Mentors
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
స్టార్టప్‌లకు అంతర్జాతీయ నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: ఆర్థికమాంద్యం మొదలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వరకూ ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించేందుకు స్టార్టప్‌లు అవసరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయుష్ గోయెల్ అభిప్రడాయపడ్డారు. ఔత్సాహికులు, పెట్టుబడిదారులు, మెంటర్లతో కూడిన నెట్వర్క్ ద్వారా స్టార్టప్‌లకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. భారత్ అధ్యక్షతన ఈ ఏడాది జరగనున్న జీ–20 సదస్సు సన్నాహకాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో స్టార్టప్ –20 సమావేశాలు మొదలయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, జీ–20 షేర్పా(సన్నాహక దేశ ప్రతినిధి) అమితాబ్ కాంత్ పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టార్టప్‌లకు అనుకూల వాతా వరణం ఏర్పాటు, అందరికీ అవకాశాలు, మద్దతు లభించేలా చేయడం జీ–20 దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అంతర్జాతీయ నెట్వర్క్ స్ఫూర్తినిచ్చేదిగా ఉండటమే కాకుండా, ఆలోచనలు, మేలైన కార్యాచరణ పద్ధ తులను పంచుకునేలా ఉండాలని, అవసరమైన నిధులకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశాల్లో పరస్పర సహకారానికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ‘‘ఈ రోజుల్లో సృజనాత్మ కత అనేది ఆర్థిక లక్ష్యాల సాధనకు మాత్రమే ఉపయోగపడటంలేదు. సామాజిక, పర్యావరణ, సుస్థిరాభివృద్ధి సమస్యల పరిష్కారానికీ అవసర మవుతోంది’’అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2016లోనే స్టార్టప్ ఇండియా కార్యక్ర మాన్ని మొదలుపెట్టగా ఈ ఏడేళ్లలో కొత్త, వినూత్న ఆలోచనలతో వివిధ రంగాల్లో పలు కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, ఆరోగ్య రంగాల్లోని స్టార్టప్ కంపెనీల కారణంగానే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. ఆన్లైన్ విద్యా బోధన, వ్యవసాయ టెక్నాలజీల్లోనూ సవాళ్లను స్టార్టప్‌లతో ఎదుర్కోగలిగామని వివ రించారు. భారతదేశంలో ఆవిర్భవించిన కోవిన్, యూపీఐ వంటి టెక్నాలజీలు, ఈ–కామర్స్ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ)లు ప్రపంచంలోని అనేక దేశాల సమస్యలను పరిష్కరించగలవని, అందుకే జీ–20 సదస్సు ద్వారా ఈ ‘ఇండియా స్టాక్’ను ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గోయెల్ తెలిపారు. అనుకూల విధానాలతోనే వృద్ధి: కిషన్ రెడ్డి స్టార్టప్‌లకు అనుకూల విధానాలను రూపొందించి అమలు చేస్తున్న కారణంగానే భారత్ అతితక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఏడేళ్లలోనే భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 41 స్థానాలు పైకి ఎగబాకిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్టార్టప్–20 ఇండియా చైర్పర్సన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్‌బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్‌బెల్.. మొదట్లో ఫుట్‌బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్‌బెల్. ►మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
అర్ధమైంది గురువర్యా...
ఓ ధార్మిక గురువుకు ఇద్దరు శిష్యులు. ఒకసారి ఆ శిష్యులు నమాజుకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారు చూస్తుండగానే ఓ వ్యక్తికి ప్రమాదం జరిగింది. అక్కడ ఆగిపోతే నమాజు సమయం మించిపోతుంది. వదిలేసి వెళ్ళిపోతే అతని ప్రాణాలు పొయ్యే పరిస్థితి. ఇద్దరిలో ఒక యువకుడు దైవకార్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదని, తరువాత ఆలోచిద్దామన్నాడు. కాని రెండవ యువకుడు, నమాజును తరువాత చేసుకుందాం... ముందు ఇతడిని వైద్యుడి దగ్గరికి తీసుకు వెళదామన్నాడు. కాని అతను, ‘దైవప్రార్థన తరువాతనే ఏదైనా’ అంటూ స్నేహితుడి స్పందన కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. రెండో యువకుడు ఆ క్షతగాత్రుణ్ణి దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యుడు, సకాలంలో తీసుకొని రావడం వల్ల ఇతని ప్రాణాలు నిలిచాయని, ఆలస్యమైతే ఇతను ప్రాణాలతో మిగిలేవాడు కాదనీ అన్నాడు. తరువాత ఆ యువకుడు కూడా మసీదుకు చేరుకొని, దైవానికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ రెండు రకతులు నఫిల్ నమాజు, తరువాత ఫర్జ్ నమాజు ఆచరించాడు. కాసేపటికి విషయం గురువుకు తెలిసింది. అంతా సావధానంగా విన్న గురువు, మొదటి శిష్యుణ్ణి మందలించాడు. ధర్మాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావని రెండవ శిష్యుణ్ణి ప్రశంసించారు. దీంతో, ‘అదేమిటి గురువర్యా.. జమాత్‌తో నమాజ్ ఆచరిస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. జమాత్ వదలడం పాపం కదా’ అన్నాడు శిష్యుడు. ‘నువ్వన్నది నిజమే.. కాని, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతణ్ని గాలికి వదిలేసి ప్రార్థనలో లీనమైపోతే దేవుడు ఆ ప్రార్థనను స్వీకరిస్తాడా? ఈనాడు చాలామంది చేస్తున్న తప్పు ఇదే. సామాజిక విషయాలను పట్టించుకోకుండా ఆధ్యాత్మికతలో లీనమైపోతున్నారు. మరికొందరు ప్రాపంచిక విషయాల్లో పడి ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. తోటి మానవుల్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికతలో ఎంతగా మునిగి తేలినా దేవుడు హర్షించడు. తన ఆరాధనలను నెరవేర్చక పోయినా దైవం క్షమిస్తాడు కాని మానవ హక్కుల విషయంలో మాత్రం మన్నించడు. దైవ ప్రసన్నత ద్వారానే ఇహ పరలోకాల్లో సాఫల్యం’ అని చెప్పాడు గురువు. అర్ధమైందన్నట్లు తల పంకించాడు శిష్యుడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శంకరా... ఆది శంకరా! జగద్గురు!!
సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో కాలటి క్షేత్రాన ఆర్యాంబ, శివగురువు అనే పుణ్యదంపతులకు ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకరాచార్యుల వారి రూపంలో వైశాఖ శుక్ల పంచమి రోజున అవతరించారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం క్షీణిస్తున్నప్పుడు అంటే జనులందరూ స్వధర్మాచరణను కొంచెం కూడా పాటించకుండా ఉన్నప్పుడు జనులందరి శ్రేయస్సుకై పునః ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు తానే అవతరిస్తానని చెప్పినట్లుగా సాక్షాత్ పరమేశ్వరుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారు. ఆ సమయంలో బౌద్ధాది మతాల ప్రభావంతో వేదం, శాస్త్రం, ధర్మం, యాగం అనే శబ్దాలు కూడా వినబడని పరిస్థితి. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని స్వధర్మాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ ధర్మ సంస్థాపన చేశారు. శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. ముప్ఫై రెండు సంవత్సరాల వయసులో కైవల్యాన్ని పొందారు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని. అందుకే అంటారు ‘శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా’ ఈ జగత్తులో పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో సంచరించారు అని. శంకరాచార్యుల వారికి మాత్రమే జగద్గురువు అనే శబ్దం సార్థకం అవుతుంది. ప్రతి మనిషికీ ధర్మాన్ని ఆచరించడం, అర్థం అంటే సంపాదనం, కోరికలు తీర్చుకోవడం చివరికి ముక్తిని పొందడం. ధర్మ, అర్థ, కామ మోక్షాలు పురుషార్థాలు. ఇవి ప్రతి ఒక్కరికీ జీవిత లక్ష్యాలు. అయితే వీటిలో మోక్షం చాలా ప్రధానమైనది. అది ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆత్మజ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉండాలి? అని. దానికి చెప్తారు. ‘‘కో గురుః’ అంటే గురువు ఎవరు? దానికి సమాధానం... తత్త్వాన్ని అర్థం చేసుకొని శిష్యుడి హితం ఎల్లప్పుడూ కోరేవాడే గురువు. శ్రీ శంకరాచార్యులవారి దగ్గర ఈ లక్షణం సంపూర్ణంగా కనపడుతోంది. ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేనేగాని అర్థం కాని ప్రౌఢ భాషలోనూ; ఎలాంటి శబ్ద జ్ఞానం కూడా లేని సామాన్యుడికి అర్థం అయ్యేట్టుగా సులభ శైలిలో ఉండే భజగోవిందాది స్తోత్రాలతోనూ ప్రబోధించారు. ఆయన సర్వ శాస్త్రాలు తెలిసిన వారు. మానవులందరికి శ్రేయస్సుకోసం అపారమైన కృషి చేసిన వారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన ఉపదేశాలు మానవాళికి మార్గదర్శనం అవుతున్నాయి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్నే శంకరులు చెప్పారే కాని ఏ కొత్త సిద్ధాంతాన్నీ చెప్పలేదు. ఎందుకంటే మనకు వేదం ప్రామాణికం. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికీ ధర్మబద్ధమైన జీవనం గడపడం ఎలాగో సూచించగల మహానుభావుడే జగద్గురువు. ఆదిశంకరులను జగద్గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము ప్రబోధించినటువంటి సనాతన ధర్మం ఇప్పుడు పిలవబడే హిందూధర్మం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మానవాళికి అంది, వారు శ్రేయస్సును పొందాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు. దాంట్లో... 1. తూర్పున పూరీలో గోవర్థన పీఠాన్ని, 2. దక్షిణాన శృంగేరీలో శారదాపీఠాన్ని, 3. పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠాన్ని, 3. ఉత్తరాన బదరీలో జ్యోతిర్మఠ పీఠాన్ని నాలుగు దిక్కులలో నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను స్థాపించారు. మనకు దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో శృంగేరీ శారదాపీఠం ధర్మాన్ని ప్రబోధిస్తుంది. ఈ పీఠంలో శంకరాచార్యులు మొదలుకొని ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వరకు అవిచ్ఛిన్న గురు పరంపరలో ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యులే. ఈ మాట శంకరులు స్వయంగా చెప్పినారు. వీరు నడిచే అమ్మవారి లాగా అమ్మవారే స్వయంగా పురుషాకారం తీసుకుని ఈ భూమియందు మానవాళిని ఉద్ధరించడానికే నడుస్తున్నది అని. ఒక మహాకవి ఇదే చెప్తారు ‘పుంభావం సము పేయుషీ భగవతి’ ఆది శంకరాచార్యులవారి జయంతి సందర్భాన వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రేరణ, సన్మార్గం కలగాలని శంకరాచార్యుల స్వరూపులైన శ్రీ మద్ భారతీ తీర్థ మహాస్వామి వారికీ, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికీ సవినయ సాష్టాంగ నమస్సులతో.... – వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ శృంగేరీ పండితులు -
సెప్టెంబర్ 3న ఆగస్ట్ ఫెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలోని స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటార్స్‌ను ఒకే వేదికగా మీదికి తీసుకొచ్చే ఆగస్ట్ ఫెస్ట్ మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది. వచ్చే నెల 3,4 తేదీల్లో నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 2013లో 500 మందితో ప్రారంభమైన ఈ ఆగస్ట్ ఫెస్ట్‌లో గతేడాది 4,200 మంది పాల్గొన్నారని.. ఈ ఏడాది సుమారు 12 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని ఆగస్ట్ ఫెస్ట్ ఫౌండర్ కిరణ్ చెప్పారు. ఇప్పటికే 7 వేల మంది సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని.. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, బాహుబలి నిర్మాత శోభా యార్లగడ్డ, ప్రొ-కబడ్ది ఫౌండర్ చారు శర్మ వంటి ప్రముఖ వ్యక్తులెందరో ఈ కార్యక్రమంలో వక్తలుగా, మెంటార్లుగా పాల్గొంటారని తెలిపారు. ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ఈనెల 30 చివరి తేదీ. ప్రవేశ రుసుము రూ.800.