Adi Shankara
-
శంకరులు చెప్పిన చరమకాంక్ష
గంగాదేవి ఎంత గొప్పదంటే... ‘మాతా జాహ్నవీ దేవీ !’ అని సంబోధించారు ఆది శంకరులు. గంగాష్టకం చేస్తూ..‘‘మాతర్జాహ్నవి శంభూసంగమిలితే మౌషౌ నిధాయాఞ్జలిం/ త్వత్తిరే వపుషో వాసనసమయే నారాయణాం ఘ్రిద్వయమ్ / సనన్దమ్ స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే / భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ’’ అన్నారు. అమ్మా! అని పిలిచారు. నా శరీరం నుంచి ప్రాణాలు ఊర్థ్వముఖమై పోతుంటాయి. ఏదో ఒక సమయంలో శరీరం విడిచి పెట్టాలి కదా! ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ /తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి’’పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అమ్మా! నా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నీ ఒడ్డున నిలబడి నా రెండు చేతులు తలమీద పెట్టి అంజలి ఘటించి నీవంక చూస్తూ.... నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతుంటే... మిగిలిన వాళ్ళందరూ ఏడ్వ వచ్చుగాక! కానీ నాకు అది ఉత్సవం కావాలి’’ అన్నారు. భగవంతుడు లోపలినుంచి బయటికి ఉత్సవమూర్తిగా వస్తుంటే పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కరించి ఎగిరెగిరి చూసినట్లు – నా ప్రాణాలు పైకి లేచిపోతుంటే – అమ్మా నేను ఆనందపడిపోవాలి. ఇంతకాలం ఎవరి పాదాలు పట్టి స్మరించానో ఎవరి గురించి చెప్పుకున్నానో వారి పాదపంజరం లోకి వెళ్ళిపోతున్నా.. ఈ శరీరం వదిలి పెట్టేస్తున్నా..... అని .. చెమటపట్టిన బట్టను ఎంత తేలిగ్గా వదిలేస్తామో, అంత తేలిగ్గా నా శరీరాన్ని వదిలిపెట్టేస్తూ, నా తల మీద నారాయణ మూర్తి పాద ద్వయాన్ని స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదం లేకుండా బతికిన నేను చిట్టచివరన శరీరం విడిచిపెట్టేటప్పుడు ‘అమ్మా! నిన్ను చూడాలి’ అని అంటారు. గంగమ్మ వైభవాన్ని గురించి చెబుతూ ఆయన... ‘‘ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం/ పశ్చాత్పన్నగ శాయినో భగవతః పాదోదకం పావనమ్ / భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షే రియం / కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే’’ అన్నారు. ఆమె మొట్టమొదట శ్రీమహావిష్ణువు పాదాలను కడగడానికి పనికొచ్చింది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడిగారు. అంటే ఆ కమండలంలో ఉన్నది గంగే. తరువాత శంభుని తలమీద పడింది. తరువాత జహ్ను మహర్షి తాగి తాను మళ్ళీ విడిచి పెట్టాడు. అలా ఋషి స్పర్శ పొందింది. అటువంటి గంగమ్మా! నా పాపాలన్నీ తొలగించు.. అని వేడుకున్నారు. దీక్షితార్ వారు దీనినంతటినీ దృష్టిలో పెట్టుకుని గంగే మాం పాహి.. గిరీశ శిరస్థితే... అన్నారు తన కీర్తనలో. గంగ శివుని తలను తాకింది.. ఎలా? వినయంతో తాకిందా !!! నిజానికి పైనుంచి పడిపోయేటప్పుడు చాలా అహంకారంతో పడింది. ‘ఈడ్చి అవతల పారేస్తాను పాతాళానికి..’’ అంటూ పడింది. అలా పడుతుంటే పరమ శివుడు..‘‘ఇంత అహంకరిస్తోంది గంగ. ఎలా వెళ్ళిపోతుందో, నన్నెంత లాగేస్తుందో చూస్తా..’ అనుకుంటూ.. పాండురంగడు నిలుచున్నట్లు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ నిలుచున్నాడు. పైనుంచి గంగ పడంగానే జుట్టుతో కట్టేసాడు.. జటాజూటంలో. అలా దానిలోకి ఏళ్లతరబడి అలా పడుతూనే ఉంది. శాస్త్రాలుగానీ మరేదయినా గానీ చదువుకోని దీక్షితార్ వారు చిన్న చిన్న పదాలతో చాలా గంభీరమైన భావాల్ని తన కీర్తనల్లో అద్భుతంగా పలికించారు. అదంతా గురువుల శుశ్రూష ఫలితంగా అబ్బిన విద్యాగంధం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ద్వారకలో కాళి
తరుణారుణ ముఖకమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవన మాశాసే మంజుల మహిమాన మంజనాసూనుం విషయవాంఛలను విడిచిన వైరాగ్య పూర్ణుడవు కనుక, నీలో ఆనందానికి లోటు లేదు. నీ సజల నేత్రాలు, నీ రోమాంచాలు, నీ నిర్మలత్వం ఇవన్నీ మెచ్చుకున్న శ్రీరాముడు నిన్ను తన దూతగా ఎన్నుకున్నాడు. నవవికసితమై ఎర్రనైన నీ ముఖపద్మం, దయారస ప్రవాహం కల నీ చూపులు, నీ మనోహరత్వం, నీ మంజుల హృదయం నా పాలిట సంజీవనులు. నిన్ను నిరంతరం నా మనసులోనే నిలుపుకునే భోగాన్ని అంజనాతనయా! నాకు అనుగ్రహించు. నీవలె సడలని రామభక్తిని నాకూ కొంత దయచేయి... అన్నాడు శంకరుడు.ఆంజనేయుడు తలపంకించాడు. శంకరుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన తరువాత... కాశ్మీర యువరాజ కుమారుడైన గోపాదిత్యుని కోరిక మేరకు జ్యేష్ఠ రుద్రేశ్వరాలయానికి కుంభాభిషేకం నిర్వహించాడు. విభిన్న వాదాలను ఖండిస్తూ, మతాల మధ్య సమన్వయం సాధిస్తూ కొంతకాలం పాటు కాశ్మీర భూముల్లో దిగ్విజయ యాత్రలు జరిపాడు. కలియుగాది 2611 (క్రీ.శ. 491) శ్రీసాధారణ నామ సంవత్సరం నాటికి.... హిమాలయ భూముల్లో పడమటి కొస నుంచి తూర్పుకు మళ్లి, యమునా తీరాన శ్రీకృష్ణ బృందావనాన్ని సమీపించాడు. ఆ కార్తిక పౌర్ణమివేళ శ్రీకృష్ణదర్శనానికి ముందుగా బృందావన క్షేత్రపాలకుడైన ఆంజనేయుని దర్శించి అనుమతిని అర్థించాడు. శ్రీకృష్ణదేవుడు రాధాసమేతుడై మహారాస జరిపే పర్వదినాన బృందావనానికి రావాలంటే దేవతలైనా హనుమ అనుజ్ఞ కోరవలసిందే. జగద్గురువుగా, యతివేషాన్ని ధరించి తనముందు నిలిచిన సాక్షాత్ శంకరునితో కొద్దిసేపు సంభాషించాలని ఆ రుద్రాంశ సంభూతునికి మనసు లాగింది. ‘‘జగద్గురూ! పరమాత్మ నల్లగా ఉంటాడా.. తెల్లగా ఉంటాడా... ఎర్రని వాడా... నీలమేఘచ్ఛాయ బోలు దేహము వాడా?’’ అని ఒక చిలిపి ప్రశ్న సంధించాడు. ‘‘ఛాందోగ్యం ఆదిత్యుని వర్ణన చేసింది కదా స్వామీ! అంగోపాసనలను చెప్పిన తర్వాత వచ్చే మంత్రంలో... ఆదిత్యునిలోని తెల్లని ప్రకాశమే ఋక్కు, ఆయనలోని అతిశయించిన నల్లదనమే నీలవర్ణమై సామగా మారిందని తెలియచేసింది. ఆదిత్యునికి మధ్యలో బంగరు రంగు పురుషుడున్నాడన్నది...’’ శంకరుడు చెప్పుకుపోతున్నాడు. ‘‘కాస్త ఆగు స్వామీ! ఆ హిరణ్మయుని జుత్తు, మీసం, గెడ్డం కూడా బంగారం రంగులో ఉన్నాయంటోది కదూ ఉపనిషత్తు?’’ అడిగాడు ఆంజనేయుడు. ‘‘పరమాత్మ బంగారు వర్ణంలో ఉన్నాడంటే బంగారంతో స్వామిని ఎవరో తయారు చేశారని అర్థం కాదు కదా! దేహప్రకాశం వల్ల బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి కానీ, నిత్యయవ్వనుని కేశాలు నల్లగా కాక మరోలా ఉన్నాయంటే అసంబద్ధంగా ఉంటుంది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘వేదాంతం చెప్పడానికి పూనుకున్నప్పుడు శాస్త్రాన్ని శాస్త్రంలా చెప్పాలి కానీ, జ్ఞానులైన ఋషులు కూడా కవిత్వాన్ని ఒలకబోస్తే ఇలాగే ఉంటుంది... సామాన్యులకు అర్థం కాదు. అది సరే కానీ, ఆ తరువాత మంత్రమున్నదే... అదే... ‘తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ తస్యోదితి నామ’ దానిమీద నీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఆగి నోటిపై నాలుగువేళ్లనూ ఉంచుకుని, ‘హవ్వ’ అన్నట్లు సంకేతిస్తూ, ‘‘పరమాత్మ కళ్లను గురించి చెబుతూ కోతిపృష్ఠభాగంలా ఎర్రగా ఉంటాయని చెప్పడం తగిన పనేనంటావా?’’ అన్నాడు హనుమంతుడు తోక దాచుకుంటూ. ‘‘అయ్యయ్యో అదేమీ లేదయ్యా తండ్రీ!’’ చెప్పాడు శంకరుడు. ‘‘కోతిపృష్ఠభాగంలా ఎర్రగా ఉండేవి పద్మాలు. బురదలో పుట్టిన పద్మానికే ఆ నీచోపమ చెందుతుంది కానీ, స్వామి కన్నులు పద్మాలే. ఏ సందేహమూ తగలకుండా పుండరీకాక్షుడని చెప్పింది అందుకే...’’ అన్నాడు. ‘‘సరేలే... నీ సంగతి చూస్తుంటే మన ఋషులమీద, శాస్త్రాలమీద ఈగ వాలనిచ్చేలా లేవు. అందరినీ సమర్థిస్తూ, సమన్వయిస్తూ పోవాలంటేనూ... కొందరినైనా కాదని తిట్టిపోయకుండా ఉండాలంటేనూ.... సత్యం ఒక్కటే కానీ పండితులు అనేక రకాలుగా చెబుతుంటారని తెలుసుకోవాలంటే నీలాంటి తెలివితేటలు అందరికీ ఉండొద్దా చెప్పు! తెలివిదేమున్నది కానీ, ఇంత చిన్నవయస్సులో ఇంతటి వైరాగ్యాన్ని ఎక్కడ సాధించావు చెప్పవా’’ మనకోసం అడిగినట్టు అడిగాడు పాపం ఆంజనేయుడు. ‘‘భగవానుడందించిన గీతనుంచే. సుఖహేతువులైన విషయాలు మూడురకాలుగా ఉంటాయి. వినిపించేవి, స్మరణకు వస్తుండేవి, అనుభవంలోకి వచ్చేవి. ఒక వ్యక్తి తనకు ప్రీతిని కలిగించే వ్యక్తిని గురించి విన్నప్పుడు తెలియకుండానే సకాముడు అవుతున్నాడు. ఆ వ్యక్తిని మనసున స్మరించి స్మరించి కామము కలవాడవుతున్నాడు. ప్రీతికరమైన వస్తువు లేదా వ్యక్తి తనకు సన్నిహితమైనప్పుడు అనుభవించి కూడా తనివి తీరక కామాన్ని పెంచుకుంటున్నాడు. శరీరమందు గగుర్పాటు, కన్నులు విప్పార్చడం, ముఖంలో ప్రీతి, శరీరం కంపించి పోవడం, చెమటలు పట్టడం, పెదవులు కొరకటం, కన్నులు రక్తం చిమ్మటం, మనసులో తెలియరాని సంక్షోభం చెలరేగడం వంటి కామక్రోధోద్భవ వేగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అభ్యాసం చేయాలి. ఈ సంకేతాలు కనిపించగానే కామాన్ని అరికట్టగలిగితే యోగం అవుతుంది. వైరాగ్యం, భగవద్భక్తి రెండూ అందుకు సాధనాలు. కాగా దీనిలో నిశ్చయము, అనిర్వేదము, సమదర్శనము అనేవి అనుష్ఠించ దగినవి’’ శంకరుడు ఇంకా చెబుతూనే ఉన్నాడు. అంతలోనే ఆంజనేయుడు అందుకుని, ఆ సందర్భంలోని గీతాశ్లోకాన్ని పఠించాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే శంకరుడు దానికి భాష్యాన్ని ఇలా వెలువరించాడు. ‘‘అభ్యాస వైరాగ్యముల చేతనే మనస్సును నిగ్రహించడం సాధ్యమవుతుంది. మన చిత్తవృత్తులలో భాసించే ఇష్ట దేవతనే బ్రహ్మస్వరూపంగా ఎంచుకోవాలి. అన్ని స్థితుల యందూ సమానంగా తోస్తున్న చిత్తవృత్తినే దేవతారూపంగా దర్శించడం కనుక అభ్యసిస్తే మనస్సు తేలికగా స్వాధీనమవుతుంది. ఐహిక ఆముష్మిక భోగాలయందు దోషాన్ని చూడడం అభ్యసించడం వల్ల వైరాగ్యం ఉదయిస్తుంది. శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి కలిగి ఇటువంటి అభ్యాసం చేసిన యోగికి మరణకాలంలో స్మృతి భ్రష్టమైనా, అతడు యోగమార్గం నుంచి మాత్రం భ్రష్టుడు కాడు. ఆ యోగబలమే అశ్వమేధాది యాగఫలాన్ని అందిస్తుంది. తరువాతి జన్మలలో కూడా అటువంటి యోగి అధర్మవర్తన నుంచి దూరంగానే ఉంటాడు. మోక్షమార్గాన్ని తేలికగా పొందుతాడు.... ’’ ‘‘అయితే అశ్వమేధాది యాగాలను మానసికమైన యోగబలంతోనే నిర్వహించాలంటావు. నిజంగానే జంతువును తీసుకొచ్చి బలివెయ్యనక్కరలేదంటావు’’ అడిగాడు ఆంజనేయుడు. ‘‘ఉపనిషత్తు చెప్పిన ఏకైకమార్గం మాత్రం అంతే...’’ అన్నాడు శంకరుడు. ‘‘సరే... ఈనాడు కార్తిక పౌర్ణమి. మాధవ దేవుడు మహారాస కోసం బృందావనానికి తరలి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. అదిగో ఆ భక్తులందరూ అందుకే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ రాత్రివేళ వారు సమకూర్చిన సకల సంభారాలూ దైవానికే అనుభవైక వేద్యమవుతాయి. తాను వచ్చివెళ్లిన ఆనవాళ్లను మాధవదేవుడు రేపటికి మిగుల్చుతాడు. ఈరాత్రి సమయంలో ఈ చుట్టుపక్కల ఉండేందుకు మానవ మాత్రులెవరికీ అనుమతి లేదు. ఇక్కడ గోవిందుడొక్కడే పురుషుడు. కనుక ఇచ్ఛామాత్రంగా దేహాన్ని మార్చుకోగలిగిన దేవతలు, మహర్షులు సైతం పశుపక్ష్యాది రూపాలలోకి మారి, దూరాన నిలిచి కృష్ణలీలలను తిలకించి జన్మధన్యత పొందుతుంటారు. అయినా అతిచిన్న వయస్సులోనే స్వామి నీ మాటవిన్నవాడు. నీ కోరికమేరకు లీలామాత్రంగా తన ఆలయాన్ని పూర్ణానది ముంపునుంచి తప్పించినవాడు. మరి నీకక్కడ మినహాయింపు లభిస్తుందో లేదో నేను చెప్పలేను. ఏం చేస్తావో చెప్పు... ఇతరుల వలె నీవు కూడా రూపు మార్చుకుంటావా?!’’ అడిగాడు హనుమంతుడు ముసిముసిగా నవ్వుతూ. ‘‘అక్కడికి వెళ్లాక చెబుతాను’’ అని జవాబిచ్చాడు శంకరుడు దారితీస్తూ. ఆనాడు హనుమతో కలిసి శంకరుడు శ్రీకృష్ణదర్శనం చేశాడు. ముదురుతున్న చలిని ఇక తట్టుకోవడం నావల్లకాదంటూ మార్గశిరానికి చోటిచ్చి కార్తికం మరలిపోయింది. శంకరుడు బృందావనాన్ని విడిచిపెట్టి, ద్వారకానగరం దిశగా మరలాడు. ఆవేళ సర్వజ్ఞపీఠంలో చందనదారు శిల్పమై వెలిíసిన ఉభయభారతి ఇప్పుడు సంచారపీఠానికి అధిదైవమై వెంటనంటి వస్తోంది. పద్మపాద, మండనమిశ్ర, హస్తామలకాది పద్నాలుగు మంది ముఖ్యశిష్యులతోనూ, ఇతర శిష్యులతోనూ, అభిమాన గణంతోనూ కలిసి ఒక మహాసమూహంగా శంకరయతి గోమతీతీరంలో ప్రవేశించాడు. అవి మాఘమాసపు మాతంగీ నవరాత్రి పర్వదినపు రోజులు. ఆ పంచమినాడు స్నానార్థమై నదిలో మునిగిన శంకరాచార్యుడు ఒడ్డుకు వచ్చే సమయంలో చేతిలో ఒక గోమతీచక్రాన్ని తీసుకువచ్చాడు. ఎర్రని రంగు కలిగి, శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శనాన్ని పోలివుండే గోమతీచక్రం మహాలక్ష్మీ స్వరూపం. దానిని పీఠంలో ఉంచి, శంకరుడు తగినరీతిన అర్చించసాగాడు. అర్చన ముగింపుకు వచ్చేవేళలో అవ్యక్తమధురమైన ఒక కంఠధ్వని వినవచ్చింది. ‘‘జగద్గురూ! శ్రీకృష్ణదేవుడు ఆనతిచ్చిన శుభముహూర్తం సమీపించింది’’ అన్న సందేశమది. కన్నులు తెరిచి చూసేసరికి తన ఎదుట ఉన్న శ్రీశారదా రూపం నల్లనికాటుక రంగులోకి మారి ఉంది. క్రమంగా ఆ శిల్పంలో కదలిక వచ్చింది. శంకరుడు ఆ మహాకాళీ స్వరూపం వెంట మౌనంగా నడిచాడు. కదులుతున్న చీకటిరాశిలా కాళి ఆయనను ద్వారకా నగరంలోకి తీసుకుపోయింది. ద్వారకాధీశుని ఆలయానికి కొద్దిదూరంలో సముద్రతీరాన శుద్ధస్ఫటిక మూర్తిగా దర్శనమిచ్చే సిద్ధేశ్వర మహాదేవుని సన్నిధిలో నిలబెట్టింది. ఆ స్వామి వెలుగులు ప్రసరించిన తరువాత నల్లని కాళి కాస్తా అరుణవర్ణంలో భద్రకాళిగా మారింది. శంకరుడు ఆ ఇద్దరినీ శాస్త్రవిధిన అర్చించాడు. శ్రీశారదా చందన దారుమూర్తిలోని ఒక కళ ద్వారకలోని భద్రకాళిలో చేరి అక్కడే స్థిరపడింది. కాగా దారుమూర్తి మళ్లీ శంకరుని వద్దనే మిగిలిపోయింది. భరతఖండానికి పశ్చిమదిశలో తొలి శంకర పీఠం ద్వారకలో నెలకొల్పడానికి భద్రకాళీ, సిద్ధేశ్వరుల అనుమతి ఆ విధంగా లభించింది. శ్రీసాధారణ నామ సంవత్సర మాఘశుక్ల సప్తమి అనగా రథసప్తమినాడు ద్వారకా పీఠస్థాపనకు ముహూర్తం ఖరారైంది. శంకరుడు తన తొలిపీఠానికి కాళీపీఠమనే నామకరణం చేశాడు. కానీ దానిని కూడా శారదాపీఠమనే పిలుస్తుంటారు. పీఠస్థాపన వేళ శంకరుడు ఇలా ప్రకటించాడు. ‘‘సముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌరాష్ట్రదేశం (గుజరాత్), సింధు, సౌవీరదేశాలతో (పంజాబ్ నుంచి ఎగువకు ఉన్న ప్రాంతం) మొదలుపెట్టి మహారాష్ట్రం వరకు ఉన్న ప్రాంతాలన్నీ నేటి నుంచి ద్వారకా కాళీపీఠ పాలనలోకి వస్తాయి. భద్రకాళీ, సిద్ధేశ్వరులు ఈ పీఠానికి అధిదేవతలు. భరతఖండానికి నాలుగు దిక్కులా పీఠస్థాపనలు చేయాలన్న ప్రణాళికలో ఇది మొదటి అడుగు. ఈ పీఠ ఆచార్య స్థానానికిగానూ హస్తామలకాచార్యుణ్ణి ఎంపిక చేస్తున్నాను’’ అంటూ శంకరుడు తన శిష్యుణ్ణి చేరబిలిచాడు. హస్తామలకుడు వినమ్రంగా వెళ్లి జగద్గురువు ముందు నిలబడ్డాడు. పీఠాధిపతిగా శంకరుడు అతడిని అభిషేకించాడు. అనంతరం... ‘‘సామవేద సారమైన ఛాందోగ్యోపనిషత్తు అందించిన ‘తత్త్వమసి’ మహావాక్యాన్ని ద్వారకా పీఠాధిపతులు బోధిస్తారు. వీరందరూ భూతదయతో ఉంటారు. క్రిమికీటకాదులను సైతం హింసించని నియమం కలవారు. కనుక వీరిది కీటవార సంప్రదాయమవుతుంది. గోమతీ తీర్థాన్ని సేవించే వీరికి అవిగత గోత్రాన్ని ప్రసాదిస్తున్నాను. తత్ వాక్యార్థాన్ని గ్రహించినవాడే ఇక్కడ తీర్థుడవుతాడు. సన్యాసాశ్రమ గ్రహణ నిపుణుడు, ఆశాపాశాల నుంచి విడివడినవాడు ఆశ్రమనామాన్ని ధరిస్తాడు. స్వానందమున క్రీడిస్తూ స్వస్వరూపమును ఎరిగిన వాడికి ఈ పీఠాధిపతులు స్వరూపనామాన్ని అనుగ్రహిస్తారు’’ అన్నాడు. ద్వారకలో కాళీపీఠ స్థాపన కార్యక్రమం జయప్రదంగా నెరవేరింది. కానీ పీఠాధిపత్యాన్ని శంకరులు తనవద్దనే ఉంచుకోకుండా వేరొకరికి ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్న కొందరిని వేధించింది. మరికొందరి మనసుల్లో ఎందరో శిష్యులుండగా హస్తామలకుడే తొలిపీఠాధిపతిగా ఎందుకు ఎంపికయ్యాడో అన్న సందేహం మెదిలింది. శంకరుడొకసారి వారి సందేహాన్ని తీర్చాడు. ‘‘ఈనాడు పదహారేళ్ల బాలునిగా కనిపిస్తున్న ఈ హస్తామలకుని వయస్సు నిజానికి అంతకంటే చాలా ఎక్కువ. వాయుదేవుని అంశతో జన్మించిన ఇతడు పూర్వజన్మలోనే సిద్ధస్థితిని పొందాడు. ఒకరోజున గంగాతీరాన బాహ్యస్మృతిలేని తపస్సమాధిలో ఉన్నాడు. ప్రభాకర పండితుని ఇల్లాలు తన రెండేళ్ల కుమారుణ్ణి ఎత్తుకుని గంగాస్నానానికి వచ్చింది. తన పిల్లవాణ్ణి సిద్ధుని ముందు దిగవిడిచి స్నానానికి వెళ్లింది. తల్లి తనకు పిల్లవాణ్ణి అప్పగించి వెళ్లిందన్న సంగతి సిద్ధుడు గుర్తించలేదు. అన్నెం పున్నెం ఎరుగని పసిబాలుడు అమ్మవెళ్లిన తోవను వెతుక్కుంటూ వెళ్లి నదిలో మునిగి మరణించాడు. తల్లి తన బిడ్డ శవాన్ని ఎత్తుకుని సిద్ధుని ముందుకు వచ్చి బావురుమని విలపించింది. సిద్ధుని మనస్సు కరిగి నీరైపోయింది. తనపై వచ్చిన అపవాదును పోగొట్టుకోవడానికి, ఆ తల్లి కడుపుకోతను తీర్చడానికి ఆయన తన విద్యను ఉపయోగించాడు. అప్పటికప్పుడు తన దేహాన్ని తృణప్రాయంగా త్యజించి బాలుని దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. బాలుడు తిరిగి బ్రతికాడు. కానీ ఆ బాలునికి కూడా తనలోపల ఉన్న సిద్ధునికి వలెనే లౌకిక ప్రపంచం పట్టేది కాదు. అతని తీరుచూసిన పెద్దలు అతడు వఠ్ఠి జడుడు అనుకున్నారు. తండ్రిగా ప్రభాకరుడు ఎంతో ఆవేదన పడ్డాడు. కుమారుని శ్రేయస్సుకోసం ఉపనయనాది సంస్కారాలు నిర్వహించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. శంకరుణ్ణి కలుసుకునే వరకూ అతని సంగతి ఎవరికీ అంతుపట్టలేదు. చేతిలో ఉసిరికాయలతో శంకరుని ముందుకు వచ్చి తొలిసారిగా తన స్వస్వరూప స్థితిని నివేదించాడు. ఆనాటి జడస్వరూపం నేడు భరతఖండానికి సామవేదోక్తమైన ధర్మనియమాలపై అంతిమ నిర్ణయాన్ని వెలువరించగలిగే పశ్చిమామ్నాయ శంకర పీఠానికి తొలి గురువు అయ్యాడు.’’ (సశేషం) - నేతి సూర్యనారాయణ శర్మ -
షణ్మత స్థాపనాచార్య
చతురామ్నాయాలతో పాటు ఊర్ధ్వామ్నాయ విద్యా రహస్యాలను శంకరుడు వెల్లడించిన వేళ... సర్వజ్ఞపీఠపు పైకప్పు అలవోకగా పక్కకు జరిగింది. ఉభయభారతి తన లోకానికి సాగిపోవడానికి ఉద్యుక్తురాలైంది. అటువంటి తరుణంలో అక్కడో విచిత్రం జరిగింది. ఆకాశం నుంచి పరబ్రహ్మ తేజస్సు సభామధ్యంలో అవతరించింది. సభాసదులందరూ చూస్తూ ఉండగా ఆ తేజస్సు క్రమంగా విఘ్నేశ్వర రూపాన్ని పొందింది. ఆ మహారూపానికి అందరూ మొక్కుతుండగా, శంకరుడు పంచరత్నాలతో స్తోత్రం చేశాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం శ్రీవినాయకా! నీ రెండుచేతులా ధరించిన మోదకాలు సాధకులకు మోక్షసామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాయి. నెలవంకను శిరసున ధరించి లోకాలన్నింటినీ విలాసంగా రక్షించే పరబ్రహ్మవు నీవే. దైత్యగుణాలను నిర్జించి నీవు అనాథనాథునివైనావు. అశుభాలను ఆశువుగా పోగొట్టే నిన్ను గొలిచి నేను కృతార్థుడినవుతాను. మొక్కనివారికి మిక్కిలి భయంకరునివి నీవు. అప్పుడే ఉదయించిన సూర్యునిలా ప్రకాశిస్తుంటావు. ఆశ్రయించిన వారిని ఆపదలనుంచి గట్టెక్కించే దేవాధిదేవా మాహేశ్వరా! పరాత్పరునివైన నిన్ను నిరంతరం నేను ఆశ్రయిస్తాను. ఓంకార వదనుడా! నీ మోము సకల లోకాలకూ శుభాలను కలిగించేది. మహారాక్షసులను నిర్జించి నీవే ఈ విశ్వాన్ని కడుపున పెట్టుకుని కాపాడుతున్నావు. నీ కృపావర్షం అంతులేనిది. నీ క్షమాహృదయం హద్దులేనిది. నీకు మొక్కిన వారికి ముదములను, యశస్సులను కలిగిస్తావు. నీవలె నా మనస్సును ప్రకాశింప చేయమని కోరుతున్నాను. ఓయి పురాణగజమా! పరమేశ్వరుని పెద్దకుమారుడా! నీ బుగ్గల నుంచి జాలువారే మదజలం వేదవాదాలకు పుట్టుకస్థానం. అది సమస్త దారిద్య్ర బాధలను తుడిచిపెట్టగలదు. ప్రపంచ నాశవేళ అగ్నిస్వరూపాన్ని దాల్చి రాక్షస శక్తుల అణిచివేయగలదు. ఓయి ఏకదంతుడా! యముణ్ణి సైతం మట్టుపెట్టిన శివుని కుమారుడా! నిన్ను తలచుకుంటే అంతరాయానికి తావుండదు. నీవు నిరంతరాయంగా నా హృదయ మధ్యమందు యోగరూపంలో కొలువుండమని సదా ప్రార్థిస్తాను.. అన్నాడు శంకరుడు. శంకరస్తోత్రానికి ఫలశ్రుతిని ఉభయభారతి స్వయంగా చెప్పింది... ప్రతిదినం ప్రాతఃకాలంలో వినాయక దేవుని మనసులో నెమ్మదిగా తలచుకుంటూ, ఈ మహాగణేశ పంచరత్నమనే స్తోత్రాన్ని పెద్దగా చదివే భక్తుడు ఆరోగ్యాన్ని పొందుతాడు. అతడి దోషాలు హరిస్తాయి. సాహిత్యాభిలాష ఉదయిస్తుంది. మంచిసంతానం పొందుతాడు. దీర్ఘాయుష్షు కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. చిరకాలం వర్ధిల్లుతాడు అన్నదామె. ఆ మాటలు చెబుతూనే సర్వజ్ఞపీఠ సింహాసనం నుంచి దిగివచ్చింది. వినాయక దేవునికి కుడివైపున ఆమెకోసమే కల్పితమైన దివ్యాసనాన్ని అధిష్ఠించింది. తిలకిస్తున్న వారి కన్నులు ధన్యములవుతుండగా ప్రభలు చిమ్ముతున్న వెలుగుల ముద్ద అయిన విఘ్నేశ్వరమూర్తి శంకరుణ్ణి ‘జగద్గురూ!’ అని సంబోధించింది. ఆ సంబోధన ఆలకించిన సర్వజ్ఞపీఠం యావత్తూ ఒక్కసారిగా జయజయ శంకర ధ్వానం చేసింది. ఆ సందడి కొద్దిగా సద్దుమణిగిన తరువాత గజాననుడు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘జగద్గురూ! దేవుడున్నాడంటావా?’’ ‘‘పరమాత్మా! నువ్వు వేరుగా లేవుగా కదా స్వామీ!’’ ‘‘మరైతే లేని నన్ను కలుసుకోవడం జీవులకు సాధ్యమేనం టావా?’’ ‘‘సాధ్యమేనని సాక్ష్యమివ్వడానికి ఈ సభ చాలదా స్వామీ!’’ ‘‘ఒకప్పుడు కొద్దిసేపు కనిపిస్తే మాత్రం ఈ అనుభవం నీవంటి వారికి తప్ప అన్యులకు నిత్యమై, సిద్ధమై ఉండదు కదా!’’ ‘‘సాధనతో ఎవరికైనా అసాధ్యమన్నది ఉండదు.’’ ‘‘ఎందుకసలు సాధన చేయడం... నన్ను పొందమని, నన్ను తెలుసుకోమని ఎవ్వరినీ నేనెప్పుడూ కోరను కదా!’’ ‘‘నీవు కోరకపోయినా దుఃఖరాహిత్యాన్ని పొందడానికి జీవుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మాయను తెలుసుకోలేని అజ్ఞానం అవివేకానికి దారి తీస్తుంది. అవివేకం అభిమానాన్ని పుట్టిస్తుంది. అభిమానం వల్ల రాగద్వేషాలు వచ్చిపడతాయి. రాగద్వేషాలతో మిళితమైన కర్మలు జన్మకు, ఆ జన్మ దుఃఖానికి హేతులవుతున్నాయి. జీవుడు నిరంతరం తనకు దుఃఖాలే లేకుండా పోవాలని, అన్నీ సుఖాలే ప్రాప్తించాలని అర్రులు చాస్తూ ఉంటాడు. పుణ్యకర్మల సాయంతో దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మంత్రసిద్ధి పొందినవాడికి అగ్నిలోని వేడిమిని ఓర్చుకునే శక్తి వస్తుంది. కానీ నిప్పులోని కాల్చే తత్త్వాన్ని పోగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. పుణ్యబలం క్షీణించిన తరువాతైనా వేచివున్న నిప్పు కాల్చక మానదు. ఫలితంగా దుఃఖం తప్పదు. జన్మ సిద్ధమవుతూనే జీవుడు మళ్లీ సుఖప్రాప్తికి వెంపర్లాట మానడు. ఆనంద పరమావధిని తెలుసుకునేంత వరకు ఈ జన్మల వలయం ఇలాగే తిరుగుతుంది. జన్మకు మూలకారణమైన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే నీ తత్త్వాన్ని సాకల్యంగా తెలుసుకోవడం మినహా వేరుమార్గం లేదు.’’ ‘‘అసలీ దుఃఖం ఎక్కడినుంచి వచ్చిందయ్యా? నా సృష్టిలోని దేనంటావా?!’’ ‘‘స్వామీ! తమరెరుగరు కానీ, ఆయుధాలు ధరించిన దేవేంద్రాదులకే దుఃఖం తప్పలేదు. ఇక కర్మ పరిత్యాగానికి సిసలైన అర్థం తెలియని మానవుల సంగతి ఏమని చెప్పేది?’’ ‘‘సరే... దేవతలకే దుఃఖం ఉంటే మీరంతా వారిని కొలవడం ఎందుకు? దండగ కదా!’’ ‘‘మా లోకంలో రాజులకు, వివేకులకు కూడా దుఃఖమున్నది. అంతమాత్రం చేత మిగిలిన వారంతా వారిని ఆశ్రయించడం మానేస్తున్నారా? దేవతలు కూడా అంతే. దుఃఖనివృత్తికి వారిని ఆశ్రయించ వలసిందే. నామస్మరణలతో, రూపధ్యానాలతో, మూర్తిపూజలతో ఏదో ఒక తోవన తాను తరించే మార్గాన్ని జీవుడు తనంతతాను అన్వేషించి తెలుసుకోవలసిందే.’’ ‘‘అయితే దుఃఖం జీవునికి స్వాభావికంగా వచ్చిందేమో!’’ ‘‘కాదు. దుఃఖం స్వాభావికం అని చెబితే ఎన్నటికీ తీరనే తీరదని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు దుఃఖనివృత్తి కోసం, సుఖప్రాప్తి కోసం కర్మ చేయాల్సిన అవసరం జీవునికి తప్పిపోతుంది. చివరకు సత్కర్మలు చేయడానికి, ఉపాసనలు చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నమూ చేయరు. వేదం శాస్త్రం పురాణం వీటి ప్రామాణ్యాన్ని నిరసించేవారి సంఖ్య పెరిగిపోతుంది. జీవునికి స్వాభావికంగానే దుఃఖం వచ్చిందని చెబితే దుఃఖమే జీవస్వరూపం అయి కూచుంటుంది? స్వరూపాన్ని చెడగొట్టుకోవాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు? ఆత్మ స్వరూపం ఆనందమే కానీ, దుఃఖం ఎన్నటికీ కాదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనికదా ఉపనిషత్తు... ఆనందాన్ని నీ స్వరూపంగా దర్శించడం చేతకాని మానవులే దుఃఖభాజనులు అవుతున్నారని చెప్పవలసి వస్తోంది.’’ ‘‘అయితే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికే నన్ను తెలుసుకోవాలంటావు. అదిసరే కానీ మట్టిబొమ్మల్లోనూ, కొయ్యశిల్పాలలోనూ, రాతి విగ్రహాలలోనూ నేనున్నానంటావా?’’ ‘‘అసలు నువ్వు ఎక్కడైనా ఉన్నావు కదా స్వామీ! అందులో సందేహమేమీ లేదు. మూర్తిమత్వం పొంది చర్మచక్షువులకు కనిపిస్తున్న అన్నింటిలోనూ పంచభూతాలతో కూడి నువ్వున్నావు. కానీ మలమూత్రాలతో కలుషితమైన దేహాల్లోనూ, మరికొన్ని నీచ వస్తువులలోనూ నిన్ను దర్శించడానికి కష్టపడేకంటే పవిత్ర వస్తువులలో నిన్ను ఆరోపిస్తే దర్శించడం సులభమవుతుంది. ఎవరో చెప్పారని గుడ్డిగా అనుసరించడం కాకుండా అపరోక్షానుభూతిని పొందాలంటే సాధన అవసరం.’’ ‘‘ఎలా చేయాలి సాధన?’’ ‘‘ముక్తికోరే మానవుని సాధన నాలుగు మార్గాల్లో ముందుకు కొనసాగాలి. ఈ నాలుగింటినీ ఏమరుపాటుకు రాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి. మొదటిది నిత్యానిత్య వస్తువివేకం. శ్రుతుల వల్ల, స్మృతుల వల్ల, పురాణాదుల వల్ల శ్రవణ, మనన, నిదిధ్యాస పూర్వకంగా నిరంతరం ఒక్కటే స్మరించాలి. ‘బ్రహ్మ నిత్యం, ప్రపంచం అనిత్యం’ అని. ఇలా స్వీయజ్ఞానంతో ఆత్మనాత్మ వివేకం పెంపొందనంత వరకు కోటిజన్మలెత్తినా మానవునికి బంధచ్ఛేదనమనేది జరగదు కనుక, సాధనలో వివేకోదయమే మొదటి మెట్టు.’’ ‘‘మరి రెండవది...’’ ‘‘ఫలితం ఆశించి కర్మలను చేయడాన్ని విరమించుకోవాలి. ఎంతవరకూ అంటే, ఇహాముత్ర ఫలభోగ విరాగం ఉదయించే వరకూ. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా జీవుడు తాను చేసిన కర్మల తాలూకు ఫలాన్ని తానే అనుభవించాలనే ఉబలాటాన్ని కట్టిపెట్టుకోవాలి. ఒకడు ఒక మహాభోగాన్ని అనుభవిస్తున్నాడంటే అది సృష్టిలో అంతకుముందు ఎవ్వడూ అనుభవించనిది కాదు అని గుర్తుచేసుకోవాలి. చేసిన పనికి ఫలితాన్ని కూడా అనుభవించాలని కోరుకోవడమంటే కక్కిన కూటికి ఆశపడడమే అని తెలుసుకోవాలి. పరబ్రహ్మ సాయుజ్యమందే మనసు నిలుపుకోవాలి.’’ ‘‘సరేలే... లోకంలో అందరూ వ్రతం చెడ్డా ఫలం దక్కాలనుకుంటారు. నువ్వేమో గొప్ప వ్రతం చేసి ఫలాన్ని వదిలేయమంటున్నావు. ఇది సరైన పనేనంటావా?’’ ‘‘వైరాగ్యవంతుని కంటే గొప్ప సంపన్నుడు లేడు కదా స్వామీ! ఆరు సుగుణాలుంటే భగవంతుడైనట్లు... ఆరు సంపదలున్నవాడే అన్నీ వదిలేసుకున్న వైరాగ్య సంపన్నుడు అవుతాడు. మొదటి సంపద పేరు శమం... అంటే విషయసుఖాల పట్ల నిర్లిప్తత కలిగి ఉండడం. దీనికోసం అంతరింద్రియాలైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలను నిగ్రహించడం నేర్చుకోవాలి. రెండోసంపద దమం.... అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మూడో సంపద ఉపరతి లేదా నిష్కామకర్మ. నాలుగోది తితిక్ష... అంటే ప్రారబ్ధ, ఆగతాలన్నింటినీ శీతోష్ణాలవలె ఓర్చుకోవడం. అయిదోది గురువుపైన, వేదంపైన శ్రద్ధ. ఆరోది సమాధానం. శ్రవణాదుల ద్వారా సాధనకు అనుకూలమైన విషయాలపైనే మనసు ఉంచడం.’’ ‘‘ఈ ఆరు సంపదలనూ పొందడం సాధనలో మూడోమెట్టు. మరి ఆఖరుది?’’ ‘‘ముముక్షుత్వం అంటే సంసార తాపత్రయాలను పోగొట్టుకుని, బ్రహ్మతాదాత్మ్యాన్ని పొందాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగివుండడం. ఈ సాధన చతుష్టయాన్ని పొందినవాడే ముక్తికి అర్హుడవుతాడు. అద్వైత సిద్ధిని పొందడానికి అనుకూలుడై ఉంటాడు. ఇవి లోపించిన వారికి, అవైదికమైన ఇతరమార్గాల్లో ఆత్మసాక్షాత్కారం పొందాలని ప్రయత్నించిన వాడికి వట్టి ఆరాటమే మిగులుతుంది.’’ ‘‘నిజమేననుకో. ఇదంతా చేయలేని సామాన్యుల సంగతేమిటి? నాముందు కొందరు గుంజీళ్లు తీసి పాపాలు పోగొట్టమంటారు. నేనేం చేస్తాననుకుంటున్నావు?’’ ‘‘అసలు నువ్వు ఎవరిని మాత్రం కాదంటావు... వెంటనే పోగొట్టేస్తావు. కానీ పాపమని తాననుకుంటున్నది మళ్లీ చేయక తప్పని మానవుడు తత్ఫలంగా దుఃఖం కలగగానే నువ్వు తన మొర వినలేదనుకుంటాడు. వేరొక దైవాన్ని ఆశ్రయిస్తాడు.’’ ‘‘అలా చేయడం తప్పంటావా?’’ ‘‘ఏమీ కాదు. గోదానం కావాలంటే మహారాజును ఆశ్రయించాలి కానీ, బేడ అప్పుకోసం ఎరిగున్నవాడు ఎవడైనా చాలు కదా! ఎంతమంది దేవతలనైనా ఆశ్రయించవచ్చు’’ ‘‘ఓహో! అలాగైతే నాలాంటి దేవతలు చాలామంది ఉన్నారంటావు?’’ ‘‘చాలమంది దేవతలున్నారు. కానీ నీలాంటి దైవాలు మీరు మొత్తం కలిపి ఆరుగురే కదా స్వామీ!... గణేశం దినేశంచ వహ్నిం విష్ణుం శివం శివాం సమభ్యర్చ దేవషట్కం ఇష్టదైవంచ పూజయేత్... అని బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. గణేశునివైన నీవు, దినేశుడైన సూర్యుడు, అగ్నిరూపుడైన కార్తికేయుడు, విష్ణువు, శివుడు, శివాని ఈ ఆరే పరబ్రహ్మ స్వరూపాలు. పగటివేళ సూర్యునివై, రాత్రివేళ మిగతా నీవే నక్షత్రరూపునివై అయిదు జ్యోతిర్మండలాల్లో కన్నులముందు ప్రకాశిస్తుంటావు. నీ అనుగ్రహం నేలకు పరిపూర్ణంగా వర్షించే శుభవేళలు పరిగణించిన మా పౌరాణికులు వివిధ సందర్భాలలో నీపేర వివిధ పర్వాలను, వ్రతవిధానాలను ఏర్పరిచారు. కన్నుల ఎదుటే నీవు ప్రత్యక్షమై కనిపిస్తుంటే దేవుణ్ణి చూడలేమని, కనిపెట్టలేమని అనుకోవడం మానవుడి వెర్రితనం కాక మరేమిటి? తల పైకెత్తి ఆకాశంలో చూస్తే నీవే. నేలపై చూస్తున్న జీవులన్నీ నీకు అభేద రూపాలే. కన్నులు మూసుకుని ధ్యానించినా మనిషిని పలకరించేది నీ తేజమే. యోగమార్గాన్ని అవలంబించి మనిషి తనలోకి తాను చూసుకుంటే, మూలాధారం మొదలు ఆజ్ఞవరకూ వరుసగా ఉన్నవన్నీ ఆరుచక్రాలూ నీ ఆరు రూపాలే. ఆజ్ఞనుంచి పైకి ఎగబ్రాకిన యోగి సహస్రారంలో ఆరు తేజస్సులూ కలిసి ఒకే పరబ్రహ్మ స్వరూపంగా ఆవిష్కరించుకున్నట్లు మీ ఆరుగురూ కలిసి ఒక్కటే. మీ ఆరు రూపాలే సనాతనం. నిత్యం. మిమ్మల్ని కాకుండా ఇతర దైవాలను కొలిచే మానవుడు మీ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దశలో ఉన్నవాడు.’’ ‘‘బాగున్నది. నీలోని ఎరుక సకల మానవులకూ కలగాలి. అందుకే జగద్గురునివై సాక్షాత్ శంభుమూర్తివైన నీవు నేలకు దిగివచ్చావు. నీవంటివాడు వచ్చినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతిసన్నివేశం దేవతామయమే కావాలి కదా! అందుకే బ్రహ్మాదులు మండన మిశ్ర తదితర శిష్యగణమై నిన్ను అనుసరించి వచ్చారు. వారందరి తోడ్పాటుతో నీ అద్వైత సిద్ధాంతం సామాన్యుల మధ్యకు వెళ్లాలి. అవివేకం అజ్ఞానం వల్ల ఎవరికివారు తమదైవమే గొప్పదనే భ్రమలో ఉన్నారు. పరమతాల పట్ల పరమ అసహనంతో రగిలిపోతున్నారు. వాదులాటలతో, కొట్లాటలతోనూ కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఒకరినొకరు చంపుకోవడానికి, ఇతరులను ప్రలోభ పెట్టడానికి కూడా వెనుదీయడం లేదు. అటువంటి వారందరికీ కనువిప్పు కలిగేలా నీ జ్ఞానాన్ని వారికి పంచు. మతాలమధ్య సమన్వయాన్ని సాధించు. సనాతన ధర్మమనే స్రోతస్వినిలో మానవులందరూ కలగలిసిపోయేలా చూడు. మూర్ఖత్వమనే రాక్షసశక్తితో పోరాటం చేయడం వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రునికైనా, జ్ఞానదండాన్ని ధరించిన నీకైనా తేలికైన విషయమేమీ కాదు. కానీ జగదుద్ధారణ తంత్రంలో కరుణాబిందువైన నీవు యుగాంతాల వరకూ మానవులందరూ తరించేందుకు వలసిన పాఠాలు కొన్ని నేర్పు. సెలవా మరి...’’ అన్నాడు వినాయకుడు తిరుగు ప్రయాణమవుతూ. వినాయకునితో పాటుగా శాపవిమోచనం పొందిన ఉభయ భారతి తానూ బ్రహ్మలోకానికి ప్రయాణమైంది. చూస్తుండగానే సర్వజ్ఞపీఠపు ఊర్ధ్వద్వారం నుంచి ఒక కాంతివలయం పైకి ఎగిసింది. ఉభయభారతి ఖాళీ చేసిన ప్రదేశంలో ఒక కొయ్యబొమ్మ వెలిసింది. శంకరుడు గబగబా పీఠం నుంచి దిగివచ్చి ఆ బొమ్మను రెండుచేతులా పట్టుకుని కళ్లకద్దుకున్నాడు. సాక్షాత్ బ్రహ్మ అయిన మండన మిశ్రుడు మానవలోకంలో మిగిలి ఉండగానే తన ప్రతీకను నేలపై వదిలి బ్రాహ్మీశక్తి స్వస్థానానికి మరలిపోయింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
‘‘పాపం ఆ దూర్వాస మహర్షి ఎప్పుడనగా తిన్నాడో ఏమో... కాస్త ఆ సంగతి చూడరాదూ’’ అన్నాడు వశిష్ఠుడు. సరేనంటూ బయలుదేరింది అరుంధతి. దూర్వాసుడు తపస్సు చేస్తున్న చోటికి, వశిష్ఠాశ్రమానికి మధ్యగా ఒక వాగు ప్రవహిస్తోంది. అరుంధతి వెళ్లే సమయానికి అది కాస్తా పొంగింది. దాటివెళ్లడానికి భయమేసి బేలగా వెనక్కు తిరిగి వచ్చిందామె. ‘‘సదా బ్రహ్మచారి దారివ్వమన్నాడని చెప్పు’’ అన్నాడు వశిష్ఠుడు. అరుంధతి వందమంది కొడుకుల్ని కన్నతల్లి. అక్షరాలా భర్త చెప్పినట్లే చేసింది. వాగు దారిచ్చింది. దూర్వాసునికి భక్తిప్రపత్తులతో భోజనం వడ్డించింది. తినేదాకా వేచివుంది. తిరిగి వెళదామని చూస్తే మళ్లీ అదే సమస్య. వాగు ఇందాకటి కంటే ఎక్కువ పరవళ్లు తొక్కుతోంది. ‘‘నిత్యోపవాసి దూర్వాసుడు దారివ్వమన్నాడని చెప్పు’’ అన్నాడు బ్రేవున త్రేనుస్తూ ఈసారి ఈ మహర్షి. ఇద్దరి పుణ్యమా అంటూ ఏ అడ్డంకీ లేకుండా అరుంధతి ఇల్లు చేరగలిగింది. అంతలేసి మహర్షులు అబద్ధాలాడారని చెప్పగలమా? వారు నిజమే చెప్పి ఉంటే ఎలా సాధ్యం?!.... ఇంతవరకూ కథ చెప్పి ప్రశ్న అడిగాడు ఆనందగిరి. శంకరుడు కన్నులు విప్పి చూశాడు. అప్పుడు వారు విద్యామంటపంలో ఉన్నారు. ఎదురుగా శిష్యులతో పాటు కాశీపుర ప్రజలు కూడా అనేకమంది వచ్చారు. శంకరునితో వాదానికి సిద్ధమై వచ్చినవారు అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఆనందగిరి అడిగిన ప్రశ్నకు మందస్మితుడై సమాధానం చెప్పబోయాడు శంకరుడు. అంతలో సభలోని చివరి పంక్తి నుంచి ఇలా వినిపించింది.... యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ యోగరతుడే కానివ్వు... భోగాలన్నీ అనుభవిస్తూ ఉండనివ్వు. జనారణ్యంలో సంచరిస్తూ ఉండేవాడే కానివ్వు... కారడవులలో తపస్సు చేస్తుండనివ్వు. ఎవడి చిత్తం బ్రహ్మమునందు మాత్రమే క్రీడిస్తూ ఉంటుందో వాడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సభ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. ‘‘ఎలాగండీ అది సాధ్యమా?’’ మళ్లీ శంకరుణ్ణే అడిగాడు ఆనందగిరి. ‘‘సాధ్యమేనని మహర్షులు నిరూపించారు కదా! ప్రయోగించే శబ్దానికి పటుత్వం ఉండాలి’’ అన్నాడు శంకరుడు. ‘‘అయితే అది కేవలం శబ్ద ప్రభావమేనా?’’ ఇందాక శ్లోకం చెప్పిన వ్యక్తి నుంచి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా శంకరుడు శ్లోకరూపంగానే సంభాషించాడు. ‘‘కాదు... అది యోగదృష్టి. యోగులైన వారు పుణ్యపాపాలకు అతీతంగా సంచరిస్తారు. దారిలో కనిపించిన చిరుగు పేలికలు బొంతల్లా కప్పుకుంటారు. పసిపిల్లల్లా, ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తారు’’ అన్నాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి భోరుమని విలపించాడు. లేచి నిలబడ్డాడు. అతడు బవిరి గడ్డం, చింపిరి జుట్టుతో ఉన్నాడు. ఒంటిమీద వస్త్రాలు చిరుగులు పట్టాయి. పరుగు పరుగున వచ్చి శంకరుని పాదాలపై పడ్డాడు. శంకరుడు తాను అప్పుడే చెప్పిన శ్లోకంలో మొదటి రెండు పాదాల్నీ పునరావృత్తి చేశాడు. చివరి రెండు పాదాల్లోనూ, ‘‘నువ్వు లేవు. నేను లేను. ఈ భూలోకమే లేదు. నీదీ నాదీ ఇలాంటి స్థితి అయినప్పుడు శోకం ఎందుకు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నిజమే స్వామీ! ఇది కాదు ఇది కాదనుకుంటూ ఆత్మవిచారణ చేసి ఉంటే ఈ గతి పట్టి ఉండేవాడిని కాను. కొద్ది సాధనతో అబ్బిన సిద్ధులన్నీ గొప్పవనుకుంటూ భ్రమల్లో చిక్కుకున్నాను. యోగం చేస్తున్నాననుకుంటూ అపమార్గం పట్టాను. చూస్తూండగానే కల కరిగి పోయింది. ఇలా పిచ్చివాడిలా స్థిరపడ్డాను. మీ ఉపదేశం నా మోహాన్ని పటాపంచలు చేసింది. ఇకపై నన్ను మీరే నడిపించాలి’’ అన్నాడు అతడు. ‘‘అస్తు’’ అన్నాడు శంకరుడు. అతడే తరువాతి కాలంలో ప్రసిద్ధులైన శంకరుని పద్నాలుగు మంది శిష్యుల్లో నిత్యానందునిగా గుర్తించబడ్డాడు. సభలోనుంచి వేరొకవ్యక్తి లేచి నిలబడ్డాడు. ‘‘అయితే స్వామీ! ఏదీ కాదనుకోవాలి... లేదనుకోవాలంటారు. ఎదురుగుండా దేవుణ్ణి పెట్టుకుని... నువ్వు దేవుడివి కాదు. అయినా నువ్వు నా పూజలందుకో అనాలంటారా?’’ ప్రశ్నించాడు అతడు. శంకరుని ముఖంపై చిరునవ్వు చెరగలేదు. ‘‘నువ్వు పూజించే బొమ్మ కదలదు. అది చైతన్య విహీనమైనది. అయినా పూజ చేస్తున్నావు. అది విష్ణువు అనుకుని పూజించడం వల్ల... ఆ బొమ్మయే విష్ణువుగా నీ పూజలు స్వీకరిస్తోంది. నీకు ఇష్టఫలాలను ఇస్తోంది. ఇక్కడ దృష్టి ప్రధానం. ‘ఏతేనైవ ఆయతనేన ఏకతర మన్వేతి’ అని శ్రుతి చెప్పింది’’ అన్నాడు. ‘‘అయితే పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చుంటే చాలా? ఏమిటి వాటివల్ల ప్రయోజనం?’’ ‘‘తపసా కల్మషం హంతి విద్యయా అమృత మశ్నుతే.... అంటోంది స్మృతి. తపస్సు వల్ల కల్మషాలు నశిస్తాయి. విద్య అమృతత్వాన్నిస్తుంది. కర్మాచరణ చేసిన వాడు విశుద్ధ తత్త్వుడు అవుతాడు. అందువల్ల ఎవ్వరైనా బ్రహ్మజిజ్ఞాసతో కర్మలు ఆచరించవలసిందే.’’ శంకరుడు చెబుతున్న మాటతో సనందాచార్యుని ఘంటం ఆగింది. ‘‘జ్ఞాని అయినవాడు కూడా కర్మలు చేయాల్సిందేనా?’’ అని ప్రశ్నించాడు. ‘‘చేయాల్సిందే! కర్మలే విద్యాప్రాప్తికి హేతువులు. జ్ఞానోదయానంతరం కూడా కర్మలు చేసి తీరవలసిందే. కర్మాచరణ అవసరం లేని స్థితికి చేరుకోవాలి కానీ, అక్కర్లేదు అని చెప్పడానికి ఉపనిషత్ నియమాలు అంగీకరించడం లేదు’’ అన్నాడు శంకరుడు. ఆ ప్రస్తావనలన్నీ వ్రాయసకాడుగా ఉండి సనందుడు తైత్తిరీయంలోని శిక్షావల్లి 11వ అనువాకంలో నమోదు చేశాడు. ‘‘కర్మలు చేయడం ఎందుకు... మోక్షం కోసమే కదా?’’ అడిగాడు ఇందాకటి వ్యక్తి. ‘‘కాదు. పుణ్యకర్మల వల్ల స్వర్గాదులు మాత్రమే లభిస్తాయంటున్నాయి ఉపనిషత్తులు. మోక్షం కావాలంటే జ్ఞానమార్గమే శరణ్యం’’ అన్నాడు శంకరుడు. ‘‘కానీ జ్ఞానం అనంతం కదా... తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతూ... చివరకు అంతా తెలుసునన్న స్థితి ఎప్పటికి స్వామీ వచ్చేను?’’ ప్రశ్నించాడు ఇందాకటి వ్యక్తి. ‘‘నిజమే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు. ఇక్కడ జ్ఞానమనే పదానికి లౌకికమైన అర్థాన్ని చెప్పకూడదు. జ్ఞానాన్ని క్రియారూపంలో చూడకూడదు. అలా చూస్తే దానికి అనంతత్వం ఉండదు. బ్రహ్మ చైతన్యం అనంతమైనది. బ్రహ్మజ్ఞానమే ఉపాసన చేయవలసింది’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘క్రియారూపంగా లేనిదాన్ని నమ్మడమెలాగా? ఇది ఎలా ఉందంటే... ఒకడు బాగా పొద్దువాలాక నిద్దర లేచాట్ట. ఎండమావుల్లో కాసేపు స్నానం చేశాడు. ఒళ్లు శుభ్రంగా తుడుచుకుని ఆకాశ పుష్పాలతో చేసిన మాలను తలకు చుట్టుకున్నాట్ట. కుందేటి కొమ్మును ఊడబెరికి విల్లులా పట్టుకున్నాట్ట. ఇంక యుద్ధానికి బయల్దేరాడు. అదుగో వచ్చేస్తున్నాడు... వాడే గొడ్రాలి కొడుకు’’ అన్నాడు ప్రశ్న వేసిన వ్యక్తి. సభమొత్తం ఫక్కుమంది. ‘‘వేదం ఎప్పుడూ శూన్యార్థాన్ని కల్పించదు. అక్కడ సత్యం... అనంతం అని చెప్పింది బ్రహ్మతత్త్వాన్ని గురించి మాత్రమే. ఏది మూడు కాలాల్లోనూ ఎటువంటి వికారాలూ లేకుండా మార్పు చెందకుండా ఉంటుందో అది మాత్రమే సత్యం. బ్రహ్మ అటువంటి వాడు. అతడు కూడా సృష్టి చేయాలి అనుకున్నప్పుడు తనయందు జ్ఞాన కర్తృత్వం ఆపాదించుకుంటాడు.... జ్ఞానం కోసం అన్వేషిస్తాడు అంటారు కొందరు. కానీ అవన్నీ సమర్థనీయాలు కాదు. పరబ్రహ్మ సాక్షి మాత్రమే. జీవుడే తొమ్మిది రంధ్రాలు కలిగిన దేహాలను మార్చుకుంటూ తన కర్మలకు కొనసాగింపును, నశింపును తెచ్చుకుంటున్నాడు’’ శంకరుడు నిష్పక్షపాతంగా చెప్పాడు. ‘‘మొత్తంమీద జ్ఞానాన్ని ఉపాసించాలా? కర్మలు చేయాలా?’’ అమీతుమీ తేల్చుకుంటున్నట్లుగా అడిగాడు అతగాడు. ‘‘జ్ఞానమే బ్రహ్మ. అదొక్కటే సత్యం. అవశ్యం ఉపాసించాల్సింది దానినే. కర్మలు దానికి ఉపాయాలు అవుతాయంతే. యజ్ఞ యాగాదులకు దూరమై కర్మపరిత్యాగులైన మావంటి పరివ్రాజకులు కూడా నిత్యం జ్ఞానాగ్నిని అనుష్ఠిస్తూనే ఉంటారు. రాత్రింబవళ్లనే ఇటుకలుగా మార్చి, పక్ష మాస అయన సంవత్సరాలను సమిధలుగా చేసి, వాయు సంచారమే ఆజ్యం కాగా వారి జ్ఞానయజ్ఞం పూర్ణాహుతి రహితమై కొనసాగుతుంది. అలా లౌకికమైన ఉపకరణాలను మనసా కల్పించుకున్న వాడు నిజమైన కర్మాచరణ శీలి అవుతున్నాడు’’ అన్నాడు శంకరుడు. ప్రశ్నించిన వ్యక్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి సంశయం తీరిన ఆనందం శ్లోకరూపంలో వెలువడింది. త్వయిమయిచాన్యత్ర ఏకోవిష్ణుః వ్యర్థం కుప్యసిమయ్యసహిష్ణుః సర్వస్మిన్నపి పశ్యత్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానం – సర్వమూ విష్ణుమయం. నీలో, నాలో ఇతర వస్తువులన్నింటిలోనూ ఉన్నది విష్ణువే. అతి ముఖ్యమైన ఆ విషయాన్ని గ్రహించకుండా అనవసరంగా కలవరం దేనికి? అంతటా ఆత్మనే చూడు. ఎల్లవేళలా భేదభావాలను విడిచిపెట్టు... అన్నాడు. అతడే తరువాతికాలంలో శంకరశిష్యులలో ప్రసిద్ధుడైన సురేంద్రాచార్యుడు. ఇప్పుడు నావంతు అన్నట్లు సభలో నుంచి ఓ పాశుపత శైవుడు లేచి నిలబడ్డాడు. అతడు శరీరంమీద అయిదు స్థానాల్లో శివలింగాలను ధరించి ఉన్నాడు. ‘‘పశుపతి చేతిలోని పాశమే అవిద్యను ధ్వంసం చేస్తుంది. జీవుణ్ణి అతడితో సమానుణ్ణి చేస్తుంది. అప్పుడు మోక్షం కరతలామలకం అవుతుంది’’ అన్నాడు అతడు. ‘‘ఎలా కుదురుతుంది?’’ ‘‘పువ్వులోని పరిమళం అంటించుకుంటే గాలి సుగంధంగా మారిపోయినట్లే! జీవుడు కూడా శివభక్తిని పెంపొందించుకుంటే ఈశునిగా మారిపోతాడు. అప్పుడు దుఃఖం తీరి ముక్తి లభిస్తుంది.’’ ‘‘పరిమళం గాలికి సహజ లక్షణం కాదు. ఏ గంధాన్ని అంటించుకుంటే అదే వాసన వస్తుందంతే. ఆత్మ అటువంటిది కాదు. దానికి ముక్తి నిత్యమై ఉంటుంది. అది భావనామాత్రం కాదు.’’ ‘‘అలా ఎలా కుదురుతుంది? అవిద్యలోనే కొట్టుకుపోయే మానవుడు నిత్యముక్తుడు ఎలా అవుతాడు?’’ అని ప్రశ్నించాడు పాశుపతుడు. ‘‘ఒక విషయం తెలుసుకోగానే... అదే విషయానికి సంబంధించి నీకున్న పూర్వపు అభిప్రాయం ధ్వంసమైపోతుంది. కొత్త అభిప్రాయం ఏర్పడుతుంది. స్పష్టత పెరిగే కొద్దీ జ్ఞానం నుంచి జ్ఞానం నుంచి మళ్లీ జ్ఞానం వైపుకే మనిషి ప్రయాణిస్తాడు. పూర్వపూర్వ జ్ఞానాలు ధ్వంసమై పోతుండగా ఉత్తరోత్తర జ్ఞానియై మానవుడు వికాసం పొందుతాడు. ఒకసారి జ్ఞాని అయినవాడు తిరిగి అవిద్యావంతునిగా వెనక్కు పోడు కదా! ఇక్కడ అవిద్యా ధ్వంసమనే క్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది ఎలాంటిదంటే చీకట్లను ధ్వంసం చేస్తూ వెలుగు వస్తుంది. చీకటి అనేదానికి ప్రత్యేకమైన అస్తిత్వం అంటూ ఉందా? వెలుగు లేకపోవడమే చీకటి అని మనం చెప్పుకుంటాం అంతే. కాబట్టి సృష్టిలో ధ్వంసరచన మాత్రమే నిత్యమైనది’’ అన్నాడు శంకరుడు. ‘‘ఎవరైనా అయిదు నియమాలు పాటిస్తే చాలు... ముక్తి పొందగలరని మా మతం చెబుతోంది’’ అన్నాడు పాశుపతుడు. ‘‘కాదు.... ఉపాసన పంచముఖాలుగా కొనసాగాలని తైత్తిరీయం చెప్పిన విషయాన్ని వివరిస్తాను. విను.. 1. అధిలోకము: భూలోకానికి ఉత్తరరూపమే ద్యులోకం. ఒకప్పుడు రెండూ కలిసే ఉండేవని చెబుతారు. వాయువు సంధానకర్తగా ఉండి, ఆ రెంటినీ వేరుపరిచాడు. 2. అధి జ్యోతిషం: అగ్ని పూర్వరూపం. ఆదిత్యుడు ఉత్తరరూపం. దీనికి జలమే సంధి అంటే మధ్యభాగం. విద్యుత్తు సంధానకర్త. 3. అధి విద్య: ఆచార్యుడు పూర్వరూపం. శిష్యుడు ఉత్తరరూపం. విద్య సంధి. ప్రవచన పాఠమే సంధానం. 4. అధి ప్రజ: తల్లి పూర్వరూపం. తండ్రి ఉత్తరరూపం. ప్రజ సంధి. ప్రజననం అంటే సంతానాన్ని కనడమే సంధానం. 5. అధ్యాత్మ: క్రింది దవడ పూర్వరూపం. పై దవడ ఉత్తరరూపం. ఆ రెండు హనువుల సాయంతో కదలాడే వాక్కు సంధి. జిహ్వ దానిని సంధానిస్తుంది. అధ్యాత్మ అన్నప్పుడు ఆత్మ అంటే దేహమే. దేహ అవయవ విషయమైన ఉపాసనే అధ్యాత్మ. – ఈ అయిదు మహాసంహితలనూ ధ్యేయ దేవత ఆకారాన్ని చిత్తమందు నిలుపుకుని అహం స్ఫురణతో ఉపాసించాలి. ఈ రకమైన చిత్తవృత్తి తైలధారలా అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ చింతన చేసినవాడు గురువునే తదేక ధ్యానంతో ఉపాసించే శిష్యునిలా, రాజుని శ్రద్ధగా కనిపెట్టుకుని ఉండే భృత్యునిలా సిద్ధిపొందుతాడు’’ ముగించాడు శంకరుడు. తన్మయుడై అప్పటివరకూ విన్న పాశుపతుడు.... కురుతే గంగాసాగర గమనం వ్రతపాలన మథవా దానం జ్ఞానవిహీనే సర్వమనేన ముక్తిర్న భవతి జన్మశతేన .... గంగాసాగర సంగమ తీర్థాన్ని సేవించినా, ఎన్నెన్ని వ్రతాలు ఆచరించినా, దానాలు ఎన్ని చేసినా, తత్త్వజ్ఞానం పొందనివాడికి నూరు జన్మలకైనా ముక్తి లభించదు – అని ఆలపించాడు. అతడే తరువాతికాలంలో సుబోధాచార్యుడై శంకరశిష్యునిగా ప్రసిద్ధికెక్కాడు. ఆనాటి సభ ముగిసింది. ఆ మరునాడే నిత్యానందుడు, సురేంద్రుడు, సుబోధాచార్యుడు సంన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కొంతకాలం గడిచింది. కాశీపండితులతో నిరంతరం కొనసాగుతున్న వాద ప్రతివాదనలు శంకరుని భాష్యరచనకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల కాశీని విడిచి బదరికాశ్రమానికి తరలిపోవాలని శంకరుడు నిర్ణయించుకున్నాడు. ఒకనాటి ఉదయాన్నే ప్రారంభమైన శంకరయతి ప్రయాణం పాణిని మహర్షి ఆలయం ముందు కొద్దిసేపు ఆగింది. లోపల నుంచి ధాతుపాఠం వినిపిస్తోంది. ‘ఊ.. సరిగ్గా చెప్పు. తను విస్తారే... షణు దానే’ ‘కొట్టకండి గురువుగారూ! తను విస్తారే... షణు దానే... క్షణు హింసాయాం’ అంటున్నాడు శిష్యుడు. - నేతి సూర్యనారాయణ శర్మ -
శంకరా... ఆది శంకరా! జగద్గురు!!
సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో కాలటి క్షేత్రాన ఆర్యాంబ, శివగురువు అనే పుణ్యదంపతులకు ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకరాచార్యుల వారి రూపంలో వైశాఖ శుక్ల పంచమి రోజున అవతరించారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం క్షీణిస్తున్నప్పుడు అంటే జనులందరూ స్వధర్మాచరణను కొంచెం కూడా పాటించకుండా ఉన్నప్పుడు జనులందరి శ్రేయస్సుకై పునః ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు తానే అవతరిస్తానని చెప్పినట్లుగా సాక్షాత్ పరమేశ్వరుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారు. ఆ సమయంలో బౌద్ధాది మతాల ప్రభావంతో వేదం, శాస్త్రం, ధర్మం, యాగం అనే శబ్దాలు కూడా వినబడని పరిస్థితి. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని స్వధర్మాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ ధర్మ సంస్థాపన చేశారు. శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. ముప్ఫై రెండు సంవత్సరాల వయసులో కైవల్యాన్ని పొందారు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని. అందుకే అంటారు ‘శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా’ ఈ జగత్తులో పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో సంచరించారు అని. శంకరాచార్యుల వారికి మాత్రమే జగద్గురువు అనే శబ్దం సార్థకం అవుతుంది. ప్రతి మనిషికీ ధర్మాన్ని ఆచరించడం, అర్థం అంటే సంపాదనం, కోరికలు తీర్చుకోవడం చివరికి ముక్తిని పొందడం. ధర్మ, అర్థ, కామ మోక్షాలు పురుషార్థాలు. ఇవి ప్రతి ఒక్కరికీ జీవిత లక్ష్యాలు. అయితే వీటిలో మోక్షం చాలా ప్రధానమైనది. అది ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆత్మజ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉండాలి? అని. దానికి చెప్తారు. ‘‘కో గురుః’ అంటే గురువు ఎవరు? దానికి సమాధానం... తత్త్వాన్ని అర్థం చేసుకొని శిష్యుడి హితం ఎల్లప్పుడూ కోరేవాడే గురువు. శ్రీ శంకరాచార్యులవారి దగ్గర ఈ లక్షణం సంపూర్ణంగా కనపడుతోంది. ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేనేగాని అర్థం కాని ప్రౌఢ భాషలోనూ; ఎలాంటి శబ్ద జ్ఞానం కూడా లేని సామాన్యుడికి అర్థం అయ్యేట్టుగా సులభ శైలిలో ఉండే భజగోవిందాది స్తోత్రాలతోనూ ప్రబోధించారు. ఆయన సర్వ శాస్త్రాలు తెలిసిన వారు. మానవులందరికి శ్రేయస్సుకోసం అపారమైన కృషి చేసిన వారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన ఉపదేశాలు మానవాళికి మార్గదర్శనం అవుతున్నాయి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్నే శంకరులు చెప్పారే కాని ఏ కొత్త సిద్ధాంతాన్నీ చెప్పలేదు. ఎందుకంటే మనకు వేదం ప్రామాణికం. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికీ ధర్మబద్ధమైన జీవనం గడపడం ఎలాగో సూచించగల మహానుభావుడే జగద్గురువు. ఆదిశంకరులను జగద్గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము ప్రబోధించినటువంటి సనాతన ధర్మం ఇప్పుడు పిలవబడే హిందూధర్మం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మానవాళికి అంది, వారు శ్రేయస్సును పొందాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు. దాంట్లో... 1. తూర్పున పూరీలో గోవర్థన పీఠాన్ని, 2. దక్షిణాన శృంగేరీలో శారదాపీఠాన్ని, 3. పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠాన్ని, 3. ఉత్తరాన బదరీలో జ్యోతిర్మఠ పీఠాన్ని నాలుగు దిక్కులలో నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను స్థాపించారు. మనకు దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో శృంగేరీ శారదాపీఠం ధర్మాన్ని ప్రబోధిస్తుంది. ఈ పీఠంలో శంకరాచార్యులు మొదలుకొని ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వరకు అవిచ్ఛిన్న గురు పరంపరలో ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యులే. ఈ మాట శంకరులు స్వయంగా చెప్పినారు. వీరు నడిచే అమ్మవారి లాగా అమ్మవారే స్వయంగా పురుషాకారం తీసుకుని ఈ భూమియందు మానవాళిని ఉద్ధరించడానికే నడుస్తున్నది అని. ఒక మహాకవి ఇదే చెప్తారు ‘పుంభావం సము పేయుషీ భగవతి’ ఆది శంకరాచార్యులవారి జయంతి సందర్భాన వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రేరణ, సన్మార్గం కలగాలని శంకరాచార్యుల స్వరూపులైన శ్రీ మద్ భారతీ తీర్థ మహాస్వామి వారికీ, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికీ సవినయ సాష్టాంగ నమస్సులతో.... – వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ శృంగేరీ పండితులు -
సంకల్ప బలం
సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాటా వినలేదు. ఉత్సాహం! దృఢత్వం! పౌరుషం! ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలుపెట్టాయి.ఈ సమాచారం పక్షులకు రాజయిన గరుత్మంతుడికి తెలిసింది. ‘పద నేను చూస్తాను‘ అని గరుడుడు కూడా వచ్చాడు. ‘‘ఓ సముద్రమా! మా వారంతా ఒకటై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ‘ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు’ అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాఖా!’’ అని గరుడుడు సముద్రంపైన తన రెక్కలతో రెండు మూడుసార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. పక్షి గుడ్లను తెచ్చి ఇచ్చాడు. ‘అంటే ఎంత పెద్ద పనైనా సరే సంకల్పించి, శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆ పని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురువు గౌడపాదాచార్యులవారు శిష్యులకు బోధించేవారు.