శంకరా... ఆది శంకరా! జగద్గురు!! | There Are all Sorts of People in the World | Sakshi
Sakshi News home page

శంకరా... ఆది శంకరా! జగద్గురు!!

Published Thu, May 9 2019 3:27 AM | Last Updated on Thu, May 9 2019 3:27 AM

There Are all Sorts of People in the World - Sakshi

సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో కాలటి క్షేత్రాన ఆర్యాంబ, శివగురువు అనే పుణ్యదంపతులకు ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకరాచార్యుల వారి రూపంలో వైశాఖ శుక్ల పంచమి రోజున అవతరించారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం క్షీణిస్తున్నప్పుడు అంటే జనులందరూ స్వధర్మాచరణను కొంచెం కూడా పాటించకుండా ఉన్నప్పుడు జనులందరి శ్రేయస్సుకై పునః ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు తానే అవతరిస్తానని చెప్పినట్లుగా సాక్షాత్‌ పరమేశ్వరుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారు. ఆ సమయంలో బౌద్ధాది మతాల ప్రభావంతో వేదం, శాస్త్రం, ధర్మం, యాగం అనే శబ్దాలు కూడా వినబడని పరిస్థితి. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని స్వధర్మాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ ధర్మ సంస్థాపన చేశారు. 

శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. ముప్ఫై రెండు సంవత్సరాల వయసులో కైవల్యాన్ని పొందారు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని. అందుకే అంటారు ‘శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా’ ఈ జగత్తులో పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో సంచరించారు అని. శంకరాచార్యుల వారికి మాత్రమే జగద్గురువు అనే శబ్దం సార్థకం అవుతుంది. ప్రతి మనిషికీ ధర్మాన్ని ఆచరించడం, అర్థం అంటే సంపాదనం, కోరికలు తీర్చుకోవడం చివరికి ముక్తిని పొందడం. ధర్మ, అర్థ, కామ మోక్షాలు పురుషార్థాలు. ఇవి ప్రతి ఒక్కరికీ జీవిత లక్ష్యాలు. అయితే వీటిలో మోక్షం చాలా ప్రధానమైనది. అది ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆత్మజ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉండాలి? అని. దానికి చెప్తారు.

‘‘కో గురుః’ అంటే గురువు ఎవరు? దానికి సమాధానం... తత్త్వాన్ని అర్థం చేసుకొని శిష్యుడి హితం ఎల్లప్పుడూ కోరేవాడే గురువు. శ్రీ శంకరాచార్యులవారి దగ్గర ఈ లక్షణం సంపూర్ణంగా కనపడుతోంది. ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేనేగాని అర్థం కాని ప్రౌఢ భాషలోనూ; ఎలాంటి శబ్ద జ్ఞానం కూడా లేని సామాన్యుడికి అర్థం అయ్యేట్టుగా సులభ శైలిలో ఉండే భజగోవిందాది స్తోత్రాలతోనూ ప్రబోధించారు. ఆయన సర్వ శాస్త్రాలు తెలిసిన వారు. మానవులందరికి శ్రేయస్సుకోసం అపారమైన కృషి చేసిన వారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన ఉపదేశాలు మానవాళికి మార్గదర్శనం అవుతున్నాయి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్నే శంకరులు చెప్పారే కాని ఏ కొత్త సిద్ధాంతాన్నీ చెప్పలేదు. ఎందుకంటే మనకు వేదం ప్రామాణికం.

 ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికీ ధర్మబద్ధమైన జీవనం గడపడం ఎలాగో సూచించగల మహానుభావుడే జగద్గురువు. ఆదిశంకరులను జగద్గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము ప్రబోధించినటువంటి సనాతన ధర్మం ఇప్పుడు పిలవబడే హిందూధర్మం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మానవాళికి అంది, వారు శ్రేయస్సును పొందాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు. దాంట్లో... 1. తూర్పున పూరీలో గోవర్థన పీఠాన్ని, 2. దక్షిణాన శృంగేరీలో శారదాపీఠాన్ని, 3. పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠాన్ని, 3. ఉత్తరాన బదరీలో జ్యోతిర్మఠ పీఠాన్ని నాలుగు దిక్కులలో నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను స్థాపించారు. మనకు దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో శృంగేరీ శారదాపీఠం ధర్మాన్ని ప్రబోధిస్తుంది.

ఈ పీఠంలో శంకరాచార్యులు మొదలుకొని ప్రస్తుత పీఠాధిపతులు  శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వరకు అవిచ్ఛిన్న గురు పరంపరలో ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యులే. ఈ మాట శంకరులు స్వయంగా చెప్పినారు. వీరు నడిచే అమ్మవారి లాగా అమ్మవారే స్వయంగా పురుషాకారం తీసుకుని ఈ భూమియందు మానవాళిని ఉద్ధరించడానికే నడుస్తున్నది అని. ఒక మహాకవి ఇదే చెప్తారు ‘పుంభావం సము పేయుషీ భగవతి’ ఆది శంకరాచార్యులవారి జయంతి సందర్భాన వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రేరణ, సన్మార్గం కలగాలని శంకరాచార్యుల స్వరూపులైన శ్రీ మద్‌ భారతీ తీర్థ మహాస్వామి వారికీ, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికీ సవినయ సాష్టాంగ నమస్సులతో....
– వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ
శృంగేరీ పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement