాలను కలిగించేది. మహారాక్షసులను నిర్జించి నీవే ఈ విశ్వాన్ని కడుపున పెట్టుకుని కాపాడుతున్నావు. నీ కృపావర్షం అంతులేనిది. నీ క్షమాహృదయం హద్దులేనిది. నీకు మొక్కిన వారికి ముదములను, యశస్సులను కలిగిస్తావు. నీవలె నా మనస్సును ప్రకాశింప చేయమని కోరుతున్నాను.
ఓయి పురాణగజమా! పరమేశ్వరుని పెద్దకుమారుడా! నీ బుగ్గల నుంచి జాలువారే మదజలం వేదవాదాలకు పుట్టుకస్థానం. అది సమస్త దారిద్య్ర బాధలను తుడిచిపెట్టగలదు. ప్రపంచ నాశవేళ అగ్నిస్వరూపాన్ని దాల్చి రాక్షస శక్తుల అణిచివేయగలదు.
ఓయి ఏకదంతుడా! యముణ్ణి సైతం మట్టుపెట్టిన శివుని కుమారుడా! నిన్ను తలచుకుంటే అంతరాయానికి తావుండదు. నీవు నిరంతరాయంగా నా హృదయ మధ్యమందు యోగరూపంలో కొలువుండమని సదా ప్రార్థిస్తాను.. అన్నాడు శంకరుడు.
శంకరస్తోత్రానికి ఫలశ్రుతిని ఉభయభారతి స్వయంగా చెప్పింది...
ప్రతిదినం ప్రాతఃకాలంలో వినాయక దేవుని మనసులో నెమ్మదిగా తలచుకుంటూ, ఈ మహాగణేశ పంచరత్నమనే స్తోత్రాన్ని పెద్దగా చదివే భక్తుడు ఆరోగ్యాన్ని పొందుతాడు. అతడి దోషాలు హరిస్తాయి. సాహిత్యాభిలాష ఉదయిస్తుంది. మంచిసంతానం పొందుతాడు. దీర్ఘాయుష్షు కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. చిరకాలం వర్ధిల్లుతాడు అన్నదామె.
ఆ మాటలు చెబుతూనే సర్వజ్ఞపీఠ సింహాసనం నుంచి దిగివచ్చింది. వినాయక దేవునికి కుడివైపున ఆమెకోసమే కల్పితమైన దివ్యాసనాన్ని అధిష్ఠించింది.
తిలకిస్తున్న వారి కన్నులు ధన్యములవుతుండగా ప్రభలు చిమ్ముతున్న వెలుగుల ముద్ద అయిన విఘ్నేశ్వరమూర్తి శంకరుణ్ణి ‘జగద్గురూ!’ అని సంబోధించింది. ఆ సంబోధన ఆలకించిన సర్వజ్ఞపీఠం యావత్తూ ఒక్కసారిగా జయజయ శంకర ధ్వానం చేసింది. ఆ సందడి కొద్దిగా సద్దుమణిగిన తరువాత గజాననుడు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు.
‘‘జగద్గురూ! దేవుడున్నాడంటావా?’’
‘‘పరమాత్మా! నువ్వు వేరుగా లేవుగా కదా స్వామీ!’’
‘‘మరైతే లేని నన్ను కలుసుకోవడం జీవులకు సాధ్యమేనం టావా?’’
‘‘సాధ్యమేనని సాక్ష్యమివ్వడానికి ఈ సభ చాలదా స్వామీ!’’
‘‘ఒకప్పుడు కొద్దిసేపు కనిపిస్తే మాత్రం ఈ అనుభవం నీవంటి వారికి తప్ప అన్యులకు నిత్యమై, సిద్ధమై ఉండదు కదా!’’
‘‘సాధనతో ఎవరికైనా అసాధ్యమన్నది ఉండదు.’’
‘‘ఎందుకసలు సాధన చేయడం... నన్ను పొందమని, నన్ను తెలుసుకోమని ఎవ్వరినీ నేనెప్పుడూ కోరను కదా!’’
