గంగాదేవి ఎంత గొప్పదంటే... ‘మాతా జాహ్నవీ దేవీ !’ అని సంబోధించారు ఆది శంకరులు. గంగాష్టకం చేస్తూ..‘‘మాతర్జాహ్నవి శంభూసంగమిలితే మౌషౌ నిధాయాఞ్జలిం/ త్వత్తిరే వపుషో వాసనసమయే నారాయణాం ఘ్రిద్వయమ్ / సనన్దమ్ స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే / భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ’’ అన్నారు. అమ్మా! అని పిలిచారు. నా శరీరం నుంచి ప్రాణాలు ఊర్థ్వముఖమై పోతుంటాయి.
ఏదో ఒక సమయంలో శరీరం విడిచి పెట్టాలి కదా! ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ /తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి’’పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అమ్మా! నా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నీ ఒడ్డున నిలబడి నా రెండు చేతులు తలమీద పెట్టి అంజలి ఘటించి నీవంక చూస్తూ.... నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతుంటే... మిగిలిన వాళ్ళందరూ ఏడ్వ వచ్చుగాక! కానీ నాకు అది ఉత్సవం కావాలి’’ అన్నారు.
భగవంతుడు లోపలినుంచి బయటికి ఉత్సవమూర్తిగా వస్తుంటే పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కరించి ఎగిరెగిరి చూసినట్లు – నా ప్రాణాలు పైకి లేచిపోతుంటే – అమ్మా నేను ఆనందపడిపోవాలి. ఇంతకాలం ఎవరి పాదాలు పట్టి స్మరించానో ఎవరి గురించి చెప్పుకున్నానో వారి పాదపంజరం లోకి వెళ్ళిపోతున్నా.. ఈ శరీరం వదిలి పెట్టేస్తున్నా..... అని .. చెమటపట్టిన బట్టను ఎంత తేలిగ్గా వదిలేస్తామో, అంత తేలిగ్గా నా శరీరాన్ని వదిలిపెట్టేస్తూ, నా తల మీద నారాయణ మూర్తి పాద ద్వయాన్ని స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదం లేకుండా బతికిన నేను చిట్టచివరన శరీరం విడిచిపెట్టేటప్పుడు ‘అమ్మా! నిన్ను చూడాలి’ అని అంటారు.
గంగమ్మ వైభవాన్ని గురించి చెబుతూ ఆయన... ‘‘ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం/ పశ్చాత్పన్నగ శాయినో భగవతః పాదోదకం పావనమ్ / భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షే రియం / కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే’’ అన్నారు. ఆమె మొట్టమొదట శ్రీమహావిష్ణువు పాదాలను కడగడానికి పనికొచ్చింది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడిగారు. అంటే ఆ కమండలంలో ఉన్నది గంగే. తరువాత శంభుని తలమీద పడింది. తరువాత జహ్ను మహర్షి తాగి తాను మళ్ళీ విడిచి పెట్టాడు. అలా ఋషి స్పర్శ పొందింది. అటువంటి గంగమ్మా! నా పాపాలన్నీ తొలగించు.. అని వేడుకున్నారు.
దీక్షితార్ వారు దీనినంతటినీ దృష్టిలో పెట్టుకుని గంగే మాం పాహి.. గిరీశ శిరస్థితే... అన్నారు తన కీర్తనలో. గంగ శివుని తలను తాకింది.. ఎలా? వినయంతో తాకిందా !!! నిజానికి పైనుంచి పడిపోయేటప్పుడు చాలా అహంకారంతో పడింది. ‘ఈడ్చి అవతల పారేస్తాను పాతాళానికి..’’ అంటూ పడింది. అలా పడుతుంటే పరమ శివుడు..‘‘ఇంత అహంకరిస్తోంది గంగ. ఎలా వెళ్ళిపోతుందో, నన్నెంత లాగేస్తుందో చూస్తా..’ అనుకుంటూ.. పాండురంగడు నిలుచున్నట్లు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ నిలుచున్నాడు. పైనుంచి గంగ పడంగానే జుట్టుతో కట్టేసాడు.. జటాజూటంలో. అలా దానిలోకి ఏళ్లతరబడి అలా పడుతూనే ఉంది.
శాస్త్రాలుగానీ మరేదయినా గానీ చదువుకోని దీక్షితార్ వారు చిన్న చిన్న పదాలతో చాలా గంభీరమైన భావాల్ని తన కీర్తనల్లో అద్భుతంగా పలికించారు. అదంతా గురువుల శుశ్రూష ఫలితంగా అబ్బిన విద్యాగంధం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
శంకరులు చెప్పిన చరమకాంక్ష
Published Mon, Feb 19 2024 5:59 AM | Last Updated on Mon, Feb 19 2024 5:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment