Brahmasri chaganti Koteshwara Rao
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అల్లుడు కోడలు ఆయుర్దాయం..!
కోడలు.... ఆమె నాకు పుట్టిన పిల్ల కాదు. ఎక్కడో పుట్టినపిల్ల. ఎక్కడో చదువుకుంది.. ఎవరి ఇంటినుండో వచ్చింది. అయితే నాకు కోడలిగా వచ్చింది. నా కొడుకును సంతోష పెట్టింది. నా వంశాన్ని పెంచింది. నాకు మనవడిని, మనవరాలిని ఇచ్చింది. నాకు, నా భార్యకు ఊతకర్ర.. చేతికర్ర అయింది. ముప్పూటలా ప్రేమను పంచిపెడుతున్నది. అటువంటి కోడలును చూసుకుని అత్తామామలు మురిసిపోతారు. అందుకే శాస్త్రం కోడలికి పెద్దపీట వేసింది. మామగారు కాలం చేస్తే... తద్దినం పెట్టేటప్పుడు కొడుకు అక్కడే ఉన్నా దీపం పెట్టే అధికారం మాత్రం కోడలికే ఇచ్చింది. ఏ కారణంచేతనయినా ఆమెకు అవాంతరం ఏదయినా వస్తే... ఆమె మళ్ళీ యోగ్యత పొందినప్పుడే తద్దినం పెట్టాలని చెప్పింది. అంత గొప్ప ఉపకారం చేస్తున్న కోడలిని... మా కిచ్చిన కన్యాదాతకు ప్రతిఫలంగా ఏమిచ్చి గౌరవించగలం!!నా కూతురిని వేరొకరి ఇంటి కోడలిగా పంపితే.. నేను ఒక మహోపకారం చేసినట్లు. నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది. ఆయన తరిస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతానాన్ని పొందాడు. నేను తాతయినట్టుగానే ఆయన తల్లిదండ్రులు తాత, నాయనమ్మలయి వారు సంతోషిస్తున్నారు. భగవంతుడు నాకేమి ఇచ్చాడో వేరొకరికి కూడా ఇచ్చాడు. అది నాకు గొప్ప సంతృప్తి. ఎవరంటారు శాస్త్రం ఆమెకు తక్కువ చేసిందని!!! తండ్రికి ఆమె 21 తరాలు తరించే అవకాశం ఇచ్చింది.పిల్లను ఇస్తున్నాం... కన్యాదానం చేస్తున్నామంటే... ఏదో పంచలచాపు ఇస్తున్నట్లు కాదు... ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. పరమ మర్యాద, గౌరవం అల్లుడి దగ్గరే మొదలవుతుంది. మంచి అల్లుడిని పొందడం అంటే మరో కొడుకును కన్నంత ఆనందం. కొడుకు చూపే అభిమానంకన్నా కోడలి అభిమానం పొందిన వారు మరో పదేళ్ళు ఎక్కువగా బతుకుతారు. మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడన్న ఆనందం వారి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.కాంచీపురంలో ఒక వృద్ధ వేదపండితుడు తటస్థపడి మాటల సందర్భంలో ఇలా అన్నాడు.. ‘‘అల్లుడు మంచివాడయితే మీకు మరో కొడుకున్నట్టే. మంచివాడు కాకపోతే మీరు నిత్యం చచ్చిపోయినట్లే. కారణం కూతురి బాధను చూడలేక, చూసి.. మింగలేక.. కక్కలేక మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.’’ అని.మనిషిని మనిషి బాధపెట్టుకోవడమయినా, బతికించుకోవడమయినా మన అనుబంధాలనుబట్టి ఉంటుంది. గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుంటే... ఓహ్... ఇంత గొప్పగా మాట్లాడి ఇస్తున్నారా పిల్లను... అనిపిస్తుంది. అందుకనే ‘ధర్మేచ అర్థేచ కామేచ....ఏషా నాతి చరితవ్యా... ధర్మప్రజాసంపత్తి అర్థం స్త్రీయం ఉద్వహే’ .. నేను ఈమెను దేనికోసం స్వీకరిస్తున్నాను..ధార్మికమైన సంతానం కోసం... జీవితంలో మొదట భార్య ఊరట, తరువాత కొడుకు ఊరట, తదుపరి కోడలు ఊరట, పిదప మనవడు, మనవరాలు ఊరట...అదీ గృహస్థాశ్రమ వైభవం... తాత పక్కన ఉంటే మనుమలకు ఒక విశ్వవిద్యాలయం పక్కన ఉన్నట్టే.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శంకరులు చెప్పిన చరమకాంక్ష
గంగాదేవి ఎంత గొప్పదంటే... ‘మాతా జాహ్నవీ దేవీ !’ అని సంబోధించారు ఆది శంకరులు. గంగాష్టకం చేస్తూ..‘‘మాతర్జాహ్నవి శంభూసంగమిలితే మౌషౌ నిధాయాఞ్జలిం/ త్వత్తిరే వపుషో వాసనసమయే నారాయణాం ఘ్రిద్వయమ్ / సనన్దమ్ స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే / భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ’’ అన్నారు. అమ్మా! అని పిలిచారు. నా శరీరం నుంచి ప్రాణాలు ఊర్థ్వముఖమై పోతుంటాయి. ఏదో ఒక సమయంలో శరీరం విడిచి పెట్టాలి కదా! ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ /తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి’’పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అమ్మా! నా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నీ ఒడ్డున నిలబడి నా రెండు చేతులు తలమీద పెట్టి అంజలి ఘటించి నీవంక చూస్తూ.... నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతుంటే... మిగిలిన వాళ్ళందరూ ఏడ్వ వచ్చుగాక! కానీ నాకు అది ఉత్సవం కావాలి’’ అన్నారు. భగవంతుడు లోపలినుంచి బయటికి ఉత్సవమూర్తిగా వస్తుంటే పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కరించి ఎగిరెగిరి చూసినట్లు – నా ప్రాణాలు పైకి లేచిపోతుంటే – అమ్మా నేను ఆనందపడిపోవాలి. ఇంతకాలం ఎవరి పాదాలు పట్టి స్మరించానో ఎవరి గురించి చెప్పుకున్నానో వారి పాదపంజరం లోకి వెళ్ళిపోతున్నా.. ఈ శరీరం వదిలి పెట్టేస్తున్నా..... అని .. చెమటపట్టిన బట్టను ఎంత తేలిగ్గా వదిలేస్తామో, అంత తేలిగ్గా నా శరీరాన్ని వదిలిపెట్టేస్తూ, నా తల మీద నారాయణ మూర్తి పాద ద్వయాన్ని స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదం లేకుండా బతికిన నేను చిట్టచివరన శరీరం విడిచిపెట్టేటప్పుడు ‘అమ్మా! నిన్ను చూడాలి’ అని అంటారు. గంగమ్మ వైభవాన్ని గురించి చెబుతూ ఆయన... ‘‘ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం/ పశ్చాత్పన్నగ శాయినో భగవతః పాదోదకం పావనమ్ / భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షే రియం / కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే’’ అన్నారు. ఆమె మొట్టమొదట శ్రీమహావిష్ణువు పాదాలను కడగడానికి పనికొచ్చింది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడిగారు. అంటే ఆ కమండలంలో ఉన్నది గంగే. తరువాత శంభుని తలమీద పడింది. తరువాత జహ్ను మహర్షి తాగి తాను మళ్ళీ విడిచి పెట్టాడు. అలా ఋషి స్పర్శ పొందింది. అటువంటి గంగమ్మా! నా పాపాలన్నీ తొలగించు.. అని వేడుకున్నారు. దీక్షితార్ వారు దీనినంతటినీ దృష్టిలో పెట్టుకుని గంగే మాం పాహి.. గిరీశ శిరస్థితే... అన్నారు తన కీర్తనలో. గంగ శివుని తలను తాకింది.. ఎలా? వినయంతో తాకిందా !!! నిజానికి పైనుంచి పడిపోయేటప్పుడు చాలా అహంకారంతో పడింది. ‘ఈడ్చి అవతల పారేస్తాను పాతాళానికి..’’ అంటూ పడింది. అలా పడుతుంటే పరమ శివుడు..‘‘ఇంత అహంకరిస్తోంది గంగ. ఎలా వెళ్ళిపోతుందో, నన్నెంత లాగేస్తుందో చూస్తా..’ అనుకుంటూ.. పాండురంగడు నిలుచున్నట్లు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ నిలుచున్నాడు. పైనుంచి గంగ పడంగానే జుట్టుతో కట్టేసాడు.. జటాజూటంలో. అలా దానిలోకి ఏళ్లతరబడి అలా పడుతూనే ఉంది. శాస్త్రాలుగానీ మరేదయినా గానీ చదువుకోని దీక్షితార్ వారు చిన్న చిన్న పదాలతో చాలా గంభీరమైన భావాల్ని తన కీర్తనల్లో అద్భుతంగా పలికించారు. అదంతా గురువుల శుశ్రూష ఫలితంగా అబ్బిన విద్యాగంధం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురు వాక్యస్య... !!!
వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు. శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు. యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు. ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను. ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు. -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తప్పులు చేయకపోతే...???
సర్వసాధారణంగా లోకంలో ..ఎవరయినా విజయం సాధిస్తే..దానికి వారు ఎంత కష్టపడిందీ పదేపదే చెప్పుకుని పొంగిపోతుంటారు. అది సహజం కూడా. కానీ అపజయం ఎదురయితే మాత్రం... ‘మనం చేయాల్సింది చేశాం కానీ ఫలితం లేకపోయింది’ అంటారు.. అంటే విజయం అయితే తన స్వంతం. అదే వైఫల్యం చెందితే అందరినీ కలుపుకుంటారు. తన వైఫల్యాన్ని అంగీకరించరు..ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. కానీ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త సర్ సివి రామన్ ఏమంటారంటే... ‘‘ఎక్కడ నేను వైఫల్యం చెందానో దానికి యజమానిని నేను. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి. అసలు నేను వైఫల్యం చెందకపోతే .. నేను నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది!!!’’– అని. దిద్దుకుందామన్న స్పృహ లేకపోతే దోషం కానీ, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండి.. తాను పొందిన వైఫల్యాలను అనుభవంగా స్వీకరించి, అది నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తానంటే... ఇక సమస్యే ముంది!!! నిజానికి అందరిలో ఉండాల్సిన లక్షణం అది. సుందరకాండలో స్వామి హనుమ... ‘‘నాలుగు అంగుళాలు కూడా వదలకుండా లంకా పట్టణమంతా గాలించేసాను. సీతమ్మ కనబడలేదు. అంటే సీతమ్మ ఇక్కడ లేదేమో.. సీతమ్మ క్షేమ సమాచారం లేకుండా నేను తిరిగి వెడితే..అక్కడ రాముడు శరీరం వదిలేస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల రాజ్య ప్రజలు, వానర రాజ్యంలో ఉన్నవాళ్ళు...అందరూ హతాశులైపోతారు. నేను వెళ్ళి సీతమ్మ సమాచారం దొరకలేదని చెప్పి ఇంతమందిని బాధపెట్టడం కంటే ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తాను. శరీరం వదిలేస్తాను’’ అన్నాడు... హనుమ అంత బలశాలి లంకంతా వెతికి సీతమ్మజాడ తెలియకపోతే... ఎంత నిరాశ, ఎంత నిస్పృహæ... అది కొద్దిసేపే... వెంటనే తన బాధ్యతలను గుర్తు చేసుకున్నాడు.. ‘అసలు మనిషికి శోకం పొందకుండా ఉండడం, బాధ పడకుండా ఉండడం, వైఫల్యానికి బాధపడినా దాన్ని విడిచి మళ్లీ... దిద్దుకుని ఉత్సాహం పొంది ఎక్కడ వైఫల్యం చెందాడో అక్కడ తిరిగి విజయం అందుకోవడానికి సాధన మొదలుపెట్టడం ముఖ్యం’ అనుకున్నాడు. ఎక్కడ వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే ఫలితం... ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ విజయం సాధిస్తే అది ఇచ్చే తృప్తి, అది నేర్పిన పాఠం, అది నేర్పిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి... అటువంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మరింత స్ఫూర్తినిస్తాయి... అన్న వివేకం మనల్ని ముందుకు నడిపించడమే గాక మరిన్ని విజయాలను రుచి చూపిస్తుంది. అంతే తప్ప నేనేది చేసినా ఇంతే... అయినా నాకా శక్తి ఎక్కడిది.. అని నిరాశపడితే జీవితం ముందుకు కదలదు. మేడమీద ఉన్న కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి చూస్తే... ఒకడికి కింద ఉన్న బురదనేల, మురికి కనిపించి నిరాశ పరిస్తే.. మరొకడికి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, వెలుగులు కనిపించి మురిపిస్తాయి. వాళ్ళ దక్పథాల్లోనే తేడా.. ఆశావాదం ఉన్న వాళ్లు జీవితంలో వృద్ధిలోకి వస్తారు... నిరాశావాదులు నిరాశను ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. రామన్ చెప్పినట్లు వైఫల్యాలను మనసారా అంగీకరిస్తే... అది మనల్ని ఎన్నటికీ నిరాశపరచకపోగా... కొత్త శక్తినిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చిన్న మాటలే.. ఛిన్నాభిన్నం చేసేస్తాయి
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు. బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు. అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు. ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం. అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇంట్లో పెద్ద తాచుపాముంటే.. ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండగలమా!
జీవితంలో కొన్ని వదిలించుకుని తీరవలసినవి, ఎన్ని సర్దుబాట్లుచేసుకుని అయినా వదలకూడనివి కొన్ని ఉంటాయి... వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా దిద్దుకోకపోతే పచ్చటి జీవితాలు పాడయిపోతాయి, మోడయిపోతాయి. అందులో మొదటగా స్నేహితుడు.. అదీ ఆత్మీయుడు, ప్రాణసముడు.. అని నమ్మి మనం మన కష్టం, సుఖం, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మనసు విప్పి ఏవీ దాచుకోకుండా చెప్పేసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని మనల్ని మోసం చేయడానికి అతను కనిపెట్టుకుని ఉన్నాడు... అని తెలిసినప్పుడు మీరెంత ప్రమాదంలో ఉన్నారో ఊహించుకోండి. మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి... సాధ్యం కానప్పుడు దూరంగా పెట్టడానికి సందేహించకూడదు. అలాగే భృత్యుడు... సేవకుడికి వినయం ఉండాలి. యజమానిపట్ల గౌరవభావం ఉండాలి. ఆయన చెప్పిన ఆదేశాలను పాటించడం తన విధిగా అనుకోవాలి. తనసేవలతో యజమానిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుండాలి. అలా కాక యజమానికన్నా తాను ఎక్కువ చదువుకున్నవాడిననీ, దేనిలోకూడా ఆయనకేమీ తాను తీసిపోననీ, ఆయన మాటలు నేను వినేదేమిటనే సేవకుడు... యజమానిని ఎప్పుడూ తిరస్కార భావంతోనే చూస్తుంటాడు. అటువంటి భృత్యుడిని సంస్కరించగల శక్తి ఉంటే సంస్కరించగలగాలి... అది సాధ్యంకానప్పుడు వదిలించుకోవాలి. కపటి అయిన మిత్రుడు, అహంకారి అయిన భృత్యుడు మృత్యువుతో సమానం. ఇంట్లో పెద్ద తాచుపాము దూరింది.. ఇంట్లోనే ఎక్కడో ఉంది.. రోజుకు నాలుగైదు సార్లు కనిపిస్తున్నది. ఏదో దానిమానాన అది ఉందని ప్రశాంతంగా, నిబ్బరంగా ఇంట్లో ఉండగలమా... ఇవి కూడా అంతే... ఇక ... ఒకసారి అనుబంధం ఏర్పడిన తరువాత ఎన్ని అవాంతరాలు, ఎంత మానసిక క్లేశం ఎదురవుతున్నా సర్దుబాటు చేసుకుంటూ, చివరిదాకా కొనసాగించాల్సిన బంధం – దాంపత్య బంధం. ఇద్దరూ కలిసి చెయ్యిచెయ్యిపట్టుకుని ప్రస్థానం చేయాలి. ఎవరు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎవరు ఎవరిని కాపాడుకోవాలి.. అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు... ఒక చిన్న పిల్లను తీసుకుని తండ్రి నడిచి వెడుతున్నాడు. ‘అమ్మా! మనం నడుస్తున్న ప్రదేశం అంత మంచిది కాదు. కొండమీద నడుస్తున్నాం. జారితే ప్రమాదం. నా చేయి గట్టిగా పట్టుకో..’ అన్నాడు. దానికి ఆ పిల్ల .. ‘‘వద్దు నాన్నగారూ, నేను మీ చేయి పట్టుకున్నాననుకోండి. జారిపోవడం ఎంత ప్రమాదకరమో, మీ చేయి విడిచి పెట్టేయడం కూడా అంతే ప్రమాదకరం కావచ్చు. అందుకని నేను మీ చేయి పట్టుకోను. మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఎంత ప్రమాదం వచ్చినా మీరు నా చేయి వదలరు.. అది నా నమ్మకం’’ అన్నది. ఆ నమ్మకం ఎంత గొప్పది. ఇది భార్యాభర్తలమధ్య జీవితాంతం అలాగే ఉండాలి... ఒకరికొకరు బాసటగా. అంతే తప్ప ఎవరి చేయి ఎవరు ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకే తెలియకపోతే... వాళ్ల మధ్యే అభిజాత్యాలు, అహంకారాలు పుడితే, ఆ దాంపత్యం ఏం వర్ధిల్లుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది... ఇవి చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. తరువాత చూసుకోవచ్చులే అని కాక .. సమస్య మొదలయిందని గుర్తించిన మరుక్షణం దృష్టి పెట్టి దిద్దుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సంపద.. సమృద్ధి
సన్యసించిన వ్యక్తులు, పరమహంసలు, మఠాధిపతులు, పీఠాధిపతులు... వీరు సర్వసాధారణంగా ఆత్మోద్ధరణకు సంబంధించిన విషయాలమీద అనుగ్రహభాషణలు చేస్తుంటారనీ, వారు తాము తరించి, ఇతరులు తరించడానికి సంబంధించిన మార్గాలను బోధచేయడం వరకే పరిమితం అవుతారని లోకంలో భావన చేస్తుంటారు. కానీ ఈ భావనలకు భిన్నంగా వెళ్ళిన గురువు ఒకరున్నారు. ఆయన సమర్ధ రామదాసు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. దేశంలో సమకాలీన పరిస్థితులను బాగా అధ్యయనం చేసారు. ఆ కాలంలో ఉన్న పాలనా వ్యవస్థ, అప్పుడున్న సామాజిక అలజడులు, ప్రజలలో అప్పుడున్న అభద్రతా భావాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలికంగా ఏవి అవసరమో వాటిని బోధించి, ఆచరణలో కూడా మార్గదర్శనం చేసిన గురువు ఆయన. ప్రజలు తమ శారీరక ఆరోగ్యంతోపాటూ, ఆత్మరక్షణకు అవసరమయిన దృఢత్వాన్ని పొందడానికి ఆయన పర్యటించిన ప్రదేశాల్లో వ్యాయామశాలలు నెలకొల్పారు. ఆరోగ్యంతోపాటూ మానసిక పరిణతికి చదువు అవసరమని పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, ధర్మంపట్ల అనురక్తి కలగడానికి భక్తి అవసరమని హనుమాన్ మందిర్ లు నిర్మించారు. ప్రజలందరిలో దేశభక్తి నూరిపోసారు. ఆయన ప్రజలకు తరచుగా ఆరు సూత్రాలు బోధిస్తుండేవారు...అవి ఎప్పటికీ ఆచరణ యోగ్యాలే. వాటిలో మొదటిది సంపద, సమృద్ధి. అంటే అందరివద్దా సంపద ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. లేకపోతే తను వ్యక్తిగతంగా అనుకున్నది కూడా సాధించలేరు, జీవితంలో అభ్యున్నతిని పొందలేరు. ఒక వయసు వచ్చిన తరువాత, మనిషి కష్టపడి స్వయంగా సంపాదించుకోవడం అవసరం. దీని ప్రాధాన్యతను మన సుభాషితాలు కూడా చక్కగా వివరించాయి. మాతానిందతి/ న అభినందతి పితా / భ్రాతా న సంభాషతే! భృత్యః కృప్యతి/ న అనుగచ్ఛతి సుతః/ కాంతాచ న ఆలింగతే/ అర్థప్రార్థన్ శంకయా న కురుతే స్వాలాపమాత్రం సుహృత్ / తస్మాత్ అర్థముపాశ్రయ శ్రుణు సర్వేహి అర్థేన సర్వే వశాః... అంటాయి. అంటే – నీకంటూ సంపాదన లేకపోతే ఎప్పుడూ నిందించని అమ్మ కూడా నిందిస్తుంది. తండ్రి సంతోషంతో భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అభినందించడు. తోడపుట్టినవారు కూడా చులకన చేస్తారు. పలకరించరు.సేవకుడికి ఏదయినా పని చెబితే... పైసా విదల్చడు కానీ పనులు మాత్రం చెబుతుంటాడని ఆగ్రహిస్తాడు. పిల్లల అభ్యున్నతికి ఖర్చుపెట్టనప్పుడు కన్న కుమారుడు సేవలందించడు. ఇల్లు గడవడానికి అవసరమయిన సొమ్ము తీసుకురానప్పుడు కట్టుకున్న భార్య ప్రేమగా కౌగిలించుకోదు. ఎంత మంచి స్నేహితుడయినా ఎదురుపడితే అప్పు అడుగుతాడేమోనని ముఖం చాటేస్తాడు. అందువల్ల ఓ స్నేహితుడా! నీతి తప్పకుండా సంపాదించు. దానితో సమస్తమూ నీకు వశపడుతుంది... అంటారు. ఒక తోటలో అరవిరిసిన పువ్వుల వాసనలకన్నా.... కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యం ఎంత తక్కువయినా దాని సువాసన ఎక్కువగానే ఉంటుందని కూడా అంటారు. అలా సక్రమ మార్గంలో కష్టపడి మనిషి సంపాదించి బతకగలగాలి. అది ఆత్మగౌరవం. అది మనిషికి సంపూర్ణతను ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
గురువాణి: సంస్కార వైభవం
రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు. రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు. వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు. బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు. కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు. ‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు. వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి. (సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం
‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు. నందుల చరిత్ర తెలిసే ఉంటుంది. కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను.. అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు. చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినరోజు
అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ? మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి. స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు. అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతి: సత్సాంగత్య ఫలం
మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుపకాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగదీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంతా అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మలనుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి. ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్తకాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయలేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడుతుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి, ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థమైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. ‘నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవరకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టుకుంటాను’ అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగుతుంది. అంతేతప్ప తనకోసం బతికేవాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించేవాడూ, పదిమందికి ఆదర్శం కానివాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు, కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు, ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభవిస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ, వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి.. ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు
మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం. మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి ప్రతి క్షణం కలిగిస్తుంటాయి. మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు. నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే, వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తమ్ముడా! నువ్వు చెప్పిందే నిజం...
వినేవాడయితే ఒక్క మాట చాలు...జీవితాలు మారిపోతాయి. వినడమన్నది అలవాటు లేకపోతే ఎంత మంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అవి వారి జీవితంలో ప్రయోజకత్వాన్ని ఇవ్వవు. సీతమ్మ కనబడకపోతే–రామచంద్ర మూర్తి కోపాన్ని పొంది...‘‘ఈ వేళ నేను నా రాచబాణంతో ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను.. పంచభూతాల్లో ఏ ఒక్క భూతం కూడా కదలదు. యథాకాలో యథామృత్యుర్ యథాజరా యథా విధిః నిత్యం న ప్రతిహ్నం యంతే.. .ఓ లక్ష్మణా! ఏమనుకుంటున్నాయో.. వృద్ధాప్యాన్ని ఎలా దాటలేరో, మృత్యువును ఎలా జయించలేరో, కాలాన్ని ఎలా అధిగమించలేరో ఈ వేళ నన్నలా దాటలేరెవ్వరూ.. సమస్త బ్రహ్మాండాలన్నీ లయం చేస్తాను... ’’ అని హూంకరించాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి కాళ్ళమీద పడ్డాడు. చదవండి: పహిల్వాన్ గర్వభంగం ‘‘అన్నయ్యా! ఏమిటీ కోపం!!! సీతమ్మ కనబడలేదనీ.. అడిగితే నీకు బదులివ్వలేదని సమస్త భూతములను లయం చేసేస్తావా? చంద్రేలక్ష్మీ, ప్రభాసూర్యే, గతిర్వాయుః.. భువి క్షమ.. ఉత్తమమ్ యశః,...చంద్రుడు అంటే కాంతి, భువి అంటే క్షమ, వాయువు అంటే కదులుతుంది...నువ్వంటే ఏమిటి...గొప్ప కీర్తి..రాముడంటే ఓర్పు, క్షమ, వింటాడు. గురువులు ఏది చెప్పారో దాన్ని ఆచరణాత్మకం చేస్తాడు...అని కీర్తి నీకు...సీతమ్మ జాడ చెప్పలేదని అందర్నీ చంపేస్తావా...??? ఎవడెత్తుకెళ్ళాడో వాడిని చంపాలి అన్నయ్యా...ఓర్చుకో..’’ అన్నాడు లక్ష్మణుడు. చదవండి: వారి మాట సలహా కాదు, శాసనం ఆ.. మహా చెప్పొచ్చావులే...ఆశ్రమంలో ఉండి వదినను కనిపెట్టుకుని ఉండరా అంటే ఉండకుండా వచ్చేసావ్.. అసలు నీవల్లే వచ్చిపడిందీ కష్టమంతా..కాబట్టి నీ మాట అస్సలు వినను...’’ అనవచ్చు రాముడు. కానీ అలా అనలేదు...‘‘తమ్ముడా! నీవు చెప్పింది సత్యం. ఎవడు అపహరించాడో వాణ్ణి సంహరిస్తా. ఈ బ్రహ్మాండాలను లయం చేయను’’ అంటూ వెళ్ళిపోయాడు. మాట విన్నాడు కాబట్టి అంత కీర్తిమంతుడయ్యాడు. లక్ష్మణుడి మాట వినకుండా రాముడు బ్రహ్మాండాలను లయం చేసుంటే... మొట్టమొదట ఎవరు తలదించుకుని ఉండేవారంటే... వశిష్ఠ విశ్వామిత్రులు. ఇటువంటి అయోగ్యుడికి మేమింత ధనుర్వేదాన్నిచ్చాం. చిన్న కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మాండాలను లయం చేసేసాడు. ఓర్పు లేనివాడికి మేమా విద్య ఇవ్వకుండా ఉండాల్సింది.ఇవ్వడమే మేము చేసిన తప్పు’’ అని తలదించుకోవాల్సి వచ్చేది. చెప్పిన మాట రాముడు విన్నాడు కాబట్టి వశిష్ఠవిశ్వామిత్రులు పొంగిపోయారు. నిజంగా రాముడికి యుద్దంలో కష్టమొస్తే అగస్త్యుడు పరుగుపరుగున వచ్చాడు. ఆదిత్య హృదయం ఉపదేశం చేసాడు. పాత్రత దేనివలన నిలబడుతుంది... అంటే చెప్పిన మంచి మాట వినడం వలన. మాటలు ఎన్నయినా సారభూయిష్టమైన ఒక్క మాట చాలు. సాలగ్రామం ఎక్కడో ఉండదు. రాళ్ళకుప్పల్లో వెతికితేనే దొరుకుతుంది. అలా ఒక మంచి మాట కోసం ఒక పుస్తకాన్నంతటినీ చదవాలి. ఒక్క మంచి మాట కోసం ఎన్ని మంచి మాటలయినా వినాలి. వాటిలో సారవంతమయిన ఒక్క మంచి మాటను జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. దాన్ని అనుష్టాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ‘నా అంతటి వాడను నేను . నాకు వాళ్ళు చెప్పేదేమిటి? నాకు వాడు చెప్పొచ్చేవాడా? వాడు చెప్పడం, నేను వినడమా...???’ అని అహంకార పూరిత వ్యక్తిత్వంతో ఉండేవాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అలా కాకుండా గురువుగారు ఆ మాట ఎందుకన్నారో.. అయినా నా మంచికేగా చెప్పింది..అని స్వీకరించినవాడు ధన్యాత్ముడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాజైనా తల్లికి నమస్కరించవలసిందే!
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ...ఈ మూడు అంశలూ ప్రచోదనమయి ఉంటాయి. జీవితాంతం నిలబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డలకు పరదేవతే... పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా.. దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా.. తనలో తానే ఏవో సంధిమాటలు మాట్లాడుకుంటున్నా... తన బిడ్డలకు మాత్రం ఉద్ధారకురాలే. ఎలా ? అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ ఉంటే కదూ, కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేల మార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫలం దక్కుతుందంటుంది శాస్త్రం. బిడ్డలకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఇలా చేసుకోలేదు. అమ్మ ఉన్నది కాబట్టి నీకా పుణ్యం వస్తున్నది. అమ్మకు నమస్కారం చేయడం అంత గొప్ప ఫలితాన్నిస్తుంది. బాహ్యంలో ఎన్ని యజ్ఞాలుచేసినా, యాగాలు చేసినా, ఎన్నో చండీ హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో సమానమా.. అంటే చెప్పడం కష్టం. అమ్మ–త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతటతానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకే మాతదేవోభవ. అందుకే అమ్మ దేవత. అమ్మ పరబ్రహ్మం. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళూ, బ్రహ్మచారులూ, వానప్రస్థులూ అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. మరి సన్యాసి ఎవరికి నమస్కరిస్తారు? చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసినవారెవరున్నారో వారికి మిగిలిన వారు నమస్కరిస్తారు. ఎక్కువ దీక్షలు చేసినవారు, తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారికి నమస్కరించరు. అది సంప్రదాయం. కంచి కామకోటి మఠంవంటి పీఠాలలో కూడ ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యం వహించాడనుకోండి. అప్పుడు సందర్శకుల వరుసలో వస్తున్న తండ్రిగారికి కూడా ప్రత్యేకతేం ఉండదు. కడుపునబుట్టిన కొడుకయినా సరే, తండ్రికూడా వచ్చి పీఠాధిపతుల పాదాలకు అందరిలాగే నమస్కారం చేసుకోవలసిందే. కానీ తల్లిగారు వరుసక్రమంలో వస్తున్నారనుకోండి. వెంటనే పీఠాధిపతయినా కూడా లేచి నిలబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. అది సంప్రదాయం, అది నియమం. -
అపర విష్ణువు... అమ్మ
అమ్మ... బ్రహ్మ అని చెప్పుకుంటూ, సృష్టికర్త అయిన బ్రహ్మ అంశ అమ్మలో ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదా! ప్రముఖ వైద్యులొకరు ‘మాతృదేవోభవ’ అని పుస్తకం రచించారు. వైద్యశాస్త్రపరంగా తనకున్న పరిజ్ఞానాన్నంతటినీ ఉపనిషత్ జ్ఞానంతో కలిపి రచన చేశారు. అమ్మ కడుపులో బ్రహ్మస్థానం ఎలా ఉంటుంది, సృష్టి చేయడానికి అవకాశం ఎలా ఉంటుందో విశ్లేషించారు. అమ్మ కడుపులో ఒక రకమైన ద్రవం ఊరుతుంది. అలా ఊరి, అది కడుపులో చేరుతుంది. దానిలో శిశువుంటుంది. అలా ఉన్న కారణం వల్ల అమ్మ వంగినా, జారి పడినా.. లోపల ఉన్న పిండానికి దెబ్బతగలకుండా, అలా అది అంగవైకల్యం పొందకుండా... ఆ ద్రవంలో తేలుతూ ఉంటుంది. అలా ఉన్నస్థితిలోనే బయట వైద్యుడు ఆ పిండం ఎదుగుదల క్రమాన్నీ, ఆరోగ్య పరిస్థితినీ అంచనా వేయడానికి అవకాశం కలుగుతుంది. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు సృష్టికర్త అంశంగా తల్లిలో మాత్రమే అలాంటి ద్రవం ఉత్పన్నమవుతుందని రాశారు. అమ్మలో... సృష్టికర్త అంశతో పాటు, స్థితికర్త అంశా ఉంటుంది. స్థితికర్త అంటే... పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు అని అర్థం. ఇది విష్ణుతత్త్వం. సృష్టి, స్థితి, లయ – అనే మూడింటిలో స్థితి... అంటే రక్షణ భారాన్ని స్వీకరించి, త్రిమూర్తి త్రయంలోని విష్ణుస్వరూపం స్థితికారకమై ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఒక ధర్మం ఉంటుంది. ఏ పేరుపెట్టి పిలవకపోయినా, ఆపదలో మన రక్షణ కోసం పలికేది విష్ణువే. అది ఆయన కర్తవ్యం. ‘గజేంద్ర మోక్షం’లో ప్రమాదంలో చిక్కుకున్న గజేంద్రుడు ఒక పేరు పెట్టి ఎవరినీ తన రక్షణ కోసం పిలవలేదు. ఓ బ్రహ్మ రావాలనో, ఓ శివుడు రావాలనో, నాలుగు తలకాయలవాడు రావాలనో, తామరపూవులో నుంచి పుట్టినవాడు రావాలనో, నాగభూషణుడు రావాలనో వర్ణన చేయలేదు. ‘‘తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంత శక్తయే అరూపా యోరు రూపాయ నమః ఆశ్చర్యకర్మణే... విదూరాయ, కైవల్యనాథాయ, శాంతాయ, ఘోరాయ, మూఢాయ, నిర్విశేషాయ, సామ్యాయ, జ్ఞానధనాయ’’ – ఇలా కీర్తిస్తూ అలాంటివాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. అటువంటి వాడెవరు విష్ణువా? శివుడా? బ్రహ్మా? రక్షణకి పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరుగెత్తుకొచ్చాడు. ఆయననే ఉద్దేశించి రక్షించమని ప్రత్యేకించి అడగక్కర్లేదు. అటువంటి విష్ణుతత్త్వం అమ్మలో ఉంటుంది. అమ్మ.. అమ్మగా రక్షకతత్త్వంతో ఉంటుంది. అమ్మకు రక్షించడమొక్కటే తెలుసు! ఆ రక్షకతత్త్వం గురించి ప్రత్యేకంగా ఎవరూ బోధ చేయక్కర్లేదు. మనుష్య ప్రాణే కాదు, ఏ జీవి అయినా, ఏ ప్రాణి అయినా తీసుకోండి... తన బిడ్డ అనేటప్పటికి అప్పటి వరకు భయహేతువుగా ఉన్న వాటివల్ల తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా సరే, బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. కోడిపెట్ట అనుక్షణం పైన ఉన్న గ్రద్ద నుండి, పక్కనున్న కుక్క వరకు దేని నుంచీ ఎలాంటి హానీ జరగకుండా తన పిల్లలను కనిపెట్టుకునే ఉంటుంది. ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ‘కొక్కొక్కొక్కొ...’ అంటూ పిల్లలన్నిటినీ రెక్కల దగ్గరకు తీసేసుకుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. పిల్లల్ని తీసుకువెళ్ళి ఎక్కడో సురక్షిత స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. గ్రద్ద కానీ, కుక్క కానీ వస్తే ముందు తనను కొట్టేయాలి తప్ప పిల్లలను ముట్టుకోనీయదు. తాను చచ్చిపోయాకే తప్ప తన కళ్ళ ముందు తన పిల్లలు చచ్చిపోకూడదు. ఎవరు నేర్పారు ఈ త్యాగభావన? ఎక్కడి నుంచి వచ్చిందీ రక్షణశక్తి? అంటే దర్శనం చేయగలిగిన నేత్రాలుండాలే గానీ... పిల్లలకు అడ్డుగా రక్షణ కవచంలా నిలబడి పోయిన ఆ తల్లి కోడే – శ్రీమహావిష్ణువు! ఆ తల్లి కోడే – జగన్మాత!! అసలు ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఏమిటంటే ‘‘అమ్మ కడుపులోంచి బిడ్డ బయటకు రాగానే అపారమైన భయానికి లోనై, వాడికి ఊపిరితిత్తుల చలనం ఆగిపోతుంది. వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. ఆ భయానికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా అయిపోతుంది. ఈ దశలో ‘వీడు నా బిడ్డ’ అన్న భావనతో, సంతోషంతో వాడిని అమ్మ దగ్గరకు తీసుకుని స్తన్యమివ్వగానే, ఈ సృష్టిలో ఎక్కడా తయారుచేయడానికి సాధ్యపడని పసుపుపచ్చని పదార్థం ఒకటి విడుదలవుతుంది. దానిని బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె మళ్ళీ సాధారణస్థాయిలో కొట్టుకుంటుంది. లోపల గడ్డ కట్టుకున్న నల్లటి మలం విసర్జింపబడుతుంది. అంతేకాక రుగ్మతల బారి నుండి వాడిని వాడు రక్షించుకోవడానికి అవసరమైన నిరోధకశక్తిని సమకూర్చుకొని స్వస్థతను పొందుతాడు.ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ‘నా బిడ్డ’ అన్న భావనతో అమ్మ ఇచ్చిన స్తన్యంలో నుంచి, స్థితికారకత్వమైన విష్ణుతత్త్వంలో నుంచి వచ్చింది. అందువల్ల అమ్మ సృష్టికర్తే కాదు, స్థితి కర్త కూడా! అందుకే మాతృదేవోభవ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది?
విద్య - విలువలు మీరిప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు. భవిష్యత్‌లో మీకు చిక్కుసమస్యలు ఎదుైరనప్పుడు, సందిగ్ధావస్థల్లో చిక్కుకున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుని వాటినుంచి బయటపడే ప్రజ్ఞ అంకురించాలంటే-మంచి విషయాలను మీరు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. మీకు ఆ సపోర్ట్ లేకపోతే...కేవలం మీరు అకాడమిక్‌గా పాఠ్యాంశాలకే పరిమితమైతే, మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడలేరు. స్వామి వివేకానంద, భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, అబ్దుల్కలాంవంటి వారి ప్రసంగాలు, రామాయణ భారతభాగవతాదులవంటి గ్రంథాలను నిరంతరం చదవడం, పరిశీలించడం అలవాటైందనుకోండి. క్లిష్టసయమాల్లో మీరు మహోన్నతమైన నిర్ణయాలు చేయగలుగుతారు. అలాగే మీరు మహాత్ముల ఇళ్ళు చూడండి. వారి ఇళ్ళలో ఉన్నవి అనవసర వస్తువులు కావు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూకు చెందిన తీన్‌మూర్తి భవన్ వెళ్ళిచూడండి. ఇప్పటికీ చాలా షెల్ఫులు, వాటినిండా పుస్తకాలు. చివరకు కారాగారంలో ఉండికూడా వారుమాట్లాడిన మాటలు అంత సారవంతంగా ఉంటాయి. వాళ్ళు నడిచివెడుతున్న గ్రంథాలయాల్లా కనిపిస్తారు. ఈ దేశంలో మహాత్ములు కారాగారంలో మగ్గుతుంటే మనం బయట ఉండడమేమిటని సిగ్గుపడి సొంతంగా సిద్ధపడి కారాగారాలకు వెళ్ళినవారు ఎందరో ! ఘంటసాల వేంకటేశ్వర రావుగారు గొప్ప నేపథ్యగాయకుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులందరూ కారాగారంలో ఉంటే నేను బయట పాటలు పాడుకోవడమేమిటని తనకుతానుగా సంగ్రామంలో పాల్గొని, జైలుకెళ్ళి పొట్టి శ్రీరాములుగారితో కలిసి గడిపిన రోజుల్లో వారి దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పేవారు. శ్రీరాములుగారు మరణిస్తే, అంత్యేష్ఠి సంస్కారం జరుగుతున్నప్పుడు శ్మశానంలో కూర్చుని దేశభక్తిగీతాలతో కచ్చేరీ చేసారు. అటువంటి వ్యక్తులు పుట్టినగడ్డ ఇది. మంచిమంచి పుస్తకాలు చదవండి. చదివిన విషయాలపై ఆ పుస్తకం మొదటిపేజీలో చక్కటి సమీక్ష రాయండి. నేను చదివిన ప్రతి పుస్తకం ముందు పేజీలో అలా రాసుకుంటాను. నేనెంత కాలం ఉంటాను! నాతదనంతరం నా మనవడు ఎప్పుడైనా ’మా తాత ఇన్ని పుస్తకాలు చదివాడా?’ అని ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం బయటికి తీసి ముందుపేజీ చూస్తాడు. దానిలో ’’పక్షపాతం గురించి వ్యాఖ్యానం అద్భుతం-92వపేజీలో’’ అని ఉంటుంది. ఆ పేజీలోకి వెడతాడు. పక్షపాతం అన్నది జీవితాలను ఎంతగా పాడుచేస్తుందో అక్కడ చదివినతర్వాత వాడేమనుకుంటాడంటే...’’మా తాత చదివిన ఇన్ని పుస్తకాలు నేను చదవక్కరలేదు. ఆ సమీక్షలవరకు చూసుకుంటే చాలు’’ అనుకుంటాడు. అంటే నేను శరీరంతో లేకపోయినా నా మనవళ్ళకు మార్గదర్శనం చేసినవాడినవుతాను. గొప్పకోసం కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను చదివిన పుస్తకాలు వందలకొద్దీ అయిపోతే నేను మొదటిపేజీలో సమీక్ష రాసుకున్నవి ఈ మధ్యకాలంలో కాకినాడలో ఒక గ్రంథాలయం వారికిస్తే నా పేరున ఒక షెల్ఫ్ నింపేశారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానం సంపాదించడమేకాదు, పంచిపెట్టడం అనేది... అంటే విషయాలు తెలుసుకోవడమే కాదు, తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడి దాహం తీర్చడం మరింత తృప్తినిస్తుందని చెప్పడానికే. మీరు కూడా మంచి పుస్తకాలు చదివి సమీక్షలు రాసి మీ స్నేహితులకు బహూకరించండి. మీరు ఏ పుస్తకం చదివినా ముందున్న ఖాళీపేజీలో ఆ పుస్తకంలో మీకు నచ్చిన విషయాలు రాసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా ఆ విషయాల తాలూకు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ పుస్తకం తెరిచి మీ వ్యాఖ్యచూసుకుని మీరెలా మురిసిపోతారంటే.. పటికబెల్లం చప్పరిస్తున్న అనుభూతి చెందుతారు. ఈ అలవాటు మీరు జీవితంలో మంచి మంచినిర్ణయాలు చేయడానికి కారణమవుతుంది. ఈ డేటాబేస్, ఈ విషయాలు మీ స్టోర్‌లో ఉండాలి. ఉంటే మిమ్మల్ని చెడుైవపు వెళ్ళనివ్వదు. ఆపుతుంది. మంచిైవపుకు నడిపిస్తుంది. పదిమందిలో కష్టపడి నిలబడడానికి యోగ్యుడిని చేస్తుంది. దీనికి మీరు టైంలేదనకండి.... ఒంగోలులో డాక్టర్ గోపీచంద్గారని ఒక వైద్యుడున్నారు. ఆయనతో నేనొక సభకూడా చేసాను. మధ్య వయస్కుడు. గుండెకు సంబంధించి ఇప్పటికి ఇంచుమించు 50వేల శస్త్ర చికిత్సలు చేసారు. ఎవరికి ! చంటిపిల్లలకు. ఆయన ఒక్క క్షణం ఖాళీగా ఉండరు. ఆపరేషన్ థియేటర్లోకి వెడితే నూరో ఎన్నో శస్త్ర చికిత్సలుచేసిగాని బయటకు రారు. అటువంటి వ్యక్తి నెలలో రెండు రోజులు దక్షిణాఫ్రికా వెళ్ళి వస్తారు. ఎందుకో తెలుసా! వ్యాధులు సంక్రమించి పిల్లలు చనిపోతున్నారని అక్కడికి వెళ్ళి ఆపరేషన్లు చేసి, అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వస్తారు. టైం లేదన్నంత దారుణమైన మాట మరొకటి లేదు. మనం కాదు సమయాన్ని చంపాల్సింది. నిర్లిప్తంగా చూస్తూ ఉంటే సమయమే మనల్ని చంపేస్తుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బంధువులు మీకేదయినా బహుమతి ఇవ్వదలుచుకున్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకుని హైదరాబాద్‌లో ఫలానా పుస్తకశాలలో దొరుకుతుందని, దానిలో నాకు ఒక సంపుటి బహూకరించండని అడగండి. అది మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. మీకెవరైనా పుస్తకం బహూకరిస్తే దాని మొదటిపేజీలో ఫలానాతేదీనాడు, ఫలానావారిచే బహూకరింపబడినదని రాసుకోండి. అడిగే పిల్లలు దొరకాలి కానీ ఎంతో సంతోషపడి ఆ పుస్తకాలు నాదగ్గర ఉంచుకోవడం కన్నా, చదవాలన్న జిజ్ఞాస ఉన్న పిల్లవాడు దొరికితే నా దగ్గరున్న అన్ని పుస్తకాలను ఇచ్చేస్తానన్నంతగా మురిసిపోతారు. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు వద్దు. మంచి పుస్తకాలు చదవండి. ఏది మంచి పుస్తకం? అన్నదానికి నిర్వచనం ఎప్పుడు తెలుస్తుందంటే.. మంచి పుస్తకాలను సూచించమని మీరు పెద్దలను అడిగినప్పుడు వారి సమాధానం ద్వారానే. అందువల్ల సునిశిత ప్రజ్ఞ అభివృద్ధి చెందేది కేవలం సమాచార సేకరణ, విషయసేకరణ ద్వారా మాత్రమే. అది మంచి పుస్తకాలద్వారా, మంచి ప్రసంగాల ద్వారా అందుతుంటుంది. మంచి పుస్తకాలు చదవండి. మంచి వ్యక్తులుగా ఎదగండి. జీవితంలో అవి దార్శనికతకు కారణమౌతాయి. ఎవరైనా పెద్దల్ని కలిస్తే, మీరు వేయవలసిన ప్రశ్న ఒకటే-’’అయ్యా ! నేను తప్పకుండా చదవవలసిన పుస్తకం ఒకటి సూచిస్తారా?’’ అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సంస్కారమే బలం... విచక్షణే శక్తి!
విద్య - విలువలు సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారంతోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. దానితో, ఆ సంస్కారబలంతో మీకు తెలియకుండానే ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఔను! నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదు, నేనే తప్పు చేయలేదు’’ అన్న విశ్వాసం పెరగాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోతే, పిల్లలకు నాలుగు మాటలు ధైర్యంగా చెప్పలేకపోతే నాకు ఈ గౌరవం ఎందుకు? ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అందుకున్న వాడు అదృష్టవంతుడు. అందుకోలేనివాడు పరమేశ్వరుని దయతో ఎప్పటికయినా అందుకోవాలి. అప్పుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తయినట్లే. నీపట్ల ఎంత కఠినంగా మాట్లాడినా నీకేది అందాలో అది అందించినవాడిపట్ల గౌరవం ప్రదర్శించిననాడే నీకు హితం. నీ హితంకోరి మాట్లాడేటప్పుడు అన్ని వేళలా మంచి మాటలే ఉండవు. మనం పాలకోవా అంటాం. ఉత్తరభారతదేశంలో దేధ్పేడా అంటారు. పేరలా ఉందేమిటండీ’ అని పాలకోవా తిననంటే నీ ఖర్మ. పేరేదయితే నీకెందుకు? పాలకోవా రుచి ఉందా లేదా! అనుభవిస్తే అదృష్టవంతుడివి. నేనింతటి వాడినయ్యా, మా నాన్నగారేంటండీ అలా మాట్లాడతారనుకోకూడదు. అమ్మ కూడా అలానే మాట్లాడుతుంది. వేళపట్టున తినరా, ఉపన్యాసాలనీ, ప్రసంగాలనీ ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చి తినకురా. కావాలంటే ఉపన్యాసం మధ్యలో ఆపయినా కొద్దిగా తినరా. నీ ఒళ్ళు అసలే గాజుకాయలాంటిది’ అంటుంది. ‘‘ఏంటమ్మా అలా మాట్లాడతావు. నేనింత పెద్దపెద్ద సభలలో మాట్లాడతాను. నీవేంటి అందరిముందు అలా మాట్లాడతావేంటి’’ అనకూడ. పరమ సంతోషంతో స్వీకరించాలి. మా అమ్మకాకపోతే అలా ఎవరు చెబుతారు. అది నా అదృష్టం. ఇప్పుడే కాదు, నా షష్టిపూర్తయినా మా అమ్మ అలానే చెబుతుంటుంది. ఆమె వాక్కులో కాఠిన్యం కాదు, ఆమె ఏం కోరుకుంటున్నదో తెలుసుకుంటే అది సంస్కారం. నీవేదో ఉన్నత స్థానంలో ఉన్నావని అమ్మ అలా మాట్లాడకూడదనుకుంటే ఎలా? నీవలా కావాలని ఆమె ఉపవాసాలు చేసింది, గుళ్ళకు వెళ్ళింది, ప్రదక్షిణలు చేసింది... నీకు జలుబు చేస్తుందని ఆమె చింతకాయపచ్చడి మానేసింది. నీకు జలుబు చేస్తే ఆమె శొంఠిపొడి తిని నీకు పాలిచ్చింది. ఆమె శరీరంలో 15 లీటర్ల నెత్తురు పోగొట్టుకుని నిన్ను కన్నది. ఆమె పచ్చిపుండయి నిన్ను కాపాడింది. నాన్నగారు ఆకలిమీదొచ్చి అడిగితే ఏం వండిపెట్టిందేమో కానీ, నీవు ఏడిస్తే మాత్రం ఆమె నెత్తురు పాలయ్యాయి. ఆమె ఇప్పుడు అయోగ్యురాలయిందా? ఆమె ఇప్పుడు నీతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా? అలా అని నీవనుకోవడమే నీ కుసంస్కారం. ఆమె ఏది మాట్లాడినా అది ఈశ్వరుడి మాటనుకోవడం నీ సంస్కారం, ఒక మనిషికి ఇది తెలియదు. వాడు పాడైపోడు’ అని శాస్త్రం చెప్పింది. వాడు ఎప్పుడు పాడైపోతాడంటే నేను తెలుసుకోను, నేను వినను’’ అంటే పాడైపోతాడు. పుట్టుకతో ఎవరూ సర్వజ్ఞులు కారు. ప్రతివాడూ తప్పొప్పుల కూడికే. కఠినంగా ఉండడమే హితవాక్కు లక్షణం నో స్మోకింగ్ అని బోర్డుంటుంది. అంటే పొగ తాగరాదు. పొగతాగడంవల్ల వచ్చే నష్టములు అని బోర్డు పెట్టరు కదా! ఒక కీడునుంచి మిమ్మల్ని బయటకు లాగాలనుకోండి. మర్యాదగా చెప్పడం కుదరదు. ఒక మహారాజుగారున్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. వంది, మాగధి, ఏనుగులు, గుర్రాలు, మేళాలు, తాళాలు వెడతాయా! మహారాజుగారిని ఈడ్చుకొచ్చేస్తారంతే. నేను మహారాజును, పల్లకీ పంపొద్దా అంటాడా ఆయన? అనడు. అనకపోగా మంటలనుంచి తప్పించి మంచిపని చేశారని తన మెడలోని హారం తీసి ఇస్తాడు. అగ్నిహోత్రంలో చిక్కుకున్నవాడిని బయటికి తీసుకురావడానికి వాక్కు మాధుర్యంతో ఉండదు. నీళ్ళలో కొట్టుకుపోతున్నవాడిని రాచమర్యాదలతో బయటికి తీసుకురారు. బయటికి లాక్కొచ్చి, ఒడ్డునపడేసి పైన కాళ్ళు పెట్టి తొక్కి నీళ్ళు కక్కించాలి. నీళ్ళలో మునిగినాయన మహానుభావుడు. ఎక్కడ కనిపించినా కాళ్ళకు నమస్కారం చేసే డాక్టరు కూడా ఆ ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు, ఆఖరి ఊపిరి మీదున్నప్పుడు, కాళ్ళు మీదపెట్టి నొక్కేస్తాడు, అంతకన్నామార్గంలేదు. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం. అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో దేనికి వెళ్ళినా విద్యార్థులేకాదు, ప్రొఫెసర్లు కూడా చెవులొగ్గి వినేవారు. అటువంటి వాళ్ళు ’’పిల్లలు వృద్ధిలోకి రావాలి, అందరూ సమున్నతమైన స్థితిని పొందాలి’’అని అంత పెద్ద వయసులోకూడా విశ్రాంతి తీసుకోకుండా ’’పిల్లలతో సంభాషించడం నాకెంత ఇష్టమో! ఎందుచేతంటే, భావి భారతమంతా వాళ్ళచేతుల్లోనే ఉంది’’ అంటూ అంత శ్రమకోర్చి వచ్చి నాలుగు మంచి మాటలు చెబుతుంటే... వినండి, పూర్తిగా వినండి. ఒక్కోమాట ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన ఒకసారి ఒక యూనివర్శిటీలో మాట్లాడుతూ...’’ఈ దేశం వృద్ధిలోకి రావాలంటే ఒకే ఒక్క ఆస్కారముంది. చిన్న చిన్న దేశాలు... ఎంత చిన్నవంటే... ప్రపంచ పటంలో సూదిపెట్టి చూపిస్తే కానీ కనబడని దేశాలు, ఈ వేళ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. కారణం చమురు నిక్షేపాల మీద వాటికున్న కమాండ్. మనం కూడా మనకున్న చమురు వనరులను ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో చూడండి. అలాగే దేశంలో పనికిమాలిన మొక్కలుగా భావించే వాటి ఆకులనుండి సహజమైన చమురు వంటి పెట్రోల్, ముడిచమురు వంటివి తయారు చేయడంలో పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి.’’ అన్నారు. పిల్లలు అటువంటి ప్రయత్నం చేసిన నాడు ఎవడో ఒక విద్యార్థివల్ల మొత్తం ఈ దేశం స్వరూపమే మారిపోతుంది. అలాంటి పరిశోధనాత్మక దృష్టి పెంచుకోండి. కేవలం గాటకు కట్టిన తాడు ఎంతదూరం వస్తుందో అంతదూరం వరకే ఒక పశువు తిరిగినట్లుగా మూసపోసిన జీవితాన్ని జీవించకండి. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అభ్యున్యన్నతి కోసం మీ మేధాశక్తిని ఎంత ఉపయోగించుకోగలరో చూడండి. అటువంటి మహాపురుషులు చాలామంది ఉన్నారు లోకంలో. విశాఖపట్టణంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేసిన డాక్టర్ శ్రీపాద పినాకపాణిగారు సంగీతంలో కూడా పరమ నిష్ణాతులై, 90 ఏళ్ళుదాటినా కూడా మంచంమీద లేవలేని స్థితిలో ఉండి కూడా అసంఖ్యాకంగా శిష్యులు వచ్చి సేవిస్తుండగా, స్వరాలు వేసి పాడుకుంటూ తరించిపోయేవారు. ఒక పనికిమాలిన వాడిగా కాకుండా, కొన్ని లక్షలమందికి పనికివచ్చేలా వృద్ధాప్యం తాలూకు అసౌకర్యాలను లెక్కచేయకుండా జీవితా గడుపుతున్న మహాపురుషులున్నారు. కానీ మన ప్రచార, ప్రసార సాధనాలు అటువంటి వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం అసలు చేయవు. ఏది అక్కర్లేదో... ఎక్కడో ఎవడో నూతిలో పడిపోతే బ్రేకింగ్ న్యూసంటూ గంటలతరబడి మీకు చూపిస్తాయి. చూసి మీరు పొందే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మీకుగా మీరు అలవాటు చేసుకోకపోతే గడిచిపోయిన సమయం మళ్ళీరాదు. అందుకే మనవి చేస్తున్నా. నా ఆర్తిని సహృదయంతో అర్థంచేసుకోండి. కఠినంగా ఉండడమే హితవాక్కు లక్షణం నో స్మోకింగ్ అని బోర్డుంటుంది. అంటే పొగ తాగరాదు. పొగతాగడంవల్ల వచ్చే నష్టములు అని బోర్డు పెట్టరు కదా! ఒక కీడునుంచి మిమ్మల్ని బయటకు లాగాలనుకోండి. మర్యాదగా చెప్పడం కుదరదు. ఒక మహారాజుగారున్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. వంది, మాగధి, ఏనుగులు, గుర్రాలు, మేళాలు, తాళాలు వెడతాయా! మహారాజుగారిని ఈడ్చుకొచ్చేస్తారంతే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సాహిత్య సౌరభం... శీలవైభవం
విద్య - విలువలు ఒక ఆఫీసర్ ఓ అయిదుగురు అసిస్టెంట్స్‌ను రిక్రూట్ చేయవలసి వచ్చింది. ఓ వంద మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో స్టేట్ చీఫ్ సెక్రటరీ ఒకతన్ని రికమెండ్ చేశాడు. ఆయన ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తూ ఫైలు మీద ఇలా రాశాడు. ‘‘ఈ ఒక్క అపాయింట్మెంటు చీఫ్ సెక్రటరీ రికమెండేషన్ మీద చేయకపోతే రేపు సంస్థకు సమస్యలు రావచ్చు. అందువల్ల ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇస్తున్నాను. దీనివల్ల సంస్థకు పెద్ద నష్టమేమీ కలగదు. దిస్ మే అప్రూవ్డ్’’ అని రాసి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌కి ఇచ్చాడు. మరొక ఆఫీసర్ ఉండేవాడు. ఆయననేవాడు. ‘‘ఎప్పుడూ రూల్, రూల్ అనీ, రూల్స్ పర్మిట్ చెయ్యవండి అని మాట్లాడకయ్యా. నిజంగా నీవు చాలా గొప్పపని చేయాల్సి వస్తే బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్. నిజంగా అది నీవు మంచని నమ్మితే రాయి ఫైలు మీద. దాన్ని నేను ఆమోదిస్తాను’’ అనేవాడు. మీరు మీకిందవాళ్లకి అలాంటి స్ఫూర్తినివ్వగల ఆఫీసర్సుగా తయారుకండి. మీరు నమ్మిన సిద్ధాంతానికి నిలబడగలిగినవారుగా తయారుకండి. ఎప్పుడైనా మీ జీవితంలో చిన్న పొరపాటు జరిగితే మృతపిండాలు కాకండి. బంతులు కండి. అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి, ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి. ఆయన నిరాశతో రుషికేశ్‌లోని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామీజీ అలా వెళుతూ కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి వెళ్లాను ఇంటర్వ్యూకు. అది పొందడం నాకిష్టం. కాని నేను సెలక్ట్ అవ్వలేదు. ఈ ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. ఏదో ఈ ఇంటర్వ్యూకి వెళ్లాను. దీనికి సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టం లేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఈశ్వరుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా ఎందుకు వెళ్లలేకపోతున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే! ఈ దేశానికి ఉపగ్రహాలు తయారుచేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు కలాం. రెండవమారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా దాన్ని తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడటమే నాకిష్టమనీ, ప్రతి కాలేజీకి, యూనివర్సిటీలకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూనే వాళ్ల మధ్యనే కన్నుమూశారాయన. తలిదండ్రులను, గురువులను గౌరవించగలిగిన శీలవైభవం లేనివాడు ఎవడికి కావాలి. మీరు ఎదగడం కాదు. మిమ్మల్ని ఆదర్శంగా మీ వెనుకనున్నవాళ్లు తీసుకోవాలి. అది మీ ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో. కేవలం నాలాగా ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు. ఏ ఒక్కరైనా నా ఈ మాటల వల్ల మీ జీవితాలను దిద్దుకోగలిగితే అది చాలు. పెద్దలు ఇచ్చిన సాహిత్యం మీదగ్గర పెట్టుకోండి. ఎత్తు పల్లాలను తట్టుకోగలిగిన శక్తి ఎక్కడినుంచి వస్తుందంటే ఒక భగవత్ గీతను మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చదువుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతిగారి బోధనల్ని మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు చదవండి. మంచి మంచి పుస్తకాలు కొని చదవండి. ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగు పుట్టి పెరిగినట్లు బతకకూడదు. మంచిగా బతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందికి తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా? అన్న సందిగ్ధం. మీరు ఇంగ్లిషు బాగా చదువుకుని చక్కగా పాసవ్వండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథ ప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతనగారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి. సినిమాను వినోదంగా తీసుకోండి. సినిమాలు ఆదర్శం కావని గుర్తుంచుకోండి. ఎక్కడైనా మీ జీవితాలలో వెలుగు నింపగలిగే ఆదర్శాలు కనిపిస్తే.. మీరు దానిని అనుసరిస్తే నేను తప్పుపట్టడానికి సిద్ధంగా లేను. అది మంచి పనే అని చెపుతాను. సచిన్ టెండూల్కర్ ముంబాయిలోని ఒక వీధిలో ఇల్లు కడుతూ... ఈ వీధిలోని వాళ్లందరి ఇళ్లకు ఉత్తరాలు రాసి పంపించాడు. నేను ఇల్లు కట్టే క్రమంలో పునాదులను తవ్వడానికి రాళ్లు పేల్చవలసి వస్తుంది. ట్రక్స్ వెళుతున్నప్పుడు చప్పుళ్లు వస్తున్నాయి. దీనివల్ల వీధిలో ఉన్న మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కానీ మీ అందరినీ కోరేదొక్కటే. అమ్మ కడుపులో నుంచి ఓ బిడ్డడు ఒక కుటుంబంలో ప్రవేశించడానికి ముందు అమ్మకడుపులో తొమ్మిది నెలలు ఉన్నప్పుడు ఆ అమ్మ పొందే వికారాలు, కష్టాలు భరిస్తే తప్ప ఆ బిడ్డడు రాలేనట్టు... మీ అందరూ కష్టాలను తల్లిలా ఓరిస్తే తప్ప, మీ కుటుంబంలో సభ్యుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకోలేను. మీకు కలుగుతున్న కష్టాలకు క్షమించవలసినది’ అని ఉత్తరాలు పంపాడు. ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీని మీరు అలవాటు చేసుకోండి. ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ అయిన సచిన్ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంత పైకి లేచాడు. తను రికార్డు బ్రేక్ చేయగానే ఊర్ధ్వలోకాలలో ఉన్న తన తండ్రికి తలయెత్తి కృతజ్ఞత చెబుతాడు. ఎంతోమంది వీధి బాలలను చదివిస్తున్నాడు. ఎక్కడా తానిది చేశానని చెప్పుకోడు. ఎవ్వరిమీదయినా వ్యతిరేకంగా ఒక మాటయినా మాట్లాడలేదు. నేను మీతో మనవి చేసేది అదే. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఆయనేం చెప్పుకున్నాడో తెలుసా సమాధానం. ‘‘నేను బ్యాట్ పట్టుకుని అన్యమనస్కంగా ఏదో షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ వెళ్లవలసిన డెరైక్షన్‌లో వెళ్లవలసిన వేగంలో వెళ్లకపోతే.. మహాకోపంతో ఇంకా రెండు బాల్స్ చూసి లోపలకొచ్చి, ‘‘ఏరా ఇలా ఆడుతున్నావ్?’’ అని మా గురువుగారు కొడితే దిమ్మదిరిగి పడిపోయాను. ఆనాడు మా గురువుగారు కొట్టిన దెబ్బ జ్ఞాపకం ఉండిపోయి, ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. ఎక్కడ బంతి పడుతుంది. దీన్ని ఏ డెరైక్షన్‌లో కొట్టాలి? అని. అంతే స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. ఒక సభలో గురువుగారి పాదాలకి నమస్కరించి గురువుగారి గొప్పతనాన్ని చెబుతాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. ఒక్కొక్కరూ జాతిరత్నాల్లా ప్రకాశించి ఈ దేశానికి ఖ్యాతి తీసుకురండి. కిందివారికి పని చెప్పడం తేలికే! కాని, చేయడంలోని కష్టాన్ని తెలుసుకోవాలి. మీరు రేపు చాలా పెద్ద పెద్ద అధికారులు అవుతారు. కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం మీ చేతుల్లో ఉంటుంది. ఆ నిధులు సక్రమంగా ఖర్చు కావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. ఎదుటివారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకరికొకరు అర్థమవుతారు. మా ఆఫీసు విషయమే మీకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇన్స్పెక్షన్కు ముందు ఆఫీసంతా సర్దమన్నారు. పాత ఫైళ్లన్నీ చూసి పనికిరానివి తీసివేసి పనికి వచ్చేవి ఒక క్రమంలో అమర్చుకోవాలి. మీకు తెలుసు. ఇటువంటి విషయాల్ని ఎంత పట్టించుకుంటామో. మా అధికారి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందర్నీ పిలిచారు. ఐదు నిమిషాల్లో సమావేశం ముగిసింది. ఆయనేం చెప్పారో తెలుసా. ‘‘నేను రేపు ఆదివారం వచ్చి ఈ పని మొదలుపెడుతున్నాను. మీలో ఎవరైనా రావచ్చు. రాకపోయినా నేనేమీ అనను. రేపు పని పూర్తి కాకపోతే రోజూ ఉదయం 7 గంటలకే వచ్చి చేస్తాను. ఎన్నాళ్లలో అవుతుందో అన్నాళ్లలో అవుతుంది. మీరు రావాలనుకుంటే రండి. మీకు స్వాగతం.’’ ఆదివారమే మా ఆఫీసు ఇన్స్పెక్షన్కు ముస్తాబైంది. ఆయన అందర్నీ సమావేశపరచి ప్రశంసించారు. ఆయన అందర్నీ ఆజ్ఞాపించి, వాళ్లు పని పూర్తిచేయలేకపోతే కోప్పడి హంగామా చేసి ఉంటే ఏమయ్యేది? ఆయన చెడ్డవాడయ్యేవాడు. కింది ఉద్యోగులకు ఆయనంటే ఇష్టం ఉండేది కాదు. పని అసలే జరిగేది కాదు. అందువల్ల సమయానుకూలంగా ప్రవర్తించాలి. కోపం నివారించుకోవాలి. కలిసి పనిచేయాలి. క్రోధాన్ని తొలగించుకోవడం అన్ని శ్రేయస్సులకూ మూలం. అందుకే మనం నేర్చుకునే విద్య మన క్రోధాన్ని పోగొట్టగలగాలి. అదొక గొప్ప విలువ. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు