సెప్టెంబర్ 3న ఆగస్ట్ ఫెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలోని స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటార్స్‌ను ఒకే వేదికగా మీదికి తీసుకొచ్చే ఆగస్ట్ ఫెస్ట్ మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది. వచ్చే నెల 3,4 తేదీల్లో నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. 2013లో 500 మందితో ప్రారంభమైన ఈ ఆగస్ట్ ఫెస్ట్‌లో గతేడాది 4,200 మంది పాల్గొన్నారని.. ఈ ఏడాది సుమారు 12 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని ఆగస్ట్ ఫెస్ట్ ఫౌండర్ కిరణ్ చెప్పారు.
ఇప్పటికే 7 వేల మంది సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని.. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, బాహుబలి నిర్మాత శోభా యార్లగడ్డ, ప్రొ-కబడ్ది ఫౌండర్ చారు శర్మ వంటి ప్రముఖ వ్యక్తులెందరో ఈ కార్యక్రమంలో వక్తలుగా, మెంటార్లుగా పాల్గొంటారని తెలిపారు. ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ఈనెల 30 చివరి తేదీ. ప్రవేశ రుసుము రూ.800.