‘‘నీవు కోరకపోయినా దుఃఖరాహిత్యాన్ని పొందడానికి జీవుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మాయను తెలుసుకోలేని అజ్ఞానం అవివేకానికి దారి తీస్తుంది. అవివేకం అభిమానాన్ని పుట్టిస్తుంది. అభిమానం వల్ల రాగద్వేషాలు వచ్చిపడతాయి. రాగద్వేషాలతో మిళితమైన కర్మలు జన్మకు, ఆ జన్మ దుఃఖానికి హేతులవుతున్నాయి. జీవుడు నిరంతరం తనకు దుఃఖాలే లేకుండా పోవాలని, అన్నీ సుఖాలే ప్రాప్తించాలని అర్రులు చాస్తూ ఉంటాడు. పుణ్యకర్మల సాయంతో దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మంత్రసిద్ధి పొందినవాడికి అగ్నిలోని వేడిమిని ఓర్చుకునే శక్తి వస్తుంది. కానీ నిప్పులోని కాల్చే తత్త్వాన్ని పోగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. పుణ్యబలం క్షీణించిన తరువాతైనా వేచివున్న నిప్పు కాల్చక మానదు. ఫలితంగా దుఃఖం తప్పదు. జన్మ సిద్ధమవుతూనే జీవుడు మళ్లీ సుఖప్రాప్తికి వెంపర్లాట మానడు. ఆనంద పరమావధిని తెలుసుకునేంత వరకు ఈ జన్మల వలయం ఇలాగే తిరుగుతుంది. జన్మకు మూలకారణమైన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే నీ తత్త్వాన్ని సాకల్యంగా తెలుసుకోవడం మినహా వేరుమార్గం లేదు.’’
‘‘అసలీ దుఃఖం ఎక్కడినుంచి వచ్చిందయ్యా? నా సృష్టిలోని దేనంటావా?!’’
‘‘స్వామీ! తమరెరుగరు కానీ, ఆయుధాలు ధరించిన దేవేంద్రాదులకే దుఃఖం తప్పలేదు. ఇక కర్మ పరిత్యాగానికి సిసలైన అర్థం తెలియని మానవుల సంగతి ఏమని చెప్పేది?’’
‘‘సరే... దేవతలకే దుఃఖం ఉంటే మీరంతా వారిని కొలవడం ఎందుకు? దండగ కదా!’’
‘‘మా లోకంలో రాజులకు, వివేకులకు కూడా దుఃఖమున్నది. అంతమాత్రం చేత మిగిలిన వారంతా వారిని ఆశ్రయించడం మానేస్తున్నారా? దేవతలు కూడా అంతే. దుఃఖనివృత్తికి వారిని ఆశ్రయించ వలసిందే. నామస్మరణలతో, రూపధ్యానాలతో, మూర్తిపూజలతో ఏదో ఒక తోవన తాను తరించే మార్గాన్ని జీవుడు తనంతతాను అన్వేషించి తెలుసుకోవలసిందే.’’
‘‘అయితే దుఃఖం జీవునికి స్వాభావికంగా వచ్చిందేమో!’’
‘‘కాదు. దుఃఖం స్వాభావికం అని చెబితే ఎన్నటికీ తీరనే తీరదని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు దుఃఖనివృత్తి కోసం, సుఖప్రాప్తి కోసం కర్మ చేయాల్సిన అవసరం జీవునికి తప్పిపోతుంది. చివరకు సత్కర్మలు చేయడానికి, ఉపాసనలు చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నమూ చేయరు. వేదం శాస్త్రం పురాణం వీటి ప్రామాణ్యాన్ని నిరసించేవారి సంఖ్య పెరిగిపోతుంది. జీవునికి స్వాభావికంగానే దుఃఖం వచ్చిందని చెబితే దుఃఖమే జీవస్వరూపం అయి కూచుంటుంది? స్వరూపాన్ని చెడగొట్టుకోవాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు? ఆత్మ స్వరూపం ఆనందమే కానీ, దుఃఖం ఎన్నటికీ కాదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనికదా ఉపనిషత్తు... ఆనందాన్ని నీ స్వరూపంగా దర్శించడం చేతకాని మానవులే దుఃఖభాజనులు అవుతున్నారని చెప్పవలసి వస్తోంది.’’
‘‘అయితే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికే నన్ను తెలుసుకోవాలంటావు. అదిసరే కానీ మట్టిబొమ్మల్లోనూ, కొయ్యశిల్పాలలోనూ, రాతి విగ్రహాలలోనూ నేనున్నానంటావా?’’
‘‘అసలు నువ్వు ఎక్కడైనా ఉన్నావు కదా స్వామీ! అందులో సందేహమేమీ లేదు. మూర్తిమత్వం పొంది చర్మచక్షువులకు కనిపిస్తున్న అన్నింటిలోనూ పంచభూతాలతో కూడి నువ్వున్నావు. కానీ మలమూత్రాలతో కలుషితమైన దేహాల్లోనూ, మరికొన్ని నీచ వస్తువులలోనూ నిన్ను దర్శించడానికి కష్టపడేకంటే పవిత్ర వస్తువులలో నిన్ను ఆరోపిస్తే దర్శించడం సులభమవుతుంది. ఎవరో చెప్పారని గుడ్డిగా అనుసరించడం కాకుండా అపరోక్షానుభూతిని పొందాలంటే సాధన అవసరం.’’
‘‘ఎలా చేయాలి సాధన?’’
‘‘ముక్తికోరే మానవుని సాధన నాలుగు మార్గాల్లో ముందుకు కొనసాగాలి. ఈ నాలుగింటినీ ఏమరుపాటుకు రాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి. మొదటిది నిత్యానిత్య వస్తువివేకం. శ్రుతుల వల్ల, స్మృతుల వల్ల, పురాణాదుల వల్ల శ్రవణ, మనన, నిదిధ్యాస పూర్వకంగా నిరంతరం ఒక్కటే స్మరించాలి. ‘బ్రహ్మ నిత్యం, ప్రపంచం అనిత్యం’ అని. ఇలా స్వీయజ్ఞానంతో ఆత్మనాత్మ వివేకం పెంపొందనంత వరకు కోటిజన్మలెత్తినా మానవునికి బంధచ్ఛేదనమనేది జరగదు కనుక, సాధనలో వివేకోదయమే మొదటి మెట్టు.’’
‘‘మరి రెండవది...’’
‘‘ఫలితం ఆశించి కర్మలను చేయడాన్ని విరమించుకోవాలి. ఎంతవరకూ అంటే, ఇహాముత్ర ఫలభోగ విరాగం ఉదయించే వరకూ. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా జీవుడు తాను చేసిన కర్మల తాలూకు ఫలాన్ని తానే అనుభవించాలనే ఉబలాటాన్ని కట్టిపెట్టుకోవాలి. ఒకడు ఒక మహాభోగాన్ని అనుభవిస్తున్నాడంటే అది సృష్టిలో అంతకుముందు ఎవ్వడూ అనుభవించనిది కాదు అని గుర్తుచేసుకోవాలి. చేసిన పనికి ఫలితాన్ని కూడా అనుభవించాలని కోరుకోవడమంటే కక్కిన కూటికి ఆశపడడమే అని తెలుసుకోవాలి. పరబ్రహ్మ సాయుజ్యమందే మనసు నిలుపుకోవాలి.’’
‘‘సరేలే... లోకంలో అందరూ వ్రతం చెడ్డా ఫలం దక్కాలనుకుంటారు. నువ్వేమో గొప్ప వ్రతం చేసి ఫలాన్ని వదిలేయమంటున్నావు. ఇది సరైన పనేనంటావా?’’
‘‘వైరాగ్యవంతుని కంటే గొప్ప సంపన్నుడు లేడు కదా స్వామీ! ఆరు సుగుణాలుంటే భగవంతుడైనట్లు... ఆరు సంపదలున్నవాడే అన్నీ వదిలేసుకున్న వైరాగ్య సంపన్నుడు అవుతాడు. మొదటి సంపద పేరు శమం... అంటే విషయసుఖాల పట్ల నిర్లిప్తత కలిగి ఉండడం. దీనికోసం అంతరింద్రియాలైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలను నిగ్రహించడం నేర్చుకోవాలి. రెండోసంపద దమం.... అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మూడో సంపద ఉపరతి లేదా నిష్కామకర్మ. నాలుగోది తితిక్ష... అంటే ప్రారబ్ధ, ఆగతాలన్నింటినీ శీతోష్ణాలవలె ఓర్చుకోవడం. అయిదోది గురువుపైన, వేదంపైన శ్రద్ధ. ఆరోది సమాధానం. శ్రవణాదుల ద్వారా సాధనకు అనుకూలమైన విషయాలపైనే మనసు ఉంచడం.’’
‘‘ఈ ఆరు సంపదలనూ పొందడం సాధనలో మూడోమెట్టు. మరి ఆఖరుది?’’
‘‘ముముక్షుత్వం అంటే సంసార తాపత్రయాలను పోగొట్టుకుని, బ్రహ్మతాదాత్మ్యాన్ని పొందాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగివుండడం. ఈ సాధన చతుష్టయాన్ని పొందినవాడే ముక్తికి అర్హుడవుతాడు. అద్వైత సిద్ధిని పొందడానికి అనుకూలుడై ఉంటాడు. ఇవి లోపించిన వారికి, అవైదికమైన ఇతరమార్గాల్లో ఆత్మసాక్షాత్కారం పొందాలని ప్రయత్నించిన వాడికి వట్టి ఆరాటమే మిగులుతుంది.’’
‘‘నిజమేననుకో. ఇదంతా చేయలేని సామాన్యుల సంగతేమిటి? నాముందు కొందరు గుంజీళ్లు తీసి పాపాలు పోగొట్టమంటారు. నేనేం చేస్తాననుకుంటున్నావు?’’
‘‘అసలు నువ్వు ఎవరిని మాత్రం కాదంటావు... వెంటనే పోగొట్టేస్తావు. కానీ పాపమని తాననుకుంటున్నది మళ్లీ చేయక తప్పని మానవుడు తత్ఫలంగా దుఃఖం కలగగానే నువ్వు తన మొర వినలేదనుకుంటాడు. వేరొక దైవాన్ని ఆశ్రయిస్తాడు.’’
‘‘అలా చేయడం తప్పంటావా?’’
‘‘ఏమీ కాదు. గోదానం కావాలంటే మహారాజును ఆశ్రయించాలి కానీ, బేడ అప్పుకోసం ఎరిగున్నవాడు ఎవడైనా చాలు కదా! ఎంతమంది దేవతలనైనా ఆశ్రయించవచ్చు’’
‘‘ఓహో! అలాగైతే నాలాంటి దేవతలు చాలామంది ఉన్నారంటావు?’’
‘‘చాలమంది దేవతలున్నారు. కానీ నీలాంటి దైవాలు మీరు మొత్తం కలిపి ఆరుగురే కదా స్వామీ!... గణేశం దినేశంచ వహ్నిం విష్ణుం శివం శివాం సమభ్యర్చ దేవషట్కం ఇష్టదైవంచ పూజయేత్... అని బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. గణేశునివైన నీవు, దినేశుడైన సూర్యుడు, అగ్నిరూపుడైన కార్తికేయుడు, విష్ణువు, శివుడు, శివాని ఈ ఆరే పరబ్రహ్మ స్వరూపాలు. పగటివేళ సూర్యునివై, రాత్రివేళ మిగతా నీవే నక్షత్రరూపునివై అయిదు జ్యోతిర్మండలాల్లో కన్నులముందు ప్రకాశిస్తుంటావు. నీ అనుగ్రహం నేలకు పరిపూర్ణంగా వర్షించే శుభవేళలు పరిగణించిన మా పౌరాణికులు వివిధ సందర్భాలలో నీపేర వివిధ పర్వాలను, వ్రతవిధానాలను ఏర్పరిచారు.
కన్నుల ఎదుటే నీవు ప్రత్యక్షమై కనిపిస్తుంటే దేవుణ్ణి చూడలేమని, కనిపెట్టలేమని అనుకోవడం మానవుడి వెర్రితనం కాక మరేమిటి? తల పైకెత్తి ఆకాశంలో చూస్తే నీవే. నేలపై చూస్తున్న జీవులన్నీ నీకు అభేద రూపాలే. కన్నులు మూసుకుని ధ్యానించినా మనిషిని పలకరించేది నీ తేజమే. యోగమార్గాన్ని అవలంబించి మనిషి తనలోకి తాను చూసుకుంటే, మూలాధారం మొదలు ఆజ్ఞవరకూ వరుసగా ఉన్నవన్నీ ఆరుచక్రాలూ నీ ఆరు రూపాలే. ఆజ్ఞనుంచి పైకి ఎగబ్రాకిన యోగి సహస్రారంలో ఆరు తేజస్సులూ కలిసి ఒకే పరబ్రహ్మ స్వరూపంగా ఆవిష్కరించుకున్నట్లు మీ ఆరుగురూ కలిసి ఒక్కటే. మీ ఆరు రూపాలే సనాతనం. నిత్యం. మిమ్మల్ని కాకుండా ఇతర దైవాలను కొలిచే మానవుడు మీ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దశలో ఉన్నవాడు.’’
‘‘బాగున్నది. నీలోని ఎరుక సకల మానవులకూ కలగాలి. అందుకే జగద్గురునివై సాక్షాత్ శంభుమూర్తివైన నీవు నేలకు దిగివచ్చావు. నీవంటివాడు వచ్చినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతిసన్నివేశం దేవతామయమే కావాలి కదా! అందుకే బ్రహ్మాదులు మండన మిశ్ర తదితర శిష్యగణమై నిన్ను అనుసరించి వచ్చారు. వారందరి తోడ్పాటుతో నీ అద్వైత సిద్ధాంతం సామాన్యుల మధ్యకు వెళ్లాలి. అవివేకం అజ్ఞానం వల్ల ఎవరికివారు తమదైవమే గొప్పదనే భ్రమలో ఉన్నారు. పరమతాల పట్ల పరమ అసహనంతో రగిలిపోతున్నారు. వాదులాటలతో, కొట్లాటలతోనూ కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఒకరినొకరు చంపుకోవడానికి, ఇతరులను ప్రలోభ పెట్టడానికి కూడా వెనుదీయడం లేదు.
అటువంటి వారందరికీ కనువిప్పు కలిగేలా నీ జ్ఞానాన్ని వారికి పంచు. మతాలమధ్య సమన్వయాన్ని సాధించు. సనాతన ధర్మమనే స్రోతస్వినిలో మానవులందరూ కలగలిసిపోయేలా చూడు. మూర్ఖత్వమనే రాక్షసశక్తితో పోరాటం చేయడం వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రునికైనా, జ్ఞానదండాన్ని ధరించిన నీకైనా తేలికైన విషయమేమీ కాదు. కానీ జగదుద్ధారణ తంత్రంలో కరుణాబిందువైన నీవు యుగాంతాల వరకూ మానవులందరూ తరించేందుకు వలసిన పాఠాలు కొన్ని నేర్పు. సెలవా మరి...’’ అన్నాడు వినాయకుడు తిరుగు ప్రయాణమవుతూ.
వినాయకునితో పాటుగా శాపవిమోచనం పొందిన ఉభయ భారతి తానూ బ్రహ్మలోకానికి ప్రయాణమైంది. చూస్తుండగానే సర్వజ్ఞపీఠపు ఊర్ధ్వద్వారం నుంచి ఒక కాంతివలయం పైకి ఎగిసింది. ఉభయభారతి ఖాళీ చేసిన ప్రదేశంలో ఒక కొయ్యబొమ్మ వెలిసింది. శంకరుడు గబగబా పీఠం నుంచి దిగివచ్చి ఆ బొమ్మను రెండుచేతులా పట్టుకుని కళ్లకద్దుకున్నాడు. సాక్షాత్ బ్రహ్మ అయిన మండన మిశ్రుడు మానవలోకంలో మిగిలి ఉండగానే తన ప్రతీకను నేలపై వదిలి బ్రాహ్మీశక్తి స్వస్థానానికి మరలిపోయింది.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment